Paidipala
-
కథ: చూడలేని కళ్లు
సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే ‘గౌతమి’ ఎక్స్‌ప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఆయాసపడుతూ హడావిడిగా మా‘బే’ లోపల కొచ్చింది. కూడా వచ్చిన సిబ్బంది బెర్త్ నెంబర్ల కేసి ఎగాదిగా చూసి ‘అమ్మ గారూ, మీ బెర్త్ యిదే’ అంటూ నా పై నున్న మిడిల్ బెర్త్ కేసి చూపించారు. సూట్ కేస్ లోయర్ బెర్త్ కింద సర్ది బ్రీఫ్‌కేస్ ఆవిడ చేతికందించి వెళ్లొస్తాం అమ్మగారూ, జాగ్రత్తండి’ అంటూ వినయంగా నమస్కరించి రైలు కదులుతుండగా బయటకు పరుగెత్తారు. ఖాళీగా ఉన్న నా యెదుటి సీట్లో కూర్చున్న ఆమె ముందుగా హేండ్ బ్యాగ్‌నూ, ఆ తరువాత బ్రీప్కేస్నూ తెరిచి దేని కోసమో వెతుకుతూ గాబరాపడ్డం నేను గమనించాను. ‘మేడమ్ మీరేమైనా మర్చిపోయారా?’ అంటూ మర్యాద కొద్దీ పలకరించాను. ‘ఫర్వాలేదు లెండి బయల్దేరే తొందరలో షుగర్ టాబ్లెట్స్ మర్చిపోయాను’ అందామె కంగారు నణుచుకొంటూ. ‘ఇవి చూడండి. మీకు పనికొస్తాయేమో’ అంటూ నా దగ్గరున్న స్ట్రిప్ తీసి యిచ్చాను. ‘థాంక్స్, రక్షించారు. నేను వాడుతున్న టాబ్లెట్స్ యివే’ అంటూ నేను ఫర్వాలేదు వుంచమంటున్నా వినకుండా ఒక్క టాబ్లెట్ మాత్రం తీసుకొని మిగిలినవి యిచ్చేశారు. ‘మీరెంతవరకు?’ మార్యదపూర్వకంగా అడిగారు. ‘రాజమండ్రిలో దిగి అమలాపురం వెళ్లాలి’ ‘అమలాపురమా? మీరు లెక్చర ర్ వనమాలి గారు కానీనా?’ ‘అవునండీ. మీకెలా తెలుసు?’ అన్నాను కించిత్ ఆశ్చర్యపడుతూ. ‘నమస్కారమండీ. మిమ్మల్నెక్కడో చూసినట్టుందని యిందాకటి నుంచీ అనుకుంటున్నాను. నేను ‘లు’ గారి మిసెస్.. గీతని’ నేను తుళ్లిపడ్డాను. అంతటి ఉన్నత స్థితిలో వున్నావిడ రైల్లో ప్రయాణించడం నమ్మశక్యం కాలేదు. ‘అలాగాండీ, మిమ్మల్నిలా కలవడం చాలా సంతోషం’ నా మాటలు పూర్తి కాకుండానే టికెట్స్ ‘చెక్’ చెయ్యడానికి టి.టి.ఇ. వచ్చాడు. ఆమె మొహమాటపడుతూ తను కూర్చున్న లోయర్ బెర్త్ ఖాళీయేనా అని అడిగింది. ‘సారీ, అది వరంగల్ కోటాది’ అని చెప్పి అతను వెళ్లిపోయాడు. ‘నా లోయర్ బెర్త్ మీరు తీసుకోండి’ ‘థాంక్స్. మీ కిబ్బంది లేకపోతే అలాగే’ ‘అదేం లేదు. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మి’ ‘రక్షించారు. చూస్తున్నారుగా నాది స్థూలకాయం. అందుకని మీకు కొంచెం అసౌకర్యమయినా మీ ఆఫర్‌ని కాదనలేకపోతున్నాను’ ఆమె నిష్కాపట్యం, నిరాడంబరత నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆమెతో మాట్లాడ్డానికి నేను సంశయిస్తున్నా ఆమె కలుపుగోలుగా నన్ను మాటల్లోకి దించింది. సహజంగా మా సంబాషణ ‘లు’ గారి చుట్టూనే నడిచింది. ‘లు’ గార్కి నా పట్ల ఉండే అభిమానం గురించి చెపుతూ మధ్యలో చిట్టిబాబు ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటీవల చిట్టిబాబు తరచుగా వాళ్లింటికి వస్తున్నాడనీ, కులం ముడితో ‘లు’ గారి దగ్గర చనువు పెంచుకున్నాడనీ చెపుతూ నేను అదిరిపడే ఓ ప్రశ్న వేసింది. ‘ఈ మధ్య మీరూ చిట్టిబాబు ఏమైనా గొడవ పడ్డారా?’అని! ‘అలాంటిదేమీ లేదే. చిట్టిబాబు నాకంత సన్నిహితుడు కూడా కాదు. అసలు మీకా అనుమానమెందు కొచ్చింది?’ అన్నాను విస్తుపోతూ. నిజానికి ఆమె ప్రశ్న నేను తికమకపడుతున్న ఓ ‘పజిల్ని’ కదిపింది. ‘అవునా? మరి మీకంత క్లోజ్ కానప్పుడు ‘లు’ గారి దగ్గర తరచుగా మీ గురించి యెందుకు మాట్లాడుతుంటాడు?’అందామె ఆసక్తిగా. ‘ఈ విషయం కూడా నాకు తెలియదు. మీరు చెపుతుంటే మొదటిసారి వింటున్నాను..’ ఆమె చెప్పిన సమాచారం నాకు ఆందోళనను కలిగించిన మాట నిజం. నేను ‘లు’ మధ్యలో చిట్టిబాబు – మాదొక కాకతాళీయమైన సమీకరణం. దానికింత పొడిగింపు.. నా జ్ఞాపకాలు చిట్టిబాబు పరిచయాన్ని తవ్వడం ప్రారంభించాయి... ∙∙ రెండు మూడేళ్ల క్రితం వరకు నాకు చిట్టిబాబు యెవరో తెలియదు. అతను నాకు మార్నింగ్ వాక్‌లో తారసపడిన వ్యక్తుల్లో ఒకడు. జ్యూయలరీ షాపు యజమానిగా తనంత తాను పరిచయం చేసుకొన్నాడు. ఆ తర్వాత రోడ్ మీద కలిసినప్పుడల్లా పత్రికల్లో వచ్చిన నా రచనల గురించో నా వార్తల గురించో చెప్పి నన్ను అతిశయోక్తులతో మెచ్చుకొనేవాడు. అలాంటి స్వల్ప పరిచయంతో ఓ రోజు పొద్దుటే నన్ను వెదుక్కొంటూ వచ్చి మా యింటి తలుపు తట్టాడు. మడత నలగని తెల్లని బట్టలు, వాటికి మాచ్ అయ్యే తెల్లటి చెప్పులూ, మెడలో నులకతాడు లాంటి బంగారు గొలుసు, చేతి వేళ్ల నిండా వుంగరాలు... రోడ్ మీద చూసినప్పటి కంటే భిన్నమైన ‘గెటప్’లో వున్న ఆ మనిషిని వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అయినా మొహమాటపడుతూ లోపలకు పిల్చి కూర్చోమన్నాను. ‘లు’ గారు మీ ఇంటి కొచ్చినట్లు నిన్నటి పేపర్లలో ఫొటోలతో సహా వేశారు. తమరు చూశారా?’ అంటూ ఓ పేపర్ కటింగ్ నా కందించాడు చిట్టిబాబు. అప్పటికి గుర్తుపట్టాను – అతనెవరో!. వనమాలి యింట ‘డి.వి.లు’,‘హల్ చల్’ అంటూ జిల్లా ఎడిషన్‌లో వచ్చిన ఆ వార్త నేను చూసిందే! ‘డి.వి.లు’ పత్రికల్లో తరుచుగా పేరు కనిపించే ‘సెలబ్రిటీ’. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘కైట్స్’ చైర్మన్. ఆయనను ఇటీవలే ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది కూడా. మొన్న కోనసీమలోని దేవాలయాల్ని దర్శించుకొని వెళ్తూ వెళ్తూ చెప్పాపెట్టకుండా మా యింటి కొచ్చారు. ఆయన వెంటబడిన పత్రికా విలేకరులు దానికి ప్రాముఖ్యమిచ్చి ఆర్భాటంగా రాశారు. ఆ న్యూస్ చూసి అయిదారుగురు పరిచయస్థులు తమ సంబంధీకులకు ‘కైట్స్’లో వుద్యోగాలిప్పించమని నన్ను సతాయించారు. డబ్బు ఆశ కూడా చూపించారు. ‘లు’ గారు మా యింటికి రావడం కాకతాళీయం తప్ప ఆయన దగ్గర నాకంత పలుకుబడి లేదని చెప్పి తప్పించుకొనే సరికి నా తలప్రాణం తోక కొచ్చింది. మా యింటికెప్పుడూ రాని చిట్టిబాబు కూడా అలాంటి బాపతేనని అనుమానించి అతను అడక్కుండానే పని చెప్పే సరికి సిగ్గుపడ్డం నావంతయింది. మా వూళ్లో భారీ స్థాయిలో చిట్టిబాబు ప్రారంభిస్తున్న మెగా జ్యూయలరీ షాపును ఓపెన్ చేయ్యడానికి ‘లు’ గార్ని ఒప్పించమని అతని కోరికట! అతని కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా యిలాంటి ప్రారంభోత్సవాలకు సినీ రాజకీయ రంగాలకు చెందిన గ్లామరున్న వాళ్లను పిలుస్తుంటారు. అలాంటిది యెంత కార్పొరేట్ దిగ్గజమైనా ‘డి.వి.లు’ను కోరుకోవడంలోని ఆంతర్యం నాకర్థం కాలేదు. పిల్చేవాడి మాటెలా వున్నా ‘లు’కి ఈ పని మీద వచ్చే కోరిక, తీరిక వుంటాయా? అదే మాట చిట్టిబాబుకు చెప్పాను. ‘క్షమించాలి గురువుగారూ. మీరాయనను వుద్యోగాలూ వుపకారాలు అడగడం లేదు. ఆయన రాక వల్ల మన ప్రాంతంలో మీ విలువ, నా విలువ పెరుగుతాయి. ఆయన పేరు మారు మోగిపోతుంది. దయచేసి మీరు కాదనకండి.’ చేతులు పట్టుకొని బ్రతిమాలుతున్న చిట్టిబాబును కాదనలేక, ఆ కాదనే మాటేదో ‘లు’ గారే అంటారని ఆయనకు ఫోన్ చేశాను. అదృష్టవశాత్తు ఫోన్ చెయ్యగానే దొరికాడు. నే నన్నట్టుగానే తనలాంటి వాణ్ణి యెందుకు పిలుస్తున్నారంటూనే ముక్తాయింపుగా ‘మీ మాట కాదనలేకపోతున్నాను. ఆయనను రమ్మనండి చుద్దాం’ అని చిన్న ఆశను కల్పించాడు. అది కంటితుడుపు అని నేననుకున్నా చిట్టిబాబు మాత్రం గంపెడాశతో సంబరపడిపోతూ నాకు మళ్లీ థాంక్స్ చెప్పి హైదరరాబాద్ వెళ్లాడు. వారం తిరక్కుండా ‘లు’ గారు ప్రారంభోత్సవానికి అంగీకరించారనే శుభవార్తతో పాటు ఓ పళ్లబుట్టను కూడా మా యింటికి మోసుకొచ్చాడు. ఫంక్షన్‌కి నాతో పాటు నా శ్రీమతి కూడా రావాలని యిద్దర్నీ ఆహ్వానించి, వస్తామని వాగ్దానం చేయించుకొని మరీ వెళ్లాడు... ‘ఇతనేదో అమాయకుడనుకున్నాం గాని కార్యసాధకుడే. కానీ వాలకం చూస్తే నమ్మదగిన మనిషిలా లేదు. ఎక్కడి మద్దెల అక్కడ వేసి పబ్బం గడుపుకొనే బాపతులా వున్నాడు. ఇలాంటి వాణ్ని ‘లు’ గారంతటి పెద్దాయన దగ్గరకు చేరనిస్తే రేపు మీకు ‘మేక’వుతాడేమో చూడండి’ అని హెచ్చరించింది చిట్టిబాబును అంచనా వేస్తూ నా శ్రీమతి. ‘నీ కన్నీ అనుమానాలే. అవసరం కొద్దీ చిట్టిబాబు మన దగ్గర కొచ్చాడు గాని ఆ తర్వాత అతనెవరో మన మెవరమో! ఇక ‘లు’ గారిది, నాది కృష్ణ కుచేలుర లాంటి అనుబంధం. ఆయనకు యెంత అభిమానం లేకపోతే మొన్న మనింటి కొచ్చాడు?’ ‘అవును– ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతున్నాడు కదా..మరి పేరు అలావుందే?’ ‘ఓహ్! అదా నీ సందేహం? అతనిదీ నాదీ ఒకే వూరని యిది వరకెప్పుడో చెప్పాను కదా. అతని అసలు పేరు వెంకటేశ్వర్లు. ఇంటి పేరు దున్నపోతు. కార్పొరేట్ రంగంలో తెలుగు తెలిసిన వాళ్లు హేళన చెయ్యకుండా, తెలుగు రానివాళ్లు తన పేరును ఖూనీ చెయ్యకుండా తన పేరును తెలివిగా ‘డి.వి.లు’గా మార్చుకొన్నాడు. ఈ రహస్యం ఆయన యెవరికీ చెప్పరు. ఎవరికో కాని తెలియదు. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో మా నాన్న గారి దగ్గర చదువుకొన్నాడట. పేద కుటుంబంలో పుట్టి యెన్నో కష్టాలనుభవించి పట్టుదలతో చదువుకొని ఈ స్థాయికెదిగాడట. నువ్వు పొరపాటున కూడా ‘లు’ గారి వ్యక్తిగత విషయాల గురించి యెక్కడా నోరుజారకు సుమా..’ ‘నాకలాంటి సందర్భమే రాదు. సరేనా?’ అంటూ తను హామీ యిచ్చింది. మేమూహించిన దాని కంటే గొప్పగా చిట్టిబాబు ‘మెగా జ్యూయలరీ షోరూమ్’ ప్రారంభోత్సవం జరిగింది. ఊరంతా ప్లెక్స్‌లు ఏర్పాటు చేసి వూరేగింపుగా పూర్ణ కుంభ స్వాగతంతో ‘లు’ను షోరూమ్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఆయన కూడా చాలా ఉల్లాసంగా కనిపించారు. రిబ్బన్ కత్తిరించిన తర్వాత ‘లు’ ప్రసంగిస్తూ మా మైత్రీబంధాన్ని ప్రస్తావించి అదే తననీ కార్యక్రమానికి రప్పించిందని చెప్పడంతో అభిమానుల చప్పట్లు మారు మ్రోగాయి. చిట్టిబాబు కృతజ్ఞతాపూర్వకంగా ‘లు’గారి నక్షత్రానికి అనువైన రాయితో చేయించిన వుంగరాన్ని ఆయనకు బహుకరించడమే కాకుండా వద్దంటున్నా వినకుండా నా శ్రీమతికి ఓ వెండి పూలసజ్జను వాళ్లావిడ చేత యిప్పించాడు. అలా చిట్టిబాబుతో యేర్పడ్డ అనుబంధం క్రమక్రమంగా పెరిగి మా యింటి పనులేమైనా వుంటే అతను పూరమాయించి చేయించి పెట్టే వరకు వచ్చింది. ప్రథమ వార్షికోత్సవం నాటికి చిట్టిబాబు వ్యాపారం మూడు వడ్డాణాలు, ఆరు అరవంకెలుగా సాగుతోందని తెలిసి ఆనందించాను. అయితే బిజినెస్ ఒత్తిడి వల్లనేమో యిది వరకటిలా అతను కనిపించడం లేదు. మా ఆవిడ ఫోన్ చేస్తే చాలు ‘మేడమ్ గారూ’ అంటూ వచ్చి వాలిపోయే అతని మనుషులు ఆవిణ్ని యిప్పుడంతగా పట్టించుకోవడంలేదు. ఆమె చిట్టిబాబు అవకాశవాదాన్ని తిట్టిపోస్తోంది. నాకు చిట్టిబాబు గురించిన దిగులు లేదు కాని యిటీవల ‘లు’ మౌనం నన్ను కలవరపెడుతోంది. ఎంత బిజీగా వున్నా నెలకు ఒకటి రెండు సార్లుయినా ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కొనే మనిషి నేను ఫోన్ చేసినా పలకడం లేదు. అతను ఏ విదేశీ పర్యటనలోనో వుండి నా కాల్స్ చూడలేదని మొదట్లో సరిపెట్టుకున్నా దేశంలో అతనికి సంబంధించిన వార్తలు నన్ను వెక్కిరిస్తున్నాయి. ‘లు’ ఆలోచనలతో ‘వర్రీ’ అవుతున్న నన్ను మా శ్రీమతి పిలుపు ఈ లోకంలోకి తెచ్చింది. ‘మన శశకి ‘కైట్స్’లో ఇంటర్వ్యూ వున్నట్లు మీతో చెప్పాడా? ఈ రాత్రికి బయల్దేరుతున్నాడు’ ‘వెళ్లమను. డబ్బు కావలిస్తే నా పర్సులో ఉంది తీసుకోమను’ ‘డబ్బు గురించి కాదు. కైట్స్ చైర్మన్ ‘లు’ గారు మీ ఫ్రెండ్ కదా. ఆయనకు ఫోన్ చేసి అబ్బాయి ఇంటర్వ్యూ కొస్తున్నట్లు మీరో మాట చెప్పొచ్చు కదా!’ అంది నా శ్రీమతి నా నిర్లిప్తతకు విస్తుపోతూ. ‘ఆయన యిది వరకటిలా లేడు. నేను ఫోను చేసినా ఉలుకుపలుకూ లేదు. ఎంత యెత్తులో వుంటే మాత్రం అంత పట్టించుకోని వాణ్ని నన్ను ప్రాధేయపడమంటావా?’ ‘బావుంది. సొంత కొడుకు కోసం ఓ మెట్టు దిగితే అవమానమా?’ ‘అవమానమని కాదు, అంత అవసరం లేదు. మన వాడికి మెరిట్ వుంది. ఇక్కడ కాకపోతే యెక్కడైనా వాడికి ఉద్యోగ యొస్తుంది’ ‘ఎక్కడైనా వేరు. ఇది పేరున్న సంస్థ కదా. కనీసం ‘లు’ గార్కి ఓ లెటరైనా రాసివ్వండి’ అర్ధాంగి అభ్యర్థనను తోసి పుచ్చి యింట్లో అశాంతిని కోరి తెచ్చుకోవడం యిష్టం లేక మధ్యే మార్గంగా శశిని పిల్చి నా విజిటింగ్ కార్ట్ యిచ్చి ఇంటర్వ్యూకి ముందు ‘లు’ గార్ని కలవమన్నాను. శశికి తప్పకుండా ‘కైట్స్’లో ఉద్యోగ మొస్తుందనే నమ్మకంతో వున్న నేను వాడు తిరిగొచ్చి చెప్పిన సమాధానం విని దిగ్భ్రంతుణ్ణయాను. శశిని ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటాడనుకున్న వేంకటేశ్వర్లు ‘అలాగా, చూస్తాను’ అంటూ నేనెవరో తెలియనివాడిలా ముక్తసరిగా మాట్లాడి పంపించేశాడట! ఆ తర్వాత ఇంటర్వ్యూలో శశి పెర్ ఫార్మెన్స్ చూసి కమిటీ మెచ్చుకున్నా చివరకు నిరాశే మిగిలిందంట!. వారం తరువాత శశిని ఇంటర్వ్యూ చేసిన కంపెనీ ‘హెచ్. ఆర్’ ఆశ్చర్యంగా మా యింటికొచ్చాడు. అతను మా వాడికి వాళ్ల అమ్మాయి నిచ్చే ప్రపోజల్‌తో నేరుగా మాతో మాట్లాడ్డానికి వచ్చాడట. వాళ్లమ్మాయి బయోడేటా, ఫొటో మాకు న చ్చాయి. అవి అబ్బాయి చూసిన తర్వాత, ఆమెరికాలో వున్న మా అమ్మాయి కూడా ఓ.కె. చేస్తే ఏ విషయమూ ఆయనకు తెలియజేస్తామని చెప్పాం. వెళ్తూ వెళ్తూ ఆ హెచ్. ఆర్ శ్రీపతి చెప్పిన విషయం విని నేను ‘షాక్’కు గురయ్యాను. ‘మీ సంబంధం కోసం మేమంతకాలమైనా వెయిట్ చేస్తాం. ‘కైట్స్’లో మీ వాణ్ని ఇంటర్వ్యూ చేసిన కమిటీకి చైర్మన్‌ను నేనే. మీ అబ్బాయి రియల్ టైమ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్.. సింప్లీ సూపర్బ్. అలాంటివాడు కంపెనికీ ‘ఎసెట్’ అవుతాడని మా కమిటీ అతన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసి లిస్ట్‌లో ‘టాప్’న పెట్టాం. కానీ మా అంచనాలకు విరుద్ధంగా ఆశ్చర్యకరంగా మా చైర్మన్ ‘లు’ గారు మీ వాణ్ని పక్కన పెట్టారు. ఆయన చెప్పిన కారణం మాకంత సమంజసంగా అనిపించలేదు. ఏదైనా వ్యక్తిగతమైన ‘ప్రెజుడీస్’ కావచ్చు అనుకున్నాం. పోన్లెండి. అతణ్ని యెవరైనా కళ్లకద్దుకొని యింతకంటే మంచి జాబ్ యిస్తారు..’’ నా మొహం వివర్ణం కావడం గమనించి శ్రీపతి సెలవు తీసుకొని కారెక్కాడు. శశి సెలక్ట్ కాకపోవడానికి కారణం ‘లు’ గారే అనే చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను...! ∙∙ శశి విషయంలో ‘లు’ ఉపకారం చెయ్యకపోతే పోయింది, అపకారం చేశారని తెలిసిన తర్వాత ఆయనకు నా పట్ల ద్వేషానికి కారణం తెలియక మథన పడుతున్న నాకు గీత ప్రశ్న ద్వారా ఒక క్లూ దొరికింది. – అది చిట్టిబాబు రాజేసిన నిప్పు అని! అయితే నా వల్ల యెంతో కొంత వుపకారం పొందిన చిట్టిబాబుకు నా మీద పగ యెందుకుంటుంది? ఇది మరో పజిల్! ‘చిట్టిబాబు మీ వారి దగ్గర తెచ్చే ప్రస్తావనలో నా గురించి ‘నెగెటివ్’గా మాట్లాడేవాడా?’ ‘సారీ, నిజం చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను’ అంటూ గీత నొచ్చుకుంది. ‘కాదు. నిజం చెప్పి నా మనసు తేలికపడేలా చేశారు. ఇన్నాళ్లూ ‘లు’ గార్కి నా మీద కలిగిన అపార్థానికి కారణాలు తెలియక మానసికంగా చిత్రహింసను అనుభవిస్తున్నాను. మేడమ్, చిట్టిబాబు నా మీద చెప్పడానికి నేరాలేమున్నాయి?’ ‘మా వారికో బలహీనత ఉంది. ఆయన యెంత కింది స్థాయి నుంచి వచ్చిందీ యెవరికీ తెలియకూడదని. అలాగే ఆయన పేరు గురించి కూడా. ఆయన పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలిసిన మీరే ఆ గుట్టు బహిరంగం చేస్తున్నారని చిట్టిబాబు మా వారికి నూరిపోశాడు’ అందామె యెవరైనా వింటున్నారేమోనని అటూయిటూ చూస్తూ. ‘అందువల్ల చిట్టిబాబు కొచ్చే ప్రయోజనం? అతనికీ నాకూ యెలాంటి శత్రుత్వమూ లేదే!’ ‘మాష్టారూ, మీరు రచయిత కూడా మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కాని అపకారం చెయ్యడానికి శత్రుత్వమే అవసరం లేదు – ఈర్ష్య చాలు! ఈర్ష్య, మనిషి కవల పిల్లలు. పక్కవాళ్ల యెదుగుదలను చూడలేకపోవడమనేది అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ల మధ్య, ఇరుగుపొరుగు మధ్య, సహోద్యోగుల మధ్య... ఇలా అన్ని చోట్లా వుంటుంది. అలాగే చిట్టిబాబుకి మా వారితో మీ స్నేహం చూసి కన్ను కుట్టింది. ఆ ‘శాడిజం’తో మీ మీద చాడీలు చెప్పాడు. దేవుడు అందాన్ని చూడమని మనిషికి కళ్లిస్తే మనిషి ఆ కళ్లను చూడలేక పోవడానికి వినయోగించడం దౌర్భగ్యం!!’ గీత వాక్ప్రవాహం గీతోపదేశంలా సాగుతోంది. ఇంతలో స్టేషన్ వచ్చినట్టుంది.. బండి ఆగింది. ప్రయాణీకులు కోలాహలంగా మా ‘బే’లో చొరబడ్డంతో మా సంభాషణ అక్కడితో ఆగిపోయింది! - డా. పైడిపాల చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
