
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్‌లో ఉన్నా.
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.
2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.