నిన్న రాత్రి...
పద్యప్రభావం
పొద్దున లేచింది మొదలు.. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాల వార్తలు... అవిశ్రాంతంగా వినిపిస్తుంటాయి. కోపం వస్తుంది. ఈ బక్కపలచటి శక్తి లేని కోపంతో ఏం చేయగలం? అనిపిస్తుంది. కన్నెర్ర చేయాలనిస్తుంది, కండ్లకలక అనుకుంటారేమోనని వెనక్కి తగ్గాలనిపిస్తుంది... ఇలా రాజీ పడుతూనే ఉంటాం. ఇక దేని గురించీ ఆలోచించవద్దు అనుకుంటాం. ఇలా ఆలోచించే ఒకడికి దేవుడు కనిపిస్తే ఏంచేస్తాడు? ఆ దేవుడి ముందు తన నిరసనను వెళ్లగక్కుతాడా? లేక మానవుడే దానవుడైన ఈ కలికాలంలో పాపం...
దేవుడు మాత్రం ఏంచేస్తాడు? అనుకుంటాడా?
బాలగంగాధర తిలక్ ‘నిన్నరాత్రి’ కవిత దగ్గరికి వెళ్లి చూసొద్దాం.. ఆకలి అని ఆశలు గొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి దేవుడిని అడిగానా? అమ్ముకొన్న యౌవనం, అలసిన జీవనం సంధ్యవేళ ఉరి పోసుకున్న సాని పడుచు మాట చెప్పానా? కాలి కమురు కంపుకొట్టే కాలం కథ, మానవ వ్యథ నే వివరించానా?
దేవుడి కన్నీటిని తుడిచి, వెళ్లిరమ్మని వీధి చివరి దాకా సాగనంపి వచ్చాను. నాకు తెలుసు... నాకు తెలుసు మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు-కన్నకడుపు- ఏంచేస్తాడని!
- యాకుబ్ పాషా