సంక్రాంతి పర్వాన ఆకాశ దేశాన! | Under the Ahmedabad Sky' documentary | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పర్వాన ఆకాశ దేశాన!

Published Wed, Jan 14 2015 10:43 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

సంక్రాంతి పర్వాన  ఆకాశ దేశాన! - Sakshi

సంక్రాంతి పర్వాన ఆకాశ దేశాన!

ఏమాటకామాట చెప్పుకోవాలి... సంక్రాంతి రోజుల్లో ఆకాశం ఆకాశంలా ఉండదు. విశాలమైన పూలతోటలా ఉంటుంది. ఆ తోటలో... ఎన్ని అందమైన గాలిపట పుష్పాలో కదా! ఆ నోటా ఈ నోటా... మన పండగ సమయపు ఆకాశాన్ని గూర్చి విన్న ఫ్రాన్సిస్కో లిగ్‌నోల అనే ఇటాలియన్ అమ్మాయి తన మిత్రుడు, కెమెరామెన్ జీన్ ఆంటోనితో చర్చించింది. అప్పుడు వారొక నిర్ణయానికి వచ్చారు... సంక్రాంతి పండగ రోజుల్లో ఇండియాకు వెళ్లాలని. అలా ఓ సంక్రాంతి పండగ రోజుల్లో గుజరాత్‌లోని ప్రముఖ నగరమైన అహ్మదాబాద్‌కు వచ్చారు... పతంగుల పండగ కోసం, ఆకాశంలో వెలిగిపోయే పూలతోట కోసం! ఈ నేపథ్యంలో పుట్టిందే ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీ. మొదట ఆల్‌జజీరా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌లో ‘విట్‌నెస్ స్పెషల్’ కార్యక్రమంలో ఈ డాక్యుమెంటరీ ప్రసారమైంది. నాలుగు భాగాల ఈ డాక్యుమెంటరీలో ఎన్నెన్నో కోణాలు కనిపిస్తాయి.

తొలి దృశ్యం... అందమైన సూర్యోదయం.

అయ్యవారి మాటలు వినిపిస్తుంటాయి... ‘‘ఏదో ఒకరోజు... ఆ ఆకాశంలో నారాయణుడు కనిపించి సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడు. నారాయణుడి చుట్టూ చేరి దేవతలు సంతోషంలో తలమునకలై పోతారు...’’ ఆకాశంలో కనిపించే సంభ్రమాశ్చర్య దృశ్యాన్ని చూసి... ప్రజలు ‘పతంగ్ ఉత్సవ్’ను ఘనంగా జరుపుకుంటారట. దీంతో... రోజూ కనిపించే ఆకాశమే ఆరోజు రంగులమయమై, సౌందర్యమయమై, కన్నులపండగై కనిపిస్తుందట. కొద్ది సేపటి తరువాత కెమెరా అహ్మదాబాద్ పతంగుల దుకాణాల గల్లీలలోకి వెళుతుంది.

‘‘ఎలా ఉన్నాయి పతంగ్‌ల ధరలు?’’ అడుగుతాడు కస్టమర్.

పతంగులు అమ్మేటాయన దగ్గరి నుంచి ఏకవాక్య సమాధానం వినిపించదు. ఎందుకంటే, మనుషుల్లో తేడా ఉన్నట్లే, మనసుల్లో తేడా ఉన్నట్లే పతంగుల్లోనూ తేడాలు ఉంటాయి. అన్నీ ఎగిరేది ఆకాశంలోనైనా పేదోళ్ల పతంగులు, పెద్దోళ్ల పతంగులు, మధ్యతరగతి పతంగులు... ధరను బట్టి పతంగుల విలువ పెరుగుతుంది. అందుకే, దుకాణదారుడిని ‘‘ధర ఎంత?’’ అని అడిగితే చాలు... చాలా వివరంగా మాట్లాడతాడు. తన దుకాణంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు తొంగి చూస్తున్న 15 రకాల పతంగుల గురించి! హిందువులు మాత్రమే కాదు... జైనులు, సిక్కులు, ముస్లింలు... మతాలకు అతీతంగా ‘ఫెస్టివల్ ఆఫ్ మకరసంక్రాంతి’ని పతంగుల పండగ ద్వారా సొంతం చేసుకుంటారు. పతంగి అంటే ఆట వస్తువు కాదు... మతాలకతీతమైన లౌకిక ప్రతీక!

ఢిల్లీ గేట్ దగ్గర మాంజా తయారీదారులు కూడా ఈ డాక్యుమెంటరీలో తమ గొంతు వినిపిస్తారు. కూరగాయలు, రకరకాల ఔషధ మొక్కల సారంతో తొమ్మిది రకాల మాంజా ఎలా తయారవుతుందో చెబుతారు. ‘మాంజా గురు’గా ప్రసిద్ధుడైన అరవై సంవత్సరాలు పైబడిన ధీరుబాయి పటేల్ - ‘‘మాంజాను అందరూ ఒకేవిధంగా తయారుచేసినట్లు అనిపించినా... ఎవరి రహస్యాలు వారికి ఉంటాయి’’ అంటారు.
 అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కవి భాను షా... ఇంటర్వ్యూలో ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. భాను షా అంటే కవి మాత్రమే కాదు... పతంగులకు సంబంధించిన సంపూర్ణ సమాచార సర్వస్వం. వివిధ కాలాల్లో పతంగుల తయారీ, పతంగ్ ఉత్సవ్‌కు సంబంధించిన ఆనాటి విశేషాలు ఆయన నోటి నుంచి వినాల్సిందే. ‘అహ్మదాబాద్ కైట్ మ్యూజియం’లో ప్రతి పతంగి గురించి సాధికారికంగా చెప్పగలిగే సామర్థ్యం భాను షా సొంతం. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి తాత్విక నిర్వచనాలు ఇస్తారు షా. ‘‘ఆకాశం అనే ప్రపంచంలో గాలిపటం అనేది స్వేచ్ఛను, ఒకరి గాలిపటాన్ని మరొకరు తెంపడం అనేది పోటీ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి’’ అంటారు ఆయన. ‘‘నగరమంతా ఆ రోజు ఇళ్లలో కాదు... ఇంటి కప్పులపై ఉంటుంది’’ అని చమత్కరిస్తారు అహ్మదాబాద్ అర్కిటెక్చర్ ప్రొఫెసర్ నితిన్ రాజే.

కైట్ మార్కెట్‌లో వినిపించే ‘షోలే’ సినిమాలోని ‘మెహబూబా మెహబూబా ’ పాట కావచ్చు, ఆలయ వీధుల్లో పవిత్రధ్వనితో వినిపించే ‘ధినక్ ధినక్ నాచే బోలానాథ్’ పాట కావచ్చు... నేపథ్యసంగీతం ద్వారా దృశ్యాన్ని పండించి ‘అండర్ ది అహ్మదాబాద్ స్కై’ డాక్యుమెంటరీని కన్నుల పండగ చేయడంలో విజయం సాధించింది ఫ్రాన్సిస్సో లిగ్‌నోల, జీన్ అంటోని ద్వయం.
- యాకుబ్ పాషా యం.డి
 
డాక్యుమెంటరీ పేరు: అండర్ ది అహ్మదాబాద్ స్కై
దర్శకత్వం: ఫ్రాన్సిస్కో లిగ్‌నోల
కెమెరా: జీన్ ఆంటోని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement