Knowledge of science
-
సాంకేతికతలో మనమే ముందుండాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఏటా 7 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదవుతున్నారు. వారంతా యువకులు కావడంతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఎక్కువ ఉంటుంది. అదే పరిజ్ఞానంతో కొత్త ఓటర్లను ఆకర్షించడంలో సఫలం కావాలి. ఈ విషయంలో రాజ కీయ ప్రత్యర్థి కన్నా మనం ముందుండాలి. వారి వేగాన్ని అందుకునేలా శక్తి యాప్ లో సభ్యులను చేర్పించాలి’అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానమే కీలకపాత్ర పోషిస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన శక్తి యాప్ సమీక్ష సమావేశానికి చిదంబరం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల ఓటర్లు ఉన్నారని, వారిలో కనీసం 10% (22 లక్షలు) మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 119 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న లక్ష సభ్యత్వాలు చాలా తక్కువని, ›ప్రతి పోలింగ్ బూత్ లో 25 మందిని సభ్యులుగా చేర్పించాలని కోరారు. ‘కాంగ్రెస్ నేతల కాళ్లు ఆఫీసుల్లో, సొంత పనుల్లో కాకుండా క్షేత్రంలో ఉండాలి. యాప్ ద్వారా నాయకత్వ స్థాయి నుంచి కింది స్థాయి వరకు సమాచారం వస్తుంది, దీన్ని పార్టీ ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆలోగా ప్రతి నెలా 2 లక్షల మందిని యాప్‌లో సభ్యులుగా చేర్పించేలా నేతలు పనిచేయాలి’అని సూచించారు. అత్యధికంగా అంబర్‌పేటలో.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు శక్తి యాప్ చాలా ఉపయోగపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శక్తి యాప్ ప్రాజెక్టును రాహుల్‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, దీన్ని విజయవంతం చేసేందుకు శ్రద్ధతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రచార కార్యక్రమాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. యాప్ రాష్ట్ర ఇన్చార్జి రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలో తెలంగాణలో లక్ష మందిని యాప్ సభ్యులుగా చేర్పించగలిగామన్నారు. అత్యధికంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 13,240 మంది.. కోదాడలో 6,467, హుజూర్‌నగర్‌లో 6,120 మంది యాప్‌లో సభ్యులుగా చేరారని చెప్పా రు. యాప్ నమోదు విషయంలో నేతలు అడిగిన సాంకేతిక సమస్యలకు చిదంబరంతో పాటు ఏఐసీసీ విశ్లేషణ డేటా విభాగం ఇన్చార్జి ప్రవీణ్ చక్రవర్తి సమాధానాలు చెప్పారు. సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క, మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితులపై రాహుల్‌తో చర్చించా: ఉత్తమ్ సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శక్తినివ్వాలనే ఆలోచనతో శక్తి యాప్‌కు రాహుల్ శ్రీకారం చుట్టారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకే చిదంబరం వచ్చారని వెల్లడించారు. శనివారం తన ఢిల్లీ పర్యటనపై మీడియా ప్రశ్నించగా, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. పలువురు నేతల గైర్హాజరు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులంతా సమావేశానికి హాజరవాలని పీసీసీ నుంచి ఆహ్వానం వెళ్లింది. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలే హాజరయ్యారు. సమావేశంలో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి మాట్లాడాలని గ్రేటర్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌ను కోరగా వీహెచ్ అడ్డుచెప్పినట్లు తెలిసింది. అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. యువ నాయకులను తక్కువ అంచనా వేయొద్దని, నేతలందరూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని హితవు పలికినట్లు సమాచారం. -
నైపుణ్యమివ్వండి చాలు..
♦ డొనేషన్లు, ప్యాకేజీలు వద్దు... మా వనరులే మాకు పెట్టుబడి ♦ ఈశాన్య రాష్ట్రాల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై విద్యా ప్రముఖులు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య భారతంగా పిలిచే 8 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీదున్న జీవవైవిధ్య వనరుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని, ఆ వనరుల్నే పెట్టుబడిగా మలిచేలా విద్యా, విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే చాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల మాదిరి తాము ప్యాకేజీలు, డొనేషను కోరుకోవడం లేదని, నైపుణ్య శిక్షణ ఇస్తే సరిపోతుందన్నారు. 104వ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారమిక్కడ ఈశాన్య రాష్ట్రాలలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. గౌహతీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గౌతమ్ బిశ్వాస్ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో మణిపూర్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ అరుణ్‌కుమార్, శాస్త్ర, సాంకేతిక శాస్త్రాల పరిశోధనా సంస్థ (గౌహతీ) డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్సీ తాలూక్‌ధర్, ఈశాన్య రాష్ట్రాల గిరి ప్రాంతాల విశ్వవిద్యాలయం అధిపతి ప్రొఫెసర్ బీకే తివారీ, ప్రొఫెసర్ అరుణ్ కె.మిశ్రా తదితరులు ప్రసంగించారు. ‘‘ఈశాన్య భారతంలోని రాష్ట్రాలలో డిగ్రీ సీట్లు 60 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు 50 శాతం మిగిలిపోతున్నాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభుత్వ జోక్యంతో ప్రజల మధ్య అంతరం పెరుగుతోంది. ఫలితంగా తాము ఈ దేశంలో భాగం కాదా? అనే భావన ప్రజల్లో పెరిగి తిరుగుబాట్లకు దారితీస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి విద్యార్థులు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచాలి. నైపుణ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. కీలకమైన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పేరిట ఏది పడితే అది రుద్దే కన్నా ఏది అవసరమో అది ఇస్తే చాలు’’ అని నిపుణులు చెప్పారు. -
రైతు మిత్రత్వమేదీ?
పేరు మార్చారు ... లక్ష్యాలు నిర్దేశించారు ... నిధులూ కేటాయించారు ... కానీ అడుగు ముందుకు పడడం లేదు. రైతును పలకరించాలి, వ్యవసాయ క్షేత్రంలో ఆయనే ఓ శాస్త్రవేత్తగా ఎదగనివ్వాలి, పొదుపు చేయిస్తూ ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి, దిగుబడిలో రారాజు కావాలంటూ కాగితాల్లో ఎంచక్కా ఊహాగానాల్లో విహరింపజేయించి... ఆచరణలో అపహాస్యం పాలు చేశారు. ఒంగోలు టూటౌన్: వ్యవసాయ అధికారుల్లో నిర్లిప్తత కారణంగా రైతుమిత్ర సంఘాల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రైతుల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మెరుగుపర్చాలన్న లక్ష్యం అటకెక్కింది. 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుక్లబ్ పథకానికి పేరు మార్చి రైతు మిత్ర సంఘాలుగా ప్రస్తుతం తెరపైకి తెచ్చింది. రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి కలిగించడం, రైతుల ఆత్మహత్యలను నివారించడం, ప్రభుత్వ రాయితీలు, యంత్రాలు అందించడంలో సంఘాలను కీలకంగా మలచాలన్నదే లక్ష్యం. ఈ లక్ష్యం జిల్లాలో కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పద్ధతిదీ... ప్రతి వంద హెక్టార్లకు ఒక రైతు మిత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లాలో మూడేళ్లలో 6,030 సంఘాలు మూడు విడతల్లో ఏర్పాటు చేయాలి. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరికి సంఘంలో సభ్యత్వమిస్తారు. ఒక్కో సంఘంలో 15 మంది సభ్యులుంటారు. సంఘ బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ.500 క్రమం తప్పకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంఘం నుంచి ఒకరు కన్వీనర్‌గాను, మరికొరు కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతుల మధ్య ఈ సంఘాలు వారధిగా పనిచేస్తాయి. అమలేదీ... 2001లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 2002లో 170 వరకు ఏర్పాటయ్యాయి. వాటిలో 148 చురుకుగా పనిచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్చినాటికి 2,010 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అన్ని మండలాలకు లక్ష్యాలు నిర్దేశించింది. ఇప్పటి వరకు ఒక్క రైతుమిత్ర సంఘం ఏర్పాటు చేసినట్లు జిల్లా కేంద్రానికి సమాచారం రాలేదు. ఆయా మండలాలకు ఇచ్చిన లక్ష్యాలు కాగితాల్లోనే మగ్గుతున్నట్లు సమాచారం. రూ.కోటి కేటాయింపు ప్రతి రైతుమిత్ర సంఘానికీ నిర్వహఖ ఖర్చుల కింద రూ.5 వేలు మంజూరు చేస్తారు. మొత్తం కోటి 50 వేలు కేటాయించారు. వాటితో దస్త్రాల నిర్వహణ, క్షేత్రసందర్శన లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పట్లో రైతుక్లబ్ల నిర్వహణకు 2001వ సంవత్సరంలో రూ.800, 2002వ సంవత్సరంలో రూ.2,500 ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతు మిత్ర సంఘాలు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి సభ్యునికి నెలకు రూ.50 ప్రకారం కొన్ని నెలలపాటు పొదుపు చేశాయి. సక్రమంగా పొదుపు చేసిన సంఘాలకు రూ.10వేల ప్రకారం రివాల్వింగ్ ఫండ్ కూడా మంజూరు చేశారు. -
పూసపాటి ‘టైమ్‌లెస్ ఆర్ట్’!
జూన్ 12 వరకు నగరంలో కొనసాగనున్న ప్రదర్శన బెల్జియంలో సానపెట్టిన వజ్రాలకు ఒక రవ్వ ప్రకాశం ఎక్కువ అని సామెత. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌కు సమీపంలోని ‘మ్యూజియం ఆఫ్ శాక్రెడ్ ఆర్ట్’ (మోసా)లో ప్రదర్శించే చిత్రాలకూ అటువంటి అదనపు గౌరవం ఉంది. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించే యూరోపియన్ సంస్థ (యు ఆర్ ఐ)లో సభ్యుడైన మార్టిన్ ‘మోసా’ను 2009లో స్థాపించాడు. ‘మోసా’ నూతన భవనాన్ని ఈ నెల 17వ తేదీన హరిప్రసాద్ చౌరాసియా వేణుగానంతో, పూసపాటి పరమేశ్వరరాజు చిత్రించిన ఐకానిక్ కాలిగ్రఫీ చిత్రాల ఎగ్జిబిషన్ (టైమ్‌లెస్ ఆర్ట్)తో ప్రారంభిస్తున్నారు. అంతదూరం వెళ్లి పూసపాటి చిత్రాలను చూడలేం కదా! నథింగ్ టు వర్రీ! ఈ నెల 12 నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో పూసపాటి తాజాచిత్రాలు కొలువై ఉన్నాయి. వచ్చే నెల 12 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఈ నేపథ్యంలో పూసపాటితో సంభాషణా సారాంశం ఆయన మాటల్లోనే... విజయనగరంలో 1961లో జన్మించాను. తమిళనాడు, పుణే, ఔరంగాబాద్‌లలో చదువుకున్నాను. ‘ముద్ర’లో పనిచేశాను. జగదీష్ అండ్ కమలా మ్యూజియం ట్రస్టీలలో ఒకరిగా సేవలు అందిస్తున్నాను. మా ప్రపితామహులు పూసపాటి అప్పలరాజుగారు ఒరిస్సాలో ‘అస్కా’ అనే గ్రామానికి చెందినవారు. ఆలయ శిల్పాలు, లోహ విగ్రహాలు రూపొందించేవారు. పౌరాణిక గాధల చిత్రకథలను ప్రెస్కోలుగా చిత్రించేవారు. చింతగింజల మేళవింపుతో తయారైన రంగులను వాడి వస్త్రాలపై బొమ్మలు వేసేవారు. పూర్వీకుల కళ బహుశా నాలో అంతర్లీనంగా ఉండి ఉంటుంది. భారతీయ ఇతిహాసాలను ఆధునికంగా చెప్పాలనే ముప్పయ్యేళ్ల ప్రయత్నం ఐకానిక్ క్యాలిగ్రఫీ రూపంలో వ్యక్తమైంది. రామాయణంలో ‘కొత్తదనాలు’! వాల్మీకి రామాయణంలో ఇప్పటికీ మనకు ఉపకరించే కుటుంబ జీవితానికి సంబంధించిన మౌలిక విలువలున్నా యి. రామాయణం భారతీయ సామూహిక, సామాజిక చేతనాత్మ! తరచి చూస్తే.. రాముడు-సీత-లక్ష్మణుడు-భరతుడు-ఆంజనేయుడు-సుగ్రీవుడు-రావణుడు తదితర పాత్రలన్నీ ఏ కొంచెమో మన జీవితంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో 37 డ్రాయింగ్ల సంకలనంగా కాలిగ్రఫీలో రామాయణం రూపొందించాను. ఆరు కాండాల ఇతిహాసంలో ఎన్నెన్ని ఘట్టాలు... ఎన్నెన్ని పాత్రలు.... ఎంతటి వైవిధ్యం... వీటన్నిటిని ఎంపిక చేసుకున్న పాళీల ద్వారా లయగతితో వ్యక్తీకరించాను. నా పుస్తకంలో రామాయణ కథానుసారం చిత్రాలుండవు. నా మనో చిత్రంలో మెరిసిన ఘట్టాలను డ్రాయిం గులుగా మలచా. ఉదాహరణకు సరయూ నదిని గిరిజన రాజు గుహుడు తన పడవపై సీతారామలక్ష్మణులను దాటిస్తోన్న దృశ్యం పుస్తకంలో తొలి చిత్రం! ఈ బొమ్మను 2003 లో తొలిసారిగా వేశా. అందులో నావ హంసలా ఉంటుంది. పుస్తకంలోని ఇదే సన్నివేశంలోని పడవ సింపుల్ ! మంథర కైకేయికి దుర్బోధ చేసే చిత్రం (ఒకే గీత) వేసేందుకు చాలా కాలం పట్టింది. ఒక్క గీతలో మంథర పూర్తి శరీరాన్ని చూసినవారు తలపంకించడం గొప్ప కితాబు! రామసేతు చిత్రం లో ఇటుకపై దేవనాగరి లిపిలో ‘రామ’ చిత్రించాను. మొత్తం బొమ్మల్లో ‘అక్షరం’ ఇదొక్కటే! క్షరించని (నాశనం కాని) చిత్రాలు అనే అర్థంలో ఇందులోని చిత్రాలన్నీ అక్షరాలే! ‘గీత’ ప్రత్యేకత! అసంఖ్యాక రామాయణాలను శతాబ్దాలుగా ఎందరో కళాకారులు శిల్పాలుగా-విగ్రహాలుగా-చిత్రాలుగా మలుస్తున్నారు. వారందరి తపస్సునూ కాలిగ్రఫీ చిత్రాలలో స్పర్శామాత్రంగా రాబట్టి సంప్రదాయానికి ఆధునికత తేవాలనుకున్నాను. మనిషికి ఒడ్డూపొడవులున్నట్లే గీత ప్రారంభానికి, ముగింపుకు మధ్య స్థలకాలాదులుంటాయి. సరళంగా, ఒంపుగా, పలుచగా, చిక్కగా, శూన్యంగా గీత ప్రయాణిస్తుంది. చిత్రంలో ఖాళీ శూన్యం కాదు. రేఖలో భాగమూ, రేఖకు కొత్త కోణమూ! ఈ చిత్రాలు సందర్శకులకు సందేశాలు ఇవ్వవు. తమ సంస్కృతిలో తమకు నచ్చిన అన్వయించే ప్రత్యేక సందర్భాలను గుర్తు చేసుకునేందుకు ఆస్కారం ఇస్తాయి. - పున్నా కృష్ణమూర్తి, సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్ పూసపాటి గురించి... తెలుగు పద్య మాధుర్యాన్ని ఆస్వాదించి ‘సుందర తెలుగు’ అన్నారు తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. పూసపాటి పరమేశ్వరరాజు ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ని చూస్తే ‘సుందర చిత్రమ్’ అనేవారేమో! క్యాలీగ్రఫీ అంటే అందమైన రాత! ఆ రాతలో తనదైన రీతిలో చిత్రాలను రూపొందించారు పూసపాటి! తెలుగు వారికే సొంతమైన పద్యాల్లా తెలుగువాడైన పూసపాటి ‘ఐకానిక్ కాలిగ్రఫీ’ అనే అపురూప కళాప్రకియకు ఆద్యుడయ్యారు! కాబట్టే ఆయన చిత్రాలు సముద్రాంతర యానాలు చేస్తూ ప్రపంచ కళాప్రేమికులను అలరిస్తున్నాయ్! ఆమ్‌స్టర్‌డామ్‌లో 2013 జూలై నుంచి నవంబర్ 14 వరకూ ‘రామాయణ : లోర్ ఆఫ్ బిలీఫ్’ చిత్రాలను ప్రదర్శించారు. బీజింగ్‌లోని ఐదవ అంతర్జాతీయ బినాలేలో, ఇండియాలోని ఒకేఒక బినాలే అయిన కోచీ ముజిరిస్ బినాలేలో కూడా ఇవి ప్రదర్శితాలు. న్యూఢిల్లీలోని ఐఐసీ గ్యాలరీ నిర్వహించిన అంతర్జాతీయ కాలిగ్రఫీ కళాకారుల ప్రదర్శనకు పూసపాటి ఆహ్వానితులు. పూసపాటి వర్క్స్‌ను (బుద్ధిస్ట్ సింబల్స్, జూయిష్ సింబల్స్, క్రిస్టియన్ సింబల్స్, ఏక ఓంకారం, అల్లా నూరు నామాలు, అహురమజ్దా, న్యూమరికల్ యాత్రలు, ఎపిక్ నెరేటివ్స్, ఆయతనాలు, రామయణ-భాగవతాలు) ‘మోసా’ శాశ్వత ప్రాతిపదిక న ప్రద ర్శిస్తోంది. ‘రామాయణమ్ : లోర్ ఆఫ్ బిలీఫ్, ఐకానిక్ కాలిగ్రఫీ’ (రామాయణమ్ : విశ్వాస గాథ, ఐకానిక్ కాలిగ్రఫీ) అనే ప్రతిష్టాత్మక పుస్తకం ఇటీవల విడుదలైంది. వివిధ మ్యూజియంలు ఈ పుస్తకాన్ని సేకరించాయి.