అనువాదం కథ: వేపచెట్టు  | Ranganatha Ramachandra Vepachettu Short Story In Funday | Sakshi
Sakshi News home page

అనువాదం కథ: వేపచెట్టు 

Published Sun, Oct 3 2021 11:49 AM | Last Updated on Sun, Oct 3 2021 12:22 PM

Ranganatha Ramachandra Vepachettu Short Story In Funday - Sakshi

‘ఆ ఇల్లు నేను ఎవరికీ ఇవ్వను!’
‘నాయనా! ఆ ఇంటికోసం నువ్వెందుకు ఇంత పట్టుపట్టి కూర్చున్నావో నాకు అర్థం కావటం లేదు? నువ్వు పట్టణంలో ఉంటున్నావు. ఆ ఇల్లు నీకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు. నువ్వు ఆ ఇంట్లో ఉండటానికి వెళ్ళటం లేదు. వెళ్ళినా నీ చిన్నాన్న నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు. ఒకకవేళ నీ తల్లితండ్రులు బతికివుంటే ఆ మాట వేరు. మట్టితో కట్టిన ఆ ఇల్లు కొద్దిరోజుల్లోనే శిథిలమైపోతుంది. అలా కాకుండా కనీసం మీ చిన్నాన్నకైనా ఇస్తే మంచిది కదా! కొంత సొమ్ము అయినా దొరుకుతుంది. దాంతోపాటు ఈ కలహాలు, క్లేశాలు సమసిపోతాయి’ మా మామయ్య నాకు నచ్చజెపుతూ అన్నాడు.

‘ మామయ్యా! నేను నా తండ్రి ఇంటిని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి?’ కోపంగా అన్నాను. 
‘సరేనయ్యా, నీ ఇష్టం. చెప్పటం నా బాధ్యత. అయినా నీకు ఎన్నో సమస్యలున్నాయి. పాపం, నీ భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుంది. ఈ మధ్య నీ ఆరోగ్యమూ బాగుండటం లేదు. ఈ జంజాటంలో నువ్వు పడకపోవటమే మంచిది’ నా భుజాలపై చేతులు వేస్తూ అన్నాడు మామయ్య.

నేను మాట్లాడకుండా బయలుదేరాను. ఓ ఇంటికోసం నేను ఎందుకింత పట్టుపడుతున్నాను? ఆ ఇంటిలో ఏ ప్రపంచం ఉందని తాను మొండిపట్టు పడుతున్నాడు?’ ఈ ప్రశ్నలన్నింటికీ జవాబుగా నా కళ్ళముందు దట్టంగా పెరిగిన వేపచెట్టు కదిలింది.

చాలా సంవత్సరాల తరువాత గ్రామానికి పోతున్నాను. నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను. అటు తరువాత ఎందుకో అక్కడికి వెళ్ళటానికి మనస్కరించలేదు. నా భార్య చాలాసార్లు, ‘పదండి , షికారుగా వెళ్ళొద్దాం’ అనేది. అయితే ఏదో నెపం చూపి తోసిపుచ్చేవాణ్ణి. నిజానికి నా మనస్సు అక్కడే ఉండేది, కానీ అడుగు ముందుకు పడేదికాదు. గతమంతా గుర్తొచ్చి ఎక్కడ బాధపడవలసి వస్తుందోనని భయపడేవాణ్ణి. అక్కడ ముఖ్యమైంది ఏమీ లేదు. గ్రామం ఎలాగూ గ్రామమే. ఎండిపోయిన ప్రాంతం. నదీ, సరోవరం, పచ్చదనమూ ఏదీ లేదు. దుమ్ముధూళి ఎగురుతూ ఉంటుంది. ధూళికి కూడా ఒక మాయ ఉంటుంది. 

మా గ్రామం పట్టణం నుంచి దూరంలో ఉంది. మా పొరుగు గ్రామం వరకూ బస్సుసౌకర్యం ఉంది. అక్కడి నుంచి మూడు కోసులు నడవాలి. గ్రామంలో ప్రవేశించగానే మామయ్య ఇల్లు కనిపిస్తుంది. గ్రామం మధ్యలో మా ఇల్లుంది. నాన్న కట్టించిన ఇల్లు. మట్టి ఇల్లు. రెండు గదులు, ఒక వంటిల్లు. పొడవైన వసారా. విశాలమైన ముంగిలిలో తులసికోట. అంతేకాకుండా  అంగణం మధ్యలో పచ్చగా దట్టంగా పెరిగిన వేపచెట్టు. ఇంట్లో ఎవరూ లేకపోయినా ఆ ఇంటిని ఎలా వదిలిపెట్టగలను? నా తండ్రికి వైద్యం తెలుసు. ఆయన చిన్నప్పుడు గ్రామానికి ఎవరో సాధువు–సన్యాసులు వచ్చేవారని విన్నాను. 

అంతేకాకుండా మా ఇంట్లోనే వాళ్ళు బసచేసేవారట. నాన్న వాళ్ళకు సేవలు చేసేవారట. వాళ్ళతో వుంటూ ఒక రోజు ఎవరికీ చెప్పకుండా వాళ్ళతోపాటు ఇల్లు వదలిపోయారట.
సుమారు ఆయన ఏడేళ్ళపాటు వాళ్ళతోటే ఉన్నారు. గురువుగారు మరణించిన తరువాత తిరిగొచ్చారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ దగ్గర మూలికలు నూరుతూ మూలికా వైద్యం నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వైద్యమే ఆయనకు జీవితాంతం ఆసరా అయింది. 

ఇల్లు కట్టుకున్నారు. కుటుంబానికి సంబంధించిన చిన్నచిన్న బాధ్యతలు నెరవేర్చారు. అదే ఇంట్లో నేను పుట్టాను. నేను ఒక్కడినే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా, గారాబంగా పెంచారు. బాల్యంలో నేను చాలా తుంటరివాడిని. రోజూ నా మీద ఫిర్యాదులు వచ్చేవి. నాన్నగారు కోప్పడేవారు. బెత్తం పట్టుకుని నా వెంటపడేవారు. నేను వెంటనే వేపచెట్టు ఎక్కేవాడిని. పొద్దుపోయి, చీకటిపడినా నేను ఆయన పట్ల ఉన్న భయంతో కిందికి దిగేవాడిని కాను. వేపచెట్టు మీద ఉంటే నాకు భయం వేసేదికాదు. ‘కొట్టనులే, కిందికి దిగు’ అని నాన్న అంటే, అప్పుడు నేను కిందికి దిగేవాడిని. ఆ వేపచెట్టంటే నాకు ప్రాణం. నా ఊపిరి. ఎన్నెన్నో తీయటి జ్ఞాపకాలు ఆ చెట్టుతో ముడిపడివున్నాయి.

ఆ రోజులు మరచిపోవాలన్నా మరచిపోలేం. ఇంటి ముంగిట్లోనే అమ్మ పొయ్యి మీద రొట్టెలు చేసేది. నాన్న వేపచెట్టు కింద మంచం వేసుకుని కూర్చునేవారు. నేను నా గోళ్ళతో ఆయన వీపు గోకుతూ ఉండేవాడిని. ఆయన నా రోజువారీ వివరాలు అడిగేవారు. నేను అన్నీ చెప్పేవాడిని. బడిలో ఎవరిని కొట్టాను, మాస్టరుగారి చేతుల్లో ఎవరికి దెబ్బలు పడ్డాయి? రమ్లీని ఎలా వేధించాను వగైరా వగైరా. నాన్నగారు మౌనంగా అన్నీ వినేవారు. తిట్టేవారు కాదు. ‘ఇలా చేయకూడదు నాన్నా’ అని మాత్రం అనేవారు. అయితే రమ్లీని వేధించాననే విషయం విని కోపగించుకునేవారు. రమ్లీ ఆయన స్నేహితుడి కూతురు. 

నా స్నేహితురాలు. ఆమె అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆమె పట్ల ఆయన చాలా శ్రద్ధ వహించేవారు. ఆమె నా పట్ల సదా శ్రద్ధ వహించేది. నేను తనను ఎంతగా వేధించినా నా మీద ఫిర్యాదు చేసేది కాదు. తన ఇంటి నుంచి ఎప్పుడూ ఏదో ఒకటి దాచుకుని తెచ్చి నాకు ఇచ్చేది. నా చేత తినిపించేది. నేను తింటూవుంటే తను నా వంకే చూస్తూ ఏదో ఆలోచనలో మునిగేది. వేపచెట్టు కింద మేము ఆడుకునేవాళ్ళం. వేప పుల్లలతో, ఆకులతో, వాటి కాయలతో ఇళ్ళు కట్టుకునేవాళ్ళం. వాటితో బల్లలు, మంచాలు, కుర్చీలు చేసేవాళ్ళం. ఆమె ఉట్టుట్టినే వంట చేసేది. నాకు వడ్డించేది. నేను తిన్నట్టు నటించేవాడిని. ఆమె బట్టలు ఉతికేది. ఆరవేసేది. ఇంటి కసువు చిమ్మేది. కోపాన్ని నటించేది.

ఒక రోజు ఆమె నా కోసం తినడానికి ఏదో తెచ్చింది. నేను అప్పుడు వేపచెట్టు మీద కూర్చుని చదువుకుంటున్నాను. ఆమె చెట్టెక్కి నా దగ్గరికి వచ్చి ‘తీసుకో, తిను’ అంది. నాకు కోపం వచ్చింది. కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ, ‘తిను, ఎందుకలా చేస్తావు?’ అంది. నాకు కోపం వచ్చింది. ‘నాకొద్దు పో.. ఇక్కడి నుంచి’ అని నా చేతిని పట్టుకున్న ఆమె చేతిని విదిల్చాను. అయితే పట్టుతప్పి ఆమె వేపచెట్టు మీది నుంచి కిందకు జారింది. పడుతూ పడుతూ కెవ్వున కేకపెట్టి స్పృహ తప్పి పడిపోయింది. నేను దిగ్భ్రాంతి చెందాను. ఆమె వేసిన కేకకు ఇంట్లోని వారందరూ కంగారుగా పరుగెత్తుకొచ్చారు. కోలాహలం చెలరేగింది. నాన్నగారు రమ్లీని ఎత్తుకుని ముంగిట్లోకి తీసుకునిపోయారు. మంచం మీద పడుకోబెట్టారు. అమ్మ వణుకుతున్న చేతుతో రమ్లీ ముఖం మీద నీళ్ళు చిలకరించింది. విసనకర్రతో గాలి వచ్చేలా విసరసాగింది. నాన్నగారు ఏదో మూలికను నూరి ఆమె చేత తాగించారు. 

తరువాత నేరుగా కర్ర పట్టుకుని చెట్టుకిందకు వచ్చి కిందకు దిగమన్నారు. అయితే నేనెందుకు దిగుతాను? నేను మరింత పైకి ఎక్కి కూర్చున్నాను. నాన్న వేపచెట్టు కింద మంచం వేసుకుని కూర్చున్నాడు.. ‘దొంగ వెధవా, కిందకు రారా నువ్వు, నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను’ అంటూ. నేను మనస్సులోనే రమ్లీని తిట్టుకోసాగాను. ఆమె కారణంగా నాకు దెబ్బలు పడబోతున్నాయి. దాంతోపాటు నా మనస్సులో రమ్లీకి ఏమైనా అవుతుందేమోననే భయమూ కదలసాగింది.

కొద్దిసేపటి తరువాత రమ్లీకి స్పృహ వచ్చింది. అది చూసి అమ్మ ఆమెను దగ్గరికి లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకుని చాలా సేపు ఏడ్చింది. రమ్లీని పదేపదే ముద్దు పెట్టుకుంది. అదే సమయంలో నన్ను చాలాసార్లు తిట్టింది. తరువాత అమ్మవారి ముందు దీపం వెలిగించడానికి ఇంట్లోకి వెళ్ళింది. రమ్లీ నాన్నను దుర్వాసుడి పోజులో వేపచెట్టు కింద కూర్చునివుండటం చూసింది. మళ్ళీ నా వైపు చూసింది. ఆమె మెల్లగా లేచి నాన్నగారి దగ్గరికి వచ్చింది. ‘తనను కొట్టకండి, తనేమైనా నన్ను కిందికి తోశాడా? పొరబాటున నేనే జారిపడ్డాను..’ అంది. నాన్నగారు ఆమెను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో అమ్మ లోపలి నుంచి వచ్చింది. ‘చూశారా, రమ్లీ ఎంత తెలివైందో? తనను నేను నా దగ్గరే పెట్టుకుంటాను’ అంది. అమ్మ మాటలు విని నాన్నగారు నవ్వసాగారు. అమ్మ రమ్లీని వంటింట్లోకి తీసుకెళ్ళింది. నాన్నగారు నాకు నచ్చజెప్పి నేను కింద దిగేలా చేశారు. 

నేను చెట్టు దిగగానే భోంచేయడానికి లోపలికి పంపారు. అమ్మ నాకు, రమ్లీకి అన్నాలు పెట్టింది. నాన్న కూడా వచ్చి మా పక్కనే కుర్చున్నారు. మమ్మల్ని చూసి అమ్మానాన్న ఊరకూరకే నవ్వసాగారు. భోజనాలయ్యాక నాన్న రమ్లీని వాళ్ళింట్లో వదిలి వచ్చారు. అంతే. ఆ రోజు నుంచి నేను ఎప్పుడూ తనను వేధించలేదు. ఆమె పట్ల నాకు ఇష్టం పెరగసాగింది. మేము కలిసే భోజనాలు చేసే వాళ్ళం. చదువుకునేవాళ్ళం. ఆడుకునేవాళ్ళం. అల్లరి చేసేవాళ్ళం. సరదాగా ఉండేవాళ్ళం. చాలావరకూ వేపచెట్టు కిందే కాలం గడిపేవాళ్ళం. ఋతువులు వస్తున్నాయి, పోతున్నాయి. చెట్టు ఆకులు రాలుతుండేవి. కొత్త చివుళ్ళు వేస్తూవుండేవి. పూత పట్టేవి. చెట్టు పెరుగుతూ ఉంది.

మేమూ పెద్దగయ్యాం. మాలో యవ్వనం ప్రవేశించింది. యవ్వనంలోని మొదటి స్పర్శను అనుభవించాం. అప్పుడు కూడా వేపచెట్టు సాక్ష్యంగా ఉంది.  నమ్మండి చెట్టు తన ఆకును మాపై రాల్చిరాల్చి తన ప్రసన్నతను వ్యక్తం చేసింది. రమ్లీ ఇప్పుడు రమీలా అయిపోయింది. ఒక రోజు ఆమె పూజకోసం పూలు ఇవ్వటానికి నాన్న దగ్గరికి వచ్చింది. ఆ రోజు వేపచెట్టు వెనుక దాక్కుని ఆమె మొదటి ముద్దును తీసుకుంది. వేపచెట్టు కూడా తాను ఏమీ చూడలేదన్నట్టు మౌనంగా నుంచుంది.

అటు తరువాత రమ్లీ మెట్రిక్‌ పూర్తి చేశాక చదువు మానేసింది. ఆమె తండ్రి పాతకాలపు ఆలోచనలున్న మనిషి. నా తండ్రి చదువు మానిపించవద్దని ఎంత నచ్చజెప్పినా అతను వినిపించుకోలేదు. నేను పట్టణం వెళ్ళి చదువుకోసాగాను. హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడిని. రమ్లీ కోసం ఎన్నో పుస్తకాలు తెచ్చేవాడిని. ఆమెకు పుస్తకాలు దొరికితేచాలు, దేవుడినే చూసినంతగా ఆనందించేది. హాస్టల్‌ చిరునామాకు ఆమె ఉత్తరాలు రాస్తుండేది. ఆమె అక్షరాలు చూడగానే నాకు పూతపట్టిన వేపచెట్టు జ్ఞాపకానికి వచ్చేది. హాస్టల్లో ఉండాలని అనిపించేది కాదు.

ఒక రోజు తీవ్రంగా వర్షం కురుస్తోంది. ఎందుకో ఇల్లు గుర్తొచ్చింది. వేపచెట్టు చేదుచేదు వాసనతో మనసులో చిందులు వేసింది. హాస్టల్లో ఉండలేక వెంటనే గ్రామానికి బయలుదేరాను. పొరుగు గ్రామం వరకు వెళుతున్న బస్సెక్కి బయలుదేరాను. అక్కడ బస్సు దిగి నడుస్తూ, వర్షంలో తడుస్తూ, బురదను తొక్కుకుంటూ ఇల్లు చేరాను. గుమ్మంలోంచి చూడగానే అంగణంలోని వేపచెట్టు కింద రమ్లీ వర్షంలో తడుస్తూ నుంచుని ఉండటం కనిపించింది. ఆ దృశ్యం ఈ రోజుకీ నా కళ్ళల్లో స్థిరంగా నిలిచిపోయింది. బహుశా ఆమె నా కోసం ఎదురుచూస్తున్నట్టుంది.

ఆమె తడిసిన, తెల్లటి శరీరం నన్ను చూడగానే ఆనందంతో పులకరించటం, ఆమె సిగ్గుతో ముడుచుకుపోవడం నేను ఎప్పటికీ మరచిపోను. ఆమె ఇంట్లోకి పరుగుతీసింది. నేను వసారాలోకి వచ్చేసరికి ఆమె తువ్వాలు, పొడిబట్టతో తిరిగి వచ్చింది. తువ్వాలు, పొడిబట్టలు తీసుకుని నేను లోపలికి వెళ్ళి ఒళ్ళు తుడుచుకున్నాను. దుస్తులు మార్చుకున్నాను. అంతలో రమ్లీ చాయ్‌ చేసుకుని తీసుకొచ్చింది. నేను మంచం మీద కూర్చుని చాయ్‌ తాగాను. ఆమె కప్పుసాసర్‌ లోపలికి తీసుకుని వెళ్ళింది. ఈ మధ్యలో ఆమె నేను చాయ్‌ తాగుతున్నంత సేపు మౌనంగా, తదేకంగా, కళ్ళార్పకుండా నన్నే చూస్తూ ఉంది.

చీకటి పడుతూ ఉంది. ఆమె దీపం వెలిగించింది. ఆమె తడిసిన ముఖం మీద లేత వెలుతురు పరచుకుంది.
ఆమె కళ్ళల్లో వెలుగుతూ, కదులుతున్న దీపపు ఒత్తి ప్రతిబింబం కనిపిస్తోంది.
‘అమ్మా, నాన్న ఎక్కడికి పోయారు?’ అడిగాను.
‘ఇంత ఆలస్యంగా వాళ్లు గుర్తొచ్చారా?’ ఆమె అల్లరిగా నవ్వుతూ అడిగింది.
నేను సంకోచంతో తల వంచాను.

‘అత్తయ్యకు జబ్బు చేసింది. ఆమెను చూడటానికి వెళ్ళారు. రేపు సాయంత్రానికి వస్తారు’ అంది రమ్లీ.
‘నువ్వు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు?’
‘ఊరికే.. ఇలాగే వచ్చి వేపచెట్టు కింద నుంచున్నాను. నన్ను ఇంటిని చూసుకోమని చెప్పి వెళ్ళారు’ అంది.
‘నా కోసం ఎదురుచూస్తున్నావా?’ నేను ఆమె దగ్గరికి వెళ్ళాను.
‘లేదు, నేనెందుకు ఎదురుచూస్తాను? నాకు చాలా పనులున్నాయి’ అంటూ ఆమె నవ్వింది.
నేను మౌనం వహించాను. దాంతో.. రమ్లీ  ‘నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఈ రోజు వర్షంలో వేపచెట్టు కూడా సంతోషంతో ఉంది. గాలి అలలు వీస్తున్నాయి. నువ్వు గుర్తుకు వచ్చావు. ఈ సమయంలో నువ్వు వస్తే ఎంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉండిపోయాను. వేపచెట్టు కింద అలాగే నిలబడి నిలబడి నీ కోసం ఎదురుచూస్తూండిపోయాను’ అంటూ నా దగ్గరికి వచ్చేసింది.

నేను ఆమెను దగ్గరికి లాక్కుని ముద్దు పెట్టుకున్నాను.
ఆమె సిగ్గుపడుతూ ‘నేను వెళుతున్నాను. భోజనానికి ఇంటికి వచ్చేయ్‌’ అంటూ బయలుదేరబోయింది.

నేను ఆమెను పట్టుకుని ఆపాను. వేపచెట్టు వెనక్కు ఆమెను లాక్కునిపోయాను. మరుక్షణం సిగ్గే స్వయంగా నా బాహువుల్లో ఇమిడిపోయినట్టనిపించింది. అలా ఎంతసేపు ఉండిపోయామో. ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. చాలాసేపటి తరువాత సమయం గుర్తుకొచ్చినట్టు ఆమె నన్ను విడిపించుకుని పరుగుతీసింది. నేను అక్కడే, వేపచెట్టు కింద ఏదో మైకం కమ్మినట్టు కూర్చుండిపోయాను. చెట్టు ఆకుల నుంచి రాలుతున్న నీళ్ళు నా మీద పడుతున్నాయి.. నన్ను అభిషేకిస్తున్నట్టుగా.. చాలాసేపటి వరకు.. అటు తరువాత హాస్టల్లో ఉంటూ నేను పూర్తిగా మనస్సుపెట్టి, కష్టపడి చదువు పూర్తిచేయాలని ప్రమాణం చేసుకున్నాను.

తరువాత మంచి ఉద్యోగం సంపాదించి, రమ్లీని నా జీవితభాగస్వామిగా చేసుకోవాలని కలలుకన్నాను. అదే కోరికతో కష్టపడి చదవసాగాను. ఒకరోజు నాకు ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. అందులో, ‘ప్రియమైన.. నేను రెండుమూడు రోజుల్లో పరాయిదాన్ని అవుతున్నాను. తడి భూమిలో మౌనంగా విత్తనం నాటినా, అది మొలకెత్తడంతో జగానికంతా తెలిసిపోయింది. మీ తల్లితండ్రులు వచ్చి నా తల్లితండ్రులను ఎంతగా బతిమిలాడినా, ఆర్థించినా..’  నేను ఉత్తరం పూర్తిగా చదవలేకపోయాను.

వెంటనే గ్రామానికి బయలుదేరాను. గ్రామ పొలిమేరలోనే పెండ్లి కొడుకు ఊరేగింపు ఎడ్లబండ్లు వస్తూ కనిపించాయి. ఎద్దుబండిలో కూర్చుని, తన సిగ్గును కొద్ది  క్షణాలపాటు మరచిపోయిన రమ్లీ నా వైపు కళ్ళెత్తి చూసింది. ఆమె ఏడ్చిఏడ్చి వాచి ఉబ్బిన కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాలుతున్నాయి. రోడ్డుకు ఒకవైపున నిలబడి, ఆమె కనిపిస్తున్నంతసేపు చూస్తూ ఉండిపోయాను. మెల్లమెల్లగా, ఒక్కొక్కటిగా ఎడ్లబండ్లు కనుమరుగయ్యాయి. నేను ఒక భూతంలా ఆలోచిస్తూ నిలుచుండిపోయాను. దీన్ని ఎలా అంగీకరించను? నా దగ్గరికి ఎందుకు పరుగెత్తుకుంటూ రాలేదు? మనస్సులో జవాబులేని ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి. ఓడిపోయిన జూదరిలా ఇంటికి వచ్చాను. తెరచిన తలుపులు గాలి రభసకు కొట్టుకుని చప్పుడు చేస్తున్నాయి. 

నాన్న వేపచెట్టు కింద నులకమంచం మీద కూర్చునివున్నారు. నన్ను చూశారు. అయితే ఏమీ చెప్పలేదు. తలవంచుకుని అలాగే కూర్చుండిపోయారు. అమ్మ వచ్చింది. నేను ఆమెను గట్టిగా పట్టుకుని బిగ్గరగా రోదించసాగాను. అమ్మ నన్ను ఓదార్చుతూ లోపలికి తీసుకునిపోయింది. నీళ్ళు తాగించింది. నన్ను ఓదార్చుతూ నిద్రపుచ్చింది. అందరూ నిశ్శబ్దంగా నిద్రపోయారు. ఎవరూ భోంచేయలేదు. నేను అర్ధరాత్రి లేచి వేపచెట్టు కాండాన్ని ఆసరా చేసుకుని దానికి ఆనుకుని కూర్చున్నాను. దాని శరీరంలో పోగుపడిన పరిచితమైన సర్శానుభవాన్ని పొందుతూ ఉండిపోయాను. అలాగే తెల్లవారింది. ఇప్పుడు కూడా మనస్సు వ్యాహారిక క్లేశాలతో అలసి, ఓడిపోయినట్టు అనిపిస్తే, అదే వేపచెట్టు సహాయం తీసుకుంటాను. దాని నీడను తలచుకుంటే మనసుకు ఒక విధమైన హాయి, శాంతి దొరుకుతాయి.

‘ఇదే ఇంట్లో ఆశాతో నా పెళ్ళి జరిగింది. పెళ్ళి మంటపం కూడా వేపచెట్టు కిందనే నిర్మించారు. వాస్తవానికి నేను ఆశాను మనస్ఫూర్తిగా ఎప్పుడూ స్వీకరించలేదు. చేతుల్లో ఆమె ముఖాన్ని తీసుకోగానే నాకు రమ్లీ గుర్తుకొచ్చేది. తళుక్కున మెరిసే ఆమె కళ్ళు ఎక్కడ..! ముందునుంచే ఆశా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. బాగా వడలిపోయింది. 

అమ్మా, నాన్న చనిపోయాక నేను పూర్తిగా ఒంటరి అయిపోయాను. నా మనసులోని దుఃఖాన్ని, బాధను చెప్పుకోవడానికి ఆత్మీయులు ఎవరూ లేరు. కేవలం వేపచెట్టు మాత్రం ఉండేది. దాని జ్ఞాపకాలే నాకు శాంతిని కలిగించేవి. దాని నీడలో గడచిన క్షణాలే నాకు జీవించటానికి ప్రేరణ ఇచ్చేవి. దాంతో నేను నా బాధలు, దుఃఖాలు మరచిపోయేవాడిని. మనసు కూడా వేపచెట్టునే ధ్యానించేది. ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరేటప్పుడు ఉదయపు ఎండలో ఇంటిమీద పడే  దానినీడ గుర్తుకు వచ్చేది. మధ్యాహ్నం, సాయంత్రాలు కూడా దాని మధురమైన జ్ఞాపకాలే వెంటాడేవి.

ఆ వేపచెట్టు ఉన్న ఇంటిని మామయ్య  చిన్నాన్నకు ఇచ్చివేయమని చెబుతుండేవాడు. డబ్బులు వస్తాయని! అయితే నాకు డబ్బు వద్దు.. దార్లో పిన్ని కనిపించింది. నన్ను నేరుగా ఆమె ఇంటికి తీసుకెళ్లింది. నిజానికి నేరుగా మా ఇంటికి వెళ్ళానుకున్నాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. చిన్నాన్న ఇంటిదగ్గర లేడు. పిన్ని చాయ్‌ చేసింది. చాయ్‌ తాగి నేను, ‘కాస్త ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాను’ అన్నాను.
‘ఇంటికి పోయి ఏం చేస్తావు? చాలా కాలంగా ఆ ఇంటిని శుభ్రం కూడా చేయలేదు’ అంది పిన్ని.
‘వేపచెట్టు కింద కూర్చుంటాను’
‘అయితే వేపచెట్టును మీ చిన్నాన్న నరికించాడు. డబ్బు అవసరం ఉండింది. అందుకే..’
‘నరికించాడా?’

నమ్మండి, ఆ మాట వినగానే నా చెవుల్లో ఎవరో కరిగించిన సీసం పోసినట్టు అనిపించింది. నా శరీరం ముడుచుకుపోయింది. గజగజావణుకుతూ,ఫెళఫెళమంటూ చప్పుడు చేస్తూ పడిపోతున్న వేపచెట్టు ఆర్తనాదం వినిపించింది. కూలిపోతున్న దాని శరీరం కింద నేను అణిగిపోయినట్టు అనిపించింది. కళ్ళల్లో చీకటి కమ్ముకుంది. కాళ్ళకింది భూమి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. నా రోమరోమాలు నిప్పు అంటుకున్నట్టు భగభగమని మండసాగాయి.. ఈ మనుషులు నా గతాన్ని ఒక్క దెబ్బతో లేకుండా చేశారు. నా మూలాలను మట్టిలోంచి పెళ్లగించారు. ఆ వేపచెట్టుతో పెనవేసుకున్న నా ఒక్కొక్క జ్ఞాపకం గాయపడింది. రక్తసిక్తమైంది. ఒక భరించరాని చేదు అనుభవం నా అస్తిత్వంలో చేరుకుంది. దుఃఖంతో నా గొంతు పూడుకుపోయింది.

‘మామయ్యా..’
‘ఆ..’
‘నాకు ఇల్లు అవసరం లేదని చినాన్నతో చెప్పు మామయ్య. అలాగే నాకు డబ్బు కూడా వద్దని చెప్పు.. అంతా ఆయనకే వదిలివేస్తున్నాను..’ చాలా కష్టంగా ఆ మాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. తడబడుతున్న అడుగులతో నేను అక్కడి నుంచి కదిలాను. మామయ్య, పిన్ని నన్ను ఆపటానికి ప్రయత్నించసాగారు. ఏదో చెప్పాలని, ఏదో అడగాలని ప్రయత్నించసాగారు. అయితే నేను ఆగలేదు. మాట్లాడలేదు. మరమనిషిలా అడుగులు వేస్తున్నాను. మామయ్య నా వెనుకనే అడుగులు వేస్తున్నాడు. నా మనస్సులో ప్రళయం.. వేపచెట్టు.. వేపచెట్టు.. వేపచెట్టు.. చెవులకు గాలిలోనూ ఏమీ వినిపించటం లేదు.
గాలి కూడా బహుశా శోకగీతం ఆలపిస్తూవుంది. 

గుజరాతీ మూలం: దీపక్‌ రావల్‌  
అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

చదవండి: ఈ వారం కథ: తిరగబడ్డ చేప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement