ఓడిపోయిన మనిషి | A Story Written by Bal Gangadhar Tilak | Sakshi
Sakshi News home page

ఓడిపోయిన మనిషి

Published Sun, Sep 1 2019 10:35 AM | Last Updated on Sun, Sep 1 2019 10:35 AM

A Story Written by Bal Gangadhar Tilak - Sakshi

తెరచి ఉన్న కిటికీలోంచి వొంటి మీద జల్లుపడి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను. సన్న చినుకులతో వాన. గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది. సగం నలుపూ, సగం తెలుపూ గల తెలవారగట్ల సన్నని చినుకుల ధారలు గాలిలో కదలిపోతున్నాయి. చెదిరిపోతున్నాయి. ప్రహారీ గోడ దగ్గర మందార చెట్టు పువ్వులు ఎర్రగా వానలో తడుస్తున్నాయి.
చల్లని గాలికి వొళ్ళంతా ఏదో హాయిగా ఏంది.
చల్లదనం మనస్సులోకి వెళ్ళి బాధ్యతల్నీ, సమస్యల్నీ, భయాల్నీ దాచుకున్న వేడి సెరిబెల్లానికి కూడా చల్లపరుస్తోన్నట్టు అనిపించింది. 
కళ్ళు మూసుకున్నాడు.
ఎవరో మంచుకోండల మీద స్కేటింగ్‌ చేస్తోన్న దృశ్యం. విశాఖపట్నంలో డాల్ఫిన్స్‌ నోస్‌ దగ్గర తెల్లని ఓడ కదులుతూన్న దృశ్యం. మద్రాస్‌ కాలేజీ ఆవరణలో ఎవెన్యూలో నడుస్తూన్న దృశ్యం. ఈ మూడింటికి ఏదైనా సంబంధం ఉందా?
హాయిలో హాయి అనే పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకున్నట్లు ఏదో ఫీలింగ్‌. ఈ ఫీలింగ్‌ని పోనివ్వకూడదనుకుంటూనే వొళ్ళు ముడుచుకుంటూ, కళ్ళు మూసుకుంటూ చల్లని వానని మనసులో కురిపించుకుంటూ, చెయ్యి పక్కకి జాపాను.

మెత్తగా ముదురుగా లావుపాటి పాత రబ్బరులాగ చేతికి తగిలింది. అంతవరకూ పక్క మీద నా పక్కనే సుభద్ర పడుకుని ఉందన్న మాట మరిచిపోయాను. పండ్రెండేళ్ల క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలు, రహస్యాలు నాలో ప్రసరింపచేసిన ఈమె శరీరం, ఇన్నేళ్ళ పరిచయంలో, పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి ఈనాడు ఆకర్షణని కోల్పోయి ‘ఇల్లాలు’ అనే ఒక వ్యర్థ గౌరవప్రదమైపోయిన ఈమె శరీరం, నా చేతికి తగలగానే వానా, వేకువా, మందార చెట్టూ గబుక్కున మాయమైపోయాయి. వాటి స్థానే పెళ్ళికి ఎదుగుతున్న ఆడపిల్లో, ట్యాన్సిల్స్‌ ఆపరేషన్‌ చేయించవలసిన చిన్న కొడుకూ, బ్యాంకిలో తరిగిపోతున్న డబ్బూ, ఎప్పుడూ రిపెయిర్స్‌ కొచ్చే కారూ వచ్చి నిలుచున్నాయి. కాసేపు కూడా కల్పన సుఖాన్ని ఊహించుకోనివ్వని కఠిన వాస్తవికతలా కనబడింది భార్య. ఆమె వైపు తిరిగి చూశాను.

వొంటి మీద సగం సగం బట్టతో, రేగిన జుట్టుతో గృహిణీ ధర్మాన్ని రోజంతా నిర్వహించిన అలసట కనిపించే కనురెప్పలతో జాలిగా కనిపించింది.
ఏదో బాధ అనిపించింది.
ఎవరో నన్ను దగా చేస్తున్నారనిపించింది.
మాంచి ట్యూన్‌ వినిపించే రేడియా గొంతుని ఎవరో నొక్కేసి వికటంగా నవ్వినట్టనిపించింది. ప్రథమ యౌవన దినాలు లీలగా జ్ఞాపకం వచ్చాయి. సుతారపు అత్తరువాసనలాంటి జ్ఞాపకాలు–ఆరోజులు!
మళ్ళీ అటు తిరిగి పడుకున్నాను. చల్లనిగాలి మొహానికి తగులుతోంది. వెనక్కి వెళ్ళిపోతున్నాను.
ముదిరిన ఏళ్ళ పర్వతాల మీద నుంచి వెనక్కి వెనక్కి లోయల్లోకి, పచ్చిక బయళ్ళలోకి వెళ్ళబోతున్నాను. రొమాన్సూ, ఆదర్శాలు, అమాయకత్వం కలిసిన వేడి వేడి రక్తం. జేబునిండా డబ్బూ, సినిమాలు పైలా పచ్చీసుగా ఉండేది. భావకవిత్వం మీదా, సుభాస్‌బోస్‌ నాయకత్వం మీద మోజు. ఇంగ్లీషు వాళ్ళన్నా, ఉద్యోగస్తులన్నా చిరాకూ, ద్వేషమూ.
ఈ వయస్సులోనే చిన్న చిన్న రొమాన్సులు ప్రారంభం. రెండు కలువ రేకులలాంటి కళ్ళుగాని, చివరికి–జవ్వాడే నడుం మీద నాట్యం చేసే వాల్జడగాని కవిత్వంలోకి పంపివేసేది. సామ్రాజ్యవాదాన్ని, సంప్రదాయాన్ని ఎదిరించాలనే సాహసం. కాని మరి కొంచెం ఎదిగేటప్పటికి నాకు తెలియకుండానే ఎన్నో జాగ్రత్తలు వచ్చి కూర్చున్నట్లు తెలుసుకున్నాను.
లోపల–నా లోపల ఎవడో పెద్దమనిషీ బుద్ధిమంతుడూ అయిన వాడు పరివ్యాప్తమౌతున్నాడు, మెడ చుట్టూ కండువా వేసుకుని, కొంచెం వొంగి, కర్రనానుకుని జీవితాన్ని భద్రంగా ఇటూ అటూ చెదిరిపోకుండా తాళం వేసుకుంటున్నాడు.

బాలని ప్రేమించాను. అలాగని చెప్పాను కూడా.
అయినా చివరికి ఏమీ  ఎరగనట్టుగా తప్పుకున్నాను. పెళ్ళిపందిట్లో  ఆరాత్రి నేను తలనొప్పితో విడిది మేడగదిలోనే పడుకున్నాను. అందరూ పందిట్లో ఉన్నారు. పెట్రోమాక్సు లైటు ఆరిపోయింది. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. మెట్ల మీద చప్పుడు వినపడింది. ఎవరా అని చూశాను. బాల! 
నల్లని  కాటుకతో, బుగ్గ మీద చుక్కతో బాల నా దగ్గరకు వచ్చి తట్టి లేపింది. ఏమీ ఎరగనట్టుగా ‘‘ఎవరూ?’’ అన్నాను.
‘‘నేను బాలని’’ ఆమె గొంతులో బాధ, ఆవేశం.
‘‘రేపు ఉదయమే నాకు పెళ్లి అయిపోతోంది’’
నేను మాట్లాడలేకపోయాను.
‘‘ఏం నిద్రపోతున్నావా?’’ అంది.
‘‘లేదు’’
‘‘ప్రేమించానని, పెళ్లి చేసుకుంటావనీ అన్నావు. పల్లెటూరి పిల్లననీ, ప్రతిమాట నమ్ముతాననీ, ఏంచేసినా ఊరుకుంటానని అనుకున్నావా?’’
‘‘..... ...... ....’’
‘‘ఏం మాట్లాడవేం?’’
‘‘అది కాదు బాలా, ఇలా జరుగుతున్నందుకు నేనెంత బాధ పడుతున్నానో దేవుడికి తెలుసును’’
‘‘మరి–?’’
‘‘మా వాళ్లెవరికి ఇష్టం లేదు. మీ కుటుంబానికి మాకూ శత్రుత్వముందట. మీ చిన్నాన్న మా నాన్నని చంపడానికి కొచ్చాడట’’
‘‘ఇదివరకు నీకు తెలియదా?’’

‘‘తెలియదు’’
‘‘అది జరిగి  ఇరవై ఏళ్ళయింది. ఇప్పుడు దెబ్బలాటలు లేవుగా. ఒకిరిళ్ల కొకరు వస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు...’’
‘‘అయినా మావాళ్లెవరికీ ఇష్టం లేదు’’
‘‘మీ వాళ్ళంటే?’’
‘‘మా నాన్న, అమ్మా, మా అక్కయ్య, అన్నయ్య, మా మేనత్త...ఆఖరికి మా పాలేరు కూడా.’’
‘‘అయితే ఈ వశంగా ఎక్కడికేనా పారిపోదాం. నా వంటి మీద నాల్గువేల బంగారం ఉంది. నిన్ను వొదిలి ఉండలేను’’
‘‘ఛ..ఛ..ఇప్పుడెలాగ, నలుగురూ ఏమనుకుంటారు?’’
ఆమె ఏడుస్తూ కూర్చుంది.
బాల చాలా అందమైంది.
అదొక విలక్షణమైన ఉజ్వలమైన అందం.
అటువంటి అందం అన్నిచోట్లా కనిపించదు. నాకు బాధగా ఉంది. నిజమే కాని ఎంతమందిని ఎదిరించి, ఎన్ని అడ్డంకుల్ని దాటి, నా భవిష్యత్తుని ఏం చేసి ఈమెను నాదాన్ని చేసుకోగలను. కోపంతో మీరి ఎరుపెక్కిన జీరలు కల కళ్లుకల నాన్న మొహం, నిరసనతో చూసే అమ్మ మొహం, పద్దెనిమిది వేల కట్నంతో జడ్డిగారి సంబంధం, రాజకీయంగా నేను వేసుకున్న ప్లానులు... ఇవన్నీ ఏమౌతాయి?
‘‘కిందికి వెళ్లిపో బాలా. ఎవరైనా వొస్తారు’’ అన్నాను.
బాల కోపంగా లేచి నుంచుంది.

వెన్నెల రేకలో ఆమె పెదవి వణకడం కూడా కనబడింది. కోపమూ ఏడుపూ కలిసిన కంఠంతో ‘‘నూతిలో పడి చద్దామనుకున్నాను. కాని తప్పు నీది కాదు. నువ్వు మగాడివి కాదు. నీకన్న ఏ వెధవైనా వెయ్యిరెట్లు నయం’’ అని విసవిసా వెళ్లిపోయింది.
స్తంభించిపోయిన నా లోపల్లోపల ఈ సమస్య ఇలా పరిష్కారమైనందుకు సంతోషించానో, ఆమె దూరమైపోతున్నందుకు బాధ పడ్డానో నాకు తెలియదు.
నాలుగేళ్ళ అనంతరం ఆమె చాలా జబ్బుతో జనరల్‌ ఆస్పత్రిలో ఉందని తెలిసి మనసు పట్టలేక వెళ్ళాను. నర్సు వచ్చి ‘‘మిమ్మల్ని చూడడానికి వీల్లేదంది ఆమె. మిమ్మల్ని పంపించి వెయ్యమంది’’ అని చెప్పింది.
నర్సుతో బతిమిలాడాను.
ఆమె నావల్లనే, నా కోసమే ఇలా అయిపోయిందన్న బాధతో, పశ్చాత్తాపంతో కాలిపోతున్నాను. చివరికి ఆమె దగ్గరికి వెళ్లాను. వంద కేరట్ల రత్నాన్ని చెక్కి వేయగా చెక్కి వేయగా మిగిలిన అణువులా ఆమె కృశించిన శరీరమూ, మొహమూ మెరుస్తోంది. నన్ను చూసి ఆమె పక్కకు తిరిగి పడుకుంది.
‘‘బాలా’’
ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.

‘‘నన్ను క్షమించు. ఒకటి చెబుతున్నాను. ఏనాడూ నా హృదయం నుండి నువ్వు తొలగిపోలేదు. నేను పిరికివాణ్ణి. కాని ఆజన్మాంతం నిన్ను మరిచిపోను. మనసా నేను నీ వాడిని’’
ఆమె చెయ్యి చేతిలోకి తీసుకున్నాను.
నా మాటలు ఆమె నమ్మలేదు. అవిశ్వాసంతో, ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళతో నన్ను చూసింది. నాకు కన్నీరాగ లేదు.
‘‘వస్తాను బాలా’’ అని డగ్గుత్తికతో గబగబా ఆమెని విడిచి వచ్చేశాను.
ఒక నెల్లాళ్ళ తర్వాత  ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఈ జ్ఞాపకాలతో నా వొళ్ళంతా వేడెక్కిపోయింది. ఊపిరాడనట్టనిపించింది. గది గోడలు దగ్గరిగా వచ్చి నన్ను నొక్కుతున్నట్లు అనిపించింది. లేచి, గొడుగు తీసుకొని వీధిలోకి వచ్చేశాను. వాన ఇంకా కురుస్తూనే ఉంది.స్వేచ్ఛగా, విశాలంగా తిరిగి వస్తేనే కాని ప్రాణం కుదుటపడుతుందనిపించలేదు. కాలవ వారనే బయలుదేరి వెళ్ళుతున్నాను. 
కాలువ అవతల మా పొలాలు ఉన్నాయి. తెల్లవారిపోతుంది. వాన నీటికి రాత్రి వొంటి రంగు కరిగి తెల్లబడుతున్నట్టుగా ఉంది. రేగటి మట్టి కాలి జోళ్ళకి అంటుకుని బరువుగా అడుగులు వేస్తున్నాను. చల్లనిగాలి రివ్వుమని తగులుతుంటే  కొంత ఉత్సాహం కలిగింది.

ఆకాశం మబ్బులతో నిండి వుంది. కాలవ వారనున్న చెట్ల ఆకుల మీద నుంచి జల్లుమని జడి పడుతోంది. కాకులు అరుస్తూ అటూ ఇటూ పోతున్నాయి. కాలవ అవతలి వైపున అరటి తోటలూ, వరి చేలూ పొడుగ్గా పరుచుకొని అందంగా ఉన్నాయి.
కర్ర వంతెన వచ్చింది. వంతెన కింద కాలవ సుడి తిరుగుతుంటే కొంతసేపు చిత్రంగా చూశాను. వంతెన దాటి పొలం గట్టునే వెళుతుంటే ‘‘ఏవండోయ్‌’’ అన్న పిలుపు వినిపించింది. వీరన్న మామిడితోటలోంచి ఆ పిలుపు. తోటలో పైన గడ్డి కప్పిన ఇటికల ఇంటి ముందరుగు మీద  ఎవరో ఆడ మనిషి నిలుచుంది. 
నన్నేనా అనుకున్నాను. తోటలోకి రెండడుగులు వేశాను. అరుగు మీద చామన చాయగా, బొద్దుగా, పొడి పొడిగా ఉన్న జుట్టు బుగ్గల మీద పడుతుంటే నవ్వుతూ సుబ్బులు. మంచి పొంకంగా, ఆరోగ్యంగా ఉన్న యవ్వనం అసూయని కలిగించేటట్లు ఉంది. సుబ్బుల్ని నేను చిన్నతనం నుంచి ఎరుగుదును. అయిదో క్లాసు వరకూ నాతో కలిసి బళ్ళో చదువుకుంది. అయినా ఆమె నాకన్నా చిన్నదిగా, చాలా చిన్నదిగా ఉంది. పాతికేళ్ళంటే నమ్ముతారు సుబ్బులు వయస్సు.
‘‘ఎప్పుడొచ్చావు  సుబ్బులు...’’ అన్నాను నవ్వుతూ.
‘‘రావయ్యా లోనికి రా. వర్షంలో తడుస్తా ఎంతసేపుంటావు?’’
నేను తటపటాయించాను.

‘‘ఎవరూ సూడ్డం లేదులే. అబ్బో, మా పెద్దమనిషైపోయావు’’ కనుబొమ లెగరేసి చేతులూపుకుంటూ అంది. నేను లోనికి వెళ్ళాను.
సుబ్బులు ఇంట్లోంచి ఒక కుర్చీ తీసుకు వచ్చి వేసింది.
‘‘సిన్నప్పుడు నువ్వీ దారిని యెల్తా వుంటే చెరుకుపాకం ఇచ్చేదాన్ని. గ్యాపకం ఉందా. ఎప్పుడేనా ముద్దెట్టుకుంటావేమో అనుకునేదాన్ని. అయ్యో రాత ఆ సరదాయే లేదు...’’ ఫక్కున నవ్వుతోంది.
నాకు సిగ్గుగా బెదురుగా వుంది. ఆమె ముందు నేను ముడుచుకుపోతున్నాను.
‘‘అలా సిగ్గుపడుతూ కూర్చో. కొంచెం కాఫీ కాచి తీసుకువస్తాను’’ అంటూ లోపలికి వెళ్ళింది.
సుబ్బులు యాసనీ, నాగరికాన్ని కలిపి మాట్లాడుతుంది. అలాగే ప్రవర్తిస్తుంది. పట్టణాల్లో చాలాకాలం ఉంది.
సుబ్బులు మొహంలో విచారం తాలూకు నీడ కాని, వయస్సు తాలూకు నీరసం కాని లేదు.
 జీవింతలో ఎంతో సుఖాన్ని, స్వేచ్ఛని పొందినవాళ్ళు తప్ప అంత హాయిగా నవ్వలేరు. ఆమె నాకన్న మూడేళ్లు చిన్నదైనా పదిహేనేళ్ళు చిన్నదిలా కనబడుతోంది. వింతగా ఆలోచిస్తున్నాను ఆమెను గురించి.
ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ మంచి రుచిగా ఉంది. నా ఎదురుగా ముక్కాలిపీట మీద కూర్చుని జుట్టు విప్పుకుంది.  కళ్ళల్లో ఆరోగ్యపు వెలుతురు. ఆందోళనలు లేని వెలుతురు.
‘‘ఏడెనిమిదేళ్ళయింది నిన్ను చూసి సుబ్బులూ. రంగడు కులాసాయేనా’’ అన్నాను ఆమె భర్త నుద్దేశించి.

ఆమె మళ్ళీ విరగబడి నవ్వింది.
 ‘‘రంగడా!  ఇంకా ఆడెక్కడ? బలేవాడివయ్యా తెలియనట్టు మాటాడుతావ్‌’’ అంది.
‘‘ఏం, రంగడు పోయాడా’’ ఆత్రుతగా అన్నాను.
‘‘ఛఛ దుక్కలా ఉన్నాడు. నేనే వాడిని వొగ్గేశాను’’
‘‘ఏం?’’
‘‘నా కిష్టం లేకపోయింది. భయమా?’’
‘‘ఇన్నాళ్లూ మరి ఏంచేస్తున్నావు’’
‘‘వీరస్వామితో గుంటూరు వెళ్ళిపోయాను. అతను పెద్ద మేస్త్రీ. మాంచి డబ్బున్నవాడు కూడా’’
‘‘అతన్ని పెళ్ళి చేసుకున్నావా?’’
‘‘ఆ...గుంటూరులో మా బలేగా వుందిలే. నగలూ, బట్టలూ, సినీమాలు–ఓ దర్జాగా ఉండేది. వీరస్వామి కూడా బాగుండే వాడు కాని...’’
‘‘అతనితో కూడా చెడిందా’’
‘‘అతను దేన్నో మరిగాడు. నాకు శానా కోపం వచ్చింది. నీకింటి దగ్గర దెబ్బలు తిని శాకిరీ సెయ్యడానికి నేనేం యెదవని కాదని చెప్పి నా నగలూ డబ్బూ తెచ్చుకుని వేరే వెళ్లిపోయాను’’
‘‘ఇప్పుడు కలుసుకున్నారా, మళ్ళీ–’’
‘‘ఆడినీ ఒగ్గేశాను’’
నేను తెల్లబోయి చూస్తున్నాను.
‘‘అదేంటలా చూస్తావు! ఇష్టం లేని వాడితో కాపురం చేసి ఏడుస్తా చావనా? నా దగ్గర అటువంటిది లేదయ్యోయ్‌. బతికిననన్నోళ్లు కులాసాగా బతుకు. నా కన్నాయం ఒహరు చేస్తే ఊరుకునేది లేదు’’
‘‘మరి ఇప్పుడొకర్తివే ఉన్నావా?’’

‘‘నువ్వున్నావు కదయ్యా. నీ కోసమే వచ్చినాను. అబ్బ, నువ్వంటే నేటికి మనసే నాకు. పాడు మనసు...’’ గమ్మత్తుగా చూస్తూ పమిట కొంగు నోటికి అడ్డం పెట్టుకు నవ్వుతోంది.
‘‘బాగుంది నీ హాస్యం’’ అన్నాను నేను సిగ్గుపడుతూ.
‘‘బెజవాడ రైల్వేలో పనిచేస్తున్నాడు రాఘవులు. అతనితో వుంటున్నా’’ అంది మళ్ళీ.
‘‘మనువా?’’
‘‘మనువూ లేదు శ్రాద్దం లేదు. నాకంటే సిన్నోడు. అయినా మా అందగాడు. స్టోర్సులో పనిచేస్తున్నాడు. నేనంటే వల్లమాలిన ప్రేమ రాఘవులికి. నొక్కుల జుట్టుతో, చిన్న పెదాలతో బలే అందంగా వుంటాడు’’ అంది ఆప్యాయత కళ్ళలో కనపడేటట్టు.
నేను లేచాను. కోర్టు పని ఉంది. ఇవాళ ఎన్నో కాగితాలు చూసుకోవాలి.
‘‘ఇంకా ఉంటావా సుబ్బులూ’’
‘‘మా బాబుని చూసి పోదామని వచ్చాను. రేపో ఎల్లుండో వెళ్ళిపోతాను’’
‘‘ ఓసారి మా ఇంటికిరా. మా ఆవిడకు కనిపించు’’ అంటూ అరుగు దిగాను.

‘‘నేనెందుకొచ్చి చూస్తానూ నా సయితీ! సర్లే. అందమైన వాడినని నీకు గర్వం లేవయ్యా’’ నవ్వుతూ చేతులూపుతూ అంది.
వానలో తిరిగి ఇంటికి బయలుదేరాను. ఆమెలో ఆనందానికి, ఆరోగ్యానికి నవనవోన్మేషతకీ కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను.
జీవితాన్ని తేలిగ్గా సహజంగా తీసుకోవడమా? కృత్రిమమైన నీతులూ భయాలు పెద్దరికాలు అడ్డురాక పోవడమా? ఇంత చదువూ డబ్బూ వుండి నాలో ఈ అసంతృప్తి దిగులు ఏమిటి? ఏదో చేయలేక పోయానన్న వేదన. కలలు కాగితపు పేలికల్లా రాలిపోయిన క్షోభ.
చెంపల దగ్గర నెరిసిన జుట్టు క్రమంగా అంతటా తెల్లబడి ముసలివాణ్ని, మృత్యుపదాభిముఖుణ్ణి అయిపోతున్నానన్న బెదురూ...ఏమిటి ఇదంతా?
ఎక్కడ నేను జీవితరహస్యాన్ని మరిచిపోయాను?
ఏ సమయంలో జీవించడంలోని కీలకం జారిపోయింది? ఈమె–చదువూ, సంస్కారమూ లేని సుబ్బులు ముందు నేను చాతకానివాడిలా ఎందుకయిపోయాను?
బరువుగా బాధగా అడుగులు వేసుకుంటూ కర్ర వంతెన దాటాను. కాలవ వారనే జనం బాగా తిరుగుతున్నారు. వర్షానికి కాకులు తడుస్తూ చెట్ల కొమ్మల మీద వణుకుతూ కూర్చున్నాయి. మనసులో ఆలోచన హెచ్చిన కొలదీ అడుగులు వేగంగా వేస్తున్నాను. జీవితపు పందెంలో  ఓడిపోయిన వాడిని.
- బాలగంగాధర తిలక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement