వెయ్యి చీకట్ల వాడు... లక్ష వెలుగుల రేడు! | He thousand in the dark ... Redu being lighted! | Sakshi
Sakshi News home page

వెయ్యి చీకట్ల వాడు... లక్ష వెలుగుల రేడు!

Published Wed, Feb 11 2015 11:20 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

వెయ్యి చీకట్ల వాడు...   లక్ష వెలుగుల రేడు! - Sakshi

వెయ్యి చీకట్ల వాడు... లక్ష వెలుగుల రేడు!

 దృశ్యం
 
ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల  పరిచయమే... ఈ దృశ్యం.
 
ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు.
డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
 - ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
 
అబ్రహం లింకన్ జీవితం ఆయనది మాత్రమే కాదు. సొంతం చేసుకుంటే అందరిదీ. ఆయన జీవితంలోని మేలిమి అంశాలు, సొంతం చేసుకున్నవాళ్లకు సొంతం చేసుకున్నంత. బహుముఖ కోణాల ఆయన జీవితం ఏకైక విశ్లేషణలకు, నిర్వచనాలకు లొంగనిది. ‘అమెరికన్ సివిల్ వార్’ కాలంలో ‘అధ్యక్షుడంటే ఇలా ధైర్యంగా ఉండాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా దూసుకుపోవాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా పట్టుదలగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అర్హతలకు తన వ్యక్తిత్వపు వెలుగులో సరికొత్త నిర్వచనాలు ఇవ్వడమే కాదు, నల్లబానిసల జీవితాలకు కొత్త వెలుగు తీసుకువచ్చినవాడు లింకన్. ఆయన ‘అధ్యక్షుడు’ కాకుండా ఉంటే... అమెరికా ఎన్ని అమెరికాలుగా ఉండి ఉండేదో! (కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి పేర్లతో!)

అబ్రహం లింకన్ గురించి మాట్లాడుకోవడమంటే కెంటకీలోని నాల్గవ తరగతి పట్టణమైన హొడ్జెన్‌విల్లీలో జన్మించిన వ్యక్తి గురించి, ఆయన గొప్పదనం గురించి మాట్లాడుకోవడం కాదు. దేశాలకు అతీతమై, కాలాతీతమైన ఒక నవ ఉత్తేజం గురించి మాట్లాడుకోవడం. రాజనీతిజ్ఞులకు, ఆర్థిక వేత్తలకు, చరిత్రకారులకు, జీవితచరిత్రకారులకు, పాత్రికేయులకు లింకన్ జీవితంలో నుంచి ఎంత విలువైన ముడిసరుకు లభించిందో... కాల్పనిక రచయితలు, కళాకారులు, మానసిక విశ్లేషకులకు అంతే విలువైన ముడి సరుకు లభించింది.
 అబ్రహం లింకన్ జీవితం ఆధారంగా ఎన్నో పుస్తకాలు, మరెన్నో సినిమాలు వచ్చాయి కదా... మరి డెరైక్టర్ విక్రమ్ జయంతి తన ‘లింకన్’ అనే డాక్యుమెంటరీలో కొత్తగా ఏం చెప్పాడు?

‘‘కొత్తగా ఏం చెప్పగలను?’’ అని మొదట్లో తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు విక్రమ్. ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలు చూసిన తరువాత ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. ‘‘డాక్యుమెంటరీ తీయవద్దు’’ - ఇదీ నిర్ణయం. ‘‘ఒకవేళ తీస్తే మాత్రం...లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్‌తో కాదు, లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్‌తో తీయాలి’’. ‘లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్’తో రీలు చుట్టేయడం కష్టమైన పనేమీ కాదు... కానీ ‘లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్’తో తీయడమే కష్టాల్లో కెల్లా కష్టం. చిత్రాన్ని కాదు... చిత్రం వెనుక చిత్రాన్ని చూడాలి. వాక్యాన్ని కాదు. వాక్యం వెనుక వాక్యాన్ని చూడాలి. సంతోషాన్ని కాదు... దాని వెనక దుఃఖాన్ని చూడగలగాలి! తాను చదివిన పుస్తకాల్లో నుంచి నోట్స్ రాసుకున్నాడు. శాస్త్రీయంగా విశ్లేషించడానికి లింకన్ బ్రెయిన్ కెమిస్ట్రీ డాటాలాంటిది అందుబాటులో లేదు కాబట్టి ‘డిప్రెషన్’తో సహా లింకన్‌కు సంబంధించిన రకరకాల మనోవైఖరులను సందర్భానుసారంగా ఒడిసి పట్టి వాటికి దృశ్యరూపం ఇచ్చి, ప్రపంచానికి సుపరిచితుడైన ఒక మహానాయకుడి ‘అపరిచిత ప్రపంచాన్ని’ పట్టుకోగలిగాడు విక్రమ్. థామస్ క్రాగ్‌వెల్ రాసిన పుస్తకం ఆధారంగా వచ్చిన ‘లింకన్ గ్రేవ్ రాబరీ’లాంటి డాక్యుమెంటరీలతో పోల్చితే, వాటిలో కనిపించే సస్పెన్స్, మలుపులు, నాటకీయత ‘లింకన్’లో బొత్తిగా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ ‘లింకన్’ అనేది ఏ సస్పెన్స్ థ్రిల్లర్‌కూ తీసిపోని ‘ఆసక్తి’ని ప్రేక్షకులకు కలిగిస్తుంది.
                        
పూరి గుడిసెలో కన్న కలల గురించి, వైట్‌హౌజ్‌లో కార్చిన కన్నీళ్ల గురించి గోర్ విడల్ గొంతులో లింకన్ స్వగత కథనం వినిపిస్తుంది. ప్రధాన స్రవంతి సినిమాలలో కనిపించే ఈ టెక్నిక్‌ను వాడుకొని డాక్యుమెంటరీని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు విక్రమ్. ‘‘ఎంతోమంది లింకన్ జీవితాన్ని తమ జీవితంతో పోల్చుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని’’ అంటాడు విక్రమ్. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే!

లింకన్‌ను వెంటాడిన కుంగుబాటు, చావుపై ప్రధానంగా సాగే ఈ డాక్యుమెంటరీలో లింకన్ జీవితంలోని పలు అంశాలపై జీవితచరిత్రకారులు స్పందించారు. లింకన్ జీవితంలోని భిన్న పార్శ్వాల గురించి విశ్లేషించారు. ‘‘ఆయన విజయాలు, ప్రతిభకు సంబంధించిన విషయాలు మాత్రమే తెలుసుకుంటే... లింకన్ జీవితాన్ని అసంపూర్ణంగా తెలసుకున్నట్లే. నిజానికి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాడు. వాటి గురించి తెలుసుకుంటేగానీ ఆయన గొప్పదనం అర్థం కాదు’’ అంటాడు ‘లింకన్స్ మెలంకలి’ పుస్తకం రాసిన వోల్ఫ్ షెంక్. నిజానికి లింకన్ బాధపడినట్లు, ఏ ప్రసిద్ధ నాయకుడూ ‘డిప్రెషన్’తో బాధ పడి ఉండడు. అయినప్పటికీ ఆయన గత జ్ఞాపకాల భారంతో బాధ పడినట్లు అనిపించదు. ఆయన విజయాలకేమీ అది అడ్డుపడలేదు.
 ఒకే కోణం అని కాకుండా... లింకన్‌లోని రకరకాల డిప్రెసివ్ టెండెన్సీలను ఈ డాక్యుమెంటరీ స్పృశిస్తుంది. దీనికి సంబంధించి లింకన్ ఉత్తరాల నుంచి కొన్ని వాక్యాలను కూడా ఉదహరించారు. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీలో ప్రపంచానికి తెలిసిన లింకన్ వెలుగులు లేవు. తెలియని చీకటి ప్రపంచం ఉంది. ఆ చిమ్మ చీకట్లోనే ప్రకాశించే నిలువెత్తు లింకన్ సంతకం ఉంది.

-యాకుబ్ పాషా యం.డి
 
డాక్యుమెంటరీ పేరు: లింకన్
డెరైక్టర్: విక్రమ్ జయంతి
 డెరైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎమ్మా మాథ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement