Bal Gangadhar Tilak
-
చైతన్య భారతి: లోకమాన్యుడు బాల గంగాధర తిలక్ 1856–1920
సాంప్రదాయిక జాతీయవాదాన్ని స్వాతంత్య్రోద్యమంగా మలిచే ప్రయత్నం చేశారు బాల గంగాధర తిలక్. 1893లో ఆయన వినాయక చతుర్థి ఉత్సవాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఇందుకొక ఉదాహరణ. ఈ మహారాష్ట్ర యోధుడికి గాంధీ మార్గం పట్ల కొన్ని అభ్యంతరాలు ఉండేవి. 1920లో తిలక్ చనిపోయినప్పుడు బొంబాయిలో ఆయన అంత్యక్రియలకు హాజరైన 2 లక్షల మందిలో గాంధీ కూడా ఉన్నారు. ‘తిలక్ ఆధునిక భారత నిర్మాత’ అని గాంధీ వర్ణించారు. బాల గంగాధర తిలక్ అసమాన జనాకర్షణ కలిగిన శక్తిమంతమైన రాజకీయవేత్త. బ్రిటిష్ పాలనపై తిలక్ తీవ్రమైన విమర్శలు గుప్పించేవారు. వారి విధానాలను వ్యతిరేకించడంలో సమర్థమైన పాత్ర పోషించేవారు. అందుకు ఆయనను ‘లోకమాన్య’ అని గౌరవంగా పిలిచేవారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడైన తిలక్ కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. బాల్యంలోనే ఆయన స్వతంత్ర వైఖరి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పుణెలోని దక్కన్ కాలేజీలో చేరి గణితశాస్త్రంలో అమోఘమైన ప్రావీణ్యం సంపాదించారు. కాలేజీలో చదువుకుంటూనే ఆయన దేహదార్ఢ్యం పెంచుకోవడం కోసం జిమ్నాస్టిక్స్, కుస్తీ, ఈతలతో పాటు పడవ నడపడం వంటి కసరత్తులు చేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పుణెలో కొంతకాలం గణిత శాస్త్ర బోధకుడిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన జాతీయవాదాన్ని బోధించే విద్యా సంస్థల్లో చేరారు. 1880ల తొలినాళ్లలో ఆయన జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ‘మరాఠా’ అనే ఇంగ్లిషు పత్రికను, ‘కేసరి’ అనే మరాఠీ భాషా పత్రికను ప్రారంభించారు. ఆయన అందులో రాసే వ్యాసాలు ఎంతో హేతుబద్ధంగా, ముక్కుసూటిగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో మితవాదులు, అతివాదుల మధ్య చీలిక మొదలైంది ఆ దశాబ్దంలోనే. పాశ్చాత్య విద్యను అభ్యసించిన భారతీయులతో అధికారాన్ని పంచుకోవాలని మితవాదులు బ్రిటిష్ వారిని కోరే ప్రయత్నం చేశారు. మితవాదుల యాచక వైఖరిని వ్యతిరేకించిన కూటమి పట్ల ఆకర్షితులైన తిలక్ ఆ కూటమికి నాయకుడిగా మారారు. స్వరాజ్యమే నా ధ్యేయమని ఆయన నిక్కచ్చిగా నినదించారు. – రిచర్డ్ క్యాష్‌మన్, ‘ది మిత్ ఆఫ్ ది లోకమాన్య : తిలక్, మాస్ పాలిటిక్స్ ఇన్ మహారాష్ట్ర’ గ్రంథ రచయిత -
మానవత్వం పరిమళించిన కవి తిలక్
సందర్భం ఆధునిక కవిత్వంలో మానవతా కేతనాన్ని నిలిపిన మహాకవి తిలక్. అనుభూతి వాద కవిగా ప్రకటించుకొన్న తిలక్ చేపట్టిన ప్రతి వస్తువునీ కవితామయం చేసి కవిత్వంలో వెలుగులు విరజిమ్మిన రవి. శైలీ రమ్యత సాధించిన నవకవి. జీవిత విశేషాలు : తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన 1921 ఆగస్టు 1న పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండపాక గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి సత్య నారాయణకు లోకమాన్య బాలగంగాధర తిలక్‌పై ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టారు. రచనా వ్యాసంగం : ఆధునిక సాహితీ ఉద్య మాల్లో అప్పట్లో ప్రముఖంగా ఉన్న భావకవితా ఉద్యమ ప్రభావంతో 1937లో ప్రభాతము–సంధ్య అనే పద్యకవితా సంకలాన్ని వెలువరించాడు. బొంబాయిలో 1942లో జరిగిన అఖిల భారత అభ్యుదయ సంఘం ప్రతినిధిగా పాల్గొన్నారు. అనారోగ్యం వల్ల 1945 నుండి 1955 వరకు సాహిత్య కృషి అంతగా సాగలేదు. 1961 నుండి కవిత్వంలో కొత్త పోకడలు చూపించాడు. కవిత్వంతో పాటు కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, లేఖా సాహిత్యం, మొదలైన ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేశాడు. మరణానంతరం 1968లో ఆయన వచన కవితలను విశాలాంధ్ర పబ్లికేషన్వారు ‘అమృతం కురిసిన రాత్రి’ పేరిట ప్రచురించారు. ఈ సంకలానికి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కవితా తత్త్వ వివేచన : తన కవితా లక్ష్యాన్ని వివరిస్తూ ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, ప్రజాశక్తుల విజయ ఐరావతాలు/ వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అందమైన ఆర్ధ్రమైన భావాలను అందమైన శైలిలో చెప్పడమే తన కవితా లక్ష్యమన్నాడు. ఆధునిక కవిత్వ తత్త్వాల్లో తన కవిత్వం దేనికీ చెందదని స్పష్టీకరించాడు. తిలక్ కవితా విమర్శకుడిగా ‘నవత–కవిత’ ఖండికల్లో ‘కవిత్వం ఒక అల్కెమి. దాని రహస్యం కవికే తెలుసు. కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. అని కవితా కళను రసవాదవిద్యతో పోల్చాడు. కవితా పర మావధిని వివరిస్తూ ‘కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చేయాలి, విస్తరించాలి. చైతన్య పరిధి. అగ్ని చల్లినా/అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి కావాలని వివేచించాడు. తిలక్ హైదరాబాద్ నగరాన్ని స్త్రీతో పోల్చి నగరం మీద ప్రేమగీతం ఖండిక రాశాడు. ట్యాంక్‌బండ్‌ను స్త్రీ నడుముతో, అబిడ్స్ని కళ్లతో పోల్చాడు. నౌబత్పహాడ్ని నాగరంగా భావించి వర్ణించాడు. తపాలాశాఖ వార్షికోత్సవ సందర్భంగా తిలక్ మిత్రుడు డాక్టర్ తంగిరాల వెంకటసుబ్బారావు అభ్యర్థన మేరకు తపాలా బంట్రోతు ఖండిక రాశాడు. అప్పటి కవుల దృక్పథాన్ని అన్యాపదేశంగా అధిక్షేపిస్తూ ‘ఈ నీ ప్రార్థన కడుంగడు అసహ్యం సుబ్బారావు/ ఉత్త పోస్టుమన్ మీద ఊహలు రానే రావు’ అంటూ ప్రారంభించి తపాలా బంట్రోతు స్థితిని ‘ఎండలో వానలో ఎండిన చివికిన చిన్న సైజు జీతగాడు’ అంటూ వర్ణించాడు. ఆర్తగీతం ఆరంభంలో ‘నాదేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించ లేను. ఈ విపంచికలో శృతి కలుపలేను’ అని నిర్మోహ మాటంగా ప్రకటించాడు. తిలక్ కవితా ఖండికల్లో అధిక్షేపాత్మకాలెన్నో ఉన్నాయి. ప్రత్యేకించి ‘న్యూ సిలబస్’ ఖండికలో భారతదేశంలో అధిక జనాభాను, ఆర్థిక పరిస్థితిని అధిక్షేపిస్తూ ‘అమెరికాలో డాలర్లు పండును/ఇండియాలో సంతానం పండును’ అంటారు. స్త్రీలపై జరిగే అత్యాచారాలను, వేధింపులను అధిక్షేపిస్తూ ‘గజానికొక గంధారీ కొడుకు, గాంధీగారి దేశంలో... అంటాడు. ఆధునికాంధ్ర కవిత్వంలో అద్భుతమైన శైలీ విన్యాసంతో మానవతావాదానికి మకుటాయమానమైన ఖండికలతో అభ్యుదయానురక్తితో అమృతం కురిసిన రాత్రి సంకలాన్ని సృష్టించిన తిలక్ చిరస్మరణీయుడు. ఆధునిక కవులకు అనుసరణీయుడు. (ఆగస్టు 1న మహాకవి తిలక్ శతజయంతి) వ్యాసకర్త సాహితీ విమర్శకులు ‘ 98491 77594 డా. పీవీ సుబ్బారావు -
ఓడిపోయిన మనిషి
తెరచి ఉన్న కిటికీలోంచి వొంటి మీద జల్లుపడి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను. సన్న చినుకులతో వాన. గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది. సగం నలుపూ, సగం తెలుపూ గల తెలవారగట్ల సన్నని చినుకుల ధారలు గాలిలో కదలిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. ప్రహారీ గోడ దగ్గర మందార చెట్టు పువ్వులు ఎర్రగా వానలో తడుస్తున్నాయి. చల్లని గాలికి వొళ్ళంతా ఏదో హాయిగా ఏంది. చల్లదనం మనస్సులోకి వెళ్ళి బాధ్యతల్నీ, సమస్యల్నీ, భయాల్నీ దాచుకున్న వేడి సెరిబెల్లానికి కూడా చల్లపరుస్తోన్నట్టు అనిపించింది. కళ్ళు మూసుకున్నాడు. ఎవరో మంచుకోండల మీద స్కేటింగ్ చేస్తోన్న దృశ్యం. విశాఖపట్నంలో డాల్ఫిన్స్ నోస్ దగ్గర తెల్లని ఓడ కదులుతూన్న దృశ్యం. మద్రాస్ కాలేజీ ఆవరణలో ఎవెన్యూలో నడుస్తూన్న దృశ్యం. ఈ మూడింటికి ఏదైనా సంబంధం ఉందా? హాయిలో హాయి అనే పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకున్నట్లు ఏదో ఫీలింగ్. ఈ ఫీలింగ్‌ని పోనివ్వకూడదనుకుంటూనే వొళ్ళు ముడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ చల్లని వానని మనసులో కురిపించుకుంటూ, చెయ్యి పక్కకి జాపాను. మెత్తగా ముదురుగా లావుపాటి పాత రబ్బరులాగ చేతికి తగిలింది. అంతవరకూ పక్క మీద నా పక్కనే సుభద్ర పడుకుని ఉందన్న మాట మరిచిపోయాను. పండ్రెండేళ్ల క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలు, రహస్యాలు నాలో ప్రసరింపచేసిన ఈమె శరీరం, ఇన్నేళ్ళ పరిచయంలో, పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి ఈనాడు ఆకర్షణని కోల్పోయి ‘ఇల్లాలు’ అనే ఒక వ్యర్థ గౌరవప్రదమైపోయిన ఈమె శరీరం, నా చేతికి తగలగానే వానా, వేకువా, మందార చెట్టూ గబుక్కున మాయమైపోయాయి. వాటి స్థానే పెళ్ళికి ఎదుగుతున్న ఆడపిల్లో, ట్యాన్సిల్స్ ఆపరేషన్ చేయించవలసిన చిన్న కొడుకూ, బ్యాంకిలో తరిగిపోతున్న డబ్బూ, ఎప్పుడూ రిపెయిర్స్ కొచ్చే కారూ వచ్చి నిలుచున్నాయి. కాసేపు కూడా కల్పన సుఖాన్ని ఊహించుకోనివ్వని కఠిన వాస్తవికతలా కనబడింది భార్య. ఆమె వైపు తిరిగి చూశాను. వొంటి మీద సగం సగం బట్టతో, రేగిన జుట్టుతో గృహిణీ ధర్మాన్ని రోజంతా నిర్వహించిన అలసట కనిపించే కనురెప్పలతో జాలిగా కనిపించింది. ఏదో బాధ అనిపించింది. ఎవరో నన్ను దగా చేస్తున్నారనిపించింది. మాంచి ట్యూన్ వినిపించే రేడియా గొంతుని ఎవరో నొక్కేసి వికటంగా నవ్వినట్టనిపించింది. ప్రథమ యౌవన దినాలు లీలగా జ్ఞాపకం వచ్చాయి. సుతారపు అత్తరువాసనలాంటి జ్ఞాపకాలు–ఆరోజులు! మళ్ళీ అటు తిరిగి పడుకున్నాను. చల్లనిగాలి మొహానికి తగులుతోంది. వెనక్కి వెళ్ళిపోతున్నాను. ముదిరిన ఏళ్ళ పర్వతాల మీద నుంచి వెనక్కి వెనక్కి లోయల్లోకి, పచ్చిక బయళ్ళలోకి వెళ్ళబోతున్నాను. రొమాన్సూ, ఆదర్శాలు, అమాయకత్వం కలిసిన వేడి వేడి రక్తం. జేబునిండా డబ్బూ, సినిమాలు పైలా పచ్చీసుగా ఉండేది. భావకవిత్వం మీదా, సుభాస్‌బోస్ నాయకత్వం మీద మోజు. ఇంగ్లీషు వాళ్ళన్నా, ఉద్యోగస్తులన్నా చిరాకూ, ద్వేషమూ. ఈ వయస్సులోనే చిన్న చిన్న రొమాన్సులు ప్రారంభం. రెండు కలువ రేకులలాంటి కళ్ళుగాని, చివరికి–జవ్వాడే నడుం మీద నాట్యం చేసే వాల్జడగాని కవిత్వంలోకి పంపివేసేది. సామ్రాజ్యవాదాన్ని, సంప్రదాయాన్ని ఎదిరించాలనే సాహసం. కాని మరి కొంచెం ఎదిగేటప్పటికి నాకు తెలియకుండానే ఎన్నో జాగ్రత్తలు వచ్చి కూర్చున్నట్లు తెలుసుకున్నాను. లోపల–నా లోపల ఎవడో పెద్దమనిషీ బుద్ధిమంతుడూ అయిన వాడు పరివ్యాప్తమౌతున్నాడు, మెడ చుట్టూ కండువా వేసుకుని, కొంచెం వొంగి, కర్రనానుకుని జీవితాన్ని భద్రంగా ఇటూ అటూ చెదిరిపోకుండా తాళం వేసుకుంటున్నాడు. బాలని ప్రేమించాను. అలాగని చెప్పాను కూడా. అయినా చివరికి ఏమీ ఎరగనట్టుగా తప్పుకున్నాను. పెళ్ళిపందిట్లో ఆరాత్రి నేను తలనొప్పితో విడిది మేడగదిలోనే పడుకున్నాను. అందరూ పందిట్లో ఉన్నారు. పెట్రోమాక్సు లైటు ఆరిపోయింది. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. మెట్ల మీద చప్పుడు వినపడింది. ఎవరా అని చూశాను. బాల! నల్లని కాటుకతో, బుగ్గ మీద చుక్కతో బాల నా దగ్గరకు వచ్చి తట్టి లేపింది. ఏమీ ఎరగనట్టుగా ‘‘ఎవరూ?’’ అన్నాను. ‘‘నేను బాలని’’ ఆమె గొంతులో బాధ, ఆవేశం. ‘‘రేపు ఉదయమే నాకు పెళ్లి అయిపోతోంది’’ నేను మాట్లాడలేకపోయాను. ‘‘ఏం నిద్రపోతున్నావా?’’ అంది. ‘‘లేదు’’ ‘‘ప్రేమించానని, పెళ్లి చేసుకుంటావనీ అన్నావు. పల్లెటూరి పిల్లననీ, ప్రతిమాట నమ్ముతాననీ, ఏంచేసినా ఊరుకుంటానని అనుకున్నావా?’’ ‘‘..... ...... ....’’ ‘‘ఏం మాట్లాడవేం?’’ ‘‘అది కాదు బాలా, ఇలా జరుగుతున్నందుకు నేనెంత బాధ పడుతున్నానో దేవుడికి తెలుసును’’ ‘‘మరి–?’’ ‘‘మా వాళ్లెవరికి ఇష్టం లేదు. మీ కుటుంబానికి మాకూ శత్రుత్వముందట. మీ చిన్నాన్న మా నాన్నని చంపడానికి కొచ్చాడట’’ ‘‘ఇదివరకు నీకు తెలియదా?’’ ‘‘తెలియదు’’ ‘‘అది జరిగి ఇరవై ఏళ్ళయింది. ఇప్పుడు దెబ్బలాటలు లేవుగా. ఒకిరిళ్ల కొకరు వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు...’’ ‘‘అయినా మావాళ్లెవరికీ ఇష్టం లేదు’’ ‘‘మీ వాళ్ళంటే?’’ ‘‘మా నాన్న, అమ్మా, మా అక్కయ్య, అన్నయ్య, మా మేనత్త...ఆఖరికి మా పాలేరు కూడా.’’ ‘‘అయితే ఈ వశంగా ఎక్కడికేనా పారిపోదాం. నా వంటి మీద నాల్గువేల బంగారం ఉంది. నిన్ను వొదిలి ఉండలేను’’ ‘‘ఛ..ఛ..ఇప్పుడెలాగ, నలుగురూ ఏమనుకుంటారు?’’ ఆమె ఏడుస్తూ కూర్చుంది. బాల చాలా అందమైంది. అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం. అటువంటి అందం అన్నిచోట్లా కనిపించదు. నాకు బాధగా ఉంది. నిజమే కాని ఎంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి, నా భవిష్యత్తుని ఏం చేసి ఈమెను నాదాన్ని చేసుకోగలను. కోపంతో మీరి ఎరుపెక్కిన జీరలు కల కళ్లుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిది వేల కట్నంతో జడ్డిగారి సంబంధం, రాజకీయంగా నేను వేసుకున్న ప్లానులు... ఇవన్నీ ఏమౌతాయి? ‘‘కిందికి వెళ్లిపో బాలా. ఎవరైనా వొస్తారు’’ అన్నాను. బాల కోపంగా లేచి నుంచుంది. వెన్నెల రేకలో ఆమె పెదవి వణకడం కూడా కనబడింది. కోపమూ ఏడుపూ కలిసిన కంఠంతో ‘‘నూతిలో పడి చద్దామనుకున్నాను. కాని తప్పు నీది కాదు. నువ్వు మగాడివి కాదు. నీకన్న ఏ వెధవైనా వెయ్యిరెట్లు నయం’’ అని విసవిసా వెళ్లిపోయింది. స్తంభించిపోయిన నా లోపల్లోపల ఈ సమస్య ఇలా పరిష్కారమైనందుకు సంతోషించానో, ఆమె దూరమైపోతున్నందుకు బాధ పడ్డానో నాకు తెలియదు. నాలుగేళ్ళ అనంతరం ఆమె చాలా జబ్బుతో జనరల్ ఆస్పత్రిలో ఉందని తెలిసి మనసు పట్టలేక వెళ్ళాను. నర్సు వచ్చి ‘‘మిమ్మల్ని చూడడానికి వీల్లేదంది ఆమె. మిమ్మల్ని పంపించి వెయ్యమంది’’ అని చెప్పింది. నర్సుతో బతిమిలాడాను. ఆమె నావల్లనే, నా కోసమే ఇలా అయిపోయిందన్న బాధతో, పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను. చివరికి ఆమె దగ్గరికి వెళ్లాను. వంద కేరట్ల రత్నాన్ని చెక్కి వేయగా చెక్కి వేయగా మిగిలిన అణువులా ఆమె కృశించిన శరీరమూ, మొహమూ మెరుస్తోంది. నన్ను చూసి ఆమె పక్కకు తిరిగి పడుకుంది. ‘‘బాలా’’ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ‘‘నన్ను క్షమించు. ఒకటి చెబుతున్నాను. ఏనాడూ నా హృదయం నుండి నువ్వు తొలగిపోలేదు. నేను పిరికివాణ్ణి. కాని ఆజన్మాంతం నిన్ను మరిచిపోను. మనసా నేను నీ వాడిని’’ ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాను. నా మాటలు ఆమె నమ్మలేదు. అవిశ్వాసంతో, ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో నన్ను చూసింది. నాకు కన్నీరాగ లేదు. ‘‘వస్తాను బాలా’’ అని డగ్గుత్తికతో గబగబా ఆమెని విడిచి వచ్చేశాను. ఒక నెల్లాళ్ళ తర్వాత ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ జ్ఞాపకాలతో నా వొళ్ళంతా వేడెక్కిపోయింది. ఊపిరాడనట్టనిపించింది. గది గోడలు దగ్గరిగా వచ్చి నన్ను నొక్కుతున్నట్లు అనిపించింది. లేచి, గొడుగు తీసుకొని వీధిలోకి వచ్చేశాను. వాన ఇంకా కురుస్తూనే ఉంది.స్వేచ్ఛగా, విశాలంగా తిరిగి వస్తేనే కాని ప్రాణం కుదుటపడుతుందనిపించలేదు. కాలవ వారనే బయలుదేరి వెళ్ళుతున్నాను. కాలువ అవతల మా పొలాలు ఉన్నాయి. తెల్లవారిపోతుంది. వాన నీటికి రాత్రి వొంటి రంగు కరిగి తెల్లబడుతున్నట్టుగా ఉంది. రేగటి మట్టి కాలి జోళ్ళకి అంటుకుని బరువుగా అడుగులు వేస్తున్నాను. చల్లనిగాలి రివ్వుమని తగులుతుంటే కొంత ఉత్సాహం కలిగింది. ఆకాశం మబ్బులతో నిండి వుంది. కాలవ వారనున్న చెట్ల ఆకుల మీద నుంచి జల్లుమని జడి పడుతోంది. కాకులు అరుస్తూ అటూ ఇటూ పోతున్నాయి. కాలవ అవతలి వైపున అరటి తోటలూ, వరి చేలూ పొడుగ్గా పరుచుకొని అందంగా ఉన్నాయి. కర్ర వంతెన వచ్చింది. వంతెన కింద కాలవ సుడి తిరుగుతుంటే కొంతసేపు చిత్రంగా చూశాను. వంతెన దాటి పొలం గట్టునే వెళుతుంటే ‘‘ఏవండోయ్’’ అన్న పిలుపు వినిపించింది. వీరన్న మామిడితోటలోంచి ఆ పిలుపు. తోటలో పైన గడ్డి కప్పిన ఇటికల ఇంటి ముందరుగు మీద ఎవరో ఆడ మనిషి నిలుచుంది. నన్నేనా అనుకున్నాను. తోటలోకి రెండడుగులు వేశాను. అరుగు మీద చామన చాయగా, బొద్దుగా, పొడి పొడిగా ఉన్న జుట్టు బుగ్గల మీద పడుతుంటే నవ్వుతూ సుబ్బులు. మంచి పొంకంగా, ఆరోగ్యంగా ఉన్న యవ్వనం అసూయని కలిగించేటట్లు ఉంది. సుబ్బుల్ని నేను చిన్నతనం నుంచి ఎరుగుదును. అయిదో క్లాసు వరకూ నాతో కలిసి బళ్ళో చదువుకుంది. అయినా ఆమె నాకన్నా చిన్నదిగా, చాలా చిన్నదిగా ఉంది. పాతికేళ్ళంటే నమ్ముతారు సుబ్బులు వయస్సు. ‘‘ఎప్పుడొచ్చావు సుబ్బులు...’’ అన్నాను నవ్వుతూ. ‘‘రావయ్యా లోనికి రా. వర్షంలో తడుస్తా ఎంతసేపుంటావు?’’ నేను తటపటాయించాను. ‘‘ఎవరూ సూడ్డం లేదులే. అబ్బో, మా పెద్దమనిషైపోయావు’’ కనుబొమ లెగరేసి చేతులూపుకుంటూ అంది. నేను లోనికి వెళ్ళాను. సుబ్బులు ఇంట్లోంచి ఒక కుర్చీ తీసుకు వచ్చి వేసింది. ‘‘సిన్నప్పుడు నువ్వీ దారిని యెల్తా వుంటే చెరుకుపాకం ఇచ్చేదాన్ని. గ్యాపకం ఉందా. ఎప్పుడేనా ముద్దెట్టుకుంటావేమో అనుకునేదాన్ని. అయ్యో రాత ఆ సరదాయే లేదు...’’ ఫక్కున నవ్వుతోంది. నాకు సిగ్గుగా బెదురుగా వుంది. ఆమె ముందు నేను ముడుచుకుపోతున్నాను. ‘‘అలా సిగ్గుపడుతూ కూర్చో. కొంచెం కాఫీ కాచి తీసుకువస్తాను’’ అంటూ లోపలికి వెళ్ళింది. సుబ్బులు యాసనీ, నాగరికాన్ని కలిపి మాట్లాడుతుంది. అలాగే ప్రవర్తిస్తుంది. పట్టణాల్లో చాలాకాలం ఉంది. సుబ్బులు మొహంలో విచారం తాలూకు నీడ కాని, వయస్సు తాలూకు నీరసం కాని లేదు. జీవింతలో ఎంతో సుఖాన్ని, స్వేచ్ఛని పొందినవాళ్ళు తప్ప అంత హాయిగా నవ్వలేరు. ఆమె నాకన్న మూడేళ్లు చిన్నదైనా పదిహేనేళ్ళు చిన్నదిలా కనబడుతోంది. వింతగా ఆలోచిస్తున్నాను ఆమెను గురించి. ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ మంచి రుచిగా ఉంది. నా ఎదురుగా ముక్కాలిపీట మీద కూర్చుని జుట్టు విప్పుకుంది. కళ్ళల్లో ఆరోగ్యపు వెలుతురు. ఆందోళనలు లేని వెలుతురు. ‘‘ఏడెనిమిదేళ్ళయింది నిన్ను చూసి సుబ్బులూ. రంగడు కులాసాయేనా’’ అన్నాను ఆమె భర్త నుద్దేశించి. ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది. ‘‘రంగడా! ఇంకా ఆడెక్కడ? బలేవాడివయ్యా తెలియనట్టు మాటాడుతావ్’’ అంది. ‘‘ఏం, రంగడు పోయాడా’’ ఆత్రుతగా అన్నాను. ‘‘ఛఛ దుక్కలా ఉన్నాడు. నేనే వాడిని వొగ్గేశాను’’ ‘‘ఏం?’’ ‘‘నా కిష్టం లేకపోయింది. భయమా?’’ ‘‘ఇన్నాళ్లూ మరి ఏంచేస్తున్నావు’’ ‘‘వీరస్వామితో గుంటూరు వెళ్ళిపోయాను. అతను పెద్ద మేస్త్రీ. మాంచి డబ్బున్నవాడు కూడా’’ ‘‘అతన్ని పెళ్ళి చేసుకున్నావా?’’ ‘‘ఆ...గుంటూరులో మా బలేగా వుందిలే. నగలూ, బట్టలూ, సినీమాలు–ఓ దర్జాగా ఉండేది. వీరస్వామి కూడా బాగుండే వాడు కాని...’’ ‘‘అతనితో కూడా చెడిందా’’ ‘‘అతను దేన్నో మరిగాడు. నాకు శానా కోపం వచ్చింది. నీకింటి దగ్గర దెబ్బలు తిని శాకిరీ సెయ్యడానికి నేనేం యెదవని కాదని చెప్పి నా నగలూ డబ్బూ తెచ్చుకుని వేరే వెళ్లిపోయాను’’ ‘‘ఇప్పుడు కలుసుకున్నారా, మళ్ళీ–’’ ‘‘ఆడినీ ఒగ్గేశాను’’ నేను తెల్లబోయి చూస్తున్నాను. ‘‘అదేంటలా చూస్తావు! ఇష్టం లేని వాడితో కాపురం చేసి ఏడుస్తా చావనా? నా దగ్గర అటువంటిది లేదయ్యోయ్. బతికిననన్నోళ్లు కులాసాగా బతుకు. నా కన్నాయం ఒహరు చేస్తే ఊరుకునేది లేదు’’ ‘‘మరి ఇప్పుడొకర్తివే ఉన్నావా?’’ ‘‘నువ్వున్నావు కదయ్యా. నీ కోసమే వచ్చినాను. అబ్బ, నువ్వంటే నేటికి మనసే నాకు. పాడు మనసు...’’ గమ్మత్తుగా చూస్తూ పమిట కొంగు నోటికి అడ్డం పెట్టుకు నవ్వుతోంది. ‘‘బాగుంది నీ హాస్యం’’ అన్నాను నేను సిగ్గుపడుతూ. ‘‘బెజవాడ రైల్వేలో పనిచేస్తున్నాడు రాఘవులు. అతనితో వుంటున్నా’’ అంది మళ్ళీ. ‘‘మనువా?’’ ‘‘మనువూ లేదు శ్రాద్దం లేదు. నాకంటే సిన్నోడు. అయినా మా అందగాడు. స్టోర్సులో పనిచేస్తున్నాడు. నేనంటే వల్లమాలిన ప్రేమ రాఘవులికి. నొక్కుల జుట్టుతో, చిన్న పెదాలతో బలే అందంగా వుంటాడు’’ అంది ఆప్యాయత కళ్ళలో కనపడేటట్టు. నేను లేచాను. కోర్టు పని ఉంది. ఇవాళ ఎన్నో కాగితాలు చూసుకోవాలి. ‘‘ఇంకా ఉంటావా సుబ్బులూ’’ ‘‘మా బాబుని చూసి పోదామని వచ్చాను. రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను’’ ‘‘ ఓసారి మా ఇంటికిరా. మా ఆవిడకు కనిపించు’’ అంటూ అరుగు దిగాను. ‘‘నేనెందుకొచ్చి చూస్తానూ నా సయితీ! సర్లే. అందమైన వాడినని నీకు గర్వం లేవయ్యా’’ నవ్వుతూ చేతులూపుతూ అంది. వానలో తిరిగి ఇంటికి బయలుదేరాను. ఆమెలో ఆనందానికి, ఆరోగ్యానికి నవనవోన్మేషతకీ కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. జీవితాన్ని తేలిగ్గా సహజంగా తీసుకోవడమా? కృత్రిమమైన నీతులూ భయాలు పెద్దరికాలు అడ్డురాక పోవడమా? ఇంత చదువూ డబ్బూ వుండి నాలో ఈ అసంతృప్తి దిగులు ఏమిటి? ఏదో చేయలేక పోయానన్న వేదన. కలలు కాగితపు పేలికల్లా రాలిపోయిన క్షోభ. చెంపల దగ్గర నెరిసిన జుట్టు క్రమంగా అంతటా తెల్లబడి ముసలివాణ్ని, మృత్యుపదాభిముఖుణ్ణి అయిపోతున్నానన్న బెదురూ...ఏమిటి ఇదంతా? ఎక్కడ నేను జీవితరహస్యాన్ని మరిచిపోయాను? ఏ సమయంలో జీవించడంలోని కీలకం జారిపోయింది? ఈమె–చదువూ, సంస్కారమూ లేని సుబ్బులు ముందు నేను చాతకానివాడిలా ఎందుకయిపోయాను? బరువుగా బాధగా అడుగులు వేసుకుంటూ కర్ర వంతెన దాటాను. కాలవ వారనే జనం బాగా తిరుగుతున్నారు. వర్షానికి కాకులు తడుస్తూ చెట్ల కొమ్మల మీద వణుకుతూ కూర్చున్నాయి. మనసులో ఆలోచన హెచ్చిన కొలదీ అడుగులు వేగంగా వేస్తున్నాను. జీవితపు పందెంలో ఓడిపోయిన వాడిని. - బాలగంగాధర తిలక్ -
స్వాతంత్ర్య పిపాసి
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. అందుకు సంబంధించిన స్పృహ నాలో చైతన్యవంతంగా ఉన్నంతకాలం నేను వృద్ధుడిని కాను. ఆ స్ఫూర్తిని ఏ ఆయుధమూ ఖండించలేదు. ఏ నిప్పూ దహించలేదు. ఏ నీరూ తడిపి ముద్ద చెయ్యలేదు. ఏ గాలీ ఎండిపోయేటట్టు చేయలేదు. మనం స్వయం పాలన కోరాలి. సాధించుకోవాలి.’ హోమ్‌రూల్ లీగ్ తొలి వార్షికోత్సవం (1917) నాసిక్‌లో జరిగినప్పుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇచ్చిన ఉపన్యాసంలో కొన్ని మాటలవి. ఆ ఉపన్యాసం యువకుల కోసం చేశారు. తనది వృద్ధుడి శరీరమే అయినా ఆత్మ మాత్రం ఎప్పటికీ శిథిలం కాదని కూడా అన్నారు తిలక్. స్వాతంత్య్రం అన్న భావనను ఆత్మతో అనుసంధానం చేసి, తరం తరువాత తరం దానిని అనుభవించాలని ఆయన ఆకాంక్షించారు. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. దానిని సాధించి తీరుతాను’ అంటూ బాలగంగాధర తిలక్ భారత జాతికి ఇచ్చిన నినాదంలో ఎన్నో రాజకీయ చింతనల సారాంశం దట్టించుకుని ఉన్నట్టు అనిపిస్తుంది. స్వాతంత్య్రోద్యమ చరిత్ర భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. అలాంటి భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు తాత్విక భూమిక తిలక్ (జూలై 23, 1856–ఆగస్టు 1, 1920) నినాదం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నినాదం స్వరాజ్య ఉద్యమం మీద చూపిన ప్రభావం అంచనాకు అందనిది. తిలక్ మహరాజ్ ఇంగ్లిష్ విద్యను అందుకున్న తొలి తరం భారతీయులలో అగ్రగణ్యులు. ఆంగ్ల విద్య ప్రభావంతో భారతీయులు అనుభవిస్తున్న బానిసత్వం గురించి తెలుసుకున్న వర్గంలో కూడా తిలక్ అగ్రగణ్యులే. అంతేకానీ ఇంగ్లిష్ విద్యతో ఆంగ్లేయులకు మరింత బానిసలుగా మారిపోయిన వర్గంలో ఆయన పడిపోలేదు. ఆయన ఆంగ్ల విద్యను అభ్యసించారే కానీ, ఆంగ్ల సంస్కృతిని అలవర్చుకోలేదు. రాజా రామ్మోహన్రాయ్, దయానందుడు, వివేకానందుడు వంటి వారి కృషి ఫలితంగా భారతదేశం సాంస్కృతిక పురుజ్జీవనం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆ అడుగులలో అడుగు కలిపిన మహానుభావులు కొందరు ఉన్నారు. అందులో తిలక్ ఒకరు. ఇంగ్లిష్ చదువుకున్నా, మూలాలు ఇక్కడి మట్టిలోనే ఉండాలని భావించిన విజ్ఞులు తిలక్ కాలంలో కనిపిస్తారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలశ్రుతి తిలక్, ఆయన సమకాలికులు కొందరి ఆలోచనలలో కనిపిస్తుంది. మహదేవ గోవింద రెనడే, జ్యోతిరావ్ ఫూలే, లోక్‌హితవాది, బాల్శాస్త్రి జంభేకర్ అలాంటివారే. జాతీయవాదానికీ, భారతీయ సమాజ సంస్కరణకీ వీరు దేశీయమైన ఆలోచనలనే పునాదిగా స్వీకరించారు. తిలక్ కూడా అంతే. ఆయన సంస్కృత పండితుల కుటుంబం నుంచి వచ్చారు. స్వయంగా సంస్కృత పండితుడు. వారిది శోత్రియ కుటుంబం. అయినా హెగెల్, కాంట్, స్పెన్సర్, మిల్, బెంథామ్, వాల్టేర్, రూసోల సిద్ధాంతాలను శిరోధార్యంగా భావించారు. తండ్రి గంగాధర తిలక్ ఉపాధ్యాయుడు. సంస్కృత పండితుడు. తన పదహారవ ఏటనే తిలక్ తండ్రిని కోల్పోయారు. తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర తిలక్. అదే బాలగంగాధర తిలక్ అయింది. చదువంతా పుణేలో సాగింది. పూనా దక్కన్ కళాశాల నుంచి ఆయన గణితశ్రాస్తం ప్రధానాంశంగా పట్టా తీసుకున్నారు. కెరునానా ఛాత్రే గణితశాస్త్రంలో తిలక్ అభిమాన గురువు. అలాగే ఆచార్య వర్డ్స్ వర్త్ కూడా తిలక్‌ను అభిమానించేవారు. ఆయన మహాకవి వర్డ్స్‌వర్త్ మనుమడు. తరువాత తిలక్ న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు. తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్గణేశ్ అగార్కర్, ఇంకా మహాదేవ బల్లాల్ నామ్‌జోషి, విష్ణుశాస్త్రి చిప్లూంకర్ కలసి తిలక్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంస్థ ధ్యేయం. భారతీయ చింతన ప్రాతిపదికగా జాతీయ భావాలను పెంపొందించడమే ఆ సొసైటీ ఆశయం. ఈ వ్యవస్థాపకులంతా సంవత్సరం పాటు ఉచితంగానే విధులు నిర్వహించారు. తిలక్ గణితం, సంస్కృతం బోధించేవారు. మేఘదూతం కూడా ఆయనే చెప్పేవారు. న్యూ ఇంగ్లిష్ స్కూలు, ఫెర్గూసన్ కళాశాల దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీయే స్థాపించింది. పూనా కేంద్రంగా ఇవి పనిచేసేవి. తిలక్ ఎంతటి ఆలోచనాపరుడో, అంతటి కార్యశీలి. మొదట ఆయన విద్యావేత్త. తరువాత పత్రికా రచయిత. గ్రంథకర్త. రైతాంగ ఉద్యమాలలో భాగస్వామ్యం ఉన్నవారు. పూనా సార్వజనిక్ సభ నాయకత్వం గోఖలే తరువాత తిలక్ చేతికి వచ్చింది. 1896లో మహారాష్ట్రలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. సార్వజనిక్ సభ కార్యకర్తలను ఆయా ప్రాంతాలకు పంపించి, వాస్తవాలను సేకరించి వాటిని తన పత్రిక కేసరిలో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తిలక్ కృషి చేశారు. 1872లోనే రూపొందించిన ఫేమిన్ కోడ్‌ను బయటకు తీసి, మరాఠీ భాషలోకి అనువదించి రైతుల కోసం తిలక్ తన పత్రికలో వెలువరించారు. ఆ కోడ్ మేరకు ప్రభుత్వాన్ని రైతులు నిలదీయవచ్చునని తిలక్ ప్రబోధించారు. అయితే ప్రొఫెసర్ పరాంజపే అనే మేధావి కూడా రైతుల సభల ఏర్పాటు చేసి ఫేమిన్ కోడ్‌లో ఏమి ఉందో, ప్రభుత్వాన్ని ఏ మేరకు నిలదీసే అవకాశం ఉందో ఉపన్యాసాలు ఇచ్చినందుకు పోలీసులు నిర్బంధించారు. దీనితో తిలక్ స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఫేమిన్ కోడ్‌ను మరాఠీలోకి అనువదించి మరీ ప్రచురించిన తనను మొదట అరెస్టు చేయాలని పట్టుపట్టారు. కానీ తిలక్‌ను అరెస్టు చేయకుండా ఉండడమే కాదు, ప్రొఫెసర్ పరాంజపేను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. తిలక్ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించిన ఐదేళ్ల తరువాత మొదటిసారి సభలకు హాజరయ్యారు. చాలాకాలం ఆ సంస్థలో కొనసాగినా మితవాదుల ధోరణి ఆయనకు సమ్మతంగా ఉండేది కాదు. విన్నపాలు, వినతులు వలస ప్రభుత్వాన్ని లొంగదీయలేవని తిలక్ సిద్ధాంతం. కానీ ఆయన కాంగ్రెస్‌లోని చాలామంది ప్రముఖులను విశేషంగా గౌరవించేవారు. దాదాభాయ్ నౌరోజీ అంటే ఎంతో గౌరవం. భారత పేదరికం బ్రిటిష్ పుణ్యమేనన్న నౌరోజీ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా, తన పత్రికలో ఎంతో ప్రాచుర్యం కల్పించారు. అలాగే గోఖలేతో చాలా అంశాలలో తిలక్‌కు విభేదాలు ఉండేవి. ముఖ్యంగా వయో పరిమితి బిల్లు విషయంలో ఇద్దరికీ తీవ్ర విభేదాలు వచ్చాయి. అయినా గోఖలేను తిలక్ సగౌరవంగా చూసేవారు. కానీ 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సభలు తిలక్‌ను ఘోర అవమానానికి గురి చేశాయి. అదే ఆ సంస్థలో చీలికకు నాందీ వాచకమైంది. ఆ సభలకు అధ్యక్షుడు అరబిందొ ఘోష్ కావడం మరొక విశేషం. కాంగ్రెస్ సాధారణ భారతీయుడికి చేరువ కావాలన్నదే తిలక్ ఆశయం. కానీ అప్పటికి ఆ సంస్థ మహారాష్ట్ర, బెంగాల్ సహా పలు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయుల అధీనంలో ఉండేది. ఇంగ్లిష్ తెలిసినవారికే ప్రవేశం మరొక ఆటంకం. అయినా ఉదారవాదంలో ప్రజానీకం మనసును తాకే అంశాలు లేవన్నదే తిలక్ అభిప్రాయంగా కనిపిస్తుంది. జాతీయ కాంగ్రెస్‌లో పని చేస్తున్నప్పటికీ తిలక్ తనదైన మార్గం నుంచి తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్‌లోని మితవాదులకు రుచించేది కాదు. ఆయన 1893లో గణేశ్ చతుర్థిని సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని పుణే, బొంబాయిలలో తీసుకువచ్చారు. అది దేశవ్యాప్తమైంది. తరువాత శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. శివాజీ పట్టాభిషేకం జరిగిన రాయగఢ్ కోటలోనే ఆయన సమాధి కూడా ఉంది. కానీ అది శిథిలావస్థకు చేరింది. దీనిని పునరుద్ధరించేందుకు తిలక్ పెద్ద ఉద్యమమే నిర్వహించారు. మతం మనుషులను ఒక శక్తిగా నిలబెడుతుందని తిలక్ నమ్మకం. ‘మతం, వాస్తవిక జీవనం వేర్వేరు కావు. సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదు. అందులో ఉన్న నిజమైన స్ఫూర్తి ఏదంటే – దేశం మొత్తాన్ని కూడా నీ కుటుంబంగానే భావించడం. నీ కుటుంబం కోసమే కాకుండా, ఈ ప్రపంచం కోసం కూడా పనిచేయడం. దీని తరువాత మెట్టు మానవ సేవ. ఆ తరువాతి అడుగు భగవంతుడి సేవ’ అన్నారు తిలక్. అలా మతం ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించాలన్నదే తిలక్ ఉద్దేశం. అలాగే శివాజీ జీవితానికీ, పోరాటానికీ తిలక్ ఇచ్చిన నిర్వచనం ప్రత్యేకమైనది. హిందువుల హక్కులను హరిస్తూ, వారి మత విశ్వాసాలను దారుణంగా అవమానిస్తున్న మొగలుల మీద యుద్ధం చేసిన వీరునిగా తిలక్ విశ్లేషించేవారు. అలాగే అప్జల్‌ఖాన్ మరణం గురించి కూడా. అఫ్జల్ఖాన్ అనే బిజాపూర్ సైనికాధికారిని చంపడం వెనుక మత భావనను వెతక్కూడదని తిలక్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు కాబట్టే శివాజీ అఫ్జల్‌ను చంపాడని చెప్పేవారు. ఆనాడు ఆంగ్లేయుల యాజమాన్యంలో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా దీనినే వక్రీకరించి, తిలక్ హత్యను సమర్థిస్తున్నారని ప్రచారం ప్రారంభించింది. ఏప్రిల్15, 1896లో తిలక్ శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. దేశం కోసం మరణించడం అనే ఊహ మీద తిలక్ స్పందన కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకసారి అభినవ్ భారత్ సభ్యులు ఒక అంశం మీద సలహా కోసం తిలక్‌ను కలుసుకున్నారు. ఇది సావర్కర్ నాయకత్వంలో నడిచేది. అందులో ఎవరో ‘తాము దేశం కోసం చనిపోవడానికి కూడా సిద్ధమ’ని అన్నారు. అందుకు తిలక్, ‘అవసరమైతే మరణించడం సరే, కానీ దేశమాత సేవకు జీవించడం కూడా అవసరమే’ అని చెప్పారు.బ్రిటిష్‌జాతి మీద జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. అదే బెంగాల్ విభజనతో రుజువైంది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో లాలా లజపతిరాయ్, బిపిన్పాల్లతో కలసి తిలక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. నిజానికి ముస్లింలు, హిందువులకు మధ్య ఘర్షణలను నివారించడంలో బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తిలక్ కేసరిలో వాదించేవారు. బెంగాల్‌ను మత ప్రాతిపదికనే కర్జన్ 1905లో విభజించాడు. లాల్, పాల్‌లతో పాటు చిత్తరంజన్‌దాస్, రవీంద్రనాథ్ టాగోర్ వంటి బెంగాలీ ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి యువతరంలో అరవింద్ ఘోష్ అంటే ఎంతో ఆకర్షణ ఉండేది. ఘోష్‌తో తిలక్ అనుబంధం ప్రత్యేకమైనది. 1902లో ఆ ఇద్దరు మొదటిసారి అహమ్మదాబాద్ జాతీయ కాంగ్రెస్ సభలలో కలుసు కున్నారు. ఘోష్‌ను కాంగ్రెస్ డేరా బయటకు తీసుకు వెళ్లి తిలక్ చాలాసేపు మాట్లాడారు. ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒక్కటే. మితవాదుల పంథా సరికాదన్నది అందులో ఒకటి. అలాగే స్వాతంత్య్రోద్యమం మరింత విస్తరించాలి. విప్లవాత్మకం కావాలి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం జాతీయ స్థాయికి వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు. అవి–స్వరాజ్, జాతీయ విద్య, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ. ఇవి తిలక్ అందించినవేనని కొందరు రాశారు. వీటితోనే ఉద్యమం భారతీయులందరికీ చేరువ కాగలదని తిలక్ నమ్మారు. ఇవి ఆచరించదగినవే అయినా, మరింత విప్లవ దృష్టితో ఉద్యమం రావాలన్నది ఘోష్ అభిప్రాయం. ఇవన్నీ జరిగిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందనీ, తిలక్‌ని ఊరికే వదులుతుందనీ ఎవరూ అనుకోలేదు. అదే జరిగింది కూడా. అలాంటి అవకాశం కోసమే పొంచి ఉన్న పోలీసులకి ఏప్రిల్ 30, 1908న జరిగిన ముజఫర్‌పూర్ బాంబుదాడి, తరువాతి పరిణామాలు అవకాశం కల్పించాయి. బొంబాయిలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు భారతీయుల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించినందుకు ప్రతీకారంగా ఆ రోజున ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ అనే యువకులు బొంబాయి ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్ మీద బాంబు విసిరారు. అది గురి తప్పి ఇద్దరు స్త్రీలు మృతి చెందారు. ఆ ఇద్దరు యువకుల ఉద్దేశాన్ని మాత్రం తిలక్ కేసరి పత్రికలో శ్లాఘించారు. పైగా వెంటనే స్వరాజ్యం ఇవ్వాలని కోరారు కూడా. దీని మీదనే జూలై 3,1908న దేశద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు. ఈ కేసును తిలక్ కోసం బొంబాయి హైకోర్టులో మహమ్మదలీ జిన్నా వాదించారు. కానీ ఓడిపోయారు. అదంతా ఒక పథకం. తిలక్‌కు ప్రవాస శిక్ష విధించినందుకు దావర్ అనే న్యాయమూర్తికి ఆలస్యం లేకుండా సర్ బిరుదు వచ్చింది. జిన్నా తిలక్ వద్దకు వచ్చి చేతులు పట్టుకుని ఎంత బాధపడ్డారో ఎంసీ చాగ్లా తన ఆత్మకథ ‘రోజెస్ ఇన్ డిసెంబర్’లో అద్భుతంగా వర్ణించారు. 1908 నుంచి 1914 వరకు తిలక్ బర్మాలోని (నేటి మయన్మార్) మాండలే జైలులో శిక్ష అనుభవించారు. అక్కడే గీతా రహస్య పుస్తకం రచించారు. బొంబాయిలోని సర్దార్ గృహ తిలక్ నివాసం. ఆగస్టు1(1920) వేకువన ఆయన మరణించినట్టు చెప్పే వార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. ఆ ముందు రాత్రి అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్‌ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులంతా శ్రమించారు. అలాంటి సమయంలో కూడా తిలక్ అన్నమాట ఒక్కటే, ‘స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు.’ - డా. గోపరాజు నారాయణరావు -
ప్రాతఃస్మరణీయుడు
నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. ‘ఒక నల్లజాతీయుడిని ప్రజాప్రతినిధిగా చూసుకోవడానికి బ్రిటిష్ ప్రజలు సిద్ధంగా లేరు.’ ఇది 1886లో నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ సాలిస్బరీ చేసిన ప్రకటన. ఆ సంవత్సరం బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసియా వాసిని గురించి కన్జర్వేటివ్ పార్టీ వాడైన సాలిస్బరీ ఈ మాట అన్నాడు. ఆయనే దాదాభాయ్ నౌరోజీ. ఆసియా నుంచి బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ఆసియా వాసి ఆయనే. ఆయన భారతీయుడు కావడం ఇంకొక చరిత్రాత్మక సంఘటన. మొత్తం బ్రిటిష్ జాతీయులంతా ఆయనను వ్యతిరేకించలేదు. ఆయనకు మద్దతుగా ఒక అద్భుత వనిత, చరిత్ర మహిళ నిలిచారు. ఆమె ఫ్లారెన్స్ నైటింగేల్. ‘నల్లజాతీయుడు’ అంటూ సాలిస్బరీ అత్యంత సంస్కార హీనంగా మాట్లాడినా అది నౌరోజీ విషయంలో వరమే అయింది. అప్పటికి ఇంకా రవి అస్తమించని సామ్రాజ్యంగానే వెలిగిపోతున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్య పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించింది. దీనితో రాత్రికి రాత్రి నౌరోజీ ఇంగ్లండ్‌లో ప్రముఖ వ్యక్తి అయిపోయారు. సాక్షాత్తు ఇంగ్లండ్ ప్రధాని ప్రస్తావించిన ఆ నల్లజాతీయుడు ఎవరు? ఆయన దాదా భాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4,1825–జూన్ 30, 1917)! భారతదేశంలో బొంబాయి నగరం నుంచి వచ్చారు. అయినా తెల్లవాళ్లలాగే పాలిపోయినట్టు కనిపించే శరీరం వర్ణంతో ఉండే నౌరోజీని నల్లజాతీయుడు అని ఎందుకంటున్నారు అన్న సందేహం కూడా అప్పుడే వచ్చింది. చర్చ మొదలైంది. నౌరోజీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతఃస్మరణీయుడు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. మూడు పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలకు అధ్యక్షత వహించిన నాయకుడు. బొంబాయిలోనే గుజరాతీ మాట్లాడే పేద కుటుంబంలో నౌరోజీ పుట్టారు. ఆయన నాలుగో ఏటనే తండ్రి నౌరోజీ పలాన్జీ దోర్దీ కన్నుమూశారు. కుమారుడిని పెంచే బాధ్యత తల్లి మానేక్బాయి మీద పడింది. ఆమె కొడుకును బాగా చదివించింది. ఆయన ఎలిఫెన్‌స్టోన్ ఇనిస్టిట్యూట్‌లో చదివారు. తరువాత అక్కడే ఆచార్య పదవిని పొందారు. తన జొరాస్ట్రియన్ మతంలో సంస్కరణల కోసం ఆయన పాటు పడ్డారు. 1855లో వ్యాపారం కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కొద్దికాలం తరువాత తన సొంత జౌళి పరిశ్రమను స్థాపించారు. ఇంగ్లండ్‌లో భారతీయుడు స్థాపించిన తొలి వాణిజ్య సంస్థ అదే. భారతదేశ దుస్థితికి కారణం– భారతీయ జీవనం గురించి ఆంగ్లేయులకి తెలియకపోవడమేనన్నారాయన. 1833 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల నుంచి 20 ఏళ్ల పాటు భారత్‌ను లీజ్‌కు తీసుకున్నారు. 1853లో ఈ లీజ్‌ను కొనసాగించడానికి ప్రతిపాదన వచ్చింది. దీనిని నౌరోజీ తీవ్రంగా వ్యతిరేకించారు. నౌరోజీ మళ్లీ 1892లో జరిగిన ఎన్నికలలో ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఈ ‘నల్లజాతీయుడు’ విజయం సాధించాడు. తక్కువ ఓట్లతోనే నెగ్గి ఉండవచ్చు. కానీ చరిత్ర సృష్టించాడు. నల్లవాడి గెలుపుని జీర్ణించుకోలేని ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి మళ్లీ ఓట్లు లెక్కించాలని కోరాడు. అదే జరిగింది. మొదట కేవలం మూడు ఓట్లు ఆధిక్యం ఉంది. తిరిగి లెక్కించినప్పుడు ఆ సంఖ్య ఐదుకు చేరింది. అప్పటికి కూడా ఆయనను గేలి చేయడం మానలేదు. దాదాభాయ్ నేరో మెజారిటీ (అత్తెసరు ఓట్లతో గెలిచినవాడు) అని పిలిచేవారు, తెల్లజాతీయులు. కానీ వాటిని పట్టించుకోలేదాయన. ‘మనం ప్రధానంగా యుద్ధం చేయవలసింది పార్లమెంటులోనే’ అనే వారాయన. నిజంగానే ఆ యుద్ధంలో విజయం సాధించారు. అక్కడి సంప్రదాయం ప్రకారం బైబిల్ మీద ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ తాను పార్శీ మతస్తుడు కాబట్టి నౌరోజీ అందుకు అంగీకరించలేదు. చిత్రంగా జెండా అవస్తా మీద ప్రమాణం చేయడానికి ఆయనకు అనుమతి లభించింది. ఒక సందర్భంలో నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. పార్లమెంటులో ఉన్నది మూడేళ్లే అయినా నిర్మాణాత్మకమైన కృషి చేశారు నౌరోజీ. ఆ సమరానికి అనేక కోణాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైనవి. ఒకటి – భారతదేశంలో ఇంగ్లండ్ చేస్తున్న ఆర్థిక దోపిడీ. రెండు– భారతదేశానికి స్వయం ప్రతిపత్తి. మూడు– మహిళలకు ఓటు హక్కు. భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నేతలంతా విధేయులే. బ్రిటిష్ జాతి భారతదేశం నుంచి వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వాతంత్య్రం భారతీయుల పరం కావాలని ఆశించిన వారు కారు. స్వయం ప్రతిపత్తి, డొమీనియన్ స్థాయి కల్పిస్తే అదే చాలునన్న భావమే వారికి ఉంది. అయినా ఇంగ్లండ్ మూలంగా భారతదేశం ఎంత నష్టపోతున్నదో వారి దేశంలోనే, వారి పార్లమెంటు వేదికగానే నినదించదలిచినవారు నౌరోజీ. రాజకీయానికి ఆర్థిక కోణం ఎంత అవసరమో భారతీయులకు చెప్పినవారు నౌరోజీ. అందుకే రాజకీయాలకు నౌరోజీ గణాంకాలు కూడా నేర్పారని అంటూ ఉండేవారు. తన భావాలను, వాస్తవాలను ‘పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో నౌరోజీ అమోఘంగా నమోదు చేశారు. డ్రెయిన్ థియరీ ఆయన మేధో జనితమే. 1886 ప్రాంతంలో భారత జాతీయాదాయం ఎంత? అంటే ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికానికి భారతదేశం దఖలు పడ్డ దరిమిలా, ఇరవై ఎనిమిదేళ్లకు ఆర్థిక పరిస్థితి గురించి నౌరోజీ సంధించిన ప్రశ్న ఇది. బహుశా బ్రిటిష్ ఇండియాలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ గురించి గణాంకాల ఆధారంగా వెలువడిన తొలి ప్రశ్న ఇదే కావచ్చు. జాతీయాదాయం గురించి అధికారులు చెబుతున్న గణాంకాలను తాను విశ్వసించలేనని కరాఖండీగా చెప్పేశారాయన. ‘ది ఇండియన్ ఎకనమిస్ట్’ అన్న ఒక్క పత్రిక మాత్రమే ఇలాంటి వివరాలు ప్రచురిస్తూ ఉండేది. ఆ పత్రిక కూడా చాలినంతగా సమాచారం ఇవ్వడం లేదని ఆయన వాదన. అసలు అధికారుల లెక్కలు తప్పుతోవ పట్టించే విధంగా ఉన్నాయని అనేవారు నౌరోజీ. భారత్ అభివృద్ధి పథంలో సాగిపోతోంది అంటూ నోటిమాటగా చెప్పే మాటలు సరికావని కూడా తేల్చి చెప్పారాయన. దేశంలో సగటు వార్షిక తలసరి ఆదాయం ఎంత? ఇది చెప్పాలి అన్నారు. ఆకలితో నకనకలాడిపోతూ శ్రమించే కార్మికుడిని బట్టి కాదు, కార్మికుడు ఆరోగ్యంతో ఉంటే అతడి అవసరాలు ఎలా ఉంటాయో, ఆ ఆదాయం ఆధారంగా వివరాలు చెప్పాలని కోరారు. ఈ ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చిందో కూడా చెప్పారు నౌరోజీ. బ్రిటిష్ అధికారులు ఇచ్చిన గణాంకాల ప్రకారం 1867–1870 సంవత్సరాలలో సగటున భారతీయుడి తలసరి ఆదాయం ఏటా రూ. 20 మాత్రమే. శ్రామికుడు ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉండవలసిన ఆదాయం రూ. 34. పై తరగతుల వారికీ, మధ్య తరగతుల వారికీ జాతీయాదాయంలో ఎక్కువ వాటా దక్కుతోంది. పేదలకి మాత్రం కనీస అవసరాలకు కూడా ఆదాయం అందడం లేదు. కాబట్టి బ్రిటిష్ ఇండియాలో రెండు భారతాలు ఉన్నాయని నిర్ధారించారాయన. సౌభాగ్యంతో వెలుగొందుతున్న భారత్ ఒకటి. ఇది బ్రిటిష్ వారికీ, కొందరు విదేశీయులకీ పరిమితం. రెండవది పేద భారతం. ఇది పేద భారతీయుల పరం. భారతీయుల మీద బ్రిటిష్ పాలకుల వివక్ష పన్నుల విషయంలో ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుందని నౌరోజీ ఉదాహరణలతో చెప్పారు. పన్ను విధింపులో ఇది మరీ సుస్పష్టం. ఇంగ్లండ్‌లో విధించే ఆదాయం పన్ను 8 శాతం. అదే భారతదేశంలో మాత్రం 15 శాతం పన్ను విధించేవారు. మాంచెస్టర్ నుంచి దిగుమతి అయ్యే జౌళి ఉత్పత్తుల మీద సుంకం ఎత్తివేయడం గురించి ఇంగ్లండ్ కుత్సితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనితో భారతదేశంలోని జౌళి పరిశ్రమ నాశనం కావడానికి పునాది వేసినట్టయింది. ప్రభుత్వం తెచ్చే రుణాలకి అధిక వడ్డీ చెల్లించడం, ఐరోపావారు అందించే సేవలకి విపరీతంగా చెల్లింపులు చేయడం– ఈ రెండింటితోనే భారత్‌లో పేదరికం వీరవిహారం చేస్తోందని నౌరోజీ విశ్లేషించి చూపారు. భారతీయుల మీద భారం ఎక్కువగానే పడుతున్నదంటూ 1870లో నాటి ప్రధాని గ్లాడ్‌స్టోన్ వెల్లడించిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, మరో 23 సంవత్సరాల తరువాత ఆయనే భారత్ భరిస్తున్న సైనిక వ్యయం ప్రమాదకర స్థాయిలో ఉందని కూడా అన్నాడు. అయినా బ్రిటన్ తన అవసరాల కోసం సైన్యాన్ని వినియోగించుకున్నప్పుడు తన వాటా తాను భరించవలసి ఉంటుందని కూడా నౌరోజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 37 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన తరువాత నౌరోజీ ఎగుమతి, దిగుమతుల వివరాలు కూడా ఇచ్చారు. భారత్ నుంచి జరిగిన ఎగుమతుల కంటే, దిగుమతుల విలువ 50 కోట్లకు పెరిగిందని ఆయన తేల్చారు. రైల్వేల నిర్మాణం కూడా బ్రిటన్ అవసరాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది తప్పితే సాధారణ భారతీయుడికి అందుబాటులోకి రావడం లేదని నౌరోజీ ఆక్రోశించారు. అంటే రైల్వే వ్యవస్థ నిర్మాణం కోసం తెచ్చిన విదేశీ రుణభారం భారత్ మీద పడేది. ఈ వాదనలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం వైలీ కమిషన్ నియమించింది. భారతదేశంలో జరిగే ఆదాయ వ్యయాల గురించి నివేదిక ఇవ్వడానికి ఉద్దేశించిన కమిషన్ ఇది. పరిపాలనా వ్యయం, సైనిక వ్యయం భారత్, ఇంగ్లండ్ ఏ నిష్పత్తిలో భరించాలన్న అంశాన్ని సిఫారసు చేయడం కూడా ఈ కమిషన్ ఉద్దేశం. నౌరోజీ సేవలు చరిత్రపుటలకి అందేవి కావు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు 1894లో ఆయనకు ఒక లేఖ రాశారు– ‘పిల్లలు తండ్రి వైపు చూస్తున్నట్టు, భారతీయులు మీ వైపు చూస్తున్నారు. ఇక్కడ అచ్చంగా ఉన్న భావన ఇదే.’ దక్షిణాఫ్రికాలో భారతీయుల, విస్తృతార్థంలో చెప్పాలంటే నల్లజాతీయుల కడగండ్లను తీర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించవలసిందని నౌరోజీ ఎంపీగా ఉండగా గాంధీజీ రెండు పర్యాయాలు లేఖల ద్వారా కోరారు. గాంధీజీ ఆయనలో తండ్రిని చూశారు. కానీ జాతి ఆయనను ‘గ్రాండ్ ఓల్డ్మన్ ఆఫ్ ఇండియా’గా గౌరవించింది. ∙డా. గోపరాజు నారాయణరావు -
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తిలక్
స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తొలి స్వాతంత్య్ర పోరాటవీరుడు బాలగంగాధర్ తిలక్. ప్రజల చేత లోకమాన్యుడుగా పిలిపించుకొన్న తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర్ తిలక్. 160 ఏళ్ల క్రితం 1856 జూలై 23 న మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉపాధ్యాయుడైన గంగాధర్ తిలక్ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే దేశ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తాను కూడా స్వరాజ్య పోరాటంలో ఓ సమిధగా మారాలని నిశ్చయించుకున్నారు. 1890 ప్రాంతంలో స్వరాజ్య పోరాట వేదిక అయిన కాంగ్రెస్‌లో చేరారు. తిలక్ ప్రవేశం నాటికి జాతీయోద్యమంలో గోపాలకృష్ట గోఖలే సారథ్యంలో మితవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే అహింస, మితవాదం వల్ల స్వరాజ్యం లభించదని, బిట్రిష్‌వారితో పోరాటం వల్లనే స్వాతంత్య్రం సాధించగలమని విశ్వసించిన తిలక్ అతివాదిగా తన పోరాటాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ కంటే ముందే దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించారు. పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన కలం పదునుతో ఎన్నో వ్యాసాలతో అక్షర గర్జన చేసి నాటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. మాతృభాష మరాఠీలో, ఇంగ్లిష్ భాషలలో పత్రికలను ప్రారంభించి స్వరాజ్య పోరాటాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 1897లో బొంబాయి పరిసర ప్రాంతలలో ప్లేగు వ్యాధి విజృంబించింది. ఈ వ్యాధి నియంత్రణ పేరుతో బ్రిటిష్ వారు ప్రజల ఇళ్ళపై దాడులు చేస్తూ సోదాలు జరపడంతో ఆ చర్యను తిలక్ వ్యతిరేకించారు. దీనితో బ్రిటిష్ వారు ఆయనపై విప్లవ వాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పోరాడారు. దీంతో ఆయనను రంగూన్ జైలుకు తరలించి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 1914లో జైలు నుంచి విడుదలై తిరిగి తన పోరాటం కొనసాగిం చారు. ఆయన రచించిన గీతా రహస్యం పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. తన జీవితాంతం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తిలక్ బొంబాయిలో 1920 ఆగస్టు 1న తన 64వ యేట కన్నుమూశారు. తిలక్ జీవితం ఆదర్శప్రాయం. (నేడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 88వ వర్ధంతి సందర్భంగా) - యస్.బాబు రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, దళిత జర్నలిస్టులు, రచయితల సంక్షేమ సంఘం, కావలి ‘ 9573011844 -
సినిమా ఇలా చూపించారా?
విశ్లేషణ తిలక్‌పై సినిమా సాకుతో రెండున్నర కోట్లను మాయం చేయడమే కాదు. వందకోట్ల బడ్జెట్‌తో సంబరాలు చేసుకున్న కమిటీ.. సంబంధిత కాగితాలనూ నిర్వహించకపోవడం, కోట్లాది ప్రజాధనం మాయమైనా పట్టించుకోకపోవడమే అసలు సమస్య. బాలగంగాధర్ తిలక్ పేరుమీద సినిమా తీస్తానని కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుని పాత సీరియల్ ముక్కలను సినిమాగా ఇచ్చి ప్రజాధనం కాజేసిన విషయం వి.ఆర్. కమలాపుర్కర్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. 2001లో భారత గణతంత్ర 50వ వార్షికోత్సవం, బాలగంగాధర్ తిలక్ శతాబ్ది సంబరాలు నిర్వహించడానికి ఒక ఉత్సవ విభాగాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. తిలక్ కథతో ఒక సినిమా తీయాలని ఈ ఉత్సవ విభాగం నిర్ణయించింది. ఈ విభాగానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏ కార్యక్రమాలు నిర్వహించారు, సినిమా సంగతేమయింది, అందుకు ఎంత ఖర్చు చేశారు? అని కమలాపుర్కర్ ఆర్టీఐ కింద అడిగారు. మంత్రిత్వ శాఖలో ఆ ఉత్సవ విభాగానికి సంబంధించిన దస్తావేజులు ఏవీ లేవని, వాటికోసం వెతుకుతున్నామని జవాబిచ్చారు. వినయ్ ధుమాలేకు తిలక్ సినిమా నిర్మాణం కోసం రెండు వాయిదాలలో 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆర్టీఐ దాఖలైన తరువాతనే ధనం మాయమైన విషయం తెలిసిందని సీపీఐఓ డిప్యూటీ సెక్రటరీ వివరించారు. కనీసం ఏమైందని అడగలేదని, సినిమా వచ్చిందా లేదా అని కూడా అధికారులు విచారించలేదని తేలింది. ఒక్క కాగితం కూడా తమ కార్యాలయంలో లేదని ఆమె చెప్పారు. ఈ ఉత్సవాల విభాగంలో అంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉండడం, గణతంత్ర ఉత్సవాలు ముగిసిన వెంటనే విభాగం మూతపడడంతో వారు కూడా వెళ్లిపోయారనీ, వారెవరో ఎక్కడున్నారో ఎంత డబ్బు తీసుకున్నారో కూడా తమకు తెలియదని, ఆ వివరాలున్న ఫైళ్లు కూడా లేవని, అవి ఎక్కడికిపోయాయో తెలియదని అధికారులు తెలిపారు. దస్తావేజు లేవీ లేకపోవడం తీవ్రమైన లోపమని కమిషన్ భావించి రికార్డుల మాయంపైన దర్యాప్తు జరిపించాలని, రెండునెల్లలో నివేదికను సమర్పించాలని సూచించింది. తనకు సీబీఐ చార్జిషీటు కాపీ ఇవ్వలేదని కమలాపు ర్కర్, మంత్రిత్వ శాఖ కూడా చెప్పారు. సీబీఐ ప్రతినిధి, డీఎస్íపీ కేఎస్ పథానియా తిలక్ సినిమా పేరుతో 2.5 కోట్ల రూపాయల స్వాహా జరిగినట్లు పరిశోధనలో తేలిం దని, పాటియాలా హౌజ్ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలుచేసామని వివరించారు. ఎంత వెతికినా తిలక్ సినిమాఫైల్ మాత్రం దొరకలేదని, ఫైల్ మాయం కావడానికి తాము కారణం కాదని, తమకు ఆ ఫైలును అప్పగించినవారెవరూ లేరని కనుక తాము దానికి బాధ్యులము కాబోమని వివరించారు. గణతంత్ర 50వ వార్షికోత్సవాలకోసమే ఏర్పడిన విభాగం ఆ ఉత్సవాలు పూర్తికాగానే అంతరించిందని. ఆ విభాగం సాక్ష్యాలేమీ లేవని చెప్పారు. దూరదర్శన్ కోసం ఇదివరకు రూపొందించిన తిలక్ సీరి యల్ లోని 7 భాగాలలో కొన్ని దృశ్యాలను ఇష్టం వచ్చినట్టు అతికించి దాన్నే కొత్త సినిమాగా సమర్పించారని తేలింది. అయితే పన్నెండేళ్లుగా ఈ ఫైలు కోసం, మాయమైన డబ్బుకోసం పరిశోధన చేయకపోవడం అన్యాయం. కమలాపుర్కర్ తన దగ్గర ఉన్న పత్రాలన్నీ ఇచ్చి ఫైళ్లు వెతకడానికి, నేరస్తులను పట్టుకోవడానికి సహకరించాలని కమిషన్ ఆదేశించింది. ఫైల్ దొరకడం లేదనే నెపంతో పూర్తి సమాచారం ఇవ్వకపోవడం తప్పు అనీ అందుకు గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలను తెలియజేయాలని సీపీఐఓకు నోటీసు ఇచ్చింది. సీపీఐఓ అందుకు వివరంగా జవాబిచ్చారు. ఫైలు దొరకకపోయినా దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని సేకరించి ఇచ్చిందని వివరించారు. ప్రజల సొమ్ము కాజేసిన వారిని కాపాడే దురుద్దేశం ఇక్కడ ఎవరికీ లేదని, కమలాపుర్కర్తో సమన్వయం చేసి సమాచారం మొత్తం సేకరించామన్నారు. విజ్ఞాన్ భవన్ అనుబంధ భవనంలో, మంత్రిత్వ శాఖ రికార్డు గదుల్లో, జాతీయ పురావస్తు గ్రంథాలయంలో ప్రతి దస్తావేజును వెతికించామని, 15.1.2018నాడు సర్చ్ మెమొరాండంను విడుదల చేసి అన్ని విభాగాలకు పంపించామని, గత సంవత్సరమే ఫైళ్లుపోయాయని పోలీసు ఫిర్యాదు కూడా చేశామని, సీబీఐ పరిశోధనకు అవసరమైన ఫైళ్లు సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు. 2015లో కేంద్ర విజి లెన్స్ కమిషన్ ఆదేశానుసారం ఈ ఫైళ్లన్నీ చిట్టచివరిసారి ఎవరి అధీనంలో ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం కూడా ఆరంభించామని వివరించారు. తాను కేవలం 8 నెలల కిందటే సీపీఐఓగా బాధ్యతలు స్వీకరించానని, కనుక తనకు ఈ సినిమా మోసం రికార్డులతో సంబంధమే లేదని తనపైన జరిమానా విధించడం భావ్యం కాదని విన్నవించారు. కమలాçపుర్కర్ 13.12.2012 నుంచి అనేక మార్లు ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించారు. అనేకానేక అంశాల ద్వారా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం అడిగారు. ఫైళ్ల అదృశ్యం వల్ల ఆ సమాచారం ఇవ్వలేకపోయారు. కాని ఆయనే మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తిలక్ సినిమాకోసం 2.5 కోట్ల రూపాయల మంజూరీ (విడుదల) పత్రం ప్రతిని ఇచ్చారు. ప్రసారభారతి 7 తిలక్ ఎపిసోడ్ల నిర్మాణ పత్రాలను కూడా ఆయనే ఇచ్చారు. ధుమాలే పైన చార్జిషీటు దాఖలుచేసినా, అతనికి ఏ ఆధారమూ లేకుండా కోట్ల రూపాయలు సమర్పించిన అధికారులెవరు? ఫైళ్లుమాయం చేసిన వారెవరు? ధుమాలే సమర్పించిన సినిమా సీడీ దూరదర్శన్ వారి ఏడు ఎపిసోడ్ల కత్తిరింపులు అతికింపులా కాదా అని చూసిన వారే లేరా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు. పూర్తి సమాచారం ఇచ్చారనీ, కావలసిన చర్యలు తీసుకున్నారని ప్రశంసించి, అప్పీలును ముగించడమైనది. (వీఆర్ కమలాపుర్కర్ వర్సెస్ సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఇఐఇ/ ఏ/అ/2016/000484 కేసులో 27. 2.2018 నాటి ఆదేశం ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆకుపచ్చ సూర్యోదయం
1 ఆగస్ట్ 1, 1920. లోకమాన్య బాలగంగాధర తిలక్ అస్తమించారన్న వార్త వేకువనే బొంబాయిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వెంటనే, స్వరాజ్య సాధన కోసం సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిద్దామంటూ మోహన్‌దాస్ గాంధీ లాంఛనంగా ఇచ్చిన ప్రకటన గురించి మరో వార్త. ఈ సంచలనాలు భారతదేశాన్ని చుట్టబెట్టాయి. ఆంధ్రపత్రిక ద్వారా రెండు రోజుల తరువాత కృష్ణదేవిపేట చేరాయి. ‘‘మహాను భావుడు, వెళ్లిపోయాడు!’’ చేతులు జోడించి అన్నాడు ఊరి పెద్ద చింతల స్వామినాయుడు. కొద్దిసేపు మౌనం. ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. భాస్కరుడు అన్నారు–‘‘ రాజుగారు మాట్లాడడం లేదు.’’ నిమిషం తరువాత గుర్తు చేసుకుంటున్నట్టుగా మాట్లాడాడు శ్రీరామరాజు.‘‘మితవాదులూ, అతివాదులూ కలసి పని చేయాలని నిర్ణయించడానికి కొంచెం ముందు జరిగింది లక్నో ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశం. అందులో ఆ మహానుభావుడిని నేను చూశాను. అదే ఆవేశం. స్వరాజ్యం కోసం అదే తపన. చూస్తుంటే ఆయన చెప్పిన అతివాదమే సత్యమనిపిస్తుంది’’ అన్నాడు రామరాజు. ‘‘మీరు...కూడా...!?’’ అన్నాడు మునసబు లగుడు సత్యనారాయణ అర్ధోక్తిగా.‘అతివాదపద్ధతే మంచిదని అంటాను.’’ అన్నాడు రామరాజు నిశ్చయంగా.‘‘మీరూ కాంగ్రెస్ వాదులేనన్నమాట!’’ అన్నాడు మునసబు.‘‘అలా అనుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఆధ్యాత్మికవాదిని కాబట్టి నేను ఒక సంస్థకి లిఖిత పూర్వకంగా కట్టుబడి ఉండను.’’ అన్నాడు రామరాజు. అలాంటి మాట ఆయన నోటి నుంచి రావడం అదే మొదటిసారి. అంతా ఆశ్చర్యంగా చూశారు. తిలక్ మరణించిన నెలకే కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. ‘‘సహాయ నిరాకరణను విజయవంతం చేయగలిగితే ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం తథ్యం’’ అన్నారు గాంధీ. ఆ డిసెంబర్లో జరిగిన నాగపూర్‌లో వార్షిక సమావేశాలలో ఈ ప్రతిపాదనకి ఇంకా బలం వచ్చింది. మోతీలాల్, చిత్తరంజన్‌దాస్, రాజేంద్రప్రసాద్, వల్లభ్‌బాయ్ పటేల్, రాజగోపాలాచారి వంటి వారు కూడా ఉద్యోగాలకీ, వృత్తులకీ వీడ్కోలు పలికి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అప్పుడే భారత రాజకీయాలలోకి అడుగు పెడుతున్నాడు సుభాశ్ చంద్రబోస్. గాంధీ పిలుపు మేరకే ఐసీఎస్‌కు రాజీనామా చేశాడు.అందరం గ్రామాలకు వెళదామన్నాడు గాంధీ. ∙∙∙ నాగపూర్ కాంగ్రెస్ తరువాత జనవరి, 1921లో బెజవాడలో ఆంధ్రా ప్రోవిన్షియల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. స్వరాజ్య భావనని కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, తెలుగు నేల నాలుగు చెరగులా. స్వరాజ్య నినాదం తెలుగువారిలో కదలిక తెచ్చింది. సంవత్సరంలో వచ్చే స్వాతంత్య్రం గురించీ, యూనియన్ జాక్ అవనతమవుతున్న దృశ్యం గురించీ కలలుగంటున్నారు తెలుగువారు. 2 జనవరి 16వ తేదీ. కనుమ పండుగ. అచ్చంగా పత్రికా పఠనం కోసమే ఆ రోజు వచ్చారంతా. జనవరి 13, 1921 నాటి పత్రిక అది. లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి వార్త మరి. ఎప్పుడూ వినలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందట. వార్తంతా చదివి చెప్పడం మొదలు పెట్టారు భాస్కరుడు గారు. ‘‘1919లో భారత ప్రభుత్వం చట్టం తెచ్చారు కదా! ఆ మేరకు ప్రెసిడెన్సీలలో ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జనవరి 12,1921న మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా మొదలయిందట. ఇంకో విషయం – మొన్న డిసెంబర్ 17న ప్రభుత్వం కూడా కొలువైంది.’’బ్రిటిష్ పాలనని భుజాన వేసుకునే జస్టిస్ పార్టీ బ్రాహ్మణాధిక్యం నినాదంతో మొదటి ఎన్నికలలో మెజారిటీ తెచ్చుకుంది. రామరాజు అంతా విన్నా మౌనంగానే ఉండిపోయాడు. ∙∙∙ 1921 ఏప్రిల్‌లో మండే ఎండలలో బెజవాడలో జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్, పటేల్ దాదాపు జాతీయ నేతలంతా వచ్చారు. వారిని చూసేందుకు రెండు లక్షల మంది వచ్చారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము....’, ‘దండాలండోయ్ దండాలు’, ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ వంటి పాటలూ పద్యాలూ పాడుకుంటూ రాత్రీ పగలూ నడిచి వచ్చారు జనం.ఆ ఆగస్టులోనే కృష్ణా పుష్కరాలు జరిగాయి. కృష్ణాతీరమంతా ఎక్కడ విన్నా అలాంటి పాటలే. సాధువులు, సన్యాసులు, భిక్షకులు అంతా అవే పాడుతున్నారు. 3 ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం.శ్రీరామవిజయనగరంలో ఆశ్రమం అరుగు మీద శిష్యులతో కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పుడే దూరంగా పది పన్నెండు మంది రావడం కనిపించింది. అందరికీ ముందు బొంకుల మోది, గోకిరి ఎర్రేసు నడుస్తున్నారు. ఆ ఇద్దరినీ గుర్తు పట్టాడు రామరాజు.‘వారే సాములు!’ అన్నట్టు చాలా భక్తితో చూపించాడు వచ్చిన వాళ్లకి ఎర్రేసు. రామరాజును చూడగానే ఆ బృందంలోని అందరి ముఖాలలోను మాటలకందని ఉద్వేగం. ముప్పయ్ అయిదేళ్ల ఆ వ్యక్తి రామరాజుకు భక్తితో నమస్కరించి అన్నాడు.‘‘దండాలు స్వామి! నా పేరు కంకిపాటి ఎండుపడాలు. బాలయ్య అని కూడా అంటారు. పెద్దవలసకి ఒకప్పుడు ముఠాదారుని కూడా రామయ్య అంటారీయన్ని. గూడెంలోనే ఓ బళ్లో అయ్యోరు. మా అందరి మంచీ కోరేటోరు. అయ్యోరి పక్కన, కొటికల బాలయ్య. కంతారం మొఖాసాదారు. ఆయన గాం గంతన్న, ఒకప్పుడు బట్టిపనుకుల మునసబు. ఆ కుర్రోడు గంతన్న తమ్ముడు, మల్లు. నడింపాలెం. ఈళ్లు మా మనుషులు.’’‘‘నమస్కారం! ఇలా వచ్చారేమిటి?’’ ప్రతి నమస్కారం చేస్తూ అడిగాడు రామరాజు. ‘‘అందరిదీ ఒకేరకం బాధ సామీ! మా కొండోళ్లు ఇన్ని కష్టాలు గతంలో ఎప్పుడూ పడలేదు. తమరితో మాట్లాడి, సాయం తీసుకుందామని వచ్చాం. దయ చూపాలి.’’ అన్నాడు ఎండు పడాలు, దీనంగానే. ‘‘ఎంతమాట పడాలు గారూ! రండి, కూర్చుని మాట్లాడుకుందాం!’’తాండవ ఒడ్డునే ఉన్న పెద్ద మామిడిచెట్టు కిందకు నడిచాడు రామరాజు. ఐదారు పెద్ద పెద్ద దుంగలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి మీదే రామరాజు, శిష్యులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న సభ తీర్చినట్టే ఉంటుంది. పడాలు, గంతన్న, మల్లు, రామయ్య, బాలయ్య మాత్రం కూర్చున్నారు. మిగిలిన వాళ్లు చేతులు కట్టుకుని నిలబడే ఉండిపోయారు. ‘‘నేనూ చాలానే విన్నాను!’’ అన్నాడు రామరాజు రెండు నిమిషాల తరువాత.‘‘ఎంత విన్నా తరగనంత బాధ స్వామీ మాది. నేనూ కొండవాడినే. వీళ్ల దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నవాడిని. 1882లో అడవులని రిజర్వు చేయడం దగ్గర నుంచి కొండ ప్రజల ఉనికే ప్రశ్నార్థకమైపోయింది.’’ ఆవేదనతో అన్నారు కూడా రామయ్య.‘‘మేం అడవిలోకి పోకూడదు. మరో లోకమేదీ మాకు తెలీదు. ఇంక మా బతుకెక్కడ సామీ?’’ అన్నాడు గంతన్న. ‘‘అనుకోకుండా మమ్మల్ని మామిడిచెట్టు కింద కూర్చోబెట్టారు తమరు. ఈ కాలంలో కొండోళ్లం పవిత్రంగా చూసుకునే చెట్టు. ఆ దేవత నీడలో చెబుతున్నాను. కొండోళ్లు కడుపునిండా తిని కొన్నేళ్లయింది. కొండల్లో కొండవాడు రోడ్లేసే కూలీగా మారిపోయాడు.’’ చెప్పాడు కొటికల బాలయ్య.‘‘ఈ సమస్త కష్టాలకీ బేస్టీను కారణం స్వామీ. వీళ్లని జంతువుల్లా వేటాడుతున్నాడు. పోడు సేద్యం చేస్తే శిక్ష. కొమ్మా రెమ్మా కొట్టుకుంటే జరిమానా. !’’ చెప్పారు రామయ్య. కొద్ది విరామం తరువాత ఆయనే చెప్పారు. ‘‘బాస్టియన్ సామీ. కొండవాళ్లంతా బేస్టిన్ అనడం అలవాటు. ఇక్కడిlవాడే, మతం పుచ్చుకున్నాడు. గూడెం డిప్యూటీ తహసీల్దారు.’’ ‘‘స్వామీ! అడవిలో అడుగుపెట్టలేని కొండవాడు, ఆకలికి చింతంబలీ, టెంకంబలీ తాగుతాడు. రోగాలొస్తున్నాయి. అందుకే బియ్యానికీ, కూలికీ ఆశపడి రోడ్డు పనికి వెళతన్నారు.అదో నరకం. అన్నం వార్చుకున్నా అంబలి కుండ తప్పదని కొండోళ్ల సామెత. కూలికి పోతేనే నరకం కాదు. పోకపోయినా నరకమే. రోడ్డు పనికి పోకపోతే గ్రామాల మీద పడి చావగొడుతున్నారు పోలీసులూ, బేస్టీనూ.అడ్డగుడ్డ కట్టిన ఆడది, మొలతాడు కట్టిన మొగోడు బేస్టీను పిలిస్తే పనికి పోవాల్సిందే. కానీ సామీ! ఆరణాల కూలీ అంటాడు. రెండు అణాలే ఇస్తాడు. కొందరికి అదీ దక్కదు. చెప్పినట్టు బియ్యమైనా కొలవడు. అరకొరగా కొలిచి పొమ్మంటారు.’’ అంటూ ఒక్క నిమిషం ఆగాడు రామయ్య. ‘‘కొండోళ్లవి బక్కప్రాణాలు స్వామీ! పంటి బిగువున పనిచేస్తున్నారు. రోడ్డు పని కొండోళ్లని బతికించడానికని చెబుతున్నారు. కానీ కొండోళ్లని చంపడానికే రోడ్లేస్తున్నారు.’’ డగ్గుత్తికతో చెప్పాడు రామయ్య. ‘‘ఇదంతా ఎంతకాలం నుంచి?’’ బాధగా అడిగాడు రామరాజు.‘‘ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో రోడ్లేయడం మొదలైంది. అప్పటి నుంచీ హింసే.’’ చెప్పారు రామయ్య. ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి.‘‘రామయ్య గారూ! నేనేం చేయగలనో చెప్పండి!’’ అన్నాడు రామరాజు.‘‘ఇవన్నీ కలెక్టర్దొరకి తెలియాలి. మద్రాసు ప్రభుత్వానికి తెలియాలి.’’ అన్నాడు రామయ్య. ‘‘అంటే అర్జీలు పంపమంటారా?’’ అడిగాడు రామరాజు.‘‘చిత్తం, డిప్యూటీ తాసీల్దారు అరాచకాలనీ, వాటిని చూస్తూ కూర్చున్న తాసీల్దారు చేతకానితనాన్ని గవర్నరు దొర వారికి రాసి పంపించాలి. మీకు ఆంగ్లం, హిందీ క్షుణ్ణంగా వచ్చునని విన్నాం. ఈ సాయం చేసి పెట్టాలి తమరు!’’ అన్నాడు బాలయ్య. ‘‘తప్పనిసరిగా రాసి పంపుతాను. మళ్లీ కలుసుకుందాం!’’ అన్నాడు రామరాజు.అంతా లేచారు, బయలుదేరడానికి. ఇంక మౌనంగా ఉండలేనన్నట్టు ఒక్కసారి ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు పొట్టిగా లావుగా బలంగా ఉన్న ఆ కుర్రాడు– మల్లుదొర. ‘‘సామీ! సామీ..నా మాట కూడా ఇనండి! ఆ బేస్టిను పెద్ద దానగుడు. ఆళ్లు కొట్టే కొరడా దెబ్బలకి లెక్కలేదు. ఆడమగా అందరికీ ఒళ్లంతా చీరుకుపోతది. సామీ, అప్పుడు.. నూరిన పచ్చి మిరపకాయల ముద్ద రుద్దుతాడు. మొగోళ్లయితే ముడ్డిలో కూడా కుక్కిస్తాడు. ఆడోళ్లకి కొంగుల్లాగేసి గుండెల మీద రాస్తాడు. బేస్టీను, ఆడి బంట్రోతూ, ఓవర్సీరు పిళ్లే కొట్టే దెబ్బలకి ఇళ్లకి వచ్చాక మంచం పడుతున్నారు సామీ కొండోళ్లు. ఇక దిగేది లేదు, కాటికే. ఇలా ఊరికి ఇద్దరో ముగ్గురో..నేను చిన్నోణ్ణే. కానీ నేను చెప్పేదంతా పచ్చినిజం. ఈ ఎండుపడాలు గారు పెద్దవలస ముఠాదారు. పరువూ మర్యాద ఉన్నోడు. ఆయన రెండు చేతులూ ఎనక్కి ఇరిచి బాదపెట్టాడు. మా అన్న ఊరి మునసబు. ఈణ్ణి బూటుకాలితో తన్నాడు. గుండెల మీద తన్నాడాడు. కాయితాల మీద గీతలు గీసే కర్రతో నా మోకాళ్లు చితక్కొట్టాడు... చంపెయ్యాలి ఆ కొడుకుల్ని. ఆ పని చేయలేకపోతే కొర్రు దిగి సచ్చిపోవడం మంచిదనిపిస్తంది సామీ!’’ ఆ ఉద్రేకానికి అతడి కళ్లలో నీరు ఉబికింది. ముఖం ఎర్రబడిపోయింది. ‘‘సామీ! ఈ పడాలుగారూ, మా అన్న, ఈ అయ్యోరు.. ఎవరూ జరిగినవన్నీ చెప్పలేదు. మర్యాద అడ్డొస్తంది ఆళ్లకి. ఈళ్లు చెప్పినదానికి పదింతల ఎక్కువ బాధలు మావి.’’ మళ్లీ తనే అన్నాడు మల్లు. నిమిషం మౌనం. తరువాత మల్లుకు అర్థమయ్యేటట్టు, రామరాజుకు పరిచయమయ్యేటట్టు చెప్పాడు రామయ్య, నిదానంగా. ‘‘సామీ! ఒక్కమాట! పితూరీ అంటూ బేస్టీను మీద బరిసెలూ బాణాలూ ఎత్తి తిరగబడొచ్చు. నాలుగు పోలీసు స్టేషన్లు తగలబెట్టొచ్చు. ఓ నలుగురిని చంపొచ్చు. ఓ పదిమంది కొండవాళ్లు ఉరికంబాలు ఎక్కొచ్చు. ఓ పాతికమంది రాజమండ్రి జైల్లో చచ్చేదాకా మగ్గడానికి పోవచ్చు. మా తాతలకాలం నుంచీ పితూరీలు ఉన్నాయి. ఆటి ఫలితమిదే. పితూరీలు ఇక చాలు. ఇప్పుడు ముప్పు కొండవాళ్లకే కాదు, కొండలకి కూడా. ఈ అడవులకి కూడా. ఈ లోయలకి కూడా. ఇది కూడా ఆలోచించాలి స్వామీ. రోడ్లతో ఈ నాశనం మొదలైపోయింది.’’ ఇక చెప్పేదేమీ లేదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి, చేతులు జోడించి అన్నాడు రామయ్య, ‘‘మీలో మాకో దేవుడు కనిపిస్తున్నాడు. పోలీసుల నుంచి మమ్మల్ని కాపాడండి! రోడ్ల నుంచి మన్యాన్ని రక్షించడానికి సాయపడండి.సెలవు.’’తలొంచుకుని నడుస్తున్నా, మల్లులో ఆవేశమైతే తగ్గలేదని అతని అడుగులు చెబుతున్నాయి. కొటికల బాలయ్యని కూడా రామయ్య మాటలు తృప్తి పరచలేకపోయామని అతని ముఖం చూస్తే తెలుస్తోంది.ఆశ్రమం లోపల కుర్రాళ్లంతా వెళ్లిపోయారు ఎప్పుడో. నదిని చూస్తూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు రామరాజు. బాస్టియన్ మీద ఫిర్యాదు ఎలా రాయాలో ఆలోచిస్తూ. 4 ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తల మీద జోరుగా సాగుతోంది చర్చ. భాస్కరుడు మాత్రం అన్య మనస్కంగా ఉన్నారు. ఎక్కడికో తెలియదు. ఎందుకో తెలియదు. తల్లికి కూడా చెప్పలేదు. ఏడెనిమిది వారాల క్రితం ఎవరికీ చెప్పకుండా వెళ్లాడు శ్రీరామరాజు.‘‘ఏమండోయ్! ప్రెసిడెన్సీ మొదటి ప్రధానమంత్రిగారు అగరం సుబ్బరాయులు రెడ్డియార్ రాజీనామా చేసేశాడట.’’ హడావుడిగా అన్నాడు లగుడు సత్యనారాయణ, కొంచెం ఆలస్యంగా వచ్చిన చింతల నాయుడుతో. చెప్పింది సత్యనారాయణే అయినా, స్వామినాయుడు, భాస్కరుడిని ఉద్దేశించి ప్రశ్నించాడు ‘‘ఎందుకో!’’భాస్కరుడుగారు జవాబు ఇవ్వలేదు. ‘‘భాస్కరుడుగారు! ఏమిటి అలా ఉన్నారు?’’ ఆయన భుజం సుతారంగా తడుతూ అడిగాడు స్వామినాయుడు.‘‘ఆ... ఏమిటి?’’అన్నారు భాస్కరుడు తేరుకుని.‘‘ రెడ్డియారు, రాజీనామా చేసేశారంట? ఎందుకు?’’ ‘‘అనారోగ్యం.’’ జవాబిచ్చాడు భాస్కరుడు పేపరు ఆయనకి ఇస్తూ. జూలై 12, 1921 నాటి పేపరు అది. ఈసారి నాలుగు రోజులకి వచ్చింది. ‘‘అదలా ఉంచండి! ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?’’ అన్నాడు నాయుడు. ‘‘రామరాజుగారు వెళ్లి రెండు నెలలు కావస్తోంది. సూర్యనారాయణమ్మగారిని చూస్తే బాధగా ఉంది నాయుడుగారు! నిన్ననే ఆ తల్లి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లింది. అసలే అభిమానవతి. అక్కడ మీ ఇద్దరూ ఎందుకు, ఇక్కడే ఉండండి అంటే ఆమె వినడం లేదు.’’ అన్నారు కొంచెం నెమ్మదిగా, భాస్కరుడు.సత్యనారాయణ పేపరు తీసుకుని చెబుతున్నాడు. ‘‘ఇది వినండి! ఇప్పుడు మొత్తం మూడు మంత్రి పదవులలోను తెలుగువాళ్లే ఉన్నారు.’’‘‘అలాగొచ్చిందా?’’ అన్నాడు పొన్నాడ వెంకటరత్నం బ్రహ్మానందం పడిపోతూ.‘‘సుబ్బరాయులు రెడ్డియారుగారు పానగల్లు రాజాని ప్రధానమంత్రిని చేయమని సిఫార్సు చేశాడట. పానగల్లు రాజా రామరాయణింగారు, కూర్మా వెంకటరెడ్డినాయుడు పాతవాళ్లే. కొత్తగా అన్నెపు పరశురామదాస్ పాత్రో అనే ఆయన్ని నియమించాడట గవర్నర్ విల్లింగ్డన్.’’ చెప్పాడు లగుడు.‘‘తెలుగువాళ్లని సంబరపడడం తప్ప ఏం ఒరుగుతుంది? దేశమంతా జాతీయ కాంగ్రెసు సహాయ నిరాకరణ. అక్కడేమో జస్టిస్ పార్టీ పాలన. పనులెలా జరుగుతాయి?’’ అన్నాడు స్వామినాయుడు. మళ్లీ ఆయనే అన్నారు, ‘‘చీరాల–పేరాల ఉద్యమం ఈ తెలుగు మంత్రులకి పట్టదేం? పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్లు మహా యాతన పడుతున్నారక్కడ. గర్భవతులు ఆ పందిళ్లలో ఎండనకా, వాననకా నానా ఇక్కట్లూ పడుతున్నారు. వాళ్లని అలా ఎంతకాలం ఉంచుతారు? మునిసిపాలిటీ చేయకుండా ఈ పానగల్లు చేయలేడా? గాంధీగారికీ అక్కర్లేదు. దొరతనానికీ అక్కర్లేదు. ఎప్పుడు దానికి ముగింపు?’’అంతా మౌనంగా ఉండిపోయారు. తలుచుకుంటేనే బాధగా ఉంది. అప్పుడే ‘‘అయ్యా! తమకి ఉత్తరం!’’ అంటూ ఓ పోస్టు కార్డు అందించాడు పోస్ట్‌మ్యాన్ వినయంగా. అందుకుని, ఆత్రంగా చూసి, ఒక్క నిమిషంలో చదవేశాడు భాస్కరుడు. ‘‘ఎక్కడ నుంచి?’’ ఉండబట్టలేక అడిగాడు స్వామినాయుడు.‘‘రామరాజుగారే రాశారు!’’ కొంచెం గట్టిగానే అన్నారు భాస్కరుడు. ఆయన కళ్లలో ఒక వెలుగు.‘‘రామరాజుగారే!?’’ అంతా ఒక్కసారిగా అన్నారు.‘‘నాసికా త్య్రంబకం వెళ్లారట. తిరుగు ప్రయాణంలో ఉన్నారట.’’ చెప్పారు భాస్కరుడు. 5 1921 అక్టోబర్ చివరి రోజులు.... చరిత్రను మార్చే ఆ తేదీలనూ, ఘడియలనూ ముందుకు తోసుకురావడం కోసం తనను తాను కరిగించుకున్నట్టు వేగంగా సాగింది కాలం. రామరాజు నాసిక్ నుంచి వచ్చిన పదిహేను రోజులకే జరిగిందా సంఘటన.నర్సీపట్నం నుంచి వచ్చిన ముప్పయ్ నలభయ్ మంది జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు కృష్ణదేవిపేటలో సభ ఏర్పాటు చేశారు. ఊళ్లో పోలీస్ స్టేషన్ నుంచి నలుగురు పోలీసులు వచ్చి సభని భగ్నం చేశారు. ఆ చలిలో ఒక్కసారిగా వెల్లువెత్తింది ఉద్యమ వేడి. అప్పటి నుంచి కొండ గ్రామాల నిండా నిఘా. సంతల నిండా సీఐడీలు. ఆ సంవత్సరంలో నవంబర్, డిసెంబర్ నెలలే కాదు, 1922 వచ్చాక జనవరి నెల తొలి పక్షం కూడా ఏమీ ఎరగనట్టు, అప్రకటిత పోలీసు శాసనాన్ని చూసి భయపడినట్టు జారుకున్నాయి. ఆ తరువాతే కృష్ణదేవిపేటలో పుట్టింది ఓ వదంతి. ‘మన్యంలో కొండవాళ్లు మళ్లీ పితూరీ లేవదీస్తున్నారు.’ ఈ పితూరీ నాయకుడు మరెవరో కాదు, సాక్షాత్తు అల్లూరి శ్రీరామరాజేనట. -
‘తిలక్’ నిధులు మింగేశారు!
న్యూఢిల్లీ: బాల గంగాధర్ తిలక్‌పై సినిమా రూపొందించేందుకంటూ తీసుకున్న రూ. 2.5 కోట్ల నిధులను మింగేశారు. సినిమా కోసం 2005లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా వీఆర్ కమలా పుర్కర్ అనే వ్యక్తి సాంస్కృతిక శాఖకు దరఖాస్తు చేశారు. నిర్మాత వినయ్ ధుమాలేకు రూ.2.5 కోట్లు ఇచ్చామని, అయితే ఆయన సినిమాను రూపొందించలేదని ఆ శాఖ.. .సమాచార కమిషన్‌కు తెలిపింది. రికార్డులేవీ తమ వద్ద లేవని చెప్పింది. ‘ధుమాలేకి రెండు విడతల్లో మొత్తం డబ్బు బదిలీ చేశారు. కానీ అతడు సినిమా రూపొందించలేదు’ అని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై విచారణ జరపాలని, 60 రోజుల్లోగా నివేదిక అందజేయాలని సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు. -
నిన్న రాత్రి...
పద్యప్రభావం పొద్దున లేచింది మొదలు.. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాల వార్తలు... అవిశ్రాంతంగా వినిపిస్తుంటాయి. కోపం వస్తుంది. ఈ బక్కపలచటి శక్తి లేని కోపంతో ఏం చేయగలం? అనిపిస్తుంది. కన్నెర్ర చేయాలనిస్తుంది, కండ్లకలక అనుకుంటారేమోనని వెనక్కి తగ్గాలనిపిస్తుంది... ఇలా రాజీ పడుతూనే ఉంటాం. ఇక దేని గురించీ ఆలోచించవద్దు అనుకుంటాం. ఇలా ఆలోచించే ఒకడికి దేవుడు కనిపిస్తే ఏంచేస్తాడు? ఆ దేవుడి ముందు తన నిరసనను వెళ్లగక్కుతాడా? లేక మానవుడే దానవుడైన ఈ కలికాలంలో పాపం... దేవుడు మాత్రం ఏంచేస్తాడు? అనుకుంటాడా? బాలగంగాధర తిలక్ ‘నిన్నరాత్రి’ కవిత దగ్గరికి వెళ్లి చూసొద్దాం.. ఆకలి అని ఆశలు గొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి దేవుడిని అడిగానా? అమ్ముకొన్న యౌవనం, అలసిన జీవనం సంధ్యవేళ ఉరి పోసుకున్న సాని పడుచు మాట చెప్పానా? కాలి కమురు కంపుకొట్టే కాలం కథ, మానవ వ్యథ నే వివరించానా? దేవుడి కన్నీటిని తుడిచి, వెళ్లిరమ్మని వీధి చివరి దాకా సాగనంపి వచ్చాను. నాకు తెలుసు... నాకు తెలుసు మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు-కన్నకడుపు- ఏంచేస్తాడని! - యాకుబ్ పాషా -
శ్రమకు సలామ్
సగటు నగరవాసికి సిటీలోని రూట్లు ఎంత క్లియర్‌గా తెలుసో.. ఏ మూలన ఏ గుంత ఉందో కూడా అంతే బాగా తెలుసు. గతుకుల దారిలో ముక్కుతూ మూల్గుతూ జర్నీ చేస్తాడే తప్ప.. వాటిని బాగుచే సే బాధ్యత ప్రభుత్వానిదనుకుంటాడు. కానీ, మన దారిని మనమే బాగు చేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తి ఒకరున్నారు. సిటీలో ఆయన వెళ్లే దారిలో గుంత కనిపిస్తే చాలు దాన్ని పూడ్చకుండా కదలరు. ఆరుపదుల వయసు దాటిన ఆ పెద్దాయన పేరు బాలగంగాధర తిలక్. రైల్వే ఉద్యోగిగా రిటైర్ అయిన ఆయన గుంతలు పూడ్చడం కోసం ప్రత్యేకంగా ‘శ్రమదాన్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు. దూరదేశానికి వె ళ్తున్నా.. తన ఫౌండేషన్ ద్వారా గుంతల పూడ్చివేత కార్యక్రమం కొనసాగుతుందంటున్న బాలగంగాధర తిలక్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను హైదర్ షా కోట గ్రామంలో ఉండేవాడిని. 2010 జనవరి 18న ఉదయం ఆఫీస్‌కు బయల్దేరాను. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయమైంది. గుంతలో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం.. బురదనీరు స్కూల్‌కు వెళ్తున్న పిల్లలపై చిందడం జరిగిపోయాయి. అప్పుడు ఆందోళనగా కారు ఆపా. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకున్నా. అప్పటికే వారు ఓ రకంగా చూసిన చూపులు నన్ను కదిలించాయి. మర్నాడే ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను పూడ్చా. అదే పిల్లలు వచ్చి కృతజ్ఞతలు తెలపడం ఎప్పటికీ మరచిపోలేను. మరెన్నో ఘటనలు.. ఇవే కాదు గుంతలు పడి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద మరణాలు నన్ను మరింత ఆలోచింపజేశాయి. ప్రభుత్వం కోసం ఎదురుచూడకుండా ఈ గోతులను ఎవరైనా పూడ్చేస్తే రోడ్డు ప్రమాదాలు జరిగేవి కాదు కదా అనిపించింది. అప్పటి నుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా పూడ్చటమే పనిగా పెట్టుకున్నాను. నా కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజ్‌లు సిద్ధంగా ఉంటాయి. 1,070 గుంతలు.. గతంలో హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు కనిపించేవి. రెండు నెలల క్రితం అనారోగ్యం కారణంగా అమెరికాలో స్పిరిట్ కమ్యూనికేషన్స్‌లో సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నా కుమారుడు రవికిరణ్ వద్దకు వెళ్లా. రెండు నెలల కిందట సిటీకి వచ్చాను. నేను తిరిగి అమెరికా రానేమోనని అనుకున్న నా కుమారుడు కూడా నాతోపాటే ఇక్కడికి వచ్చాడు. అయితే రోడ్లపై గుంతలు చూడగానే మళ్లీ పలుగు, పారా పట్టుకున్నాను. జేఎన్టీయూ రోడ్డు వద్ద గొయ్యిల్ని, గచ్చిబౌలి ఫ్లైఓవర్ గుంత పూడ్చాను. దీంతో నేను పూడ్చిన గుంతల సంఖ్య 1,070కి చేరింది. ఇప్పుడు నేను నా కొడుకుతో కలసి మళ్లీ యూఎస్ వెళ్తున్నా. ఇంతటితో ఆగొద్దు.. నేనిక్కడ లేకున్నా, నా ఫౌండేషన్ తరఫున వాలంటీర్లు ఎక్కడ గుంతలు కనిపించినా శ్రమదానం చేస్తారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మా కుటుంబసభ్యులు నన్నీ పని చేయవద్దంటున్నారు. అయితే ఈ పనిని మాత్రం ఫౌండేషన్ కొనసాగించేలా ప్రణాళిక రూపొందించాం. గుంతలు లేని హైదరాబాద్‌ను చూడాలనేదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందనుకుంటున్నా. దీనికి జీహెచ్ఎంసీ సహకారం ఉండాలి. బాలగంగాధర తిలక్ -
బాలకార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్?
వ్యక్తి పరిపూర్ణ వికాసానికి, స్వేచ్ఛగా జీవించేందుకు తోడ్పడే అవకాశం కల్పించేదే హక్కు. ఒక రాజ్యం స్వభావం దాని పౌరులకు కల్పించే హక్కుల ద్వారానే తెలుస్తుందని హెచ్.జె. లాస్కి పేర్కొన్నారు. ‘సమాజం కోరిన, రాజ్యాంగంతో గుర్తింపు పొందిన అంశాలే హక్కులు’ అని గార్నర్ పేర్కొన్నారు. ‘భారతీయులకు సమాన హక్కులు కావాలి, స్వరాజ్యం మా జన్మ హక్కు’ అని మొదటిసారిగా 1895 కాంగ్రెస్ సమావేశంలో బాలగంగాధర్ తిలక్ డిమాండ్ చేశారు. 1928 మోతిలాల్ నెహ్రూ నివేదికలో భారతీయులకు సమాన హక్కులు ఉండాలనీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని కోరారు. 1931లో కరాచీలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో సర్దార్ పటేల్ హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రాథమిక హక్కులు హక్కుల రూపకల్పన కోసం పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల కమిటీ, జె.బి. కృపలానీ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల ఉపకమిటీని రాజ్యాంగ పరిషత్ నియమించింది. ఈ కమిటీలు అమెరికా బిల్ అ్ఫ్ రైట్స్ ద్వారా ప్రభావితమై హక్కులను రూపొందించాయి. ప్రాథమిక హక్కులను మూడో భాగంలో చేర్చారు. వీటి గురించి అధికరణలు 12- 35 వరకు వివరిస్తాయి. * అధికరణ 12 - రాజ్య నిర్వచనం: రాజ్యం అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు; అవి చేసే శాసనాలు. * అధికరణ 13 - హక్కుల అమలు: హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లవు. వీటి రక్షణ కోసం న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం కల్పించారు. న్యాయ సమీక్ష గురించి రాజ్యాంగంలో పరోక్షంగా ప్రస్తావించారు. సమానత్వపు హక్కు (అధికరణ 14-18) * అధికరణ - 14: చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది. దీన్నే సమన్యాయ పాలనగా పేర్కొంటారు. దీని నుంచి అధికరణ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు మినహాయింపు ఇచ్చారు. * అధికరణ - 15: పౌరుల పట్ల జాతి, మత, కుల, లింగ పుట్టుక ప్రాతిపదికన రాజ్యం వివక్ష చూపకూడదు. * 15(2): ప్రజా ఉపయోగమైన ప్రదేశాల్లో అందరికీ సమాన ప్రవేశం కల్పించాలి. * 15(3): మహిళలకు తోడ్పడే ఉద్యోగాల్లో వారికే ప్రాముఖ్యత ఇవ్వాలి. * 15(4): బలహీన వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి. * 15(5): వృత్తి విద్యా సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. దీన్ని 2006లో 93వ సవరణ ద్వారా చేర్చారు. * అధికరణ 16: ప్రభుత్వ ఉద్యోగ, విద్య అవకాశాల్లో అందరికీ సమాన అవకాశం కల్పించాలి. * 16(1): ఉద్యోగ అవకాశాల్లో కుల, మత, లింగ విభేదాలు పాటించకూడదు. * 16(2): సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి. * 16(3):అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి. * 16(4): ప్రభుత్వ ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. * అధికరణ 17 - అస్పృశ్యత నిషేధం: ఇది ఒక సామాజిక దూరాచారం. కాబట్టి దీన్ని నిషేధించారు. దీని అమలుకు పార్లమెంట్ చట్టాలు చేయవచ్చు. అంటరానితనం నిషేధ చట్టాన్ని 1955లో రూపొందించారు. దీన్ని 1976లో పౌర హక్కుల చట్టంగా మార్చారు. * అధికరణ 18 - బిరుదుల రద్దు: బ్రిటిషర్లపాలనా కాలంలో కల్పించిన రావ్బహద్దూర్, రావు సాహెబ్, రాజా విక్రమార్క మొదలైన బిరుదులను నిషేధించారు. విదేశీ బిరుదులను కూడా నిషేధించారు. వీటిని రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే స్వీకరించాలి. స్వదేశీ బిరుదులపై కూడా రాష్ట్రపతి నిషేధం విధించవచ్చు. ఉదా: 1977 నుంచి 1980 వరకు భారతరత్న, పద్మ విభూషణ్ మొదలైన బిరుదులను నిషేధించారు. స్వేచ్ఛ, స్వాతంత్రపు హక్కు (అధికరణ19-22) * అధికరణ 19: భారత పౌరులందరికీ ఏడు రకాల స్వేచ్ఛ కల్పించారు. ప్రస్తుతం ఆరు రకాల స్వేచ్ఛ ఉంది. * అధికరణ 19(1)(ఎ) భావ ప్రకటన స్వేచ్ఛ: వ్యక్తిగత భావాలను వార్తా పత్రికలు, రేడియో, టీవీ, పుస్తకాలు, కరపత్రాలు మొదలైన సాధనాల ద్వారా వ్యక్తపర్చుకోవచ్చు. * అధికరణ 19(1)(బి): మారణాయుధాలు ధరించకుండా, శాంతియుతంగా బహిరంగ సభలను నిర్వహించుకోవచ్చు. * అధికరణ 19(1)(సి): సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. * అధికరణ 19(1)(డి): దేశంలో ఎక్కడైనా సంచరించవచ్చు. * అధికరణ 19(1)(ఇ): దేశంలో ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పర్చుకోవచ్చు. * అధికరణ 19(1)(ఎఫ్): ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ. దీన్ని 1978లో 44వ సవరణ ద్వారా తొలగించారు. * అధికరణ 19(1)(జి): ఇష్టమైన వృత్తిని చేపట్టవచ్చు. * అధికరణ 20 - నేర నిరూపణ, వ్యక్తులకు కొన్ని రక్షణలు * 20(1): ఏ వ్యక్తినైనా చట్ట ప్రకారమే శిక్షించాలి. * 20(2): ఏ వ్యక్తినీ ఒకే నేరానికి రెండుపర్యాయాలు శిక్షించరాదు. * 20(3): ఏ వ్యక్తినీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టరాదు. * అధికరణ 21 - జీవించే హక్కు: చట్టంలో నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరేవిధంగానూ ఒక వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు. ‘చట్టం నిర్ధారించే పద్ధతి’ అనే అంశాన్ని జపాన్ నుంచి గ్రహించారు. * అధికరణ - 21(ఎ): ఉచిత, నిర్బంధ విద్యాహక్కు. దీన్నే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చారు. దీని అమలుకు 65:35 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను భరిస్తాయి. * అధికరణ 22 - నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి రక్షణ: అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి. అతడికి ఇష్టమైన అడ్వకేట్‌ను పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలి. అరెస్టు చేసిన వ్యక్తిని చట్టప్రకారమే విచారించాలి. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టైన వారికి ఇది వర్తించదు. పీడనాన్ని నిరోధించే హక్కు (అధికరణ - 23, 24) దీన్ని ప్రత్యేకంగా మహిళలు, పిల్లల కోసం చేర్చారు. * అధికరణ - 23: మహిళలను దోపిడీకి గురిచేస్తున్న వెట్టిచాకిరి, దేవదాసి, పడుపు వృత్తి మొదలైన దూరాచారాలను నిషేధించారు. మనుషుల అక్రమ రవాణాను నిషేధించారు. * అధికరణ 24 - బాలకార్మిక వ్యవస్థ నిషేధం: బాలల సంరక్షణ కోసం బాలల హక్కుల చట్టం 1938, ఫ్యాక్టరీల చట్టం - 1948, మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956 మొదలైనవాటిని రూపొందించారు. పాఠశాలల్లో విద్యార్థులను భౌతికంగా దండించడం కూడా పీడించడం కిందకే వస్తుందని 2006లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మతస్వాతంత్రపు హక్కు(అధికరణ-25, 28) * అధికరణ - 25: దీని ప్రకారం మతస్వేచ్ఛ కల్పించారు. ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. బలవంతంగా మత మార్పిడి చేయకూడదు. * అధికరణ - 26: ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. స్థిర, చరాస్థులను సంపాదించుకోవచ్చు. మతాభివృద్ధి కోసం సంస్థలను స్థాపించుకోవచ్చు. * అధికరణ - 27: దీని ప్రకారం మత ప్రాతిపదికన, మత కార్యక్రమాలపై పన్ను విధించరాదు. మత కార్యక్రమాల కోసం విరాళాలను వసూలు చేసుకోవచ్చు. * అధికరణ - 28: ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో మత బోధన నిషేధం. సాంస్కృతిక, విద్యాహక్కు (అధికరణలు - 29, 30) * అధికరణ-29: భారత ప్రజలు తమ భాషను, లిపిని, సంస్కృతిని రక్షించుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. మైనార్టీ లు అనే కారణంతో విద్యాసంస్థల్లో ప్రవేశం నిరాకరించరాదు. ఆదివాసీలు సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు. * అధికరణ - 30: మైనార్టీ వర్గాలు ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిర్వాహణలో యాజమాన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆస్తిహక్కు (అధికరణ - 31) ఇది ఒకప్పుడు ప్రాథమిక హక్కు. దీనికి 1, 17, 24వ సవరణల ద్వారా మార్పులు చేశారు. 1978లో 44వ సవరణ ద్వారా దీన్ని తొలగించి, నిబంధన 300(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఇది ఒక చట్టబద్ధమైన హక్కు. రాజ్యాంగ పరిహార హక్కు (అధికరణ-32) ఇది అతి ముఖ్యమైంది. మిగతా అన్ని హక్కులకు రక్షణ కల్పిస్తుంది. హక్కులకు నష్టం వాటిల్లినప్పుడు న్యాయ స్థానాలను ఆశ్రయించే అవకాశం కల్పిస్తుంది. వీటి రక్షణ కోసం సుప్రీంకోర్టు 32వ, హైకోర్టులు 226వ అధికరణల ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. రిట్ల జారీ విషయంలో హైకోర్టు అధికార పరిధి ఎక్కువ. అవసరమైతే రిట్ల జారీ అధికారాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా కింది కోర్టులకూ కల్పించవచ్చు. రిట్లు హెబియస్ కార్పస్: ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయస్థానంలో హాజరుపర్చాలి. ఈవిధంగా హాజరు పర్చని సందర్భంలో కోర్టు ఈ రిట్‌ను జారీ చేస్తుంది. మాండమస్: ఏదైనా ప్రభుత్వ సంస్థ లేదా ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించాలని ఆదేశిస్తూ జారీ చేసే రిట్ ఇది. దీని నుంచి రాష్ట్రపతికి, గవర్నర్‌కు మినహాయింపు ఉంది. కో వారెంటో: ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ఆ పదవులను దుర్వినియోగపర్చడం లాంటి సందర్భాల్లో ఆ పదవిలో కొనసాగరాదని జారీ చేసే రిట్. ప్రొహిబిషన్: ఏదైనా కోర్టు తన పరిధిలోకి రాని కేసును విచారిస్తున్న సందర్భంలో ఆ కేసు మీ పరిధిలోకి రాదు కాబట్టి విచారణ ఆపేయాలని కింది కోర్టుకు హైకోర్టు జారీ చేసే రిట్. సెర్షియరీ: ఏదైనా కింది కోర్టు తన అధికార పరిధిలోకి రాని కేసును విచారిస్తుంటే.. ఆ కేసు మీ పరిధిలోకి రాదు కాబట్టి దాన్ని పై కోర్టుకు బదిలీ చేయాలని కింది కోర్టుకు హైకోర్టు జారీ చేసే రిట్. * అధికరణ - 33: దీని ప్రకారం సైన్యంలో, పోలీస్ వ్యవస్థలో పనిచేసే అధికారుల హక్కులపై పరిమితులు విధించవచ్చు. * అధికరణ - 34: జాతీయ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. వీటిని రద్దు చేసే అధికారం నిబంధన 359 ప్రకారం రాష్ట్రపతికి ఉంది. ఈ సందర్భాల్లో నిబంధనలు 20, 21 రద్దు కావు. * అధికరణ - 35: దీని ప్రకారం హక్కులకు సంబంధించి చట్టాలను చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. గతంలో అడిగిన ప్రశ్నలు 1. హెబియస్ కార్పస్ అనేది? 1) గ్రీక్ పదజాలం 2) లాటిన్ పదజాలం 3) ఇంగ్లిష్ పదజాలం 4) ఫ్రెంచ్ పదజాలం 2. భారత రాజ్యాంగం ప్రకారం కిందివాటిలో ఏది మౌలికమైన హక్కు కాదు? 1) సంఘాలను ఏర్పర్చుకోవడం 2) భావ ప్రకటన హక్కు 3) ఉచిత నిర్బంధ విద్యా హక్కు 4) సంచరించే హక్కు 3. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌లో కిందివాటిలో దేన్ని చేర్చలేదు? 1) వాక్కు, భావ స్వాతంత్య్రం 2) వినోదం, ఉల్లాసం, హాస్యం స్వాతంత్య్రం 3) సమావేశాలు, సంఘాలను ఏర్పర్చుకునే స్వాతంత్య్రం 4) చలన, నివాస, వృత్తి, వ్యాపార స్వాతంత్య్రం 4. రాజ్యంగంలోని 21వ ఆర్టికల్ ఏ విషయా నికి సంబంధించింది? 1) మాట్లాడే హక్కుకు సంబంధించిన కొన్ని హక్కులను సంరక్షిస్తుంది 2) నేర నిర్ధారణకు సంబంధించిన సంరక్షణ 3) వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితం సంరక్షణ 4) కొన్ని కేసుల్లో అరెస్టుకు వ్యతిరేకంగా రక్షణ 5. రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కా ర్మిక వ్యవస్థను నిషేధిస్తుంది? 1) 24 2) 36 3) 18 4) 28 6. {పాథమిక హక్కులను సవరించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? 1) కేశవనంద భారతి ఠిట స్టేట్ ఆఫ్ కేరళ 2) గోలక్‌నాథ్ ఠిట స్టేట్ ఆఫ్ పంజాబ్ 3) ఇందిరాగాంధీ ఠిట రాజ్‌నారాయణ్ 4) శంకర్ ప్రసాద్ ఠిట యూనియన్ ఆఫ్ ఇండియా సమాధానాలు 1) 2; 2) 3; 3) 2; 4) 3; 5) 1; 6) 2. -
ఆయన దారి... ఎందరికో రహదారి
ఏ రోడ్డు మీద గుంటలు కనిపించినా వెంటనే కారాపి, వాటిని పూడ్చేస్తారాయన. ఆయన కారు డిక్కీలో గోనె సంచుల నిండా తారుపెళ్లలు, పలుగు, పార ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి... రైల్వే ఉద్యోగం నుంచి రిటైరై... హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న బాలగంగాధర తిలక్ ఈ పనెందుకు చేస్తున్నట్లు? రోజూ చూసే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది మెరుగైన సమాజం కోసం శ్రమిస్తున్న ఓ సామాన్యుడి విచిత్ర సేవకు వెయ్యిమంది ఎలా కలిశారు? ‘‘మొదట్లో నేను ఒక్కడినే చేసేవాడిని. నా చేతికి నీళ్లు పోయడానికి పిలిచినా కూడా ఎవరూ వచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు దాదాపు వెయ్యిమంది దాకా నాతో చేతులు కలిపారు. ఇది నాకెంతో తృప్తినిస్తోంది.’’ - తిలక్ హైదరాబాద్‌లోని రోడ్ల మీద తరచూ గుంటలను పూడుస్తూ కనిపిస్తుంటారాయన. చూడడానికి బాగా చదువుకున్న వాడిలా అనిపించే ఆయనను చూస్తే, ‘కాంట్రాక్టరేమో... పిసినిగొట్టులా ఉన్నాడు... కూలీలను పెట్టకుండా తానొక్కడే చేస్తున్నాడు. పైగా తారు... కంకర వేయకుండా రాళ్లతో నింపేస్తున్నాడు...’ అనుకొంటారు. ఇంతకీ ఆయన చేస్తున్న పనేంటంటే... రోడ్డు మీద ప్రమాదాలకు కారణమవుతున్న గుంటలను స్వచ్ఛందంగా, స్వహస్తాలతో పూడ్చడం. రోడ్ల మీద గుంటలను పూడ్చే యజ్ఞంలో సమాజంలోని అనేక కోణాలను చూశానంటారు కాట్నం బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్‌ది పశ్చిమగోదావరి జిల్లా ఎర్నగూడెం గ్రామంలో వ్యవసాయ కుటుంబం. పాలిటెక్నిక్ పూర్తి చేసి 1993లో రైల్వేలో సిగ్నల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. సాఫ్ట్వేర్ డిజైనింగ్‌లో నైపుణ్యం సాధించిన తిలక్... ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ శివార్లలో ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. హైదర్షా కోట్ గ్రామంలో నివాసం. సాధారణ వ్యక్తిగా తన జీవితమేదో తాను గడిపేస్తున్న తిలక్‌ని అసాధారణ వ్యక్తిగా మార్చిన ప్రదేశం అది. ఆ రోజు ఉదయం మామూలుగానే ఆఫీసుకు బయల్దేరారాయన. ముందురోజు రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా బురదమయం. గుంతల్లో నీరు మడుగులు కట్టింది. ఎంత జాగ్రత్తగా నడిపినా సరే కారు చక్రం మడుగులో పడడం... బురద నీరు స్కూలుకెళ్తున్న పిల్లల మీద చిందడం జరిగిపోయాయి. ఆందోళనగా కారాపారు తిలక్. స్కూలు పిల్లలతోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్లు ఏమీ మాట్లాడలేదు... కానీ ఒక చూపు చూశారు. ఆ చూపులో చాలా అర్థాలున్నాయి, అనేక భావాలు వ్యక్తమయ్యాయి. తర్వాత ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. మనిషిని మార్చిన సంఘటనలు కానీ తిలక్‌ని ఆ చూపులు ఆ రోజంతా వెంటాడుతూనే ఉన్నాయి. అదే విషయాన్ని ఆఫీసులో సహోద్యోగులతో పంచుకున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద ఇది చాలా సాధారణం అని తేలిగ్గా అనేశారు. తిలక్ మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయారు. ‘‘ఆ తర్వాత వచ్చిన శని, ఆదివారాల్లో ఆ గుంతలను పూడ్చేశాను. ఇది జరిగింది 2010 జనవరి 19వ తేదీన. ఆ రోజు ఆరు ట్రక్కుల మట్టితో శ్రామికులను పెట్టి గుంతలను నింపడానికి ఐదున్నరవేలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత సోమవారం రోజు యథావిధిగా ఆఫీసుకు వెళ్తున్నప్పుడు అదే పిల్లలు కారాపి కృతజ్ఞతలు చెప్పారు’’ అంటూ తన ప్రయత్నం నిరంతర యజ్ఞంలా సాగడానికి దారి తీసిన సంఘటనను తిలక్ వివరించారు. అదే వారంలో ఒకరోజు లంగర్ హౌస్ నుంచి నార్సింగి వెళ్లేదారిలో ప్రయాణిస్తున్నారు తిలక్. రోడ్డుమధ్యలో చిన్న గుంట... బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఆ గుంటను తప్పించుకోవడానికి పక్కకు జరిగాడు. వెనుకే వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టి, బైక్ రైడర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో మూడు రోజులకు ఒక ఆటో డ్రైవర్ అదే గోతిని తప్పించబోయినప్పుడు ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. ఒకరు అక్కడే చనిపోయారు. కళ్ల ముందే ప్రాణాలు పోవడంతో తిలక్ మనసు కలిచివేసినట్లయింది. ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా ఈ గోతిని ఎవరైనా పూడ్చేస్తే ఈ ప్రమాదాలు జరక్కపోయేవి కదా అని కూడా అనిపించింది. దీనిని ఇలాగే వదలడం ఎందుకు అనిపించి కారాపి ఫుట్‌పాత్ పక్కన ఉన్న తారుపెళ్లలతో గోతిని నింపారు. ఇక అప్పటినుంచి రోడ్డు మీద ఎక్కడ గొయ్యి కనిపించినా రోడ్డు పక్కన కారాపి తారుపెళ్లలతో ఆ గోతిని పూడ్చడం ఆయన దైనందిన కార్యక్రమంగా మారింది. ఆయన కారు డిక్కీలో చిన్న పలుగు, పార, చేతికి వేసుకోవడానికి గ్లవుజులు ఎప్పుడూ ఉంటాయి. పదుగురినీ కదిలించిన సేవ తిలక్ సందర్భానుసారంగా స్పందించి చేసిన పని, ఆయన కుమారుడు రవికిరణ్ చొరవతో సమష్టికృషిగా మారింది. ఈ క్రమంలో ఇన్ఫోటెక్లో కన్సల్టెంట్ ఉద్యోగాన్ని మానేశారాయన. పెన్షన్ డబ్బు కూడా మట్టికొనడం వంటి ఇతర అవసరాలకు ఖర్చయిపోవడం మొదలయ్యాక భార్య వెంకటేశ్వరి ఇక చూస్తూ ఊరుకోలేక పోయారు. ఈ సమాచారం అమెరికాలో ఉన్న రవికిరణ్‌కు చేరింది. కానీ, తండ్రిలో పరివర్తన తీసుకురావడానికి ఇండియా వచ్చిన రవికిరణ్ ఈ సేవను కళ్ళారా చూసి, చివరికి తండ్రి మార్గంలోకే వచ్చేశారు. అప్పటి నగర కమిషనర్ కృష్ణబాబును కలిసి ఈ శ్రమదానానికి ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఇప్పించే ఏర్పాటు చేశాడు. ఇప్పటి నగర కమిషనర్ కూడా సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ‘‘అలాగే మా అబ్బాయి నేను గుంటలు పూడుస్తున్న వైనాన్ని ఫొటోలు తీసి ఫేస్బుక్లో పెట్టి, ఇలాగే శ్రమదానం చేయాలనే వారు పాల్గొనవచ్చని ఆహ్వానించాడు. అప్పటి నుంచి చాలామంది యువకులు ముందుకొస్తున్నారు’’ అన్నారు తిలక్. వీరంతా కలిసి ప్రతి శని, ఆది వారాలూ పనిచేస్తున్నారు. ఏ వారం ఎక్కడ శ్రమదానం ఉంటుందనేది ఫేస్బుక్ ద్వారానే సమాచారం ఇస్తారు. ఆ ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిని మాత్రమే పాల్గొంటారు. అలా ఇప్పటి వరకు దిల్షుక్ నగర్, ఎల్.బి నగర్, నాగోల్, వనస్థలిపురం, పురానాపూల్, జియాగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, చందానగర్ రోడ్లను బాగుచేశారు. తిలక్ చేస్తున్న పని ద్వారా సమాజం ఫలితం పొందుతోంది. ఒక సామాన్యుడి శ్రమదానానికి ఇంతకన్నా సత్ఫలితం ఇంకేం కావాలి! - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ -
గుడివాడ 2టౌన్ సీఐపై వేటు
కానిస్టేబుల్ సస్పెండ్ ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అధికారుల చర్యలు నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై క్రిమినల్ కేసు ఆర్ఐవో, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యుల తొలగింపు {పశ్నపత్రాలు లీక్ కాలేదు: బోర్డు స్పష్టీకరణ మచిలీపట్నం, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గుడివాడ 2 టౌన్ సీఐ బాలగంగాధర తిలక్, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి తెలిపారు. అలాగే, గుడివాడ నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రితోపాటు హెడ్ కానిస్టేబుల్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. లీకేజీ ఆరోపణలపై జాయింట్ కలెక్టర్ మురళి విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఇక, ఈ ఘటనలో ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐవో) పి.వెంకట్రామయ్యను ఆ బాధ్యతల నుంచి తొలగించి, ఆయన స్థానంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజారావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీలోని ముగ్గురు సభ్యులను ఆ బాధ్యతల నుంచి తొలగిం చారు. ఆర్ఐవో పి.వెంకట్రామయ్య, డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు, చీఫ్ సూపరింటెండెంట్, కస్టోడియన్‌పై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. గుడివాడలోని నారాయణ జూనియర్ కళాశాలకు ‘ఇంటర్ సప్లిమెంటరీ’ పరీక్షా కేంద్రం కేటాయించనప్పటికీ, ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాలను ముందుగా తీసుకెళ్లడంతో లీకేజీ జరిగిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లీక్ కాలేదు: గుడివాడ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాల బండిల్స్ ఉన్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించినప్పటికీ, అవి లీక్ కాలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి బుధవారం ప్రకటన విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి లేకుండా ప్రశ్నపత్రాలున్న పెట్టెలను నారాయణ కాలేజీకి తరలించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.