SP Balasubrahmanyam: జీవితాన్ని ప్రేమించిన బాలుడు
ఆబాలగోపాలం ‘బాలు’ అని ముద్దుగా పిల్చుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వజ్రోత్సవ (75 సంవత్సరాల) జయంతి నేడు. ఆ మహామనీషి మన మధ్యలేని ప్రథమ జయంతి. బాలు ఒక సంగీత విశ్వవిద్యాలయమనీ, ఆయన సంగీత సాహిత్యాలను సమంగా ప్రేమించారనీ సర్వులకూ తెలుసు. ఆయన సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమనీ, ఎదిగినకొద్దీ ఒదిగే వినయం ఆయన ఆభరణమనీ ‘పాడుతా తీయగా’ వీక్ష కులకు తెలుసు. ఆయన భాషాభిమానం విస్తృత సంగీత సాహిత్య పరిజ్ఞానం ఆ కార్యక్రమం ద్వారా వెల్లడయ్యాయి. వెరసి ఆదర్శ ప్రాయమైన వ్యక్తిత్వం గల ప్రతిభామూర్తిగా ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం పండిత పామర భేదం లేకుండా అందరికీ అభిమాన పాత్రులయ్యారు. ‘పుట్టినరోజు పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ అన్నారు ఒక పాటలో డాక్టర్ సి.నారాయణరెడ్డి. అలా తన పుట్టుక పరమార్థం తెలిసిన కారణజన్ముడు బాలు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలోను, రెండు మూడు ఇంటర్వ్యూలలోను బాలు జీవితంపట్ల తన ప్రేమను, సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నాకు కావలసినవన్నీ ఉన్నాయి. లగ్జరీస్ పట్ల కోరికలు లేవు. ఉండటానికి మంచి ఇల్లుంది. మంచి సంసారం ఉంది. బయటకు వెళ్తే నిల్చుని గౌరవించే మనుషులున్నారు. దేవుడు నాకిచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నాను. నాకిలాంటి జీవితం చివరి వరకు సాగాలనీ, నూరేళ్లూ నేను బతకాలనీ కోరుకుంటున్నాను. నాకు జన్మరాహిత్యం వద్దు. మళ్లీ జన్మ కావాలి. నేను మరుజన్మలో కూడా బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టి ఇలాగే గాయకుడినవ్వాలి. ఈ జన్మలో నేను చనిపోతే నిద్రలో చనిపోవాలి కానీ హాస్పిటల్‌కి వెళ్లకూడదు’ అంటూ జీవితంతో తన అనుబంధాన్ని, ఆశలను పునరుక్తం చేసేవారు. ఇప్పట్లో తన జోలికి చావురాదని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ‘శీతవేళ రానీయకు శిశిరానికి చోటీ యకు’ అని కృష్ణశాస్త్రి చెప్పినట్టు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లా సంగా నిత్యవసంతుడిలా ఉండేవారు. దురదృష్టవశాత్తు 2020 సెప్టెంబర్‌లో మృత్యువు కరోనా రూపంలో వచ్చి, దొంగదెబ్బ తీసి బాలును మనకు భౌతికంగా దూరం చేసినా– ఆయన నమ్మ కాన్ని మాత్రం వమ్ము చేయలేకపోయింది. కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువైన ఆయన మధుర స్మృతులను ఏ మహమ్మారీ చెరపలేకపోతోంది. ‘నా మాతృభాష సంగీతం’ అనే నినాదంతో 16 భాషల్లో సుమారు 40 వేల పాటల్ని ఆలపించి సంగీత ప్రపంచంలో శిఖ రాగ్రాన్ని అధిష్టించిన త్రివిక్రముడు బాలుడు. ‘స్నేహం చేసే ముందు అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. స్నేహం చేశాక మిత్రునిలో లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దాలి తప్ప, స్నేహాన్ని తెంచుకోకూడదు. అది దాంపత్య బంధం లాంటిది. కష్టమైనా నిష్టురమైనా భరించక తప్పదు’ అంటూ స్నేహాన్ని నిర్వచించి, నిజ జీవితంలో ఆచరించి చూపిన కర్మయోగి బాలు. తనకు సినీ గాయకునిగా జన్మనిచ్చిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి పేర రికార్డింగ్ థియేటర్‌ను నెలకొల్పి, హైదరాబాద్ రవీంద్ర భారతి ఆవరణలో ఘంటసాల విగ్రహాన్ని ప్రతిష్టించి, జేసుదాసుకు పాదాభిషేకం చేసి పెద్దలపట్ల గౌర వాన్ని, కృతజ్ఞతను చాటిన సంస్కారి బాలు. సీనియర్ గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు బాలు ఇచ్చిన గౌరవం ఆయన వినమ్రతకు తార్కాణం. సంగీత దర్శకుడు సత్యం, హీరో కృష్ణ, ఇళయరాజా వంటి ప్రముఖులతో వచ్చిన వివాదాలను బాలు పరిష్కరించుకున్న తీరు, అతని సంస్కారానికి మచ్చుతునకలు. కుడిచేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియనీయని వితరణశీలి బాలు. తండ్రి పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించి క్రీడా వైద్య రంగాలకు చెందిన వారితో సహా ఎందరో విద్యార్థులకు ఆయన గుప్తదానాలు చేశారు. చివరిలో పిత్రార్జితమైన ఇంటిని కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామికి ఉదారంగా ధారపోశారు. తన చరమదశలో ‘ఎస్పీబీ ఫ్యాన్స్ చారి టబుల్ ఫౌండేషన్’ ద్వారా కరోనా బాధితులను ఆదుకొన్న బాలు సేవా నిరతిని చూసి కరోనాకు కడుపు మండిందేమో అజాత శత్రువయిన ఆయననే కాటేసింది. ఎస్పీ బాలు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించిన ఆదర్శపుత్రుడు. హరికథా భాగవతార్ అయిన తండ్రి సాంబ మూర్తి కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్టించడమే కాకుండా ఆయన జీవిత చరిత్రను గ్రంథస్తం చేయించి ప్రచురించారు. తన సోదరి ఎస్పీ శైలజ, తనయుడు చరణ్ సినీ రంగంలో గాయనీ గాయకులుగా వారికి తగిన స్థాయిలో ఎదగకపోవడానికి తన క్రీనీడయే కారణమని మథనపడేవారు. ‘పాడుతా తీయగా’, ‘పాటశాల’ ద్వారా ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకు లను ప్రోత్సహించి కొందరిని వెండితెరకు కూడా పరిచయం చేసిన పెద్ద మనసుగల ఆచార్యుడు బాలు. ఆయన మరణాన్ని జయించిన యశఃకాయుడు. తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’లో రాసినట్టు– ‘జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అమృతంపు సోనను దోసిళ్లతో తాగి వచ్చినవాడు దుఃఖాన్నీ, చావునూ వెళ్లిపొమ్మన్న అమరుడు’ డాక్టర్ పైడిపాల సినీ గేయ సాహిత్య విమర్శకులు మొబైల్ : 99891 06162 చదవండి: SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం -
పొట్ట చించాక
ఆరుద్ర రచయిత్రి కె.రామలక్ష్మిని అభ్యుదయ వివాహం చేసుకున్నారు. ఆమె మీద ‘కె.రా. త్రిశతి’ అని మూడు వందల కవితలతో ఒక పుస్తకాన్ని రాశారు కూడా. అలాంటి రామలక్ష్మి ఒకసారి ఉదరానికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకోవలసి వచ్చింది. ఆమెను థియేటర్లోకి తీసుకెళ్లిన చాలా సేపటివరకూ లోపలినుంచి వైద్యులెవరూ వచ్చి ఏ కబురూ చెప్పకపోవడంతో ఆరుద్రకూ, సహచరులకూ ఆందోళన ఎక్కువైంది. తోటివాళ్లందరూ కంగారు పడుతుంటే ఆరుద్ర మాత్రం తాపీగా నవ్వుతూ– ‘‘పొట్ట చించారు కదా, అక్షరం ముక్క కోసం వెతుకుతున్నారేమో’’ అన్నారట. అంత క్లిష్ట సమయంలో కూడా ఆరుద్ర నిబ్బరానికీ, చమత్కారానికీ అంతా ఆశ్చర్యపోయామని ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి, రామలక్ష్మి దగ్గర ‘తాళ్లపాక వారి పలుకుబడులు’ పరిశోధన గ్రంథానికి సహాయకుడు అయిన ఎమ్వీఎల్ చెప్పేవారు. -డాక్టర్ పైడిపాల -
పెద్ద వ్యాఖ్యానం
సినీనటుడు జగ్గయ్య అరుదైన సాహితీవేత్త అని కొందరికే తెలుసు. తండ్రి సీతారామయ్య దగ్గర బాల్యంలో సంస్కృతాంధ్రాలను అభ్యసించిన జగ్గయ్య 15వ యేటే పద్యాలు రాశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్ టాగూరు వివిధ కవితా సంపుటాల్లోంచి 137 ఖండికలను యెంచుకొని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించారు. 1980లో అవి పుస్తకంగా వచ్చాయి. పురాణ ప్రబంధ కావ్యాలలోని విశేష ప్రయోగాల గురించి జగ్గయ్య షూటింగ్స్ లేని సమయాల్లో ఆ పరిజ్ఞానం గల విద్యావంతులతో చర్చించేవారు. అలా ఆయనకు దగ్గరైన వారిలో ‘ముత్యాలముగ్గు’ నిర్మాత, నూజివీడు కళాశాలలో ప్రధాన ఆంధ్రోపన్యాసకుడు అయిన ‘ఎమ్వీయల్’ ఒకరు. ఒకనాడు వాళ్లిద్దరి మధ్య ‘మను చరిత్ర’ ప్రథమాశ్వాసంలోని ప్రవరుని గుణగణాలకు సంబంధించిన ప్రసక్తి రాగా, ఎమ్వీయల్ ‘ఆపురి బాయకుండు’ పద్యంలో పెద్దన శైలిని ప్రశంసించారట. అప్పుడు జగ్గయ్య కలిగించుకుని పద్యాంతంలో ‘ప్రవరాఖ్యు డలేఖ్య తనూ విలాసుడై’ అనే ప్రయోగానికి తనదైన భాష్యం చెప్పారు. సంస్కృతంలో ‘తనూ’ శబ్దం స్త్రీ వాచకమనీ, అనేక పర్యాయ పదాలుండగా పెద్దన తనూ శబ్దం వాడ్డం ప్రవరుడు స్త్రీ అంతటి సౌకుమార్యం కలిగినవాడని సూచించడమేనని జగ్గయ్య ఆ పద ప్రయోగ రహస్యం గురించి వ్యాఖ్యానిస్తే ఆయన పాండిత్య పటిమకు ఎమ్వీయల్ అవాక్కయ్యారట! - డాక్టర్ పైడిపాల -
నాటకం నుండి సినిమానా? సినిమా నుండి నాటకమా?
(జూన్ 20 నాటి ‘తొలి తెలుగు సినీకవి’ చర్చకు కొనసాగింపు) 1. శ్రీకృష్ణతులాభారం నాటకానికి చందాల కేశవదాసు 22 పాటలు రాశారు. ఈ పాటలతో నాటకాన్ని ‘మైలవరం బాలభారతి నాటక సమాజం’ వారు చాలాసార్లు ప్రదర్శించారు. ఈ పాటల్లో బలే మంచి చౌక బేరము, మునివరా, కొట్టు కొట్టండిరా అనే మూడు పాటలే సినిమాల్లోకి ఎక్కాయి. (పైడిపాల రాసినట్లుగా) 1935, 55, 66 సంవత్సరాల్లో తీసిన మూడు సినిమాల్లోనూ ఈ మూడు పాటలున్నాయి. కేశవదాసు కుమారులు కృష్ణమూర్తి... రామానాయుడు మీద ఖమ్మం కోర్టులో కేసు గెలిచిన ఫలితంగా 1966లో సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా టైటిల్స్‌లో కేశవదాసు పేరు చేర్చడం జరిగింది. 2. పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకానికి కేశవదాసు 21 పాటలు రాశారు. అయితే, మొదట కవిగారు పాటలు చేర్చడానికి ఒప్పుకోలేదు. కాని మైలవరం బాలభారతి నాటక సమాజం పెద్దలు ఆయన్ని ఒప్పించారు. భక్తిగీతాలు మాత్రమే రాయాలని కవిగారు షరతు పెట్టి కేశవదాసుగారి పాటలతో నాటకాన్ని ప్రదర్శించడానికి ఒప్పుకున్నారు. ఈ పాటలను 1929లో కురుకూరి సుబ్బారావు అచ్చువేశారు. ఈ పాటల ప్రతి ఇప్పటికీ ఉన్నది. 3. సురభి నాటకంలోని మూడు పాటల్ని సినిమాలోకి ఎక్కించారని ‘ముక్తకంఠం’తో చెప్పిన పెద్దలు గౌరవనీయులు- వారి మాట శిరోధార్యమే. కాని నాటకం నుండి సినిమాకెక్కాయా? సినిమా నుండి నాటకంలోకి దిగినాయా? అనే సందేహానిక్కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మా తండ్రిగారు వెంకట నరసింహాచార్యులు దాసుగారి సమకాలికులు. జగ్గయ్యపేటలో ఒక హరికథాగానంలో ఉండగా హెచ్.ఎం.రెడ్డిగారి నుండి పిలుపు వచ్చిందనీ, తాను వెళ్లి ‘ప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసి వచ్చాననీ దాసుగారు చెప్పినట్లు నాన్నగారు నాతో అన్నారు. అయితే ఇది రికార్డు చేయలేకపోయిన పరిస్థితులలో ‘రుజువు’ చెయ్యలేకపోవచ్చు. కాని మా నాన్న చెప్పడం ద్వారా నేను విన్న విషయమది. దీని రుజువుల కోసం ప్రయత్నిస్తున్నాను. అంతవరకు ఇవే సంగతులు. పైడిపాలగారికి అభినందనలు. డా॥ఎం.పురుషోత్తమాచార్య 9396611905 -
సినిమా తోటలోకి కొత్త పాట ఒకటి వచ్చింది!
పాటతత్వం పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు... సినిమా పాటల్లో ఆ లక్షణాలు బొత్తిగా లేని పాటలు కొన్ని అరుదుగానే వచ్చాయి. అలాంటి అరుదైన పాటల్లో ఓ ఆణిముత్యం ‘ముత్యాల ముగ్గు’ చిత్రంలోని చివరి పాట. ఇది విద్వత్కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఏకైక చలనచిత్ర గీతం కావడం విశేషం! ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాలను మధించి ముప్ఫైకి పైగా కావ్యాలను, విమర్శనగ్రంథాలను రచించిన శేషేంద్ర సాహిత్య సంపద అంతా ఒక ఎత్తయితే ఈ పాట ఒక్కటీ ఒక ఎత్తనడం అతిశయోక్తి కాదేమో! ఈ ఒక్క పాటతో ఆయన తెలుగు సినీ గేయసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరును సంపాదించారు. జనసామాన్యానికి పాట గుర్తున్నంతగా ఆయన ‘శేషజ్యోత్స్న’, ‘మండే సూర్యుడు’, ‘గెరిల్లా’ ఇత్యాది కావ్యాలు గుర్తుండవు. అది సినిమా మాధ్యమం మహిమ కూడా కావచ్చు! శేషేంద్రగారి చేత ఈ పాట రాయించాలని ప్రతిపాదించిన కవితాప్రియుడు ‘మెలోడియస్ వాయిస్ ఆఫ్ లిటరేచర్’ అని పేరు పడిన ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత ఎమ్వీయల్. ‘ముత్యాల ముగు’్గ ఔట్‌డోర్ షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో ఇందిరా ధనరాజ్‌గిరి గారి ‘జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్’ ఒకటి కావడం కూడా ఈ ప్రతిపాదనకు దోహదం చేసి ఉండవచ్చు. బాపు దర్శకత్వాన్ని, ముళ్లపూడి వెంకటరమణ రచనను, కె.వి.మహదేవన్ సంగీతాన్ని, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణ దర్శకత్వాన్ని నిర్వహించగా ఆరుద్ర, సినారె, శేషేంద్ర శర్మ పాటలు సమకూర్చగా, మొదట్లో శ్లోకాన్ని, పాటను మంగళంపల్లి వారు ఆలపించగా దృశ్యకావ్యంలా రూపుదిద్దుకున్న ఈ కళాఖండానికి మొదటివారం ప్రేక్షకులు కరవయ్యారట! ఉత్తర రామాయణానికి సాంఘిక రూపమే ‘ముత్యాల ముగ్గు’ ఇతివృత్తం. సీతారాముల్లాంటి ఆదర్శదంపతులు లక్ష్మి శ్రీధర్‌లు. సినిమా కథ ప్రకారం లక్ష్మి, శ్రీధర్ల వివాహం కాకతాళీయంగా జరుగుతుంది. లక్ష్మి శ్రీధర్ మిత్రుని చెల్లెలు. లక్ష్మి వివాహం ఒక మోసగాడితో నిశ్చయమవుతుంది. ఆ పెళ్లికి తన తండ్రి తరఫున సహాయం అందించడానికి శ్రీధర్ వెళ్తాడు. వరుడు నిత్య పెళ్లి కొడుకని తెలిసి అతని అరెస్ట్‌తో పెళ్లి ఆగిపోవడంతో అపవాదుపాలయిన లక్ష్మి మెళ్లో మూడు మూళ్లు వేస్తాడు శ్రీధర్. ఆ గతాన్ని తలచుకొని తనను ఆపదలో ఆదుకొని జీవితభాగస్వామిని చేసుకున్న ఉన్నత సంస్కారం గల శ్రీధర్ తన జీవితంలో అనూహ్యంగా ఓ పాటలా అడుగు పెట్టి తనకు ఓదార్పును, కమ్మని కలలాంటి బతుకును ఇచ్చాడని- ఆమె మనసు తన అదృష్టానికి మురిసిపోతుంది. రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది అనే మొదటి చరణంలో శ్రీధర్ సాంగత్యంలో చిగురు తొడిగిన లక్ష్మి జీవితాన్ని కవి హృద్యంగా చెప్పారు. లక్ష్మి పెట్టిన రంగవల్లులను శ్రీధర్ తన్మయంతో తిలకించడం, దీపాలు వెలిగించుకోవడానికి అనువైన గూళ్లతో కూడిన తులసికోట ముందు లక్ష్మి పరవశమై నిలబడడం వంటి దృశ్యాలు కవి భావనకు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఇచ్చిన సహకారాన్ని తెలియజేస్తాయి. ఆలుమగల అన్యోన్యత శూన్యమైన వేణువుకు స్వరాలు ఒదిగినట్టుగా ఉందనడం, లక్ష్మి వైవాహిక జీవితాన్ని శిశిరానికి వీడ్కోలు చెప్పిన వసంతంలా భావించడం... మామూలు సినిమా పాటలకు భిన్నమైన రమణీయమైన భావచిత్రాలు! ‘విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినబడి, అంతలో పోయాయి...’ అనే పంక్తులు సహృదయులకు రసస్పందనను కలిగిస్తాయి. నిరాశామయ జీవితాన్ని గడుపుతున్న లక్ష్మి హృదయంలో ఆశ ఎలా దోబూచులాడిందో కవి ఎంత ఆర్ద్రంగా చెప్పాడు! ‘కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా నది దోచుకు పోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’... అనే ముక్తాయింపు గుండెలను పిండేస్తుంది. మానవసహాయం అందదని తెలిసి సీతాదేవిలాగే నాయిక ప్రకృతికి మొరపెట్టుకుంటుంది. దూరమవుతున్న నావను నది దోచుకుపోవడంగాను, మెరుపులా మెరిసి మాయమైన మనిషి కోసం అలమటిస్తున్న నాయిక ఆవేదనను రేవు విలపిస్తున్నట్టుగాను ఊహించడం కవి భావుకతకు పరాకాష్ఠ! నిజానికి ఈ పాటను శర్మగారు ఇంకా దీర్ఘంగా రాశారని, సినిమా పాట కొలతను దృష్టిలో పెట్టుకొని దానిని సంక్షిప్తీకరించామని ఎమ్వీయల్ చెప్పారు. ఎడిట్ చేసిన భాగంలో ఎన్ని అందాలు జారిపోయాయో మరి! జీవనసత్యాన్ని వెల్లడించే తాత్విక ప్రధానమైన గీతం కనుక, ఈ శీర్షికలో విశ్లేషణకు దీనిని ఎంచుకున్నాను. జీవితం చీకటి వెలుగుల, ఆశ నిరాశల ఊగిసలాట అనీ, సహనం వహిస్తే మంచికి అంతిమ విజయం లభిస్తుందని ఆశావహ దృక్పథంగల ఈ గీతానికి కవితాత్మ తోడు కావడం పూవుకు తావి అబ్బినట్లయింది. ఇది నిదురించిన సినిమా తోటలోకి దారి తప్పి వచ్చిన కమ్మని కలలాంటి పాటే! - పైడిపాల సినీగేయ సాహిత్య పరిశోధకులు -
ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి
చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడంనా దురదృష్టం! - శ్రీమతి పద్మావతీ ఆత్రేయ నేడు ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి మన‘సు’ కవి ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి! కానీ నిజ జీవితంలో ఆయన ‘మనసు’లేని వాడని కొందరి అభియోగం! నిజం చెపితే - ఆత్రేయ మనసు మూగది; మాటలు రానిది! ఆత్రేయ అర్ధాంగి శ్రీమతి పద్మావతి మనసు గొప్పది; మమత మాత్రమే తెలిసినది! దంపతులిద్దరూ మనస్కులే అయినా - ‘వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశ్రుతి? అది ఎలాగైనది విషాద గీతి?’ అని ఆత్రేయ రాసినట్టు వారి ‘సంసార వీణ’లో అపశ్రుతులు దొర్లడం విధివిలాసమంటారు ఇద్దరూ! ఈ అనుబంధంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని... ఆత్రేయకు చరమాంకంలో ఆయనకు సన్నిహితునిగానే కాక, తన అభిమాన పుత్రునిగా భావించే పైడిపాల ముందు మనసు విప్పి వెల్లడించిన శ్రీమతి పద్మావతి అంతరంగ ఆవిష్కరణం ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... నమస్కారం అమ్మా! మీ ఆరోగ్యం ఎలా ఉంది? పద్మావతి: ఆరోగ్యం ఏమాత్రం బావుండలేదు. నాకిప్పుడు 86 ఏళ్లు. సరిగ్గా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో మా మరిదిగారైన వింజమూరి వెంకటేశ్వర్లు గారింట్లో ఉంటున్నా. మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. గుర్తుపడతారా లేదా అనుకున్నాను. మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం, మర్చిపోవడం ఉండదు. మీతో పాటు మురారి, జగ్గయ్యగార్లను కూడా మర్చిపోలేను. ఆత్రేయ అసలు భార్య పేరు పద్మావతి అని, ఆమె బతికే ఉందని లోకానికి తొలిసారిగా చాటిచెప్పిన మీ ‘మనస్వినీ ట్రస్టు’ను ఎలా మర్చిపోగలను? 1990లో ఆత్రేయగారి పుట్టినరోజున (మే 7వ తేదీ) మద్రాసులో జరిగిన ‘ఆత్రేయ సాహితి’ ఆవిష్కరణ సభలో నన్ను స్టేజీ మీదకు పిలిచి సన్మానించి, ‘ఆత్రేయ సాహితి’ మొదటి ప్రతిని నాకు అందించారు కదా. ఆత్రేయ గారి అసలు పేరు....???? ఆత్రేయగారి అసలు పేరు కూడా ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులే! ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు. ఆయన మీకు పెళ్లికి ముందే తెలుసా? మీకు బంధుత్వముందా? వాళ్ల అయ్య శ్రీకృష్ణమాచార్యులు నాకు వరుసకు మేనమామ. మాది ముందు నుంచీ అనుకొన్న సంబంధమే. మా ఇద్దరికీ వయసులో ఆరేళ్ల తేడా. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా పుస్తకాలకు అట్టలు వేసిపెట్టడం, తెల్ల కాగితాల మీద రూళ్లు గీసిపెట్టడం ఆయనే చేసేవారు. మీది మొదటినుంచీ అనుకున్న మేనరికమే అయితే, ఆయన పద్యాల్లో రాసుకొన్న ఆత్మకథలోని ‘తొలిగాయం’లో ‘బాణ’మనే ప్రియురాల్ని సగోత్రం కారణంగా పెళ్లిచేసుకోలేకపోయానని బాధపడుతూ రాశారే? అది నిజమే. ఆయన స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ప్రేమించారు. బాణమనేది ఆమె ముద్దు పేరు. ఆమె పేరు కూడా పద్మావతే. ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమయ్యింది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల హాస్పిటల్లో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే కూడా, అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు. నర్స్ పద్మ గురించి మీరు చెప్పడం తప్ప, ఎవరికీ తెలియదు. కాని బాణం మాత్రం తన మనసుకు తొలిగాయం చేసి దూరమైందని అందరితో చెప్పుకునేవారట! వీణ వాయించడంలో నేర్పరి అయిన బాణానికి వేరొకరితో వివాహమైన తర్వాత ‘వీణ’ ప్రసక్తి వస్తే చాలు, బోరుమని ఏడ్చేవారని, ఆయన సినిమాల్లో అన్ని వీణ పాటలు రాయడానికి బాణం జ్ఞాపకాలే కారణమని చెపుతారు. మరి బాణాన్ని అంతగా ప్రేమించారని తెలిసి కూడా ఆత్రేయతో పెళ్లికి మీరెందుకు తలూపారు? ప్రేమ వేరు, పెళ్లి వేరు. టీనేజ్‌లో సర్వసాధారణమైన ప్రేమను తర్వాత మర్చిపోవడం సహజమనే అభిప్రాయంతో పెద్దలు మా పెళ్లి కుదిర్చారు. ఏమాటకామాట... నేను కూడా ఆత్రేయ గారిని చూసి ఇష్టపడ్డాను. అయినా మా అయ్యను పెళ్లికొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాను. మా అయ్య ఆ విషయం అడగటానికి ఆత్రేయ ఉంటున్న వాళ్ల మేనమామ జగన్నాథాచార్యుల గారింటికి వెళ్తే, ఆత్రేయ కనపడి ‘మీరొచ్చిన విషయం నాకు తెలుసు. పద్మతో పెళ్లి నాకిష్టమే’ అని చెప్పారట. అలా ఉభయుల అంగీకారంతో నా 13వ యేట 1940లో మా పెళ్లి జరిగింది. చెప్పడం మర్చిపోయాను. ‘శారదా యాక్టు’ వల్ల మా పెళ్లి కొంత కాలం వాయిదా పడింది కూడా. మీ పెళ్లికి ఆత్రేయగారి తరఫున పెద్దగా వ్యవహరించింది ఆయన తండ్రి కాకుండా మేనమామగారన్నమాట. తండ్రితో ఆత్రేయకు అంత సత్సంబంధాలు లేవా? లేకేం? ఆయన మీద గౌరవంతోనే బాణాన్ని పెళ్లి చేసుకోవడం మానుకొన్నారు. ఎటొచ్చీ తల్లి సీతమ్మ అనారోగ్యంగా ఉండగా, ఆయన అంతగా పట్టించుకోలేదని కోపం. తన చిన్నతనంలో తల్లికి దాయాదులు విషప్రయోగం చేసి చంపేశారని ఆత్రేయ అపోహ. ఆయనకు తల్లంటే అపరిమితమైన ఇష్టం. తల్లి దూరమైన ఊరు అనే ద్వేషంతోనే ఆయన ఉచ్చూరును విడిచిపెట్టి మేనమామ జగన్నాథాచార్యులగారి నీడన చేరారు. తల్లి మీద ప్రేమతో ఆత్రేయ అద్భుతమైన అమ్మ పాటల్ని రాశారు. ‘కలసిన మనసులు’, ‘పాపం పసివాడు’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ మొదలైన చిత్రాల్లో ఆయన ‘అమ్మ’ మీద ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాశారు.ఈ తరహా పాటలన్నింటికీ జ్ఞాపకాలే కారణమా? ఆయన స్వభావమే అంత! ఒక్క అమ్మనే కాదు - ఎవర్ని అభిమానించినా మర్చిపోలేననేవారు. పెళ్లయిన తర్వాత కూడా బాణాన్ని గుర్తుచేసుకోవడం వల్లనే మామధ్య పెళ్లయిన కొత్తలో స్పర్థలు కూడా వచ్చాయి. పెళ్లప్పటికి ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన చినమామ జగన్నాథాచార్యులుగారు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారట! దాంతో పత్రికల వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం! జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో మీ ఇంట్లో ఆత్రేయగారే ఘనంగా జరిపించారని, ఆ సందర్భంగా రాసిన కొన్ని పాటలు ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకున్నాయని గతంలో మీ ఉత్తరంలో నాకు తెలియజేశారు. మళ్లీ ఓసారి చెబుతారా? ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి ‘కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా’ అని రాశారు. అలాగే, ‘పెళ్లంటే పందిళ్లు సందళ్లు...’ అనే ‘త్రిశూలం’ చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే! ‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన..’ అనే ‘తోడికోడళ్లు’ చిత్రంలోని పాట గురించి కూడా ఎవరూ నమ్మలేని ఓ నేపథ్యాన్ని చెప్పారు. అది మీ మాటల్లో మళ్లీ వినాలనుంది... ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారట! దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు. ఆత్రేయగారికి మీరెలా దూరమయ్యారు? అన్ని సినిమాలకు రాసి సంపాదించిందంతా ఆత్రేయ ఏం చేశారు? మీకు మద్రాసులో సొంత ఇల్లు ఉండేది కదా! నిజానికి మీరడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి నా దగ్గర కాని, ఆయన దగ్గర కాని సరైన జవాబులు ఉండవు. ఆయన సినిమా ఫీల్డ్కి వెళ్లిన తర్వాత, కొన్ని సమస్యల్లో ఇరుక్కొని కాపురం పెట్టలేదు. కొంతకాలం పుల్లయ్యగారి ఆఫీసులో ఒక్కరే ఉన్నారు. 1954లో నన్ను మద్రాసు తీసుకెళ్లారు. ఆళ్వారుపేటలో చిన్న ఇంట్లో కాపురం. చుట్టూ పల్లెవాళ్లతో వాతావరణం ఇబ్బందికరంగా ఉండేది. అయినా ఎలాగో భరించి సహించేదాన్ని. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదు. అప్పుడప్పుడూ మాత్రమే వచ్చేవారు. ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదు. మీరన్నట్టు యాభైలలో అంత సంపాదన ఉండి మాకా దరిద్రం ఎందుకో నాకర్థమయ్యేది కాదు. ఇదిలా ఉండగా, 1956లో మా అమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, నేను మంగళంపాడు వెళ్లి వచ్చేసరికి పరిస్థితులు మారి, ఆయన నాకు కాకుండా పోయారు. సారీ, మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మిమ్మల్ని నొప్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ‘నల్ల కమల’ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారని, ఆమె ఇద్దరు కూతుళ్లనూ చివరి వరకూ తన పిల్లలుగా భావించి, పెళ్లిళ్ల బాధ్యతను కూడా ఆయనే తీసుకొన్నారని మద్రాసులో ఆత్రేయ కుటుంబం గురించి చెప్పుకునేవారు. అవన్నీ నిజాలా? ఆయన నల్ల కమలను చేరదీసిన మాట నిజం. అయితే, ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు. సహజీవనం చేశారు... అంతే! ఆత్రేయ కూతుళ్లుగా చెలామణీ అయినవాళ్లు, కమల అక్కగారి సంతానం. ఆవిడ 1978లో చనిపోయింది. అప్పుడు ఆత్రేయ భార్య చనిపోయిందని, అసలు భార్య ఎప్పుడో తెరమరుగైపోయిందని అందరూ అనుకొన్నారట! ఆ కుటుంబ భారం మీద పడేసరికి ఆయన సంపాదన, సొంత ఇల్లు... అన్నీ హరించుకుపోయాయి. జరిగిన అన్యాయానికి ఆత్రేయగారి పట్ల కోపం లేదా? లేవు. ఆయన దుర్మార్గుడు కాదు. నన్ను ఆయనెప్పుడూ ద్వేషించలేదు, దూషించలేదు. నా గురించి చాలా బాధపడేవారు. నా జీవితాన్ని పాడుచేశాను అని పశ్చాత్తాపపడేవారు. ఊబిలో దిగాను, పైకి రాలేకపోతున్నాననేవారు. విధి మమ్మల్ని దూరం చేసింది. అంతే! ఆత్రేయగారితో ముడిపడి, ఇలా దగా పడినందుకు సహధర్మచారిణిగా మీరేమనుకుంటున్నారు? (కళ్లొత్తుకొంటూ) ఆత్రేయ అంతటి కవికి భార్యనైనందుకు గర్విస్తాను. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడం నా దురదృష్టంగా భావిస్తాను. చివరిగా ఈ వృద్ధాప్యంలో మీ జీవితాన్ని గురించి మీకేమనిపిస్తోంది? ఆ మహానుభావుడే చెప్పినట్టు - పోయినోళ్లందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు! అని! - డా॥పైడిపాల paidipala_p@yahoo.com నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను..! ఆత్రేయ సంపూర్ణ రచనలపై పీహెచ్డీ పట్టా కోసం పైడిపాల మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేద్దామని వెళ్లారు. కాని అప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో ‘సజీవులైన వ్యక్తుల మీద పరిశోధన చేయకూడద’నే ఆంక్ష ఉండటం వల్ల, పైడిపాల పరిశోధనాంశాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆ సందర్భంగా ఆత్రేయ ‘నేను సగం చచ్చే ఉన్నాను. నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను. ఈ విషయం మీ యూనివర్సిటీవారికి చెప్పి, నా రచనల మీద నీ పరిశోధన కొనసాగించు’ అన్నారు. ‘పరిశోధన మీవంటి కవులను బతికించడానికి తప్ప, చంపడానికి కాదు’ అని జవాబిచ్చారు. కానీ ఆ ఏడే (89) సెప్టెంబర్ 13న ఆత్రేయ కన్నుమూశారు. -
సినీ అనువాదకుడిగా ఆరుద్ర
నీ లీల పాడెద దేవా! ఆరుద్ర పేరు తెలియని అక్షరాస్యులైన తెలుగువారుండరు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి అని తెలిసినవాళ్లు మాత్రం తక్కువ. బహుముఖ ప్రతిభాశాలి అయిన ఆరుద్ర చేపట్టని సాహితీ ప్రక్రియ లేదనీ, ఆయన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను (13 సంపుటాలు) వాడుక భాషలో రాసిన పరిశోధక పట్టభద్రులనీ, సాహిత్యంతో పాటు చదరంగం, ఇంద్రజాలాది రంగాలలో ఆరితేరిన వారనీ అందరికీ తెలియకపోవచ్చు. ఆయన ‘త్వమేవాహమ్’, ‘సినీవాలీ’ వంటి ప్రసిద్ధ కావ్యాలను చదవని వారు ఉండొచ్చుకానీ ఆయన సినిమా పాటల్ని వినని వారు ఉండరు. బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే (రక్తసంబంధం-1962) కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది (ఉయ్యాల-జంపాల - 1965) గాంధి పుట్టిన దేశమా ఇది (పవిత్రబంధం - 1971) ముత్యమంతా పసుపు ముఖమెంతొ చాయ (ముత్యాల ముగ్గు - 1974) రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా (గోరంతదీపం - 1978)... ఇలాంటి ఆణిముత్యాలెన్నో నేటికీ వినిపిస్తున్నాయి. ఆయన 500 చిత్రాలకు పాటలు రాశారు. వాటిలో వందల కొద్దీ డబ్బింగ్ చిత్రాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడినా ఆయన పేర వచ్చిన అనువాద చిత్రాలు 50కి మించవు. ఆరుద్ర తన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోకుండా 1948లో శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి పరిచయమై ఎన్నడూ ఆశించని సినీరంగ జీవితాన్ని ప్రారంభించినట్టే- డబ్బింగ్ చిత్ర రచయితగా స్థిరపడే ఉద్దేశం లేకపోయినా మోడరన్ థియేటర్స్ వారి ‘ఆలీబాబా- 40 దొంగలు’ అనువాద చిత్రానికి దాని రచయిత అయిన తోలేటి వెంకటరెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆపద్ధర్మంగా పూర్తి చెయ్యవలసి వచ్చింది. దాంతో అనువాద చిత్ర రచన కూడా కొనసాగించారు. దానికి ముందే ‘ప్రేమలేఖలు’ (1953)కి మాటలు, పాటలు రాస్తే అది ట్రాక్ ఛేంజ్ చిత్రమే అయినా ఆ సినిమాను పరిశ్రమలో డబ్బింగ్ చిత్రంగా పరిగణించడం వల్ల అప్పటికే ఆరుద్రకు అనువాద రచయితగా కూడా ముద్రపడింది. పందిట్లో పెళ్లవుతున్నది కనువిందవుతున్నది... పాడు జీవితము, యౌవనం మూడునాళ్ల ముచ్చటలోయి... వంటి హిట్స్ అందులోవే. ఆరుద్ర అనువదించిన చిత్రాలలో వీరఖడ్గము, సంపూర్ణ రామాయణము, మురిపించే మువ్వలు, సింగపూర్ సిఐడి, సరస్వతీ శపథం, కొండవీటి సింహం, కోటీశ్వరుడు మొదలైనవి చెప్పుకోదగ్గవి. లభిస్తున్న ఆధారాల మేరకు ఆయన అనువదించిన చివరి చిత్రం ‘అఖండ నాగప్రతిష్ట’ (1984). తెలుగు చిత్ర రంగంలో అనువాద రచనకు ఆద్యులైన శ్రీశ్రీ- నన్నయ వంటి వారైతే అనువాదంలో తెలుగుదనానికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిన ఆరుద్రను అభినవ తిక్కనగా అభివర్ణించవచ్చు. ఆయన ‘లిప్ సింక్’ కంటే తెలుగు నుడికారానికే మొగ్గు చూపించారు. ‘రాణీ రంగమ్మ’ చిత్రాన్ని అనువదించేటప్పుడు అందులో కట్టబొమ్మన సోదరుడైన భూమయ్యదొరను కీర్తిస్తూ పాడే నృత్యగీతాన్ని తొలగించి ఆ స్థానంలో పెదవుల కదలికకు, నాట్యభంగిమలకు సరిపడేలా బొబ్బిలి కథను రాయడం ఆరుద్ర తెలుగుప్రేమకు నిదర్శనం. ఆరుద్ర అనువాద గీతాలలోనే కాదు- తెలుగు అనువాద గీతాల్లోనే మకుటాయమానమైన పాట దేవీ ఫిలిమ్స్ వారి ‘మురిపించే మువ్వలు’ (1962)లోని - ‘నీ లీల పాడెద దేవా’.... ఈ సినిమాలో హీరో నాదస్వర విద్వాంసుడు కావడం వల్ల జానకి ఈ పాటను నాదస్వరంతో సమమైన స్థాయిలో పాడి ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. దీని తమిళ మాతృక ‘కొంజు సెలంగై’లో ఈ పాట ‘సింగార వేలనె దేవా’... అని మొదలవుతుంది. ‘శూలపాణి అయిన మనోహరమైన స్వామీ రావా... అద్భుత మహిమాన్వితుడా స్వామీ రావయ్యా’ అనే భావం గల ఆ పాటను ఆరుద్ర ‘సింగార వీధిని రావా’ అని తెనిగిద్దామనుకొని పాట శృంగారపరంగా కాక భక్తిపరంగా ఉండాలనే అభిప్రాయంతో ‘నీ లీల పాడెద దేవా’ అనే ప్రారంభాన్ని ఎంచుకున్నారు. అది జనానికి బాగా నచ్చింది. అనువాద చిత్రాల్లోని గీతాలతో పాటు ద్విభాషా చిత్రాలలోని పునర్నిర్మాణ చిత్రాలలోని సన్నివేశాలకు కూడా పాటలు రాసేటప్పుడు ఆరుద్ర తనదైన ముద్రను ప్రదర్శించారు. ఉదాహరణకు తమిళ చిత్రం‘లక్ష్మీ కల్యాణం’ (1968) కోసం కణ్ణదాసన్- రామన్ ఎత్తనైదా మనడి- అవన్ నల్లవర్ వణంగుం దేవనడి- దేవన్... అనే పాటను అనుసరిస్తూ ఆరుద్ర ‘మీనా’లో- శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరే బహుతీపి... రాశారు. ‘కుళం వైయుం దైవముం’ ఆధారంగా తీసిన తెలుగు చిత్రం ‘లేత మనసులు’లో- కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమొ తల్లడిల్లే ప్రేమ లేని కానలో... అని రాశారు. ‘కాదలిక్క నేరమిల్లై’ ఆధారంగా తీసిన పునర్నిర్మాణ చిత్రం ‘ప్రేమించి చూడు’లో- నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా హాయ్ ఓ చేయి వేసేదా... రాశారు. ఈ పాటలో ‘కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను’ అనేది మూలాన్ని మించిన గడుసు ప్రయోగం. శబ్దశక్తి, సద్యఃస్ఫూర్తి అక్షరంతోనే అలవడిన ఋషిత్యులుడు ఆరుద్ర. అందుకే ఆయన అసలు సిసలు తెలుగు చిత్రాలకు రాసినా అనువాద చిత్ర రచన చేసినా రెండు రంగాలలోనూ సవ్యసాచిలా రాణించారు. వాస్తవానికి ఆయన చేసిన అనువాద చిత్రాలు పదుల సంఖ్యలోనే ఉన్నా ఆయన భావించినట్టుగా అవి వందల పెట్టు. - పైడిపాల 9989106162 -
అలివేలు కూతురు - అయిదేళ్ల పెళ్లి క(ళ)ల!
కథ:‘‘అన్నయ్యా! అందరి పెళ్లిళ్లూ అయిపోతున్నాయి. శ్రావణమాసం దాటితే మంచి ముహూర్తాల్లేవట! వచ్చే పుష్కరాల తర్వాత యేడాది వరకు పెళ్లిళ్లు చెయ్యకూడదట! అంతవరకు ఎలా ఆగుతాం? ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలున్నాయట! ఆ మూడ్రోజుల్లో ఏకంగా రెండు లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయట! నువ్వేం చేస్తావో, ఎలా చూస్తావో... వారంలోగా వరుణ్ని చూసి ఆ ముహూర్తాల్లో అసుర మెళ్లో మూడు ముళ్లూ వేయించి తీరాలి’’ జూలై రెండో వారంలో నన్ను అర్జెంటుగా పిల్చి, అలివేలు ఆర్డరు వేసింది - మార్కెట్లో వస్తువు కొని తెమ్మన్నంత తేలిగ్గా. దాని నోటికి ఆర్డర్ తప్ప రిక్వెస్టు అనే పదం తెలియదు! ‘‘ఏళ్ల తరబడి వెదుకుతున్నా దొరకని పెళ్లికొడుకును వారంలోగా పట్టుకోవడం, నెల్నాళ్లలో పెళ్లి జరిపించడం... సాధ్యమయ్యే పనులేనా?’’ రెండు రెళ్లు మూడంటే మూడేననే మూర్ఖురాలు అలివేలుకి తెలిసీ నచ్చజెప్పబోయాను. ‘‘ఒరేయ్! నీ బూజు పట్టిన మైండ్‌సెట్ ఇంక మారదురా. అయిదు రోజుల పెళ్లిళ్లు పోయి, అయిదు రోజుల గడువులో పెళ్లిళ్లు జరుగుతున్న కాలం నడుస్తోంది. అమెరికా వరుడొచ్చి, ఇలా పిల్లను చూసుకొని, అలా తాళి కడుతున్న కాలంలో నేను పెట్టిన గడువు ఎక్కువే. నువ్వెళ్లి యుద్ధప్రాతిపదికన నీ ప్రయత్నాలు చెయ్యి. ఆరు నూరైనా ఆగస్టు 15లోగా అసుర పెళ్లి జరుగుతుంది. అంతే!’’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా అలివేలు మంగమ్మ శపథం లాంటి నిర్ణయాన్ని ప్రకటించింది! అలివేలు నా వేలువిడిచిన చెల్లెలు. అదీ నేనూ చిన్నతనం నుంచీ ఒకే కంచాన్నీ మంచాన్నీ పంచుకోకపోయినా, (మా కుటుంబంలో వాటికి లోటు లేదు) ఒక చూరు కింద ఆడుతూ పాడుతూ కలిసి పెరిగాం. అందువల్ల దానికి నా దగ్గర చనువూ చొరవా ఎక్కువ. తను అందరిలా కాక, ‘స్పెషల్’ అనుకొనే పిచ్చి, చెప్పడం తప్ప వినడం అలవాటు లేని తిక్క... దానికి మొదటినుంచీ ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కూడా దానికా అహం చెల్లడానికి, ఆ మాటకొస్తే మరికాస్త పెరగడానికి నెత్తికెక్కించుకొని మాట జవదాటని చిదానందం అనే పప్పుసుద్ద భర్తగా లభించిన పుణ్యమే కారణం! అలివేలు ఏ సందర్భంలో ఎప్పుడెలా అరుస్తుందో కరుస్తుందోనని మా బంధువులంతా భయపడుతూ దూరాన్ని పాటిస్తున్నా, దానికి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా నాకు మాత్రం తప్పకపోవడం అలవాటైన గ్రహపాటు! అలివేలు ఒక్కగానొక్క కూతురి పేరు అసురి! (వాళ్లమ్మ అసుర అనే పిలుస్తుంది) అసుర అనే పేరు వరుసగా బిడ్డలు బతక్కపోవడం వల్లో, ఆడపిల్ల పుట్టిందనే కోపంతోనో, పెద్దల పేరు పెట్టాలనే ప్రతిపాదనల్లో వచ్చిన పేచీతోనో... పెట్టినపేరు కాదు. అలివేలు మురిపెంగా పెట్టుకొన్న అరుదైన పేరు! నిజానికి వాల్మీకి కల్పన తప్ప ఎంత రాక్షసులైనా తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు ‘శూర్పణఖ’(చేటల్లాంటి గోళ్లు కలిగినది), ‘కుంభకర్ణుడు’ (కుండల్లాంటి చెవులున్నవాడు) లాంటి పేర్లు పెట్టి ఉండరు. అలాంటిది అలివేలు తన గారాలపట్టికి అసుర (రాక్షస) అని నామకరణం చెయ్యడానికి కారణం కేవలం దాని పైత్యం. అలివేలుకి లేక లేక ఆడపిల్ల పుట్టిందని తెలిసీ తెలియగానే ఆలస్యం చేస్తే ఎక్కడ అక్షతలు వేస్తుందోనని భయపడుతూ ఆగమేఘాల మీద వెళ్లి తల్లినీ పిల్లనీ చూశాను. ‘‘అన్నయ్యా! చూశావుగా. నీ మేనకోడలు బంగారు బొమ్మే. తెలుగులో నీకున్న పరిజ్ఞానాన్నంతటినీ ఉపయోగించి దీనికి తగిన పేరు పెట్టు చూద్దాం’’ అలివేలు అలవాటుగానే నా పాండిత్యానికి పరీక్ష పెడుతున్నట్టు మాట్లాడింది. అంతటితో ఆగక, పేరు ‘అ’ అనే అక్షరంతో ఆరంభం కావాలనీ, రెండు మూడు అక్షరాల్లో ఉండాలనీ, అలాంటి పేరు ఇంతవరకూ ఎవరికీ ఉండకూడదనీ... సవాలక్ష షరతులు పెట్టినా, దాని స్వభావం తెలిసిన నేను, కోపగించుకోలేదు. నిఘంటువు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా అలాంటి అపూర్వమైన పేర్ల జాబితా తయారుచేసి ఇచ్చాను. నా శ్రమను మెచ్చుకొని, మేక తోలు కప్పుతుందనుకొన్న అలివేలు బారసాల నాడు నాకిచ్చిన ‘ఝలక్’కి కళ్లు తిరిగాయి. నన్ను, నా వృత్తిని అవమానించిందని కాదు నా బాధ. నా లిస్టును పక్కనపెట్టి అది అతి తెలివిగా పెట్టుకొన్న పాప పేరు విని! కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత నా మనసొప్పక ఎవరూ లేకుండా చూసి, అలివేలును పిలిచి, ‘అసుర అనే పేరు అర్థం తెలిసే పెట్టావా?’ అని అడిగి అర్థం చెప్పాను. అర్థం తెలిసిన అలివేలు పొరపాటైందని నాలుక కరుచుకొంటుందనుకున్నాను కానీ, ఎదురుదాడికి దిగి నన్నే కరుస్తుందనుకోలేదు. ‘‘ఆ - సింగినాదం! నీలాంటి చాదస్తులు తప్ప ఇప్పుడీ అర్థాలు పర్థాలు ఎవరు చూస్తున్నారు? మనం చెవి కోసుకొని వింటున్న సినిమా పాటలకు అర్థాలూ అన్వయాలూ ఉంటున్నాయా? మోజు పడుతున్న సినీతారల ముద్దుపేర్లకు హద్దులూ పద్దులూ ఉంటున్నాయా? ఇప్పుడు చాలామంది పెడుతున్న వెర్రి మొర్రి పేర్ల కంటే ‘అసుర’ అనే పేరు ఎంత స్పెషల్‌గా, ‘క్యాచీ’గా ఉంది! అయినా ఈ పేరు నేను సొంతగా పెట్టింది కాదు. ఓ ప్రసిద్ధ నవలా రచయిత రాసిన పేర్ల పుస్తకం నుంచి సెలక్ట్ చేశాను’’ అలివేలు కొట్టిన చావుదెబ్బకు నాకు ‘సౌండ్’ లేదు. ఆ తర్వాత మెల్లగా తేరుకుని, ‘‘పోనీ ‘అసురి’ అనవే. ఆడా మగా తేడా పాటించినట్టూ ఉంటుంది. రాక్షసీ అని ముద్దుగా పిలుచుకున్నట్టూ ఉంటుంది’’ అని సర్దిచెప్పినా, ఆమె ఖాతరు చేయకుండా, ‘‘సారీ, నేను అసురకు ఫిక్సయిపోయాను’’ అంది. అలా భంగపడిన నన్ను గోరు చుట్టుమీద రోకటి పోటులా మా ఆవిడ దెప్పి పొడిచింది - ‘‘పాపం! ఎంత కష్టపడి తయారుచేశారు ఆ పేర్ల లిస్టు? మీకూ మీ చదువుకీ గడ్డిపరక విలువిచ్చిందా ఆ పొగరుమోతు పిల్ల? జరిగిన శాస్తి చాలు! ఇక ముందు ఆ అలివేలు విషయాల్లో తలదూర్చకండి’’ అంటూ! మా ఆవిడ హెచ్చరించడం, నాకూ అంతో ఇంతో పౌరుషం పొడుచుకొని రావడం కారణాలుగా కొంతకాలం అలివేలుతో అంటీముట్టనట్టుగా ఉన్నాను. అయితే మళ్లీ మళ్లీ ఏదో సందర్భంలో అలివేలు నన్ను పిలిచి సలహాలడగడం, బాధ్యతలప్పగించడం, నేను తగుదునమ్మా అని తలదూర్చడం, ఆ తర్వాత ‘ఛీ’ కొట్టించుకోవడం నాకు పరిపాటైపోయింది. ఏళ్లు గడుస్తున్నా, అలివేలు స్వభావం మారకపోవడంతో ఆమెకు దూరంగా ఉండాలనుకొంటూనే జూద వైరాగ్యం లాంటి మనస్తత్వంతో అది ‘అన్నయ్యా’ అని పిలిచేసరికి మళ్లీ మెత్తబడుతున్నాను. అలాంటి సంఘటనల్లో అసురి పెళ్లి అతి ముఖ్యమైంది. ఇంటర్ పూర్తి కాకుండానే అసురిని చదువు మాన్పించేసిన అలివేలు, ఆ కొత్తలో ఎవరైనా దాని పెళ్లి సంగతి ప్రస్తావిస్తే, ‘చిన్నపిల్ల! ఇప్పుడే దానికి పెళ్లేవిటి?’ అంటూ ఒంటికాలి మీద లేచేది. అయితే క్రమంగా ఇంటికి ‘రాంగ్ కాల్స్’ ఎక్కువగా రావడం, అసురి సెల్ఫోన్లో ‘మిస్డ్ కాల్స్’ కనిపించడం, మీడియాలో ప్రేమోన్మాదుల యాసిడ్ దాడులు వగైరా వార్తలు తరచుగా రావడం... వంటి పరిణామాలు అలివేలును కలవరపెట్టినట్టున్నాయి. ఓ రోజు నాకు ఫోన్ మీద ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని, కూతురికి పెళ్లి సంబంధాలు చూడమని ఆదేశించింది. అలివేలు ఆకస్మిక నిర్ణయం విన్న వెంటనే నేను కంగారుపడ్డాను- అసురి కాని పని ఏదైనా చేసిందేమోనని! అలాంటి ప్రమాదమేమీ జరగలేదని రూఢీ అయిన తర్వాత అలివేలు జాగ్రత్తను అభినందించి, దాని ప్రయత్నాలకు తోడుగా ‘నేను సైతం’ అంటూ రంగంలోకి దిగాను. తీరా పెళ్లికొడుకుల వేట మొదలెట్టాక, ఎన్ని సంబంధాలు తెచ్చినా, అలివేలుకి నచ్చేవి కావు. ప్రభుత్వోద్యోగాలు చేసే ఇంజనీర్స్, డాక్టర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, లెక్చరర్స్ మొదలైనవాళ్లే అలివేలు కంటికి పురుగుల్లా కనిపించేవారంటే, సాదాసీదా ఉద్యోగుల సంగతి చెప్పాలా? చివరకు అలివేలు హింసకి నాతో సహా మధ్యవర్తులంతా తలలు పట్టుకొని, ఆర్తనాదాలు చేస్తోంటే, ఆమెగారు కరుణించి తన మనసులోని మాటను వెల్లడించింది. తన అల్లుడు అందరి లాంటివాడు కాకూడదనీ, ఆకాశం నుంచి కాకపోయినా అమెరికా నుంచైనా దిగి రావాలనీ, కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనీ! ‘‘సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ చదువు చదివిన అమ్మాయిలే కావాలంటున్నారు. మీ పిల్ల ఇంటర్ కూడా..’’ అంటూ ఏ పెళ్లిళ్ల పేరయ్యో నసిగితే, అతగాడు అయిపోయాడన్నమాటే! అమెరికా వరులు అక్షరమ్ముక్కరాని పల్లెటూరి గబ్బిలాలను పెళ్లాడిన సంఘటనల్ని సోదాహరణంగా వివరించి, ఆ పేరయ్యకు వృత్తిమీద విరక్తి కలిగేలా చివాట్లు పెట్టేది. ‘‘నీ కూతురు రాక్షసి. అప్సరస అనుకుంటున్నావా? ఆడపిల్ల తల్లికింత బింకం తగదు’’ అని అలివేలు ఆంక్షలకు విసుగెత్తిన నేను మెత్తగా మందలిస్తే నన్ను కూడా ఉపేక్షించకుండా వాయించేసింది-‘‘ఇంకా నువ్వే కాలంలో ఉన్నావురా అన్నయ్యా. ఇప్పుడు పెళ్లిళ్ల మార్కెట్లో ఆడపిల్లల హవా నడుస్తోంది. వరకట్నానికి కాలం చెల్లిపోయి, మళ్లీ బాల్యవివాహాలు మినహాయింపుగా కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి. పెళ్లికూతుళ్లు కరువై లక్షణమైన పిల్ల దొరికితే చాలని ఎదురు కట్నాలతో పెళ్లికొడుకు తరఫువాళ్లు ‘క్యూ’ కడుతున్నారు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు పెళ్లిళ్లవడం కష్టంగా ఉంది. ‘సీను’ రివర్సయింది గనుక ఆడపిల్ల తల్లిగా నేను బెట్టుచేస్తున్నా. తప్పా?’’ అలివేలు వాదాన్ని ఓ పట్టాన నమ్మలేక, ఇటీవల పెళ్లిళ్ల సంగతి తెలియని నేను తీరా వాకబు చేస్తే- ఆశ్చర్యకరమైన కఠోర సత్యాలు తెలిశాయి. ఆస్తులు, ఉద్యోగం, జాతకాలు కలవడం మొదలైన విషయాల్లో ఆడపెళ్లి వారిదే పైచేయిగా ఉందట! వయసొచ్చిన కుర్రాడికి పెళ్లవుతుందో లేదోననే బెంగతో ముసలాళ్లు మంచాలు పడుతున్నారట! ఇలా ‘జంబ లకిడి పంబ’ సినిమాలోలా పరిస్థితులు తారుమారు కావడంతో ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తప్ప మిగతా పెళ్లికొడుకులంతా ‘డిప్రెషన్’కు లోనవుతున్నారట! సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీత భత్యాలు చూసి పచ్చబడుతున్న అమ్మాయి తరఫువాళ్లు కళ్లకు మిగతా పెళ్లికొడుకులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారట! ఆ తూకంలో నిలవలేక సంబంధాలు తప్పిపోతున్న ముదురు పెళ్లికొడుకులు పరస్పరం సానుభూతి తెలుపుకొంటూ వర్గ శత్రువులైన సాఫ్ట్వేర్ వరులతో ఎదురయ్యే అవస్థలనేకరువు పెడుతూ వాళ్లమీద కథలూ కవితలూ రాసి, కసి తీర్చుకుంటున్నట్టు కూడా మా సుబ్రహ్మణ్యం చెప్పాడు. ఇన్ని తెలిసిన తర్వాత అసురి పెళ్లి విషయంలో అలివేలు ధోరణిని ఎలా తప్పుపట్టగలను? కాని వరాన్వేషణలో మా అలివేలమ్మ లీలలు, బాధితుల గోలలు తెలిసి, నాకు టెన్షన్ పెరుగుతోంది. పత్రికల్లో వచ్చే స్వదేశాగమన ప్రకటల్ని చూసి, వాళ్లకు బలవంతంగా నాచేత ఫోన్స్ చేయించేది. వాళ్లలో ఎవరైనా స్పందించి, కోరికల చిట్టా విప్పితే, అంత ఎత్తుకెగరలేక, వాళ్లమీద వరకట్న నేరం మీద చర్య తీసుకోమని పోలీసుల్ని సతాయించేది. నచ్చిన సంబంధాల విషయంలో- జాతకాలు కుదరలేదనో, నక్షత్రాలు నప్పలేదనో, వరుడికి కల్యాణ ఘడియలు రాలేదనో సైంధవుల్లా అడ్డుపడే సిద్ధాంతుల మీద యుద్ధం ప్రకటించి, భయభ్రాంతులను చేసేది! ఇలా నాలుగైదేళ్లు గడిచినా, పట్టు వదలని, మెట్టు దిగని అలివేలుతో వేగలేక, నేను అసురికి సంబంధాలు చూడ్డం మానేశాను. మళ్లీ ఇన్నాళ్లకు అలివేలు పిల్చి, ముంచుకొస్తున్న ముహూర్తాల ముప్పు గురించి చెప్పడంతో నా మనసు మరోసారి కరిగి నీరై, కార్యరంగంలోకి దూకాను. అదృష్టవశాత్తూ రెండ్రోజుల్లోనే హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ బుద్ధిమంతుడైన సాఫ్ట్వేర్ పెళ్లికొడుకు భోగట్టా తెలిసి, ఎగిరి గంతేసి అతని పెద్దలతో మాట్లాడాను. రోగి వైద్యుడు సామెతగా, వాళ్లు కూడా ముహూర్తాల బెడదతోనే తొందర పడుతున్నారు. నా ప్రయోజకత్వానికి కాలరెగరేసి- ‘విదేశాలనే ఒక్క షరతును సడలిస్తే ఇది చాలా మంచి సంబంధం. ముందుకెళ్దా’మని అలివేలుకి చెపితే- ఈసారి కూడా ఆమె సంబరపడలేదు! ‘‘అమెరికా సంబంధం ఒకటి లైన్లో ఉంది. అది తేలిన తర్వాత ఆలోచిద్దాం’’ అని నీరుగార్చేసరికి నాకొళ్లు మండి, ‘‘ఇలా అయితే ఈ జన్మలో నీ కూతురికి పెళ్లి చేయలేవు’’ అని శపించి ఇంటికొచ్చేశాను. ఇలా జరిగిన మూడోనాడు ఆశ్చర్యంగా అలివేలు నుంచి ఫోనొచ్చింది, ‘జూలై 27 ఆదివారం ఉదయం అసురకు అమెరికా వరుడితో నిశ్చితార్థమనీ, సతీసమేతంగా తప్పనిసరిగా రమ్మనీ!’ ఒక విధంగా నాకిది అలివేలు ముందు మరోసారి తలవంపే అయినా, దాని కార్యసాధనకు మెచ్చుకొంటూ ఆ శుభకార్యానికి హాజరయ్యాను. ఆ రోజు నాతో పాటు మా బంధువర్గమంతా పెళ్లికొడుకు పర్సనాలిటీని, హుందాతనాన్ని, అతని బృందం ఖరీదైన కదలికలను, దర్జాలను, ఫంక్షన్ స్థాయిని చూసి అదిరిపోయాం. అలివేలు ప్రయోజకత్వాన్నీ, అసురి అదృష్టాన్నీ ప్రశంసల పరంపరతో అభినందించాం. జరిగింది కలా? నిజమా? అలివేలు మాయా? - అని నేను సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకోకముందే జూలై 30న తెల్లవారకుండానే అలివేలు నుంచి పిలుపు - ఉన్నపళంగా రమ్మని! తీరా అలివేలు ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆ వాతావరణం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది! ‘‘అన్నయ్యా! నీ మాట విన్నాను కాదు. నన్ను క్షమించు. ఆ అమెరికా పెళ్లికొడుకుకిదివరకే పెళ్లాం పిల్లలున్నారట. మన పిల్ల అదృష్టం బాగుండి, వాళ్ల మోసం ముందుగానే బయట పడింది. నా కళ్లు తెరుచుకున్నాయి. నువ్వు చెప్పిన ఆ హైదరాబాద్ సంబంధం ఖాయం చేసి పుణ్యం కట్టుకో. ఈ ఆపద నుంచి గట్టెక్కించి, మా పరువు కాపాడు’’ అలివేలు కళ్లలో మొదటిసారి నీళ్లు చూశాను. ‘‘ఛ! ఛ! ఏడవకు. అదృష్టం కొద్దీ ఈ గండం నుంచి బయటపడ్డాం. ఇక మా రాక్షసి పెళ్లి బాధ్యత నాది. అన్నీ కలిసొస్తే, నువ్వు కోరుకున్నట్టు ఆగస్టు ముహూర్తాల్లోనే పెళ్లి జరిపిద్దాం. అప్పుడే నీ కూతురి మొహంలో నిజమైన పెళ్లి కళ వచ్చేసింది చూడు’’ అంటూ పక్కనున్న అసురికేసి చూస్తూ, అలివేలు కళ్లు తుడిచాను.‘ఫో! మావయ్యా’ అని సిగ్గులొలకబోస్తూ అసురి అక్కణ్నుంచి తుర్రుమందని వేరే చెప్పాలా?! . డా॥పైడిపాల -
అతని అనువాదం కూడా సాహిత్యమే...
సవ్యసాచి: నిదుర పో... నిదుర పో... నిదుర పో నిదురపోరా తమ్ముడా నిదురలోన గతమునంతా నిముసమైన మరచిపోరా... చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయినే చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా మధురాశలు పలికేనో నా మనసున చిలికేనో ఆపాత మధురాలైన ఇలాంటి పాటల్ని వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. అందులోనూ ‘సంతానం‘ చిత్రంలోని ‘నిదుర పోరా’ పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా స్మరించని వాళ్లుండరు. అయితే ఈ పాటలన్నీ అనిసెట్టి రాశారని అందరికీ తెలియకపోవచ్చు. అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు (1922). శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా. సి.నారాయణరెడ్డి వంటి సినీ కవులలాగే సినీరంగ ప్రవేశానికి ముందే అభ్యుదయకవిగా ప్రసిద్ధులు. ‘అగ్నివీణ’, ‘బిచ్చగాళ్ల పదాలు’ వంటి కావ్యాలు... ‘గాలిమేడలు’, ‘మాఊరు’ నాటకాలు, ‘చెప్పు కింద పూలు’, ‘చరమాంకం’ నాటికలు మొదలైనవి అనిసెట్టి పేరు చెప్పగానే చప్పున స్ఫురించే రచనలు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే నవ్య కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అ.ర.సం కార్యవర్గ సభ్యుడిగా 1973లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా అభ్యుదయ కవిత్వంతో పరిచయమున్న వాళ్లెవరూ అనిసెట్టిని మర్చిపోరు. అనిసెట్టి సాహిత్యంపై ఇది వరకే వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. కాని అనిసెట్టి సినీరచనలపై సమగ్ర పరిశీలన జరగలేదు. అనిసెట్టి 1952లో గిడుతూరి సూర్యం ప్రోత్సాహంతో ‘ప్రియురాలు’ చిత్ర రచయితగా సినీరంగంలో అడుగుపెట్టి ‘శ్రీకృష్ణ లీలలు’ (1956), ‘కొండవీటి దొంగ’ (1958) అనువాద చిత్రాలతో ఆ రంగంలో నిలదొక్కుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్రల తర్వాత ఆ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. అనిసెట్టి రచయితగా పని చేసిన సుమారు 130 చిత్రాలలో డెరైక్ట్ చిత్రాలు 40 కాగా మిగిలినవన్నీ అనువాదాలే. అనువాదాల్లో ఆరుద్ర లిప్‌సింక్ కంటే తెలుగుదనానికి ప్రాధాన్యం ఇస్తే అనిసెట్టి లిప్సింక్ని నిర్లక్ష్యం చేయకుండా వీలయిన వరకు మూలంలోని భావాలను కూడా అనువదిస్తూ అనువాద రచనను అసిధారవ్రతంలా నిర్వహించారు. అనిసెట్టి అనువాదం చేసిన సినిమాల్లో ‘కొండవీటి దొంగ’, ‘మావూరి అమ్మాయి’, ‘పాప పరిహారం’ ‘మాయామశ్చీంద్ర’, ‘సర్వర్ సుందరం’, ‘లోకం చుట్టిన వీరుడు’ మొదలైనవి పేరు తెచ్చాయి. మలయాళంలో వచ్చిన మొట్టమొదటి ‘స్వామి అయ్యప్ప’ సినిమాకు తెలుగు అనువాదం అనిసెట్టే. ఆ పాటలు నేటికి అయ్యప్ప భక్తుల కార్యక్రమాల్లో వినబడుతుంటాయి. ఆయన అనువాదం చేసిన ‘కొండవీటి దొంగ’లోని పాటల్లో తెలుగుదనం చూడండి. సాహసమే జీవితపు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా తమలపాకు సున్నమూ పడుచువాళ్లకందమూ ఒక్కడికీ ఇద్దరయా ఇవి కలికాలపు బుద్ధులయా... ఇవి వింటే అనువాదమని అనుకోరు. ఇక భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘పాలుం పశముం’ (1961) తమిళ చిత్రం తెలుగులో ‘ప్రాయశ్చిత్తం’గా అనువాదమైతే తమిళంలోని కన్నదాసన్ మాతృరచనకు అనిసెట్టి అద్భుతమైన తెలుగు అనువాదం చేశారు. ఆ పాట- పోతే పోనీ పోరా ఈ పాపపు జగతీ శాశ్వతమెవరురా... ఈ పాటలోని తాత్త్విక వాక్యాలు చూడండి. జీవితమే ఒక స్వప్నమహో మన జననం కమ్మిన నిద్దురహో ఇట మరణం ఆత్మకు వేకువహో... తమిళంలో ఎలా ఉన్నా తెలుగులో ఇది ఉన్నత సాహిత్య రూపం తీసుకుంది. ఇది అనిసెట్టి ఘనత. భీమప్రతిజ్ఞ (1965)లో ఆయన రాసిన పాట అనువాదంలో కూడా సాహిత్యవిలువ తేవచ్చనడానికి ఉదాహరణ. వీచెను కాలపు సుడిగాలి అది విసరెను బాధల పెనుధూళి విధికి లేదులే ఏ జాలి ఆ విధాతకిదియే ఒక కేళి... ‘కళత్తూర్ కన్నమ్మ’ తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా అనువాదం అవగా అందులో అనిసెట్టి రాసిన- కనిపెంచు తల్లీ కాపాడుతండ్రీ ఆపదలో ఆదరించు దైవము నీవే పాట అదే ఇతివృత్తంతో తీసిన ‘మూగనోము’ కోసం ఆరుద్ర రాసిన తల్లివి నీవే తండ్రి నీవే/ చల్లగ కరుణించే దైవము నీవే పాటకు స్ఫూర్తి కావడం అనిసెట్టికి గర్వకారణం. అనిసెట్టి 1979 డిసెంబర్ 27న నరసరావు పేటలో 57 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన ఖాళీ అన్నది ఎరగరు. మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చినా మళ్లీ ‘సర్వర్ సుందరం’తో విజృంభించారని అంటారు. తన స్వీయ నిర్మాణంలో తీసిన ‘మన ఊరు’ ఆయన చివరి సినిమా. అనిసెట్టి ఒక మంచికిగాని చెడుకుగాని బయటకు వెళ్లేవారు కాదట. ఇంట్లోనే రాసుకుంటూ కూర్చునేవారట. ఏవిఎం, దేవర్ ఫిలిమ్స్‌కు ఆయన పర్మినెంట్ రైటర్. పదిహేను రోజులకో సినిమా ముగించేవారు. అనువాద చిత్రాలనూ, పాటలనూ ద్వితీయ శ్రేణికి చెందినవిగా కొందరు భావించినా, అనువాద రచనను కొందరు రచయితలు జీవిక కోసమే స్వీకరించినా అనువాద రచన కూడా అంకిత భావంతో స్వీకరించి దాని గౌరవాన్ని పెంచిన కొద్దిమంది రచయితల్లో అనిసెట్టి ఒకరు. - పైడిపాల 9989106162