మోసం... దగా... చీటింగ్...
హవాలా... హర్షద్‌మెహతా... కోలా కృష్ణమోహన్...
తెలివిగా... చాకచక్యంగా... నేర్పుగా...
నమ్మినవారిని నిలువునా నట్టేట ముంచటం...
వచ్చిన ధనంతో దర్జాగా జీవించటం...
ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ కనిపిస్తున్న సాంఘిక రుగ్మత. ఈ రుగ్మతలపై రఘునాథ్‌రెడ్డి తీసిన లఘుచిత్రమే ‘నౌ దో గ్యారహ్’.
డెరైక్టర్స్ వాయిస్: మాది గుంటూరు. చిన్నప్పటి నుంచి నాకు కథలు చెప్పడ మంటే చాలా ఇష్టం. అదే నాకు ఈ రోజు లఘుచిత్రాలు తీయడానికి సహాయపడింది. మా నాన్నగారు గతంలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కావడం కూడా నాకు ప్లస్ అయ్యింది. నేను ప్రస్తుతం బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నౌ దో గ్యారహ్... నోరు ఉంటే రాజ్యం, నోటు ఉంటే సామ్రాజ్యం. ఇదీ స్థూలంగా కథాంశం. ఈ కాన్సెప్ట్ మీద కథ తయారుచేద్దామనుకున్నప్పుడు... రోజూ జరిగే మోసాల గురించి రాద్దామనుకున్నాను. అది కూడా వినోదాత్మకంగా తీయాలనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో 1980లలో జరిగిన ల్యాండ్ స్కామ్ గురించి ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ నన్ను బాగా ప్రభావితం చేసింది. అలా క్యారెక్టర్స్, సీన్లు డెవలప్ చేశాను. సినిమా తీయడంలో అందరిలాగే నన్ను కూడా త్రివిక్రమ్ గారు ప్రభావితం చేశారు. మా టీమే నాకు పెద్ద ఆస్తి. యుకే లో ఉంటున్న యామని శృంగారం గారు మా సినిమాకి ఆర్థికంగా సహాయం చేశారు. ఈ చిత్రం షూటింగ్ నాలుగు రోజుల్లో పూర్తి చేశాం. ఒక రోజులో ప్యాచ్ వర్క్ పూర్తి చేశాం. పూర్తిగా హైదరాబాద్‌లోనే చేశాం. మా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడింది. పెద్ద చిత్రాలు తీయాలనే నా కోరిక నెరవేర్చుకోవడం కోసం లఘుచిత్రాలు తీసి అనుభవం సంపాదించుకుంటున్నాను. నాతో పనిచేసేవారంతా ఎంతో హార్డ్‌వర్క్ చేస్తున్నారు. మా అందరికీ సినిమాలంటే ఒక ప్యాషన్ ఉండబట్టి లఘుచిత్రాలు బాగా తీయగలుగుతున్నాం. ఇంతకుముందు రోజుల్లా కాకుండా మా టాలెంట్ నిరూపించుకోవడానికి లఘుచిత్రాల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతోంది.
షార్ట్ స్టోరీ: తెల్లవారి లేచింది మొదలు ఎవరో ఒకరు అవతలివారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో కొందరు యువత ఒక జట్టుగా ఏర్పడి మోసాలు చేస్తుంటారు. అలా మోసం చేసి ధనం సంపాదిస్తుంటారు. స్థూలంగా ఇదీ కథ.
కామెంట్: టిఎంసి బ్యాన ర్ మీద తీసిన ఈ లఘుచిత్రం కథాకథనం చాలా బాగుంది. ముఖ్యంగా ఈ చిత్ర డెరైక్టర్ రఘునాథరెడ్డి లఘుచిత్రాన్ని ఫీచర్‌ఫిల్మ్ స్థాయిలో తీశారు. లొకేషన్లు చాలా బాగున్నాయి. నటీనటులలో ఒకరిద్దరు తప్ప మిగతావారంతా బాగా చేశారు. ముఖ్యంగా హీరోయిన్‌గా వేసిన అమ్మాయి డైలాగ్ డెలివరీలో పవర్ లేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది డైలాగులు. ‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ ‘దొంగతనం చేయాలంటే ఒక మనిషి జేబులో చెయ్యి పెడితే చాలు... మోసం చేయాలంటే అదే మనిషి నమ్మకాన్ని కొట్టేయాలి’ ‘యాక్టివ్‌గా అలర్ట్‌గా ఉంటాడు’ ‘మొరాలిటీ కన్న ప్రాక్టికాలిటీనే ప్రధానం’ ‘ప్రకృతిని క్యాష్ చేసుకుంటే బోలెడు ధనం’ ‘ప్రేక్షకుడికి ప్రొడ్యూసర్‌కి మధ్య బ్యారియర్‌లాగ’ ‘వెళ్లివస్తాను... సారీ... నేను వెళ్తాను మీరు రండి’ ‘నా పూర్వీకులు చాలా పూర్ అని విన్నాను’ ‘ఫ్రీగా ఎకరాలు ఇవ్వడానికి సలహా అనుకున్నావా’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి. డెరైక్టర్‌గా రఘునాథ్ సక్సెస్ సాధించినట్లే. డైలాగులు, మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్... అన్నీ పక్కాగా ఉన్నాయి. యూట్యూబ్ ప్రేక్షకులకు ఇది నిజంగా ఒక కనువిందే. కేవలం వారం రోజులలోనే రెండు లక్షల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు.
- డా.వైజయంతి
‘ఇగోకి ఆత్మాభిమానం పేరు పెట్టుకుని తిరుగుతాడు’ ‘అమ్మడానికి అది నా సెంట్ పర్సెంట్ లవ్’ వంటి చురుకైన పదునైన డైలాగులు... ఈ కథకు ప్రాణం పోశాయి.