poem
-
కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?
సెలబ్రిటీలు, అందాల తారల పెళ్లిళ్లు పెళ్లి ముచ్చట్టు హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. వారు కట్టుకున్న డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలు, వెడ్డింగ్ డెస్టినేషన్ ఇలా ఒకటనేమిటీ ప్రతీదీ వార్తల్లో విశేషంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం మహానటి ఫేం, నటి కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు వైరల్‌గా మారాయి. ఏంటా విశేషాలు తెలుసుకుందామా..!15 ఏళ్ల సుదీర్ఘ స్నేహం తర్వాత, ప్రియుడు ఆంటోనీ తటిల్‌తో ఈనెల 12న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయ్యంగార్, క్రిస్టియన్ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కీర్తి సురేష్ పెళ్లి చీర విశేషాలు గురించి మాట్టాడుకుంటే.. పసుపు , ఆకు పచ్చ రంగుల కాబినేషన్లో ఉన్న చీరలో కొత్త పెళ్లికూతురిగా అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైనర్ ఆంటోనీ అనితా డోంగ్రే ఈ చీర విశేషాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇక కీర్తి సురేష్ రెడ్-టోన్డ్ వెడ్డింగ్ చీర ఆమె తల్లిదట దీనికి మ్యాచింగ్ బ్లౌజ్‌ను డిజైన్ చేసినట్టు అనితా వెల్లడించారు.అమ్మచీర , కొంగుపై తమిళ పద్యంతొమ్మిది గజాల, అయ్యంగార్ (మడిసర్) స్టయిల్లో తన తల్లి చీరలో కీర్తి సురేష్ స్పెషల్‌గా కనిపించింది. ఈ పెళ్లి చీర మేకింగ్ వీడియోను అనితా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కంజీవరం చీరపై తమిళ పద్యాన్ని చేతితో అందంగా పొందరుపర్చారు. అదీ స్వయంగా కీర్తి చీర అంచులు, పల్లులో స్వయంగా తన చేతితో అక్షరాలను తీర్చిదిద్దడం విశేషం.తయారీకి 405 గంటలుఇంకా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన బంగారు జరీ డైమండ్ సూది ఉన్నాయని అనితా డోంగ్రే వెల్లడించారు.అంతేకాదు దీని తయారీకి సుమారు 405 గంటలు పట్టింది. సంప్రదాయ నేత కళను, ఫ్యాషన్ సంస్కృతిని ప్రతిబింబించేలా తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు డిజైనర్లు. పెళ్లిలో ఆమె భరతనాట్య ఆభరణాలను ఎంచుకుంది. నెక్లెస్‌లు అట్టికై , హారం, మాంగ టిక్కా లేదా నెట్టి చుట్టి, ఒడ్డాణం, ఇరుచెంపలకు సూర్య , చంద్ర ఇలా సంప్రదాయ ఆభరణాలతో రాయల్ లుక్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Anita Dongre (@anitadongre)ఇక ఆంటోనీ పట్టు ధోతీ ,శాలువా తయారు చేయడానికి 150 గంటలు పట్టిందని కూడా ఆమె వివరించారు. ఇక వర్క్ విషయానికి వస్తే ‘బేబీ జాన్’తో బాలీవుడ్లో అడుగు పెడుతోంది. డిసెంబర్ 25న విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో హాజరైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌అయిన సంగతి తెలిసిందే. -
ప్రధానిపై బండారు దత్తాత్రేయ మనుమరాలి పద్యం
సాక్షి, హైదరాబాద్: హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మనుమరాలు జశోధర తనపై పఠించిన పద్యాన్ని విని ప్రధాని నరేంద్రమోదీ మంత్రముగ్ధులయ్యారు. జశోధర పద్య పఠనానికి సంబంధించిన వీడియోను బండారు దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ‘ఆమె మాటలు శక్తికి మూలం‘అని పేర్కొన్నారు. Creative and adorable. Her words are a source of great energy as well. https://t.co/9BTgtFkpH9 — Narendra Modi (@narendramodi) December 10, 2023 ఇదీ చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది? -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!
ఎందరో రచయితలు ఎన్నో పుస్తకాలు రాస్తారు. అవి పాఠకులెందరినో అలరించాయి. కొన్ని పుస్తకాలు విశేషమైన ప్రజాదరణతో పాఠకుల మనసులను రంజింప చేస్తాయి. కానీ ఈ పుస్తకం మాత్రం అరుదైన గౌరవం పొందేలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం పాఠకులను ఆకట్టుకోవచ్చు లేదా రంజింపచేయకపోవచ్చేమో! గానీ చదివే వారిని ఆలోచింపజేసి చైతన్యవంతుల్ని చేస్తుంది. ఇలాంటి ఆలోచనలతో కూడిన గీతాలు ఉంటాయా? ఇలా కూడా సమాజ సేవ చేయొచ్చా అనిపించేలా ఉంటుంది ఈ విశిష్ట పుస్తకం. ఆ పుస్తకం కథాకమామీషు గురించే ఈ కథనం!. పుస్తకం పేరు "ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వోకేషన్". ఇది ప్రపంచ శాంతి, సామరస్యం ప్రధాన ఇది వృత్తంగా ఆంగ్లభాషలో సవివరంగా రచించిన సుదీర్ఘ కావ్యం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచశాంతి కోసం రచించిన ఓ అమూల్యమైన ప్రార్థన. ఇందులో మానవచరిత్రలోనే ప్రపంచశాంతి కోసం సాగిన విస్తృత అన్వేషణ గురించి తెలియజేసే భావగీతం ఉంటుంది. పైగా ఈ విశిష్ట పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము నూరు శాతం సమాజానికే కేటాయించడం మరో విశేషం. ఈ పుస్తక రచయిత తెలంగాణకు చెందిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పుస్తకాన్ని ఈ నెల అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితికి అంకితం చేయనున్నారు. ఈ పుస్తక విక్రయం ద్వారా వచ్చే డబ్బును ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలకు వరుసగా 50%, 25%, 25% చొప్పున లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అంకితం చేశారు. ఈ పుస్తక థీమ్ ప్రపంచ శాంతి, సామరస్యం కాగా, ఇందులో 10 కావ్యభాగాలు ఉన్నాయి. ఈ విశిష్ట పుస్తకంలో ఏం ఉంటాయంటే.. పుస్తకం టైటిల్ / శీర్షిక : “ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” (An Invaluable Invocation) ఓ అమూల్యమైన ప్రార్థన కవి/రచయిత : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సాహిత్య ప్రక్రియ/ జానర్ : సుదీర్ఘ కావ్యం (Epic poem) రచన ఉద్దేశం, ఆశయం (Scope) : మానవ చరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ భావగీతం. ప్రధానాంశం / ఇతివృత్తం (Theme) : ప్రపంచ శాంతి, సామరస్యం రచన నిర్మాణక్రమం (Structure) : 10 కావ్యభాగాలు / ఆశ్వాసాలు (Cantos) 1.Prelude to Peace (శాంతి ప్రస్తావన / శాంతి పీఠిక) 2.Invocation (ప్రార్థన) 3.Humanity and Unity (మానవజాతి-ఐక్యత) 4.The Broken World (దుఃఖమయ ప్రపంచం) 5.Global Peace and Unity (ప్రపంచ శాంతి-ఐక్యత) 6.United Nations, United Efforts (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ) 7.Protecting Our Planet (భూమాత పరిరక్షణ) 8.Realization and Power (మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు) 9.The Final Verse : A Summation of Our Journey (అంతిమ పద్యకృతి--ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం) 10.Acknowledgments (కృతజ్ఞతాంజలి) ఈ పుస్తకం ఎవరికోసం అంటే.. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులు, ప్రపంచ పౌరులు, ప్రతీ ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే అద్వితీయ, అమేయ భావగీతమిది. పుస్తక రచయిత శ్రీనాథాచారి నేపథ్యం దగ్గరకు వస్తే..ఆయన ఇంగ్లిష్‌లో పీహెచ్డీ, సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కళాశాల ప్రిన్సిపల్, ఆంగ్ల విభాగాధిపతిగా సేవలందించారు. అంతేగాదు బహుళ విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డును దక్కించుకున్న విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం ఫ్రీలాన్స్‌గా వక్తిత్వ వికాస నిపుణులుగా పలు సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఇక ఆయన రచనల విషయానికి వస్తే.. ఫర్సేక్ మీ నాట్(Forsake Me Not) టైటిల్ ఓ ఆంగ్ల కవితా సపుటిని వెలువరించారు. ఇది ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో eబుక్‌గా అందుబాలో ఉంది కూడా. ఎన్నో పత్రికల్లో ఆయన కవితలు అచ్చు అయ్యాయి. ఇంగ్లీష్ జాతీయాలపై ఆయన రాసిన హ్యాండీ క్రిస్టల్స్ (Handy Crystals) పుస్తకం 2010లో లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ బుక్ విభాగంలో గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. (చదవండి: అక్షరాల... టైమ్ ట్రావెల్!) -
22న పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్పర్మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్లో ఆర్బిటల్ ఎక్స్పర్మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్‌లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్పర్మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు. -
నూరేళ్లుగా ఫలవంతం
ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్ లాండ్’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్. ఎలియట్ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరుల్లో ప్రచురితమైంది. డిసెంబరులో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్! నీకేం కావాలి?’’ ‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’ బ్రిటిష్ గాథల్లో ‘హోలీ గ్రెయిల్’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్ కింగ్. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్ ఖండాన్ని కూడా ఎలియట్ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు. అమెరికాలోని ‘బోస్టన్ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్‌లో స్థిరపడిన ఎలియట్ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్‌తో కలిసి ఇంగ్లండ్‌లోని కెంట్ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గత సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చి పోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చి పోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధాన విషయం’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి. ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్‌ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతిని స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్‌కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ‘ఇది ప్రపంచాన్ని ప్రభా వితం చేయబోయే కవిత’ అని సరిగ్గానే గుర్తించాడు. ఏప్రిల్ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్ లాండ్’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్స్పియర్, మిల్టన్, హెర్మన్ హెస్, బాదలేర్ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్. దాన్ని భావ సంగీతం అన్నాడు. సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్. అన్నీ అవాస్తవికం. లండన్ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తు న్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడు స్తున్నారు. మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్‌ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ణి చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్ లాండ్’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్ ఎరిక్ షూమేకర్ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
ఆ సినిమా కోసం చిరంజీవి 'షాయరీ'
Chiranjeevi Shayari In Krishna Vamsi Rangamarthanda: మెగాస్టార్ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. ఒక కవితాత్మకమైన ధోరణిలో చెప్పేది. ఇంతకీ చిరంజీవి షాయరీ ఎందుకు చెప్పారంటే 'రంగ మార్తాండ' చిత్రం కోసం. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక నటుడి జీవితం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ నటుడు తన జీవితంలో ఎదుర్కొనే ఘటనలు, అతని భావోద్వేగాలు ఇవన్నీ చెప్పాలంటే.. 30 ఏళ్లకుపైగా నటనానుభవం ఉన్న చిరంజీవి అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారట. ఆ నటుడి తాలుకూ భావోద్వేగాన్ని షాయరీ రూపంలో చెబితే ప్రేక్షకుల మనసులను తాకొచ్చని అనుకున్నారట. ఇప్పటివరకూ చిరంజీవి పలు చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ షాయరీ చెప్పలేదు. అందుకే కృష్ణవంశీ షాయరీ గురించి చెప్పగానే చిరంజీవి ఎగ్జయిట్ అయి, ఓకే అన్నారట. (చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ..) ఇటీవలే ఈ షాయరీని రికార్డ్ చేశారని, ఒక రోజులేనే చిరంజీవి చెప్పారని తెలిసింది. 'రంగ మార్తాండ'కు మెగాస్టార్ చెప్పిన ఈ షాయరీ కచ్చితంగా హైలెట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించనున్నారు. (చదవండి: పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్‌గా పోస్ట్..) -
‘మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్
పిల్లలు తెలివిగా, చురుకుగా ఉండడంతోపాటు సరదా పనులు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అలా సరదాగా ఓ ఐదేళ్ల అమ్మాయి తన తండ్రిపై చమత్కారంగా ఒక కవిత రాసి తన కోపంతో పాటు ప్రేమను ప్రదర్శించి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆ చిన్నారి తన ప్రాస నైపుణ్యాలను ఆ కవితలో అద్భుతంగా ప్రదర్శించింది. తాజాగా ఈ కవిత ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఆ చిన్నారి తన తండ్రి లైఫ్ స్టైల్‌ని కాస్త ఫన్నీగా వివరించింది. ఆ కవితలో చమత్కారంతో పాటు ప్రాస కూడా కుదిరేలా జాగ్రత్త పడింది. తను రాసిన ఆ కవితను ఆమె తల్లి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. ఇది షేర్ చేయకుండా ఉంటేనే బాగుండేదంటూ క్యాప్షన్ పెట్టింది. దీన్ని చదివిన నెటిజన్లు ఆ ఐదేళ్ల చిన్నారి పదాలు తప్పు లేకుండా అంత కరెక్టుగా ఎలా రాసిందని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతూ దూసుకుపోతోంది. చదవండి: మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే? -
అమ్మా! అన్నం పెట్టమ్మా...
‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగుని నోరున్...’’అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఇటువంటి రచనలు చేసేటప్పుడు మన పూర్వకవులు అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది మనం మరిచిపోకూడదో, నాలుగు కాలాలపాటు గుర్తుంచుకుని జీవితానికి అన్వయం చేసుకోవాలో అటువంటి వాటిని ఛందోబద్ధం చేసి పద్యాలు, శ్లోకాలుగా అందించారు. అంటే వాటిని ఒకసారి చదివితే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. భవిష్యత్తులో కష్టాలు ఎదురయినప్పుడు లేదా సందర్భవశాత్తూ గుర్తుకు రావడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. సుమతీ శతకంలోని పద్యాలు కూడా శ్రద్ధపెట్టి చదివితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులు చదువుకునే వయసులో ఏది చదివినా కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలి. అలాగే లోకంలో అమ్మంటే అమ్మే. అమ్మ అన్నం పెట్టేటప్పుడు కడుపు నిండడం కోసం మాత్రమే పెట్టదు. ఆర్తితో, సంతోషంతో పెడుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఆరోగ్యంగా బతకాలని పెడుతుంది. వాళ్లు సరిగా తినకపోతే, తన వంటలో లోపం ఉందేమోనని బాధపడుతుంది తప్ప మరోలా ఆలోచించదు. తనకోసం అన్నం వండుకోదు, మనకోసం వండుతుంది. అందరికీ పెట్టి చివరగా తను తింటుంది. తనకు సరిపడా మిగలకపోతే ఆకలిని ఓర్చుకుంటుంది తప్ప నాకు మిగల్చకుండా అంతా వాళ్ళే తినేసారని బాధపడదు. ‘మాతా సమున్నాస్తి శరీరపోషణమ్’– అమ్మ పోషించినట్టుగా ఈ శరీరాన్ని పోషించగలిగిన వారుండరు ఈ లోకంలో. అమ్మ భగవంతునితో సమానం... అంటే తప్పు. భగవంతుడే అమ్మ అయినది, పరదేవతే అమ్మగా ఉన్నది. మాతృదేవోభవ..ఆ పరదేవతే అమ్మ రూపంలో తిరుగుతోంది. నమశ్శంకరాయచ, మయస్క రాయచ, నమశ్శివాయచ, శివతరాయచ.. అంటుంది వేదం. శంకరుడు అంటే ఎక్కడో ఉండడు. తండ్రి రూపంలో ఉంటాడు. అలాగే అమ్మ కూడా పరదేవతయై బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటుంది. తన కడుపు మాడ్చుకుని కూడా పిల్లల వృద్ధికోసం త్యాగం చేయగలిగిన జీవి ఈ లోకంలో అమ్మ ఒక్కతే. తండ్రి ఎంతటి ఐశ్వర్యవంతుడయినా, బిడ్డపుట్టగానే ఆకలేసి ఏడిస్తే ఏమీ చేయలేని నిస్సహాయత. కానీ నెత్తుటిని పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే. అందుకే జీవితంలో గొప్ప అదృష్టం–అమ్మను పొంది ఉండడంగా భావిస్తారు. అపార కీర్తిప్రతిష్టలు ఆర్జించిన మహామహుల జీవితాలు పరిశీలిస్తే...అమ్మ వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తొలినాళ్ళల్లో పడిన కష్టాలు తెలుస్తాయి. మా అమ్మ పచ్చడి తాను తిని ఇడ్లీలు నాకు పెట్టి...రెక్కలు ముక్కలు చేసుకునేది..అని ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్నారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి అమ్మ సూర్యకాంతమ్మ గారు బిడ్డ ప్రసవానికి ముందు వరకు ఎవరు వారించినా వినకుండా కడుపులో ఉన్న తన బిడ్డకు సంగీతం నేర్పే అవకాశం తరువాత తనకు వస్తుందో రాదోనని వీణ వాయించారట. ప్రసవానంతరం పదోరోజు ఆమె కన్ను మూసారు. ‘‘నన్ను కనడం కోసమే వచ్చింది ఒక అమ్మ, నన్ను పెంచడం కోసమే వచ్చింది మా పెద్దమ్మ. ఇద్దరు అమ్మల చేతిలో పెరిగి పెద్దవాణ్ణయి ఇవ్వాళ ఈ స్థితిలో ఉన్నాను..’’ అని ఆయన గుర్తు చేసుకునేవారు. అటువంటి అమృతమూర్తి అయిన అమ్మను నోరారా ‘అమ్మా!’ అని పిలిచి ‘అన్నం పెట్టు’ అని అడగకపోతే ఎలా? -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రైతు బంద్
గోధుమ ధుమధుమ లాడుతూ– కేంద్ర దుశ్శాసన పర్వాలు ధూళిలో కలవాలని శపిస్తుంది. వరి గొలుసులు తెంపుకున్న వడ్లు ఒడ్లు– వరాలు తెంచుకుని– ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు దిక్కులే మాకు షెడ్లు అంటున్నాయ్ పత్తి– పాలకుల ప్రవృత్తి చూళ్లేక శ్వేత రక్తం వాంతి చేసుకుంటుంది కంది– చలికి దగ్గుతూ కళ్లెలు– కళ్లెలుగా ఖాండ్రించి ఉమ్ముతుంది. మిరప– మిరియం కలిసి కారాలు నూరుతున్నై బియ్యం– పప్పు, ఉప్పు వంటి వంటింటి దినుసులు రోడ్లమీద కడుపు మండి కుత కుత ఉడికిపోతున్నై అధికార భవన భోజన పదార్థాలు పాలకుల పులినోట్లోకి వెళ్ళడం జన్మ జన్మల పాపంగా విలపిస్తున్నై పవర్లో ఉన్న నేతల్ని చుట్టుకొనివున్న సూట్లు కుర్తాలు ధోతులూ పంచెలు చీరలు అనకొండల్ని చుట్టుకున్నట్టు అనునిమిషం చిరచిరలాడుతూ ఛీత్కరించుకుంటున్నాయి ఏడు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత ఉగ్రత కొని తెచ్చుకోలేక తన్నుతాను అసహ్యించుకుంటుంది కురుస్తున్న మంచు నేను నేలకు రాలిపోయేవేళ ఎందుకొచ్చారు బిడ్డలారా అంటూ పశ్చాత్తాపంతో కరిగి కన్నీటి చిమ్మై తప్పు మన్నించమని రైతుల పాదాల్ని ముద్దుపెడుతుంది రోడ్లమీద కొచ్చిన రైతులకోసం ప్రాణంలేని ట్రాక్టర్లు ఇళ్ళుగా మారి రైతుల్ని కడుపులో దాచుకుంటున్నై ఏలెటోని మీద నేల ఎత్తి ఏడు దోసిళ్ళ మన్నుపోస్తుంది ఎగ్గు సిగ్గులేని ఏలికలు పట్టపగ్గాల్లేని పాలకులు చర్చలమీద చర్చలకు రమ్మంటూ ‘రమ్మి’ ఆట ఆడుకుంటున్నారు మీరు పెట్టే బిచ్చపుకూడు తినమని రైతులు తమ చద్దులు తామే తింటున్నా కూడా లజ్జా– మానం– శరం లేని అధికారం రైతులు కోరిన కార్పొ‘రేట్’ చట్టాలు రద్దుచేయడం లేదు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకం కదా గుద్దే నైజం – అందుకే ఢిల్లీలో రైతుల అడుగుల ధ్వని లండన్‌లో రాస్తారోకో చేస్తుంది ఈ రోజు దేశం ఆకాశపు టంచుల్లో నిలుచున్న ధిక్కార పతాక సన్నివేశం వ్యాసకర్త డాక్టర్ సుద్దాల అశోక్ తేజ కవి, సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత -
గడ్డి అంచున
చాన్నాళ్లయింది నిన్ను చూసి నువ్వలా ఎదురుచూస్తూనే వున్నావా గాలి వీచినప్పుడల్లా నవ్వుతూనే వున్నావా నీ సమాధి మీద మొలిచిన మొక్కకు కాసిన పూల కళ్లలో నుంచి కలలు కనే నేలనిద్రలో నుంచి లేతాకు పచ్చలో నుంచి ∙∙ నాటుకున్నాను కదా పగిలిన నా ప్రాణవిత్తువి తలకిందులుగా తలపులు కలుస్తాయిగా మట్టితీగల ఆత్మల్లో నీ చింతనా చితాభస్మం రాసుకొని సాగుతానిక సమాధి ముందర తడిచిన గడ్డి అంచున నిలిచిన లోకాన - పి.శ్రీనివాస్ గౌడ్ -
తప్పిపోయిన కాలం
బాల్యం ఔతలి ఒడ్డున ఒకరినుంచి ఒకరం తప్పిపొయ్యి మళ్ళ యిక్కడ ఈ బిగ్ బాజారుల కలుసుకున్నం వాషింగు మిషనులు ఫ్రిజ్జులు ఎల్ఈడీ టీవీలపై పడి దొరులుతున్న చూపుల నడుమ ఇద్దరం రోబోలుగ ఎదురుపడ్డం కొంచెం సేపటికి ఎప్పటినుంచో వెతుకుతున్న వస్తువు కంటిముందర ప్రత్యక్షమైన మాదిరిగ ఒకింత ఆశ్చర్యంగనే ఒకరికొకరం దొరికి పోయినం వస్తుజాలంల చిక్కుకున్న మమ్ములని అమాంతం పొంగిన సుద్దవాగు ముంచేసింది సీసీ కెమెరాలు చూస్తున్నయని మరిచి వాగునీళ్ళల్ల ఏసంగిల పారిచ్చిన దోసకాయలు ఇరుగ తిన్నం కాళ్ళకింద చలువరాయి ఉన్నా గుంచీలు తవ్వి గోటీలు, గిల్లి దండలాడినం దిగుడు కాదు కదా పట్నంల మట్టే కరువన్నది మరిచి సలాక ఆడుకుంటు కుంటినం గుట్టలమీద కంపల్ల పడి ఆడినా ఏడ యింత దెబ్బ తగులలె గని ఇంత నొప్పైతె ఎప్పుడు లేదు రాంరాయని వాగు ఖిల్లగుట్ట బత్తీస్ గడి కజాన్ చెరూ బంగల్ చెరూ బొమ్మల కార్ఖాన చిన్న తిరిగితిమా ఇంత తిరిగినా కాళ్ళనొప్పులు లేవు కండ్ల నీళ్ళు తప్ప - మడిపల్లి రాజ్‌కుమార్ -
త్రిపద
రెప్పలు మూస్తే నువ్వు తెరిస్తే ఈ లోకం: రెప్పపాటే దూరం! పువ్వుకు ఫ్రేమ్ కట్టగలిగింది అద్దం, పరిమళానికి కాదు! ముక్కలైనా మోదమే: చూపించింది కదా అద్దం నీ వేయి సొగసులు! నిమురుతున్న కొద్దీ ఉబుకుతోంది గాయం: జ్ఞాపకం నెమలీక! పక్షి ఎగిరిపోయింది కొన్ని పూలు రాలాయి అశ్రువుల్లా! జ్ఞాపకం నీడలో నేను నా నీడలో జ్ఞాపకం కలిసే నడుస్తున్నాం చితికిపోతూ తనను తాను జారవిడుచుకుంటూ పాదరస బిందువు మనసు! లోకాన్ని అదృశ్యం చేసే దీపాలుంటాయని తెలిసింది నీ కనులు చూశాకే! ఎక్కడ వాలాలన్నా పలుమార్లు ఆలోచిస్తుంది ఎదలో ఎన్ని గాయాలో తూనీగకు! జననం వాగ్దానం చేసింది దేహానికి ఒక మరణాన్ని మనసుకు నిత్య మరణాన్ని! -పెన్నా శివరామకృష్ణ -
ఈ దేహం ఎవరిది?
‘నిబద్ధురాలైన స్త్రీవాద కవయిత్రి’ అనిపించుకున్న మందరపు హైమవతి తొలి కవితా సంపుటి ‘సూర్యుడు తప్పిపోయాడు’. రెండవ సంపుటి ‘నిషిద్ధాక్షరి’ 2004లో వచ్చిన తర్వాత, ఆమధ్య మూడవ సంపుటి ‘నీలి గోరింట’ వెలువరించారు. అందులోంచి ఒక కవిత: కొత్త చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి అందమైన ఈ దేహశిల్పం నాదే కదా అని ఆనందిస్తా నలుగు పెట్టుకొని తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకొంటూ హాయి ఉయ్యాలలో ఆదమరిచి ఊగుతూ ఈ తనువు తారక నాదేనని గర్విస్తా జ్వర సూర్యుడు శరీరాకాశంపై ప్రజ్వలిస్తుంటే బాధాకారణం ఈ దేహమేనని చింతిస్తా ప్రేమ ప్రతిపాదన సుమ గుచ్ఛంతోనో పెళ్లి కామన పూలమాలతోనో నా ఎదుట నిలిచిన నిన్ను నిర్ద్వంద్వంగా తిరస్కరించినపుడు నిర్దాక్షిణ్యంగా నాపై దాడి చేసి ఆమ్ల వర్షం కురిపించినపుడు నా దేహ దేశ సార్వభౌమాధికార హక్కు నాకు భ్రమగానే మిగిలినపుడు శత్రు రాజ్యాలను జయించినప్పటికన్నా వారి స్త్రీల శరీర రాజ్యాలను జయించిన సందర్భంలోనే నీ అహంకారం తృప్తి పడినపుడు ఎదురుపడిన వ్యక్తిని వైదొలగమన్న శంకరాచార్యునితో దేహాన్నా ఆత్మనా అని సందేహ బాణం సంధించినట్లు సర్వావయవాల ఈ దేహం సకలానుభూతులు ఈ శరీరం నాది కాదా అని / తీరని సందేహం నిజంగా / ఈ దేహం ఎవరిది -మందరపు హైమవతి -
లాక్డౌన్ కవిత : గూళ్ళకు చేరాలి
కొడవలి చేతిలో చంద్రవంకై మెరిసినందుకే కల్లం నిండుగా కండ్లచలువైంది తట్ట సుట్టబట్ట మీద సూర్యదీపమై వెలిగినందుకే భవంతులు బహుళ అంతస్తులై తలెత్తుకుంది దేహం దిమ్మిసలా దుమ్ముకొట్టుకుపోయి ఇనుపపాదాల కింద దొర్లినందుకే రహదారులన్నీ నల్లతివాచీలై పరుచుకున్నది వెన్నుపూసలు మూలవాసాలై నిలబెడితేనే పట్నం తొవ్వలు ఫ్లైవోవర్లై పైకిలేచింది కాలికి బలపాలు కట్టుకున్న కన్నీటిబొట్లు నలుదిక్కులా నల్లచీమల్లా పాకితేనే నాలుగు మెతుకులు కంచంలో రాలింది అప్పుడెపుడో ఆకలి విస్ఫోటనం జరిగి తలోవైపు విసిరేయబడ్డ వలస పక్షులు మళ్ళీ తమ గూళ్ళకు మళ్ళుతున్నాయి ముసుగేసుకున్న మృత్యువును తప్పుకుంటూ తల్లిచెట్టుమీద వాలేదెన్నో పొలిమేర చేరక మునుపే రాలేదెన్నో -కొండి మల్లారెడ్డి -
లాక్డౌన్ కవిత : నా రెక్కలు జాగ్రత్త
నా రెక్కల్ని నగరానికి తగిలించి ఇంటికి వెళ్తున్నా కాస్త కనిపెట్టుకోండి అష్టకష్టాల కష్టనష్టాల రెక్కలివి మీ కస్టడీలో వుంచి పోతున్నా కాస్త భద్రంగా చూసుకోండి నగరం దీపాలు పొలమారినప్పుడు నా రెక్కలు మినుకు మినుకుమని మూలుగుతాయి అంతస్తుకో ఆకాశం... ఆకాశానికో కన్నుతో ఈ భవంతులు నన్ను కలవరిస్తే నా రెక్కలు పలకరింపుగా సిమెంటు చిలకరిస్తాయి నగరం నడిరోడ్డు పేగు కనలి కేక వేస్తే నా రెక్కలు నులిపెట్టే బాధతో తారు కక్కుకుంటాయి నా రోజువారీ ప్రసవ గీతం ఈ నగరం అది బెంగటిల్లితే నా రెక్కలు బిక్కుబిక్కున వణికిపోతాయి నా రెక్కల్ని మీ చేతుల్లో పెట్టి పోతున్నా జాగ్రత్త సుమా మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తానో తెలీదు అసలు వస్తానో రానో కూడా తెలీదు తాళం వేసిన నగరం ముందు కొత్త ఉద్యోగాల దరఖాస్తులు పట్టుకుని అనేకానేక ఆత్మల అస్థి పంజరాలు క్యూలు కట్టిన చోట నా రెక్కలు టపటపా కొట్టుకుంటాయి భద్రం మరి ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాను ఇంటి కాడ అమ్మా నాయినా ఇంకా బతికే వున్నారన్న భరోసాతో పోతున్నా మళ్ళీ ఈ నగరాన్ని నా రెక్కలతో దుమ్ము దులిపి శుభ్రం చేసి పట్టాలెక్కించడానికి తప్పకుండా వస్తా ఈ మెట్రో రైళ్ళు, ఈ రెస్టారెంట్లు, ఈ సినిమా హాళ్లు నా దేహ శ్వాస కోసం అలమటిస్తే నేను వస్తానని నమ్మకం పలకండి నా రెక్కల్ని మీ చేతుల్లో పెట్టి సెలవు తీసుకుంటున్నా మీదే పూచీ మరి - ప్రసాదమూర్తి -
లాక్డౌన్ కవిత.. చావు చిత్తడి
గాలి కొసల మీదుగా ప్రాణాలు ఎగిరిపోతున్నవి అసహజమైన జీవనం నుండి సహజ సిద్ధమైన చావు నవ్వుతున్నది ఏ నాగరికత చూపులకు ఇక్కడి జీవనంలో తేనెలంటుకున్నవి ఇప్పుడు నేలంతా చావు చిత్తడి – చెరువుల మీద విల్లాలు వెక్కిరిస్తున్నవి గుట్టలు ముక్కలై మన అడుగులను మోస్తున్నవి అడవి మన చూపుకు వణికి మైదానమై మోకరిల్లింది జంతువులు, పక్షులు మన వంట గిన్నెల్లో దిగులుగా కూర్చున్నవి పర్యావరణం మనకు పగటి వేషం – మనను హెచ్చరిస్తూ సైరన్ మోగుతుంది ఒక్కో కాలంలో ఒక్కో పేరుతో చావు శబ్దం చెవికి సోకినప్పుడు మంచి చెడుల లెక్క తవ్వుతం ప్రసూతి వైరాగ్యంతో చేతులెత్తుతం సమీపిస్తున్న మృత్యు ఘడియలను కన్నీటి మీదుగా దాటుతుంటం – మన ఆకలికి భూమి బెదురుతున్నది శ్మశానం విస్తరిస్తున్నది కాలం కసిగా కాటేస్తున్నది పువ్వులు జాలిగా రాలుతున్నవి. -ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ -
రండి.. దీపాలు వెలిగిద్దాం
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి రచించిన ‘రండి.. దీపాలు వెలిగిద్దాం’ అనే ప్రఖ్యాత కవిత వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వాజ్‌పేయి కవితను మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో క్లిప్‌లో ఓ వేదికపై వాజ్‌పేయి తన కవితను చదువుతూ కనిపించారు. వైద్య పరికరాల కొరత లేకుండా చూడాలి కరోనా వైరస్ బాధితులకు, వారికి వైద్య సేవలందించే డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి, సాధారణ ప్రజలకు సరిపడా నిత్యావసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మాస్కులు, గ్లౌజ్‌లు, వెంటిలేటర్ల కొరత లేకుండా చూడాలన్నారు. కరోనా నియంత్రణ చర్యల సన్నద్ధత కోసం ఏర్పాటు చేసిన 11 సాధికార బృందాలతో, సంబంధిత అధికారులతో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యాలపై ఆరా తీశారు. కరోనా టెస్టింగ్, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందాం ఫోన్లో ట్రంప్–మోదీ సంభాషణ ప్రాణాంతక కరోనా మహమ్మారిని తుద ముట్టించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినబూనారు. వారిద్దరూ శనివారం ఫోన్ ద్వారా పరస్పరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. కరోనా వ్యాప్తి విషయంలో తాజా పరిణామాలపై చర్చించుకున్నారు. కరోనా కట్టడి విషయంలో భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. కరోనా నివారణ చర్యలపై తమ మధ్య విస్తృతమైన చర్చ జరిగిందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. -
కవితను చదివి వినిపించిన నిర్మల
-
‘హమ్ దేఖేంగే’ను ఆలాపించడంపై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పాకిస్థానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దెఖేంగే’ కవితను ఐఐటీ కాన్పూర్‌లో ఆలాపించడం వివాదంగా మారింది. ఫైజ్ కవిత హిందూ వ్యతిరేకమైనదని, దీనిని పాడటం దేశద్రోహం అంటూ ఈ కవితను పాడిన విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు వివాదంపై ప్రఖ్యాత బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ స్పందించారు. ఫైజ్ కవితను హిందూ వ్యతిరేకమైనదని పేర్కొనడం అసంబద్ధం, హాస్యపూరితమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి వివాదాన్ని అసలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అప్పటి పాకిస్థానీ పాలకుడు జియా ఉల్ హక్ ఛాందసవాద, మతతత్వ, ప్రగతినిరోధక పాలనకు వ్యతిరేకంగా ఫైజ్ ఈ కవిత రాశారని తెలిపారు. అవిభాజ్య భారతం నుంచి వచ్చిన ప్రగతిశీల రచయితల్లో ఫైజ్ ప్రముఖుడని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం గురించి కవితలు రాసిన ఫైజ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న దేశ విభజన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు రాశారని, దేశ విభజనను వ్యతిరేకించిన కవిని ఇప్పుడు దేశద్రోహి అని అభివర్ణించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫైజ్ తన జీవితంలో సగభాగం పాక్ వెలుపలే గడిపాడని, అప్పట్లో పాక్ ద్రోహి అని కూడా అతనికి ముద్ర వేశారని గుర్తు చేశారు. -
నిర్నిద్రం
చీకటనీ వెలుతురనీ రెండుంటాయంటాం కానీ ఉండేది చీకటే వెలుతురు వచ్చి వెళుతుంది శబ్దాన్నీ నిశ్శబ్దాన్నీ వేరు పరుస్తాం కానీ ఉండేది నిశ్శబ్దమే దాన్ని భగ్నం చేస్తే శబ్దం పుడుతుంది నిద్దురనీ మెలకువనీ రెండు స్థితులు చెబుతాం కానీ ఉండేది నిద్దురే ముందు నిద్ర వెనుక నిద్ర చిరంతన నిద్ర ఆద్యంతాలు లేని నిద్రలో జీవితం ఒక ఉలికిపాటు -కొప్పర్తి (యాభై ఏళ్ల వాన’ సంపుటిలోంచి; ప్రచురణ: 2014; ప్రచురించిన కవిత 2006లో రాసింది.) -
‘రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతా’
నాటింగ్‌హామ్: గాయం కారణంగా రాబోయే ప్రపంచకప్ మ్యాచ్‌లకు దూరమైన శిఖర్ ధావన్ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు. గాయం తనను దెబ్బ తీయలేదనే ఉద్దేశం అతని మాటల్లో కనిపించింది. ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ‘కభీ మహక్ కీ తరహ్ హమ్ గులోన్సే ఉడ్తే హై.. కభీ ధుయే కీ తరహ్ పర్బతోన్సే ఉడ్తే హై..యే కైంచియా హమే ఉడ్నే సే ఖాఖ్ రోకేంగీ.. కే హమ్ పరోన్సే నహీ హౌస్లోసే ఉడ్తే హై’ (పూలల్లో ఉండే సువాసనలా ఒకసారి, పర్వతాల మీదుగా వెళ్లే పొగ మంచులా మరోసారి ఎగురుకుంటూ వెళ్లిపోతాను. నేను ఎగరకుండా ఈ కత్తెరలు ఏం ఆపగలవు. నేను ఎగిరేది రెక్కలతో కాదు, సంకల్పంతో) అని ధావన్ తన భావాన్ని పంచుకున్నాడు. తన కవితతో ధావన్ స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయగా... స్వయంగా రాహత్ ఇందోరి వెంటనే మరో కవితతో స్పందించడం విశేషం. ‘సెలయేటికి తన అస్తిత్వంపై చాలా గర్వం ఉంది. దాహంతో ఉన్న నాతో పెట్టుకుంటే తన సంగతేమౌతుందో తెలియదా’ (బహుత్ గురూర్ హై దరియాకో అప్నే హోనేపర్. జో మేరీ ప్యాస్ సే ఉల్ఝేతో ధజ్జియా ఉడ్జాయే, జిందాబాద్) అంటూ మరింతగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. -
ఓ ట్విట్టర్ పక్షీ.. నీ ఇల్లెక్కడ?
అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. సినిమా షూటింగ్ అప్డేట్స్, ఫ్లాష్‌బ్యాక్ ఫొటోలు, ఫ్యామిలీ ఈవెంట్స్ విషయాలతో సహా అన్ని విషయాల్నీ అభిమానులతో షేర్ చేసుకుంటూ ట్విట్టర్లో చాలా చురుకుగా ఉంటారు. ఇటీవల ట్విట్టర్లో ఒకేరోజులో సుమారు 2 లక్షల మంది ఫాలోయర్స్ సంఖ్య తగ్గిపోవటంతో అప్సెట్ అయిన అమితాబ్ ట్విట్టర్‌ను వదిలేస్తున్నాను అని చమత్కరించారు. అక్కడితో ఆగకుండా ఏకంగా ట్విట్టర్‌ను ఉద్దేశిస్తూ ఓ కవిత కుడా రాసేశారు. ఆ కవిత ముందు ట్విట్టర్‌ని ఉద్దేశిస్తూ ఓ విన్నపం కూడా వదిలారు. ‘‘అరే తమ్ముడూ లేదా అక్కయ్యా.. నువ్వే జెండరో తెలియదు అందుకే రెండిటితో సంభోదిస్తున్నాను. నేనేదో రాద్దాం అనుకుంటాను, నువ్వు దానికి రాద్ధాంతం చేస్తావు. నా 2లక్షల మంది ఫాలోయర్స్‌ను లాగేసుకున్నావు. ఇప్పుడు నా అకౌంట్‌ను కూడా లాగేసుకోవద్దు. నా పట్ల క్రూరంగా ఉండొద్దు’’ అని పేర్కొన్నారు. ఈ విన్నపం తర్వాతి ట్వీట్లో కవితను పోస్ట్ చేశారు బిగ్ బీ. ఆయన రాసిన ‘ట్విట్టర్ కవిత’ సారాంశం ఏంటంటే... ‘‘పక్షీ... ఓ పక్షీ ఎక్కడుంది నీ ఇల్లు? తుర్రు తుర్రుమంటూ ఇక్కడికి ఎగిరి వస్తున్నావు. నిన్ను చూడాలనుకునే వారు ఇంతమంది... నీకెందుకు భయం? ఒకవేళ అలిగితే చెప్పు మాకు... మేం తిరిగిపోతాం కాసేపటువైపు సదా నీ ఆశీస్సులెప్పుడూ ఉండాలి మాపైనే నిత్యనూతనమైన మా పువ్వులనెప్పుడూ (మాటలు) కురిపిస్తాం నీపైనే ’’. అంటూ సరదాగా సాగే ఈ పద్యాన్ని అభిమానులతో పంచుకున్నారు బిగ్ బీ. -
ముక్కలైన నా హృదయం -రేణూ
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ గొప్ప కవయిత్రి కూడా అని మరోసారి నిరూపించుకున్నారు. మల్టీ టాలెంటెడ్ రేణూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇటీవలి కాలంలో తన అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ఆంగ్లంలో రాసిన కవితలను ట్విటర్లో పోస్ట్ చేయడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీన్ని అభిమానుల కోసం ట్విటర్లో షేర్ చేశారు. జ్ఞాపకాల సమాధులను తవ్వితీస్తూ..ముక్కలైన హృదయాన్ని విషాద సాహిత్యంగా అవిష్కరించిన వైనం అద్భుతంగా నిలిచింది. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయానడం ఆమె ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టింది. ముక్కలైన హృదయం, రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు మాత్రమే మిగిలాయంటూ తన జ్ఞాపకాలతో బాధాతప్త హృదయాన్ని ప్రస్తావించారు. కమ్ముకున్న మంచు కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. మనసు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలని మళ్ళీ తట్టి లేపుతుంది. తిరిగి చూసుకుంటే..తుప్పు పట్టిన కలం, తుడిచిపెట్టుకుపోయిన పేరు. విధి ఎంత బలీయమైనది . ముక్కలైన హృదయం విషాద సాహత్యంగా అంటూ తన కవితను ముగించారు. ఎంతో బాధతో, ఆవేదనతో కూడిన ఈ కవిత అభిమానులను ఆలోచింపచేస్తోంది. కాగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఫీనిక్స్ పక్షిలా తిరిగి జీవితాన్నిసాగిస్తున్న రేణూ దేశాయ్ ప్రస్తుతం ఒక టీవీ షోకు జడ్జిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రేణూ దేశాయ్ ఆంగ్ల కవిత: Went digging in the graveyard of my memories Had buried my metaphors with his words, some letters too and a pen with his name inscribed Spring, forced the cherry trees to blossom The ice melted, leaving the grave bare Scavengers of destiny dug open the buried moments and metaphors Found the remains of the pen,rusted parts,name faded Pieces of my heart, in the torn letters Jagged edges of buried reminiscences And the metaphors had ironically become literal tragedies Uploaded a new poem on YouTube. Do share with your friends too 🌸https://t.co/0duBjs3taU — renu (@renuudesai) February 22, 2018 -
కమల్ హాసన్ సంచలన ట్వీట్
చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్ హాసన్ తాజా ట్వీట్ సంచలనంగా మారింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు రాజకీయాల ఆసక్తిని సూచన ప్రాయంగా తెలియజేస్తుండగా.. తాజా గా ఆయన ట్విట్టర్లో షేర్ చేసిన కవిత ఈ విషయాన్ని మరింత ధృవీకరిస్తోంది. తమిళంలో ఈ 11 లైన్ల ఓ పవర్ ఫుల్ కవితను కమల్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘ఇపుడు ఎవ్వరూ రాజుకాదు , విమర్శిద్దాం.. హృదయపూర్వకముగా ఉద్భవిద్దాం..మనం వాళ్లలాగా రాజులు కాము. ఓడిపోయినా..మరణించినా.. నేను తీవ్రవాదినే. నేను నిర్ణయించుకుంటే నేనే 'ముదుల్వార్' (నాయకుడు)ని..నేను బానిసను కాదు..లొంగి ఉండటానికి..కిరీటాన్ని వదిలినంతమాత్రాన ఓడిపోయినట్టు కాదు..శోధించకపోతే మార్గాలు కనిపించవు. కామ్రేడ్, నాతో పాటు రండి...అసంబద్ధతను బద్దలు గొట్టేవాడే నాయకుడిగా ఉంటారు. " ఇలా తమిళంలో ఆయన కవిత్వం సాగింది. ఇదే ఇపుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. గతవారం కమల్ బిగ్ బాస్ షో పై విలేకరుల సమావేశం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ శాఖలు అవినీతిమయంగా మారాయని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు న్యాయ శాఖమంత్రి షణ్ముగం వ్యాఖ్యలు, ఆర్థికమంత్రి డి.జయకుమార్ దమ్ముంటే రాజకీయాల్లో చేరాలని చేసిన సవాల్‌ను కమల్ సీరియస్‌గా తీసుకున్నారా? అనే చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి అభిప్రాయాలను వినిపించవచ్చన్న పన్నీర్ సెల్వం వ్యాఖ్యల ద్వారా అటు డీఎంకేనుంచి ఈ స్టార్ హీరో కు మద్దతు లభించడం విశేషం. కాగా ఇటీవలి కాలంలో కమల్ వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారనే అనుమానం రాక మానదు. ముఖ్యంతా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. புரியாதோர்க்கு ஆங்கில பத்திரிக்கைகளில் நாளை வரும் சேதி pic.twitter.com/yoFMD8jeJO — Kamal Haasan (@ikamalhaasan) July 18, 2017 -
పద్యం మరి దేనికి!
► 2016 కవిత సంపాదకీయం సరిహద్దుల్లో జనం గద్యం మాట్లాడతారు మురికివాడల్లో, ఫ్యాక్టరీల్లో గద్యం మాట్లాడతారు పగటివేళ నగరం గద్యం మాట్లాడుతుంది వర్తమాన క్లేశాలన్నీ గద్యం మాట్లాడతాయి ఎండిపోయిన పొలమూ, మాడిపోయిన మనిషీ గద్యం మాట్లాడతారు కత్తుల నాగరికత సమస్తం గద్యం మాట్లాడుతుంది మరి పద్యం దేనికి? – సునీల్ గంగోపాధ్యాయ బెంగాలీ కవి (1934–2012) సాహితీమిత్రులు ప్రచురణ ‘కవిత 2016’కి ఒక సంపాదకుడిగా నాకు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారు అప్పగించిన బాధ్యతని సంతోషంతో స్వీకరించాను. మొదటి నుంచీ ఇటువంటి పనులంటే మక్కువకొద్దీ, కవి మిత్రులు ఒమ్మి రమేష్‌బాబు, తల్లావఝల శశిశేఖర్లతో కలిసి ‘కంజిర’(1990–96) కవిత్వ పత్రికను తీసుకువచ్చాను. అటు పిమ్మట ఒక దినపత్రికలో ఉపసంపాదకుడిగా సాహిత్యానుబంధం కోసం విధులను నిర్వర్తించాను. ప్రస్తుతం కవిత్వ ప్రచురణకే నిబద్ధమైన ‘ప్రేమలేఖ’లో భాగస్వామినయ్యాను. ఈ అభ్యాసంతోనే అసంఖ్యాక కవితల నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసేందుకు పూనుకున్నాను. సమకాలీన కవులు ఏ అనుభూతులను నవనవంగా వ్యక్తీకరిస్తున్నారు? నా తోటి కవులు ఏయే అనుభవాలను దృశ్యమానం చేస్తున్నారు? వర్ధమాన కవులు ఎంతటి అన్వేషణలోంచి ఆగమగీతాలను ఆలపిస్తున్నారు? అనే ఉత్సుకతతో, ప్రతి కవితలో ఒకటికి మూడుమార్లు వెదికాను. కవిత్వం పట్ల విధేయతతో సంవత్సరకాలపు పంటని తూర్పారబట్టాను. ఇదే విధంగా కవి మిత్రుడు జూకంటి జగన్నాథం గారు మరొక సంపాదకుడిగా ఎంపికలో పాలుపంచుకొన్నారు. ఇరువురి సమన్వయంతోనూ మేలిమి కవిత్వం స్వల్పంగానే దక్కింది. వర్తమాన తెలుగు కవిత్వం మునుపటి ధోరణులకి శక్తిహీనమైన కొనసాగింపుగా మనగలుగుతుంది. కవులలో ఎవరి నామమాత్రపు పాయ వారిది. ఒక్కరే అందరి తరఫున నినదిస్తుంటే, అక్కడక్కడ మరికొందరు ఒంటరి ద్వీపాల మాదిరి తమలో తాము మాట్లాడుకొంటున్నారు. ఈనాటికీ ఎక్కువగా సామాజిక స్పృహవాదంతో కూడిన కవిత్వ రచనకే మొగ్గు చూపుతున్నారు. ఎప్పటికప్పుడు ఒక వివాద విషయమే కవిత్వ వస్తువుగా అందుకొనేందుకు ప్రాధాన్యత నిస్తున్నారు. పలువురు మేటి కవులమల్లే గొప్ప సహజత్వంతో రాస్తున్నారు. భావుకతలో నూతనత్వం సాధిస్తున్నారు. పరిభాషని వాడుక మాటల్లోకి సడలిస్తున్నారు. అభివ్యక్తిలో భిన్నత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తమ్మీద కవిత్వాన్ని స్వేచ్ఛాయుతం, సులభతరం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అనుభూతి గాఢత, ఆర్ద్రత, క్లుప్తతలు నిండిన గాంభీర్యంతో రాస్తున్న వారున్నారు. అలానే వస్తువ్యామోహంలో పడిన కొందరు కవిత్వ సృష్టికి ఆవశ్యకమైన మూలధాతువులని విస్మరిస్తున్నారు. యువ కవులను కొన్ని పత్రికల్లో వస్తున్న అకవిత్వం తప్పుదారి పట్టిస్తుంది. అదే కవిత్వమన్న భ్రమని కలిగిస్తుంది. దానితో అలవోక రచనకి వారు సంసిద్ధమవుతున్నారు. పత్రికల్లో ప్రకటించుకోవాలని ఉబలాటపడుతున్నారు. అక్కడితో తమ సామాజిక బాధ్యత నెరవేరిందనుకొంటున్నారు. ఈ ధోరణి మన కవిత్వంలో లోతుగా పాదుకొనిపోయింది. దేశదేశాల అద్భుతమైన కవిత్వం పత్రికలకి వెలుపల గ్రంథాలయాల్లోనూ, అంతర్జాలంలోనూ అందుబాటులో ఉన్నదని నేను చెప్పనక్కరలేదనుకొంటాను. పాఠకులు తీరని దాహార్తితోనే కవిత్వాన్ని సమీపిస్తారు కదా. అటువంటి వేళ కవిహృదయం వారిలో ఎక్కడ లంగరు వేస్తుంది? ఏమి ఏకరువు పెడుతుంది? రహస్యంగా ఏమి సంభాషిస్తుంది? మరేమి ఉపదేశించాలని ఆరాటపడుతుంది? జీవితంలోంచి తమని తవ్వుకొని పఠిత అనుభవంలోకి కొత్తగా ఊరే జలని కవులు ఎలా తీసుకురాగలుగుతున్నారు? అని ప్రశ్నించుకొన్నాను. ఈ నేపథ్యంలో తొలుత అది కవిత్వమై తీరాలని, విలక్షణత, కాలానికి నిలవగలిగే నిండుదనం ఉండాలనే ప్రాతిపదికన ‘కవిత 2016’ రూపుదిద్దుకొంది. అంతమాత్రాన కవితల స్థాయిలో తారతమ్యం లేకపోలేదు. అలానే ఒక ఘటనకి సంబంధించి ఒక ప్రాతినిధ్య కవితని మాత్రమే తీసుకోవడం వల్ల పుస్తకంలో వైవిధ్యానికి తావు ఏర్పడుతుందనిపించింది. ∙∙∙ పద్యం ద్విహృదయ, బిడ్డని మోస్తున్న గర్భిణి పద్యంలోనే శిశువు మాటలు కూడబలుకుతుంది పద్యంలోనే పంజరపు పక్షి రెక్కలు కొట్టుకుంటుంది పద్యంలోనే మూగవాని కేక మారుమ్రోగుతుంది పద్యంలోనే అంధుడి చింత సూర్యచంద్రుల కాంతిని తాకుతుంది పద్యంలోనే బీడువారిన భూమి మరల సేద్యానికి సమాయత్తమవుతుంది పద్యంలోనే మానవాళి విషాదోల్లాసపు జీవన జలధి అలలు అలలుగా ఎగిసిపడుతుంది. -నామాడి శ్రీధర్ మొబైల్ నెం: 93968 07070 -
ఆ మూడూ కలిస్తేనే కవిత్వం
సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వ సంకలనం ‘తావు’ వచ్చిన నేపథ్యంలో ఈ ఐదు ప్రశ్నలు... 1. ‘రాచకన్యల చనుదోయి మధ్య/ ముత్యాల జాలు వోల్గె...’ అని మొదలవుతుంది మీ ‘వాగు’ కవిత. ప్రబంధ లక్షణంగా కనబడే దీనికి కారణం మీరు పరిశోధించిన ప్రాచీన సాహిత్య ప్రభావమా? ఆ ప్రభావం కాదు. ఆ వాగు దృశ్యాన్నీ, ఆ వాగు సౌందర్యాన్నీ కళ్లకు కట్టించడం కోసం అలాంటి వర్ణనే సరిపోతుంది. తిలక్ ఎంచుకునే పదాలను బట్టి రా.రా. కూడా ఆయన్ని ప్రబంధ కవి అన్నారు. అది సరైన అంచనా కాదు. 2. 1994లో వచ్చిన మీ ‘తోవ ఎక్కడ’ తర్వాత, ‘దాలి’ దీర్ఘకవిత, ఇతరులతో కలిసి ‘నల్లవలస’, ‘విపశ్యన కవిత్వం’ మినహా మరే విడి కవితా సంకలనం మీరు తేలేదు. ఇంత సుదీర్ఘ విరామం ఎందుకొచ్చింది? ఒక కారణం: నేను స్లో రైటర్‌ను. సంవత్సరానికి ఒకటో రెండో కవితలు రాశానంతే. అయితే, ఇవేమీ నేను ఆపి మొదలు పెట్టినవి కాదు. మధ్యమధ్యలో రాస్తూనేవున్నా. రెండో కారణం: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘ముంగిలి’, ‘మత్తడి’ సంకలనాలు తేవడం కోసం వాటికి సమయం కేటాయించాల్సి వచ్చింది. లేకపోతే మరింత రాసివుండేవాణ్నేమో! 3. మొదటి సంకలనం నుంచి ‘తావు’ వరకు మీ కవిత్వంలో నిర్మాణపరంగా వచ్చిన మార్పేమిటి? అసలు కవిత్వం ఏమిటి మీకు? ‘తోవ ఎక్కడ’ చివర్లోనే నా కవిత్వ నిర్మాణంలో షిప్ట్ కనబడుతుంది. స్టేట్మెంట్స్, కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండేవప్పుడు. ఆ తర్వాత కవిత్వాన్ని దృశ్యమానం చేయడానికి ఇమేజరీస్ శక్తిమంతమైన సాధనంగా భావించినా. ఆ మార్పు ‘తావు’లోని అన్ని కవితల్లో కనబడుతుంది. చుట్టూవున్న పరిసరాలు, సమాజం ప్రభావం వల్ల మనం ఆందోళన చెందుతాం, అలజడికి గురవుతాం, కలత పడుతాం. దుఃఖం, కోపం, ఘర్షణ... వీటన్నింటి అభివ్యక్తే కవిత్వంగా భావిస్తాను. అయితే, అభివ్యక్తే సరిపోతుందా? దానితో పాఠకుడు తాదాత్మ్యం చెందినప్పుడే అది యూనివర్సల్ అవుతుంది. మరి పాఠకుడి మనసు మొద్దుబారినప్పుడు దాన్ని కదిలించాలంటే అప్పటికి ఉన్నదానికి భిన్న రూపంలో చెప్పాలి. అంటే, మన ఉద్వేగం, అది యూనివర్సల్ కావడం, దాన్ని కొత్త పద్ధతిలో రాయడం... ఈ మూడూ కలిస్తే కవిత్వం అవుతాయి. 4. మీలోని కవిని పరిశోధకుడు మింగేస్తున్నాడా? ఆ రెండు పాత్రల్లో ఏది ఇష్టం. వాటి మధ్య ఎలా సమన్వయం కుదురుతోంది? నాకు కవిగా ఉండటమే ఇష్టం. అయితే, నాలోవున్న సామాజికుడికి తెలంగాణ ఉద్యమ అవసరాలకోసం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉండినై. (ప్ర: అంటే కవి సామాజికుడు కాదన్న ధ్వని వస్తోంది...) నా ఉద్దేశం మనలో ఒక వ్యక్తీ, ఒక సామాజికుడూ ఇద్దరూ ఉంటారు. ఇద్దరూ పరస్పర పూరకంగా, పరస్పర విరుద్ధంగా కూడా ఉండొచ్చు. వైరుధ్యంలో అనిశ్చితి వస్తుంది. ఆ అనిశ్చితి కూడా కవిత్వంలో రాగలుగుతుంది. నేననేదేమిటంటే, సామాజికుడిగా చేసే పని వేరు; కవిగా చేసే పనివేరు. సామాజికుడు చేసే పని భిన్న రూపాల్లో ఉంటుంది; అందులో కవిత్వం ఒక రూపం! 5. ‘అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ’(1982), ‘తెలుగు కవిత్వం– తాత్త్విక నేపథ్యం’(1991)... ఈ రెండు గ్రంథాలూ మీవి ఇప్పటిదాకా అముద్రితంగా ఎందుకు ఉండిపోయినై? ఎడిట్ చేసుకొని ప్రింట్ చేయాలనేది కొంతా, ఆర్థిక భారం వల్ల కొంతా అలా ఉండిపోయినై. తర్వాత, తెలంగాణ ఉద్యమ వాతావరణంలో వాటిని యథాతథంగా అచ్చువేయడం ఇష్టం అనిపించలేదు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన అంశాలతో ‘తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణం’ రాస్తున్నా. కాబట్టి, ఆ పుస్తకాల్లోని తెలంగాణ అంశాలను ఇందులో వాడుకుంటాను. తావు(కవిత్వం); కవి: సుంకిరెడ్డి నారాయణరెడ్డి; పేజీలు: 112; వెల: 40; ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు. కవి ఫోన్: 9885682572 -
ఆ భరోసానిచ్చింది అమ్మే!
ఆచార్య ఎన్. గోపి ‘అమ్మ కూడా చచ్చిపోతుంది...’ అంటూ సాగే కవిత 1985 మే నెలలో అమ్మ చితి దగ్గర కూర్చుని రాసింది. ఆ భ్రష్టుణ్ణి నేనే. అమ్మ పోయిందని దేవరకొండ నుంచి టెలిగ్రామ్ పంపారు చిన్నక్క వాళ్లు. అది నాకు మరుసటి రోజు సాయంత్రానికి అందింది. అందిన వెంటనే పరుగులు తీశాను. కానీ అమ్మ అప్పటికే కాలి బుగ్గి అయిపోయింది. అమ్మ ఇంక కనిపించదని తెలిసిన ఆ క్షణంలో నాలోని భావావేశం కవితగా పొంగి వచ్చింది. కాలుతున్న కాష్టం కూడా వెలుగుని ప్రసాదించినట్లే... అమ్మ దూరమైనా కూడా ఆమె నేర్పిన లక్షణాలు, ఆమె నుంచి నేర్చుకున్న అలవాట్లు నాలో ఇంకా బతికే ఉన్నాయి. అవే నన్ను నడిపిస్తున్నాయి. జీవించడం కష్టమేమీ కాదు, చాలా సులభం అని మళ్లీ మళ్లీ నా చేత చెప్పిస్తున్నాయి. మాది నల్గొండ జిల్లా భువనగిరి. స్వాతంత్య్రం దేశానికి వచ్చింది కానీ మా తెలంగాణాకు ఇంకా రాలేదప్పటికి. నేను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు పెద్దక్కకు పెళ్లయింది. కొత్త పెళ్లికూతురి ఒంటి మీద సొమ్ముల కోసం రజాకార్లు ఆమెను చంపేశారు. అప్పటి నుంచి అమ్మ రోజూ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు భోరున శోకాలు పెట్టి ఏడ్చేది. పొలం పనుల నుంచి వచ్చి ఏడ్చి ఏడ్చి, తర్వాత ఇంటి పనులు చేసుకునేది. అలా ఇరవై ఏళ్లు కొనసాగింది. ఊరి వాళ్లకు ఎంతగా గుర్తుండిపోయిందంటే... ‘నక్కా లక్ష్మమ్మ ఏడుపు ఆపింది, దీపాలు వెలిగించండి’ అనుకునేటంతగా అందరిలో నాటుకుపోయిందా ఏడుపు. అమ్మ పొలం పనులు, నాన్న బట్టల మూట వ్యాపారంతో ఇల్లు గడిచిపోతుండేది. మాకెవరికీ పెద్ద పెద్ద కోరికలు లేకపోవడంతో కొరత అనిపించలేదు. అమ్మ రోజంతా పని చేస్తూనే కనిపించేది. అదే పిల్లలకూ అలవాటు చేసింది. ఇంటి పనుల్లో సాయం చేయకపోతే ఆమెకి కోపం వచ్చేది. అమ్మ బావిలో నీళ్లు చేదితే నేను మోసేవాడిని. నేను చేదితే అమ్మ మోసేది. ఆమెకు చదువురాదు. కానీ జ్ఞాని. అక్షరజ్ఞానం ఉంటే జీవితం బాగుంటుందని నమ్మింది. తన సొమ్ములమ్మి అన్నను చదివించింది. నా చదువుకి అవీ లేకపోవడంతో ట్యూషన్ చెప్తూ చదువుకున్నాను. నాకు వచ్చిన నూట ముప్ఫై రూపాయల నుంచి అమ్మ ఆకు వక్క (తమలపాకులు- వక్కలు) కోసం ముప్ఫై రూపాయలు పంపేవాడిని. నేను వెళ్లేటప్పుడు ఆకుల కట్ట తీసుకెళ్తే ఆమె కళ్లు మెరిసేవి. అంతకంటే ఆమెకు కోరికలేవీ లేవు. ఆత్మగౌరవం మెండు! ఆమెకు ఎవ్వరి మీదా ఆధారపడడం ఇష్టం ఉండేది కాదు. నాన్న యాభై ఏళ్లకే పోయారు. దాంతో అన్నయ్య ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపేవాడు. మనియార్డరు వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఎంత డబ్బు పంపించాడని అడగలేదు. ప్రతిసారీ ‘వాడింటి ఖర్చులకు సరిపోతున్నాయంటనా’ అనేది. ఓసారి అన్న ‘నేను పెద్ద ఉద్యోగినయ్యాను. నువ్వింకా కూలికి పోవడం ఎందుకు మానెయ్’ అన్నాడు. అప్పుడు చూడాలి అమ్మలో పొడుచుకు వచ్చిన పౌరుషాన్ని. ‘నన్ను పోషించడానికి నువ్వెవర్రా. నాకు రెక్కలున్నాయి’ అన్నది. నాకు ఉద్యోగం వచ్చాక కూడా ‘పెద్ద పంతులుద్యోగం. నీకు బాగానే వస్తుందిరో’ అనేది కానీ, ఆమె తన కోసం ఏమీ అడిగేది కాదు. అమ్మ కూడా చచ్చిపోతుంది! యవ్వన ప్రాదుర్భావ ప్రాంగణంలో విచ్చిన మృత్యుపుష్పాలు, గుట్టుగా కళ్ల మడతల్లోకి వచ్చి చేరిన స్వార్థబాష్పాలు, అమ్మను కాస్త కాస్త చంపుతూ ఇవాళ పూర్తిగా చంపేశాయి కానీ, అమ్మ ఓ పట్టాన చావదు కాలుతున్న కాష్టంలోంచి వెలుగును ప్రసాదం చేస్తుంది శవం చుట్టూ అల్లిన వేదాంతం పక్షిని గూట్లో బంధిస్తుంది మనసు నిండా పేరిన మాలిన్యం జ్ఞాపకాలను ఏటిపాలు చేస్తుంది ఇప్పుడు పూర్తిగా నువ్వే! అమ్మ స్మృతి ఓ దివ్వె... ఆరని వేదనతో పెనుగులాట ప్రారంభమవుతుంది భ్రష్టుడా! అమ్మ రుణం తీరదు అమ్మకు అమ్మవై పుడితే తప్ప. ఆమె రూపంతో పాటు ఆమెలోని శ్రమించే తత్వమూ నాకు అబ్బింది. 68 ఏళ్ల వయసులో కూడా రోజుకి పది గంటలు పని చేస్తాను. కూలీ కోసం అట్టే చూడను. నా మూటలు నేనే మోసుకుంటాను. తమ శ్రమను నమ్ముకున్న వారికి జీవితం భయంగొల్పదు. అక్క పోవడాన్ని తల్లిగా భరించలేక ఏడ్చింది కానీ నాన్న పోయాక ఇంటి బాధ్యత మోయడానికి భయపడలేదామె. ఆ ధైర్యమే ఆమెను నడిపించింది. పౌరుషంగా, ఆత్మగౌరవంతో జీవించడానికి దోహదం చేసింది. అమ్మలోని లక్షణాలను తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. జీవించడానికి భయపడాల్సిన పనిలేదు. జీవించడం చాలా సులభం అనే భరోసా నాలో కలిగించింది మాత్రం నేను చూసిన అమ్మ జీవితమే. విపరీతమైన కోరికలకు, అత్యాశకు పోతే జీవించడం కష్టం. కానీ చేతిలో ఎంత ఉందనే స్పృహ ఉంటే జీవించడం కష్టం కానే కాదు.’’ - సంభాషణ: వాకా మంజులారెడ్డి -
సైనికులపై షారూక్ కవిత
ముంబై: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ సైనికులపై ఒక కవిత రాసి ప్రత్యేక సందేశం అందించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలన్న మోదీ పిలుపుతో దీన్ని రాసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అందులో షారూక్ ‘మన పాదాలు తివాచీల మీద. వారి బూట్లు నేలపైన. మన రోజులు ప్రశాంతం. వారికి రోజూ కొత్త సవాళ్లు. మన రాత్రులు ఆహ్లాదకరం... వారి త్యాగాల వల్లే మనం జీవిస్తున్నాం. వారి కష్టం మరుగున పడిపోకూడదు... వారు పోరాటం చేస్తున్నారు. అందుకే దేశం ఎదుగుతోంది. త్రివర్ణ పతాకం ఎగురుతోంది’ అంటూ రాశారు. -
‘కొయ్యగుర్రం’.. కొత్తరూపం
* ఒకనాటి సంచలనం.. రాజకీయ దీర్ఘకవిత ‘కొయ్యగుర్రం’ * దృశ్యకావ్యంగా కొత్త ప్రయోగం * అప్పటి పంక్తులు ఇప్పటికీ వర్తిస్తాయంటున్న సుప్రసిద్ధ కవి నగ్నముని తెనాలి: కొయ్యగుర్రం... 1977 నవంబరు 19న సాగరమెత్తిన జలడ్గానికి తెగిన అసంఖ్యాక దీన మానవుల తలలకి నగ్నముని అనే కవి అర్పించిన జలతర్పణం. రాజకీయ అంశాన్ని తొలిసారి సాహితీ విలువగా ప్రకటించిన ఈ తొలి దీర్ఘకవిత, ఆధునిక మహాకావ్యంగా కీర్తినందుకొంది. తొలి రాజకీయ, తాత్విక మహాకావ్యంగా కావ్యాలకు, దీర్ఘ కవితలకు ఒరవడి పెట్టింది. తొమ్మిది భాషల్లో అనువాదమైంది. కవి తాత్వికుడు అయినందునే ఇది సాధ్యపడింది. నగ్నముని అభిమానులతో∙ఇప్పుడీ రచన దృశ్యరూపం సంతరించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీ సినిమాగా రూపొందనుంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన తెనాలి కవి నగ్నముని, ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 1977లో ఉప్పెన విజృంభణ... కొన్ని వేలమంది చనిపోయారు. గ్రామాలకు గ్రామాలు సమాధి. తుపానును ఎటూ శాసించలేం. మిగిలిన ప్రాణాలను పట్టించుకొనేదెవరు? పైగా ఇంకో తుపాను వస్తే బాగుండనుకున్నారు కొందరు. దానివెనుక డబ్బులు, వ్యాపారాలున్నాయి. ఆ ఆవేదనలోంచి వచ్చిందే ‘కొయ్యగుర్రం’. రాజకీయ అంశాన్ని తొలిసారి సాహిత్యంలో ప్రవేశపెట్టిన కావ్యమిది. ప్రస్తుతం డాక్యుమెంటరీ రూపంలోకి తీసుకొస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు మిత్రులు. నిర్దేశిత బాధ్యతను ప్రముఖ ఆర్ట్ ఫిలింమేకర్ నటరాజ్ మహర్షి స్వీకరించారు. ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా న్యాయవాది వేణుగోపాలరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆడియో రికార్డింగ్ పూర్తయింది. స్వాతంత్య్రం సిద్ధించాక.. సొంత పరిపాలన వస్తుందని సంబరపడ్డాం. సమాజానికి రాజ్యానికి సంబంధం లేకుండాపోయింది. పారిశ్రామిక విప్లవంతో చేతివృత్తులన్నీ దెబ్బతిన్నాయి. దీన్ని తట్టుకొని వృత్తిదారుల జీవితాలు సజావుగా సాగేందుకు ఏం చేశారు? శాస్త్ర ప్రగతి శరవేగమవుతుంటే, దానికి అనుసంధానంగా పౌరజీవితాలు ఉండేలా చూసుకోవాల్సిన ప్రణాళికలు ఎప్పుడైనా అమలు జరిగాయా..? శాస్త్ర విప్లవాన్ని ఆపొద్దు... నడుం విరిగినవాళ్లను ఎలా బతికించాలనేది ఆలోచించాలి కదా..? శాస్త్రీయ దృక్పథం లేనందునే జీవితాలు నాశనమయ్యాయి. ప్రజాప్రతినిధులు సంక్షేమం పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. జవాబుదారీతనం లేని వ్యవస్థను తయారుచేశారు. ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లటం మినహా ప్రభుత్వం దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఏదైనా ఉద్యోగానికి వెళితే.. అనుభవం ఏమిటని అడుగుతారు... అర్హతలను ప్రశ్నిస్తారు. ప్రజాప్రతినిధి కావటానికి ఏ అర్హతలు లేవు, ఏ ప్రాతిపదికన ఎన్నుకోవాలో లేదు. కులం ఎంటి? మతం ఏంటి? డబ్బుందా? అనడుగుతున్నారు. అందువల్లే ఈ డొల్లతనం. యోగ్యతలు లేనివారు ధనం ప్రాతిపదికగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఫలితంగానే బాధ్యతలేని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కనీసం ఎవరేం చేయాలనే పని విభజన కూడా తెలీదు. అయోమయ ఆలోచనలతో మనల్ని ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలీదు. పాత చట్రంలో కొత్త సమస్యలకు పరిష్కారం ఉండదు. ప్రజలకీ భ్రమలపై ఎరుక కావాలి. అప్పుడే వాళ్లు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకుంటారనే భావనతో ఆనాడు కొయ్యగుర్రం రాశాను. నిజానికి ఇప్పటికీ ఇది రిలవెంట్ ఫర్ అవర్ ఇండియా. ఇంకా పెరుగుతూనే వుంటుంది. ఒకవేళ ఇప్పుడు గనుక నేను రాయాల్సివస్తే, కొయ్యగుర్రం అని కాదు... ‘ఇనుపగుర్రం’ అని రాస్తాను. విదేశీ భాష వద్దు, వస్త్రాలొద్దు... అని ‘క్విట్ ఇండియా’ ఉద్యమం చేశాం. మరిప్పుడో..? మన పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లి, వాళ్ల కంపెనీలను ఇక్కడ స్థాపించమని ఆహ్వానిస్తున్నాయి. కల్పించే సౌకర్యాలపై హామీలిస్తున్నాయి. ఎందుకిలా? ఫ్రీడం స్పిరిట్ మొత్తం పోయింది. ఒక భ్రమను డెవలప్ చేయటం వల్ల ప్రజలు అన్నిటినీ నమ్ముతారు. రాజ్యమనే కొయ్యగుర్రం ఒక భ్రమ... కదులుతుందనే భ్రమను కల్పిస్తుందేగాని, నిజంగా ఇప్పటికి ఆడియో రికార్డింగ్ పూర్తయింది. -
పద్యాలతో జాషువాకు పట్టాభిషేకం
గుంటూరు ఈస్ట్: మహాకవి గుర్రం జాషువాకు శనివారం గుంటూరులో ఆయన రచించిన పద్యాలతోనే పట్టాభిషేకం జరిగింది. పలువురు కవి గాయకులు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పద్యాలు రసరమ్యంగా ఆలపించి పరవశించారు. పలువురు సాహితీమూర్తులు విశ్వనరుడు జాషువాను విశ్వమానవ గోత్రీయుడంటూ కొనియాడారు. ఆయన సామాజిక స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందించాలని ఆకాంక్షించారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 121వ జయంతి వారోత్సవాలలో మూడోరోజు శనివారం పోలీస్ కల్యాణ మండపంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌తో పాటు 50 మంది కవులు,రచయితలను సత్కరించి,జాషువాకు సాహిత్య నీరాజనం అర్పించారు. వందమంది కవులు రచించిన కవితల సంకలనం అయిన ‘‘వందగొంతులు ఒక్కటై జాషువా కోసం’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, నరాలశెట్టి రవికుమార్,బండారు పద్మ, దేవసహాయం, బద్వేలు శ్రీహరి, ప్రజానాట్య మండలి గాయకుడు రమణ తదితరులు జాషువా పద్యాలను ఆలపించిన తీరు ఆహూతులను అలరించింది. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ను కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, సాహితీవేత్తలు డాక్టర్ బూసురుపల్లి వెంకటేశ్వర్లు,ధనేకుల వెంకటేశ్వర్లు,పెనుగొండ లక్ష్మీనారాయణ,పాపినేని శివశంకర్ ఘనంగా సత్కరించారు.అనంతరం పద్మశ్రీ ఇనాక్ రచించిన అమరావతి,పులుల బోను–నేను, సర్పయాగం, అమరావతి ఖ్యాతి మాదిగల స్థితి పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లాకు జాషువా పేరు పెట్టాలి.. పలువురు వక్తలు తమ ప్రసంగాలలో గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా పేరుపెట్టాలని, నవ్యాంధ్రలో ఆయన పేరుమీదగా లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహణకు హాలును నిర్మించాలని కోరారు. జాషువా గొప్ప మానవతా వాది అని, సమాజ దార్శనికుడని ఎందరో ఆధునిక కవులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కన్నా మాస్టారు, వేదయ్య,న్యాయవాది వైకే, చందోలు శోభారాణి, సముద్రాల కోటేశ్వరరావు, బత్తుల వీరాస్వామి,జాషువా సంఘం అధ్యక్షుడు పెద్దింటి యోహాను తదితరులు పాల్గొన్నారు. -
ఏది ప్రేమ?
కవిత ఒక ఆశాకం పిగిలిపోయాక ఒక అడవీ కుంగిపోయాక కళ్లల్లోంచి రాలిన నల్లని పదాలు ఖాళీ చేతుల్లోకి ఇంకిపోతున్నప్పుడు విచ్చుకోవాలో, ముడుచుకోవాలో తేల్చుకోలేక మనసు విరుచుకు పడిపోతున్నప్పుడు, సరిగ్గా అప్పుడే మారుమూల ద్వీపంలో అవ్వాతాతల సమాధుల సాక్షిగా పేర్చుకున్న తన కలలన్నీ ఇంకా మన ఇళ్లకు రాని ప్రళయానికి ఇచ్చి కొన్ని గ్నాపకాలను మూటగట్టుకుంటూ ఒక అమ్మాయి మనల్ని చూసి పకాలున నవ్వుతుంది అంతలోనే, ఉప్పగా ఏడుస్తూ నిలదీస్తుంది ‘దేనికోసం మీ పలవరింత? ఏది విరహం? ఏది ప్రేమ?’ –మమత -
వర్షపుదారి
- కవిత ఒక్క చినుకు దారి మరచి అరచేతిలో రాలినా చినుకులో ఏమీ వుండవు చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది ఒక నాటి వాన జల్లు తడి జ్ఞాపకం వేళ్ల కొసలని తాకుతుంది పసుపు గన్నేరు పూలు భుజాల మీద మెడ ఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం ఖాళీతనంలో చొరబడి చెవి పక్కనే వినిపించే నవ్వు ఎగిరిపోయిన గొడుగు దొరికిపోయిన శరీరం కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం దూరంగా వినిపించే చిన్న పిట్ట కూత రెక్కలో తడి ఆకాశం మబ్బులని తోసుకుంటున్న దృశ్యంలోకి చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలి గుర్తులని ఆ వర్షపు హాయిని ఈ వేడిదారిలో వెతుక్కుంటూ చాచిన అరచేయిలో రాలి పడిన ఒక్క చినుకు తడిలో వర్షపు దారి ఆనవాళ్లు పొడి పొడిగా - రేణుక అయోల, 9963889298 నిశ్శబ్దభేదం అధరాల మధ్యలో ఉక్కిరిబిక్కిరవుతూ పరస్పర పరవశాల పరాకాష్ట పరవళ్లలో మునిగిపోయింది... అపార్థాల మధ్యలో బిక్కుబిక్కుమంటూ మరింతగా ముడుచుకుని ముఖాన్ని మాడ్చుకుంటూ మూలన కూర్చుంది... అప్పటికీ ఇప్పటికీ మనిద్దరి మధ్యా నిశ్శబ్దంలో ఎంత భేదం?! - రాజేష్ యాళ్ళ, 9700467675 రెండు బాణాలు కురిస్తే ఖాళీ అవుతాయి మబ్బులు కానీ ఎప్పటికీ కురిసేవే కళ్లు చినుకు రాలితే నేలకు తడి గొంతు పాడితే గుండెకు తడి - డా॥బాణాల శ్రీనివాసరావు 9440471423 -
అమ్మకోసం నటుడి ప్రత్యేక కానుక
ముంబై: సినీ, టీవీ నటుడు ఆశీష్ శర్మ మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ప్రత్యేక కానుక ఇచ్చాడు. ప్రతి ఏటా మదర్స్ డేను తల్లితో కలసి సెలెబ్రేట్ చేసుకునే ఆశీష్.. ఈ సారి షూటింగ్‌లతో తీరికలేకుండా ఉండటంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆశీష్ ప్రత్యేకంగా కవిత రాసి తన తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. 'ప్రతి మదర్స్ డే నాకు ప్రత్యేకం. ప్రతిసారి అమ్మతో కలసి సెలెబ్రేట్ చేసుకున్నా. ఈ ఏడాడి బిజీ షెడ్యూల్ కారణంగా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో అమ్మ కోసం ప్రత్యేక కవిత రాశాను. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ కవితను అమ్మకు కానుకగా ఇచ్చాను. నా చిన్నతనం నుంచి అమ్మతో గడిపిన క్షణాలన్నీ గుర్తున్నాయి' అని ఆశీష్ చెప్పాడు. స్టార్ ప్లస్ షో షూటింగ్ కోసం అతను హైదరాబాద్ వచ్చాడు. ఆదివారం మదర్స్ డే. -
వేసవి
కవిత తనని తాను బద్దలు కొట్టుకుంటూ ఎండ కనపడని లావాలను గ్రుమ్మరిస్తే నెర్రెలిస్తూ పగుళ్ళు బారి భూగోళం కణకణమండే గాడిపొయ్యవుతుంది ఊళ్ళన్నీ చెరువులను చప్పరించేసి కదలలేని వాగుల చేతులను కూడదీసుకొని ఆకాశంలో కనపడని మబ్బులకు దణ్ణాలు పెడుతుంటాయ్ జ్వరంతో పుడమి వేడి సెగలు కక్కుతుంది పగటి తాకిడికి వడలి పోయిన రాత్రి ఉసూరంటూ ఆలస్యంగా వస్తుంటుంది చుక్కల గుడ్డలో చల్లటి చంద్రుణ్ణి చుట్టి నుదిటి మీద కప్పినా అర్ధరాత్రిగ్గాని వేడి తగ్గదు పచ్చదనాన్ని రియల్ ఎస్టేట్‌కి ఒక జీవితకాలం తాకట్టు పెట్టుకొని వడ్డీ కోసం ఒకోక్క చెట్టూ నరుక్కుంటూ పోగా ఒకటో అరో మిగిలిన చెట్టూ చేమ అక్కడక్కడో చలివేంద్రం పెట్టినా నిప్పులకుంపటి నెత్తిమీద పెట్టుకొని సెగలు కక్కుతున్న మధ్యాహ్నాలను తమ ఆకుల రెక్కలతో చల్లబరచలేక దిగులు పడి పోయుంటాయి చెట్లు నిలువ నీడలేక పిండాలతో ప్రాణాలు నిలుపుకోలేక గతించిపోయిన తమ సాటి పిచ్చుక జాతితో పోలేక పోయినందుకు వగస్తుంటాయ్ కాకులు ఇంటెన్సివ్ కేర్‌లో వడదెబ్బకు విలవిల్లాడే దేశాన్ని చూస్తూ ఈ సీజన్ గడిస్తే గాని చెప్పలేమంటూ ఆందోళనతో చెతులెత్తేస్తూందీ ప్రజాస్వామ్యం డాక్టర్ పి.బి.డి.వి.ప్రసాద్ 8186814532 -
దుర్ముఖి
ఉగసిరి పెంచునట్టి తొలి ఉత్సవ మియ్యది, ఊరు వాడలున్ సొగసుగ రంగులద్దుకొను, సోదర భావము పూజ్యమయ్యెనే చిగురులు వేసె మత్సరము, చీకటి మూగెను, రైతు గుమ్మమే బిగువగు భోజ్య భాండమగు బీదల యాకలి తీర్చు నియ్యెడన్ మాకంద మాధుర్య మైపూత మెక్కేటి పికబాల పిసరంత పిలుపు లేదె? మురిపించు వీధుల్ల, ముత్యాల ముగ్గుల్ల తెలిదమ్ము నవ్వుల తీరు లేదె? హాసమే హరితమై- హరివిల్లు హారమై హోరెత్తు గీతాల హూతి లేదె? అనురాగ బంధాల, ఆదర్శ బాంధవ్య ‘ఓ అన్న - ఓ బావ’ ఊసు లేదె? కనగ చిననాటి భావాలు కలుష మాయె వినగ కులజాడ్య మిప్పొద్దు వెల్లువాయె సరస రమణీయ సహవాస సంధి సేయ వరస కలిపేటి యువశక్తి వార్ధి యవదె? - ఇప్పగుంట సూరి 9966289776 సంవత్సర ముఖి కాలసింహం కాసేపాగి నడచివచ్చిన దారిని ఒకసారి అవలోకించి సాగిపోయే సందర్భమిది. ప్రాచీన గాయకుడు మన్మథగీతాన్ని ఆలపించి దుర్ముఖి గానాన్ని చేయటానికి గొంతు సవరించుకొంటున్న సమయమిది. దుర్ముఖినామ సంవత్సరమా! నీ పేరు కొంచెం భయపెడుతున్నా నీది మాత్రం మాతృహృదయమని మాకు తెలుసులే. అరవైయ్యేళ్ల క్రితం నీవొచ్చి అందరం కలిసుండాలని ఒక ఇల్లు ఇచ్చావు! గుర్తుందా? మేమే జీర్ణమయిందని దాన్ని విప్పుకొని కొత్తగా రెండిళ్లు కట్టుకొన్నాం ఉగాది పచ్చడి తినటానికి నీవిపుడు రెండిళ్లకు రావాల్సి ఉంటుంది తూర్పున ఉన్నాం కదా ముందు మా ఇంటికే వస్తావులే! సంవత్సర ముఖీ! ఇందుముఖివై మా హృదయాలలో ప్రేమను వర్షించు. చంద్రముఖివై మా జీవితాలపై చల్లని కాంతులు ప్రసరింపచేయి. శతముఖివై ఈ సమాజపు చీకట్లను తుడిచేసి వెలుతురు విత్తనాలను చల్లు. జ్వాలాముఖివై మా ఆలోచనలను జ్ఞానంతో జ్వలింపచేయి. - బొల్లోజు బాబా 9849320443 రైతులు నాటౌట్‌గా నిలవాలి వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశభక్తా దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్ పట్టించుకున్నావా దేశభక్తా? ఇష్టమయిన క్రికెటరెవరో వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశభక్తా? ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా దేశభక్తా? క్రికెట్ నిజం, మిగతాదంతా మిథ్య అనే ధోరణిని నిరసిస్తూ- సాగుబడి మాత్రమే నిజంగా నిజం అని రైతన్నకు పట్టం కడుతూ, రైతుకు ‘మనం చీర్ లీడర్స్ కావా’లని సూచిస్తూ- ‘రైతులు నాటౌట్‌గా నిలవాలి’ పేరుతో సైఫ్ అలీ సయ్యద్ రాసిన ఈ దీర్ఘ కవిత సామాజిక మాధ్యమాల్లో బాగా షేర్ అవుతోంది. పూర్తి పాఠం ఈ లింకులో: https://www.facebook.com/directorgoreysaifali అన్నీ! ఆశ్చర్యాలే చిన్నప్పుడు, భలే అన్నీ ఆశ్చర్యాలే నక్షత్రాల లెక్క తప్పి, మళ్లీ ఒకట్నుంచి మొదలవ్వటం భూతద్దంతో అరచేతిని సర్రున మండించటం నాన్న పొడుగు అంగీలో మునిగిపోయి అమ్మ చెప్పుల్లో దూర్చిన కాళ్లీడ్చటం ఆచ్చికి తీసికెళ్తామంటే కొత్త బట్టల్లో వీధులన్నీ ఎగరటం మనుషులు రైలుపెట్టెల్లా కదలడం మేకచన్నులు నోట్లో పొదుక్కు తాగేయటం తొండతోకకు దారం కట్టి, కాకిగుడ్లను గూడెక్కి చూడ్డం పీత జాడలోకి పరిశోధకులవ్వటం రేవు చప్టాలో జర్రున జారి- బోసిగా విరబూయటం శ్రీరామనవమి పందిళ్ళలో పానకం చెంబులతో పోటీపడటం నత్తినత్తిగా క్రిస్మస్ ప్రవచనాలు సాగదీయటం- ఏం చూసినా ఆ చిచ్చుబుడ్డి కళ్ళకు ఆశ్చర్యాలే నిద్రలో పండిన గోరింటా ఆకాశంలో విమానం పంకా, ఎగిరే పక్షి రెక్కా పండగలో ఏడ్చి కొనిపించిన బొమ్మచెక్కా ఏ శత్రుత్వం లేని ఆటలు ఎంచక్కా ఆహా! ఎంత అద్భుతం కాలం పేజీల మీద నడుచుకుంటూ వెళ్లిన నా బాల్యం... నా వొళ్ళో మనవడిలా ఆడుకుంటోంది... - నేలపూరి రత్నాజీ 9440328432 ఉషశ్రీ జయంతి సభ నేడు విజయవాడ, రేడియో ఆర్టిస్టుల కాలనీలోని ఉషశ్రీ నివాసంలో సాయంత్రం 6:25 నిమిషాలకు ఉషశ్రీ జయంతి సభ జరగనుంది. పాలపర్తి శ్యామలానందప్రసాద్, కలగా కృష్ణమోహన్, నండూరి రాజగోపాల్, గుమ్మా సాంబశివరావు పాల్గొంటారు. దుర్ముఖి ఉగాది కవిసమ్మేళనం మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ నిర్వహణలో ఏప్రిల్ 6న మధ్యాహ్నం 2:30కు 70 మంది కవులతో దుర్ముఖి ఉగాది కవిసమ్మేళనం జరగనుంది. పి.సుశీలకు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్న ఈ సమ్మేళనంలో- మాడభూషి సంపత్‌కుమార్ పుస్తకాలు ‘చివరకు నువ్వే గెలుస్తావు’, ‘ఆలోచనలు’ ఆవిష్కరణ అవుతాయి. భువనచంద్ర, జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, వెన్నెలకంటి పాల్గొంటారు. హైద్రాబాద్ విషాదం ఆవిష్కరణ పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో- మీర్ లాయక్ అలీ ‘హైద్రాబాద్ విషాదం’(అనువాదం: ఏనుగు నరసింహారెడ్డి) ఆవిష్కరణ సభ ఏప్రిల్ 10న హైదరాబాద్, చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరగనుంది. దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి, కట్టా శేఖర్‌రెడ్డి, మహమ్మద్ అన్సారీ, అమ్మంగి వేణుగోపాల్, కె.పి.అశోక్‌కుమార్ పాల్గొంటారు. గాలి అద్దం ఆవిష్కరణ ఎం.ఎస్.నాయుడు కవితల పుస్తకం ‘గాలి అద్దం’ ఆవిష్కరణ ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ఆబిడ్స్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరగనుంది. కె.శివారెడ్డి అధ్యక్షతన అంబటి సురేంద్రరాజు, యాకూబ్, రాజీవ్ వేల్చేటి, కుప్పిలి పద్మ, సిద్ధార్థ, ఆదిత్య కొర్రపాటి ప్రసంగిస్తారు. కుసుమ ధర్మన్న రచనలు కావలెను సామాజిక కార్యకర్త, కవి, సంపాదకుడు, తొలితరం అంబేడ్కరిస్టు కుసుమ ధర్మన్న పూర్తి రచనలను ‘ప్రజాశక్తి’ వెలువరించనుంది. ‘సామాజిక, సాహిత్య స్ఫూర్తి కుసుమ ధర్మన్న’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల వివిధ సంఘాలు జరపబోయే పూర్తిరోజు సదస్సులో ఆవిష్కరించనుంది. అయితే-మాకొద్దీ నల్లదొరతనం, హరిజన శతకం, విజయనగరంలో చేసిన ప్రసంగం మాత్రమే లభ్యమయ్యాయనీ, ఆయన ఇతర రచనలతోపాటు, ధర్మన్న నడిపిన జయభేరి పత్రిక సంచికలు కలిగి ఉన్నవారు వాటిని కూడా పంపవలసిందిగా సంపాదకురాలు కె.ఉషారాణి విజ్ఞప్తి చేస్తున్నారు. చిరునామా: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27-30-4, ఎం.బి.విజ్ఞాన కేంద్రం, ఆకులవారి వీధి, గవర్నరుపేట, విజయవాడ-2; ఫోన్: 9492879210 -
శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు
శ్లోకనీతి పద్యం-6 కర్మములు మేలునిచ్చును కర్మంబులు కీడునిచ్చు కర్తలు తనకుం కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల దడవగా నేమిటికిన్ కావున బరులకు హింసలు, గావింపగ వలదు తనకు కల్యాణముగా భావించి పరుల నొంచిన బోవునె తత్ఫలము పిదప బొందక యున్నే వ్యాఖ్యాన భావం... ప్రతి జీవుడికి తన పుణ్య కర్మల వల్ల మేలు, పాప కర్మల వల్ల కీడు సంభవిస్తుంది. సృష్టికర్త దృష్టిలో శుభాశుభ ఫలాలకు కర్మలే కర్తలు. కనుక కర్మానుసారంగా ప్రాప్తించే సుఖదుఃఖాలకు ఇతరులు కారకులని భావించకూడదు. అంతేకాదు ఆ కారణంగా ఇతరులను హింసించటం ఏ మాత్రం తగదు. తనకు మేలు కలుగుతుందని భావించి ఎవరైనా సరే ఇతరులను హింసిస్తే, వారు ఆ పాప కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పే. శిక్ష తప్పదు. అందుకే కర్మలు ఆచరించేటప్పుడు అందులోని మంచిచెడులను సమీక్షించుకోవాలి. తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. సాధ్యమైనంతవరకు సత్కర్మలను అచరించడానికే ప్రయత్నించాలి. అప్పుడు సత్కర్మ ఫలితాలను అనుభవించవచ్చు.... అని వసుదేవుడు కంసునితో అంటున్నాడు. - డా. పురాణపండ వైజయంతి -
అంతరాంతరాల్లో రగులుతున్న పద్యం
జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జననం 12 జనవరి 1954 మరణం 12 జనవరి 1993 గుండెనిండా బాధ కళ్లనిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండి ఉండి ఉధృతమయ్యేందుకు ఉద్వేగ భరితమైన సన్నివేశం కావాలి... సరళమైన భాషనుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు మధ్యతరగతి కౌగిట్లోని మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్ళీ మళ్ళీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయిపోయింది ... నానించి ఏమీ ఆశించని వాళ్ళే నాకెంతగానో సహకరించారు ‘ఐసోనెక్స్’ నుంచి ‘సైక్లోసెరిన్’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు. అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగ నిరోధక శక్తి సన్నగిల్లి ఆరు నెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్ని పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్, క్యానమైసిన్ ఇంజక్షన్లు నా వొంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సెడెఫైక్ట్స్ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. (చనిపోవడానికి ఆరు నెలల ముందు, ‘సిటీ లైఫ్’ నేపథ్యం పేరిట 1992 జూలైలో అలిశెట్టి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం.) -
ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే
కవిత మనమూ వొట్టిపోయాం. స్పందనలకు చచ్చిపోయాం. నడుస్తున్న శవాలమై నానాజాతి సమితిగా తయారయ్యాం. పక్షికన్ను పంచింగ్ టైమ్. వీరపనుల కట్ట బ్రహ్మలమై గసపోసే వొగిరింపులు. చెమటల నిగారింపులు. పరధ్యాన పరమేశ్వర. మిస్టేకుల స్టేక్ హోల్డర. అక్షింతల ఆహారమె భక్షింతుము భక్ష్యాలుగ. సిటీబస్సే నా రుణభూమి. ప్రయాణికులందరూ నా సహోదరులు. వారిని రౌరవించుట నా విధి సీరియల్. ఇల్లే ఇలలో హెల్లు అని, ఇల్లాలే దొరికిన సాధువని, కవితలల్లిన కచ్రాగాళ్లమై. డస్సిపోయిన డల్ హౌసీలమై. ఆ నాలుగ్గోడల మధ్యనా. నవ్వు పులుముకొని. కెవ్వుకేకల ప్రళయ భీకర పాటల పాలబడి. తిన్న అన్నం వొంటబట్టక వొంటిగా నువ్వా బాల్కనీలో ఎదురింటి కరెంట్ మీటర్ ఎర్రలైటులో చిక్కుకుని గిరికీలు కొడ్తుండగా. ఒక ఆత్మీయమైన ఫోన్ కాల్ వచ్చి నిన్ను అవాక్కయ్యేలా, దాని అక్కయ్యేలా సంభ్రమాశ్చర్యానందాంబుధిన ఓలలాడిస్తే ఎంత బాగుంటుందో. ముఖ్యంగా ఆ యొక్క కాల్ ఒక అపోజిట్ సెక్స్ నుండి అయ్యుండినప్పుడు. - మోహన్ రుషి 8341725452 -
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్‌లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్‌లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్‌కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్‌టేకర్‌గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు. -
చిత్రలోక సంచారి
కవిత కంటికి కనిపించని రంగుల్ని కూడా చూడగలిగిన చిత్రాకారుడెవరైనా ఈ క్షణం నిన్నూ- నువ్వున్న స్థలాన్నీ యథాతథంగా చిత్రిస్తే అదెంత ముచ్చటగా ఉంటుందో తెలుసా..? ఆ బొమ్మలో నువ్వు నిల్చునో లేదా కూర్చునో పడుకునో లేదా పరుగెత్తుతూనో నడుస్తూనో లేదా ఆగి నడిచొచ్చిన దారివైపు దిగులుగానో నడవాల్సిన దూరంవైపు ఆశగానో చూస్తూ ఉంటావ్. నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో దాక్కొని జీవితమూ-మృత్యువూ నీవైపే ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. పై విషయాన్ని ధ్రువీకరిస్తూ మాత్రమే నీకన్నా ముందు వెళ్లిపోయినవాడి సంతకం కనిపించని రంగుల్లో చిత్రంలో మరోవైపు ఉంటుంది. భగవంతం 9399328997 -
మనలో మచ్చ, మన మీది మచ్చ
నేను ‘పుట్టుమచ్చ’ ఎప్పుడూ మొదటిసారే చదువుతాను. ఎప్పుడు చదివినా ఇది ఇంతకుముందు చదివినదే సుమా అనిపించదు. చదువుతాను అన్నాను కదా, కాదు వింటాను. ఆ పద్యం చదువుతున్నట్టు అనిపించదు. వింటున్నట్టుంటుంది. ఈ పద్యంలో గొంతుక గుక్క తిప్పుకోనివ్వకుండా తన మాటల్ని నాకు వినిపిస్తుంది. మాట తరవాత మాట, రకరకాల వేగాలతో ఆవరించుకుంటాయి నన్ను ఆ పద్యంలోని మాటలు. మొదటి మాటే నన్ను హఠాత్తుగా ఆపి ఒక ప్రమాదకరమైన కష్టాన్ని గురించి వినిపిస్తుంది. ‘‘ఒక కట్టుకథ నన్ను కాటేసింది.’’ నాకు కాటేసింది అనే మాట వినేసరికి అదేదో ప్రమాదపు విషపు నాగు గుర్తొచ్చి కొంచెం కంగారు పడుతుండగా ఇంకొంచెం ఆలోచించుకోవడానికి చోటివ్వకుండా ‘ఒక వక్రీకరణ’, ‘ఒక అపనింద’ నన్ను చుట్టుముట్టి, నా దృష్టిని నా చుట్టూ వున్న మనుషుల వైపు మళ్లిస్తాయి. నేను వింటూనే వుంటాను. నాకు కొన్ని వివరాలు, ఆచూకీలు, పుట్టిన తేదీలతో సహా చెప్తాడీయన. నాకా గొంతుక కొత్త. ఈ కథ కొత్తది. కొంత విన్నాక తెలుస్తుంది. ఆ గొంతుకలో వ్యక్తి తన కథనే చెప్తున్నాడు అని. 1955 ఆగస్టు 10 అలా గుర్తుండిపోతుంది. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’ ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ ఆ పాపానికి నేను కూడా కారణమా అని. ఎందుకంటే అంతకుముందే నేను పుట్టాను. ఆ తర్వాత గుక్క తిప్పుకోకుండా చరిత్ర మీద, పాఠ్యపుస్తకాల మీద రాయి మీద రాయి విసిరినట్టు మాటలు వినిపిస్తాయి. హఠాత్తుగా 1947 నేననుకుంటున్న అందమైన అంకె కాదు, అది ఒక దారుణం, మనుషుల్ని విడదీసిన విషాదానికి గుర్తు అని చటుక్కున బోధపడుతుంది. నా బొమ్మ చెదిరిపోతుంది. నా ఇంట కన్ను తెరిచిన నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లిపేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో కనిపిస్తుంది ఈ 1947. ఇది మూడురంగుల పండుగ కాదు. ఆ పుట్టినవాడు ముస్లిం. మనవాడు కాదు అని గుర్తుచేస్తుంది ఈ 1947. తరవాత వినిపించే నినాదాలు నినాదాలు చేసే పనే చేస్తాయి. ఆలోచనకి చోటివ్వకుండా నా చుట్టూ ఆవేశాన్ని నింపుతాయి. మీకిష్టం లేకపోతే ‘పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని ఇప్పటి హిందూ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలు నా బుర్ర నిండా తిరుగుతాయి. పేరుకు రాజ్యాంగమైతే వుంది. అది శిలాక్షరం. అంటే రాతి మాట. దానికి మూడు సింహాల బొమ్మ రాతి గుర్తు. ఆ తరువాత వరుసగా కుట్ర కుట్ర కుట్ర అని జలపాతంగా వచ్చే మాటలు వింటూ వుంటే... నేను పెళ్లాడటం కుట్ర నేను పిల్లల్ని కనడం కుట్ర అనేసరికి నా మనసు నన్ను నిలబెట్టి ప్రశ్నిస్తుంది. నువ్వేమిటి చేస్తున్నావు ఇన్నాళ్లూ అని . రోడ్డుపక్క పేవుమెంటు మీద పూలమ్ముకునేవాళ్లు, పళ్లూ, పల్లీలు అమ్ముకునేవాళ్లు, గొడుగులు బాగుచేసేవాళ్లు, వీధరుగుల మీద కుట్టు పనిచేసేవాళ్లు, వాళ్లు కూడా ముస్లిములే సుమా. వాళ్లు ఎవరికీ ఏ అపకారమూ చేయలేదే. కాని వాళ్ల రక్తమే రోడ్లమీద పారుతుంది. పుట్టుమచ్చ అంటే మనకు తెలుసు. మనందరికీ వుంటాయి పుట్టుమచ్చలు. పుట్టుకతో శరీరం మీద వచ్చే మచ్చలివి. జాతకాలు చూసేటప్పుడు ఆ పుట్టుమచ్చలు ఎక్కడ వుంటే లాభమో, ఎక్కడ వుంటే నష్టమో చెప్తారు. బుగ్గమీదో, గడ్డం కిందో అందంగా కనిపిస్తుంది కూడా ఈ పుట్టుమచ్చ. మన వ్యక్తిత్వాన్ని నిర్ధారించుకోవడానికి గుర్తులుగా మన సర్టిఫికేటులో రాసేది ఈ పుట్టుమచ్చ ఉన్న చోటే. ఇది పుట్టుకతో వచ్చిన మచ్చ కాబట్టి దీనికి ఇన్ని విశేషమైన అందాలూ, అర్థాలూ వచ్చాయి. కాని ఈ పద్యం చెప్పేది ఆ పుట్టుమచ్చ గురించి కాదు. పుట్టడమే ఒక మచ్చ. పుట్టుకే ఒక మచ్చ. ఈ పద్యంలో పుట్టుమచ్చ అది. ఈ మాటకి అర్థం తెలిసేసరికి నాకు ఒళ్లు ఒణుకుతుంది. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదైంది నా పేరు.’’ ఆ మాట వినేసరికి నేను ఉలిక్కిపడతాను. ఒకవేళ ఆ పాపానికి నేను కూడా కారణమా అని.ఈ పద్యం చాలాసార్లు చదివాను. అంటే విన్నాను. ఇది భారతదేశపు చరిత్రలో శాశ్వతంగా వినిపించే గొంతుక. ఈ గొంతుకకి భాష లేదు. ఈ పద్యానికీ లేదు. అంచేత ఇది ఏ భాషలో అయినా గొప్ప పద్యమే. రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ పుస్తకంలో ఈ పద్యంలో కొన్ని భాగాలు ఉదహరించిన తరువాత ఇంకా చాలామంది చదివారు. ఈ పద్యపు పూర్తి అనువాదం నా ‘హైబిస్కస్ ఆన్ ది లేక్, ట్వంటీయత్ సెంచరీ తెలుగు పొయట్రీ ఫ్రమ్ ఇండియా’ పుస్తకంలో వుందని చూసి చాలా అమెరికన్ విశ్వవిద్యాలయాలలో ఈ పద్యాన్ని పాఠాలుగా చెప్పారు. ఒక కవి తన గొంతుకని ఒక సమూహపు గొంతుకగా చేయగలగడం సాహిత్యంలో చాలాసార్లు జరగదు. ఒకవేళ జరిగినా అది ఒక నినాదమో, ఒక ఆవేశమో అవుతుంది కానీ చరిత్రనీ, జీవన విధానాన్నీ అమాయకుల మీద అధికారం చేసిన అన్యాయాన్ని వివరంగా చెప్పే గొంతుక అవదు. ఖాదర్ ఈ శతాబ్దపు కవి. అతని గొంతుక ఈ శతాబ్దపు ప్రపంచపు గొంతుక. ఇది అమాయకంగా దెబ్బతింటున్న ముస్లిముల గొంతుక మాత్రమే కాదు. ప్రపంచంలో ఎక్కడ బల మైన ఎక్కువ మంది బలంలేని తక్కువమందిని వాళ్ల అవసరాల కోసం, వాళ్ల అధికారం నిలబెట్టుకోవడం కోసం శత్రువులుగా మారుస్తారో వాళ్లందరి గొంతుక ఇది. వాళ్లకి పేరు మతం మూలంగా వచ్చి ఉండొచ్చు. ఒంటి రంగు మూలంగా వచ్చి ఉండవచ్చు. కులం పేరుతో వచ్చి ఉండొచ్చు - కాని ఆళ్లంతా పేదవాళ్లు, దిక్కులేనివాళ్లు. వాళ్లంతా ‘వాళ్లు’ అధికారంలో వున్నవాళ్లు అంతా ‘మనం’ అనుకొని విడదీసి, ఎడంపెట్టి, వికారంగా వేరు పెట్టిన ‘వాళ్లు’. వాళ్ల గొంతుక ఖాదర్. - వెల్చేరు నారాయణరావు (1991 నాటి ‘పుట్టుమచ్చ’ ద్వితీయ ముద్రణ రేపు వస్తోంది. దానికిగానూ రాసిన ముందుమాట సంక్షిప్తంగా...) ఆగస్టు 10న ఖాదర్ మొహియుద్దీన్ ‘షష్టిపూర్తి’. -
హుజూరాబాద్ చిన్నారికి ప్రపంచ ఖ్యాతి
♦ అగ్రదేశం అమెరికాలో ప్రతిభ ♦ వింత మనుషులపై కవిత రాసిన సాత్విక అగ్రదేశం అమెరికాలోనూ హుజూరాబాద్‌కు చెందిన దివిటి సాత్విక ప్రతిభ చాటింది. అద్భుతమైన కవిత రచించి ప్రతిష్టాత్మక అమెరికా లైబ్రరీ బుక్‌లో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన దివిటి శ్రీనివాస్ పదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. భార్య జ్యోతిర్మయితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురే సాత్విక(12). అక్కడి కనెక్టికట్ రాష్ట్రం ఫార్మింగ్టన్ వెస్ట్‌వుడ్ అప్పర్ ఎలిమెంటరీ పాఠశాలలో సాత్విక 7వ గ్రేడ్ విద్యనభ్యసిస్తోంది. ఇదిలా ఉండగా తన కవితను ప్రచురించిన పుస్తకం త్వరలో వెలువడనుంది. -హుజూరాబాద్ కవిత్వంలో దిట్ట.. సాత్వికకు తన చిన్నతనం నుంచే కవితలు అల్లడంపై ఆసక్తి ఎక్కువ. 3వ గ్రేడ్ నుంచే విభిన్నమైన అంశాలపై వ్యాఖ్యలు రాస్తుండేది. పద్యాలు, కవితలు రాయడంలో నేర్పరి. తాజాగా ‘అమెరికా లైబ్రరీ ఆఫ్ పోయెట్రీ’ కాంపిటీషన్‌కు తన కవితను పంపించింది. వింత మనుషుల గురించి వర్ణిస్తూ రాసిన కవితను సదరు నిర్వాహకులు ఎంపిక చేసినట్లు రాతపూర్వక ప్రశంసాపత్రాన్ని పంపించారు. అంతేగాకుండా అమెరికా లైబ్రరీ బుక్‌లో కవితను ప్రచురించడంతోపాటు నగదుపారితోషికం, ఎడిటర్స్ ఛాయిస్ అవార్డు, ఇతరాత్ర బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. కవిత్వంతోపాటు పియానో, ఫ్లూట్, వయోలిన్ విద్య, కర్నాటక సంగీతం, స్విమ్మింగ్, ఐస్ స్కేటింగ్, టెన్నిస్‌లలో తనదైన ప్రతిభ చాటుతోంది. హుజూరాబాద్ వాసిగా అమెరికాలో అరుదైన ఘనత సాధించినందుకు పట్టణానికి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ ఇలాసాగరం సుమతశ్రీనివాస్, వారి స్నేహితులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. సాత్విక రచించిన కవిత తెలుగు అనువాదం.. అలాంటి వింత ప్రజలు నేను ఆ మార్గాన్ని ప్రేమిస్తున్నాను వారు ఎప్పుడు ఏమీ జరగనట్టు వ్యవహరిస్తుంటారు ఏమీ చేయనట్లు వారి వైఖరి ఉంటుంది వారు ఒక భయానక చలనచిత్రం వారు బాధిస్తారు, వారి చేష్టలు బాధపెడతాయి కాని మీరు ప్రతీక్షణం వారితో గడపాలనుకుంటారు మరుక్షణంలో వారిలో చిత్రమైన మార్పులు సంభవిస్తాయి వారు మనతో అపరిచితుల్లా వ్యవహరిస్తారు ఆ మరుక్షణం మనతో నవ్వుతారు,మనతో గుసగుసలాడుతారు ఇది విపరీత ధోరణి, ఇటువంటివారు మనల్ని అనేక విధాలుగా గాయపరుస్తారు నాకు వారి గురించి తెల్సుకోవడం ఎంతో ఆసక్తి వారు ప్రపంచాన్ని , తమను తమ అబద్దాలతో మోసగిస్తారు కావున నేను ఇటువంటివాళ్ల గురించి తెల్సుకోవడం వృధా అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా వాళ్లలో ఒకరిగా మారతాను కావచ్చు. నాకు వారి మీద ఎటువంటి భావాలు లేవు. నేను ఎవరినీ బాధపరచను నేను ఎప్పుడూ ఏడవను నేను ఇకముందు దిండు మధ్యలో నా ముఖం పెట్టి నా పసిబుగ్గలకు తడిని తాకనివ్వను. జంతువులు నా ప్రియనేస్తాలు కాదు అసత్యమనేది విలువలు మరియు, క్రమశిక్షణలపై పెత్తనం చెలాయిస్తూ నన్ను, నా ప్రపంచాన్ని శాసిస్తోంది. వీటన్నింటికి ఒకేసారి ముగింపు పలుకుతాను. -
నిన్న రాత్రి...
పద్యప్రభావం పొద్దున లేచింది మొదలు.. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాల వార్తలు... అవిశ్రాంతంగా వినిపిస్తుంటాయి. కోపం వస్తుంది. ఈ బక్కపలచటి శక్తి లేని కోపంతో ఏం చేయగలం? అనిపిస్తుంది. కన్నెర్ర చేయాలనిస్తుంది, కండ్లకలక అనుకుంటారేమోనని వెనక్కి తగ్గాలనిపిస్తుంది... ఇలా రాజీ పడుతూనే ఉంటాం. ఇక దేని గురించీ ఆలోచించవద్దు అనుకుంటాం. ఇలా ఆలోచించే ఒకడికి దేవుడు కనిపిస్తే ఏంచేస్తాడు? ఆ దేవుడి ముందు తన నిరసనను వెళ్లగక్కుతాడా? లేక మానవుడే దానవుడైన ఈ కలికాలంలో పాపం... దేవుడు మాత్రం ఏంచేస్తాడు? అనుకుంటాడా? బాలగంగాధర తిలక్ ‘నిన్నరాత్రి’ కవిత దగ్గరికి వెళ్లి చూసొద్దాం.. ఆకలి అని ఆశలు గొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి దేవుడిని అడిగానా? అమ్ముకొన్న యౌవనం, అలసిన జీవనం సంధ్యవేళ ఉరి పోసుకున్న సాని పడుచు మాట చెప్పానా? కాలి కమురు కంపుకొట్టే కాలం కథ, మానవ వ్యథ నే వివరించానా? దేవుడి కన్నీటిని తుడిచి, వెళ్లిరమ్మని వీధి చివరి దాకా సాగనంపి వచ్చాను. నాకు తెలుసు... నాకు తెలుసు మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు-కన్నకడుపు- ఏంచేస్తాడని! - యాకుబ్ పాషా -
జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా!
గ్రంథపు చెక్క గజల్ కేవలం ఒక గీతం కాదు. ధ్వనులతో అంతర్ధ్వనులతో పొరలు పొరలుగా అల్లుకుపోయిన కమనీయ కవిత గజల్. ముషాయిరాల్లో గజల్‌కు ప్రాధాన్యం హెచ్చు. అది తీగలా శ్రోతల హృదయాల పందిళ్లను దట్టంగా అల్లుకుని పుష్పించి, పరిమళించి పరవశింపజేస్తుంది. గజల్ అంటే ‘కలకంఠులతో సరస సల్లాపం’ అని అర్థం చెప్పవచ్చు. అరబ్బీ భాషలో దీనికి ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందమైన లేడిపిల్ల అరుపు, సున్నితమైన పూల నుండి దారం తీయడం... ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు. ప్రణయ సర్వస్వం-గజల్. ‘నీవున్న మేడ గదిలో నను చేరనీయ రేమో! జలతారు చీరకట్టి సిగపూలు ముడిచిరానా! యేడేడు సాగరాలు, యెన్నెన్నో పర్వతాలు యెంతెంత దూరమైన బ్రతుకంతా నడిచిరానా!’ ఇదో గజల్. ప్రియుడు ప్రేయసి కోసం పడే తపన గజల్‌కు ప్రాణం. బాల్యదశలో మహాకవి గాలిబ్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాను. అగాథమైన అతని కవిత అర్థం కావడానికి చాలా తపన పడాలి. ‘‘భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్మహలు మరువరాని అందాలు’’ అని ఒక మహానుభావుడు అన్నాడట. అది సత్యం. -డా.దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’ పుస్తకం నుంచి. -
కవిత
రసశిల ముకుళించిన మొగ్గని తాజా కుసుమంగా విప్పిన క్షణికం ఒక రహస్యదేవత చెలియలికట్టతో ఎడతెగక ముచ్చటలాడిన తరగ కోరిక ఒక తుమ్మెద ఒంటరి యాత్రికుడి ఏకాంతచింతలో వెలిగిన దీపజ్వాల ఒక చెలికత్తె కాలరాత్రిని పాలవెన్నెలగా మార్చిన చందమామ ఒక పరుసవేది పగటివేళ నక్షత్రాలని నిర్బంధించిన సూర్యుడు ఒక నియంత కన్నీటిచుక్కలో విరహరోదనం దాచిన హృదయం ఒక మధుపాత్ర ఏకాకివో జతగాడివో ప్రేమికుడిగా యవనిక దించిన జీవనరంగం ఒక ఉత్సవవేదిక కాలాగ్నికీలల్లో నిర్జీవదేహం దహనమయ్యాక మిగిలిన దోసిలి బూది ఒక తెల్లకలువ - నామాడి శ్రీధర్ 9396807070 -
ఉరి
కవిత పుస్తకాల్లోని పేజీలు కాగితపు పడవలై ఇంటి ముందు వర్షపునీటిలో వయ్యారంగా వెడుతుంటే ఎవరిది ముందనే పోటీ... చిలుక కొరికిన జామపళ్ల కోసం పోటీపడుతూ లేస్తూ రేగుముళ్లు వదిలిన సంతకాల్ని దాచిపెట్టే ప్రయత్నం... గుంకుతున్న సూరుణ్ణి కమ్మేసే ఆవుదూడల ధూళి వెంట అడుగులో అడుగు... దొంగతనంగా తెంపుకున్న మక్కకంకులు దాచి పెట్టుకున్న గడ్డివాముల్లో దాగుడుమూతలు... రాత్రివేళ లెక్కపెట్టిన చుక్కలు తెలియకుండానే నిద్రలో కొత్త లోకాలకు తెరచిన తలుపులు... ఈ జ్ఞాపకాలకు ఇక జ్ఞాపకాల్లో కూడా తావుండదట. ప్రాజెక్టు వస్తోందట. ఊళ్లో మిగిలిన మొండి గోడల్ని కూడా ముంచేస్తుందట. చెట్టూ పుట్టని కలిపేసుకుంటుందట. ఇంటినీ గుడినీ మింగేస్తుందట మట్టినీ మనిషినీ తెంచేస్తుందట అసలు- ఊరే ఉండదట. ఊరే లేకపోతే జ్ఞాపకాలు ఎలా ఉంటాయి? మనుషులు ఎలా ఉంటారు? మట్టికి మనిషికి అనుబంధం ఎలా ఉంటుంది? ఊరికి కాదు నాకు ఉరి వేసినట్టుగా ఉంది. గుండె పిండేసినట్టుగా ఉంది. ఊరే లేకపోతే నేను కూడా ఉన్నా లేనట్టే. - ఎస్.గోపినాథ్‌రెడ్డి 95055 55400 -
ఒంటరి
కవిత నేనిపుడే వస్తా ఒక మనిషిని కలిసి ఒంటరిననుకుంటున్న ఒక మనిషిని కలిసి పరమ ఏకాకితనంలో మునిగిపోయిన ఒక మనిషిని కలిసి ఇపుడే వస్తా. ‘కలిసి ఏం చేస్తావ్?’ నువ్వు అడుగుతావు ఏం చేయను, అలా చేయి పట్టుకు కూచుంటా- భుజం మీద చెయ్యేసి హత్తుకుంటా- మాటలు నిరర్థకమైనపుడు స్పర్శ మాట్లాడుతుందనుకుంటా. బహుశా అతనికి తెలియదు అతనెంత ఒంటరో నేనూ అంతేనని. అంత దూరం పోయి నన్ను నేను కలిసి వస్తానేమో - కె.శివారెడ్డి -
పున్నమిరాత్రి
హృదయము లోపలి రోదసి నీలినయనాల రాలిపడి కాన్స్పిరటోరియల్ కన్నుల వెన్నెల వెండి వెన్నెల పండు వెన్నెల నిండాతి నిండు వెన్నెల మోహజాలము వలదేహము ఏక్ ఐసా జిస్మ్ మేఘ మల్హరి శిలరంజని నీతోపాటు పరిచయమైన పాట అదియొక మర్మకవిత స్వప్నములు విసిరిసిరి జల్లుకో ఎనదర్ ఆన్ సెట్! కభీ కభీ ఐసాభీతో హోతాహై జిందగీమే! ఆకాశం వెండికొలను నిండు కలువ చంద్రవదన బంజారాహిల్స్ టు పంజగుట్ట రోడ్డు మీద శశిరేఖలు .ై. ఎల్.ఇ.డి రెడ్! ట్రాఫిక్ సిగ్నల్ రెఫ్లెక్టెడ్ ఆన్ హర్ బుగ్గల్స్ ఎర్రబుగ్గా పచ్చబుగ్గా ఆకుపచ్చ బుగ్గా (లేక సిగ్గా) అవుట్స్కర్టూ దాటుదాకా తోడురారా చందురూడా ఆఖిర్! మర్నేసే పెహెలే ప్రకాశించే దేహాలకు ఒక కౌగిలి వింత తడిసి మెరిసి విరిసి అలసి సొలసే పట్టణముల్ నగరాల్ హైవేల్ వీడి స్త్రీ పురుషుల్ చంద్రమావుల వెంట పడి పడి నువ్వంటె పా..డి..ప్పడి... - అరుణ్ సాగర్ -
బిడ్డ కోసం తల్లి వెతుకులాట- హాఫ్ మదర్
పట్టుకోగానే అరచేతికి రక్తపు మరకలు అంటించే నవల ‘హాఫ్ మదర్’. మనం గాయపడుతూ కశ్మీరీల గాయాలతో ఏకమవుతూ చివరి వరకూ వదలకుండా చదివించే కవితాత్మక వచనం షహనాజ్ బషీర్ మొదటి నవల ‘హాఫ్ మదర్’. అబద్ధాల మధ్యనా, అర్ధసత్యాల మధ్యనా, ఆల్ ఈజ్ వెల్ అనుకునేవాళ్లందరికీ ఈ నవల ఒక మేలుకొలుపు. భారతసైన్యం మాయం చేసిన ఒకానొక కొడుకు కోసం ఊరూవాడ వెతికిన ఒక కశ్మీరీ అమ్మ కథ ఇది. కశ్మీర్లో ఇలాంటి తల్లులు ఎందరో. కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంటారు కశ్మీర్లో. అలాగే భర్త ఆచూకీ తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది. కథ దగ్గరికొస్తే- ఆబ్జాన్, బోబా అందరిలాగే ఒక సాదాసీదా దంపతులు. వాళ్ల కూతురు హలీమా. కాని ఆ పిల్ల అచ్చటా ముచ్చటా తీరకుండానే బోబా క్షయవ్యాధితో మరణిస్తుంది. ఆబ్జాన్ మరో పెళ్లి చేసుకోకుండా హలీమాని చక్కగా పెంచుతాడు. ఉద్యోగంలో రిటైరైన తర్వాత కిరాణాకొట్టు పెట్టుకొని నిజాయితీగా నడుపుతుంటాడు. గనక ఆ దుకాణంలో జనం కిటకిటలాడుతుంటారు. హలీమాకి ఒక డాక్టరుతో పెళ్లవుతుంది. అయితే ఆ డాక్టరుకు ఒక నర్సుతో సంబంధం ఉందని గ్రహించి మూడో నెలలోనే విడాకులిస్తుంది. కాని అప్పటికే తను గర్భవతి. కొడుకు పుట్టాడు. వాడికి ఇమ్రాన్ అని పేరు పెట్టాడు తాత. తల్లి, కొడుకు, తాత... ఇది వారి కుటుంబం. లైబ్రరీలో పుంఖానుపుంఖాలుగా చదివే ఇమ్రాన్ టీచర్లని ప్రశ్నలతో వేధిస్తుంటాడు. ‘ఎప్పుడూ సింధూలోయ, హరప్పా నాగరికతల గురించేనా. మన నాగరికత గురించి చెప్పరా?’ అని అడిగితే టీచర్ నుంచి జవాబుకు బదులు చెవి మెలివేత దక్కింది. కాని తాత మాత్రం ‘మనకి మన సొంత అస్తిత్వం, చరిత్ర ఉన్నాయి. కాని వాటిని బయటకి రానీరు. మన గురించి మనం తెలుసుకోవడం కొందరికిష్టం లేదు’ అంటాడు. కథ ఇలా ఉండగా ఆ ఊరిపై భారత సైన్యం పడింది. తాతను ఇంట్లో నుంచి బయటికి లాగి ‘మిలిటెంట్లను ఎక్కడ దాచావో చెప్పు’ అని పిస్తోలు గురి పెట్టాడు అధికారి. ‘మానవత్వం లేని నీలాంటి మృగాలున్న చోట బతకడం కన్నా చావడం మేలు’ అని తాత అంటూ ఉండగానే గుండెల్లోనూ కడుపులోనూ గుళ్లు దిగబడ్డాయి. ఇరుగూ పొరుగూ రాబోతుంటే వాళ్లకూ తుపాకీతో బెదిరింపు ఇచ్చాడు అధికారి. తల్లి హలీమా, కొడుకు ఇమ్రాన్ జరిగిన సంఘటనతో కుదేలయ్యి దిగాలుగా బతుకుతుంటే అది చాలదన్నట్టు సైన్యం మళ్లీ ఇంటిమీదకొచ్చింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసింది. పదో తరగతి చదివే పిల్లవాడు. వాడేం పాపం చేశాడు? హలీమా వాళ్ల కాళ్లకు అడ్డం పడుతున్నా వినకుండా ‘ఇప్పుడే నాలుగైదు ప్రశ్నలడిగి పంపించేస్తాం’ అని తీసుకెళ్లారు. అంతే. ఇమ్రాన్ మళ్లీ కనిపించలేదు. ఇమ్రాన్ ఆచూకీ కోసం హలీమా రకరకాల మనుషుల్ని కలుస్తుంది. ప్రతి చోటా ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటుంది. అలాగే కశ్మీర్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకుంటుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కలిస్తే ‘నీ అందాన్ని వృధా చేస్తున్నావ్. మనిద్దరం కలిస్తే పిల్లవాణ్ణి ఒక్కరోజులో వెతకవచ్చు’ అంటాడు. తనలాంటి బాధితులతో పాటు ముఖ్యమంత్రిని కలిస్తే ‘వాళ్లు సరిహద్దును దాటేసి ఉంటారు. మేమెలా తీసుకురాగలం’ అని విసుక్కుంటాడు. కాని అతడనే మరో మాట అతడి పరిస్థితినీ తెలియచేస్తుంది. ‘నేనూ మీలాగే పిచ్చెత్తి పోతున్నాను. నా భార్య అమెరికాలో ఉంటోంది. నా కొడుకు మరో చోట. నా కూతుళ్లు వేర్వేరు చోట్ల. నేనూ మీలాగే ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయాను. మనందరం ఒకే స్థితిలో ఉన్నాం’ అంటాడు ముఖ్యమంత్రి. హలీమా ఇప్పుడు తన కొడుకు ఇమ్రాన్ కోసం పోరాడ్డం లేదు. కశ్మీర్లో మాయమైపోయిన వాళ్ల కోసం పోరాడుతోంది. అదే ఆమె జీవితంగా మారిపోయింది. ‘తల్లిపోయినవారి బంధుమిత్రుల సంఘాని’కి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఇందుకు బి.బి.సి విలేకరి, స్థానిక కశ్మీరీ అయిన ఇజర్లాంటి వాళ్లు మద్దతుగా నిలిచారు. చివరకు ఒక జడ్జి ఆధ్వర్యంలో మాయమైపోయినవారి విచారణ జరిగింది. ఆ రోజైనా ఇమ్రాన్ ఏమయ్యాడో తెలుస్తుందని ఆశ. కాని మిలటరీ అధికారి వచ్చి ‘నీ జీవితాంతం నేను చూసుకుంటాను. రెండు లక్షల దాకా డబ్బు కూడా ఇస్తాం’ అంటాడు. కొడుకు కోసం వెతికే తల్లికి ఇది ధూళితో సమానం. ‘నా కొడుకెక్కడా? వాణ్ణి తీసుకెళ్లిన మేజర్ నా బిడ్డని ఏం చేశాడు’ ఆమె కన్నీరు మున్నీరుగా అడుగుతుంది. ‘ఆ మేజర్ సరిహద్దుల్లో చచ్చిపోయాడు’ అని జవాబొస్తుంది. కొడుకు గురించిన సమాచారం ఇవ్వగలిగింది అతనొక్కడే. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. ‘నేనిలా ఓడి పోకూడదు. ఇంటికి పోయి ఎదురు చూస్తూ కూచోవాలి. అదొక్కటే నాకు దారి’ అనుకుంటుంది హలీమా. ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇజర్ ఆమెను చూడ్డానికి వెళితే ‘కలలు రాని నిద్ర పోవాలని ఉందయ్యా’ అంటుంది బాధగా. బహుశా, కశ్మీరీలకు మెలకువ, నిద్ర కూడా ఒక పీడకలగా మారిందని చెప్పడానికి ఇంతకు మించిన వాక్యం లేదు. ‘ఇమ్రాన్.. వచ్చావా నాయనా’ అన్నదే హలీమా ఆఖరి మాట. రోజులు గడిచాయి. ఒకప్పుడు పట్టుకెళ్లినవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన భవనం ఇప్పుడు విదేశీ టూరిస్టులకి అతిథి గృహమయింది. స్థానికులను తరలించి జీలం నది ఒడ్డును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం చేసే ఈ పనులు ఇజర్ వంటి వారిని ఆగ్రహోదగ్రులను చేయడం సహజం. ఈ నవలను చదువుతుంటే మహాశ్వేతాదేవి ‘ఒక తల్లి కథ’ కళ్ల ముందు కదలాడింది. హాఫ్ మదర్‌లో ఎన్నో సంఘటనలు మన కళ్లని తడిపేస్తాయి. కశ్మీర్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పకుండా చదవాలి. - కృష్ణాబాయి కొడుకు బతికున్నాడో లేదో తెలియక అల్లాడిపోయే తల్లిని ‘హాఫ్ మదర్’ అంఆరు కశ్మీర్లో. అలాగే భర్త ఆచూకి తెలియని భార్యని ‘హాఫ్ విడో’ అంటారు. గాయపడిన కశ్మీర్ సౌందర్యం గురించి బషరత్ పీర్ ‘కర్ఫ్యూడ్ నైట్స్’ చదివితే తెలుస్తుంది. ‘హాఫ్ మదర్’ చదివితే కన్నీరుబుకుతుంది. -
ఎంత కమ్మని పద్యమో!
అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలె నేయివోయ బగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం జనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై! పద్యానవనం తెలుగునాట పద్యాన్ని ఎంతో రమ్యంగా నడిపిన వారిలో నంది తిమ్మన ఒకరు. సాహితీ సమరాంగణ సార్వభౌముడని పేరు గడించిన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఆయనొకరు. అందమైన మహిళ ముక్కును సహజాతి సహజమైన సంపెంగ పూలతో పోలుస్తూ అత్యద్భుతంగా వర్ణించినందుకు ఆయన్ని ముక్కుతిమ్మన అని కూడా పిలిచేవారట. భాష మీద పట్టు, విలక్షణమైన శైలి కారణంగా విషయం అలవోకగా చదువరుల హృదయాలను తడుతూ, మెదళ్లను కదిలిస్తుంది. తిమ్మన ప్రబంధ యుగంలో కాకుండా ప్రబోధ యుగంలో ఉండి ఉంటే, తెలుగుజాతి మరింత ప్రయోజనం పొంది ఉండేదనిపిస్తుంది. కృష్ణ లీలల్లోని ఓ సందర్భాన్ని తీసుకొని ‘పారిజాతాపహరణం’ అనే రసవత్తర ప్రబంధ కావ్యాన్ని రాశారాయన. నారదుడిచ్చిన అరుదైన వేయిరెక్కల పారిజాత పుష్పాన్ని కృష్ణుడు పోయి పోయి రుక్మిణికిచ్చాడు. సత్యభామ లాంటి మరో భార్య ఉన్న భర్తగా కృష్ణుడు చేసే ఇంతకు మించిన తప్పిదమేముంటుంది వాతావరణం రచ్చ రచ్చ కావడానికి! అంతిమంగా అదే జరిగింది. ఇదీ సన్నివేశం. విషయం తెలియగానే దిగ్గున మంచం నుంచి లేచి సత్యభామ ఎలా స్పందించిందో చెబుతున్నాడీ పద్యంలో. మాటలు వినగానే, ఒంటిపై దెబ్బ పడగానే చర్రున లేచే ఆడపాములాగా సత్య లేచిందట! ఇంకొక పోలిక చూడండి, ఎంత పెద్ద పద సముచ్ఛయమో! ఇందులో ఇరవై అక్షరాలున్నాయి. ‘నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల’ అన్నట్లు లేచిందట! అగ్నిలో నేయి పోస్తే మంటలెలా ఎగుస్తాయి? భగ్గుమని, అలా జ్వాలలా ఎగిసిందని! లేచి ఏం చేసింది? గద్గద స్వరంతో ఏదో మాట్లాడింది. అది తర్వాతి పద్యంతో అన్వయం. ఏవో మాటలు చెబితే (పూర్వపు పద్యంతో అన్వయం) విని, ఎలా స్పందించింది అన్నదే ఈ పద్యంలో పేర్కొన్నాడు. బాధ, కోపం, ఆవేశం ముప్పిరిగొనగానే కళ్లల్లో ఎర్రజీరలొస్తాయి, సహజం. ఆ ఎరుపునకు మరో ఎరుపు తోడయింది. అలంకరణలో భాగంగా కొన్ని పూల, పత్రాల లేపనాలను చెంపలపై రంగరించుకుంటారు. అటువంటి కుంకుమ పత్రపు అలంకరణ చెడిపోయి అదోరకమైన ఎరుపు కాంతి జనించిందట. ఈ రెండు ఎరుపులు కలగలిసి ఓ నూతన కాంతి ఆవిష్కృతమైంది, వెదజల్ల బడింది. అదుగో ఆ దృశ్యం గోచరమౌతున్నపుడు దుఃఖం పొంగుకొస్తుంటే, ఆమె గద్గద స్వరంతో... రమ్యమైన పదాల వాడుక ఒక్కటే భాషకు అందం తీసుకురాదు. అదొక అంశం అంతే! ఇంగ్లీషులో ఫ్రేజ్ అని చెప్పే పదసముచ్ఛయాలు, సంక్లిష్ట పదాలు తెలుగు పద్య సాహిత్యంలో చాలానే ఉంటాయి. నన్నయ లాంటి వాళ్లు ‘నిజోజ్వలత్కవచుడు’ ‘శశ్వత్కుండలోద్భాసితుడు’ ‘జగత్కర్ణపూర్ణాలోలద్గుణుడు’ వంటి పదసముచ్ఛయాల్ని ఒక్క కర్ణుడిని వర్ణించడానికే వాడారు. ఇవి ఒక రకంగా టంగ్‌ట్విస్టర్స్. ‘రిపుమర్ధనదోర్దాముడు భీముడు శపథనిబద్ద గదాయుధుడు’ (23 అక్షరాలు) అని, భీముడిని వర్ణిస్తూ ఓ సినీగీతంలో శ్రీశ్రీ వాడారు. ఇటువంటి పదాలు చక్కని శబ్దాలంకారాలౌతాయి. భాషను సుసంపన్నం చేయడానికి శబ్దాలంకారాలకు తోడు అర్థాలంకారాలూ ముఖ్యమే! శబ్దం-అర్థం శివపార్వతుల్లా అవిభాజ్యమైనవి. ఇదే విషయాన్ని ‘వాగార్థా వివసంప్రక్షౌ వాగర్త ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!’ అని కాళిదాసు అత్యద్భుతంగా చెప్పారు. పార్వతీపరమేశ్వరౌ అన్న పదాన్ని ఉమాశంకరులు గానే కాకుండా ‘పార్వతీప’(పార్వతి పతియైన శివా!) ‘రమేశ్వర’ (లక్ష్మీ పతివైన కేశవా!) అని కూడా విడదీయవచ్చని భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గొప్పగా విడమర్చారు. అలా ఇంపైన పద్యాలతో అర్థ-శబ్ద రమ్యతను సాధించిన నంది తిమ్మన కీర్తి తెలుగునాట అజరామరమైనది. - దిలీప్‌రెడ్డి -
ఎదగనీ నవతరం చెట్టై, తల్లిభాషే తల్లివేరై !!
పద్యానవనం: చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి సందెతాయెతలును సరిమువ్వ గజ్టెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు! ఎప్పుడో చిన్నప్పటి పద్యం. ఇంకా గుర్తుందంటే, దాని బలం అలాంటిది. తరాల తరబడి ఈ పద్యం జనం నాలుకల మీద నాట్యమాడుతోందంటే ఏదో మంత్రశక్తి ఈ పద్యంలో దాగుంది. చాలా చిన్నపుడు మా అక్కలో, కానిగిబడి పంతులో... సర్కారు పంతులో... సరిగ్గా గర్తులేదు కానీ, ఎవరో నేర్పించారు. ఇంకా చాలా నేర్పించారు. అందులో కొన్ని గట్టిగా స్థిరపడిపోయాయి. కొన్ని కాలక్రమంలో ఎగిరిపోయాయి. ‘ఛుక్ ఛుక్ రైలూ వస్తుంది... అందరు పక్కకు జరగండి... ఆగీనాక ఎక్కండి.... జోజో పాపా ఏడవకు.... లడ్డూ మిఠాయి తినిపిస్తా....హోటల్ కాఫీ తాగిపిస్తా!’ అని కూడా నేర్పించారు. ఇది నాతో పాడించినపుడు, నాకెంత ఆనందమో! నేర్పించిన వాళ్ల ముఖాలూ వెలిగిపోయేవి. నాకన్నా ఎక్కువ ఆనందం నాకు నేర్పించిన వాళ్లకు కలిగిందని, నేను పెద్దయి పిల్లలకి నేర్పినపుడు అర్థమైంది. చిన్ని కృష్ణుడ్ని చేరి కొలిచే సంగతెలా ఉన్నా, చిన్న చిన్న పిల్లల్ని మాత్రం చాలా మందికి ఇటువంటి పాటలు, పద్యాలతో నే చేరువైన మాట మాత్రం నిజం. ‘పాటలు, పద్యాలు పాడుకుందాం రండి’ అని ఓ జనరల్ కాల్ ఇస్తే, కొందరొచ్చేవారు. ఇంకొందరు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దూరంగా ఉండి గమనించే వారు. చిన్న పిల్లల్ని మచ్ఛిక చేసుకొని ఒక్కో పదం పలికిస్తూ పాటలు, పద్యాలు పాడిస్తుంటే, అంతవరకు రామని మొరాయించిన వాళ్లు కూడ ఒక్కరొక్కరే వచ్చి చేరేది. వాళ్లలో వాళ్లకు పోటీ పెడితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఆ వాతావరణం! మాతృ భాష మాధుర్యమది. మెదడు వికసించే బాల్య దశలో తల్లి భాషలో చెప్పే అంశాలు బలంగా నాటుకొని జీవితకాలం పాటు వార్ని ప్రభావితం చేస్తాయి. ‘చందమామ రావే! జాబిల్లి రావే! కొండలెక్కి రావే! గోగుపూలు తేవే!’ అని కౌసల్య పాడుతూ గోరుముద్దలు తినిపిస్తుంటే, ముద్దలు మింగుతూ రాముడు కేరింతలు కొట్టేవాడని చదువుకున్నాం. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, రష్యా, జపాన్ ఇలా అభివృద్ధి చెందిన ఏ దేశం తీసుకున్నా... శైశవ దశలో వారికి విద్యా బోధన జరిపించేది మాతృభాషలోనే! ప్రతి ప్రగతికాముక దేశంలోనూ బాల్యంలో బలమైన, ప్రభావవంతమైన ముద్ర వేసేది తల్లి భాష, ఆ భాషలో చెప్పే తేలికపాటి విషయాలే అన్నది సశాస్త్రీయంగా దృవపడిన విషయం. తెలుసో? తెలియదో? చాలా మంది తెలిసీ తెలియనట్టు నటిస్తున్నారో? ఇంగ్లీషు చదువుల మోజులో పడి తెలుగుభాషను నిరాదరణకు గురి చేస్తున్నారు. ‘మా వాడికి తెలుగు ముక్క రాదు, తెలుసా!’ అని గర్వంగా చెప్పుకునే తలిదండ్రులున్నారు. ‘జానీ జానీ....? ఎస్ పప్పా! ఈటింగ్ షుగర్....? నో పప్పా! టెల్లింగ్ లైస్...? నో పప్పా! ఓపెన్ యువర్ మౌత్....? హ్హ హ్హ హ్హ!!’ చక్కటి ఇంగ్లీష్ రైమ్. అలతి అలతి పదాలవటం వల్లో, విషయపరంగా తండ్రీకొడుకుల నడుమ సాగే సున్నితమైన దోబూచులాట అవటం వల్లో... ఇంగ్లీషు భాష చలామణిలో ఉన్న ప్రతిచోటా ఇదొక హిట్! అలాంటి సాహితీ సృజన తెలుగులోనూ విరివిగా జరగాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి పిల్లల అభిరుచుల్ని పరిగణనలోకి తీసుకొని చిన్న చిన్న మాటలు, పదాలతో... పాటలు, పద్యాలు కోకొల్లలుగా పుట్టుకురావాలి. భాష కొంత గ్రాంథికమైనపుడు ‘చేతవెన్న ముద్ద....’ పుట్టి ఉంటుంది. తర్వాత్తర్వాత పిల్లల కోసం చక్కటి తెలుగు గేయాలు, పాటలు రాలేదని కాదు. ‘‘బాలు బాలు- పెద్ద బాలు, కాళ్లు లేవు చేతులు లేవు, పొట్టనిండ తిను ఎగురు దుంకు!’’ లాంటి తేలిక మాటల గేయాలు, పద్యాలు కూడా వచ్చాయి. ‘‘బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెడితివి? రాజుగారి తోటలోన తిరగ వెళ్తిని, రాజుగారి తోటలోన ఏమి చేస్తివి? తోటలోని మంచి పూల సొగసు చూస్తిని, సొగసు చూస్తే రాజు గారు ఊరకుండిరా? తోటమాలి కొట్టవస్తె తుర్రుమంటిని’’ లాంటి గేయాలు ఏ ఇంగ్లీషు రైమ్స్కి తీసిపోనివిగా పిల్లల్ని ఆకట్టుకున్నాయి. ఉద్యోగ-ఉపాధి అవకాశాల కోసం, విశ్వనరులుగా ఎదగడం కోసం పిల్లలకు ఇంగ్లీషు నేర్పండి, తప్పులేదు. మంచి విద్యావకాశాల కోసం ఇంగ్లీషు మాధ్యమంగానే కోర్సులు చదివించండి అభ్యంతరం లేదు. అదే సమయంలో, మేధో-వ్యక్తిత్వ వికాసానికి తల్లి భాషనూ నేర్పించండి. అంటే, విధిగా రాయడం, చదవటం వచ్చేలా చేసే ప్రక్రియ ఓ ఉద్యమంలా సాగాలి. అందుకు బాల్యమే మంచి సమయం. తల్లిదండ్రులారా కొంచెం చొరవ చూపండి. - దిలీప్‌రెడ్డి -
కార్ఖానలో దారుణం
మంటల బారినపడిన తల్లీ, ఇద్దరు కూతుళ్లు గాంధీ ఆస్పత్రికి తరలింపు ప్రమాదకరంగా ముగ్గురి పరిస్థితి భర్త నిర్లక్ష్యం చేయడం వల్లేనని భార్య వాంగ్మూలం రసూల్‌పురా: అనుమానాస్పదస్థితిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మంటల బారినపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ యజమాని దినేష్ కథనం ప్రకారం... కార్ఖాన ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో మామా జ్యుయెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కవిత(40), వైష్ణవి(18), భావన (16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9గంటల ప్రాంతంలో ముగ్గురికి ఒకేసారి మంటలు అంటుకున్నాయి. దినేష్ ఉంటున్న పైఅంతస్తులో అతని సోదరుడి కుటుంబం నివాసం ఉంటోంది. దినేష్ సోదరుని ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరుపులు, కేకలు విని కిందికి దిగివచ్చిన దినేష్ మంటలార్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని చేతులకు కూడా గాయాలయ్యాయి.ఈ ముగ్గురిని వెంటనే స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త నిర్లక్ష్యం వల్లే... భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని కవిత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపారు. తల్లి లేకుండా తాము బతకలేమని ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు యత్నించినట్టు కవిత పేర్కొన్నట్టు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అయితే ఇద్దరు పిల్లలు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పద్దెంపు సొగసులన్ పరమ పండితులెరుగు
సీసాల సౌందర్యమిరువురెరుగు విదుష బాంధవ వినుము వైనుతేయ! మధుభాండ మహిమలన్ మరువ తరమె? ‘మధు’రోక్తి ఒక మనిషి అసలు స్వభావం అతడు తాగి ఉన్నప్పుడే బయటపడుతుంది - చార్లీ చాప్లిన్, జగద్విఖ్యాత హాస్యనట సమ్రాట్ పద్యాల సొగసులను పండితులే మదింపు వేయగలరు. వారిని అటుల ఉండనిచ్చెదము. పద్యం తెలుగువారి జాతిసంపద. పద్యాలలో ఎన్నిరకాల ఛందో వైవిధ్యాలు ఉన్నా, సీస పద్యాల సౌందర్యమే వేరు. సీస పద్యరచనలో కవిసార్వభౌముడిది అందెవేసిన చెయ్యి. ఇక ‘ఈ యుగం నాది’ అని ఢంకా బజాయించిన మహాకవి కూడా సీసాల నైపుణ్యంలో సిద్ధహస్తుడే! కవిసార్వభౌముడికీ, తనకూ సీసాలంటే చాలా ఇష్టమని ఒకసారి సాక్షాత్తూ మన మహాకవే చమత్కరించారు. శ్రీనాథ కవిసార్వభౌముడు ‘బుడ్డి’మంతుడవునో కాదో తెలియదు గానీ, మహాకవి శ్రీశ్రీ మాత్రం చాలా ‘బుడ్డి’మంతుడు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేసిన ఖ్యాతి ‘బుడ్డి’మంతులదే. లోకంలో అంతా మంచినీళ్లు మాత్రమే తాగి బతికేసే వాళ్లయితే, చరిత్రలో ఇంతటి సాహితీ, కళా సృష్టి జరిగేదేనా..? ఇదో ‘గ్లాసి’కల్ డౌట్! క్లాసిక్స్‌ను ఆస్వాదించే ‘గ్లాసి’కల్ కళాపోషకుల కోసం ఈ వారం.. బాలే పంచ్ గోల్డెన్ రమ్ : 20 మి.లీ బ్రాందీ : 20 మి.లీ. విస్కీ : 20 మి.లీ. ఆరెంజ్ జ్యూస్ : 100 మి.లీ. సోడా : 100 మి.లీ. గార్నిష్ : చెర్రీ, నిమ్మచెక్క - వైన్‌తేయుడు -
పద్యమా, పది కాలాలు పదిలంగా విరాజిల్లు!
పద్యానవనం: అది రమణీయ పుష్పవనమా వనమందొక మేడ మేడపై నదియొక మారుమూల గది యా గది తల్పులు తీసిమెల్లగా పదునయిదేండ్ల యీడుగల బాలిక, పోలిక రాచపిల్ల, చంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది కిందకు మెట్లమీదుగాన్ ఇది పద్యమా! గద్యమా! అనిపిస్తుంది కదూ!! నిజమే. పేరుకు పద్యమే అయినా ఫక్తు వచనం లాగే ఉంటుంది. ఇలా చదివి చూడండి... అది రమణీయ పుష్పవనం, ఆ వనమందు ఒక మేడ, మేడ పైన ఆదొక మారుమూల గది, ఆ గది తల్పులు తీసి మెల్లగా పదునయిదేళ్ల ఈడుగల బాలిక, పోలిక రాచపిల్ల, చంకొదవెడు కాళ్లతోడ దిగుచున్నది కిందకు మెట్ల మీదుగా! ఇదేం పద్యం! ఇది కచ్చితంగా వచనమే కదా! ఇదీ పద్యమే! జాతి పద్యం. అదీ చంపకమాల. ప్రతి పద్యపాదంలో నగణం, జగణం, భగణం, జగణం, జగణం, జగణం, రగణం (న,జ,భ,జ,జ,జ,ర) వరుసగా వస్తాయి. పాదంలో 21 అక్షరాలుంటాయి. 11వ అక్షరంతో యతిమైత్రి ఉంటుంది. ప్రాసనియమం పాటించారు. సమర్థుడైన శిల్పి శిల్పం చెక్కే ప్రక్రియ చేపట్టగానే రాళ్లు మైనంముద్దలో, మంచుదిమ్మెలో, వెన్నరాశులో అయిపోతాయని చెబుతారు. అలాగే ప్రతిభావంతుడైన కవి పద్యం రాసేప్పుడు భాష ఆయన కోరుకున్న రీతిలో ఒదిగిపోతుందని విశ్లేషకులంటారు. దుర్వాస మహాముని ఇచ్చిన ఒక మంత్రవరాన్ని భోజరాజ పుత్రి కుంతి మననం చేసుకుంటున్న ప్రయత్నంలో కర్మసాక్షి సూర్యుడు ప్రత్యక్షమై అయాచిత వరం ప్రసాదిస్తాడు. ఆ వరప్రసాదమే కన్య కుంతికి పుత్ర యోగం. జగతి ఏమనుకుంటుందోనని జడిసిన ఆమె తరుణోపాయం దొరక్క పసికందును ఎక్కడైనా వదిలేద్దామని ఇంట్లోంచి బయటకొస్తున్న సందర్భానికి ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పద్యమిది. సర్ప పరిష్వంగాల వంటి ఛందో అలంకారాల మధ్య కవితను బందీగా చూశానంటాడు మహాకవి శ్రీశ్రీ. ‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదదో...’ అన్న ఆదికవి నన్నయ తొలి పద్యం నుంచి తీసుకున్నా అది అనేక మార్పులకు గురైంది. చాలా మంది అపోహ పడ్డట్టు పద్యమెప్పుడూ కఠినమనో, వచనమెప్పుడూ సరళమనో చెప్పడానికి లేదు. పద్య ప్రక్రియలోనూ సరళత, గాఢత చూపిన కవులున్నట్టే, వచన రచనల్లో కూడా పద కాఠిన్యాన్ని, భావ సంక్లిష్టతను ప్రదర్శించిన వారున్నారు. తమకు చేత కాకపోయినా పద్యం రాసి గొప్పవాళ్లం అనిపించుకోవాలనే తపనతో కుస్తీపట్టి, పాఠకులకు సుస్తీ తెప్పించిన ప్రయోక్తలూ ఉన్నారు. వీళ్లను చూసే కాబోలు, ‘గురువు లఘువు చేసి కుదియించి కుదియించి, లఘును గురువు చేసి లాగి లాగి, కవిని నేనటంచు ఖలుడెవ్వడన్నను...’ అంటూ తిట్టిపోశారు లాక్షణికులు గతంలోనే! భావ స్పష్టత, భాషపై సాధికారత ఉన్నపుడు ఛందస్సు ప్రతిబంధకం కాదనేది పద్య కవిత్వాన్ని ఇష్టపడే వారి బలమైన వాదన. పద్యం అజరామరమైందని ఆరాధించిన వారున్నారు. ఆధునిక వచన కవిత్వమనే దుడ్డుకర్రలతో పద్యం నడుములిరగ్గొడతామని హెచ్చరించిన వారూ ఉన్నారు. ఎవరి దారి వారిది! ఇంపైన భాష వాహకమై వ్యక్తీకరణ గొప్పగా ఉన్నపుడు అది పద్యమా, గద్యమా అన్న మీమాంస రసప్రియులకు ఉండనే ఉండదంటారు విమర్శకులు. భావం-భాష శివపార్వతుల్లా జతకట్టి ఓ రసఝరీ ప్రవాహమైనపుడు, ఆ పరవళ్లు తొక్కే నదికి పద్యం-గద్యం తటద్వయం లాంటివంటాడో లాక్షణికుడు. ఓ రైతు దయనీయ స్థితి గురించి చెబుతూ ‘...ఆయన చేలో పండిన పత్తి, సరిగ్గా ఉరితాడుకు సరిపోయింది’ అన్న వ్యక్తీకరణకు ఏ ఛందస్సు కావాలి? ఏం అలంకారం వాడాలి? ‘పాల సంద్రమందు పవ్వలించిన వాడు గొల్లలింటి పాలు కోరనేల? ఎదుటి వారి సొత్తు ఎల్లవారికి తీపి...’ అన్న వేమన తార్కిక వ్యక్తీకరణకు ఛందస్కెక్కడ ప్రతిబంధకమైంది? శతాబ్దాల తర్వాత కూడా ఆయన ఆటవెలదులు జనం నాలుకలపై సజీవ సవ్వడులవుతున్నాయంటే, అందుకు పద్య ప్రక్రియలోని శాశ్వతత్వపు లక్షణ ప్రభావం కూడా కారణమే! కట్టుబాట్ల నడుమ సాగినా... పొరుగునున్న కన్నడలో కొంచెం కొంచెం తప్ప, మరే ఇతర భాషలోనూ లేని విలక్షణమైన సాహితీ ప్రక్రియ పద్యం. పద్యం నిజంగా తెలుగు సాహితీ జగత్తు చేసుకున్న పుణ్య ఫలమేమో! పద్యమా విజయీభవ! తెలుగు పద్యమా దీర్ఘాయుష్మాన్‌భవ!! - దిలీప్‌రెడ్డి -
ఇగో టీ.. ఇనాం..
కార్మికులకు తెలంగాణ కానుక ఈ నెల వేతనాలతో ఇంక్రిమెంట్ బేసిక్‌పై 3 శాతం స్పెషల్ పేమెంట్ సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం కొత్తగూడెం(ఖమ్మం) : మూడు నెలలుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ఎట్టకేలకు యాజమాన్యం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం సింగరేణి డెరైక్టర్ (పా) టి.విజయ్‌కుమార్ సర్క్యులర్‌ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్పెషల్ ఇంక్రిమెంట్‌ను కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూఏ కార్మికులు, ఎగ్జిక్యూటివ్ ర్యాంకు కార్మికులకు 3 శాతం ఇంక్రిమెంట్ అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల వేతనాల తోపాటు ఈ ఇంక్రిమెంట్ అందనుంది. అయితే, ఇది పీఎఫ్, డీఏ, పెన్షన్లకు వర్తించదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీ కవితకు కృతజ్ఞతలు శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : తెలంగాణ ఇంక్రిమెంటుకు యాజమా న్యం అంగీకరించడంతో గుర్తింపు సంఘం నాయకులు.. యూని యన్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వ కుంట్ల కవితను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరా జు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, డాక్టర్ శం కర్నాయక్ ఎంపీని గురువారం కలిసి.. ఇంక్రిమెంటు విషయమై మాట్లాడినట్లు ఉపాధ్యక్షుడు ఏనుగు రవీం దర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఎంపీ వెంటనే సింగరేణి సీఎం డీతో చర్చించారని, అనంతరం ఉత్తర్వులు జారీ అయ్యా యని విలేకరులతో రవీందర్‌రెడ్డి చెప్పారు. సింగరేణిలో పని చేస్తున్న 62వేల మందికి ఈ ఇంక్రిమెంటు వర్తిస్తుం దని పేర్కొన్నారు. కాగా, ఈ ఇంక్రిమెంటుతో కంపెనీపై ప్రతీ నెల సుమారు రూ.5.31కోట్ల భారం పడనుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. యాజమాన్యం నిర్ణ యంతో కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ప్రశంసలు, పురస్కారాలకు... రచనా వ్యాసాంగం
మనసులోని ఆలోచనను, భావావేశాన్ని కాగితంపై పరిస్తే.. అదే కవిత్వం. మనసును ఉల్లాసపరిచే శక్తి కవిత్వానికి ఉంది. అలాగే పాట, పద్యం మనిషికి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న విలువైన ఆస్తులు. ఇవి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి, కార్యాచరణకు పురికొల్పుతాయి. కవిత్వం, పాట, పద్యం.. వీటికి పుట్టుక తప్ప చావు లేదు. అందుకే వీటి రచనను కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు కొదవ ఉండదు. మనదేశంలో ఎందరో రచయితలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో రచనా వ్యాసాంగం ద్వారా ఉపాధి పొందడంతోపాటు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. రచయితలకు అవకాశాలెన్నెన్నో... మన దేశంలో ప్రసార మాధ్యమాలు విస్తరిస్తుండడంతో ప్రస్తుతం గీత రచయితలకు అవకాశాలు పెరుగుతున్నాయి. సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ పాటలు తప్పనిసరిగా మారాయి. ప్రైవేట్ పాటల ఆల్బమ్‌లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో రచయితలకు డిమాండ్ విస్తృతమవుతోంది. ఇక కవిత్వం, పద్యాలు రాసేవారికి ఆకర్షణీయమైన వేతనంతోపాటు పత్రికలు, మేగజైన్లలో తమ పేరు చూసుకొనే అవకాశం దక్కుతోంది. పద్యాలు, కవితలను పుస్తకంగా ప్రచురిస్తే పబ్లిషర్స్ నుంచి రాయల్టీ లభిస్తుంది. ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ రచయితలుగా పనిచేసుకోవచ్చు. ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ తీరిక వేళల్లో రచనలు సాగిస్తూ.. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కవిత్వం, పద్యం, గీత రచయితలుగా మారాలనుకునేవారికి ప్రధానంగా ఊహాశక్తి, సృజనాత్మకత ఉండాలి. సమాజాన్ని కొత్తకోణంలో దర్శించే నేర్పు అవసరం. రచనకు కావాల్సిన వస్తువును చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి గ్రహించే నైపుణ్యం పెంపొందించుకోవాలి. సమకాలీన అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. వివిధ రంగాల పుస్తకాలను విస్తృతంగా చదివే అలవాటు చాలా ముఖ్యం. ఇతర భాషల్లో వస్తున్న రచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అర్హతలు: రచనా రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రత్యేకంగా ఫలానా విద్యార్హతలంటూ లేవు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రచనలు చేయొచ్చు. పెద్ద చదువులు చదవకపోయినా గొప్ప రచయితలుగా పేరుతెచ్చుకున్నవారెందరో ఉన్నారు. అయితే, ప్రతిభకు సాన పెట్టుకోవడానికి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ రైటింగ్‌లో భాగంగా పోయెట్రీ రైటింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ప్రొఫెషనల్ రైటర్స్‌గా మారాలనుకునేవారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరడం మంచిది. ఇప్పటికే వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఇందులో మెళకువలు తెలుసుకోవడానికి, రచనా శక్తిని పెంచుకోవడానికి పార్ట్‌టైమ్ కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: గీత రచయితలకు నెలతిరిగేసరికల్లా ఠంచనుగా వేతనం వచ్చే అవకాశం ఉండదు. తమను తాము మార్కెటింగ్ చేసుకొనే తెలివితేటలు ఉన్నవారు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో ప్రతిభావంతులకు అధిక వేతనాలు లభిస్తాయి. ఒక్కో పాటకు వేల రూపాయలు అందుకొనే గీత రచయితలు ఉన్నారు. ప్రతిభావంతులకు అభిమానుల ప్రశంసలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలు వరిస్తాయి. ఈ రంగంలో డబ్బు కంటే వృత్తిపరమైన సంతృప్తి అధికంగా లభిస్తుంది. క్రియేటివ్ రైటింగ్/పోయెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్సైట్: http://teluguuniversity.ac.in/ ఏ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in ఏ బ్రిటిష్ కౌన్సిల్ వెబ్సైట్: www.britishcouncil.in ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్-కర్ణాటక వెబ్సైట్: www.ciil.org అధ్యయనం, అనుశీలన ఉండాలి! శ్రీకవి, రచయిత కెరీర్ ఇతర రంగాల కంటే భిన్నమైంది. ఎందుకంటే ఇతర రంగాల్లో మౌఖిక పరీక్ష లేదా రాత పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఉద్యోగానికి, జీవితానికి భరోసా ఉంటుంది. కానీ రచయిత/కవికి అలాంటి పరిస్థితి ఉండదు. ప్రతి పాటా రాత పరీక్షే. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రతిబింబించేలా రాయాలి. పురాతన, ఆధునిక సాహిత్యం, భాషా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. భాష పట్ల ఆసక్తి, ఇష్టం పెంచుకోవాలి. విస్తృతమైన పద సంపదను సొంతం చేసుకోవాలి. సందర్భానుసారంగా వాటిని ఉపయోగించాలి. కవి ప్రధానంగా అధ్యయనం, అనుశీలన అనే ప్రాథమిక లక్షణాలను అలవర్చుకోవాలి. అధ్యయనం అంటే చదవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, అభ్యసించడం. కేవలం పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. అందులోని సారాన్ని గ్రహించాలి. పుస్తకాలతోపాటు మనుషుల్ని, మనస్తత్వాన్ని, వివిధ ప్రాంతాల్ని, భాషలను, ఆచారాలను, సంస్కృతులను తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. అనుశీలన అంటే నిత్యం పరిశీలించడం. సాధార ణ వ్యక్తులతో పోల్చితే కవికి ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. సమాజం పోకడను, విలువలను ప్రత్యేకంగా పరిశీలించాలి. రచనల్లో అవి ప్రతిబింబించాలి. కొత్తగా ఈ కెరీర్‌ను ఎంచుకునే వారికి అవకాశాలకు కొదవలేదు. భారతీయ సంప్రదాయ మూలాలు విస్మరించకుండా ఎప్పటికప్పుడు తమను తాము కొత్త రకంగా ఆవిష్కరించుకోవాలి. అప్పుడే ఈ కెరీర్లో సుస్థిరంగా కొనసాగుతారు.్ణ - చంద్రబోస్, ప్రముఖ సినీ గేయ రచయిత -
పద్యానవనం: చివరకు ఏం మిగుల్చుకుంటాం?
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిన్ బొందరే? వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనన్ గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా? స్వార్థానికీ, త్యాగానికీ నడుమ అంతరాన్నీ; లోభి గుణానికీ, దాన గుణానికి మధ్య వ్యత్యాసాన్నీ గొప్పగా చెప్పిన పద్యమిది. సమాధానాల వంటి ప్రశ్నలు ఆరు ఒక వైపూ, ప్రశ్నల వంటి సమాధానాలు రెండు మరోవైపూ ఉన్నాయి. కఠిన పదాలు దాదాపు లేవు. విషయం తేటతెల్లం. పదాల కూర్పు, పద్య పాదాల నడక అత్యద్భుతం. ఎంత మంది రాజులు కాలేదు? మహా మహా విశాలమైన రాజ్యాల్ని విస్తరించలేదు! సదరు సంపదతో వారి గర్వం తారాస్థాయికి చేరలేదు! మరి వారిప్పుడెక్కడున్నారు? అంటే, అలా ఉంటారా? ఉండటం సాధ్యమా? ఎవరి జీవితాలూ శాశ్వతం కాదని చెప్పడం. ‘జాతస్య మరణం ధృవం.’ పుట్టినవారల్లా మరణించాల్సిందే! చావు ఖాయం. మరలాంటప్పుడు... పోనీ, పోతే పోయారు, ఏమైనా తాము గడించిన సంపద కొంతలో కొంతయినా వెంట తీసుకెళ్లారా? అంటే, అదీ లేదు. పోయినవాళ్లంతా ఉత్తి చేతుల్తోనే వెళ్లారు. అందుకేనేమో, ఈ భూమ్మీద సువిశాలమైన రాజ్యాన్ని స్థాపించిన రారాజు అలెగ్జాండర్ ద గ్రేట్, తన మరణానంతరం చేతులు రెండూ పైన ఉండేలా పార్థివ శరీరాన్ని ఖననం చేయమని తన వారికి ముందే నిర్దేశించినట్టు చెబుతారు. భూమండలం చూట్టూతా రాజ్యాన్ని విస్తరించినా, చిల్లిగవ్వ వెంట తీసుకెళ్లకుండా ఉత్తి చేతులతోనే పెకైళ్లినట్టు లోకానికి తెలియజెప్పే సందేశమది. ఎలాగూ ఈ సంపద ఏదీ వెంట తీసుకెళ్లలేం గనుక, కనీసం మంచి పేరైనా సంపాదించాలి. అదే చివరకు మిగిలేది అంటుంటారు. లెక్కలేనంత మంది రాజులు, రారాజులు పుట్టి గిట్టారీ నేలమీద. కడకు వారికి కనీసం అటువంటి మంచి పేరైనా మిగలలేదన్నది ఆ అరడజను ప్రశ్నల సారం. మరోపక్క, అలా పేరు మిగుల్చుకొని పోయిన శిబి చక్రవర్తి, హరిశ్చంద్ర, దదీచ... తదితర ప్రముఖుల్ని గుర్తుచేస్తూ రెండు ప్రశ్నలు. కీర్తి కాంక్షతోనైనా కొందరు, సంతోషంగా ఎదుటివారి అవసరాల్ని తీర్చలేదా? అని అడుగుతాడు. ఆకలితో ఉన్న డేగ ఒక పావురాన్ని తరుముకు రావటం, తనను రక్షించమని ఆ పావురం శిబిని శరణు కోరడం మనకు తెలిసిన కథే! తన తొడను కోసి పావురమెత్తు మాంసాన్ని ఆహారంగా ఇచ్చి ఆకలి తీర్చడం ద్వారా డేగనూ, ప్రాణ రక్షణ చేసి పావురాన్నీ రెంటినీ కాపాడిన త్యాగపురుషుడు శిబి. అలాంటి ప్రముఖుల్ని, యుగాలు గడచినా మనం ఇప్పటికీ మరచిపోలేదు కదా! అంటాడు కవి. ఎంత గొప్ప పోలిక! మానవ జీవితపు లక్ష్యం-ఆదర్శం వంటి బరువైన పదాలు తెలియని సామాన్యుడైన సగటు మానవుడు, ఈ సూక్ష్మాన్ని గ్రహించినపుడు తనదైన భాషలో ‘‘... పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాం?’’ అంటాడు. అదీ, తనదైన వ్యక్తీకరణ. ఇక, ఇప్పుడు మళ్లీ చదవండి పై పద్యాన్ని. వీలయితే రెండు మార్లు చదవండి. యవ్వనంలో బలిష్టంగా ఉన్న ఓ గుఱ్ఱం లయబద్దమైన తూపుతో దౌడు తీస్తున్నట్టు సాగుతుందీ పద్యం. అది బమ్మెర పోతన గొప్పదనం. శ్రీమద్భాగవతం, వామనావతారంలోని ఈ సొగసరి/గడసరి పద్యంలో విషయం ఎంత లోతైనదో ఎత్తుగడా అంతే గొప్పగా ఉంటుంది. విషయం, భాష, అభివ్యక్తి... ముప్పిరిగొన్నట్టుంటాయి. ఆధునిక ‘కార్పొరేట్ గురు’లు చెప్పే టన్నులు, టన్నుల కిటుకులు ఈ పద్యంలో ఇమిడి ఉన్నాయి. ముఖ్యంగా ప్రసారమాధ్యమాలు, ఇతర కమ్యూనికేషన్ రంగంలోని వారికిది సిలబస్ లాంటి మంచి పాఠం. ఎంచుకున్న రంగమేదైనా, తనకున్న డిగ్రీ ఎటువంటిదైనా... 1) విషయ పరిజ్ఙానం (సబ్జెక్ట్ నాలెడ్జ్), 2) భాషపై పట్టు (ప్రొఫిషియెన్సీ ఆఫ్ లాంగ్వేజ్), 3) భావ ప్రసార ప్రావీణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్)... ఈ మూడూ ఉంటే ప్రపంచాన్ని దున్నేయొచ్చంటారు. ఇవి పుష్కలంగా ఉన్న బమ్మెర పోతన సాహిత్యం నేర్చుకోదగ్గ పాఠం అనడానికి ఈ పద్యం నిలువెత్తు నిదర్శనం. - దిలీప్‌రెడ్డి