ఈ వారం కథ: తిరగబడ్డ చేప | Uma Mahesh Achalla Tiragabadda Chepa Telugu Short Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: తిరగబడ్డ చేప

Published Sun, Oct 3 2021 11:29 AM | Last Updated on Sun, Oct 3 2021 11:51 AM

Uma Mahesh Achalla Telugu Short Story In Sakshi Funday

‘ఒరేయ్‌ కొండిగా నీదేరా ఫస్ట్‌ హ్యాండ్‌ ఆడతావా డ్రాపా?’ కింద హ్యాండ్‌ వాడు అడిగాడు ఓపెన్‌కార్డు కేసి ఆశగా చూస్తూ. కొండలరావు నిమిషానికి నూటముప్పైసార్లు కొట్టుకుంటున్న గుండెతో పదమూడు ముక్కలూ సర్దాడు. నాలుగు రాణులు, నాలుగు జాకీలు, ఇస్పేటు ఆసు రెండు మూడు నాలుగుతో, చేతిలో కార్డుషో. ఏ రాజొచ్చినా, ఏ పదొచ్చినా, పిల్లొచ్చినా ఆటే. ఓక్కి రూపాయి స్టేకు.  ‘వారం రోజుల నుంచి డబ్బులు పోతానే ఉన్నాయి. ఈ ఆటతో మొత్తం రికవరీ అయిపోవాల’ అనుకుంటూ పేకలోకెళ్ళి తీసిన ముక్కని ముద్దెట్టి నెమ్మదిగా చూశాడు. కళావరు ఏడు. కొట్టేశాడు. 

‘పోన్లే.. డీలయితే మళ్ళీ హాఫ్‌ కౌంట్‌ అంటారు. ఓ టర్న్‌ ఆగితే మంచిదే. ఫుల్‌ లాగొచ్చు’ సమాధాన పరచుకున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పడేశారు. ‘ఛ, తప్పించుకున్నారు. ముగ్గురు ఆడారు. పోన్లే, మూడుకౌంట్లు, రెండు డ్రాపులు, అరీబు పోనూ రెండూ ఏభై. ఈ కట్టు కొడితే నాన్నకి చెప్పుల జత కొని పట్టుకెళ్ళాలి. పాపం పోయినసారి ఈత ముల్లు గుచ్చుకుని నెల్లాళ్ళు బాధపడ్డాడు’ అనుకుంటూ ముక్కలు ముడిచి పట్టుకుని అందరికేసీ గుటకలు మింగుతూ చూస్తున్నాడు కొండలరావు జింక కోసం మాటేసిన పులిలా.

చదవండి: ఈవారం కథ: సార్థకత 

పాతికేళ్ల కొండలరావు ఊర్లో ఇంటర్‌ వరకూ చదివి, కొన్నాళ్ళు నాన్నకి వ్యవసాయంలో సాయంచేసి, ఇద్దరికి సరిపడా పనిలేక పోవడంతో పక్కనే ఉన్న పట్నమొచ్చి సెక్యూరిటీ ఏజెన్సీ తరపున ఓ అపార్ట్‌మెంట్‌లో గార్డ్‌గా చేరాడు. వరుసగా ఆరు పోర్షన్ల ఆస్బెస్టాస్‌ ఇంట్లో ఓ పోర్షన్లో ఇంకో ఇద్దరు పెళ్లికాని గార్డ్స్‌తో కలసి ఉంటున్నాడు. షిఫ్ట్‌ డ్యూటీలను బట్టి ఆ కంపెనీలో గార్డ్స్‌ అందరూ వారానికోసారి కొండలరావు ఇంట్లో పేకాడతారు. అది తప్పో, రైటో వాళ్లకి తెలీదు. తెలిసిందల్లా సెలవులు, ఇంక్రిమెంట్లు, డి.ఏ.లు, ప్రశంసా పత్రాలు .. ఇదిగో ఈ మాత్రం ఆటవిడుపు. 

మరో రౌండ్‌ తిరిగింది కానీ కొండలరావుకి ముక్కరాలేదు. ఇంతలో మిగతా ముగ్గురూ కింద నుంచి తలా ముక్కా తీసుకున్నారు. ‘సుడిగాళ్ళకి లైఫులు అయిపోయినట్టున్నాయి. పోన్లే, పెనాల్టీ అయినా ఇస్తారు’ అనుకుని ధీమాగా ఉన్నాడు కొండలరావు. మరో రౌండ్‌లో పైనున్నోడు ఓ ‘రాజు’ తీసి కొట్టబోయాడు. ఆడకుండా అందరికీ టీలు అందించేవాడు ఇద్దరిపేక చూసి, కొండలరావు చూడకుండా వాడి కాలు తొక్కాడు. అంతే వాడు ‘రాజు’ మళ్ళీ లోపల పెట్టేసి రెండు కొట్టాడు. మరో రౌండ్‌ తిరిగాక  కొండలరావు చేతి కిందున్నోడు ఆట చూపించేశాడు. కొండలరావు ముక్కలు విసిరేసి జేబులో ఉన్న ఏభైనోటిచ్చి ‘మిగతా ముప్పై తర్వాత ఇస్తానురా’ అన్నాడు. 

‘అబ్బే దీపాలెట్టే ఏల అరువు కుదర్దని తెలుసుకదరా రానీ బాలన్స్‌ రానీ’ అంటూ అందరూ ఇచ్చిన డబ్బులు ముద్దెట్టుకుని నోట్ల దొంతుని  పరచిన దుప్పటి కిందకి దోపాడు ఆట కొట్టినోడు.  కొండలరావు ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. ఆఖరికి డిపాజిట్‌ ఎనభైలో ముప్పై విరగ్గోసుకుని మిగతా ఏభై తీసుకుని ఉసూరుమంటూ డ్యూటీకి బయల్దేరాడు కొండలరావు.

అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోని కుర్చీలో కూర్చున్నాడే  కానీ కొండలరావు స్థిమితంగా లేడు. ఏభై ఫ్లాట్లు, నూటఏభై మంది జనం. ఏ ఒక్కరు వచ్చినా, పోయినా, లేచి సెల్యూట్‌ చెయ్యాలి. మోటార్‌ ఆన్‌ చెయ్యటం, మేంటెనెన్సు కలెక్ట్‌ చెయ్యటం, విజిటర్స్‌ చేత రిజిస్టర్లో సంతకం పెట్టించటం, కొందరు అరిస్తే నవ్వుతూ ‘ఇక్కడ రూల్స్‌ సర్, సారీ సర్‌’ అనటం, వాళ్ళు పెట్టకపోతే, సెక్రటరీ చేత తిట్లు తినటం, సెకండ్‌ షోకి వెళ్లొచ్చిన వాళ్లకి గేటు తియ్యడం కాస్త ఆలస్యం అయితే, తనని తీసెయ్యడం కోసం ఇరవైమంది మీటింగెట్టుకోవటం, తను వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం, ఏ దయగల అమ్మగారో పండగ పూట బూరో, బొబ్బట్టో పెడతానంటే వెళితే, ‘గేటు దగ్గర లేకుండా ఎక్కడ పెత్తనాలకెళ్లా’వని ఓ అయ్యగారు ఆరోపించడం.. అన్నీ భరిస్తే, పన్నెండు గంటల చొప్పున ముప్పైఒక్క రోజుల డ్యూటీకి ముట్టేది ఎనిమిదివేలు. 

మహా అయితే ఇంకో మూడేళ్ళకి తొమ్మిదివేలవుతుందేమో. పోనీ ఊర్లో వ్యవసాయం చేసుకుందామంటే, ‘అదీ జూదమే. మీ నాన్నాడుతున్నాడు కదరా! మళ్ళా నువ్వెందుకు?’ అంటుంది అమ్మ. ఇంతలో ఓ కుక్క అపార్ట్‌మెంట్‌లోకి దూరటంతో పైనించి వచ్చిన కేకలకు ఉలిక్కిపడి ఆలోచనలను నెట్టేసి, కుక్కని తరమడానికి లేచాడు కొండలరావు.
∙∙ 
ఏపుగా పెరిగిన చేనుకేసి తృప్తిగా చూసుకున్నాడు పెద్దాపురం. తనకున్న  రెండెకరాల్లో వరేశాడు. ఈ ఏడు కాల్వ పారుతుండడంతో నీటికి ఇబ్బందిలేదు. పెట్టుబడికోసం పొలం, పెళ్ళాం మెళ్ళో తులం తాకట్టు పెట్టాడు. చాన్నాళ్ల తర్వాత ఈ ఏడు కొంతైనా మిగిలేలా ఉంది. ‘వచ్చే బుధవారం కోతలు పెట్టుకోవాల’ అనుకుంటూ, కూలోళ్ళకి చెప్పి, కోతల ముందు బండి మాంకాళమ్మకి వెయ్యడానికి దార్లో ఓ కోడిపిల్లని కుడా కొన్నాడు. చేలోకోసి పట్టుకొచ్చిన మువ్వని చూరుకి వేలాడదీశాడు. కాళ్ళు కడుక్కుని అన్నానికి కూర్చున్నాడు. ‘ఎవసాయం ఒద్దన్నావు. చూడూ.. ఈయేడు గింజ దిగుబడి’ అంటూ వెన్నుకేసి చూపించాడు. 

 ‘ఏమోనయ్యా. చేతికాడాకొచ్చేవరకూ ఏటీ చెప్పలేం. ఇదీ జూదమే అని మా అయ్య చెప్తా ఉండేవాడు. మన పైన మెరక పొలమంతా పెసిడెంటుగారిదేగా. మనది కూడా కలుపుకున్దారని ఆ మద్దె అడిగారన్నావు కదా, అమ్మేయ్యొచ్చుగా ఎందుకీ యాతన’ అంది అతని భార్య నిట్టూరుస్తూ. 

‘నోర్ముయెస్, అన్నంకాడ ఎదవ అపశకునం. రెంటికీ అదృట్టమే ఉండాలి కాబట్టి జూదమూ, ఎవసయమూ ఒకటని కాదే. యాపకానికీ, ఊపిరికీ ఉన్నంత తేడా ఉంది. సూత్తా ఉండు. రేపు కోతలు, ఆపైవారం కుప్ప, ఓ మూడ్రోజులాగి నూర్పు, బళ్ళు మిల్లుకు తోలేత్తే, మనకి నాలుగ్గింజలు, పశువులకింత గడ్డి, బ్యాంకుకి బాకీ జమ, నీ మెళ్ళో నీ గొలుసు, నీ ముద్దుల కొడుకు ఏలుకో ఎంకటేస్సరసామి ఉంగరం, ఎప్పుడూ ఆ ఉప్పుదేరిన యూనిఫారమే తప్ప మంచి గుడ్డ కట్టుకున్నదేలేదాడు. ఓ రెండు జతల బట్టలు తియ్యాల. ఆపైన ఆడి పెళ్లి, పై ఏటికి నువ్వు అవ్వ, నేను తాత’ అంటూంటే పొలమారింది పెద్దాపురానికి. 
∙∙ 
 భోంచేసి వాకిట్లో నులక మంచం వేసుకున్నాడు పెద్దాపురం. తెల్లవారితే కోతలు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటంలేదు. ఎంత ధీమాగా ఉందామన్నా ఏదో బెరుకు. ఏ తెల్లవారుజామో నిద్ర పడుతూండగా ఎవరో లేపిన అలికిడి. విషయం తెలుసుకుని పరుగున పొలానికి బయల్దేరాడు. ప్రెసిడెంటు తన పొలమంతా చేపల చెరువుకోసం తవ్వేసి, అవి నింపటం కోసం వదిలేసిన ఆరు బోర్లూ పొంగిపోయి పెద్దాపురం నాలుగు మళ్ళూ నీటితో నిండిపోయాయి. 

పగలు పసిపాపలా తలలూపి పలకరించిన వరిచేను అప్పుడే జీవుడెళ్లిపోయిన పీనుగులా వేలాడింది. ఒబ్బిడి చెయ్యడానికి మరో పదివేలు పెట్టినా, ముతక ధాన్యం కొంటారో కొనరో తెలీదు. ఎవరో పనిమాలా చేసినా, పొరపాటున చేసినా చేసేదేంలేని పెద్దాపురం ఊసురోమంటూ గట్టుమీద కూలబడ్డాడు. ఆ క్షణం భూమ్మీదున్న మూడొంతుల నీరూ అక్కడే ఉన్నట్టుంది. ఒకొంతు మళ్ళోనూ, రెండొంతులు అతని కళ్ళల్లోనూ!   
∙∙ 
 పెద్దపండగ వచ్చింది. అతికష్టం మీద, జీతం నష్టం మీద, ఒక్కరోజు సెలవుపెట్టి ఇంటికొచ్చాడు కొండలరావు. అప్పులో అప్పుచేసి పండగ సందడి తెచ్చాడు పెద్దాపురం. సగానికి చిక్కిపోయిన కొడుకుని చూసి బెంగెట్టుకున్న తల్లి  ‘పొదుగునించి అప్పుడే గిన్నెలోకి వెచ్చగా జారే పాలనురుగులా ఉండేవోడు. ముమ్మారు మరిగించిన కాఫీలా అయిపోయాడు నా కొడుకు’ అని బాధపడి,‘నా బంగారం కదూ, పొలంలో పండే ధాన్యం, పాకమీద కాసే ఆనపకాయ, పెరట్లో పాడితో గడవకపోదు, ఇక్కడే ఉండిపోరా’ అంది. కొడుకు ఉద్యోగ వివరాలు అడిగాడు పెద్దాపురం.     

‘నాన్నా, ఆ ఉద్యోగం చెయ్యటం నావల్ల కాదు. ఎన్నేళ్లు చేసినా అంతే. పొలం అమ్మేద్దారి. ఏదైనా యాపారం చేద్దారి’ అన్నాడు కొండలరావు ఆశగా తండ్రికేసి చూస్తూ.
‘అవునయ్యా.. అదేం పొలం. రోడ్డుకి రెండు మైళ్ళలోన అక్కడో ముక్క, ఇక్కడో చెక్క.. పొలంలో పంజెయ్యటం మాట అటుంచి ఆ గట్లంపట పొలానికి ఓ పాలి ఎల్లోత్తే చాలు ఆరుసుట్లు అన్నం తినాల’ అంది అతని భార్య విసుగ్గా.

‘ఆపేహే నీ ఎదవ గోల. గట్లమ్మట ఎల్లడ మేటే, అది రివాజు మార్గం. రోడ్డార ఉండానికి అదేమన్నా బజ్జీ కొట్టంటే? భూంతల్లి. ఆమె ఏడుంటే ఆడకే ఎల్లాల. ఓ నేత పుడితే వొందమందిని పాలింతాడు. ఓ నియంత పుడితే వొందమందిని సాసింతాడు. అదే ఓ రైతు పుడితే వొందమందిని పోషింతాడని మా తాత చెప్పేవాడు. ఓ రెండు పంటలు పోయేటప్పటికి మీకు ఎవసాయమూ, నేనూ లోకువైపోయాం. ఏం ఇన్నాళ్ళూ మనకి తిండెట్టింది ఈ ఎవసాయమే కదా’ అన్నాడు పెద్దాపురం చుట్ట చివర చిదిపి నోట్లోపెట్టుకుంటూ.    

‘పోన్లే నాన్నా అమ్మొద్దులే. ఇక్కండతా చేపలేసి చేంతాడంత లావు గొలుసులు మెళ్ళో ఏసుకుని తిరుగుతా ఉంటే, నువ్వింకా మీ తాతలనాటి వరేసి వడ్డీ యాపార్లెంట తిరుగుతున్నావు. మనం కూడా  చేపల చెరువు తవ్వుదాం. పైగా మన చుట్టూ ఇప్పటికే తవ్వేశారు. భూమంతా చౌడుదేలి పోయుంటాది. పై ఏడు నువ్వు వరేసినా పండదు. నా మాటిను. లోను, గట్రా నేను చూసుకుంటాను. ‘జీరో కౌంటు’ చేప్పిల్ల ఇరవై రూపాయలకి దొరుకుతాదంట. తెచ్చి ఏద్దారి. నాలుగు ఫేన్లు ఎడదారి. ఇదేశాల నించి మంచి మేత ఒత్తంది. అది గనుక ఎడితే నాలుగు నెలల్లో చేప హీనంలో కేజీన్నర తూగుతాదంట. 

రెండెకరాలూ తవ్వితే రెండు వేల పిల్లలు పడతాయి. పట్టుబడి కొచ్చేసరికి మూడు టన్నులొత్తాయి. టన్ను తొంబై ఏలు పలుకుతోంది. కర్చులు పోనూ లచ్చ నికరంగా మిగులుతాది. ఇటుపై ఎవసాయం నాకొదిలెయ్‌ నాన్నా. నువ్వు కులాసాగా చుట్ట కాల్చుకుంటూ అరుగుమీద కూర్చో’ అన్నాడు కొండలరావు తండ్రికేసి ఆశగా చూస్తూ. మొగుడితో విసిగిపోయిన ఆ ఇల్లాలు, సొంత రక్తం మీద నమ్మకంతో వత్తాసు పలికింది. 

‘నువ్వు చెప్పేది బాలేదు అంటానికి నాకాడ రుజువుల్లేవురా. నీ ఇట్టం. పోతే, నీ ఉద్యోగం.. నువ్వు చెప్పేదాన్ని బట్టి వయసులో ఉన్నావు కాబట్టి ఓసోట కూకోడం నీకు నప్పలేదురా. ఆ కులాసాగా కూకునేదేదో నేనే అక్కడ కూకుంటా. ఆ ఉద్యోగం నాకిత్తారేమో కనుక్కో. నేసేసిన అప్పు నేనే తీర్చుకుంటా. నీ మీదెందుకు రుద్దటం’ అన్నాడు పెద్దాపురం మెత్తబడుతూ.  
‘ఓస్‌ అదెంత పని నాన్నా. మా దాంట్లో రోజుకొకరు మానేత్తా ఉంటారు. నువ్వూ దిట్టంగానే ఉన్నావు, పైగా ఏడు వరకూ చదివావు కదా. అది చాలు. మా సూపర్‌ వైజర్‌తో మాట్లాడి నా బదులు నిన్నెడతా’ అన్నాడు కొండలరావు హుషారుగా.    
మారబోతున్న వారి జాబులకీ,  జాతకాలకీ శుభం పలుకుతూ కనుమ ముస్తాబైన పశువులు తలలూపాయి. 
∙∙ 
కొత్తగా వేసుకున్న యూనిఫామ్, దగ్గరగా చేయించుకున్న క్రాఫు, చెప్పులు కూడా ఎరగని కాళ్ళకి బూట్లు, దర్జాగా కూర్చోడానికో కుర్చీ, అపార్ట్‌మెంట్‌ ఎంట్రెన్స్‌లో కుర్చీ వేసుకుని కూర్చుంటే ‘ఈ కోటకి నేనే రాజుని’ అన్నంత గర్వంగా అనిపించింది పెద్దాపురానికి. ఎవరైనా వస్తే లేచి తలపాగా సంకలో పెట్టుకుని దణ్ణంపెట్టడం ఎలాగూ అలవాటే. ఇక్కడ తలపాగా బదులు టోపీ, దండం బదులు సెల్యూట్‌. నాలుగు నెలలవడంతో పనులన్నీ అలవాటౌతున్నాయి. ఇంతలో ఆటోలో ఓ పెద్దావిడ దిగింది. చేతిలో లగేజ్‌. మోకాళ్ళ నొప్పుల వల్ల ఒంగుని నడవలేక నడుస్తోంది. ఎదుటివాడి కష్టం పంచుకోవటమే తప్ప తల తిప్పుకోవటం ఇంకా అలవాటు కాని పెద్దాపురం గబుక్కున ఆవిడ చేతిలో సంచీ అందుకుని లిఫ్ట్‌ ఆన్చేసి ఇంటి వరకు వెళ్లి దింపొచ్చాడు. 

ఆవిడ అటూఇటూ కంగారుగా చూసి, అతనివైపు కృతజ్ఞతగా చూసి, ఓ పదిరూపాయలు ఇవ్వబోయింది. మర్యాదగా తిరస్కరించి కిందకి వచ్చేశాడు. ఇదంతా వాళ్ళింట్లో గొడవాడి మానేసి అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ గారింట్లో పన్లోకి జేరిన పనిమనిషి చాటుగా చూసి సదరు ప్రెసిడెంట్‌ గారి భార్యకి చెప్పింది. ఆవిడ ఆ ముసలావిడ కోడలు ఎన్నిసార్లు అడిగినా తన కిట్టీపార్టీలో జాయిన్‌ అవని కారణంగా, ఆ నియమాతిక్రమణ పరిష్కారం నిమిత్తం ఆ రోజు రాత్రి ఏడింటికి ఎమెర్జెన్సీ మీటింగ్‌ పెట్టించింది. ముసలావిడ మొయ్యలేని బ్యాగ్‌ అందుకోవడం ఇక్కడ నేరమని తెలియని పెద్దాపురం బెదిరిపోయి, అందరికీ విడివిడిగా క్షమాపణలు చెప్పాడు. మరోసారి జరగదని హామీ ఇచ్చాక, తిట్టి వదిలిపెట్టారు. రిలీవర్‌ వచ్చాక డ్యూటీ అప్పజెప్పి దిగులుగా రూముకి బయలుదేరాడు. 
∙∙ 
పిల్లి, రెండు సీక్వెన్స్‌లు, ట్రిప్లేట్‌తో పన్నెండు ముక్కలైపోయాయి. ఎక్స్‌టెన్షన్‌ వస్తే ఆట. ముక్కలు ముడిచి, చుట్ట వెలిగించాడు పెద్దాపురం. ఈ కట్టు కొడితే కొండగాడికో చొక్కా కుట్టించొచ్చు. రెండు రౌండ్లు తిరిగాయి. వచ్చిన ముక్క వచ్చినట్టు కొడుతున్నాడు. తన పైనున్నోడు ముదురు. డిస్కార్డ్‌ బాగా ఆడుతున్నాడు. పేకలోకెళ్ళాడు. సీక్వెన్స్‌కి ఎక్స్‌టెన్షన్‌ వచ్చింది. అంతే వేస్ట్‌ కార్డు గట్టిగా కొట్టి మూసి ఆట చూపించాడు. ఆ కొట్టడంలో ఎగుడు దిగుడుగా ఉన్న దుప్పటీ మడతకి తగిలి మూత కార్డ్‌ కూడా తిరిగబడి పోయింది. అంతే అందరూ ఒక్కసారిగా ‘‘రాంగ్‌ షో’’ అని అరిచారు. ఏమీ మాట్లాడలేక, కౌంట్‌ డబ్బులు అక్కడ పెట్టేసి చెప్పులేసుకుని బైటకి నడిచాడు పెద్దాపురం.  
 మాటిమాటికీ చేతిలో ఫోన్‌ చూసుకుంటూ ఈ ఉద్యోగానికి రేపట్నించి రానని సూపర్‌వైజర్‌కి చెప్పడానికి బయల్దేరాడు. 

పట్నంలో ఉండటం ఇబ్బందిగా ఉంది. ఊర్లో ఉదయాన్నే దబ్బాకువేసి పులవపెట్టిన తరవాణి అన్నంలో వాము, గానుగనూనె వేసుకుని తింటే కడుపులో చల్లగా ఉండి, మళ్ళీ రాత్రి ఇంటికొచ్చే వరకూ ఆకలి తెలిసేది కాదు. ఇక్కడ పొద్దున్నే ఇంటిపక్క బడ్డీలో తినే నాలుగు నాజూకు ఇడ్లీలూ పదకొండో గంటకి అరిగిపోతున్నాయి. హోటల్‌ తిండి పడటం లేదు. కొత్తలో డ్యూటీ బానే ఉన్నా ముందురోజు జరిగిన మీటింగ్‌తో బెదిరిపోయాడు. చేపలు బానే కండ పట్టాయని కొడుకు మొన్నే ఫోన్‌ చేశాడు. బహుశా ఈరోజు దింపుతాడు. నాలుగు టన్నుల వరకూ రావొచ్చని చెప్పాడు. ‘ఏదో టయానికి కొండగాడి ఫోన్‌ రావాలి. దేవుడి దయవల్ల చేపల యాపారం బాగా సాగితే ఈ ఏడు ఆడి పెళ్లి చేసేసి హాయిగా మనవలతో ఆడుకోవచ్చు’ అనుకుంటూండగా కొండలరావు ఫోనోచ్చింది. ‘ఆ చెప్పరా కొండా, దింపుడు ఎంతొచ్చింది? ఎన్ని టన్నులయ్యాయి? టన్ను ఎంత పలికింది?’ ఆత్రంగా అడుగుతున్నాడు పెద్దాపురం .

‘నాన్నోయ్‌. మన చెరువులో ఎవరో ఎండ్రిన్‌ కలిపేశారు. చేప తిరగబడింది’ కొండలరావు. 
నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. సూపర్‌ వైజర్‌ దగ్గరకి వెళ్ళే వాడల్లా వెనక్కి తిరిగి రూమ్‌కి వచ్చేశాడు పెద్దాపురం. వేసుకున్న బట్టలు విప్పేసి, తలుపుకి తగిలించిన యునిఫారం తీసి వేసుకున్నాడు. జారిపోతున్న ప్యాంటుని బెల్టుతో బిగించాడు. వరికొయ్యల మళ్ళో నడిచిన పాదాల పగుళ్ళ కన్నా అలవాటు లేని షూ కరిచిన వేళ్ళు ఎక్కువ నొప్పెడుతున్నా, సాగిపోయిన సాక్సులతో వాటిని కప్పేసి, షూ లేసులు బిగించి, కొండంత దిగులు తోడురాగా డ్యూటీకి బయల్దేరాడు పెద్దాపురం.. పొలం అమ్ముకోవడం కన్నా తలమ్ముకోవడం సులువనిపించి. 
 
- ఉమా మహేష్‌ ఆచాళ్ళ 

చదవండి: మరోకథ: పులి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement