మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి (ఈయన జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులు)– వీరందరూ ఆధునిక ఆంధ్రసాహిత్యంలో హాస్యరస సామ్రాజ్యానికి చక్రవర్తులు. పరస్పరం గౌరవాభిమానాలు కలిగినవారు. ఒకే కవి కుటుంబంగా మెలగినవాళ్లు. అన్నింటినీ మించి హాస్యసంభాషణా చతురులు.
ఒకరోజున ఏదో శుభకార్యాన్ని పురస్కరించుకొని అందరూ మునిమాణిక్యం వారి ఇంట్లో కలుసుకొన్నారు. అక్కడికి శ్రీశ్రీ, ఆరుద్ర కూడా వచ్చారు. సరదా సరదా కబుర్లతోనూ, ఛలోక్తులతోనూ భోజనాలు పూర్తి ఐనై. అందరూ పెద్ద వసారాలోకి వచ్చి కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నారు. మునిమాణిక్యం ఒక పెద్ద పళ్లెంలో సిగరెట్లు, చుట్టలు పెట్టుకొని వచ్చారు. ‘‘అయ్యా! ఎవరికి ఏవి కావాల్నో వాటిని తీసుకోండి. మొహమాట మేమీ పడబోకండి’’ అన్నారు. ‘అట్లాగే’ నంటూ ఒక్కొక్కళ్లు ఎవరి కేది ఇష్టమో దానిని తీసుకొంటున్నారు. పళ్లెం జరుక్ శాస్త్రి దగ్గరకు వచ్చింది. ఆయన ‘నేను ఉభయభాషా ప్రవీణుడిని’ అంటూ ఒక సిగరెట్టునూ, ఒక చుట్టనూ తీసుకొన్నారు. తీసుకొని అందరి వైపు చిద్విలాసంగా చూశారు. అందరి ముఖాలూ నవ్వుల పువ్వులైనై.
డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment