జీరోడిగ్రీ : కవిత్వానికి కనెక్ట్ చేస్తుంది!
‘లోకం మెచ్చని నా బతుకును లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు...’ అన్న ఏక వాక్యం ‘జీరోడిగ్రీ’కి ఇరుసు. మనుషుల్లో ఒరిజినాలిటీ కోసం వెతకడం, లేనివి ఉన్నవిగా చూపెట్టే కొద్దీ ఉన్నవి లేనివిగా తెల్సిపోతోందనే పరిశీలన ఈ కవిత్వానికి ధాతువు. నలుచదరాల తెలుపు నలుపు పుస్తకం. సాదాసీదా వచనం. ఇంతకంటే సింపుల్‌గా రాయడానికి వీల్లేని పదాలు. వచన కవిత్వానికి సహజమైన పంక్తులు, ఫుల్‌స్టాపుల సాంప్రదాయాన్నీ పాటించని వైనం. అలంకార రహితమైన పుస్తకంలో అహంకార రహిత కవిత్వం.
ఈ కవిత్వం వస్తువేమిటి? సిద్ధాంతమేమిటి? పరిష్కారమేమిటి? అనే అన్ని ప్రశ్నలకూ ‘రంగు-రుచి-వాసన’ లేని నీటి బిందువులా తొణికిసలాడే సమాధానం! కాబట్టే, కవిసంగమం ద్వారా నిత్యకల్యాణంగా రోజూ కవిత్వం రాసే వందలాది యువకుల్లో ఒకరైన మోహన్‌రుషి కవిత్వం బెంగళూరుకు చెందిన నవులూరి మూర్తిని ఆకర్షించింది. కవి ఎవరో తెలియక పోయినా కవిత్వానికి పలవరించారు. ఇంగ్లిష్‌లోకి అనువదించారు. తెలుగులో పుస్తకం రాకముందే ఇంగ్లిష్ పాఠకులను ఆనందపరచారు. ‘జీరోడిగ్రీ’లో 90కి పైగా కవితల్లో ఆకట్టుకోని వాక్యం అరుదు. ఉదాహరణకు కొన్ని వాక్యాలు :
ప్రపంచమే కుగ్రామం కదా/ ఇప్పుడు ఇల్లు ఇరుకవడంలో ఆశ్చర్యం లేదు (ఓపెన్ ఘోరం)
ఆ బట్టలన్నీ మా వీపులకేసి ఉతికినా మాకా శిక్ష చాలదు (పాత యంత్రం),
అప్పుడే కదుల్తోన్న మున్సిపాలిటీ ట్రక్కులోంచి/ఒక్క చెయ్యి మాత్రం కన్పించింది (సిగ్నల్‌లైట్ సాక్షిగా...)
పొయ్యిలో నువు కట్టెవయినా కూర పాత్రలో వాని హృదయం ఉడకదు (భరతవాక్యం)
ఎందుకో తెల్వదు/ఊరికెల్లి పట్నమొచ్చిన కానించి/దేనిమీద నెనరు లేకుండయ్యింది (శెర)
నడుస్త/ఉరుక్త/ నేను మా మిర్యాలగూడెంల బడ్త (దూప)
తిరిగి తిరిగి అక్కడికే చేరుకున్నాను/మరిగి మరిగి మౌనమే మంచిదని తెలుసుకున్నాను (బైరాగి జననం)
వంటి వాక్యాలు జీవితంలోని రెండు పార్శ్వాలనూ సూచిస్తాయి.
మోహన్‌రుషి కవిత్వంలో సిద్ధాంత రాద్ధాంతాలు లేవు. అది చేస్తా ఇది చేస్తా లేవు. అది చెయ్యి ఇది చెయ్యి లేవు. కేవలం కవిత్వం ఉంది. బైరాగి-పఠాభి కోవలో ’ అని గోరటి వెంకన్న, దీవి సుబ్బారావు, హెచ్చార్కె, అసుర తదితరులు ఈ సంకలనానికి కితాబునిచ్చారు. ఇతడికి పట్టువడిన ఆల్కెమీ ఏమిటి? అక్షాంశాలకు ప్రామాణికమైన భూమధ్యరేఖను జీరో డిగ్రీ అంటారు. ప్రామాణిక రేఖాంశాన్ని కూడా జీరో డిగ్రీ అనే అంటారు. అక్షాంశాలు పరస్పరం కలవవు. భూమిపై నిర్దుష్టంగా ఉంటాయి. రేఖాంశాలు అనిర్దేశాలు. ఇదీ ఇక్కడా అని చెప్పడానికి వీలు కాని పరిభ్రమణాలు. వీటన్నిటి ఏకోన్ముఖ ప్రయాణం నార్త్‌పోల్‌లోని ‘జీరో డిగ్రీ’! మనిషిలో, అణువులో, బ్రహాండంలో సమస్తసృష్టిలో సహజమైన అంతర్గత కదలిక ‘జీరో’వైపే. ఆ కదలికను దేనికీ అంటని ‘అయస్కాంత సూచి’లో మాత్రమే గమనించగలం. మోహన్‌రుషిలోనూ అటువంటిదేదో ఉంది. ‘జీవితమంటే ఒకరికొకరు రియాక్ట్ కావడమే కదా’ అని సూచిస్తున్నాడు.