♦ డొనేషన్లు, ప్యాకేజీలు వద్దు... మా వనరులే మాకు పెట్టుబడి
♦ ఈశాన్య రాష్ట్రాల్లో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై విద్యా ప్రముఖులు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య భారతంగా పిలిచే 8 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీదున్న జీవవైవిధ్య వనరుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయని, ఆ వనరుల్నే పెట్టుబడిగా మలిచేలా విద్యా, విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే చాలని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల మాదిరి తాము ప్యాకేజీలు, డొనేషను కోరుకోవడం లేదని, నైపుణ్య శిక్షణ ఇస్తే సరిపోతుందన్నారు. 104వ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా శనివారమిక్కడ ఈశాన్య రాష్ట్రాలలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. గౌహతీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గౌతమ్ బిశ్వాస్ అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో మణిపూర్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ అరుణ్‌కుమార్, శాస్త్ర, సాంకేతిక శాస్త్రాల పరిశోధనా సంస్థ (గౌహతీ) డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌సీ తాలూక్‌ధర్, ఈశాన్య రాష్ట్రాల గిరి ప్రాంతాల విశ్వవిద్యాలయం అధిపతి ప్రొఫెసర్ బీకే తివారీ, ప్రొఫెసర్ అరుణ్ కె.మిశ్రా తదితరులు ప్రసంగించారు.
‘‘ఈశాన్య భారతంలోని రాష్ట్రాలలో డిగ్రీ సీట్లు 60 శాతం, పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు 50 శాతం మిగిలిపోతున్నాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభుత్వ జోక్యంతో ప్రజల మధ్య అంతరం పెరుగుతోంది. ఫలితంగా తాము ఈ దేశంలో భాగం కాదా? అనే భావన ప్రజల్లో పెరిగి తిరుగుబాట్లకు దారితీస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి విద్యార్థులు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచాలి. నైపుణ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. కీలకమైన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పేరిట ఏది పడితే అది రుద్దే కన్నా ఏది అవసరమో అది ఇస్తే చాలు’’ అని నిపుణులు చెప్పారు.
నైపుణ్యమివ్వండి చాలు..
Published Sun, Jan 8 2017 4:47 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
Advertisement