పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’! | Frequent 'Timeless Art'! | Sakshi
Sakshi News home page

పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!

Published Sun, May 18 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM

పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!

పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!

  • జూన్ 12 వరకు నగరంలో కొనసాగనున్న ప్రదర్శన
  •  బెల్జియంలో సానపెట్టిన వజ్రాలకు ఒక రవ్వ ప్రకాశం ఎక్కువ అని సామెత. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు సమీపంలోని ‘మ్యూజియం ఆఫ్ శాక్రెడ్ ఆర్ట్’ (మోసా)లో ప్రదర్శించే చిత్రాలకూ అటువంటి అదనపు గౌరవం ఉంది. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించే యూరోపియన్ సంస్థ (యు ఆర్ ఐ)లో సభ్యుడైన మార్టిన్ ‘మోసా’ను 2009లో స్థాపించాడు.

    ‘మోసా’ నూతన భవనాన్ని ఈ నెల 17వ తేదీన హరిప్రసాద్ చౌరాసియా వేణుగానంతో, పూసపాటి పరమేశ్వరరాజు చిత్రించిన ఐకానిక్ కాలిగ్రఫీ చిత్రాల ఎగ్జిబిషన్ (టైమ్‌లెస్ ఆర్ట్)తో ప్రారంభిస్తున్నారు. అంతదూరం వెళ్లి పూసపాటి చిత్రాలను చూడలేం కదా! నథింగ్ టు వర్రీ! ఈ నెల 12 నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో పూసపాటి తాజాచిత్రాలు కొలువై ఉన్నాయి. వచ్చే నెల 12 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ నేపథ్యంలో పూసపాటితో సంభాషణా సారాంశం ఆయన మాటల్లోనే...
     
    విజయనగరంలో 1961లో జన్మించాను. తమిళనాడు, పుణే, ఔరంగాబాద్‌లలో చదువుకున్నాను. ‘ముద్ర’లో పనిచేశాను. జగదీష్ అండ్ కమలా మ్యూజియం ట్రస్టీలలో ఒకరిగా సేవలు అందిస్తున్నాను. మా ప్రపితామహులు పూసపాటి అప్పలరాజుగారు ఒరిస్సాలో ‘అస్కా’ అనే గ్రామానికి చెందినవారు. ఆలయ శిల్పాలు, లోహ విగ్రహాలు రూపొందించేవారు.

    పౌరాణిక గాధల చిత్రకథలను ప్రెస్కోలుగా చిత్రించేవారు. చింతగింజల మేళవింపుతో తయారైన రంగులను వాడి వస్త్రాలపై బొమ్మలు వేసేవారు. పూర్వీకుల కళ బహుశా నాలో అంతర్లీనంగా ఉండి ఉంటుంది. భారతీయ ఇతిహాసాలను ఆధునికంగా చెప్పాలనే ముప్పయ్యేళ్ల ప్రయత్నం ఐకానిక్ క్యాలిగ్రఫీ రూపంలో వ్యక్తమైంది.
     
    రామాయణంలో ‘కొత్తదనాలు’!
     
    వాల్మీకి రామాయణంలో ఇప్పటికీ మనకు ఉపకరించే కుటుంబ జీవితానికి సంబంధించిన మౌలిక విలువలున్నా యి. రామాయణం భారతీయ సామూహిక, సామాజిక చేతనాత్మ! తరచి చూస్తే.. రాముడు-సీత-లక్ష్మణుడు-భరతుడు-ఆంజనేయుడు-సుగ్రీవుడు-రావణుడు తదితర పాత్రలన్నీ ఏ కొంచెమో మన జీవితంలో ఉంటాయి.

    ఈ నేపథ్యంలో 37 డ్రాయింగ్‌ల సంకలనంగా కాలిగ్రఫీలో రామాయణం రూపొందించాను. ఆరు కాండాల ఇతిహాసంలో ఎన్నెన్ని ఘట్టాలు... ఎన్నెన్ని పాత్రలు.... ఎంతటి వైవిధ్యం... వీటన్నిటిని  ఎంపిక చేసుకున్న పాళీల ద్వారా లయగతితో వ్యక్తీకరించాను. నా పుస్తకంలో రామాయణ కథానుసారం చిత్రాలుండవు. నా మనో చిత్రంలో మెరిసిన ఘట్టాలను డ్రాయిం గులుగా మలచా.

