సినీ అనువాదకుడిగా ఆరుద్ర
నీ లీల పాడెద దేవా!
ఆరుద్ర పేరు తెలియని అక్షరాస్యులైన తెలుగువారుండరు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి అని తెలిసినవాళ్లు మాత్రం తక్కువ. బహుముఖ ప్రతిభాశాలి అయిన ఆరుద్ర చేపట్టని సాహితీ ప్రక్రియ లేదనీ, ఆయన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రను (13 సంపుటాలు) వాడుక భాషలో రాసిన పరిశోధక పట్టభద్రులనీ, సాహిత్యంతో పాటు చదరంగం, ఇంద్రజాలాది రంగాలలో ఆరితేరిన వారనీ అందరికీ తెలియకపోవచ్చు. ఆయన ‘త్వమేవాహమ్’, ‘సినీవాలీ’ వంటి ప్రసిద్ధ కావ్యాలను చదవని వారు ఉండొచ్చుకానీ ఆయన సినిమా పాటల్ని వినని వారు ఉండరు. బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే (రక్తసంబంధం-1962) కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది (ఉయ్యాల-జంపాల - 1965) గాంధి పుట్టిన దేశమా ఇది (పవిత్రబంధం - 1971) ముత్యమంతా పసుపు ముఖమెంతొ చాయ (ముత్యాల ముగ్గు - 1974) రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా (గోరంతదీపం - 1978)...
ఇలాంటి ఆణిముత్యాలెన్నో నేటికీ వినిపిస్తున్నాయి. ఆయన 500 చిత్రాలకు పాటలు రాశారు. వాటిలో వందల కొద్దీ డబ్బింగ్ చిత్రాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడినా ఆయన పేర వచ్చిన అనువాద చిత్రాలు 50కి మించవు. ఆరుద్ర తన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకోకుండా 1948లో శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారికి పరిచయమై ఎన్నడూ ఆశించని సినీరంగ జీవితాన్ని ప్రారంభించినట్టే- డబ్బింగ్ చిత్ర రచయితగా స్థిరపడే ఉద్దేశం లేకపోయినా మోడరన్ థియేటర్స్ వారి ‘ఆలీబాబా- 40 దొంగలు’ అనువాద చిత్రానికి దాని రచయిత అయిన తోలేటి వెంకటరెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఆపద్ధర్మంగా పూర్తి చెయ్యవలసి వచ్చింది. దాంతో అనువాద చిత్ర రచన కూడా కొనసాగించారు. దానికి ముందే ‘ప్రేమలేఖలు’ (1953)కి మాటలు, పాటలు రాస్తే అది ట్రాక్ ఛేంజ్ చిత్రమే అయినా ఆ సినిమాను పరిశ్రమలో డబ్బింగ్ చిత్రంగా పరిగణించడం వల్ల అప్పటికే ఆరుద్రకు అనువాద రచయితగా కూడా ముద్రపడింది.
పందిట్లో పెళ్లవుతున్నది కనువిందవుతున్నది...
పాడు జీవితము, యౌవనం మూడునాళ్ల ముచ్చటలోయి...
వంటి హిట్స్ అందులోవే. ఆరుద్ర అనువదించిన చిత్రాలలో వీరఖడ్గము, సంపూర్ణ రామాయణము, మురిపించే మువ్వలు, సింగపూర్ సిఐడి, సరస్వతీ శపథం, కొండవీటి సింహం, కోటీశ్వరుడు మొదలైనవి చెప్పుకోదగ్గవి. లభిస్తున్న ఆధారాల మేరకు ఆయన అనువదించిన చివరి చిత్రం ‘అఖండ నాగప్రతిష్ట’ (1984). తెలుగు చిత్ర రంగంలో అనువాద రచనకు ఆద్యులైన శ్రీశ్రీ- నన్నయ వంటి వారైతే అనువాదంలో తెలుగుదనానికి ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిన ఆరుద్రను అభినవ తిక్కనగా అభివర్ణించవచ్చు. ఆయన ‘లిప్ సింక్’ కంటే తెలుగు నుడికారానికే మొగ్గు చూపించారు. ‘రాణీ రంగమ్మ’ చిత్రాన్ని అనువదించేటప్పుడు అందులో కట్టబొమ్మన సోదరుడైన భూమయ్యదొరను కీర్తిస్తూ పాడే నృత్యగీతాన్ని తొలగించి ఆ స్థానంలో పెదవుల కదలికకు, నాట్యభంగిమలకు సరిపడేలా బొబ్బిలి కథను రాయడం ఆరుద్ర తెలుగుప్రేమకు నిదర్శనం.
ఆరుద్ర అనువాద గీతాలలోనే కాదు- తెలుగు అనువాద గీతాల్లోనే మకుటాయమానమైన పాట దేవీ ఫిలిమ్స్ వారి ‘మురిపించే మువ్వలు’ (1962)లోని - ‘నీ లీల పాడెద దేవా’.... ఈ సినిమాలో హీరో నాదస్వర విద్వాంసుడు కావడం వల్ల జానకి ఈ పాటను నాదస్వరంతో సమమైన స్థాయిలో పాడి ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించారు. దీని తమిళ మాతృక ‘కొంజు సెలంగై’లో ఈ పాట ‘సింగార వేలనె దేవా’... అని మొదలవుతుంది. ‘శూలపాణి అయిన మనోహరమైన స్వామీ రావా... అద్భుత మహిమాన్వితుడా స్వామీ రావయ్యా’ అనే భావం గల ఆ పాటను ఆరుద్ర ‘సింగార వీధిని రావా’ అని తెనిగిద్దామనుకొని పాట శృంగారపరంగా కాక భక్తిపరంగా ఉండాలనే అభిప్రాయంతో ‘నీ లీల పాడెద దేవా’ అనే ప్రారంభాన్ని ఎంచుకున్నారు. అది జనానికి బాగా నచ్చింది.
అనువాద చిత్రాల్లోని గీతాలతో పాటు ద్విభాషా చిత్రాలలోని పునర్నిర్మాణ చిత్రాలలోని సన్నివేశాలకు కూడా పాటలు రాసేటప్పుడు ఆరుద్ర తనదైన ముద్రను ప్రదర్శించారు. ఉదాహరణకు తమిళ చిత్రం‘లక్ష్మీ కల్యాణం’ (1968) కోసం కణ్ణదాసన్- రామన్ ఎత్తనైదా మనడి- అవన్
నల్లవర్ వణంగుం దేవనడి- దేవన్...
అనే పాటను అనుసరిస్తూ ఆరుద్ర ‘మీనా’లో- శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరే బహుతీపి... రాశారు. ‘కుళం వైయుం దైవముం’ ఆధారంగా తీసిన తెలుగు చిత్రం ‘లేత మనసులు’లో- కోడి ఒక కోనలో పుంజు ఒక కోనలో పిల్లలేమొ తల్లడిల్లే ప్రేమ లేని కానలో... అని రాశారు. ‘కాదలిక్క నేరమిల్లై’ ఆధారంగా తీసిన పునర్నిర్మాణ చిత్రం ‘ప్రేమించి చూడు’లో- నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద సాయము వలదా హాయ్ ఓ చేయి వేసేదా... రాశారు.
ఈ పాటలో ‘కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను’ అనేది మూలాన్ని మించిన గడుసు ప్రయోగం. శబ్దశక్తి, సద్యఃస్ఫూర్తి అక్షరంతోనే అలవడిన ఋషిత్యులుడు ఆరుద్ర. అందుకే ఆయన అసలు సిసలు తెలుగు చిత్రాలకు రాసినా అనువాద చిత్ర రచన చేసినా రెండు రంగాలలోనూ సవ్యసాచిలా రాణించారు. వాస్తవానికి ఆయన చేసిన అనువాద చిత్రాలు పదుల సంఖ్యలోనే ఉన్నా ఆయన భావించినట్టుగా అవి వందల పెట్టు.
- పైడిపాల 9989106162