కథ: చూడలేని కళ్లు  | Dr Paidipala Choodaleni Kallu Telugu Short Story In Funday Magazine | Sakshi
Sakshi News home page

కథ: చూడలేని కళ్లు 

Published Sun, Oct 24 2021 12:55 PM | Last Updated on Sun, Oct 24 2021 12:59 PM

Dr Paidipala Choodaleni Kallu Telugu Short Story In Funday Magazine - Sakshi

సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ వెళ్లే ‘గౌతమి’ ఎక్స్‌ప్రెస్‌ కదలడానికి సిద్ధంగా ఉంది. 
ఆమె ఆయాసపడుతూ హడావిడిగా మా‘బే’ లోపల కొచ్చింది. కూడా వచ్చిన సిబ్బంది బెర్త్‌ నెంబర్ల కేసి ఎగాదిగా చూసి ‘అమ్మ గారూ, మీ బెర్త్‌ యిదే’ అంటూ నా పై నున్న మిడిల్‌ బెర్త్‌ కేసి చూపించారు. సూట్‌ కేస్‌ లోయర్‌ బెర్త్‌ కింద సర్ది బ్రీఫ్‌కేస్‌ ఆవిడ చేతికందించి వెళ్లొస్తాం అమ్మగారూ, జాగ్రత్తండి’ అంటూ వినయంగా నమస్కరించి రైలు కదులుతుండగా బయటకు పరుగెత్తారు. 


ఖాళీగా ఉన్న నా యెదుటి సీట్లో కూర్చున్న ఆమె ముందుగా హేండ్‌ బ్యాగ్‌నూ, ఆ తరువాత బ్రీప్‌కేస్‌నూ తెరిచి దేని కోసమో వెతుకుతూ గాబరాపడ్డం నేను గమనించాను. ‘మేడమ్‌ మీరేమైనా మర్చిపోయారా?’ అంటూ మర్యాద కొద్దీ పలకరించాను. 
‘ఫర్వాలేదు లెండి బయల్దేరే తొందరలో షుగర్‌ టాబ్లెట్స్‌ మర్చిపోయాను’ అందామె కంగారు నణుచుకొంటూ. 
‘ఇవి చూడండి. మీకు పనికొస్తాయేమో’ అంటూ నా దగ్గరున్న స్ట్రిప్‌ తీసి యిచ్చాను. 
‘థాంక్స్, రక్షించారు. నేను వాడుతున్న టాబ్లెట్స్‌ యివే’ అంటూ నేను ఫర్వాలేదు వుంచమంటున్నా వినకుండా ఒక్క టాబ్లెట్‌ మాత్రం తీసుకొని మిగిలినవి యిచ్చేశారు. 
‘మీరెంతవరకు?’ మార్యదపూర్వకంగా అడిగారు. 

‘రాజమండ్రిలో దిగి అమలాపురం వెళ్లాలి’
‘అమలాపురమా? మీరు లెక్చర ర్‌ వనమాలి గారు కానీనా?’
‘అవునండీ. మీకెలా తెలుసు?’ అన్నాను కించిత్‌ ఆశ్చర్యపడుతూ. 
‘నమస్కారమండీ. మిమ్మల్నెక్కడో చూసినట్టుందని యిందాకటి నుంచీ అనుకుంటున్నాను. నేను ‘లు’ గారి మిసెస్‌.. గీతని’
నేను తుళ్లిపడ్డాను. అంతటి ఉన్నత స్థితిలో వున్నావిడ రైల్లో ప్రయాణించడం నమ్మశక్యం కాలేదు. 
‘అలాగాండీ, మిమ్మల్నిలా కలవడం చాలా సంతోషం’ 
నా మాటలు పూర్తి కాకుండానే టికెట్స్‌ ‘చెక్‌’ చెయ్యడానికి టి.టి.ఇ. వచ్చాడు. ఆమె మొహమాటపడుతూ తను కూర్చున్న లోయర్‌ బెర్త్‌ ఖాళీయేనా అని అడిగింది. ‘సారీ, అది వరంగల్‌ కోటాది’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు. 

‘నా లోయర్‌ బెర్త్‌ మీరు తీసుకోండి’
‘థాంక్స్‌. మీ కిబ్బంది లేకపోతే అలాగే’
‘అదేం లేదు. ఇట్స్‌ ఎ ప్లెజర్‌ ఫర్‌ మి’
‘రక్షించారు. చూస్తున్నారుగా నాది స్థూలకాయం. అందుకని మీకు కొంచెం అసౌకర్యమయినా మీ ఆఫర్‌ని కాదనలేకపోతున్నాను’ 
ఆమె నిష్కాపట్యం, నిరాడంబరత నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమెతో మాట్లాడ్డానికి నేను సంశయిస్తున్నా ఆమె కలుపుగోలుగా నన్ను మాటల్లోకి దించింది. సహజంగా మా సంబాషణ ‘లు’ గారి చుట్టూనే నడిచింది. ‘లు’ గార్కి నా పట్ల ఉండే అభిమానం గురించి చెపుతూ మధ్యలో చిట్టిబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల చిట్టిబాబు తరచుగా వాళ్లింటికి వస్తున్నాడనీ, కులం ముడితో ‘లు’ గారి దగ్గర చనువు పెంచుకున్నాడనీ చెపుతూ నేను అదిరిపడే ఓ ప్రశ్న వేసింది. 

‘ఈ మధ్య మీరూ చిట్టిబాబు ఏమైనా గొడవ పడ్డారా?’అని! 
‘అలాంటిదేమీ లేదే. చిట్టిబాబు నాకంత సన్నిహితుడు కూడా కాదు. అసలు మీకా అనుమానమెందు కొచ్చింది?’ అన్నాను విస్తుపోతూ. నిజానికి ఆమె ప్రశ్న నేను తికమకపడుతున్న ఓ ‘పజిల్ని’ కదిపింది. 
‘అవునా? మరి మీకంత క్లోజ్‌ కానప్పుడు ‘లు’ గారి దగ్గర తరచుగా మీ గురించి యెందుకు మాట్లాడుతుంటాడు?’అందామె ఆసక్తిగా. 
‘ఈ విషయం కూడా నాకు తెలియదు. మీరు చెపుతుంటే మొదటిసారి వింటున్నాను..’ ఆమె చెప్పిన సమాచారం నాకు ఆందోళనను కలిగించిన మాట నిజం. నేను ‘లు’ మధ్యలో చిట్టిబాబు – మాదొక కాకతాళీయమైన సమీకరణం. దానికింత పొడిగింపు.. నా జ్ఞాపకాలు చిట్టిబాబు పరిచయాన్ని తవ్వడం ప్రారంభించాయి...
∙∙ 
రెండు మూడేళ్ల క్రితం వరకు నాకు చిట్టిబాబు యెవరో తెలియదు. అతను నాకు మార్నింగ్‌ వాక్‌లో తారసపడిన వ్యక్తుల్లో ఒకడు. జ్యూయలరీ షాపు యజమానిగా తనంత తాను పరిచయం చేసుకొన్నాడు. ఆ తర్వాత రోడ్‌ మీద కలిసినప్పుడల్లా పత్రికల్లో వచ్చిన నా రచనల గురించో నా వార్తల గురించో చెప్పి నన్ను అతిశయోక్తులతో మెచ్చుకొనేవాడు. అలాంటి స్వల్ప పరిచయంతో ఓ రోజు పొద్దుటే నన్ను వెదుక్కొంటూ వచ్చి మా యింటి తలుపు తట్టాడు. మడత నలగని తెల్లని బట్టలు, వాటికి మాచ్‌ అయ్యే తెల్లటి చెప్పులూ, మెడలో నులకతాడు లాంటి బంగారు గొలుసు, చేతి వేళ్ల నిండా వుంగరాలు... రోడ్‌ మీద చూసినప్పటి కంటే భిన్నమైన ‘గెటప్‌’లో వున్న ఆ మనిషిని వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా మొహమాటపడుతూ లోపలకు పిల్చి కూర్చోమన్నాను. 
‘లు’ గారు మీ ఇంటి కొచ్చినట్లు నిన్నటి పేపర్లలో ఫొటోలతో సహా వేశారు. తమరు చూశారా?’ అంటూ ఓ పేపర్‌ కటింగ్‌ నా కందించాడు చిట్టిబాబు. అప్పటికి గుర్తుపట్టాను – అతనెవరో!. 

వనమాలి యింట ‘డి.వి.లు’,‘హల్‌ చల్‌’ అంటూ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన ఆ వార్త నేను చూసిందే! 
‘డి.వి.లు’ పత్రికల్లో తరుచుగా పేరు కనిపించే ‘సెలబ్రిటీ’. ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ ‘కైట్స్‌’ చైర్మన్‌. ఆయనను ఇటీవలే ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది కూడా. మొన్న కోనసీమలోని దేవాలయాల్ని దర్శించుకొని వెళ్తూ వెళ్తూ చెప్పాపెట్టకుండా మా యింటి కొచ్చారు. ఆయన వెంటబడిన పత్రికా విలేకరులు దానికి ప్రాముఖ్యమిచ్చి ఆర్భాటంగా రాశారు. ఆ న్యూస్‌ చూసి అయిదారుగురు పరిచయస్థులు తమ సంబంధీకులకు ‘కైట్స్‌’లో వుద్యోగాలిప్పించమని నన్ను సతాయించారు. డబ్బు ఆశ కూడా చూపించారు. ‘లు’ గారు మా యింటికి రావడం కాకతాళీయం తప్ప ఆయన దగ్గర నాకంత పలుకుబడి లేదని చెప్పి తప్పించుకొనే సరికి నా తలప్రాణం తోక కొచ్చింది. మా యింటికెప్పుడూ రాని చిట్టిబాబు కూడా అలాంటి బాపతేనని అనుమానించి అతను అడక్కుండానే పని చెప్పే సరికి సిగ్గుపడ్డం నావంతయింది. మా వూళ్లో భారీ స్థాయిలో చిట్టిబాబు ప్రారంభిస్తున్న మెగా జ్యూయలరీ షాపును ఓపెన్‌ చేయ్యడానికి ‘లు’ గార్ని ఒప్పించమని అతని కోరికట!

అతని కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా యిలాంటి ప్రారంభోత్సవాలకు సినీ రాజకీయ రంగాలకు చెందిన గ్లామరున్న వాళ్లను పిలుస్తుంటారు. అలాంటిది యెంత కార్పొరేట్‌ దిగ్గజమైనా ‘డి.వి.లు’ను కోరుకోవడంలోని ఆంతర్యం నాకర్థం కాలేదు. పిల్చేవాడి మాటెలా వున్నా ‘లు’కి ఈ పని మీద వచ్చే కోరిక, తీరిక వుంటాయా? అదే మాట చిట్టిబాబుకు చెప్పాను. 
‘క్షమించాలి గురువుగారూ. మీరాయనను వుద్యోగాలూ వుపకారాలు అడగడం లేదు. ఆయన రాక వల్ల మన ప్రాంతంలో మీ విలువ, నా విలువ పెరుగుతాయి. ఆయన పేరు మారు మోగిపోతుంది. దయచేసి మీరు కాదనకండి.’
చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న చిట్టిబాబును కాదనలేక, ఆ కాదనే మాటేదో ‘లు’ గారే అంటారని ఆయనకు ఫోన్‌ చేశాను. అదృష్టవశాత్తు ఫోన్‌ చెయ్యగానే దొరికాడు. నే నన్నట్టుగానే తనలాంటి వాణ్ణి యెందుకు పిలుస్తున్నారంటూనే ముక్తాయింపుగా ‘మీ మాట కాదనలేకపోతున్నాను. ఆయనను రమ్మనండి చుద్దాం’ అని చిన్న ఆశను కల్పించాడు. అది కంటితుడుపు అని నేననుకున్నా చిట్టిబాబు మాత్రం గంపెడాశతో సంబరపడిపోతూ నాకు మళ్లీ థాంక్స్‌ చెప్పి హైదరరాబాద్‌  వెళ్లాడు. 

వారం తిరక్కుండా ‘లు’ గారు ప్రారంభోత్సవానికి అంగీకరించారనే శుభవార్తతో పాటు ఓ పళ్లబుట్టను కూడా మా యింటికి మోసుకొచ్చాడు. ఫంక్షన్‌కి నాతో పాటు నా శ్రీమతి కూడా రావాలని యిద్దర్నీ ఆహ్వానించి, వస్తామని వాగ్దానం చేయించుకొని మరీ వెళ్లాడు... 
‘ఇతనేదో అమాయకుడనుకున్నాం గాని కార్యసాధకుడే. కానీ వాలకం చూస్తే నమ్మదగిన మనిషిలా లేదు. ఎక్కడి మద్దెల అక్కడ వేసి పబ్బం గడుపుకొనే బాపతులా వున్నాడు. ఇలాంటి వాణ్ని ‘లు’ గారంతటి పెద్దాయన దగ్గరకు చేరనిస్తే రేపు మీకు ‘మేక’వుతాడేమో చూడండి’ అని హెచ్చరించింది చిట్టిబాబును అంచనా వేస్తూ నా శ్రీమతి. 
‘నీ కన్నీ అనుమానాలే. అవసరం కొద్దీ చిట్టిబాబు మన దగ్గర కొచ్చాడు గాని ఆ తర్వాత అతనెవరో మన మెవరమో! ఇక ‘లు’ గారిది, నాది కృష్ణ కుచేలుర లాంటి అనుబంధం. ఆయనకు యెంత అభిమానం లేకపోతే మొన్న మనింటి కొచ్చాడు?’
‘అవును– ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు కదా..మరి పేరు అలావుందే?’
‘ఓహ్‌! అదా నీ సందేహం? అతనిదీ నాదీ ఒకే వూరని యిది వరకెప్పుడో చెప్పాను కదా.

అతని అసలు పేరు వెంకటేశ్వర్లు. ఇంటి పేరు దున్నపోతు. కార్పొరేట్‌ రంగంలో తెలుగు తెలిసిన వాళ్లు హేళన చెయ్యకుండా, తెలుగు రానివాళ్లు తన పేరును ఖూనీ చెయ్యకుండా తన పేరును తెలివిగా ‘డి.వి.లు’గా మార్చుకొన్నాడు. ఈ రహస్యం ఆయన యెవరికీ చెప్పరు. ఎవరికో కాని తెలియదు. ఇతను ఎలిమెంటరీ స్కూల్‌లో మా నాన్న గారి దగ్గర చదువుకొన్నాడట. పేద కుటుంబంలో పుట్టి యెన్నో కష్టాలనుభవించి పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికెదిగాడట. నువ్వు పొరపాటున కూడా ‘లు’ గారి వ్యక్తిగత విషయాల గురించి యెక్కడా నోరుజారకు సుమా..’
‘నాకలాంటి సందర్భమే రాదు. సరేనా?’ అంటూ తను హామీ యిచ్చింది. 

మేమూహించిన దాని కంటే గొప్పగా చిట్టిబాబు ‘మెగా జ్యూయలరీ షోరూమ్‌’ ప్రారంభోత్సవం జరిగింది. ఊరంతా ప్లెక్స్‌లు ఏర్పాటు చేసి వూరేగింపుగా పూర్ణ కుంభ స్వాగతంతో ‘లు’ను షోరూమ్‌ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆయన కూడా చాలా ఉల్లాసంగా కనిపించారు. రిబ్బన్‌ కత్తిరించిన తర్వాత ‘లు’ ప్రసంగిస్తూ మా మైత్రీబంధాన్ని ప్రస్తావించి అదే తననీ కార్యక్రమానికి రప్పించిందని చెప్పడంతో అభిమానుల చప్పట్లు మారు మ్రోగాయి. చిట్టిబాబు కృతజ్ఞతాపూర్వకంగా ‘లు’గారి నక్షత్రానికి అనువైన రాయితో చేయించిన వుంగరాన్ని ఆయనకు బహుకరించడమే కాకుండా వద్దంటున్నా వినకుండా నా శ్రీమతికి ఓ వెండి పూలసజ్జను వాళ్లావిడ చేత యిప్పించాడు. అలా చిట్టిబాబుతో యేర్పడ్డ అనుబంధం క్రమక్రమంగా పెరిగి మా యింటి పనులేమైనా వుంటే అతను పూరమాయించి చేయించి పెట్టే వరకు వచ్చింది. 

ప్రథమ వార్షికోత్సవం నాటికి చిట్టిబాబు వ్యాపారం మూడు వడ్డాణాలు, ఆరు అరవంకెలుగా సాగుతోందని తెలిసి ఆనందించాను. అయితే బిజినెస్‌ ఒత్తిడి వల్లనేమో యిది వరకటిలా అతను కనిపించడం లేదు. మా ఆవిడ ఫోన్‌ చేస్తే చాలు ‘మేడమ్‌ గారూ’ అంటూ వచ్చి వాలిపోయే అతని మనుషులు ఆవిణ్ని యిప్పుడంతగా పట్టించుకోవడంలేదు. ఆమె చిట్టిబాబు అవకాశవాదాన్ని తిట్టిపోస్తోంది. 
నాకు చిట్టిబాబు గురించిన దిగులు లేదు కాని యిటీవల ‘లు’ మౌనం నన్ను కలవరపెడుతోంది. ఎంత బిజీగా వున్నా నెలకు ఒకటి రెండు సార్లుయినా ఫోన్‌ చేసి మా యోగక్షేమాలు కనుక్కొనే మనిషి నేను ఫోన్‌ చేసినా పలకడం లేదు. అతను ఏ విదేశీ పర్యటనలోనో వుండి నా కాల్స్‌ చూడలేదని మొదట్లో సరిపెట్టుకున్నా దేశంలో అతనికి సంబంధించిన వార్తలు నన్ను వెక్కిరిస్తున్నాయి. 

‘లు’ ఆలోచనలతో ‘వర్రీ’ అవుతున్న నన్ను మా శ్రీమతి పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది. 
‘మన శశకి ‘కైట్స్‌’లో ఇంటర్వ్యూ వున్నట్లు మీతో చెప్పాడా? ఈ రాత్రికి బయల్దేరుతున్నాడు’
‘వెళ్లమను. డబ్బు కావలిస్తే నా పర్సులో ఉంది తీసుకోమను’
‘డబ్బు గురించి కాదు. కైట్స్‌ చైర్మన్‌ ‘లు’ గారు మీ ఫ్రెండ్‌ కదా. ఆయనకు ఫోన్‌ చేసి అబ్బాయి ఇంటర్వ్యూ కొస్తున్నట్లు మీరో మాట చెప్పొచ్చు కదా!’ అంది నా శ్రీమతి నా నిర్లిప్తతకు విస్తుపోతూ. 

‘ఆయన యిది వరకటిలా లేడు. నేను ఫోను చేసినా ఉలుకుపలుకూ లేదు. ఎంత యెత్తులో వుంటే మాత్రం అంత పట్టించుకోని వాణ్ని నన్ను ప్రాధేయపడమంటావా?’ 
‘బావుంది.  సొంత కొడుకు కోసం ఓ మెట్టు దిగితే అవమానమా?’
‘అవమానమని కాదు, అంత అవసరం లేదు. మన వాడికి మెరిట్‌ వుంది. ఇక్కడ కాకపోతే యెక్కడైనా వాడికి ఉద్యోగ యొస్తుంది’ 
‘ఎక్కడైనా వేరు. ఇది పేరున్న సంస్థ కదా. కనీసం ‘లు’ గార్కి ఓ లెటరైనా రాసివ్వండి’ 
అర్ధాంగి అభ్యర్థనను తోసి పుచ్చి యింట్లో అశాంతిని కోరి తెచ్చుకోవడం యిష్టం లేక మధ్యే మార్గంగా శశిని పిల్చి నా విజిటింగ్‌ కార్ట్‌ యిచ్చి ఇంటర్వ్యూకి ముందు ‘లు’ గార్ని కలవమన్నాను. 

శశికి తప్పకుండా ‘కైట్స్‌’లో ఉద్యోగ మొస్తుందనే నమ్మకంతో వున్న నేను వాడు తిరిగొచ్చి చెప్పిన సమాధానం విని దిగ్భ్రంతుణ్ణయాను. శశిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకుంటాడనుకున్న వేంకటేశ్వర్లు ‘అలాగా, చూస్తాను’ అంటూ నేనెవరో తెలియనివాడిలా ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడట! ఆ తర్వాత ఇంటర్వ్యూలో శశి పెర్‌ ఫార్మెన్స్‌ చూసి కమిటీ మెచ్చుకున్నా చివరకు నిరాశే మిగిలిందంట!. 
వారం తరువాత శశిని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ ‘హెచ్‌. ఆర్‌’ ఆశ్చర్యంగా మా యింటికొచ్చాడు. అతను మా వాడికి వాళ్ల అమ్మాయి నిచ్చే ప్రపోజల్‌తో నేరుగా మాతో మాట్లాడ్డానికి వచ్చాడట. వాళ్లమ్మాయి బయోడేటా, ఫొటో మాకు న చ్చాయి. అవి అబ్బాయి చూసిన తర్వాత, ఆమెరికాలో వున్న మా అమ్మాయి కూడా ఓ.కె. చేస్తే ఏ విషయమూ ఆయనకు తెలియజేస్తామని చెప్పాం. వెళ్తూ వెళ్తూ ఆ హెచ్‌. ఆర్‌ శ్రీపతి చెప్పిన విషయం విని నేను ‘షాక్‌’కు గురయ్యాను. 

‘మీ సంబంధం కోసం మేమంతకాలమైనా వెయిట్‌ చేస్తాం. ‘కైట్స్‌’లో మీ వాణ్ని ఇంటర్వ్యూ చేసిన కమిటీకి చైర్మన్‌ను నేనే. మీ అబ్బాయి రియల్‌ టైమ్‌ నాలెడ్జ్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.. సింప్లీ సూపర్బ్‌. అలాంటివాడు కంపెనికీ ‘ఎసెట్‌’ అవుతాడని మా కమిటీ అతన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి లిస్ట్‌లో ‘టాప్‌’న పెట్టాం. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ఆశ్చర్యకరంగా మా చైర్మన్‌ ‘లు’ గారు మీ వాణ్ని పక్కన పెట్టారు. ఆయన చెప్పిన కారణం మాకంత సమంజసంగా అనిపించలేదు. ఏదైనా వ్యక్తిగతమైన ‘ప్రెజుడీస్‌’ కావచ్చు అనుకున్నాం. పోన్లెండి. అతణ్ని యెవరైనా కళ్లకద్దుకొని యింతకంటే మంచి జాబ్‌ యిస్తారు..’’
నా మొహం వివర్ణం కావడం గమనించి శ్రీపతి సెలవు తీసుకొని కారెక్కాడు. శశి సెలక్ట్‌ కాకపోవడానికి కారణం ‘లు’ గారే అనే చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను...! 
∙∙ 
శశి విషయంలో ‘లు’ ఉపకారం చెయ్యకపోతే పోయింది, అపకారం చేశారని తెలిసిన తర్వాత ఆయనకు నా పట్ల ద్వేషానికి కారణం తెలియక మథన పడుతున్న నాకు గీత ప్రశ్న ద్వారా ఒక క్లూ దొరికింది. – అది చిట్టిబాబు రాజేసిన నిప్పు అని! అయితే నా వల్ల యెంతో కొంత వుపకారం పొందిన చిట్టిబాబుకు నా మీద పగ యెందుకుంటుంది? ఇది మరో పజిల్‌! 

‘చిట్టిబాబు మీ వారి దగ్గర తెచ్చే ప్రస్తావనలో నా గురించి ‘నెగెటివ్‌’గా మాట్లాడేవాడా?’
‘సారీ, నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను’ అంటూ గీత నొచ్చుకుంది. 
‘కాదు. నిజం చెప్పి నా మనసు తేలికపడేలా చేశారు. ఇన్నాళ్లూ ‘లు’ గార్కి నా మీద కలిగిన అపార్థానికి కారణాలు తెలియక మానసికంగా చిత్రహింసను అనుభవిస్తున్నాను. మేడమ్, చిట్టిబాబు నా మీద చెప్పడానికి నేరాలేమున్నాయి?’
‘మా వారికో బలహీనత ఉంది. ఆయన యెంత కింది స్థాయి నుంచి వచ్చిందీ యెవరికీ తెలియకూడదని. అలాగే ఆయన పేరు గురించి కూడా. ఆయన పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలిసిన మీరే ఆ గుట్టు బహిరంగం చేస్తున్నారని చిట్టిబాబు మా వారికి నూరిపోశాడు’ అందామె యెవరైనా వింటున్నారేమోనని అటూయిటూ చూస్తూ. 
‘అందువల్ల చిట్టిబాబు కొచ్చే ప్రయోజనం? అతనికీ నాకూ యెలాంటి శత్రుత్వమూ లేదే!’

‘మాష్టారూ, మీరు రచయిత కూడా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కాని అపకారం చెయ్యడానికి శత్రుత్వమే అవసరం లేదు – ఈర్ష్య చాలు! ఈర్ష్య, మనిషి కవల పిల్లలు. పక్కవాళ్ల యెదుగుదలను చూడలేకపోవడమనేది అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, ఇరుగుపొరుగు మధ్య, సహోద్యోగుల మధ్య... ఇలా అన్ని చోట్లా వుంటుంది. అలాగే చిట్టిబాబుకి మా వారితో మీ స్నేహం చూసి కన్ను కుట్టింది. ఆ ‘శాడిజం’తో మీ మీద చాడీలు చెప్పాడు. దేవుడు అందాన్ని చూడమని మనిషికి కళ్లిస్తే మనిషి ఆ కళ్లను చూడలేక పోవడానికి వినయోగించడం దౌర్భగ్యం!!’
గీత వాక్ప్రవాహం గీతోపదేశంలా సాగుతోంది. ఇంతలో స్టేషన్‌ వచ్చినట్టుంది.. బండి ఆగింది. ప్రయాణీకులు కోలాహలంగా మా ‘బే’లో చొరబడ్డంతో మా సంభాషణ అక్కడితో ఆగిపోయింది! 

- డా. పైడిపాల

చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement