ఆకుపచ్చ సూర్యోదయం | Green sunrise | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Published Sun, Apr 2 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం

1
ఆగస్ట్‌ 1, 1920. లోకమాన్య బాలగంగాధర తిలక్‌ అస్తమించారన్న వార్త వేకువనే బొంబాయిని దిగ్భ్రాంతికి గురి చేసింది.  ఆ వెంటనే, స్వరాజ్య సాధన కోసం సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభిద్దామంటూ మోహన్‌దాస్‌ గాంధీ లాంఛనంగా ఇచ్చిన ప్రకటన గురించి మరో వార్త. ఈ సంచలనాలు భారతదేశాన్ని చుట్టబెట్టాయి. ఆంధ్రపత్రిక ద్వారా రెండు రోజుల తరువాత కృష్ణదేవిపేట  చేరాయి. ‘‘మహాను భావుడు, వెళ్లిపోయాడు!’’ చేతులు జోడించి అన్నాడు ఊరి పెద్ద చింతల స్వామినాయుడు.

కొద్దిసేపు మౌనం. ఎవరికి తోచింది వాళ్లు చెబుతున్నారు. భాస్కరుడు అన్నారు–‘‘ రాజుగారు మాట్లాడడం లేదు.’’  నిమిషం తరువాత గుర్తు చేసుకుంటున్నట్టుగా మాట్లాడాడు శ్రీరామరాజు.‘‘మితవాదులూ, అతివాదులూ కలసి పని చేయాలని నిర్ణయించడానికి కొంచెం ముందు జరిగింది లక్నో ప్రాంతీయ కాంగ్రెస్‌ సమావేశం. అందులో ఆ మహానుభావుడిని నేను చూశాను. అదే ఆవేశం. స్వరాజ్యం కోసం అదే తపన. చూస్తుంటే ఆయన చెప్పిన అతివాదమే సత్యమనిపిస్తుంది’’ అన్నాడు రామరాజు.

‘‘మీరు...కూడా...!?’’ అన్నాడు మునసబు లగుడు సత్యనారాయణ  అర్ధోక్తిగా.‘అతివాదపద్ధతే మంచిదని అంటాను.’’ అన్నాడు రామరాజు నిశ్చయంగా.‘‘మీరూ కాంగ్రెస్‌ వాదులేనన్నమాట!’’ అన్నాడు మునసబు.‘‘అలా అనుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఆధ్యాత్మికవాదిని కాబట్టి నేను ఒక సంస్థకి లిఖిత పూర్వకంగా కట్టుబడి ఉండను.’’ అన్నాడు రామరాజు. అలాంటి మాట ఆయన నోటి నుంచి రావడం అదే మొదటిసారి. అంతా ఆశ్చర్యంగా చూశారు.

తిలక్‌ మరణించిన నెలకే కలకత్తాలో జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. ‘‘సహాయ నిరాకరణను విజయవంతం చేయగలిగితే ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం తథ్యం’’ అన్నారు గాంధీ. ఆ డిసెంబర్‌లో జరిగిన నాగపూర్‌లో వార్షిక సమావేశాలలో ఈ ప్రతిపాదనకి ఇంకా బలం వచ్చింది.  మోతీలాల్, చిత్తరంజన్‌దాస్, రాజేంద్రప్రసాద్, వల్లభ్‌బాయ్‌ పటేల్, రాజగోపాలాచారి వంటి వారు కూడా ఉద్యోగాలకీ, వృత్తులకీ వీడ్కోలు పలికి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అప్పుడే భారత రాజకీయాలలోకి అడుగు పెడుతున్నాడు సుభాశ్‌ చంద్రబోస్‌.  గాంధీ పిలుపు మేరకే ఐసీఎస్‌కు రాజీనామా చేశాడు.అందరం గ్రామాలకు వెళదామన్నాడు గాంధీ.
∙∙∙  
నాగపూర్‌ కాంగ్రెస్‌ తరువాత జనవరి, 1921లో బెజవాడలో ఆంధ్రా ప్రోవిన్షియల్‌ కాంగ్రెస్‌ సమావేశం జరిగింది. స్వరాజ్య భావనని కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం, అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, తెలుగు నేల నాలుగు చెరగులా. స్వరాజ్య నినాదం తెలుగువారిలో కదలిక తెచ్చింది. సంవత్సరంలో వచ్చే స్వాతంత్య్రం గురించీ, యూనియన్‌ జాక్‌ అవనతమవుతున్న దృశ్యం గురించీ కలలుగంటున్నారు తెలుగువారు.

2
 జనవరి 16వ తేదీ. కనుమ పండుగ. అచ్చంగా పత్రికా పఠనం కోసమే ఆ రోజు వచ్చారంతా. జనవరి 13, 1921 నాటి పత్రిక అది. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ గురించి వార్త మరి. ఎప్పుడూ వినలేదు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందట.
వార్తంతా చదివి చెప్పడం మొదలు పెట్టారు భాస్కరుడు గారు. ‘‘1919లో భారత ప్రభుత్వం చట్టం తెచ్చారు కదా! ఆ మేరకు ప్రెసిడెన్సీలలో ద్వంద్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. జనవరి 12,1921న మద్రాసు ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ కూడా మొదలయిందట. ఇంకో విషయం – మొన్న డిసెంబర్‌ 17న ప్రభుత్వం కూడా కొలువైంది.’’బ్రిటిష్‌ పాలనని భుజాన వేసుకునే జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణాధిక్యం నినాదంతో మొదటి ఎన్నికలలో మెజారిటీ తెచ్చుకుంది. రామరాజు అంతా విన్నా మౌనంగానే ఉండిపోయాడు.
∙∙∙
1921 ఏప్రిల్‌లో మండే ఎండలలో బెజవాడలో జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్, పటేల్‌ దాదాపు జాతీయ నేతలంతా వచ్చారు. వారిని చూసేందుకు రెండు లక్షల మంది వచ్చారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము....’, ‘దండాలండోయ్‌ దండాలు’, ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ వంటి పాటలూ పద్యాలూ పాడుకుంటూ రాత్రీ పగలూ నడిచి వచ్చారు జనం.ఆ ఆగస్టులోనే కృష్ణా పుష్కరాలు జరిగాయి. కృష్ణాతీరమంతా ఎక్కడ విన్నా అలాంటి పాటలే. సాధువులు, సన్యాసులు, భిక్షకులు అంతా అవే పాడుతున్నారు.

3
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం.శ్రీరామవిజయనగరంలో ఆశ్రమం అరుగు మీద శిష్యులతో కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పుడే దూరంగా పది పన్నెండు మంది రావడం కనిపించింది. అందరికీ ముందు బొంకుల మోది, గోకిరి ఎర్రేసు నడుస్తున్నారు. ఆ ఇద్దరినీ గుర్తు పట్టాడు రామరాజు.‘వారే సాములు!’ అన్నట్టు చాలా భక్తితో చూపించాడు వచ్చిన వాళ్లకి ఎర్రేసు. రామరాజును చూడగానే ఆ బృందంలోని అందరి ముఖాలలోను మాటలకందని ఉద్వేగం. ముప్పయ్‌ అయిదేళ్ల ఆ వ్యక్తి రామరాజుకు భక్తితో నమస్కరించి అన్నాడు.‘‘దండాలు స్వామి! నా పేరు కంకిపాటి ఎండుపడాలు. బాలయ్య అని కూడా అంటారు. పెద్దవలసకి ఒకప్పుడు ముఠాదారుని కూడా రామయ్య అంటారీయన్ని. గూడెంలోనే ఓ బళ్లో అయ్యోరు.

మా అందరి మంచీ కోరేటోరు. అయ్యోరి పక్కన, కొటికల బాలయ్య. కంతారం మొఖాసాదారు.  ఆయన గాం గంతన్న, ఒకప్పుడు బట్టిపనుకుల మునసబు. ఆ కుర్రోడు గంతన్న తమ్ముడు, మల్లు. నడింపాలెం. ఈళ్లు మా మనుషులు.’’‘‘నమస్కారం! ఇలా వచ్చారేమిటి?’’ ప్రతి నమస్కారం చేస్తూ అడిగాడు రామరాజు. ‘‘అందరిదీ ఒకేరకం బాధ సామీ! మా కొండోళ్లు ఇన్ని కష్టాలు గతంలో ఎప్పుడూ పడలేదు. తమరితో మాట్లాడి, సాయం తీసుకుందామని వచ్చాం. దయ చూపాలి.’’ అన్నాడు ఎండు పడాలు, దీనంగానే.

‘‘ఎంతమాట పడాలు గారూ! రండి, కూర్చుని మాట్లాడుకుందాం!’’తాండవ ఒడ్డునే ఉన్న పెద్ద మామిడిచెట్టు కిందకు నడిచాడు రామరాజు. ఐదారు పెద్ద పెద్ద దుంగలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటి మీదే రామరాజు, శిష్యులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న సభ తీర్చినట్టే ఉంటుంది.  పడాలు, గంతన్న, మల్లు, రామయ్య, బాలయ్య మాత్రం కూర్చున్నారు. మిగిలిన వాళ్లు చేతులు కట్టుకుని నిలబడే ఉండిపోయారు.

‘‘నేనూ చాలానే విన్నాను!’’ అన్నాడు రామరాజు రెండు నిమిషాల తరువాత.‘‘ఎంత విన్నా తరగనంత బాధ స్వామీ మాది. నేనూ కొండవాడినే. వీళ్ల దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నవాడిని. 1882లో అడవులని రిజర్వు చేయడం దగ్గర నుంచి కొండ ప్రజల ఉనికే ప్రశ్నార్థకమైపోయింది.’’ ఆవేదనతో అన్నారు కూడా రామయ్య.‘‘మేం అడవిలోకి పోకూడదు. మరో లోకమేదీ మాకు తెలీదు. ఇంక మా బతుకెక్కడ సామీ?’’ అన్నాడు గంతన్న.

‘‘అనుకోకుండా మమ్మల్ని మామిడిచెట్టు కింద కూర్చోబెట్టారు తమరు. ఈ కాలంలో కొండోళ్లం పవిత్రంగా చూసుకునే చెట్టు. ఆ దేవత నీడలో చెబుతున్నాను. కొండోళ్లు కడుపునిండా తిని కొన్నేళ్లయింది. కొండల్లో కొండవాడు రోడ్లేసే కూలీగా మారిపోయాడు.’’ చెప్పాడు కొటికల బాలయ్య.‘‘ఈ సమస్త కష్టాలకీ బేస్టీను కారణం స్వామీ. వీళ్లని జంతువుల్లా వేటాడుతున్నాడు. పోడు సేద్యం చేస్తే శిక్ష. కొమ్మా రెమ్మా కొట్టుకుంటే జరిమానా. !’’ చెప్పారు రామయ్య.

కొద్ది విరామం తరువాత ఆయనే చెప్పారు. ‘‘బాస్టియన్‌ సామీ. కొండవాళ్లంతా బేస్టిన్‌ అనడం అలవాటు. ఇక్కడిlవాడే, మతం పుచ్చుకున్నాడు. గూడెం డిప్యూటీ తహసీల్దారు.’’ ‘‘స్వామీ! అడవిలో అడుగుపెట్టలేని కొండవాడు, ఆకలికి చింతంబలీ, టెంకంబలీ తాగుతాడు. రోగాలొస్తున్నాయి. అందుకే బియ్యానికీ, కూలికీ ఆశపడి రోడ్డు పనికి వెళతన్నారు.అదో నరకం. అన్నం వార్చుకున్నా అంబలి కుండ తప్పదని కొండోళ్ల సామెత.

కూలికి పోతేనే నరకం కాదు. పోకపోయినా నరకమే. రోడ్డు పనికి పోకపోతే గ్రామాల మీద పడి చావగొడుతున్నారు పోలీసులూ, బేస్టీనూ.అడ్డగుడ్డ కట్టిన ఆడది, మొలతాడు కట్టిన మొగోడు బేస్టీను పిలిస్తే పనికి పోవాల్సిందే. కానీ సామీ! ఆరణాల కూలీ అంటాడు. రెండు అణాలే ఇస్తాడు. కొందరికి అదీ దక్కదు. చెప్పినట్టు బియ్యమైనా కొలవడు. అరకొరగా కొలిచి పొమ్మంటారు.’’ అంటూ ఒక్క నిమిషం ఆగాడు రామయ్య. ‘‘కొండోళ్లవి బక్కప్రాణాలు స్వామీ! పంటి బిగువున పనిచేస్తున్నారు. రోడ్డు పని కొండోళ్లని బతికించడానికని చెబుతున్నారు. కానీ కొండోళ్లని చంపడానికే రోడ్లేస్తున్నారు.’’ డగ్గుత్తికతో చెప్పాడు రామయ్య.

‘‘ఇదంతా ఎంతకాలం నుంచి?’’ బాధగా అడిగాడు రామరాజు.‘‘ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో రోడ్లేయడం మొదలైంది. అప్పటి నుంచీ హింసే.’’ చెప్పారు రామయ్య. ఐదు నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి.‘‘రామయ్య గారూ! నేనేం చేయగలనో చెప్పండి!’’ అన్నాడు రామరాజు.‘‘ఇవన్నీ కలెక్టర్‌దొరకి తెలియాలి. మద్రాసు ప్రభుత్వానికి తెలియాలి.’’ అన్నాడు రామయ్య.

‘‘అంటే అర్జీలు పంపమంటారా?’’ అడిగాడు రామరాజు.‘‘చిత్తం, డిప్యూటీ తాసీల్దారు అరాచకాలనీ, వాటిని చూస్తూ కూర్చున్న తాసీల్దారు చేతకానితనాన్ని గవర్నరు దొర వారికి రాసి పంపించాలి. మీకు ఆంగ్లం, హిందీ క్షుణ్ణంగా వచ్చునని విన్నాం. ఈ సాయం చేసి పెట్టాలి తమరు!’’ అన్నాడు బాలయ్య. ‘‘తప్పనిసరిగా రాసి పంపుతాను. మళ్లీ కలుసుకుందాం!’’ అన్నాడు రామరాజు.అంతా లేచారు, బయలుదేరడానికి.

ఇంక మౌనంగా ఉండలేనన్నట్టు ఒక్కసారి ఆవేశంతో ఊగిపోతూ చెప్పాడు పొట్టిగా లావుగా బలంగా ఉన్న ఆ కుర్రాడు– మల్లుదొర. ‘‘సామీ! సామీ..నా మాట కూడా ఇనండి! ఆ బేస్టిను పెద్ద దానగుడు. ఆళ్లు కొట్టే కొరడా దెబ్బలకి లెక్కలేదు. ఆడమగా అందరికీ ఒళ్లంతా చీరుకుపోతది. సామీ, అప్పుడు.. నూరిన పచ్చి మిరపకాయల ముద్ద రుద్దుతాడు. మొగోళ్లయితే ముడ్డిలో కూడా కుక్కిస్తాడు. ఆడోళ్లకి కొంగుల్లాగేసి గుండెల మీద రాస్తాడు.

బేస్టీను, ఆడి బంట్రోతూ, ఓవర్సీరు పిళ్లే కొట్టే దెబ్బలకి ఇళ్లకి వచ్చాక మంచం పడుతున్నారు సామీ కొండోళ్లు. ఇక దిగేది లేదు, కాటికే. ఇలా ఊరికి ఇద్దరో ముగ్గురో..నేను చిన్నోణ్ణే. కానీ నేను చెప్పేదంతా పచ్చినిజం. ఈ ఎండుపడాలు గారు పెద్దవలస ముఠాదారు. పరువూ మర్యాద ఉన్నోడు. ఆయన రెండు చేతులూ ఎనక్కి ఇరిచి బాదపెట్టాడు. మా అన్న ఊరి మునసబు. ఈణ్ణి బూటుకాలితో తన్నాడు. గుండెల మీద తన్నాడాడు.

కాయితాల మీద గీతలు గీసే కర్రతో నా మోకాళ్లు చితక్కొట్టాడు... చంపెయ్యాలి ఆ కొడుకుల్ని. ఆ పని చేయలేకపోతే కొర్రు దిగి సచ్చిపోవడం మంచిదనిపిస్తంది సామీ!’’ ఆ ఉద్రేకానికి అతడి కళ్లలో నీరు ఉబికింది. ముఖం ఎర్రబడిపోయింది. ‘‘సామీ! ఈ పడాలుగారూ, మా అన్న, ఈ అయ్యోరు.. ఎవరూ జరిగినవన్నీ చెప్పలేదు. మర్యాద అడ్డొస్తంది ఆళ్లకి. ఈళ్లు చెప్పినదానికి పదింతల ఎక్కువ బాధలు మావి.’’ మళ్లీ తనే అన్నాడు మల్లు. నిమిషం మౌనం. తరువాత మల్లుకు అర్థమయ్యేటట్టు, రామరాజుకు పరిచయమయ్యేటట్టు చెప్పాడు రామయ్య, నిదానంగా.

‘‘సామీ! ఒక్కమాట! పితూరీ అంటూ బేస్టీను మీద బరిసెలూ బాణాలూ ఎత్తి తిరగబడొచ్చు. నాలుగు పోలీసు స్టేషన్లు తగలబెట్టొచ్చు. ఓ నలుగురిని చంపొచ్చు. ఓ పదిమంది కొండవాళ్లు ఉరికంబాలు ఎక్కొచ్చు. ఓ పాతికమంది రాజమండ్రి జైల్లో చచ్చేదాకా మగ్గడానికి పోవచ్చు. మా తాతలకాలం నుంచీ పితూరీలు ఉన్నాయి. ఆటి ఫలితమిదే. పితూరీలు ఇక చాలు. ఇప్పుడు ముప్పు కొండవాళ్లకే కాదు, కొండలకి కూడా. ఈ అడవులకి కూడా.

ఈ లోయలకి కూడా. ఇది కూడా ఆలోచించాలి స్వామీ. రోడ్లతో ఈ నాశనం మొదలైపోయింది.’’ ఇక చెప్పేదేమీ లేదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి, చేతులు జోడించి అన్నాడు రామయ్య, ‘‘మీలో మాకో దేవుడు కనిపిస్తున్నాడు. పోలీసుల నుంచి మమ్మల్ని కాపాడండి! రోడ్ల నుంచి మన్యాన్ని రక్షించడానికి సాయపడండి.సెలవు.’’తలొంచుకుని నడుస్తున్నా, మల్లులో ఆవేశమైతే తగ్గలేదని అతని అడుగులు చెబుతున్నాయి. కొటికల బాలయ్యని కూడా రామయ్య మాటలు తృప్తి పరచలేకపోయామని అతని ముఖం చూస్తే తెలుస్తోంది.ఆశ్రమం లోపల కుర్రాళ్లంతా వెళ్లిపోయారు ఎప్పుడో. నదిని చూస్తూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు రామరాజు. బాస్టియన్‌ మీద ఫిర్యాదు ఎలా రాయాలో ఆలోచిస్తూ.   

4
ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తల మీద జోరుగా సాగుతోంది చర్చ. భాస్కరుడు మాత్రం అన్య మనస్కంగా ఉన్నారు. ఎక్కడికో తెలియదు. ఎందుకో తెలియదు. తల్లికి కూడా చెప్పలేదు. ఏడెనిమిది వారాల క్రితం  ఎవరికీ చెప్పకుండా వెళ్లాడు శ్రీరామరాజు.‘‘ఏమండోయ్‌! ప్రెసిడెన్సీ మొదటి ప్రధానమంత్రిగారు అగరం సుబ్బరాయులు రెడ్డియార్‌ రాజీనామా చేసేశాడట.’’ హడావుడిగా అన్నాడు లగుడు సత్యనారాయణ, కొంచెం ఆలస్యంగా వచ్చిన చింతల నాయుడుతో. చెప్పింది సత్యనారాయణే అయినా, స్వామినాయుడు, భాస్కరుడిని ఉద్దేశించి ప్రశ్నించాడు ‘‘ఎందుకో!’’భాస్కరుడుగారు జవాబు ఇవ్వలేదు.

‘‘భాస్కరుడుగారు! ఏమిటి అలా ఉన్నారు?’’ ఆయన భుజం సుతారంగా తడుతూ అడిగాడు స్వామినాయుడు.‘‘ఆ...  ఏమిటి?’’అన్నారు భాస్కరుడు తేరుకుని.‘‘ రెడ్డియారు, రాజీనామా చేసేశారంట? ఎందుకు?’’ ‘‘అనారోగ్యం.’’ జవాబిచ్చాడు భాస్కరుడు పేపరు ఆయనకి ఇస్తూ. జూలై 12, 1921 నాటి పేపరు అది. ఈసారి నాలుగు రోజులకి వచ్చింది. ‘‘అదలా ఉంచండి! ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?’’ అన్నాడు నాయుడు.

‘‘రామరాజుగారు వెళ్లి రెండు నెలలు కావస్తోంది. సూర్యనారాయణమ్మగారిని చూస్తే బాధగా ఉంది నాయుడుగారు! నిన్ననే ఆ తల్లి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని వెళ్లింది. అసలే అభిమానవతి. అక్కడ మీ ఇద్దరూ ఎందుకు, ఇక్కడే ఉండండి అంటే ఆమె వినడం లేదు.’’ అన్నారు కొంచెం నెమ్మదిగా, భాస్కరుడు.సత్యనారాయణ పేపరు తీసుకుని చెబుతున్నాడు. ‘‘ఇది వినండి! ఇప్పుడు మొత్తం మూడు మంత్రి పదవులలోను తెలుగువాళ్లే ఉన్నారు.’’‘‘అలాగొచ్చిందా?’’ అన్నాడు పొన్నాడ వెంకటరత్నం బ్రహ్మానందం పడిపోతూ.‘‘సుబ్బరాయులు రెడ్డియారుగారు పానగల్లు రాజాని ప్రధానమంత్రిని చేయమని సిఫార్సు చేశాడట.

 పానగల్లు రాజా రామరాయణింగారు, కూర్మా వెంకటరెడ్డినాయుడు పాతవాళ్లే. కొత్తగా అన్నెపు పరశురామదాస్‌ పాత్రో అనే ఆయన్ని నియమించాడట గవర్నర్‌ విల్లింగ్డన్‌.’’ చెప్పాడు లగుడు.‘‘తెలుగువాళ్లని సంబరపడడం తప్ప ఏం ఒరుగుతుంది? దేశమంతా జాతీయ కాంగ్రెసు సహాయ నిరాకరణ. అక్కడేమో జస్టిస్‌ పార్టీ పాలన. పనులెలా జరుగుతాయి?’’ అన్నాడు స్వామినాయుడు.

మళ్లీ ఆయనే అన్నారు, ‘‘చీరాల–పేరాల ఉద్యమం ఈ తెలుగు మంత్రులకి పట్టదేం? పిల్లలు, వృద్ధులు, ఆడవాళ్లు మహా యాతన పడుతున్నారక్కడ. గర్భవతులు ఆ పందిళ్లలో ఎండనకా, వాననకా నానా ఇక్కట్లూ పడుతున్నారు. వాళ్లని అలా ఎంతకాలం ఉంచుతారు? మునిసిపాలిటీ చేయకుండా ఈ పానగల్లు చేయలేడా? గాంధీగారికీ అక్కర్లేదు. దొరతనానికీ అక్కర్లేదు. ఎప్పుడు దానికి ముగింపు?’’అంతా మౌనంగా ఉండిపోయారు. తలుచుకుంటేనే బాధగా ఉంది.

అప్పుడే ‘‘అయ్యా! తమకి ఉత్తరం!’’ అంటూ ఓ పోస్టు కార్డు అందించాడు పోస్ట్‌మ్యాన్‌ వినయంగా. అందుకుని, ఆత్రంగా చూసి, ఒక్క నిమిషంలో చదవేశాడు భాస్కరుడు. ‘‘ఎక్కడ నుంచి?’’ ఉండబట్టలేక అడిగాడు స్వామినాయుడు.‘‘రామరాజుగారే రాశారు!’’ కొంచెం గట్టిగానే అన్నారు భాస్కరుడు. ఆయన కళ్లలో ఒక వెలుగు.‘‘రామరాజుగారే!?’’ అంతా ఒక్కసారిగా అన్నారు.‘‘నాసికా త్య్రంబకం వెళ్లారట. తిరుగు ప్రయాణంలో ఉన్నారట.’’ చెప్పారు భాస్కరుడు.

5
 1921 అక్టోబర్‌ చివరి రోజులు....
చరిత్రను మార్చే ఆ తేదీలనూ, ఘడియలనూ ముందుకు తోసుకురావడం కోసం తనను తాను కరిగించుకున్నట్టు వేగంగా సాగింది కాలం. రామరాజు నాసిక్‌ నుంచి వచ్చిన పదిహేను రోజులకే జరిగిందా సంఘటన.నర్సీపట్నం నుంచి వచ్చిన ముప్పయ్‌ నలభయ్‌ మంది జాతీయ కాంగ్రెస్‌ కార్యకర్తలు కృష్ణదేవిపేటలో సభ ఏర్పాటు చేశారు. ఊళ్లో పోలీస్‌ స్టేషన్‌ నుంచి నలుగురు పోలీసులు వచ్చి  సభని భగ్నం చేశారు. ఆ చలిలో ఒక్కసారిగా వెల్లువెత్తింది ఉద్యమ వేడి. అప్పటి నుంచి కొండ గ్రామాల నిండా నిఘా. సంతల నిండా సీఐడీలు. ఆ సంవత్సరంలో నవంబర్, డిసెంబర్‌ నెలలే కాదు, 1922 వచ్చాక జనవరి నెల తొలి పక్షం కూడా ఏమీ ఎరగనట్టు, అప్రకటిత పోలీసు శాసనాన్ని చూసి భయపడినట్టు జారుకున్నాయి. ఆ తరువాతే కృష్ణదేవిపేటలో పుట్టింది ఓ వదంతి. ‘మన్యంలో కొండవాళ్లు మళ్లీ పితూరీ లేవదీస్తున్నారు.’ ఈ పితూరీ నాయకుడు మరెవరో కాదు, సాక్షాత్తు అల్లూరి శ్రీరామరాజేనట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement