ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్ లాండ్’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్. ఎలియట్ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరుల్లో ప్రచురితమైంది. డిసెంబరులో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్! నీకేం కావాలి?’’
‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’
బ్రిటిష్ గాథల్లో ‘హోలీ గ్రెయిల్’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్ కింగ్. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్ ఖండాన్ని కూడా ఎలియట్ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు.
అమెరికాలోని ‘బోస్టన్ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్‌లో స్థిరపడిన ఎలియట్ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్‌తో కలిసి ఇంగ్లండ్‌లోని కెంట్ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గత సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చి పోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చి పోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధాన విషయం’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి.
ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్‌ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతిని స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్‌కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ‘ఇది ప్రపంచాన్ని ప్రభా వితం చేయబోయే కవిత’ అని సరిగ్గానే గుర్తించాడు. ఏప్రిల్ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్‌ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్ లాండ్’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్‌స్పియర్, మిల్టన్, హెర్మన్ హెస్, బాదలేర్ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్. దాన్ని భావ సంగీతం అన్నాడు.
సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్. అన్నీ అవాస్తవికం. లండన్ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తు న్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడు స్తున్నారు. మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః
ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్‌ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ణి చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్ లాండ్’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్ ఎరిక్ షూమేకర్ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు.
ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి?
Comments
Please login to add a commentAdd a comment