Yaqub Pasha
-
చెట్టంత మనిషి!
ఆదర్శం పరిస్థితులు పాఠాలు నేర్పుతాయి. గుణపాఠాలు నేర్పుతాయి. అడుగులు నేర్పుతాయి. ముందడుగులూ నేర్పుతాయి. బెడో ప్రాంతం(జార్ఖండ్)లో పెద్ద పెద్ద మిషన్లు చెట్లను కోసేసి, ట్రక్కుల్లో ఇతర ప్రాంతాలకు పంపుతున్నప్పుడు సీమోన్కు అబ్బురంగా అనిపించేది. ఆ దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. కాని ఇది ఎంత ఘోరమో చాలా కాలానికిగాని తెలిసిరాలేదు. ఒక్క చెట్టే కదా అంటూ చెట్లను నరుక్కుంటూ పోవడం వల్ల బెడో ప్రాంతంలోని అడవి పలచబారి పోయింది. కరువు అనుకోని అతిథిలా వచ్చి తిష్ట వేసింది. వేసిన పంట వేసినట్టు తెల్లముఖం వేయడం మొదలుపెట్టింది. రైతు ఉన్నాడు. అతనికి ఇల్లుంది. భూమి కూడా ఉంది. అయితే కరువు కాటేయడంతో పట్టణానికి వెళ్లి కూలీగా మారాడు. సీమోన్ వాళ్ల నాన్న కూడా అంతే. ఆయన పట్టణంలో కూలి పని చేస్తే, ఇక్కడ ఊళ్లో కుటుంబానికి సీమోన్ సహాయంగా ఉండేవాడు. అతను ఆలోచిస్తూ ఉండేవాడు... ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని. చెట్లను కొట్టివేయడం వల్లే కరువు రాజ్యమేలుతోందనే అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, ఇక అప్పటి నుంచి చెట్ల మీద సీమోన్లో పవిత్ర భావం ఏర్పడింది. ‘ఎవరో ఒకరు పూనుకోకపోతే ఒక్క చెట్టు కూడా మిగ లదు. ఆ తరువాత మనిషి అనేవాడు మిగలడు’ అని నడుం కట్టి ముందుకు కదిలాడు సీమోన్. చెట్లను నరకవద్దంటూ తన గ్రామం ఖాక్సి టోలిలో విస్తృత ప్రచారం మొదలుపెట్టాడు. మొదట అతడి మాటలను తేలిగ్గా తీసుకున్నవాళ్లే ఆ తరువాత వాస్తవంలోకి వచ్చారు. చెట్ల పట్ల గౌరవం పెంచుకున్నారు. ఆ గౌరవాన్ని పది మందికీ పంచారు. మొదట్లో ఒక గ్రామానికే పరిమితమైన ప్రచారం మెల్లగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించింది. సీమోన్ ఆధ్వర్యంలో ‘విలేజ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ’లు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లో మొక్కలు నాటే పనిని ఉద్యమస్థాయికి తీసుకువెళ్లాడు సీమోన్. ఆ తరువాత సీమోన్ దృష్టి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న చుట్టుపక్కల గ్రామాలపై పడింది. తన ఊరికి సమీపంలో చెక్‌డ్యామ్‌ను నిర్మించాడు. అయితే పరిమిత వనరులు, పరిమిత సాంకేతిక జ్ఞానం వల్ల ఆ డ్యామ్ అడ్రస్ లేకుండాపోయింది. ఇలా ఏదో ఒక ప్రయత్నం జరగడం, వర్షపు నీరు కారణంగానో సాంకే తిక సమస్యల వల్లో అది విఫలం కావడం జరిగేది. అయినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వ ఇంజినీర్ల సహాయం తీసుకుని చెక్‌డ్యామ్‌ను నిర్మించాడు. మిత్రులతో కలిసి వివిధ గ్రామాల్లోడ్యామ్లు నిర్మించాడు, చెరువుల పూడికలు తీయించాడు. బావులు తవ్వించాడు. అతడి కృషి వృథా పోలేదు. ‘విలేజ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ’ల వల్ల ఫారెస్ట్ మాఫియా తోక ముడిచింది. అడవి తల్లి ఆనందంగా నవ్వింది. పచ్చదనం పెరిగింది. ప్రజల నీటి కష్టాలు తీరాయి. అదంతా చూసి తృప్తిగా నవ్వుతాడు సీమోన్. ‘‘అడవిని బతికించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. అడవి పచ్చగా ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి. వలసలు తగ్గిపోయాయి. తాగునీటికి ఇబ్బంది లేదు. మేము పండించిన కూరగాయలను రాంచీ, జంషెడ్పూర్, కోల్‌కతాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. అడవిని, నీటి వనరులను కాపాడుకోవడం వల్లే ఇదంతా’’ అంటాడు. గొప్ప పనికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చి సీమోన్ని సత్కరిం చింది. దాని గురించి అడిగితే ఈ నిరాడంబ రుడు అంటాడు... ‘‘ఎవరో ఫోన్ చేసి అభినం దించే వరకు నాకు విషయం తెలియదు. నేనే దైనా చేశానంటే అది నాకు తోడుగా నిలిచినవాళ్ల వల్లే సాధ్యమైంది. ఇది నా ఒక్కడి విజయం కాదు. సమష్టి విజయం.’’ జార్ఖండ్ వాటర్మేన్గా ప్రసిద్ధి గాంచిన సీమోన్కి ప్రస్తుతం 82 ఏళ్లు. నేటికీ నీరు, చెట్ల సంరక్షణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడెక్క డికో వెళ్లి రైతులను కలిసి వర్షపు నీటిని భద్ర పరచడం గురించి వివరిస్తున్నాడు. జార్ఖండ్ ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వశాఖ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీమోన్‌ను నియమిం చింది. అది మాత్రమే కాక... యేటా తన వంతుగా వెయ్యి మొక్కలను నాటుతు న్నాడు. ‘‘నాలో నడిచే శక్తి ఉన్నంత వరకు మొక్కలు నాటుతూనే ఉంటాను’’ అంటాడు నవ్వుతూ. అది కేవలం నవ్వులా అనిపించదు... విజయ దరహాసంలా అనిపిస్తుంది! - యాకూబ్ పాషా -
హమ్ సబ్ భాయీభాయీ
వెల్లివిరిసిన మత సామరస్యం క్రీస్మస్ కేక్‌లు కట్‌చేసి, దుస్తులు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు కాశిబుగ్గ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకోని గురువారం లోతుకుంట చర్చిలో స్థానిక మాజీ కార్పొరేటర్ యాకుబ్‌పాషా ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరై క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి, స్థానికులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత సామరస్యాన్ని చాటేలా క్రిస్మస్ నిర్వహించిన యాకూబ్‌పాషాను ఎమ్మెల్యే కొండా సురేఖ అభినందించారు. నిజాంపురలో చీరల పంపిణీ.. వరంగల్ 16వ డివిజన్ నిజాంపురలోని సెంటినరీ ట్రినిటి బాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అబ్దుల్ ఖహార్ స్థానికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు సాబిర్, అప్సర్, సలీమ్, గోరెబాయి, దేవదాసు, బాబురావు, వినోద్‌కుమార్, ఆశిర్వాదం, జోసఫ్, అలెగ్జండర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 15వ డివిజన్లో.. వరంగల్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని 15వ డివిజన్లోని అంబేద్కర్‌భవన్‌లో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ కార్పొరేటర్ మునవరున్నిసా క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు సాదిఖ్, టీఆర్ఎస్ నాయకులు బరుపట్ల మొగిళి, జన్ను ప్రదీప్, కందుకూరి దినేష్, రాము,వేణు, సంజీవ, దయాకర్, స్వామి, సుధీర్ రమేష్, సంఘ పాస్టర్ నరేష్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ పుస్తకం
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘అబ్బా... ఈరోజు కూడా వెళ్లాలా!’ అంది నోరు. ‘వెళ్లక చస్తావా? వెళ్లకుంటే ఆకలితో మాడి చస్తావ్’ అంది అంతరాత్మ. దాంతో తప్పనిసరై బయలుదేరాడు ఫిలిప్. ‘ఫోర్ట్ వర్త్ బార్’లోకి అయిష్టంగానే అడుగుపెట్టాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫిలిప్. ఆర్థిక పరిస్థితుల వల్ల అతడి కోరిక కోరికగానే మిగిలిపోయింది. ‘చదువుకోలేక పోయానే’ అన్న అసంతృప్తి వెంటాడు తూనే ఉంది. ఈ బాధను దారి మళ్లించ డానికి చాన్స దొరికితే వ్యాయామంలో మునిగిపోయేవాడు. చివరికి అదే బార్లో బౌన్సర్‌గా బతుకుదారి చూపింది. అయితే బార్లో వాతావరణం ఫిలిప్‌కు బొత్తిగా నచ్చేది కాదు. కేకలు, అరుపులు, గొడవలు, సిగరెట్ పొగలు... ఆ ప్రపంచమంటేనే వెగటు వచ్చేది. అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. రాజీ పడుతూ బతుకు బండిని భారంగా లాగించసాగాడు. సరిగ్గా అప్పుడే సూజన్ అతని జీవితంలో ప్రవేశించింది. ఫిలిప్ పని చేస్తోన్న బార్లో బార్ గాళ్‌గా చేరింది సూజన్. మొదటి చూపు లోనే ఫిలిప్ మనసును తడిమింది. ఆమె అమాయకమైన ముఖం ఫిలిప్ మనసులో ముద్రపడి పోయింది. అందుకే పొట్టి పొట్టి బట్టలు కట్టుకుని, పాటలు పాడుతూ, మందు బాబులను అలరించే అమ్మాయిగా తనను చూడలేకపోయాడు. ‘ఇంత చక్కని అమ్మాయి ఇక్కడ ఇలా ఉండటమేంటి’ అనిపించేది. కానీ తనతో మాట్లాడాలంటే మనసు సిగ్గుతో మెలికలు తిరిగేది. చివరికి ఓరోజు ధైర్యం చేసి మాట కలిపాడు. ‘‘మీరు బార్లో పాడడం నాకు ఇష్టం లేదు. చిన్న వయసు. చక్కగా చదువుకో వచ్చుగా’’ అన్నాడు ఫిలిప్. ఆశ్చర్య పోయిందామె. ఇతనేంటి ఇలా చెబు తున్నాడు అనుకుంది. కానీ అతని మనసులో తనమీద అప్పటికే పెరిగిన అపారమైన ప్రేమ అలా మాట్లాడిస్తోందని అర్థం చేసుకుంది. చదువుకోలేని తన అశక్తతని, నిస్సహాయతని వివరించింది. ‘నీతో జీవితాన్ని పంచుకోవాలను కుంటున్నాను. నీ కష్టాన్ని పంచుకోలేనా, నిన్ను నేను చదివిస్తాను’ అన్నాడు ఫిలిప్. తల అడ్డంగా ఊపింది సూజన్. ‘నీకూ చదువంటే ఇష్టమే అన్నావ్ కదా. నాతో పాటు నువ్వూ చదువుకోవాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను’ అంది. ‘సరే’ అన్నాడు. నాటి నుంచీ వాళ్ల మనసులతో పాటు లక్ష్యాలూ ఒక్కటయ్యాయి. ఒకరికొకరు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. పుస్తకాలు చేతబట్టారు. ప్రేమ అనేది అప్పుడే పుట్టిన వెలుగు కిరణం లాంటిది. చీకట్లో అప్పటి వరకు చూడలేనివాటిని అది చూపుతుంది. ప్రేమ వెలుగులో ఫిలిప్, సూజన్లు చదువులోని అద్భుతాన్ని, ఆకర్షణను చూశారు. ఒక్కొక్క మెట్టూ ఎదిగారు. ఒక్కొక్క క్లాసూ దాటారు. టెక్సాస్‌లోని సర్ రాస్ స్టేట్ యూనివర్శిటీ నుంచి బయాలజీలో బేచిలర్ డిగ్రీ, ఆ తరువాత మాస్టర్ డిగ్రీ కూడా తీసుకున్నారు. పట్టా చేతికి వచ్చాక ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది ఫిలిప్‌కి. ‘‘నువ్వు నా జీవితంలో రాక పోయి ఉంటే చీకట్లో మగ్గిపోయేవాడిని’’ అన్నాడు సూజన్ చేతిని ప్రేమగా చేతిలోకి తీసుకుని. ‘‘నాదీ అదే మాట’’ అంది సూజన్. తర్వాత ఇద్దరూ దంపతులు అయ్యారు. జీవితాన్ని సంతోషంగా సాగిం చారు. కొన్నాళ్ల క్రితమే కోడీ సిటీలోని ‘డ్రాపర్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో బయాలజిస్ట్‌గా సూజన్, అస్టి సెంట్ క్యురేటర్‌గా ఫిలిప్ రిటైరయ్యారు. ప్రస్తుతం తమ ప్రేమ పుస్తకంలోని పేజీల్ని తిరగేసి చూసుకుంటూ గడుపుతున్నారు. ఆ పుస్తకం నిండా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. తమ జీవితాన్ని కాంతివంతం చేసిన వెలుగు రేఖలున్నాయి! - యాకుబ్ పాషా -
ప్రేమఖైదీ
గ్రేట్ లవ్ స్టోరీస్ ‘మొదట నేను... కెరటాల వంటి నీ శిరోజాలతో మాట్లాడాను. నీ కళ్లలోని వెన్నెల వెలుగులతో మాట్లాడాను. నీ పెదాలపై విరిసిన హరివిల్లుతో మాట్లాడాను. చివరిగా నీ హృదయంతో మాట్లాడాను. ప్రియా... ఇప్పుడు నేను ‘నేను’ కాదు... నువ్వు!’ ప్రేమ... రెండు ప్రపంచాలను ఒకే ప్రపంచంగా చేస్తుంది. అతడి ప్రపంచం: ‘మోడల్ బ్యాడ్‌బాయ్’ ఎవరంటే ఎవరైనా సరే... మొహమాటం లేకుండా వేలెత్తి చూపించేంత బ్యాడ్ ఇమేజ్ రషీద్‌కు ఉంది. టీనేజ్‌లో వయసుతో పాటు వచ్చిన అల్లరి... ఇంతింతై అన్నట్లు ఎక్కడికో వెళ్లిపోయింది. చదువుకు నీళ్లొదిలి, వీధి రౌడీగా పోలీసుల లిస్టులోకి ఎక్కడానికి అతడికి ఎంతో కాలం పట్టలేదు. మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా ఉండేది రషీద్ జీవితం. అయితే వాటి కంటే దారుణమైన పని ఒకటి పదిహేడేళ్ల వయసులో చేశాడు. ఏదో ఒక గొడవలో ఆవేశాన్ని అణచుకోలేక, న్యూ యార్క్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏ కిక్ కోసమైతే రషీద్ నేరాలకు పాల్పడేవాడో ఇప్పుడది జైలులో లేదు. ఎటు చూసినా ఒంటరితనం. అందులో నుంచి పుట్టిన నిరాశా నిస్పృహలు. వాటి నుంచి పుట్టిన ఆలోచనలు! తమ తొలి పరిచయం నుంచి రషీద్‌ను పెళ్లి చేసుకునే వరకు ప్రతి అనుభవాన్నీ కూర్చి ‘ద ప్రిజనర్స వైఫ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది ఆశ. ‘టూ రూమ్ ట్రైలర్’లో అతడితో రెండు రోజులు ఏకాంతంగా గడిపిన ఆనందానికి ఫలితంగా పుట్టిన బిడ్డను తాను ఒంటరిగా పెంచుతోన్న వైనాన్ని, ఆ అను భూతిని వివరిస్తూ ‘సమ్‌థింగ్ లైక్ బ్యూటిఫుల్’ బుక్ రాసింది. రషీద్ విడుదలై వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె ప్రపంచం: మన్హట్టన్లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఆశా బండెల్. చదువుకు చదువు, తెలివికి తెలివి. వాటితో పాటు సామాజిక స్పృహ. ఎప్పుడూ సామాజికసేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. ఆమెలో ఒక చక్కని రచయిత్రి కూడా ఉంది. అందమైన కవితలు అల్లుతూ ఉంటుంది. ఒకసారి తన ప్రొఫెసర్ కోరిక మేరకు న్యూయార్క్‌లోని ఓ జైలుకు వెళ్లింది ఆశ. అక్కడికి వెళ్లి ఆమె చేయాల్సిన పని... ఖైదీలకు తన కవిత్వం వినిపించడం. అప్పుడే ఆమె రషీద్‌ని చూసింది. అందరు ఖైదీల మధ్యలో ఉన్నా అతడు ఆమెకు ప్రత్యేకంగా కనిపించేవాడు. ఆమె కవిత్వం చెబుతుంటే విని పులకించేవాడు. కళ్లతోనే అభినందించేవాడు. చివరికి ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లి అభినం దించాడు. ఆమె కవిత్వం తన మనసుకు కలిగించే ఊరట గురించి చెప్పాడు. నాటి నుంచీ ఆశ, రషీద్‌ల మధ్య స్నేహం పెరిగింది. ఆమె స్నేహంలో తనొక కొత్త ప్రపంచాన్ని చూశాడు. కొత్త మనిషిగా బతకడానికి, కొత్త జీవితం మొదలు పెట్టడానికి తన కోసం దేవుడు పంపిన విలువైన కానుక అని భావించాడు రషీద్. ‘ఇప్పటి వరకు నాది బతుకే కాదు. ఇక నుంచైనా మనిషిగా బతకాలి’ అనుకున్నాడు. రషీద్ గురించి ఆశ కూడా చాలా ఆలోచించింది. పెరిగిన పరిస్థితులే అతడి నలా మార్చాయని అర్థం చేసుకుంది. రషీద్‌ను చూడడానికి ఆశ వారానికి రెండు సార్లు జైలుకు వచ్చేది. ఫోన్లు కూడా చేసు కునేవారు. ఉత్తరాలు రాసుకునేవారు. వీలైనంత వరకూ తన మాటలతో అతడిలో మంచిని నింపడానికి ప్రయత్నం చేసేది ఆశ. చివరికి మోడల్ బ్యాడ్‌బాయ్‌ని మోడల్ ప్రిజనర్‌గా మార్చేసింది. ఏడేళ్లు దొర్లిపోయాయి. వారి మనసులు దగ్గరయ్యాయి. ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని ఒకరోజు ప్రపోజ్ చేసింది ఆశ. ‘‘ఇప్పటికి విధి నాతో ఆడుకుంది చాలు. ఇప్పుడు నువ్వు కూడానా’’ అన్నాడు రషీద్. ‘‘నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’... రషీద్ చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది. ఆశ అబద్ధం ఆడలేదు. అన్నట్టుగానే రషీద్‌ని పెళ్లాడింది. అధికారుల అనుమతితో జైలు నాలుగు గోడల మధ్యే అతడి అర్ధాంగి అయ్యింది. నాలుగు నెలల తరువాత జైల్లోని ‘టూ రూమ్ ట్రైలర్’లో ఆ ఇద్దరికీ రెండు రోజులు ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది. ఆ రోజు ఇద్దరూ ఒక్కటయ్యారు. నాటి నుంచీ ‘నేను నేను కాదు’’ అంటున్నాడు రషీద్. నిజమే కదా! - యాకుబ్ పాషా -
నిన్న రాత్రి...
పద్యప్రభావం పొద్దున లేచింది మొదలు.. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాల వార్తలు... అవిశ్రాంతంగా వినిపిస్తుంటాయి. కోపం వస్తుంది. ఈ బక్కపలచటి శక్తి లేని కోపంతో ఏం చేయగలం? అనిపిస్తుంది. కన్నెర్ర చేయాలనిస్తుంది, కండ్లకలక అనుకుంటారేమోనని వెనక్కి తగ్గాలనిపిస్తుంది... ఇలా రాజీ పడుతూనే ఉంటాం. ఇక దేని గురించీ ఆలోచించవద్దు అనుకుంటాం. ఇలా ఆలోచించే ఒకడికి దేవుడు కనిపిస్తే ఏంచేస్తాడు? ఆ దేవుడి ముందు తన నిరసనను వెళ్లగక్కుతాడా? లేక మానవుడే దానవుడైన ఈ కలికాలంలో పాపం... దేవుడు మాత్రం ఏంచేస్తాడు? అనుకుంటాడా? బాలగంగాధర తిలక్ ‘నిన్నరాత్రి’ కవిత దగ్గరికి వెళ్లి చూసొద్దాం.. ఆకలి అని ఆశలు గొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి దేవుడిని అడిగానా? అమ్ముకొన్న యౌవనం, అలసిన జీవనం సంధ్యవేళ ఉరి పోసుకున్న సాని పడుచు మాట చెప్పానా? కాలి కమురు కంపుకొట్టే కాలం కథ, మానవ వ్యథ నే వివరించానా? దేవుడి కన్నీటిని తుడిచి, వెళ్లిరమ్మని వీధి చివరి దాకా సాగనంపి వచ్చాను. నాకు తెలుసు... నాకు తెలుసు మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు-కన్నకడుపు- ఏంచేస్తాడని! - యాకుబ్ పాషా -
మేరే పాస్ మాఁ హై!
పంచ్ శాస్త్ర ఒకే పేగు తెంచుకొని పుట్టిన ఇద్దరు కొడుకులు. వాళ్ల దారులు వేరు. ‘దారులు వేరైనా వాళ్లకు అమ్మ మీద ఉన్న ప్రేమ ఒక్కటే. ఆదర్శాలు వేరైనా... అమ్మ మీద ఉన్న అనురాగం ఒక్కటే. ఒకరు ఇన్స్పెక్టర్...చాలా మంచివాడు. ఒకరు... క్రిమినల్....చాలా చెడ్డవాడేమీ కాదు. కుటుంబం కోసం క్రిమినల్‌గా మారినవాడు. తనను ‘మంచి వాడు’ అని పిలుస్తున్నారా? ‘చెడ్డవాడు’ అని పిలుస్తున్నారా? అనేది అతనికి ముఖ్యం కాదు...తన కుటుంబం ఎంత సుఖంగా ఉందనేదే ముఖ్యం. ‘దీవార్’ సినిమా అంటే గుర్తుకు వచ్చేది పాటలు, ఫైట్లు కాదు...ఒకే ఒక్క డైలాగ్... ‘మేరే పాస్ మా హై’ నిరూపరాయ్ అనే అమ్మకు ఇద్దరు కొడుకులు. ఆ అమ్మ ఎలాంటిదంటే...బతికిన నాలుగు రోజులు ఆత్మగౌరవంతో బతకాలి. మోసానికి దూరంగా బతకాలి. ఏసీ భవనంలో నివసించే ‘సుఖం’ కంటే, కష్టంతో సంపాదించుకున్న సొమ్ముతో పూరి గూడిసెలో నివసించే ‘కష్టమే’ గొప్పదని నమ్ముతుంది. అమ్మ ఒడి అంటే... ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అవి కథలు మాత్రమే కాదు... జీవితాన్ని సక్రమమైన దారిలో నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు. నిరూపరాయ్ ఇద్దరు కొడుకులు అమితాబ్, శశికపూర్లు ఆమె ఒడిలో ఎన్నో పాఠాలు నేర్చుకొని ఉండొచ్చు. అయితే, కాలక్రమంలో.... తల్లి చెప్పిన పాఠం చిన్నోడు శశికి వెలుగు దారిగా కనిపించింది. పెద్దోడికి... వెలుగే కనిపించని చీకటి నిండిన చాదస్తపు దారిగా కనిపించింది. ‘కన్నీటిని కన్నీటితో జయించలేము. కత్తితో జయించాలి. అన్యాయాన్ని న్యాయంతో కాదు... అంతకంటే అన్యాయంతో జయించాలి’ అనేది అమితాబ్ సిద్దాంతం. అందుకే అన్నదమ్ములు ఇద్దరి మధ్య బెర్లిన్ గోడలాంటి పెద్ద గోడ. అన్నదమ్ములిద్దరి మధ్య ‘మోరల్ క్లాష్’కు అదో బలమైన ప్రతీక. ‘‘తుమారే మేరే బీచ్ మే ఏక్ దీవార్ హై’’ అంటాడు ఇన్స్పెక్టర్ శశి. ఆ కాల్పనిక గోడకు చెరోవైపు నిల్చొని ఉన్నారు అమితాబ్, శశీలు. ‘‘నీ గోల పక్కన పెట్టు...అమ్మ నాతోనే ఉంటుంది. నీకు నా దగ్గర ఉండాలని లేకపోతే ఈ క్షణమే వెళ్లిపోవచ్చు’’ అంటాడు అమితాబ్. ఈ మాటలో ‘కఠినత్వం’ మాత్రమే కాదు...తన మీద తనకు అపారమైన ఆత్మవిశాసం ఉంది. మరి అమ్మ ఏమంటుంది? అదిగో ఆమె వైపు చూడండి. తలపై నెరిసిన ఆమె వెంట్రుకలు... పరిస్థితులతో పండి పోయిన వైనాన్ని సూచిస్తున్నాయి. పెద్ద కొడుకు అమితాబ్ మాటలు ఆసక్తిగా వింటోంది... అమితాబ్ అంటున్నాడు... ‘‘మేరా పాస్ బంగ్లా, గాడి సబ్ హై...’’ అప్పుడు అమ్మ చిన్నగా అంటుంది, ఆ చిన్న మాటల్లో ఎంత పెద్ద అర్థం ఉంది... ‘‘నేను చిన్నోడితో వెళుతున్నాను. నీ కొకటి చెప్పదల్చుకున్నాను నాయనా... నువ్వు సంపన్నుడివే కావచ్చు. అంతమాత్రాన... అమ్మను కొనే ప్రయత్నం చేయకు. నువ్వు ఎంత సంపన్నుడివైనా... అమ్మను కొనేంత సంపన్నుడివి ఇప్పుడే కాదు... ఎప్పుడూ కాలేవు. గుర్తుంచుకో..’’ ఈ సన్నివేశానికి వచ్చిన స్పందన...ఇంతా అంతా కాదు! అమ్మను కొనే సంపన్నుడు భూమి మీద పుట్టలేదు. పుట్టబోడు!! అన్నదమ్ముల మధ్య మాటల యుద్దం జరుగు తుంది. ‘‘నా మాట విను..’’ అని శశి మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అమితాబ్. ‘‘వినను’’ అంటూనే తన ఆదర్శం గురించి చెబు తున్నాడు శశి. ‘‘మాట్లాడితే ఆదర్శం అంటావు. నీ ఆదర్శాలన్నీ కలిసి ఒక రొట్టె తయారు చేసుకొని తినడానికి కూడా పనికి రావు...’’ శశిలో ఎలాంటి చలనం లేదు. ‘‘...ఇటు చూడు... ఇటు చూడు. నావైపు చూడు. నువ్వెలా ఉన్నావు. నేనెలా ఉన్నాను. ఇద్దరం ఒకే చోటు నుంచి బయలుదేరాం. ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నేనెక్కడ ఉన్నాను? ఏముంది నీ దగ్గర? ఒంటి మీద యూనిఫాం, ఉండడానికి క్వార్టర్స్, తిరగడానికి జీప్ తప్ప...! మరి నా దగ్గర- ‘ఆజ్ మేరే పాస్ బంగ్లా హై... గాడి హై... బ్యాంకు బ్యాలెన్స్ హై... తుమ్హరా పాస్ క్యా హై?’ (ఇవ్వాళ నా దగ్గర బంగ్లా ఉంది. కారు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. మరి నీ దగ్గర ఏముంది?) ఈ ప్రశ్నకు శశి ఇచ్చిన జవాబు భారతదేశాన్ని ఉర్రూతలూపేసింది. ‘మేరే పాస్ మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది) అమ్మ గొప్పదనం గురించి చెప్పాలంటే అనంతమైన శ్లోకాలు అక్కర్లేదు. భావోద్వేగభరిత శోకాలు అక్కర్లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు అక్కర్లేదు. భారీ పుస్తకాలు అక్కర్లేదు. ఒక్క చిన్న మాట చాలు... అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది! - యాకుబ్ పాషా -
కొత్త పుస్తకాలు
సమ్మోహన స్వర విపంచి కవిత్వం కావచ్చు, సాహిత్య విమర్శ కావచ్చు...‘మో’ను చదువుకోవడం అంటే ప్రపంచగ్రంథాలయాన్ని ప్రేమగా ఆలింగనం చేసుకోవడం! ‘మో’ వాదులలో నరేష్ నున్నా కూడా ఒకరే‘మో’ తెలియదుగానీ, ముప్పై పేజీల ఈ చిన్ని పుస్తకంలో ‘మో’ విశాల ప్రపంచాన్ని తనదైన ప్రత్యేక శైలితో మళ్లీ ఒక్కసారి గుర్తుకు తెచ్చారు నున్నా. వివిధ సందర్భాల్లో ‘మో’ మీద గతంలో తాను రాసిన వ్యాసాలను ‘మోహం’ పేరుతో తీసుకువచ్చారు నరేష్. అభిమానం పొంగి పొర్లగా రాసిన భావోద్వేగభరిత వ్యాసాలు కావు ఇవి. అభిమానంతో పాటు అధ్యయన విస్తృతి కూడా నరేష్ కలంలో కనిపిస్తుంది. ‘మోహం’లాంటి నలుపు, తెలుపు పొత్తాన్ని చూసినప్పుడు ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలేమో, ‘మో’కు ఒక వర్గం పాఠకులకు మధ్య ఉన్న ‘గ్యాప్’ పోవాలేమో అనిపిస్తుంది. ‘ఇక నేను గోల చేస్తో బిగ్గరగా మాట్లాడను నా ప్రభువు ఆజ్ఞ అది రహస్యాలలో చెప్తాను పాట గుసగుసల్లోనే నా హృదయభాష పలుకుతుంది’ అని రవీంద్రుడికి తెలుగు గొంతుక ఇచ్చారు అప్పుడెప్పుడో మో. మరి ‘మో’ను ఫ్రభువు ఆజ్ఞాపించాడో లేదో తెలియదు కానీ చాలా నిశ్శబ్దంగానే తన హృదయభాషను పంచారు. ఆ భాష మరింత చేరువ కావడానికి ఇలాంటి పుస్తకం ఎప్పుడూ ఒకటి రావాలి. - యాకూబ్ పాషా