ప్రేమఖైదీ | Great Love Stories: Prisoner of love | Sakshi
Sakshi News home page

ప్రేమఖైదీ

Published Sun, Oct 11 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

కారాగారంలో ఒక్కటైన చిలకా గోరింకలు: ఆశ, రషీద్

కారాగారంలో ఒక్కటైన చిలకా గోరింకలు: ఆశ, రషీద్

గ్రేట్ లవ్ స్టోరీస్
‘మొదట నేను...
కెరటాల వంటి నీ శిరోజాలతో మాట్లాడాను.
నీ కళ్లలోని వెన్నెల వెలుగులతో మాట్లాడాను.
నీ పెదాలపై విరిసిన హరివిల్లుతో మాట్లాడాను.
చివరిగా నీ హృదయంతో మాట్లాడాను.
ప్రియా... ఇప్పుడు నేను ‘నేను’ కాదు... నువ్వు!’

 
ప్రేమ... రెండు ప్రపంచాలను ఒకే ప్రపంచంగా చేస్తుంది.
అతడి ప్రపంచం: ‘మోడల్ బ్యాడ్‌బాయ్’ ఎవరంటే ఎవరైనా సరే... మొహమాటం లేకుండా వేలెత్తి చూపించేంత బ్యాడ్ ఇమేజ్ రషీద్‌కు ఉంది. టీనేజ్‌లో వయసుతో పాటు వచ్చిన అల్లరి... ఇంతింతై అన్నట్లు ఎక్కడికో వెళ్లిపోయింది. చదువుకు నీళ్లొదిలి, వీధి రౌడీగా పోలీసుల లిస్టులోకి ఎక్కడానికి అతడికి ఎంతో కాలం పట్టలేదు.
 
మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అన్నట్టుగా ఉండేది రషీద్ జీవితం. అయితే వాటి కంటే దారుణమైన పని ఒకటి పదిహేడేళ్ల వయసులో చేశాడు. ఏదో ఒక గొడవలో ఆవేశాన్ని అణచుకోలేక, న్యూ యార్క్‌లో ఒక వ్యక్తిని కాల్చి చంపాడు. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఏ కిక్ కోసమైతే రషీద్ నేరాలకు పాల్పడేవాడో ఇప్పుడది జైలులో లేదు. ఎటు చూసినా ఒంటరితనం. అందులో నుంచి పుట్టిన నిరాశా నిస్పృహలు. వాటి నుంచి పుట్టిన ఆలోచనలు!
 
తమ తొలి పరిచయం నుంచి రషీద్‌ను పెళ్లి చేసుకునే వరకు ప్రతి అనుభవాన్నీ కూర్చి ‘ద ప్రిజనర్‌‌స వైఫ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది ఆశ. ‘టూ రూమ్ ట్రైలర్’లో అతడితో రెండు రోజులు ఏకాంతంగా గడిపిన ఆనందానికి ఫలితంగా పుట్టిన బిడ్డను తాను ఒంటరిగా పెంచుతోన్న వైనాన్ని, ఆ అను భూతిని వివరిస్తూ ‘సమ్‌థింగ్ లైక్ బ్యూటిఫుల్’ బుక్ రాసింది. రషీద్ విడుదలై వచ్చే రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
 
ఆమె ప్రపంచం:
మన్‌హట్టన్‌లో ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది ఆశా బండెల్. చదువుకు చదువు, తెలివికి తెలివి. వాటితో పాటు సామాజిక స్పృహ. ఎప్పుడూ సామాజికసేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. ఆమెలో ఒక చక్కని రచయిత్రి కూడా ఉంది. అందమైన కవితలు అల్లుతూ ఉంటుంది.
 ఒకసారి తన ప్రొఫెసర్ కోరిక మేరకు న్యూయార్క్‌లోని ఓ జైలుకు వెళ్లింది ఆశ. అక్కడికి వెళ్లి ఆమె చేయాల్సిన పని... ఖైదీలకు తన కవిత్వం వినిపించడం. అప్పుడే ఆమె రషీద్‌ని చూసింది.

అందరు ఖైదీల మధ్యలో ఉన్నా అతడు ఆమెకు ప్రత్యేకంగా కనిపించేవాడు. ఆమె కవిత్వం చెబుతుంటే విని పులకించేవాడు. కళ్లతోనే అభినందించేవాడు. చివరికి ఒకరోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లి అభినం దించాడు. ఆమె కవిత్వం తన మనసుకు కలిగించే ఊరట గురించి చెప్పాడు.
 
నాటి నుంచీ ఆశ, రషీద్‌ల మధ్య స్నేహం పెరిగింది. ఆమె స్నేహంలో తనొక కొత్త ప్రపంచాన్ని చూశాడు. కొత్త మనిషిగా బతకడానికి, కొత్త జీవితం మొదలు పెట్టడానికి తన కోసం దేవుడు పంపిన విలువైన కానుక అని భావించాడు రషీద్. ‘ఇప్పటి వరకు నాది బతుకే కాదు. ఇక నుంచైనా మనిషిగా బతకాలి’ అనుకున్నాడు.
 
రషీద్ గురించి ఆశ కూడా చాలా ఆలోచించింది. పెరిగిన పరిస్థితులే అతడి నలా మార్చాయని అర్థం చేసుకుంది. రషీద్‌ను చూడడానికి ఆశ వారానికి రెండు సార్లు  జైలుకు వచ్చేది. ఫోన్లు కూడా చేసు కునేవారు. ఉత్తరాలు రాసుకునేవారు. వీలైనంత వరకూ తన మాటలతో అతడిలో మంచిని నింపడానికి ప్రయత్నం చేసేది ఆశ. చివరికి మోడల్ బ్యాడ్‌బాయ్‌ని మోడల్ ప్రిజనర్‌గా మార్చేసింది.
 ఏడేళ్లు దొర్లిపోయాయి. వారి మనసులు దగ్గరయ్యాయి. ‘‘నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అని ఒకరోజు ప్రపోజ్ చేసింది ఆశ. ‘‘ఇప్పటికి విధి నాతో ఆడుకుంది చాలు. ఇప్పుడు నువ్వు కూడానా’’ అన్నాడు రషీద్. ‘‘నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను’’... రషీద్  చేతిని తన చేతిలోకి తీసుకుని చెప్పింది.
 
ఆశ అబద్ధం ఆడలేదు. అన్నట్టుగానే రషీద్‌ని పెళ్లాడింది. అధికారుల అనుమతితో జైలు నాలుగు గోడల మధ్యే అతడి అర్ధాంగి అయ్యింది. నాలుగు నెలల తరువాత జైల్లోని ‘టూ రూమ్ ట్రైలర్’లో ఆ ఇద్దరికీ రెండు రోజులు ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది. ఆ రోజు ఇద్దరూ ఒక్కటయ్యారు. నాటి నుంచీ ‘నేను నేను కాదు’’ అంటున్నాడు రషీద్. నిజమే కదా!
- యాకుబ్ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement