English author
-
Sahitya Akademi Awards 2023: 24 మందికి సాహిత్య అకాడమీ పురస్కారాలు
న్యూఢిల్లీ: ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవలా రచయిత సంజీవ్‌సహా 25 మంది రచయితలు 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకుగాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపిందని సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. తొమ్మిది కవితా సంపుటాలు, ఆరు నవలలు, ఐదు చిన్న కథల సంపుటాలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డులు దక్కాయి. ముఝే పెహ్చానో నవలకుగాను సంజీవ్‌కు, రెకియమ్ ఇన్ రాగా జానకి పుస్తకానికిగాను నీలం సరణ్ గౌర్‌కు అవార్డు దక్కింది. టి.పతంజలి శా్రస్తి(తెలుగు), విజయ్ వర్మ(డోగ్రీ), వినోద్ జోషి(గుజరాతీ), బన్సూర్ బనిహరి(కశీ్మరీ), అరుణ్ రంజన్ మిశ్రా(సంస్కృతం) తదితరులు అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. -
నూరేళ్లుగా ఫలవంతం
ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రాధాన్యం కలిగిన కవితల్లో ఒకటని పేరొందిన ‘ద వేస్ట్ లాండ్’కు ఇది శతాబ్ది సంవత్సరం. టి.ఎస్. ఎలియట్ ఆంగ్లంలో రాసిన ఈ 434 పంక్తుల దీర్ఘ కవిత 1922 అక్టోబరు, నవంబరుల్లో ప్రచురితమైంది. డిసెంబరులో మొదటిసారి పుస్తక రూపంలో వచ్చింది. కవిత ఉల్లేఖనం(ఎపిగ్రాఫ్) గ్రీకు భాషలో ఇలా మొదలవుతుంది: ‘‘సిబిల్! నీకేం కావాలి?’’ ‘‘నాకు చచ్చిపోవాలని ఉంది.’’ బ్రిటిష్ గాథల్లో ‘హోలీ గ్రెయిల్’(పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తుడైన సుదీర్ఘ బ్రిటన్ రాజుల పరంపరలో చివరివాడు ఫిషర్ కింగ్. కానీ ఆయన కాలికి అయిన గాయం వల్ల నడవలేకపోతాడు, గుర్రం అధిరోహించలేకపోతాడు, తన విధులు నిర్వర్తించలేకపోతాడు. దానివల్ల ఆయన భూములు బంజరుగా మారిపోతాయి. దాన్ని ఆధునిక కాలానికి ప్రతీకగా చేస్తూ, మొదటి ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూల వల్ల లక్షలాది మందిని పోగొట్టుకున్న యూరప్ ఖండాన్ని కూడా ఎలియట్ ఒక ‘బంజరు నేల’గా చూశాడు. అక్కడ సూర్యుడు కఠినంగా ఉంటాడు. మోడువారిన చెట్లు ఏ నీడా ఇవ్వవు. చిమ్మెటలు ఏ పాటా పాడవు. జలధారలు ఎటూ పరుగులిడవు. అమెరికాలోని ‘బోస్టన్ బ్రాహ్మణ’ కుటుంబంలో జన్మించి, ఇంగ్లండ్‌లో స్థిరపడిన ఎలియట్ (1888–1965) ఈ కవిత రాయడానికి ముందు నెర్వస్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతి తీసుకొమ్మని చెప్పారు. పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి మూడు నెలల సెలవుపెట్టి, భార్య వివియన్‌తో కలిసి ఇంగ్లండ్‌లోని కెంట్ తీరానికి వెళ్లాడు. అయినా ఆలోచనలు సలపడం మానలేదు. ఇంటా, బయటా దుఃఖం వ్యాపించివుంది. సమాజం ముక్కలైంది. ఆధ్యాత్మిక దర్శిని లేదు. గత సాంస్కృతిక వైభవం లేదు. ప్రేమ, సాన్నిహిత్యం కేవలం భౌతికమైనవిగా మారిపోయాయి. శృంగారం కూడా అత్యాచారానికి దాదాపు సమానం. అంతకుముందు బతికి ఉన్నవాడు చచ్చి పోయాడు. ఇప్పుడు బతికి ఉన్నవాళ్లం నెమ్మదిగా చచ్చిపోతున్నాం. ‘‘పాశ్చాత్య సంస్కృతికి చచ్చి పోవలసిన సమయం వచ్చింది. దానికి చావు కావాలి. దానికి కొత్త బతుకు కావాలి. ఈ చావు బతుకుల మధ్య ఉన్న పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆవేదన ఎలియట్ కవితలో ప్రధాన విషయం’’ అంటారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి. ఐదు విభాగాలుగా ఉండే ఈ కవితకు తుదిరూపం ఇవ్వడానికి చాలాముందు నుంచే ఎలియట్ మనసులో దీనిగురించిన మథనం జరుగుతోంది. ఆధునిక కవిత్వానికి జీవం పోసినదిగా చెప్పే ఈ కవిత మీటర్‌ను పాటిస్తూనూ, అది లేకుండానూ సాగుతుంది. తొలిప్రతిని స్నేహితుడైన మరో కవి, సంపాదకుడు ఎజ్రా పౌండ్‌కు పంపగానే, చాలా మార్పులు చెబుతూనే, ‘ఇది ప్రపంచాన్ని ప్రభా వితం చేయబోయే కవిత’ అని సరిగ్గానే గుర్తించాడు. ఏప్రిల్ అత్యంత క్రూరమైన నెల, మృత నేల లైలాక్స్ను పూస్తోంది, స్మృతులనూ కోర్కెలనూ కలుపుతోంది... గతేడాది నీ ఉద్యానంలో నువ్వు నాటిన ఆ శవం మొలకెత్తడం మొదలైందా?... ‘ద వేస్ట్ లాండ్’ కవిత అస్పష్టంగా ఉంటుంది. తర్కాన్ని అతిక్రమిస్తుంది. సహజ ఆలోచనా విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా అనేక భాషల సాహిత్యాల్లోని వాక్యాలను యథాతథంగా ఉపయోగించాడు ఎలియట్. బైబిల్, బృహదారణ్యక ఉపనిషత్తు, బౌద్ధ సాహిత్యంతో పాటు హోమర్, సోఫోక్లిస్, డాంటే, షేక్స్పియర్, మిల్టన్, హెర్మన్ హెస్, బాదలేర్ లాంటి పదుల కొద్దీ కవుల పంక్తులు ఇందులో కనిపిస్తాయి. పాఠకుడు కూడా కవి అంత చదువరి కావాలని డిమాండ్ చేస్తుంది ఈ కవిత. కానీ ‘నిజమైన కవిత్వం అర్థం కాకముందే అనుభూతమవుతుంది’ అన్నాడు ఎలియట్. ఇది ఆయన కవితకు కూడా వర్తిస్తుందన్నట్టుగా, అర్థం చేసుకోవడం ఆపితే అర్థం అవుతుందన్నాడు ఐఏ రిచర్డ్స్. దాన్ని భావ సంగీతం అన్నాడు. సంధ్యవేళ పగుళ్లూ, రిపేర్లూ, పేలుళ్లూ! టవర్లు కూలుతున్నాయి. జెరూసలేం, ఏథెన్స్, అలెగ్జాండ్రియా, వియన్నా, లండన్. అన్నీ అవాస్తవికం. లండన్ బ్రిడ్జి మీద జనాలు ప్రవహిస్తు న్నారు. ఇందులో ఎంతమంది విడిపడి, వేరుపడిపోయారో! వాళ్ల పాదాల మీదే చూపు నిలిపి నడు స్తున్నారు. మృతజీవుల్లా సంచరిస్తున్నారు. లండన్ బ్రిడ్జి కూలిపోతోంది, కూలిపోతోంది. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... అన్నట్టూ, నీ పక్కన ప్రతిసారీ నడుస్తున్న ఆ మూడో మనిషి ఎవరు? నేను లెక్కపెట్టినప్పుడు కేవలం నువ్వు, నేను, పక్కపక్కన, కానీ నేను ముందటి తెల్లటి దోవకేసి చూసినప్పుడు, ఎప్పుడూ ఎవరో ఒకరు నీ పక్కన నడుస్తున్నారు. ద. ద. ద. దత్త. దయత్వం. దామ్యత. ఇవ్వడం. దయచూపడం. నియంత్రణ. శాంతిః శాంతిః శాంతిః ఎలియట్‌ను ఆధునికతకు ఆద్యుడని అంటారు. ఇది ఎలియట్ యుగం అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఆయన్ని 1948లో వరించింది. అయితే, విమర్శలు లేవని కాదు. ఎలియట్‌ను కవే కాదన్నవాళ్లు ఉన్నారు. ఆయన్ని దేవుణ్ణి చేసి పడేశారని విసుక్కున్నారు. ‘ద వేస్ట్ లాండ్’ను అతుకుల బొంత కవిత అన్నారు. గుప్పెడు కవిత్వానికి బారెడు వివరాలు అవసరమైన దీన్ని చదవడం దుర్భరం అని చెప్పే రాబర్ట్ ఎరిక్ షూమేకర్ లాంటి ఆధునిక విమర్శకులూ లేకపోలేదు. కానీ ఈ కవిత గురించి ఎవరో ఒకరు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. వందేళ్లుగా అది చదవాల్సిన కవితగానో, చదివి పక్కన పెట్టాల్సిన కవితగానో సాహిత్య ప్రియుల జాబితాలో ఉంటూనే ఉంది. కవి అనేవాడు తనను తాను ఆత్మార్పణం చేసుకుని, తాను అన్నవాడు లేకుండాపోయి రాయాలన్న ఎలియట్ స్ఫూర్తితో మాత్రం ఎవరికీ పెద్దగా విభేదం లేదు. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
రచయిత భాగ్యం
ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ ఒకసారి స్పెయిన్ చూడ్డానికి వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే తన పుస్తకాలకు రావలసిన రాయల్టీ అందజేయబడింది. అంత డబ్బును ఏకమొత్తంలో తమ దేశానికి తీసుకుపోవడానికి స్పానిష్ చట్టం ఒప్పుకోదు. ఆలోచించి మామ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. మాడ్రిడ్‌లోని అతి ఖరీదైన హోటల్లో బస చేశాడు. అక్కడున్నన్ని రోజులూ రాజభోగాలను అనుభవించాడు. చివరకు మొహం మొత్తింది. అప్పటివరకూ ఖర్చయినది చాల్లెమ్మనుకొని, హోటల్ మేనేజర్ దగ్గరకెళ్లి, ‘‘నేను గది ఖాళీ చేస్తున్నాను. బిల్లు వేయండి’’ అన్నాడు.అందుకా మేనేజర్ వినయాంజలి ఘటిస్తూ, ‘‘అయ్యా! తమవంటి గొప్పవారు మా హోటల్లో బస చేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మీరు మా హోటల్లో ఉన్నందువల్ల, మీ పేరు మీదుగా మా వ్యాపారం మామూలు కన్నా రెట్టింపైంది. మీరేమీ బిల్లు కట్టనవసరం లేదు.ఇకముందు మీరెప్పుడు స్పెయిన్ కొచ్చినా మా హోటల్లో ఉచితంగా బస చేయాలని కోరుకుంటున్నాం’’ అనేసరికి మామ్‌కు నోట మాట రాకపోయింది. అయినాల కనకరత్నాచారి -
అమితవ్ ఘోష్‌కు జ్ఞాన్‌పీఠ్
న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారం జ్ఞాన్‌పీఠ్‌ను ఈ ఏడాదికి ప్రముఖ ఆంగ్ల రచయిత అమితవ్ ఘోష్ గెలుచుకున్నారు. ‘వినూత్న రచనలకు పేరొందిన అమితవ్ చారిత్రక విషయాలతో పాటు ఆధునిక యుగంలోని పరిస్థితుల్ని స్పృశించారు. గతాన్ని వర్తమానంతో అనుసంధానించారు’ అని జ్ఞాన్‌పీఠ్ అకాడమీ కొనియాడింది. ప్రముఖ సమకాలీన భారతీయ రచయితల్లో ఒకరైన అమితవ్‌కు షాడో లైన్స్, ది గ్లాస్ ప్యాలెస్, ది హంగ్రీ టైడ్ నవలలు మంచి పేరు తెచ్చాయి. బ్రిటిష్ పాలనలో భారత్, చైనాల మధ్య జరిగిన నల్లమందు వ్యాపార కాలక్రమాన్ని వివరిస్తూ సీ ఆఫ్ పాపీస్, రివర్ ఆఫ్ స్మోక్, ఫ్లడ్ ఆఫ్ ఫైర్ పేరిట వరుసగా మూడు నవలలు రాశారు. జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమితవ్ అన్నారు. 1956లో కోల్‌కతాలో జన్మించిన అమితవ్.. ఢిల్లీ, ఆక్స్ఫర్డ్, అలెగ్జాండ్రియాలో చదివారు. ఆయన చివరగా రాసిన పుస్తకం ‘ ది గ్రేట్ డిరేంజ్‌మెంట్: క్లైమేట్ చేంజ్ అండ్ అన్‌తింకబుల్’ 2016లో విడుదలైంది. గతంలో అమితవ్‌కు పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. -
విద్య ఉంది.. ఓపికుంది...ప్రోత్సాహం కరవైంది!
‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. యావజ్జీవితం ఆనందించగల జీవన విధానాన్ని సృష్టించుకో. నీలోని అవకాశాల మెరుపులను శాయశక్తులా విజయ జ్వాలలుగా మార్చుకో’’ అంటాడు ఓ ఆంగ్ల రచయిత. ఈ పల్లెటూరి వ్యక్తికి అంత పెద్ద పదాలు తెలియవు. కానీ అంతకు మించిన పట్టుదల ఉంది. సంకల్ప బలం ఉంది. అంగ వైకల్యం వెక్కిరించినా ధిక్కరించే ఆత్మవిశ్వాసం ఉంది. అవన్నీ ఉన్నాయి కాబట్టే ‘సత్తా ఉంటే నువ్వూ ఈత కొట్టు’... అంటూ ఎవరో చేసిన సవాలును సురభి కోటయ్య సీరియస్‌గా తీసుకున్నాడు. పెరుగుతున్న వయసుతో పాటు పాతాళ బావుల్ని అణువణువూ శోధన సాగించాడు. జలయోగ విద్య అభ్యసించాడు. ఇప్పుడు గంటల తరబడి నీటిపై తేలడంలో నిష్ణాతుడయ్యాడు. వెక్కిరించినవాళ్లను విస్తుపోయేలా చేసిన ఈ సామాన్యుడు ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించాలని పరితపిస్తున్నాడు. తన విద్యను ప్రపంచవేదికపై ప్రదర్శించేందుకు అవసరమైన ప్రభుత్వ ప్రోత్సాహం, దాతల ఆసరా కరవయ్యాయి! అది వరంగల్ జిల్లా మానుకోటలోని మహర్షి విద్యాలయం. అందులో ఓ నీటికొలను. దాని చుట్టూ జనం. నీటిపై ఓ వ్యక్తి తేలుతున్నాడు. నిశ్చలంగా యోగముద్రలో ఉన్నాడు. గంటలు గడిచిపోతున్నాయి. అంతా కన్నార్పకుండా చూస్తున్నారు. సాయంత్రం 7 గంటలైంది. పది గంటలపాటు సాగిన జలయోగ విన్యాసం ముగిసింది. కరతాళ ధ్వనుల మధ్య ఆ వ్యక్తి బయటికొచ్చాడు. ఆ జలయోధుడి పేరు - సురభి కోటయ్య. వైకల్యాన్ని ధిక్కరించిన సంకల్పం ఈతకు కాళ్లు, చేతులతోనే పనెక్కువ. కానీ వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన కోటయ్య సంకల్ప బలం అంతకన్నా ఎక్కువ. అందుకే ఆయన లక్ష్యం ముందు అవయవ లోపం చిన్నబోయింది. పోలియో వైకల్యం వెంటాడుతున్నా ఈతలో ఘనపాఠిని చేసింది. కోటయ్య కథ వింటే కరిగిపోనివారు ఉండరు. పేద కుటుంబం కావడంతో చిన్నప్పుడు కోటయ్య చదువు సాగలేదు. దీంతో పదకొండేళ్ల ప్రాయం నుంచే గొడ్లు కాసేవాడు. అప్పుడే గ్రామంలోని బావులు, చెరువుల్లో ఈత నేర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మలికంటి మల్లయ్య బావిలో యోగాభ్యాసం చేయడం కోటయ్యను ఆకర్షించింది. ఆయన వద్దే యోగా నేర్చుకున్నాడు. ఎన్ని గంటలైనా నీటిలో నిశ్చలంగా తేలడంలో నిపుణుడయ్యాడు. సన్నిహితుల సూచనలతో ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికి దాదాపు పదేళ్ళ పైచిలుకుగా అది అతని కల. దాన్ని నెరవేర్చుకోవడానికి అతను పడని కష్టం లేదు. గతంలో మన భారతీయులు కొందరు 24 గంటలు, 54 గంటల పైగా నీటిలో తేలి రికార్డు సాధించారని తెలుసుకున్న కోటయ్య వందగంటల పాటు నీటిలో తేలియాడి, గిన్నిస్ రికార్డు సాధించాలని నిర్ణయించుకున్నాడు. బావుల్లో సాధన ప్రారంభించాడు. కానీ చేపలు, కప్పలు కొరికి గాయపరచడంతో అతని ఏకాగ్రతకు భంగం కలిగేది. మానుకోటలోని మహర్షి విద్యాలయంలో ఈతకొలను ఉంది. అందులో సాధన చేసుకునేందుకు సహకరించమంటూ ఆ యాజమాన్యానికి కోటయ్య విజ్ఞప్తి చేశాడు. అతని అభ్యర్థనకు యాజమాన్యం అంగీకరించింది. అక్కడ కొద్ది రోజులు సాధన చేశాడు. ‘‘బాయిలు, చెర్వుల్లో 20 గంటలు తేలిన. ఏం కాలె. కష్టమనిపిస్తలె. పదిహేను గంటలు బువ్వ తినకుంటె.. నీర్సం అనిపిస్తలె. రోజంత నీట్ల పండుకున్నా.. కిటుకులు బాగ నేర్సిన’’ అని కోటయ్య చెప్పాడు. ప్రపంచ రికార్డుకు రిహార్సల్‌గా పదిగంటల జల విన్యాసంతో అతను వార్తల్లోకెక్కాడు. వంద గంటల ప్రపంచ రికార్డు లక్ష్యానికి అదే ఊపిరి పోసింది. మాట నిలబెట్టుకోని నేతలు కానీ, సొంతంగా ఈత కొలను లేకపోవడం, ఆర్థిక స్థోమత అంతంతమాత్రం కావడం కోటయ్య లక్ష్య సాధనకు ప్రతిబంధకాలయ్యాయి. సినీ సంగీత దర్శకుడు చక్రి పెద్దమనసుతో స్పందించి రూ. 10 వేల విరాళం ఇచ్చారు. ఆ మొత్తంతో కోటయ్య స్వగ్రామంలో కొంత స్థలం కొనుగోలు చేశాడు. స్థలం సమకూరింది సరే... ఈత కొలను నిర్మాణానికి డబ్బులెలా? ‘‘ఈతకొలనుకు మస్తుగా పైసల్ గావాలె. ఎమ్మెల్యేల్ని కలిసిన... మంత్రుల్ని కలిసిన. అంతా నా ఫొటోలు చూసెటోల్లు. మంచిగుందనేటోల్లు. పైసలిప్పిస్తమనేటోల్లు. కానీ యాది మరిసేటోల్లు. అప్పులు చేసి హైద్రబాద్ వచ్చిన. ఎన్నిసార్లు వచ్చానో నాకే తెల్వదు. పైసల్ మస్తుగ ఖర్చయినై. ఆ పైసల్ కర్సు సేస్తే ఈతకొలను ఎప్పుడో వచ్చుండేది’’ అని కోటయ్య వాపోయాడు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు ఆడపిల్లలు, భార్యతో సహా హైదరాబాద్‌కి తరలివచ్చి ఎల్.బి. నగర్లో నివసిస్తున్నాడు కోటయ్య. సికింద్రాబాద్‌లోని అమృతవాణి భవనంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వెహైచ్‌ఏఐ) కార్యాలయం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘యాభై రెండేళ్ల వయసులోనూ కోటయ్య ఉత్సాహంగా పనిచేస్తాడు. ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏదో ఒక రోజు లక్ష్యాన్ని సాధిస్తాడ’’న్నారు యూత్ హాస్టల్స్ నిర్వాహకులు గిరీశ్ రెడ్డి, ప్రభాకరరెడ్డి. ఈదగల సామర్థ్యమున్నా ఈతలో ఇంకా రికార్డు సాధించలేదన్న బాధ కోటయ్యను ఇప్పటికీ తొలిచేస్తోంది. ‘హైదరాబాద్ వచ్చేశావు కదా... ఈతలో రికార్డు సాధన లక్ష్యానికి దూరమైనట్టేనా?’.. అని కోటయ్యను ప్రశ్నిస్తే, ‘‘నేనెపుడూ కాలీగా ఉండ. టైమ్ దొర్కితే... మా ఊరెల్త. పోరగాండ్లకు జలయోగ విద్య నేర్పిస్తుంట. గిప్పుడు గాకున్న... ఎప్పటికైనా రికార్డు గొట్టి సూపిస్త సారూ’’ అంటూ ఆత్మవిశ్వాసం కలగలసిన సమాధానమిచ్చాడు. కోటయ్య పొరుగూరికి చెందిన ఉపేందర్ కూడా ‘కోటయ్య ఊరి ఇజ్జత్ నిలబెడ్తడు. దునియాలో మంచి పేరు తెస్తడు’ అని ధీమా వ్యక్తం చేశాడు. నెపోలియన్ అన్నట్టు ‘అసాధ్యం అన్నది అసమర్థుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం’. - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు),సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం