పద్దెంపు సొగసులన్ పరమ పండితులెరుగు
సీసాల సౌందర్యమిరువురెరుగు
విదుష బాంధవ వినుము వైనుతేయ!
మధుభాండ మహిమలన్ మరువ తరమె?
‘మధు’రోక్తి
ఒక మనిషి అసలు స్వభావం అతడు తాగి ఉన్నప్పుడే బయటపడుతుంది
- చార్లీ చాప్లిన్,
జగద్విఖ్యాత హాస్యనట సమ్రాట్
పద్యాల సొగసులను పండితులే మదింపు వేయగలరు. వారిని అటుల ఉండనిచ్చెదము. పద్యం తెలుగువారి జాతిసంపద. పద్యాలలో ఎన్నిరకాల ఛందో వైవిధ్యాలు ఉన్నా, సీస పద్యాల సౌందర్యమే వేరు. సీస పద్యరచనలో కవిసార్వభౌముడిది అందెవేసిన చెయ్యి. ఇక ‘ఈ యుగం నాది’ అని ఢంకా బజాయించిన మహాకవి కూడా సీసాల నైపుణ్యంలో సిద్ధహస్తుడే! కవిసార్వభౌముడికీ, తనకూ సీసాలంటే చాలా ఇష్టమని ఒకసారి సాక్షాత్తూ మన మహాకవే చమత్కరించారు. శ్రీనాథ కవిసార్వభౌముడు ‘బుడ్డి’మంతుడవునో కాదో తెలియదు గానీ,
మహాకవి శ్రీశ్రీ మాత్రం చాలా ‘బుడ్డి’మంతుడు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే, సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేసిన ఖ్యాతి ‘బుడ్డి’మంతులదే. లోకంలో అంతా మంచినీళ్లు మాత్రమే తాగి బతికేసే వాళ్లయితే, చరిత్రలో ఇంతటి సాహితీ, కళా సృష్టి జరిగేదేనా..? ఇదో ‘గ్లాసి’కల్ డౌట్! క్లాసిక్స్‌ను ఆస్వాదించే ‘గ్లాసి’కల్ కళాపోషకుల కోసం ఈ వారం..
బాలే పంచ్
గోల్డెన్ రమ్ : 20 మి.లీ
బ్రాందీ : 20 మి.లీ.
విస్కీ : 20 మి.లీ.
ఆరెంజ్ జ్యూస్ : 100 మి.లీ.
సోడా : 100 మి.లీ.
గార్నిష్ : చెర్రీ, నిమ్మచెక్క
- వైన్‌తేయుడు