చెట్టంత మనిషి!
ఆదర్శం
పరిస్థితులు పాఠాలు నేర్పుతాయి. గుణపాఠాలు నేర్పుతాయి. అడుగులు నేర్పుతాయి. ముందడుగులూ నేర్పుతాయి. బెడో ప్రాంతం(జార్ఖండ్)లో పెద్ద పెద్ద మిషన్లు చెట్లను కోసేసి, ట్రక్కుల్లో ఇతర ప్రాంతాలకు పంపుతున్నప్పుడు సీమోన్‌కు అబ్బురంగా అనిపించేది. ఆ దృశ్యాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేది. కాని ఇది ఎంత ఘోరమో చాలా కాలానికిగాని తెలిసిరాలేదు. ఒక్క చెట్టే కదా అంటూ చెట్లను నరుక్కుంటూ పోవడం వల్ల బెడో ప్రాంతంలోని అడవి పలచబారి పోయింది. కరువు అనుకోని అతిథిలా వచ్చి తిష్ట వేసింది. వేసిన పంట వేసినట్టు తెల్లముఖం వేయడం మొదలుపెట్టింది.
రైతు ఉన్నాడు. అతనికి ఇల్లుంది. భూమి కూడా ఉంది. అయితే కరువు కాటేయడంతో పట్టణానికి వెళ్లి కూలీగా మారాడు. సీమోన్ వాళ్ల నాన్న కూడా అంతే. ఆయన పట్టణంలో కూలి పని చేస్తే, ఇక్కడ ఊళ్లో కుటుంబానికి సీమోన్ సహాయంగా ఉండేవాడు. అతను ఆలోచిస్తూ ఉండేవాడు... ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని. చెట్లను కొట్టివేయడం వల్లే కరువు రాజ్యమేలుతోందనే అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, ఇక అప్పటి నుంచి చెట్ల మీద సీమోన్‌లో పవిత్ర భావం ఏర్పడింది. ‘ఎవరో ఒకరు పూనుకోకపోతే ఒక్క చెట్టు కూడా మిగ లదు. ఆ తరువాత మనిషి అనేవాడు మిగలడు’ అని నడుం కట్టి ముందుకు కదిలాడు సీమోన్. చెట్లను నరకవద్దంటూ తన గ్రామం ఖాక్సి టోలిలో విస్తృత ప్రచారం మొదలుపెట్టాడు. మొదట అతడి మాటలను తేలిగ్గా తీసుకున్నవాళ్లే ఆ తరువాత వాస్తవంలోకి వచ్చారు.
చెట్ల పట్ల గౌరవం పెంచుకున్నారు. ఆ గౌరవాన్ని పది మందికీ పంచారు. మొదట్లో ఒక గ్రామానికే పరిమితమైన ప్రచారం మెల్లగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించింది. సీమోన్ ఆధ్వర్యంలో ‘విలేజ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ’లు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లో మొక్కలు నాటే పనిని ఉద్యమస్థాయికి తీసుకువెళ్లాడు సీమోన్.
ఆ తరువాత సీమోన్ దృష్టి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న చుట్టుపక్కల గ్రామాలపై పడింది. తన ఊరికి సమీపంలో చెక్‌డ్యామ్‌ను నిర్మించాడు. అయితే పరిమిత వనరులు, పరిమిత సాంకేతిక జ్ఞానం వల్ల ఆ డ్యామ్ అడ్రస్ లేకుండాపోయింది. ఇలా ఏదో ఒక ప్రయత్నం జరగడం, వర్షపు నీరు కారణంగానో సాంకే తిక సమస్యల వల్లో అది విఫలం కావడం జరిగేది. అయినా వెనకడుగు వేయకుండా ప్రభుత్వ ఇంజినీర్ల సహాయం తీసుకుని చెక్‌డ్యామ్‌ను నిర్మించాడు. మిత్రులతో కలిసి వివిధ గ్రామాల్లోడ్యామ్‌లు నిర్మించాడు, చెరువుల పూడికలు తీయించాడు. బావులు తవ్వించాడు.
అతడి కృషి వృథా పోలేదు. ‘విలేజ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ’ల వల్ల ఫారెస్ట్ మాఫియా తోక ముడిచింది. అడవి తల్లి ఆనందంగా నవ్వింది. పచ్చదనం పెరిగింది. ప్రజల నీటి కష్టాలు తీరాయి. అదంతా చూసి తృప్తిగా నవ్వుతాడు సీమోన్. ‘‘అడవిని బతికించుకోవడానికి ఎంతో కష్టపడ్డాం. అడవి పచ్చగా ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి. వలసలు తగ్గిపోయాయి. తాగునీటికి ఇబ్బంది లేదు. మేము పండించిన కూరగాయలను రాంచీ, జంషెడ్‌పూర్, కోల్‌కతాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. అడవిని, నీటి వనరులను కాపాడుకోవడం వల్లే ఇదంతా’’ అంటాడు.
గొప్ప పనికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం పద్మశ్రీని ఇచ్చి సీమోన్‌ని సత్కరిం చింది. దాని గురించి అడిగితే ఈ నిరాడంబ రుడు అంటాడు... ‘‘ఎవరో ఫోన్ చేసి అభినం దించే వరకు నాకు విషయం తెలియదు. నేనే దైనా చేశానంటే అది నాకు తోడుగా నిలిచినవాళ్ల వల్లే సాధ్యమైంది. ఇది నా ఒక్కడి విజయం కాదు. సమష్టి విజయం.’’
జార్ఖండ్ వాటర్‌మేన్‌గా ప్రసిద్ధి గాంచిన సీమోన్‌కి ప్రస్తుతం 82 ఏళ్లు. నేటికీ నీరు, చెట్ల సంరక్షణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడెక్క డికో వెళ్లి రైతులను కలిసి వర్షపు నీటిని భద్ర పరచడం గురించి వివరిస్తున్నాడు. జార్ఖండ్ ప్రభుత్వ గ్రామీణ మంత్రిత్వశాఖ వాటర్‌షెడ్ ప్రోగ్రామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సీమోన్‌ను నియమిం చింది. అది మాత్రమే కాక... యేటా తన వంతుగా వెయ్యి మొక్కలను నాటుతు న్నాడు. ‘‘నాలో నడిచే శక్తి ఉన్నంత వరకు మొక్కలు నాటుతూనే ఉంటాను’’ అంటాడు నవ్వుతూ. అది కేవలం నవ్వులా అనిపించదు... విజయ దరహాసంలా అనిపిస్తుంది!
- యాకూబ్ పాషా