విద్య ఉంది.. ఓపికుంది...ప్రోత్సాహం కరవైంది! | Is the promotion of education ... Produced by .. patience! | Sakshi
Sakshi News home page

విద్య ఉంది.. ఓపికుంది...ప్రోత్సాహం కరవైంది!

Published Thu, Apr 24 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

విద్య ఉంది.. ఓపికుంది...ప్రోత్సాహం కరవైంది!

విద్య ఉంది.. ఓపికుంది...ప్రోత్సాహం కరవైంది!

‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. యావజ్జీవితం ఆనందించగల జీవన
 విధానాన్ని సృష్టించుకో. నీలోని అవకాశాల మెరుపులను శాయశక్తులా
 విజయ జ్వాలలుగా మార్చుకో’’ అంటాడు ఓ ఆంగ్ల రచయిత.     
 ఈ పల్లెటూరి వ్యక్తికి అంత పెద్ద పదాలు తెలియవు.
 కానీ అంతకు మించిన పట్టుదల ఉంది. సంకల్ప బలం ఉంది.  అంగ వైకల్యం వెక్కిరించినా ధిక్కరించే ఆత్మవిశ్వాసం ఉంది. అవన్నీ ఉన్నాయి కాబట్టే ‘సత్తా ఉంటే నువ్వూ ఈత కొట్టు’... అంటూ ఎవరో చేసిన సవాలును సురభి కోటయ్య
 సీరియస్‌గా తీసుకున్నాడు. పెరుగుతున్న వయసుతో పాటు పాతాళ బావుల్ని అణువణువూ శోధన సాగించాడు. జలయోగ విద్య అభ్యసించాడు. ఇప్పుడు గంటల తరబడి నీటిపై తేలడంలో నిష్ణాతుడయ్యాడు. వెక్కిరించినవాళ్లను విస్తుపోయేలా చేసిన ఈ సామాన్యుడు ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించాలని పరితపిస్తున్నాడు. తన విద్యను ప్రపంచవేదికపై ప్రదర్శించేందుకు అవసరమైన
 ప్రభుత్వ ప్రోత్సాహం, దాతల ఆసరా కరవయ్యాయి!

 
అది వరంగల్ జిల్లా మానుకోటలోని మహర్షి విద్యాలయం. అందులో ఓ నీటికొలను. దాని చుట్టూ జనం. నీటిపై ఓ వ్యక్తి తేలుతున్నాడు. నిశ్చలంగా యోగముద్రలో ఉన్నాడు. గంటలు గడిచిపోతున్నాయి. అంతా కన్నార్పకుండా చూస్తున్నారు. సాయంత్రం 7 గంటలైంది. పది గంటలపాటు సాగిన జలయోగ విన్యాసం ముగిసింది. కరతాళ ధ్వనుల మధ్య ఆ వ్యక్తి బయటికొచ్చాడు. ఆ జలయోధుడి పేరు - సురభి కోటయ్య.
 
వైకల్యాన్ని ధిక్కరించిన సంకల్పం
 
ఈతకు కాళ్లు, చేతులతోనే పనెక్కువ. కానీ వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లికి చెందిన కోటయ్య సంకల్ప బలం అంతకన్నా ఎక్కువ. అందుకే ఆయన లక్ష్యం ముందు అవయవ లోపం చిన్నబోయింది. పోలియో వైకల్యం వెంటాడుతున్నా ఈతలో ఘనపాఠిని చేసింది.
 
కోటయ్య కథ వింటే కరిగిపోనివారు ఉండరు. పేద కుటుంబం కావడంతో చిన్నప్పుడు కోటయ్య చదువు సాగలేదు. దీంతో పదకొండేళ్ల ప్రాయం నుంచే గొడ్లు కాసేవాడు. అప్పుడే గ్రామంలోని బావులు, చెరువుల్లో ఈత నేర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మలికంటి మల్లయ్య బావిలో యోగాభ్యాసం చేయడం కోటయ్యను ఆకర్షించింది. ఆయన వద్దే యోగా నేర్చుకున్నాడు. ఎన్ని గంటలైనా నీటిలో నిశ్చలంగా తేలడంలో నిపుణుడయ్యాడు. సన్నిహితుల సూచనలతో ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికి దాదాపు పదేళ్ళ పైచిలుకుగా అది అతని కల. దాన్ని నెరవేర్చుకోవడానికి అతను పడని కష్టం లేదు.
 
గతంలో మన భారతీయులు కొందరు 24 గంటలు, 54 గంటల పైగా నీటిలో తేలి రికార్డు సాధించారని తెలుసుకున్న కోటయ్య వందగంటల పాటు నీటిలో తేలియాడి, గిన్నిస్ రికార్డు సాధించాలని నిర్ణయించుకున్నాడు. బావుల్లో సాధన ప్రారంభించాడు. కానీ చేపలు, కప్పలు కొరికి గాయపరచడంతో అతని ఏకాగ్రతకు భంగం కలిగేది. మానుకోటలోని మహర్షి విద్యాలయంలో ఈతకొలను ఉంది. అందులో సాధన చేసుకునేందుకు సహకరించమంటూ ఆ యాజమాన్యానికి కోటయ్య విజ్ఞప్తి చేశాడు. అతని అభ్యర్థనకు యాజమాన్యం అంగీకరించింది. అక్కడ కొద్ది రోజులు సాధన చేశాడు. ‘‘బాయిలు, చెర్వుల్లో 20 గంటలు తేలిన. ఏం కాలె. కష్టమనిపిస్తలె. పదిహేను గంటలు బువ్వ తినకుంటె.. నీర్సం అనిపిస్తలె. రోజంత నీట్ల పండుకున్నా.. కిటుకులు బాగ నేర్సిన’’ అని కోటయ్య చెప్పాడు. ప్రపంచ రికార్డుకు రిహార్సల్‌గా పదిగంటల జల విన్యాసంతో అతను వార్తల్లోకెక్కాడు. వంద గంటల ప్రపంచ రికార్డు లక్ష్యానికి అదే ఊపిరి పోసింది.
 
మాట నిలబెట్టుకోని నేతలు
 
కానీ, సొంతంగా ఈత కొలను లేకపోవడం, ఆర్థిక స్థోమత అంతంతమాత్రం కావడం కోటయ్య లక్ష్య సాధనకు ప్రతిబంధకాలయ్యాయి. సినీ సంగీత దర్శకుడు చక్రి పెద్దమనసుతో స్పందించి రూ. 10 వేల విరాళం ఇచ్చారు. ఆ మొత్తంతో కోటయ్య స్వగ్రామంలో కొంత స్థలం కొనుగోలు చేశాడు. స్థలం సమకూరింది సరే... ఈత కొలను నిర్మాణానికి డబ్బులెలా?

 ‘‘ఈతకొలనుకు మస్తుగా పైసల్ గావాలె. ఎమ్మెల్యేల్ని కలిసిన... మంత్రుల్ని కలిసిన. అంతా నా ఫొటోలు చూసెటోల్లు. మంచిగుందనేటోల్లు. పైసలిప్పిస్తమనేటోల్లు. కానీ యాది మరిసేటోల్లు. అప్పులు చేసి హైద్రబాద్ వచ్చిన. ఎన్నిసార్లు వచ్చానో నాకే తెల్వదు. పైసల్ మస్తుగ ఖర్చయినై. ఆ పైసల్ కర్సు సేస్తే ఈతకొలను ఎప్పుడో వచ్చుండేది’’ అని కోటయ్య వాపోయాడు.
 
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
 
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరు ఆడపిల్లలు, భార్యతో సహా హైదరాబాద్‌కి తరలివచ్చి ఎల్.బి. నగర్‌లో నివసిస్తున్నాడు కోటయ్య. సికింద్రాబాద్‌లోని అమృతవాణి భవనంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వెహైచ్‌ఏఐ) కార్యాలయం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘యాభై రెండేళ్ల వయసులోనూ కోటయ్య ఉత్సాహంగా పనిచేస్తాడు. ఆయన పట్టుదల, ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏదో ఒక రోజు లక్ష్యాన్ని సాధిస్తాడ’’న్నారు యూత్ హాస్టల్స్ నిర్వాహకులు గిరీశ్ రెడ్డి, ప్రభాకరరెడ్డి.
 
ఈదగల సామర్థ్యమున్నా ఈతలో ఇంకా రికార్డు సాధించలేదన్న బాధ కోటయ్యను ఇప్పటికీ తొలిచేస్తోంది. ‘హైదరాబాద్ వచ్చేశావు కదా... ఈతలో రికార్డు సాధన లక్ష్యానికి దూరమైనట్టేనా?’.. అని కోటయ్యను ప్రశ్నిస్తే, ‘‘నేనెపుడూ కాలీగా ఉండ. టైమ్ దొర్కితే... మా ఊరెల్త. పోరగాండ్లకు జలయోగ విద్య నేర్పిస్తుంట.  గిప్పుడు గాకున్న... ఎప్పటికైనా రికార్డు గొట్టి సూపిస్త సారూ’’ అంటూ ఆత్మవిశ్వాసం కలగలసిన సమాధానమిచ్చాడు. కోటయ్య పొరుగూరికి చెందిన ఉపేందర్ కూడా ‘కోటయ్య ఊరి ఇజ్జత్ నిలబెడ్తడు. దునియాలో మంచి పేరు తెస్తడు’ అని ధీమా వ్యక్తం చేశాడు. నెపోలియన్ అన్నట్టు ‘అసాధ్యం అన్నది అసమర్థుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం’.      
 
- ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు),సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement