
ఆరుద్ర రచయిత్రి కె.రామలక్ష్మిని అభ్యుదయ వివాహం చేసుకున్నారు. ఆమె మీద ‘కె.రా. త్రిశతి’ అని మూడు వందల కవితలతో ఒక పుస్తకాన్ని రాశారు కూడా. అలాంటి రామలక్ష్మి ఒకసారి ఉదరానికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకోవలసి వచ్చింది. ఆమెను థియేటర్‌లోకి తీసుకెళ్లిన చాలా సేపటివరకూ లోపలినుంచి వైద్యులెవరూ వచ్చి ఏ కబురూ చెప్పకపోవడంతో ఆరుద్రకూ, సహచరులకూ ఆందోళన ఎక్కువైంది. తోటివాళ్లందరూ కంగారు పడుతుంటే ఆరుద్ర మాత్రం తాపీగా నవ్వుతూ– ‘‘పొట్ట చించారు కదా, అక్షరం ముక్క కోసం వెతుకుతున్నారేమో’’ అన్నారట.
అంత క్లిష్ట సమయంలో కూడా ఆరుద్ర నిబ్బరానికీ, చమత్కారానికీ అంతా ఆశ్చర్యపోయామని ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి, రామలక్ష్మి దగ్గర ‘తాళ్లపాక వారి పలుకుబడులు’ పరిశోధన గ్రంథానికి సహాయకుడు అయిన ఎమ్వీఎల్ చెప్పేవారు.
-డాక్టర్ పైడిపాల
Comments
Please login to add a commentAdd a comment