ప్రశంసలు, పురస్కారాలకు... రచనా వ్యాసాంగం
మనసులోని ఆలోచనను, భావావేశాన్ని కాగితంపై పరిస్తే.. అదే కవిత్వం. మనసును ఉల్లాసపరిచే శక్తి కవిత్వానికి ఉంది. అలాగే పాట, పద్యం మనిషికి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న విలువైన ఆస్తులు. ఇవి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి, కార్యాచరణకు పురికొల్పుతాయి. కవిత్వం, పాట, పద్యం.. వీటికి పుట్టుక తప్ప చావు లేదు. అందుకే వీటి రచనను కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు కొదవ ఉండదు. మనదేశంలో ఎందరో రచయితలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేటి సమాచార సాంకేతిక యుగంలో రచనా వ్యాసాంగం ద్వారా ఉపాధి పొందడంతోపాటు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు.
రచయితలకు అవకాశాలెన్నెన్నో...
మన దేశంలో ప్రసార మాధ్యమాలు విస్తరిస్తుండడంతో ప్రస్తుతం గీత రచయితలకు అవకాశాలు పెరుగుతున్నాయి. సినిమాలతోపాటు టీవీ సీరియళ్లలోనూ పాటలు తప్పనిసరిగా మారాయి. ప్రైవేట్ పాటల ఆల్బమ్‌లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో రచయితలకు డిమాండ్ విస్తృతమవుతోంది. ఇక కవిత్వం, పద్యాలు రాసేవారికి ఆకర్షణీయమైన వేతనంతోపాటు పత్రికలు, మేగజైన్లలో తమ పేరు చూసుకొనే అవకాశం దక్కుతోంది. పద్యాలు, కవితలను పుస్తకంగా ప్రచురిస్తే పబ్లిషర్స్ నుంచి రాయల్టీ లభిస్తుంది. ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ రచయితలుగా పనిచేసుకోవచ్చు. ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం తమ తీరిక వేళల్లో రచనలు సాగిస్తూ.. మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
కవిత్వం, పద్యం, గీత రచయితలుగా మారాలనుకునేవారికి ప్రధానంగా ఊహాశక్తి, సృజనాత్మకత ఉండాలి. సమాజాన్ని కొత్తకోణంలో దర్శించే నేర్పు అవసరం. రచనకు కావాల్సిన వస్తువును చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి, పరిస్థితుల నుంచి గ్రహించే నైపుణ్యం పెంపొందించుకోవాలి. సమకాలీన అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. వివిధ రంగాల పుస్తకాలను విస్తృతంగా చదివే అలవాటు చాలా ముఖ్యం. ఇతర భాషల్లో వస్తున్న రచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
అర్హతలు: రచనా రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రత్యేకంగా ఫలానా విద్యార్హతలంటూ లేవు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రచనలు చేయొచ్చు. పెద్ద చదువులు చదవకపోయినా గొప్ప రచయితలుగా పేరుతెచ్చుకున్నవారెందరో ఉన్నారు. అయితే, ప్రతిభకు సాన పెట్టుకోవడానికి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. క్రియేటివ్ రైటింగ్‌లో భాగంగా పోయెట్రీ రైటింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ప్రొఫెషనల్ రైటర్స్‌గా మారాలనుకునేవారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరడం మంచిది. ఇప్పటికే వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఇందులో మెళకువలు తెలుసుకోవడానికి, రచనా శక్తిని పెంచుకోవడానికి పార్ట్‌టైమ్ కోర్సుల్లో చేరొచ్చు.
వేతనాలు: గీత రచయితలకు నెలతిరిగేసరికల్లా ఠంచనుగా వేతనం వచ్చే అవకాశం ఉండదు. తమను తాము మార్కెటింగ్ చేసుకొనే తెలివితేటలు ఉన్నవారు ఎంతైనా సంపాదించుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో ప్రతిభావంతులకు అధిక వేతనాలు లభిస్తాయి. ఒక్కో పాటకు వేల రూపాయలు అందుకొనే గీత రచయితలు ఉన్నారు. ప్రతిభావంతులకు అభిమానుల ప్రశంసలు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలు వరిస్తాయి. ఈ రంగంలో డబ్బు కంటే వృత్తిపరమైన సంతృప్తి అధికంగా లభిస్తుంది.
క్రియేటివ్ రైటింగ్/పోయెట్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఏ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: http://teluguuniversity.ac.in/
ఏ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.ignou.ac.in
ఏ బ్రిటిష్ కౌన్సిల్
వెబ్‌సైట్: www.britishcouncil.in
ఏ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్-కర్ణాటక
వెబ్‌సైట్: www.ciil.org
అధ్యయనం, అనుశీలన ఉండాలి!
శ్రీకవి, రచయిత కెరీర్ ఇతర రంగాల కంటే భిన్నమైంది. ఎందుకంటే ఇతర రంగాల్లో మౌఖిక పరీక్ష లేదా రాత పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. ఉద్యోగానికి, జీవితానికి భరోసా ఉంటుంది. కానీ రచయిత/కవికి అలాంటి పరిస్థితి ఉండదు. ప్రతి పాటా రాత పరీక్షే. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రతిబింబించేలా రాయాలి. పురాతన, ఆధునిక సాహిత్యం, భాషా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. భాష పట్ల ఆసక్తి, ఇష్టం పెంచుకోవాలి. విస్తృతమైన పద సంపదను సొంతం చేసుకోవాలి. సందర్భానుసారంగా వాటిని ఉపయోగించాలి. కవి ప్రధానంగా అధ్యయనం, అనుశీలన అనే ప్రాథమిక లక్షణాలను అలవర్చుకోవాలి. అధ్యయనం అంటే చదవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, అభ్యసించడం.
కేవలం పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. అందులోని సారాన్ని గ్రహించాలి. పుస్తకాలతోపాటు మనుషుల్ని, మనస్తత్వాన్ని, వివిధ ప్రాంతాల్ని, భాషలను, ఆచారాలను, సంస్కృతులను తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. అనుశీలన అంటే నిత్యం పరిశీలించడం. సాధార ణ వ్యక్తులతో పోల్చితే కవికి ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. సమాజం పోకడను, విలువలను ప్రత్యేకంగా పరిశీలించాలి. రచనల్లో అవి ప్రతిబింబించాలి. కొత్తగా ఈ కెరీర్‌ను ఎంచుకునే వారికి అవకాశాలకు కొదవలేదు. భారతీయ సంప్రదాయ మూలాలు విస్మరించకుండా ఎప్పటికప్పుడు తమను తాము కొత్త రకంగా ఆవిష్కరించుకోవాలి. అప్పుడే ఈ కెరీర్‌లో సుస్థిరంగా కొనసాగుతారు.్ణ
- చంద్రబోస్, ప్రముఖ సినీ గేయ రచయిత