మేరే పాస్ మాఁ హై! | Mere pass our high | Sakshi
Sakshi News home page

మేరే పాస్ మాఁ హై!

Published Sat, May 9 2015 11:05 PM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

మేరే పాస్ మాఁ హై! - Sakshi

మేరే పాస్ మాఁ హై!

పంచ్ శాస్త్ర
 
ఒకే పేగు తెంచుకొని పుట్టిన ఇద్దరు కొడుకులు. వాళ్ల దారులు వేరు. ‘దారులు వేరైనా వాళ్లకు అమ్మ మీద ఉన్న ప్రేమ ఒక్కటే. ఆదర్శాలు వేరైనా... అమ్మ మీద ఉన్న అనురాగం ఒక్కటే. ఒకరు ఇన్‌స్పెక్టర్...చాలా మంచివాడు.  ఒకరు... క్రిమినల్....చాలా చెడ్డవాడేమీ కాదు. కుటుంబం కోసం క్రిమినల్‌గా మారినవాడు. తనను ‘మంచి వాడు’ అని పిలుస్తున్నారా? ‘చెడ్డవాడు’ అని పిలుస్తున్నారా? అనేది అతనికి ముఖ్యం కాదు...తన కుటుంబం ఎంత సుఖంగా ఉందనేదే ముఖ్యం.  ‘దీవార్’ సినిమా అంటే గుర్తుకు వచ్చేది పాటలు, ఫైట్లు కాదు...ఒకే ఒక్క డైలాగ్... ‘మేరే పాస్ మా హై’
       
నిరూపరాయ్ అనే  అమ్మకు ఇద్దరు కొడుకులు. ఆ అమ్మ ఎలాంటిదంటే...బతికిన నాలుగు రోజులు ఆత్మగౌరవంతో బతకాలి. మోసానికి దూరంగా బతకాలి. ఏసీ భవనంలో నివసించే ‘సుఖం’ కంటే, కష్టంతో సంపాదించుకున్న సొమ్ముతో పూరి గూడిసెలో నివసించే ‘కష్టమే’ గొప్పదని నమ్ముతుంది.

అమ్మ ఒడి అంటే... ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ఎన్నో కథలు వినిపిస్తాయి. అవి కథలు మాత్రమే కాదు... జీవితాన్ని సక్రమమైన దారిలో నిర్మించుకోవడానికి అవసరమైన సాధనాలు.  నిరూపరాయ్  ఇద్దరు కొడుకులు  అమితాబ్,  శశికపూర్‌లు ఆమె ఒడిలో ఎన్నో పాఠాలు  నేర్చుకొని ఉండొచ్చు. అయితే, కాలక్రమంలో....  తల్లి చెప్పిన పాఠం చిన్నోడు శశికి వెలుగు దారిగా కనిపించింది.
 పెద్దోడికి... వెలుగే కనిపించని  చీకటి నిండిన చాదస్తపు దారిగా కనిపించింది. ‘కన్నీటిని కన్నీటితో జయించలేము. కత్తితో జయించాలి. అన్యాయాన్ని న్యాయంతో కాదు... అంతకంటే  అన్యాయంతో జయించాలి’ అనేది అమితాబ్ సిద్దాంతం. అందుకే అన్నదమ్ములు ఇద్దరి మధ్య  బెర్లిన్ గోడలాంటి  పెద్ద  గోడ. అన్నదమ్ములిద్దరి మధ్య ‘మోరల్ క్లాష్’కు అదో బలమైన ప్రతీక.  ‘‘తుమారే  మేరే బీచ్ మే ఏక్ దీవార్ హై’’ అంటాడు ఇన్‌స్పెక్టర్ శశి. ఆ కాల్పనిక  గోడకు చెరోవైపు నిల్చొని ఉన్నారు అమితాబ్, శశీలు.

‘‘నీ గోల పక్కన పెట్టు...అమ్మ నాతోనే ఉంటుంది. నీకు నా దగ్గర ఉండాలని లేకపోతే ఈ క్షణమే వెళ్లిపోవచ్చు’’ అంటాడు అమితాబ్. ఈ మాటలో ‘కఠినత్వం’ మాత్రమే కాదు...తన మీద తనకు అపారమైన ఆత్మవిశాసం ఉంది. మరి అమ్మ ఏమంటుంది? అదిగో ఆమె వైపు చూడండి. తలపై నెరిసిన ఆమె వెంట్రుకలు... పరిస్థితులతో పండి పోయిన వైనాన్ని సూచిస్తున్నాయి. పెద్ద కొడుకు అమితాబ్ మాటలు ఆసక్తిగా వింటోంది...

 అమితాబ్  అంటున్నాడు... ‘‘మేరా పాస్ బంగ్లా, గాడి సబ్ హై...’’ అప్పుడు అమ్మ చిన్నగా అంటుంది, ఆ చిన్న మాటల్లో ఎంత పెద్ద అర్థం ఉంది... ‘‘నేను చిన్నోడితో వెళుతున్నాను. నీ కొకటి చెప్పదల్చుకున్నాను నాయనా... నువ్వు సంపన్నుడివే కావచ్చు. అంతమాత్రాన... అమ్మను కొనే ప్రయత్నం చేయకు.  నువ్వు ఎంత సంపన్నుడివైనా... అమ్మను కొనేంత సంపన్నుడివి ఇప్పుడే కాదు... ఎప్పుడూ కాలేవు. గుర్తుంచుకో..’’  ఈ సన్నివేశానికి వచ్చిన స్పందన...ఇంతా అంతా కాదు! అమ్మను కొనే సంపన్నుడు భూమి మీద పుట్టలేదు. పుట్టబోడు!!
       
అన్నదమ్ముల మధ్య మాటల యుద్దం జరుగు తుంది. ‘‘నా మాట విను..’’ అని శశి మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అమితాబ్. ‘‘వినను’’ అంటూనే తన ఆదర్శం గురించి చెబు తున్నాడు శశి.  ‘‘మాట్లాడితే ఆదర్శం అంటావు. నీ ఆదర్శాలన్నీ  కలిసి ఒక రొట్టె తయారు చేసుకొని తినడానికి కూడా పనికి రావు...’’  శశిలో ఎలాంటి చలనం లేదు.  ‘‘...ఇటు చూడు... ఇటు చూడు. నావైపు చూడు. నువ్వెలా ఉన్నావు. నేనెలా ఉన్నాను. ఇద్దరం ఒకే చోటు నుంచి బయలుదేరాం. ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నేనెక్కడ ఉన్నాను? ఏముంది నీ దగ్గర? ఒంటి మీద యూనిఫాం, ఉండడానికి క్వార్టర్స్, తిరగడానికి జీప్ తప్ప...!
 మరి నా దగ్గర-  ‘ఆజ్ మేరే పాస్ బంగ్లా హై... గాడి హై... బ్యాంకు బ్యాలెన్స్ హై... తుమ్హరా పాస్ క్యా హై?’ (ఇవ్వాళ నా దగ్గర బంగ్లా ఉంది. కారు ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. మరి నీ దగ్గర ఏముంది?)
 
ఈ ప్రశ్నకు శశి ఇచ్చిన జవాబు భారతదేశాన్ని ఉర్రూతలూపేసింది.  ‘మేరే పాస్ మా హై’ (నా దగ్గర అమ్మ ఉంది)
 అమ్మ గొప్పదనం గురించి చెప్పాలంటే అనంతమైన శ్లోకాలు అక్కర్లేదు. భావోద్వేగభరిత శోకాలు అక్కర్లేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు అక్కర్లేదు. భారీ పుస్తకాలు అక్కర్లేదు. ఒక్క చిన్న మాట చాలు... అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది!
 - యాకుబ్ పాషా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement