అలివేలు కూతురు - అయిదేళ్ల పెళ్లి క(ళ)ల! | Funday Bride story of the week about her Marriage | Sakshi
Sakshi News home page

కథ: అలివేలు కూతురు - అయిదేళ్ల పెళ్లి క(ళ)ల!

Published Sun, Aug 31 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

అలివేలు కూతురు - అయిదేళ్ల పెళ్లి క(ళ)ల!

అలివేలు కూతురు - అయిదేళ్ల పెళ్లి క(ళ)ల!

కథ:‘‘అన్నయ్యా! అందరి పెళ్లిళ్లూ అయిపోతున్నాయి. శ్రావణమాసం దాటితే మంచి ముహూర్తాల్లేవట! వచ్చే పుష్కరాల తర్వాత యేడాది వరకు పెళ్లిళ్లు చెయ్యకూడదట! అంతవరకు ఎలా ఆగుతాం? ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలున్నాయట! ఆ మూడ్రోజుల్లో ఏకంగా రెండు లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయట! నువ్వేం చేస్తావో, ఎలా చూస్తావో... వారంలోగా వరుణ్ని చూసి ఆ ముహూర్తాల్లో అసుర మెళ్లో మూడు ముళ్లూ వేయించి తీరాలి’’ జూలై రెండో వారంలో నన్ను అర్జెంటుగా పిల్చి, అలివేలు ఆర్డరు వేసింది - మార్కెట్లో వస్తువు కొని తెమ్మన్నంత తేలిగ్గా. దాని నోటికి ఆర్డర్ తప్ప రిక్వెస్టు అనే పదం తెలియదు!  ‘‘ఏళ్ల తరబడి వెదుకుతున్నా దొరకని పెళ్లికొడుకును వారంలోగా పట్టుకోవడం, నెల్నాళ్లలో పెళ్లి జరిపించడం... సాధ్యమయ్యే పనులేనా?’’ రెండు రెళ్లు మూడంటే మూడేననే మూర్ఖురాలు అలివేలుకి తెలిసీ నచ్చజెప్పబోయాను.  ‘‘ఒరేయ్! నీ బూజు పట్టిన మైండ్‌సెట్ ఇంక మారదురా. అయిదు రోజుల పెళ్లిళ్లు పోయి, అయిదు రోజుల గడువులో పెళ్లిళ్లు జరుగుతున్న కాలం నడుస్తోంది. అమెరికా వరుడొచ్చి, ఇలా పిల్లను చూసుకొని, అలా తాళి కడుతున్న కాలంలో నేను పెట్టిన గడువు ఎక్కువే. నువ్వెళ్లి యుద్ధప్రాతిపదికన నీ ప్రయత్నాలు చెయ్యి. ఆరు నూరైనా ఆగస్టు 15లోగా అసుర పెళ్లి జరుగుతుంది. అంతే!’’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా అలివేలు మంగమ్మ శపథం లాంటి నిర్ణయాన్ని ప్రకటించింది!
    
 అలివేలు నా వేలువిడిచిన చెల్లెలు. అదీ నేనూ చిన్నతనం నుంచీ ఒకే కంచాన్నీ మంచాన్నీ పంచుకోకపోయినా, (మా కుటుంబంలో వాటికి లోటు లేదు) ఒక చూరు కింద ఆడుతూ పాడుతూ కలిసి పెరిగాం. అందువల్ల దానికి నా దగ్గర చనువూ చొరవా ఎక్కువ. తను అందరిలా కాక, ‘స్పెషల్’ అనుకొనే పిచ్చి, చెప్పడం తప్ప వినడం అలవాటు లేని తిక్క... దానికి మొదటినుంచీ ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కూడా దానికా అహం చెల్లడానికి, ఆ మాటకొస్తే మరికాస్త పెరగడానికి నెత్తికెక్కించుకొని మాట జవదాటని చిదానందం అనే పప్పుసుద్ద భర్తగా లభించిన పుణ్యమే కారణం!
 
 అలివేలు ఏ సందర్భంలో ఎప్పుడెలా అరుస్తుందో కరుస్తుందోనని మా బంధువులంతా భయపడుతూ దూరాన్ని పాటిస్తున్నా, దానికి తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా నాకు మాత్రం తప్పకపోవడం అలవాటైన గ్రహపాటు! అలివేలు ఒక్కగానొక్క కూతురి పేరు అసురి! (వాళ్లమ్మ అసుర అనే పిలుస్తుంది) అసుర అనే పేరు వరుసగా బిడ్డలు బతక్కపోవడం వల్లో, ఆడపిల్ల పుట్టిందనే కోపంతోనో, పెద్దల పేరు పెట్టాలనే ప్రతిపాదనల్లో వచ్చిన పేచీతోనో... పెట్టినపేరు కాదు. అలివేలు మురిపెంగా పెట్టుకొన్న అరుదైన పేరు! నిజానికి వాల్మీకి కల్పన తప్ప ఎంత రాక్షసులైనా తల్లిదండ్రులు వాళ్ల పిల్లలకు ‘శూర్పణఖ’(చేటల్లాంటి గోళ్లు కలిగినది), ‘కుంభకర్ణుడు’ (కుండల్లాంటి చెవులున్నవాడు) లాంటి పేర్లు పెట్టి ఉండరు. అలాంటిది అలివేలు తన గారాలపట్టికి అసుర (రాక్షస) అని నామకరణం చెయ్యడానికి కారణం కేవలం దాని పైత్యం. అలివేలుకి లేక లేక ఆడపిల్ల పుట్టిందని తెలిసీ తెలియగానే ఆలస్యం చేస్తే ఎక్కడ అక్షతలు వేస్తుందోనని భయపడుతూ ఆగమేఘాల మీద వెళ్లి తల్లినీ పిల్లనీ చూశాను.
 
 ‘‘అన్నయ్యా! చూశావుగా. నీ మేనకోడలు బంగారు బొమ్మే. తెలుగులో నీకున్న పరిజ్ఞానాన్నంతటినీ ఉపయోగించి దీనికి తగిన పేరు పెట్టు చూద్దాం’’ అలివేలు అలవాటుగానే నా పాండిత్యానికి పరీక్ష పెడుతున్నట్టు మాట్లాడింది. అంతటితో ఆగక, పేరు ‘అ’ అనే అక్షరంతో ఆరంభం కావాలనీ, రెండు మూడు అక్షరాల్లో ఉండాలనీ, అలాంటి పేరు ఇంతవరకూ ఎవరికీ ఉండకూడదనీ... సవాలక్ష షరతులు పెట్టినా, దాని స్వభావం తెలిసిన నేను, కోపగించుకోలేదు. నిఘంటువు దగ్గర పెట్టుకుని శ్రద్ధగా అలాంటి అపూర్వమైన పేర్ల జాబితా తయారుచేసి ఇచ్చాను. నా శ్రమను మెచ్చుకొని, మేక తోలు కప్పుతుందనుకొన్న అలివేలు బారసాల నాడు నాకిచ్చిన ‘ఝలక్’కి కళ్లు తిరిగాయి. నన్ను, నా వృత్తిని అవమానించిందని కాదు నా బాధ. నా లిస్టును పక్కనపెట్టి అది అతి తెలివిగా పెట్టుకొన్న పాప పేరు విని! కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత నా మనసొప్పక ఎవరూ లేకుండా చూసి, అలివేలును పిలిచి, ‘అసుర అనే పేరు అర్థం తెలిసే పెట్టావా?’ అని అడిగి అర్థం చెప్పాను. అర్థం తెలిసిన అలివేలు పొరపాటైందని నాలుక కరుచుకొంటుందనుకున్నాను కానీ, ఎదురుదాడికి దిగి నన్నే కరుస్తుందనుకోలేదు.
 
 ‘‘ఆ - సింగినాదం! నీలాంటి చాదస్తులు తప్ప ఇప్పుడీ అర్థాలు పర్థాలు ఎవరు చూస్తున్నారు? మనం చెవి కోసుకొని వింటున్న సినిమా పాటలకు అర్థాలూ అన్వయాలూ ఉంటున్నాయా? మోజు పడుతున్న సినీతారల ముద్దుపేర్లకు హద్దులూ పద్దులూ ఉంటున్నాయా? ఇప్పుడు చాలామంది పెడుతున్న వెర్రి మొర్రి పేర్ల కంటే ‘అసుర’ అనే పేరు ఎంత స్పెషల్‌గా, ‘క్యాచీ’గా ఉంది! అయినా ఈ పేరు నేను సొంతగా పెట్టింది కాదు. ఓ ప్రసిద్ధ నవలా రచయిత రాసిన పేర్ల పుస్తకం నుంచి సెలక్ట్ చేశాను’’ అలివేలు కొట్టిన చావుదెబ్బకు నాకు ‘సౌండ్’ లేదు.
 
 ఆ తర్వాత మెల్లగా తేరుకుని, ‘‘పోనీ ‘అసురి’ అనవే. ఆడా మగా తేడా పాటించినట్టూ ఉంటుంది. రాక్షసీ అని ముద్దుగా పిలుచుకున్నట్టూ ఉంటుంది’’ అని సర్దిచెప్పినా, ఆమె ఖాతరు చేయకుండా, ‘‘సారీ, నేను అసురకు ఫిక్సయిపోయాను’’ అంది.
 అలా భంగపడిన నన్ను గోరు చుట్టుమీద రోకటి పోటులా మా ఆవిడ దెప్పి పొడిచింది - ‘‘పాపం! ఎంత కష్టపడి తయారుచేశారు ఆ పేర్ల లిస్టు? మీకూ మీ చదువుకీ గడ్డిపరక విలువిచ్చిందా ఆ పొగరుమోతు పిల్ల? జరిగిన శాస్తి చాలు! ఇక ముందు ఆ అలివేలు విషయాల్లో తలదూర్చకండి’’ అంటూ!
    
 మా ఆవిడ హెచ్చరించడం, నాకూ అంతో ఇంతో పౌరుషం పొడుచుకొని రావడం కారణాలుగా కొంతకాలం అలివేలుతో అంటీముట్టనట్టుగా ఉన్నాను. అయితే మళ్లీ మళ్లీ ఏదో సందర్భంలో అలివేలు నన్ను పిలిచి సలహాలడగడం, బాధ్యతలప్పగించడం, నేను తగుదునమ్మా అని తలదూర్చడం, ఆ తర్వాత ‘ఛీ’ కొట్టించుకోవడం నాకు పరిపాటైపోయింది. ఏళ్లు గడుస్తున్నా, అలివేలు స్వభావం మారకపోవడంతో ఆమెకు దూరంగా ఉండాలనుకొంటూనే జూద వైరాగ్యం లాంటి మనస్తత్వంతో అది ‘అన్నయ్యా’ అని పిలిచేసరికి మళ్లీ మెత్తబడుతున్నాను. అలాంటి సంఘటనల్లో అసురి పెళ్లి అతి ముఖ్యమైంది.
    
 ఇంటర్ పూర్తి కాకుండానే అసురిని చదువు మాన్పించేసిన అలివేలు, ఆ కొత్తలో ఎవరైనా దాని పెళ్లి సంగతి ప్రస్తావిస్తే, ‘చిన్నపిల్ల! ఇప్పుడే దానికి పెళ్లేవిటి?’ అంటూ ఒంటికాలి మీద లేచేది. అయితే క్రమంగా ఇంటికి ‘రాంగ్ కాల్స్’ ఎక్కువగా రావడం, అసురి సెల్‌ఫోన్‌లో ‘మిస్డ్ కాల్స్’ కనిపించడం, మీడియాలో ప్రేమోన్మాదుల యాసిడ్ దాడులు వగైరా వార్తలు తరచుగా రావడం... వంటి పరిణామాలు అలివేలును కలవరపెట్టినట్టున్నాయి. ఓ రోజు నాకు ఫోన్ మీద ఫోన్ చేసి ఇంటికి రప్పించుకొని, కూతురికి పెళ్లి సంబంధాలు చూడమని ఆదేశించింది. అలివేలు ఆకస్మిక నిర్ణయం విన్న వెంటనే నేను కంగారుపడ్డాను- అసురి కాని పని ఏదైనా చేసిందేమోనని! అలాంటి ప్రమాదమేమీ జరగలేదని రూఢీ అయిన తర్వాత అలివేలు జాగ్రత్తను అభినందించి, దాని ప్రయత్నాలకు తోడుగా ‘నేను సైతం’ అంటూ రంగంలోకి దిగాను.
 
 తీరా పెళ్లికొడుకుల వేట మొదలెట్టాక, ఎన్ని సంబంధాలు తెచ్చినా, అలివేలుకి నచ్చేవి కావు. ప్రభుత్వోద్యోగాలు చేసే ఇంజనీర్స్, డాక్టర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, లెక్చరర్స్ మొదలైనవాళ్లే అలివేలు కంటికి పురుగుల్లా కనిపించేవారంటే, సాదాసీదా ఉద్యోగుల సంగతి చెప్పాలా? చివరకు అలివేలు హింసకి నాతో సహా మధ్యవర్తులంతా తలలు పట్టుకొని, ఆర్తనాదాలు చేస్తోంటే, ఆమెగారు కరుణించి తన మనసులోని మాటను వెల్లడించింది. తన అల్లుడు అందరి లాంటివాడు కాకూడదనీ, ఆకాశం నుంచి కాకపోయినా అమెరికా నుంచైనా దిగి రావాలనీ, కనీసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనీ!
 
 ‘‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఆ చదువు చదివిన అమ్మాయిలే  కావాలంటున్నారు. మీ పిల్ల ఇంటర్ కూడా..’’ అంటూ ఏ పెళ్లిళ్ల పేరయ్యో నసిగితే, అతగాడు అయిపోయాడన్నమాటే! అమెరికా వరులు అక్షరమ్ముక్కరాని పల్లెటూరి గబ్బిలాలను పెళ్లాడిన సంఘటనల్ని సోదాహరణంగా వివరించి, ఆ పేరయ్యకు వృత్తిమీద విరక్తి కలిగేలా చివాట్లు పెట్టేది.
 ‘‘నీ కూతురు రాక్షసి. అప్సరస అనుకుంటున్నావా? ఆడపిల్ల తల్లికింత బింకం తగదు’’ అని అలివేలు ఆంక్షలకు విసుగెత్తిన నేను మెత్తగా మందలిస్తే నన్ను కూడా ఉపేక్షించకుండా వాయించేసింది-‘‘ఇంకా నువ్వే కాలంలో ఉన్నావురా అన్నయ్యా. ఇప్పుడు పెళ్లిళ్ల మార్కెట్లో ఆడపిల్లల హవా నడుస్తోంది. వరకట్నానికి కాలం చెల్లిపోయి, మళ్లీ బాల్యవివాహాలు మినహాయింపుగా కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి. పెళ్లికూతుళ్లు కరువై లక్షణమైన పిల్ల దొరికితే చాలని ఎదురు కట్నాలతో పెళ్లికొడుకు తరఫువాళ్లు ‘క్యూ’ కడుతున్నారు. ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు పెళ్లిళ్లవడం కష్టంగా ఉంది. ‘సీను’ రివర్సయింది గనుక  ఆడపిల్ల తల్లిగా నేను బెట్టుచేస్తున్నా. తప్పా?’’
 
 అలివేలు వాదాన్ని ఓ పట్టాన నమ్మలేక, ఇటీవల పెళ్లిళ్ల సంగతి తెలియని నేను తీరా వాకబు చేస్తే- ఆశ్చర్యకరమైన కఠోర సత్యాలు తెలిశాయి. ఆస్తులు, ఉద్యోగం, జాతకాలు కలవడం మొదలైన విషయాల్లో ఆడపెళ్లి వారిదే పైచేయిగా ఉందట! వయసొచ్చిన కుర్రాడికి పెళ్లవుతుందో లేదోననే బెంగతో ముసలాళ్లు మంచాలు పడుతున్నారట! ఇలా ‘జంబ లకిడి పంబ’ సినిమాలోలా పరిస్థితులు తారుమారు కావడంతో ఒక్క సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ తప్ప మిగతా పెళ్లికొడుకులంతా ‘డిప్రెషన్’కు లోనవుతున్నారట!
 
 సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీత భత్యాలు చూసి పచ్చబడుతున్న అమ్మాయి తరఫువాళ్లు కళ్లకు మిగతా పెళ్లికొడుకులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారట! ఆ తూకంలో నిలవలేక సంబంధాలు తప్పిపోతున్న ముదురు పెళ్లికొడుకులు పరస్పరం సానుభూతి తెలుపుకొంటూ వర్గ శత్రువులైన సాఫ్ట్‌వేర్ వరులతో ఎదురయ్యే అవస్థలనేకరువు పెడుతూ వాళ్లమీద కథలూ కవితలూ రాసి, కసి తీర్చుకుంటున్నట్టు కూడా మా సుబ్రహ్మణ్యం చెప్పాడు. ఇన్ని తెలిసిన తర్వాత అసురి పెళ్లి విషయంలో అలివేలు ధోరణిని ఎలా తప్పుపట్టగలను?
 
 కాని వరాన్వేషణలో మా అలివేలమ్మ లీలలు, బాధితుల గోలలు తెలిసి, నాకు టెన్షన్ పెరుగుతోంది. పత్రికల్లో వచ్చే స్వదేశాగమన ప్రకటల్ని చూసి, వాళ్లకు బలవంతంగా నాచేత ఫోన్స్ చేయించేది. వాళ్లలో ఎవరైనా స్పందించి, కోరికల చిట్టా విప్పితే, అంత ఎత్తుకెగరలేక, వాళ్లమీద వరకట్న నేరం మీద చర్య తీసుకోమని పోలీసుల్ని సతాయించేది. నచ్చిన సంబంధాల విషయంలో- జాతకాలు కుదరలేదనో, నక్షత్రాలు నప్పలేదనో, వరుడికి కల్యాణ ఘడియలు రాలేదనో సైంధవుల్లా అడ్డుపడే సిద్ధాంతుల మీద యుద్ధం ప్రకటించి, భయభ్రాంతులను చేసేది! ఇలా నాలుగైదేళ్లు గడిచినా, పట్టు వదలని, మెట్టు దిగని అలివేలుతో వేగలేక, నేను అసురికి సంబంధాలు చూడ్డం మానేశాను.
    
 మళ్లీ ఇన్నాళ్లకు అలివేలు పిల్చి, ముంచుకొస్తున్న ముహూర్తాల ముప్పు గురించి చెప్పడంతో నా మనసు మరోసారి కరిగి నీరై, కార్యరంగంలోకి దూకాను. అదృష్టవశాత్తూ రెండ్రోజుల్లోనే హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ బుద్ధిమంతుడైన సాఫ్ట్‌వేర్ పెళ్లికొడుకు భోగట్టా తెలిసి, ఎగిరి గంతేసి అతని పెద్దలతో మాట్లాడాను. రోగి వైద్యుడు సామెతగా, వాళ్లు కూడా ముహూర్తాల బెడదతోనే తొందర పడుతున్నారు. నా ప్రయోజకత్వానికి కాలరెగరేసి- ‘విదేశాలనే ఒక్క షరతును సడలిస్తే ఇది చాలా మంచి సంబంధం. ముందుకెళ్దా’మని అలివేలుకి చెపితే- ఈసారి కూడా ఆమె సంబరపడలేదు!
 
 ‘‘అమెరికా సంబంధం ఒకటి లైన్‌లో ఉంది. అది తేలిన తర్వాత ఆలోచిద్దాం’’ అని నీరుగార్చేసరికి నాకొళ్లు మండి, ‘‘ఇలా అయితే ఈ జన్మలో నీ కూతురికి పెళ్లి చేయలేవు’’ అని శపించి ఇంటికొచ్చేశాను. ఇలా జరిగిన మూడోనాడు ఆశ్చర్యంగా అలివేలు నుంచి ఫోనొచ్చింది, ‘జూలై 27 ఆదివారం ఉదయం అసురకు అమెరికా వరుడితో నిశ్చితార్థమనీ, సతీసమేతంగా తప్పనిసరిగా రమ్మనీ!’ ఒక విధంగా నాకిది అలివేలు ముందు మరోసారి తలవంపే అయినా, దాని కార్యసాధనకు మెచ్చుకొంటూ ఆ శుభకార్యానికి హాజరయ్యాను. ఆ రోజు నాతో పాటు మా బంధువర్గమంతా పెళ్లికొడుకు పర్సనాలిటీని, హుందాతనాన్ని, అతని బృందం ఖరీదైన కదలికలను, దర్జాలను, ఫంక్షన్ స్థాయిని చూసి అదిరిపోయాం. అలివేలు ప్రయోజకత్వాన్నీ, అసురి అదృష్టాన్నీ ప్రశంసల పరంపరతో అభినందించాం.
 
 జరిగింది కలా? నిజమా? అలివేలు మాయా? - అని నేను సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకోకముందే జూలై 30న తెల్లవారకుండానే అలివేలు నుంచి పిలుపు - ఉన్నపళంగా రమ్మని! తీరా అలివేలు ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆ వాతావరణం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది!
 ‘‘అన్నయ్యా! నీ మాట విన్నాను కాదు. నన్ను క్షమించు. ఆ అమెరికా పెళ్లికొడుకుకిదివరకే పెళ్లాం పిల్లలున్నారట. మన పిల్ల అదృష్టం బాగుండి, వాళ్ల మోసం ముందుగానే బయట పడింది. నా కళ్లు తెరుచుకున్నాయి. నువ్వు చెప్పిన ఆ హైదరాబాద్ సంబంధం ఖాయం చేసి పుణ్యం కట్టుకో. ఈ ఆపద నుంచి గట్టెక్కించి, మా పరువు కాపాడు’’ అలివేలు కళ్లలో మొదటిసారి నీళ్లు చూశాను.
 
  ‘‘ఛ! ఛ! ఏడవకు. అదృష్టం కొద్దీ ఈ గండం నుంచి బయటపడ్డాం. ఇక మా రాక్షసి పెళ్లి బాధ్యత నాది. అన్నీ కలిసొస్తే, నువ్వు కోరుకున్నట్టు ఆగస్టు ముహూర్తాల్లోనే పెళ్లి జరిపిద్దాం. అప్పుడే నీ కూతురి మొహంలో నిజమైన పెళ్లి కళ వచ్చేసింది చూడు’’ అంటూ పక్కనున్న అసురికేసి చూస్తూ, అలివేలు కళ్లు తుడిచాను.‘ఫో! మావయ్యా’ అని సిగ్గులొలకబోస్తూ అసురి అక్కణ్నుంచి తుర్రుమందని వేరే చెప్పాలా?!
 . డా॥పైడిపాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement