అతని అనువాదం కూడా సాహిత్యమే...
సవ్యసాచి: నిదుర పో... నిదుర పో... నిదుర పో
నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా
నిముసమైన మరచిపోరా...
చందురుని మించు అందమొలికించు
ముద్దు పాపాయినే
చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేనో నా మనసున చిలికేనో
ఆపాత మధురాలైన ఇలాంటి పాటల్ని వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. అందులోనూ ‘సంతానం‘ చిత్రంలోని ‘నిదుర పోరా’ పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా స్మరించని వాళ్లుండరు. అయితే ఈ పాటలన్నీ అనిసెట్టి రాశారని అందరికీ తెలియకపోవచ్చు.
అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు (1922). శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా. సి.నారాయణరెడ్డి వంటి సినీ కవులలాగే సినీరంగ ప్రవేశానికి ముందే అభ్యుదయకవిగా ప్రసిద్ధులు. ‘అగ్నివీణ’, ‘బిచ్చగాళ్ల పదాలు’ వంటి కావ్యాలు... ‘గాలిమేడలు’, ‘మాఊరు’ నాటకాలు, ‘చెప్పు కింద పూలు’, ‘చరమాంకం’ నాటికలు మొదలైనవి అనిసెట్టి పేరు చెప్పగానే చప్పున స్ఫురించే రచనలు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే నవ్య కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అ.ర.సం కార్యవర్గ సభ్యుడిగా 1973లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా అభ్యుదయ కవిత్వంతో పరిచయమున్న వాళ్లెవరూ అనిసెట్టిని మర్చిపోరు. అనిసెట్టి సాహిత్యంపై ఇది వరకే వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. కాని అనిసెట్టి సినీరచనలపై సమగ్ర పరిశీలన జరగలేదు.
అనిసెట్టి 1952లో గిడుతూరి సూర్యం ప్రోత్సాహంతో ‘ప్రియురాలు’ చిత్ర రచయితగా సినీరంగంలో అడుగుపెట్టి ‘శ్రీకృష్ణ లీలలు’ (1956), ‘కొండవీటి దొంగ’ (1958) అనువాద చిత్రాలతో ఆ రంగంలో నిలదొక్కుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్రల తర్వాత ఆ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. అనిసెట్టి రచయితగా పని చేసిన సుమారు 130 చిత్రాలలో డెరైక్ట్ చిత్రాలు 40 కాగా మిగిలినవన్నీ అనువాదాలే. అనువాదాల్లో ఆరుద్ర లిప్‌సింక్ కంటే తెలుగుదనానికి ప్రాధాన్యం ఇస్తే అనిసెట్టి లిప్‌సింక్‌ని నిర్లక్ష్యం చేయకుండా వీలయిన వరకు మూలంలోని భావాలను కూడా అనువదిస్తూ అనువాద రచనను అసిధారవ్రతంలా నిర్వహించారు. అనిసెట్టి అనువాదం చేసిన సినిమాల్లో ‘కొండవీటి దొంగ’, ‘మావూరి అమ్మాయి’, ‘పాప పరిహారం’ ‘మాయామశ్చీంద్ర’, ‘సర్వర్ సుందరం’, ‘లోకం చుట్టిన వీరుడు’ మొదలైనవి పేరు తెచ్చాయి. మలయాళంలో వచ్చిన మొట్టమొదటి ‘స్వామి అయ్యప్ప’ సినిమాకు తెలుగు అనువాదం అనిసెట్టే. ఆ పాటలు నేటికి అయ్యప్ప భక్తుల కార్యక్రమాల్లో వినబడుతుంటాయి. ఆయన అనువాదం చేసిన ‘కొండవీటి దొంగ’లోని పాటల్లో తెలుగుదనం చూడండి.
సాహసమే జీవితపు బాటరా
సత్యమే నీ లక్ష్యమని చాటరా
తమలపాకు సున్నమూ
పడుచువాళ్లకందమూ
ఒక్కడికీ ఇద్దరయా
ఇవి కలికాలపు బుద్ధులయా...
ఇవి వింటే అనువాదమని అనుకోరు. ఇక భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘పాలుం పశముం’ (1961) తమిళ చిత్రం తెలుగులో ‘ప్రాయశ్చిత్తం’గా అనువాదమైతే తమిళంలోని కన్నదాసన్ మాతృరచనకు అనిసెట్టి అద్భుతమైన తెలుగు అనువాదం చేశారు. ఆ పాట-
పోతే పోనీ పోరా
ఈ పాపపు జగతీ శాశ్వతమెవరురా...
ఈ పాటలోని తాత్త్విక వాక్యాలు చూడండి.
జీవితమే ఒక స్వప్నమహో
మన జననం కమ్మిన నిద్దురహో
ఇట మరణం ఆత్మకు వేకువహో...
తమిళంలో ఎలా ఉన్నా తెలుగులో ఇది ఉన్నత సాహిత్య రూపం తీసుకుంది. ఇది అనిసెట్టి ఘనత. భీమప్రతిజ్ఞ (1965)లో ఆయన రాసిన పాట అనువాదంలో కూడా సాహిత్యవిలువ తేవచ్చనడానికి ఉదాహరణ.
వీచెను కాలపు సుడిగాలి
అది విసరెను బాధల పెనుధూళి
విధికి లేదులే ఏ జాలి
ఆ విధాతకిదియే ఒక కేళి...
‘కళత్తూర్ కన్నమ్మ’ తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా అనువాదం అవగా అందులో అనిసెట్టి రాసిన-
కనిపెంచు తల్లీ కాపాడుతండ్రీ
ఆపదలో ఆదరించు దైవము నీవే
పాట అదే ఇతివృత్తంతో తీసిన ‘మూగనోము’ కోసం ఆరుద్ర రాసిన
తల్లివి నీవే తండ్రి నీవే/ చల్లగ కరుణించే దైవము నీవే
పాటకు స్ఫూర్తి కావడం అనిసెట్టికి గర్వకారణం.
అనిసెట్టి 1979 డిసెంబర్ 27న నరసరావు పేటలో 57 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన ఖాళీ అన్నది ఎరగరు. మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చినా మళ్లీ ‘సర్వర్ సుందరం’తో విజృంభించారని అంటారు. తన స్వీయ నిర్మాణంలో తీసిన ‘మన ఊరు’ ఆయన చివరి సినిమా. అనిసెట్టి ఒక మంచికిగాని చెడుకుగాని బయటకు వెళ్లేవారు కాదట. ఇంట్లోనే రాసుకుంటూ కూర్చునేవారట. ఏవిఎం, దేవర్ ఫిలిమ్స్‌కు ఆయన పర్మినెంట్ రైటర్. పదిహేను రోజులకో సినిమా ముగించేవారు.
అనువాద చిత్రాలనూ, పాటలనూ ద్వితీయ శ్రేణికి చెందినవిగా కొందరు భావించినా, అనువాద రచనను కొందరు రచయితలు జీవిక కోసమే స్వీకరించినా అనువాద రచన కూడా అంకిత భావంతో స్వీకరించి దాని గౌరవాన్ని పెంచిన కొద్దిమంది రచయితల్లో అనిసెట్టి ఒకరు.
- పైడిపాల 9989106162