పదాలు లేని ప్రవాహాలు...
‘దుర్గం’ అంటే దుర్-గమనము కదా! అంబేద్కర్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న దుర్గం చెరువు దరికి ‘సీక్రెట్ లేక్ పార్క్’ అనే పేరు చక్కగా సరిపోయింది. వెతుక్కుని వెతుక్కుని మరీ వెళ్లాలి. రెండు, మూడు, నాలుగు చక్రాలపై, దాదాపు మూడు వందల మంది మ్యూజిక్ లవర్స్, మొన్న శనివారం సాయంత్రం ఎలాగైతేనేం అక్కడకు చేరుకున్నారు.
గోల్కొండ కోటకు మంచినీటిని సరఫరా చేసిన చరిత్ర కలిగిన దుర్గం చెరువు, తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, తాజాగా జాజ్ సంగీతంతో మ్యూజిక్ లవర్స్ దాహార్తిని తీర్చింది!
వెలుగునీడల మార్మిక వాతావరణంలో, దక్కన్ రాక్స్ అమరికల మధ్య ఏర్పాటైన వేదికపై ముగ్గురు కళాకారులు పరిసరాల సోయగానికి ముగ్ధులయ్యారు. ఇంత చక్కని వేదికను తమ పర్యటనలో చూడలేదంటూ ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నారు. ఒకరు పోర్చుగల్‌కు చెందిన డబుల్ బాస్ వాద్యగాడు కార్లోస్ బైకా. మరొకరు రంగులీనే గిటార్ ‘తంత్ర’జ్ఞుడు, జర్మనీకి చెందిన ఫ్రాంక్ బొమస్. మరొకరు అమెరికాకు చెందిన క్లాసిక్ డ్రమ్మర్ జిమ్ బ్లాక్. ముగ్గురూ జాజ్‌లోని మూడు పాయలను సీక్రెట్ లేక్‌లోని యాంఫీథియేటర్‌పై సంగమింపజేశారు!
పాప్-జాజ్-రాక్-పొయెట్రీల మేళవింపుతో స్వీయముద్రను వే సే ఇండిపెండెంట్ జాజ్‌ను ‘ఇండిజాజ్’ అంటారు కదా. ఇందులో తమదైన ప్రత్యేకతను చాటుతూ రాక్ సంగీతంలోని నిర్ణిద్ర శక్తిని, పాప్ సాహిత్యాన్ని స్ఫురింపజేసే రాగాలను, పోర్చుగీస్ జానపద సంగీతంలోని మధురిమలను ఏకీకృతం చేస్తూ ఈ ముగ్గురు 1996లో ‘జాజ్ ట్రియో’ గా ఏర్పడ్డారు.
‘అజుల్’ ఆల్బమ్‌తో ప్రారంభించి, ట్విస్ట్, లుక్ వాట్ దె హావ్ డన్ టు మై సాంగ్... తదితర ఆల్బమ్‌లతో పదిహేడు సంవత్సరాలుగా ‘ట్రియో’ ఇస్తోన్న ప్రదర్శనలు అమెరికా, యూరప్ దేశాల్లో నిత్యనూతనంగా విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్‌ముల్లర్ భవన్-గోథె జంత్రమ్‌ల ఆహ్వానంపై రెండు వారాలుగా ఢాకా, కోల్‌కతా, ముంబై, పుణె, త్రివేండ్రం, చెన్నైలు పర్యటిస్తూ హైదరాబాద్‌లో ముగింపు కచేరీకి విచ్చేశారు.
కార్లోస్ బైకా రచయిత, స్వరకర్త. తాను రచించిన సాంగ్‌బుక్ తర్వాత మరో పాటల పుస్తకం ఎందుకు తీసుకురాలేదు అనే ప్రశ్నకు ‘ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక పాటే పాడగలరు’ అంటారు.
అన్నట్లు ఆయన పాటల్లో పదాలుండవు. రాగాలే. ఆ శబ్దసౌందర్యంతో శ్రోతలు తమవైన పదాలను ఊహించుకుంటారు! ‘రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు’ అన్నట్లుగా మరచిపోవడం సాధ్యం కాని పదరహిత ప్రవాహాలు! ఏడాది క్రితం తాను స్వరపరచిన ‘థింగ్స్ ఎబౌట్’ ఆల్బమ్ బెస్ట్ పోర్చుగీస్ ఆల్బమ్‌గా ఎంపికైంది. డబుల్ బాస్‌పై ‘బో’వాడకుండా చేతి వేళ్లతో కార్లోస్ పలికించిన మంద్ర స్థాయిలోని స్వరాలు చిరుగాలికి నీటిలో సద్దుమణిగిన అలల సవ్వడిని గుర్తు చేశాయి. కార్లోస్ డబుల్ బాస్‌కు ఫ్రాంక్ మోబస్ గిటార్‌తో హృద్యంగా సమన్వయపరచడం, జిమ్‌బ్లాక్ రిథమిక్ డ్రమ్మింగ్ ఒక ‘క్లాసిక్’ ఎక్స్‌పీరియన్స్!
- పున్నా కృష్ణమూర్తి