రైతు మిత్రత్వమేదీ?
పేరు మార్చారు ... లక్ష్యాలు నిర్దేశించారు ... నిధులూ కేటాయించారు ... కానీ అడుగు ముందుకు పడడం లేదు. రైతును పలకరించాలి, వ్యవసాయ క్షేత్రంలో ఆయనే ఓ శాస్త్రవేత్తగా ఎదగనివ్వాలి, పొదుపు చేయిస్తూ ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి, దిగుబడిలో రారాజు కావాలంటూ కాగితాల్లో ఎంచక్కా ఊహాగానాల్లో విహరింపజేయించి...
ఆచరణలో అపహాస్యం పాలు చేశారు.
ఒంగోలు టూటౌన్: వ్యవసాయ అధికారుల్లో నిర్లిప్తత కారణంగా రైతుమిత్ర సంఘాల ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రైతుల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం మెరుగుపర్చాలన్న లక్ష్యం అటకెక్కింది. 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుక్లబ్ పథకానికి పేరు మార్చి రైతు మిత్ర సంఘాలుగా ప్రస్తుతం తెరపైకి తెచ్చింది. రైతులను సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ఆర్థికాభివృద్ధి కలిగించడం, రైతుల ఆత్మహత్యలను నివారించడం, ప్రభుత్వ రాయితీలు, యంత్రాలు అందించడంలో సంఘాలను కీలకంగా మలచాలన్నదే లక్ష్యం. ఈ లక్ష్యం జిల్లాలో కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పద్ధతిదీ...
ప్రతి వంద హెక్టార్లకు ఒక రైతు మిత్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలి. జిల్లాలో మూడేళ్లలో 6,030 సంఘాలు మూడు విడతల్లో ఏర్పాటు చేయాలి. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరికి సంఘంలో సభ్యత్వమిస్తారు. ఒక్కో సంఘంలో 15 మంది సభ్యులుంటారు. సంఘ బ్యాంకు ఖాతాలో ప్రతి నెలా రూ.500 క్రమం తప్పకుండా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంఘం నుంచి ఒకరు కన్వీనర్‌గాను, మరికొరు కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయశాఖ అధికారులు, రైతుల మధ్య ఈ సంఘాలు వారధిగా పనిచేస్తాయి.
అమలేదీ...
2001లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. 2002లో 170 వరకు ఏర్పాటయ్యాయి. వాటిలో 148 చురుకుగా పనిచేస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్చినాటికి 2,010 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని అన్ని మండలాలకు లక్ష్యాలు నిర్దేశించింది. ఇప్పటి వరకు ఒక్క రైతుమిత్ర సంఘం ఏర్పాటు చేసినట్లు జిల్లా కేంద్రానికి సమాచారం రాలేదు. ఆయా మండలాలకు ఇచ్చిన లక్ష్యాలు కాగితాల్లోనే మగ్గుతున్నట్లు సమాచారం.
రూ.కోటి కేటాయింపు
ప్రతి రైతుమిత్ర సంఘానికీ నిర్వహఖ ఖర్చుల కింద రూ.5 వేలు మంజూరు చేస్తారు. మొత్తం కోటి 50 వేలు కేటాయించారు. వాటితో దస్త్రాల నిర్వహణ, క్షేత్రసందర్శన లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. అప్పట్లో రైతుక్లబ్‌ల నిర్వహణకు 2001వ సంవత్సరంలో రూ.800, 2002వ సంవత్సరంలో రూ.2,500 ప్రకారం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతు మిత్ర సంఘాలు బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి సభ్యునికి నెలకు రూ.50 ప్రకారం కొన్ని నెలలపాటు పొదుపు చేశాయి. సక్రమంగా పొదుపు చేసిన సంఘాలకు రూ.10వేల ప్రకారం రివాల్వింగ్ ఫండ్ కూడా మంజూరు చేశారు.