    ఉదాహరణకు సరయూ నదిని గిరిజన రాజు గుహుడు తన పడవపై సీతారామలక్ష్మణులను దాటిస్తోన్న దృశ్యం పుస్తకంలో తొలి చిత్రం! ఈ బొమ్మను 2003 లో తొలిసారిగా వేశా. అందులో నావ హంసలా ఉంటుంది. పుస్తకంలోని ఇదే సన్నివేశంలోని పడవ సింపుల్ ! మంథర కైకేయికి దుర్బోధ చేసే చిత్రం (ఒకే గీత) వేసేందుకు చాలా కాలం పట్టింది. ఒక్క గీతలో మంథర పూర్తి శరీరాన్ని చూసినవారు తలపంకించడం గొప్ప కితాబు! రామసేతు చిత్రం లో ఇటుకపై దేవనాగరి లిపిలో ‘రామ’ చిత్రించాను. మొత్తం బొమ్మల్లో ‘అక్షరం’ ఇదొక్కటే! క్షరించని (నాశనం కాని) చిత్రాలు అనే అర్థంలో ఇందులోని చిత్రాలన్నీ అక్షరాలే!

     ‘గీత’ ప్రత్యేకత!

     అసంఖ్యాక రామాయణాలను శతాబ్దాలుగా ఎందరో కళాకారులు శిల్పాలుగా-విగ్రహాలుగా-చిత్రాలుగా మలుస్తున్నారు. వారందరి తపస్సునూ  కాలిగ్రఫీ చిత్రాలలో స్పర్శామాత్రంగా రాబట్టి సంప్రదాయానికి ఆధునికత తేవాలనుకున్నాను. మనిషికి ఒడ్డూపొడవులున్నట్లే గీత ప్రారంభానికి, ముగింపుకు మధ్య స్థలకాలాదులుంటాయి. సరళంగా, ఒంపుగా, పలుచగా, చిక్కగా, శూన్యంగా గీత ప్రయాణిస్తుంది. చిత్రంలో ఖాళీ శూన్యం కాదు. రేఖలో భాగమూ, రేఖకు కొత్త కోణమూ! ఈ చిత్రాలు సందర్శకులకు సందేశాలు ఇవ్వవు. తమ సంస్కృతిలో తమకు నచ్చిన అన్వయించే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ఆస్కారం ఇస్తాయి.  
     - పున్నా కృష్ణమూర్తి,  సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్
     
     పూసపాటి గురించి...

     తెలుగు పద్య మాధుర్యాన్ని ఆస్వాదించి ‘సుందర తెలుగు’ అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి.  పూసపాటి పరమేశ్వరరాజు ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ని చూస్తే ‘సుందర చిత్రమ్’ అనేవారేమో! క్యాలీగ్రఫీ అంటే అందమైన రాత! ఆ రాతలో తనదైన రీతిలో చిత్రాలను రూపొందించారు పూసపాటి! తెలుగు వారికే సొంతమైన పద్యాల్లా తెలుగువాడైన పూసపాటి ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ అనే అపురూప  కళాప్రకియకు ఆద్యుడయ్యారు! కాబట్టే ఆయన చిత్రాలు సముద్రాంతర యానాలు చేస్తూ ప్రపంచ కళాప్రేమికులను అలరిస్తున్నాయ్!

    ఆమ్‌స్టర్‌డామ్‌లో 2013 జూలై నుంచి నవంబర్ 14 వరకూ ‘రామాయణ : లోర్ ఆఫ్ బిలీఫ్’ చిత్రాలను ప్రదర్శించారు. బీజింగ్‌లోని ఐదవ అంతర్జాతీయ బినాలేలో, ఇండియాలోని ఒకేఒక బినాలే అయిన కోచీ ముజిరిస్ బినాలేలో కూడా ఇవి ప్రదర్శితాలు. న్యూఢిల్లీలోని ఐఐసీ గ్యాలరీ నిర్వహించిన అంతర్జాతీయ కాలిగ్రఫీ కళాకారుల ప్రదర్శనకు పూసపాటి ఆహ్వానితులు.

    పూసపాటి వర్క్స్‌ను (బుద్ధిస్ట్ సింబల్స్, జూయిష్ సింబల్స్, క్రిస్టియన్ సింబల్స్, ఏక ఓంకారం, అల్లా నూరు నామాలు, అహురమజ్దా, న్యూమరికల్ యాత్రలు, ఎపిక్ నెరేటివ్స్, ఆయతనాలు, రామయణ-భాగవతాలు) ‘మోసా’ శాశ్వత ప్రాతిపదిక న ప్రద ర్శిస్తోంది. ‘రామాయణమ్ : లోర్ ఆఫ్ బిలీఫ్, ఐకానిక్ కాలిగ్రఫీ’ (రామాయణమ్ : విశ్వాస గాథ, ఐకానిక్ కాలిగ్రఫీ) అనే ప్రతిష్టాత్మక పుస్తకం ఇటీవల విడుదలైంది. వివిధ మ్యూజియంలు ఈ పుస్తకాన్ని సేకరించాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement