నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్‌స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్‌ఐ మధు, ఏఎస్‌ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌గా ఎల్‌బీనగర్ డీఐ సుధాకర్‌ను నియమించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్‌బీనగర్‌లోని భరత్‌నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్ అతని కుమారుడు (16), గౌతమ్‌ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్‌పై మల్లేష్, నరేష్ అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్‌కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్‌స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు.
ఉప్పల్ ఎస్‌ఐపై కూడా..
ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్‌ఐ సీహెచ్ శంకర్‌పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్‌లో ప్రేమ జంట ఇచి్చన ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్‌ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్‌ఐ శంకర్‌పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌గా డీఐ మన్మథరావును నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment