అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరం చేశారని కోర్టు అంగీకరించవచ్చు. ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున మరోసారి పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ ఈ కేసు తెరమీదకు రావడం గమనార్హం. ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు. ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభేదించేవాళ్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం. ‘యూగవ్’ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది అమెరికన్ ఓటర్లు ఆయనకు మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టు విచా రణ చేపట్టడం న్యాయపరంగా బాగానే కనిపిస్తుంది కానీ రాజకీయంగా అంత తెలివైన పనేనా? ఈ విచారణ ఆయనకు మద్దతిచ్చేవారి సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది.
గత వారం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. కారణం? ఆయన నేరానికి పాల్పడటమే. ఈ విషయం కోర్టు అంగీకరించవచ్చు... ఫలితంగా ఆయన జైలు ఊచలూ లెక్కపెట్టవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ట్రంప్ ఇంకో సారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశమే ఉండదు. బాగానే ఉంది కానీ, రాజకీయంగా చూస్తే ఇదేమంత తెలివైన విషయంగా కనిపించదు.
యాదృచ్ఛికమేనా?
అమెరికా న్యాయవ్యవస్థ రాజకీయమైందేమీ కాదు కానీ చేసేందుకు అవకాశాలెక్కువ. డోనాల్డ్ ట్రంప్‌పై ఏ అంశంపై శిక్ష పడుతుందన్నది స్పష్టంగా తెలియదు. ‘పోర్న్ స్టార్’ స్టార్మీ డేనియల్స్‌కు అక్రమంగా డబ్బులిచ్చి ఆ విషయాన్ని దాచడంపై అని చాలామంది అనుకుంటున్నారు. అల్విన్ బ్రాగ్ అనే డెమోక్రటిక్ జిల్లా న్యాయవాది ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అది కూడా నేరం జరిగిందన్న కాలానికి ఆరేళ్ల తరువాత! పైగా 2024 ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్న వేళ కావడం గమనార్హం.
ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయంటే నమ్మడం కష్టమే.రాజకీయ పరిశీలకుల అంచనా ప్రకారం, ట్రంప్ కథ దాదాపుగా ముగిసిపోయినట్లే. ఆయన ర్యాలీలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది. ప్రసంగాలు కూడా చప్పగా ఉంటున్నాయి. ఫ్లోరిడాకు చెందిన రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ రిపబ్లికన్ల కొత్త ఆశల్లా కనిపిస్తున్నారు. 2020లో పోటీ నుంచి తప్పుకొని ట్రంప్‌ను వీరు నేరుగా విమర్శించారు కూడా!
ప్రజాదరణ ట్రంప్‌కే ఎక్కువ
ట్రంప్ కేసును న్యాయపరంగా విశ్లేషించినప్పుడు ఆయన జైలుకెళ్లే అవకాశాలు తక్కువే అన్నది స్పష్టమవుతుంది. అకౌంట్లను తారుమారు చేసిన నేరానికి రకరకాల ఉపశమన మార్గా లున్నాయని మాజీ ప్రాసిక్యూటర్, న్యాయశాస్త్ర అధ్యాపకుడు జెఫ్రీ బెల్లిన్ అంటున్నారు. ఈ పరి స్థితుల్లో దేశ మాజీ అధ్యక్షుడిని జైల్లో పెట్టడం ఎంత అసాధ్యమో, రాజకీయంగా ఎంత ప్రమాదకరమో జ్యూరీ సభ్యులకూ, న్యాయమూర్తులకూ తెలుసు.
ఇంతకంటే ఘోరమైన నేరాలు చేసిన అధ్యక్షుడు నిక్సన్ క్షమాభిక్షతో బయటపడ్డాడు మరి! ఒకవేళ ట్రంప్ జార్జియా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నాడనో, కాపిటల్‌పై దాడికి మూకను ఉసిగొల్పాడనో విచారణ జరిపితే పర్యవసానాలు వేరుగా ఉండేవేమో! ఏమైనా ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు అన్న ట్రంప్ వాదనతో... ఆయనతో విభే దించే రిపబ్లికన్లు కూడా అంగీకరించకుండా ఉండటం కష్టం.
ఇదిలా ఉంటే, ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని సంబరంగా ఉన్నారు. ట్రంప్‌పై నమ్మకం ఎప్పుడో సన్నగిల్లినప్పటికీ రిపబ్లికన్ నాయ కులు మైక్ పెన్స్, రాన్ డిశాంటిస్ కూడా ఈ కేసు అక్రమమని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులోని పార్టీ నేత లందరూ ఇదే మాట చెబుతూండటం దీనికి కారణం. కానీ ట్రంప్ విషయంలో ప్రజాభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది.
యూగవ్ వెబ్‌సైట్ ప్రకారం రిపబ్లికన్లలో 57 శాతం మంది ట్రంప్ రెండోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికి ఓకే అంటున్నారు. డిశాంటిస్ విషయంలో ఇది కేవలం 31 శాతం మాత్రమే. హార్వర్డ్ సీఏపీస్/హ్యారిస్ పోల్‌లో ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే నాలుగు పాయింట్లు ముందుండటం గమనార్హం. డెమోక్రాట్లు తమ రాజకీయం కోసం న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజ ల్లోనూ వ్యక్తమైంది.
స్టాలిన్ కాలపు హార్రర్ షో...
మధ్య అమెరికా ప్రాంతంలోని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్నినింపడం... న్యూయార్క్, వాషింగ్టన్లకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తులు, లిబరల్స్‌ను బూచిగా చూపడం ట్రంప్ రాజకీయంగా ఎదిగేందుకు కారణమైన అంశాలు. సాధారణ ప్రజలకు రక్షకు డిని తానేనని, వారి కోసం పోరాడేదీ తానేనని చెప్పుకొనే వాడు. అలాగే 2020లో తాను ఎన్నికల్లో ఓడిపోయేందుకు ‘వాళ్లు’ కార ణమని నమ్మించగలిగాడు. 2024లోనూ వాళ్లు తనను ఓడిస్తారని చెబుతున్నాడు. అందుకే ట్రంప్‌కు ఈ కేసు రష్యా నియంత స్టాలిన్ కాలం నాటి దమనకాండ మాదిరిగా కనిపిస్తోంది.
డెమోక్రాట్లు ఇప్పుడు నమ్మాల్సిన విషయం ఒకటే. ఎలాగోలా ట్రంప్‌కు కోర్టు ద్వారా నష్టం జరగాలి అని! ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇదెలాగూ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విచారణను పూర్తిగా వాడుకోవడం ద్వారా రిపబ్లికన్ పార్టీలో రెండో స్థానంలో ఉన్న డిశాంటిస్‌కు ఎంతో కొంత ఆదరణ పెరిగేలా చేయడం... కానీ అది జో బైడెన్ తో పోటీలో గెలిచేంత కాకుండా చూడటం డెమోక్రాట్లకు అత్యవసరం అవుతోంది.
ఇంకోలా చెప్పాలంటే ఎన్నికలకు ఉన్న 18 నెలల కాలాన్ని ట్రంప్ వ్యక్తిత్వంపై దాడికి వాడుకోవాలి. ప్రపంచ స్థాయి వాణిజ్య పోరాటాలు, మరింత జటిలమవుతున్న ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను పట్టించుకోకుండా ట్రంప్‌పైనే దృష్టి పెట్టాలన్నమాట.
ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమతో విభేదించే వారి అడ్డు తొలగించుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన ధోరణి. ప్రజల విషయంలో ఇది మరీ ముఖ్యమవుతుంది. అమెరికన్లలో చాలామంది డోనాల్డ్ ట్రంప్‌ను ఇష్టపడుతున్నారు. నమ్ముతున్నారు కూడా! న్యూయార్క్‌లోని జడ్జి మీద కంటే ఈ విశ్వాసం, ఇష్టం ఎక్కువ. ఈ ధోరణి ప్రమాదకరమైంది కూడా! ఆశ్చర్యకరంగా ఇది అమెరికాతో పాటు పశ్చిమ దేశాల రాజకీయాలన్నింటిలోనూ వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇది నాయకత్వ సంక్షోభానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
సైమన్ జెన్కిన్స్
వ్యాసకర్త కాలమిస్ట్, రచయిత
(‘ద గార్డియన్ ’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment