C. Narayana Reddy
-
ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష...
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘అమెరికా అబ్బాయి’ చిత్రంలో సి. నారాయణరెడ్డి రచించిన ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా/పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము/రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడూ’’ అని ప్రారంభమయ్యే పల్లవిని అభేరి రాగంలో స్వరపరచారు. ఈ చిత్రానికి నేను నాన్నగారికి సహాయకుడిగా పనిచేశాను. ఈ పాటను 1986లో కంపోజ్ చేశారు, 1987లో విడుదలైంది. అప్పటికే సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిపోయింది. ఈ చిత్ర నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారికి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చెన్నైలో అన్నపూర్ణ ఆఫీసు ఉండేది. హైదరాబాద్‌కి వెళ్లిపోయాక ఆ స్టూడియో లేదు. నాన్నగారితో పాట ట్యూన్ చేయించుకోవాలనుకుంటే, తప్పనిసరిగా చెన్నై రావలసిందే. ఆ రోజుల్లో పాట కంపోజింగ్ పద్ధతి వేరేగా ఉండేది. పాటను కవి రాసి ఇచ్చేస్తే, సంగీత దర్శకుడు స్వరపరచడం అనే విధానం ఉండేది కాదు. మధుసూదనరావుగారు ఈ సినిమా పాటల కోసం చెన్నై వచ్చారు. ఆయన సుశీల గారి ఇంట్లో దిగేవారు. ఆవిడ ఇంట్లో మేడ మీద ఒక హాలు, గది ఉండేవి. అక్కడే పాట కంపోజింగ్ జరిగేది. పాట కోసం సినారె, డి. మధుసూదనరావు, నాన్నగారు, సుశీలగారు అందరూ ఒక చోట కూర్చున్నారు. అప్పుడు మధుసూదనరావుగారు నాన్నగారితో, ‘‘మీ మూడో అబ్బాయి వాసూరావు చాలా హుషారుగా ఉంటున్నాడు. ఈ సినిమాకి మీ అసిస్టెంట్‌గా ఈ అబ్బాయిని పెట్టుకోండి’ అని సూచించారు. మా పెద్ద అన్నయ్య రామలింగేశ్వరరావు కూడా నన్ను తీసుకోమని చెప్పడంతో నాన్నగారు అంగీకరించారు. మొదటి చరణంలో ‘‘పుట్టింది ఈ మట్టిలో సీత/ రూపు కట్టింది దివ్య భగవద్గీత/వేదాలు వెలసిన ధరణిరా/ ఓంకార నాదాలు పలికిన అవనిరా/ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు/ వికసించె మన‡నేల విజ్ఞాన కిరణాలు’’ అనే చరణంలో ‘వేదాలు వెలసిన ధరణిరా’ అనే వాక్యాన్ని రేవతి రాగంలో స్వరపరచారు. అక్కడ నుంచి వెంటనే అభేరి రాగానికి వెళ్లడంలో నాన్నగారి గొప్పదనం కనిపిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోగాలు చేయడం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సాధారణంగా ఒక సినిమాకు పాట చేసేటప్పుడు, రచయిత పాట రాసి ఇచ్చేస్తే సంగీత దర్శకుడు సంగీతం చేసేసి, ఆ పాటను రికార్డు చేసి, గాయకులకు టేప్ ఇచ్చేస్తే, వారు ఎక్కడో ఒక చోట కూర్చుని సాధన చేసి పాడేస్తుంటారు. కాని మధుసూదనరావుగారి విధానం చూస్తే ఆశ్చర్యం వేసింది. అన్నపూర్ణ సంస్థలో అందరూ కలిసి ఒకచోట కూర్చుని పనిచేస్తారు. ఈ పాట పల్లవిలో ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా’’ అని రాయప్రోలు వారి రచనతో ప్రారంభమైనప్పుడు, అక్కడ ఉన్నవారిలో ఒకరు ‘ఎవ్వరెదురైనా’ పదం ఎందుకు ఉపయోగించారు? అని ప్రశ్నిస్తే, మధుసూదనరావుగారు, ‘‘ఏ భాషకు చెందినవారు ఎదురైనా, తొణకకుండా ‘పొగడరా నీ తల్లిని’ అని చెప్పడం కోసం ఉపయోగించారు అని చెప్పారు. ఆయన కేవలం డబ్బులు పెట్టే నిర్మాత మాత్రమే కాదు, అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్న నిర్మాత. ‘‘వెన్నెలది ఏ మతమురా కోకిలది ఏ కులమురా/గాలికి ఏ భాష ఉందిరా నీటికి ఏ ప్రాంతముందిరా/గాలికీ నీటికీ లేవు భేదాలు/ మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు’’ అని సమానత్వం గురించి ఎంతో అందంగా వివరించారు సినారె ఈ చరణంలో. ఆఖరి చరణం ‘‘గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు/ గాంధీ చూపిన మార్గం విడవద్దు/ద్వేషాల చీకట్లు తొలగించు/ స్నేహదీపాల ఇంటింటాæ వెలిగించు/ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష/ అందుకే నిరంతరం సాగాలి దీక్ష’’అంటూ పాట ముగుస్తుంది. ఈ పాటను ఖండగతిలో, చతురస్ర మిశ్రమ తాళాలలో రాగమాలికలో స్వరపరచారు. ఆ పాటకు పనిచేయడం నాకు మంచి అనుభవం. ఈ పాట కోసం సి. నారాయణరెడ్డిగారిని హైదరాబాద్ నుంచి చెన్నై రప్పించారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ చిత్రం: అమెరికా అబ్బాయి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు రచన: సినారె గానం: సుశీల సంగీత సహకారం: సాలూరి వాసూరావు సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకులు వాసూరావు సంగీత దర్శకులు -
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీతానికి బాలమురళీకృష్ణ. సాహిత్యానికి సి.నారాయణరెడ్డి. సంగీత సాహిత్య సమలంకృతంగా వారి పిల్లలైన రవాలను, వాహినులను సాక్షి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన సంగీతాన్ని పండితపామరులకు చేరువ చేశారు. సంగీతంతో ప్రపంచాన్ని తన్మయత్వంలో ముంచెత్తారు. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగా ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా గడిపేవారు? ఈరోజు ఫాదర్స్‌డే. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. ఆయన ఆరుగురు పిల్లల్ని పలకరించింది. ఆ తండ్రి అను‘రాగాల’ గురించి తెలుసుకుంది. మురళీ రవాలు పెద్దబ్బాయి అభిరామ్, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి. పెద్దబ్బాయి ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్దమ్మాయి బీఏ మ్యూజిక్ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి బీఎస్సీ, మూడో అమ్మాయి ఎంఏ ఇంగ్లిష్. పెద్దమ్మాయి అమ్మాజీ నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు సూర్యకాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన నాకు చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు ఎంతో పరవశించిపోయారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి చేశాం. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి నాన్న ఎంతో సంబరపడ్డారు. రెండో అమ్మాయి లక్ష్మి మాతో క్యారమ్స్ ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్ రింగ్ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు. రెండో అబ్బాయి సుధాకర్ నాన్నగారికి అందమైన బాల్యం లేదు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆడే లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు. మాకోసం సింగపూర్ నుంచి టేప్ రికార్డర్ తెచ్చారు. అది ఇప్పటికీ మా దగ్గర ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్ డిసి వచ్చారు. అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్‌లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది. మూడో అమ్మాయి మహతి ఆయన మాతో చాలా అటాచ్డ్గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు... నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది. వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం. నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మానాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని. నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచాలనీ అనుకుంటున్నాం. మూడో అబ్బాయి డా. వంశీమోహన్ నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు. ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు. ( తల్లిదండ్రులు అన్నపూర్ణ, బాలమురళీకృష్ణలతో 1. సూర్యకాంతి, 2. లక్ష్మి 3. మహతి 4. అభిరామ్, 5. డాక్టర్ సుధాకర్, 6. డాక్టర్ వంశీమోహన్; అల్లుళ్లు, కోడళ్లు) పెద్దబ్బాయి అభిరామ్ మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను నాన్నగారు పనిచేశారు. 1964లో ఆయన మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్ వన్ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని నమ్మేవారు. (బాల మురళికృష్ణ పెద్దమ్మాయి అమ్మాజీ, పెద్దబ్బాయి అభిరామ్, రెండో కూతురు లక్ష్మి) నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం ^è దువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే. ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్ రివల్యూషనరీ నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ బట్ ఇన్ లైఫ్ ఆల్సో. – సంభాషణ: వైజయంతి పురాణపండ కవన వాహినులు ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ అన్నారు సినారె. అమ్మ బొమ్మ (ఫొటో) లేదని... అమ్మ బొమ్మ గీయలేని అశక్తుణ్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇది జరిగి రెండేళ్లయింది. ‘నాన్న రూపం కళ్ల ముందు నుంచి చెరగడం లేదు. ఆయన నవ్వు ముఖంతో శాశ్వతనిద్రలోకి జారిపోయి ఏడాదైంది. రోజూ అలవాటుగా నాన్న గది వైపు చూస్తూనే ఉన్నాం మా నలుగురు అక్కాచెల్లెళ్లం’ అన్నారు డాక్టర్ సినారె గారి పెద్దమ్మాయి గంగ. సంతోషం, దుఃఖం ఏదైనా సరే... అనుబంధం వ్యక్తమయ్యేది కన్నీళ్ల రూపంలోనే. ఫాదర్స్ డే సందర్భంగా డాక్టర్ సినారె జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారామె. ‘‘మా నాన్నకు మేము నలుగురం కూతుళ్లం. ఆ రోజుల్లో అబ్బాయి కోసం ఎదురు చూసేవాళ్లు. మగపిల్లవాడులేడని మా నానమ్మ, అమ్మ ఇద్దరికీ కొంచెం కొరత ఉండేది. కానీ నాన్నలో అది లేశమాత్రమైనా ఉండేది కాదు. ఎవరైనా ‘అందరూ అమ్మాయిలేనా’ అంటే ఆ మాట కూడా ఆయనకు నచ్చేది కాదు. ‘నాకు నలుగురు అమ్మలు’ అనేవారు. అమ్మ పోయిన తర్వాత నాన్న ఆమెతో చెప్పాలనుకున్న భావాలను ‘ఎంత స్వార్థం నీది... నలుగురు కూతుళ్లను కన్నావు. ఇప్పుడు తెలిసింది... నాలుగు దిక్కుల్లా తోడుంటారని’ అని రాసుకున్నారు. నదుల పేర్లు నాన్నది బాల్య వివాహం. వాళ్ల నానమ్మ తాను పోయేలోపు పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో పదకొండేళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మకి తొమ్మిదేళ్లు. అమ్మకి భక్తి ఎక్కువ, నాన్న దేవుణ్ని నమ్మేవారు కాదు. నేను పుట్టక ముందు నాలుగైదు సార్లు గర్భం పోవడంతో అమ్మ గోదావరి నది తీరాన నలభై రోజులు ఉపవాస దీక్ష చేసింది. ఆరోగ్యం పాడవుతుందని నాన్న వద్దన్నా వినకుండా దీక్ష చేసిందట. ఆ తర్వాత నేను పుట్టడంతో గంగ అని పేరు పెట్టుకుంది అమ్మ. మా కరీంనగర్లో గోదావరి నదిని గంగగానే వ్యవహరిస్తారు. నాన్నకు స్వతహాగా నదులంటే ఇష్టం. దాంతో మిగిలిన ముగ్గురికీ యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. ఇంట్లో అనుబంధాలు జీవనదుల్లా ప్రవహించాలనేది ఆయన కోరిక. (తండ్రి డాక్టర్ సి. నారాయణరెడ్డితో గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి) అమ్మకు పక్షవాతం నాకు ఏడేళ్లున్నప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చింది. అయినా సరే హెల్పర్‌తో అన్నీ సిద్ధం చేయించుకుని ఒక్కచేత్తోనే నాన్నకు ఇష్టమైనవి వండేది. రోజూ నాన్న ఇంటికి రాగానే తలుపు తీసేదాన్ని. ఇంటికి రాగానే అమ్మ మంచం దగ్గర కూర్చునేవారాయన. అమ్మ పోయే వరకు కూడా ఆయన దినచర్య అలాగే సాగింది. ఉపవాసాలతో ఆరోగ్యం పాడుచేసుకుంటుందని నాన్నకు అమ్మ గురించి ఎప్పుడూ బెంగ ఉండేది. భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడగని రోజుండేది కాదు. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుండేవారు. అమ్మ చేతి వంట కోసం గుమ్మడి గారు కూడా వచ్చేవారు. మీరు నన్ను పోనిస్తారా! చిన్నప్పటి నుంచి నాకు నాన్న కోసం ఎదురు చూడడం, నాన్న భోజనం చేస్తున్నంత సేపు దగ్గర ఉండడం నాలవాటయిపోయింది. నలుగురిలో ఎవరో ఒకరం నాన్న భోజనం చేసినంత సేపూ దగ్గర ఉండేవాళ్లం. భోజనం కాగానే ట్యాబ్లెట్ ఇస్తే ఎప్పుడు నోట్లో వేసుకునేవారో గుక్కెడు నీటితో మింగేసేవారు. నాకేమో ట్యాబ్లెట్ గొంతు దిగిందో లేదోనని భయం. ఇంకొంచెం నీళ్లు తాగు నాన్నా అంటే... ‘నీకు చాదస్తం ఎక్కువవుతోందమ్మాయ్. వయసొస్తున్నది నీకా నాకా’ అనేవారు. గొంతు పట్టేస్తే ఎలా నాన్నా అంటే... ‘నాకేమవుతుంది, ఏమైనా అయినా అడ్డుపడి కాపాడుకోవడానికి మీరున్నారు కదా, నన్ను అంత సులభంగా పోనిస్తారా’ అనేవారు నవ్వుతూ. అందరూ కనిపించాలి! ఏ తండ్రికైనా కూతుళ్ల మీద ప్రేమ అలాగే ఉంటుందేమో, మా నాన్న మమ్మల్ని పొద్దుపోయాక చదువుకుంటున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అంతంత కష్టం ఎందుకనేవారు. ఆయన నిద్రపోయిన తర్వాత లైట్ వేసుకుని చదువుకునేది మా యమున. జీవితంలో చికాకులు పెంచుకోకూడదు, ప్రశాంతంగా జీవించాలనేవారు. పెళ్లి చేసి అత్తగారిళ్లకు పంపిస్తే రోజూ మమ్మల్ని చూడడం కుదరదని అందరినీ తన దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఫిలింనగర్లో మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరి కుటుంబం, వెనుక ఒక పోర్షన్లో ఒక కుటుంబం ఉండేది. అందరికీ వంటగది ఒక్కటే. అల్లుళ్లతోనూ మాతో ఉన్నంత ప్రేమగా ఉండేవారు. ఇక మనుమలు, మనుమరాళ్లనయితే కనురెప్ప వేయకుండా చూసుకునే వారు. అచ్చమైన సోషలిస్టు! నాన్న గొప్ప సోషలిస్టు. ఉద్యమాల్లో పాల్గొనలేదనే కాని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను పాటించేవారు. మనుమల్లో ఎవరికీ పేరు చివర కులవాచకాల్లేవు. వాళ్లలో చిన్నప్పుడు కనిపించిన లక్షణాలను బట్టి పేర్లు పెట్టారు. లయ చరణ్ ఉయ్యాల్లో ఉన్నప్పుడు నాన్న చిటికెలు వేస్తుంటే వాడు ఆ చిటికెల శబ్దానికి ఆనందంగా కాళ్లను లయబద్దంగా ఆడించేవాడు. అందుకే ఆ పేరు. అన్వేష్ ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కళ్లు విప్పార్చి చూసేవాడు. మేడే రోజు పుట్టిన బాబుకి క్రాంతి కేతన్ అని, చైతన్యదేవ్ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ. మా ఊరు హనుమాజీ పేటలో అన్ని కులాల వారినీ బంధుత్వంతోనే పిలిచేది మా నానమ్మ. నాన్నకు కూడా అదే అలవాటు వచ్చింది. కులాలవారీగా మనుషులను దూరంగా ఉంచే రోజుల్లోనే వాళ్లు సోషలిస్టు భావాలను అనుసరించారు. అందుకేనేమో నాన్నలో మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం కనిపించేది. మనుమలతోపాటే ఇంట్లో ఉన్నంత సేపూ మనుమలు, మనుమరాళ్లందరూ ఆయన చుట్టూ ఉండాల్సిందే. మేము పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటే ‘నాకూ పెట్టమ్మాయ్’ అని పెట్టించుకునేవారు. మేము ఎంత దగ్గర బంధువుల పెళ్లి అయినా సరే నలుగురమూ వెళ్లింది లేదు. ఎవరో ఒకరం నాన్న దగ్గర ఉండేవాళ్లం. పెళ్లికి వెళ్తూ ‘నాన్నా పెళ్లికి వెళ్లి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాం’ అని చెప్పడానికి నోరు తెరిచినా, మాకు గొంతు పెగిలేది కాదు. ఆయనకు మేము వెళ్లడం నచ్చేదీ కాదు. ‘బంధువులు కదా’ అనేవారు ముక్తసరిగా. నేను మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడైతే ఆయన ఒకటే ఏడుపు. ఆయన కన్నీళ్లు చూసి నాకూ ఏడుపాగలేదు. చాలాసేపటి తర్వాత ‘నువ్వు వెళ్లకపోతే అక్కడ పాప ఇబ్బంది పడుతుంది. వెళ్లిరా’ అన్నారు. అలా పంపించిన తర్వాత ఆయన నా కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపారని చెల్లెళ్లు చెప్పేవాళ్లు. నేను మనుమరాలిని నెలల పాపాయిని తీసుకుని ఇండియాకి వస్తున్నప్పుడు (వరేణ్య, నాన్నకు మునిమనుమరాలు) ఎయిర్‌పోర్టుకి వచ్చేశారు. ఆలస్యంగా నిద్రపోయారు గత ఏడాది జూన్ 12వ తేదీ. తెల్లవారు జామున నాలుగ్గంటలకు నాకు మెలకువ వచ్చింది. అంతకు మూడు గంటల ముందే నాన్నకు దగ్గు మందు తాగించి ఆయనకు నిద్రపట్టిన తర్వాత నేను పడుకున్నాను. అంతలోనే మెలకువ వచ్చింది. నాన్న గది దగ్గరకు వచ్చాను. నాన్నకు టెంపరేచర్, బిపి చెక్ చేయడానికి యమున కూడా వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండడంతో భోజనం వద్దని బ్రెడ్, పాలు ఇచ్చాం. టెంపరేచర్ నార్మల్‌గానే ఉందని చెప్పి యమున పైన గదిలోకి వెళ్లింది. నేను నాన్నను ఒకసారి చూసి, ఆలస్యంగా పడుకున్నారు కదా, ఆరు గంటలకు నిద్రలేపుదాం అని అలాగే కూర్చున్నాను. ఆరయ్యేలోపే అటెండర్ వచ్చి ‘యమునమ్మ’ అంటూ ఆగాడు. యమున వచ్చి పల్స్ చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ ఏడాది కాలంగా నాకు ఎప్పటి లాగానే ఉదయం నాలుగింటికే మెలకువ వస్తోంది. నాన్న లేడని తెలిసి కూడా ‘నాన్నా లే’ అనే పిలుపు నోటి వరకూ వస్తూనే ఉంది. ఈ నెల పన్నెండవ తేదీన ఆయన సంవత్సరీకానికి మిత్రులందరూ సారస్వత పరిషత్‌లో కలిశారు. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే నాన్న లేదా వేదిక మీద పులిలా కనిపించే నాన్న రూపాలే తెలుసు. ఆ రోజు అందరూ ఉన్నారు వేదిక మీద నాన్నలేరు. ఇప్పుడు మాతో ఉన్నది ఆయన జ్ఞాపకాలే’’. యమున నాన్న మా చిన్నప్పుడు సినిమాలకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ నోరు తెరవమనేవారు. పళ్లు శుభ్రంగా తోముకుంటున్నామా లేదా అని అంత పట్టింపుగా ఉండేవారు. సరిగ్గా బ్రష్ చేయట్లేదనిపిస్తే కోప్పడేవారు. నాన్నకు రోజూ కళ్లద్దాలు, వాచీ తుడిచి ఇచ్చేదాన్ని. నాకు వంటలో ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడతాయి. ‘నువ్వింత సున్నితంగా ఉంటావు, మృదువుగా మాట్లాడుతావు. వంట ఎందుకు అంత ఘాటుగా చేస్తావు’ అనేవారు. ఆయన పరిషత్తుకెళ్లేటప్పుడు బాక్స్ పెడతాం. బాక్స్ తెరిచి చూడగానే... మా నలుగురిలో ఆ రోజు బాక్స్ ఎవరు పెట్టి ఉంటారనేది పట్టేసేవారు. సరస్వతి నాన్న ఉదయం ఐదున్నరకి అల్లుళ్లతోపాటు వాకింగ్‌కి వెళ్లేవారు. నాన్న జేబులో చిన్న నోట్‌బుక్, పెన్ను ఎప్పుడూ ఉంటాయి. వాకింగ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను నోట్‌బుక్‌లో రాసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్‌ని గంగక్కకిచ్చేవారు. అక్క కాపీని తిరగరాసేది. అమ్మ అనారోగ్యం కారణంగా చెల్లెళ్ల బాధ్యత అంతా పెద్దక్కే చూసుకుంది. నాన్న కూడా అన్ని పనులకూ అక్క మీదనే ఆధారపడేవారు. రచనలకు వచ్చిన డబ్బుని ఇంటికి రాగానే ‘అమ్మాయ్’ అని పిలిచి అక్కకిచ్చేసి జేబు బరువు తీరినట్లు భావించేవారు. జేబులో అసలే డబ్బు పెట్టుకోకపోతే ఎక్కడైనా టిప్పు ఇవ్వాల్సి వస్తే ఎలా అని అక్క రోజూ నాన్న జేబులో కొంత డబ్బు పెడుతుండేది. కృష్ణవేణి నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని తాను రాసిన గజల్స్ చదివి వినిపించేవారు. రాత్రి ఇంటికి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ‘పిల్లలు (మనుమలు, మనుమరాళ్లు) నిద్రపోకపోతే కొంచెం సేపు మెలకువగా ఉంచండి, వచ్చేస్తున్నాను’ అని చెప్పేవారు. ఆయనకు హిందీ సినిమాలిష్టం. సినిమాలు చూడాలనుకుంటే మనుమలు, మనుమరాళ్లందరినీ తీసుకుని వెళ్లేవారు. కుటుంబం డాలర్ హిల్స్‌కి మారేటప్పుడు పెద్దగా ఇష్టపడలేదు నాన్న. ఫిలిం నగర్ ఇల్లు బాగానే ఉందిగా మారడం ఎందుకన్నారు. ఆ ఇంటిని నాన్న కోసమే డిజైన్ చేయించాం. ఆయన డ్రాయింగ్ రూమ్‌లోకి కూర్చుంటే ఇల్లంతా ఆయనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నారంతే. – సంభాషణ: వాకా మంజులారెడ్డి -
సినారెకు ఆటా ఘన నివాళి
కెంటకీ: తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సంతాపాన్ని తెలిపింది. కెంటకీ, లెక్సింగ్టన్లో ఆటా సభ్యులు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి మసాలా ఇండియన్ రెస్టారెంట్లో ఆటా బృందంతో పాటు తెలుగు ఎన్నారైలు సినారెకు తుది నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి సినారె అందించిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అనుగు, మిమిక్రీ రమేశ్, అనిల్ బొడ్డిరెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, కెంటకీ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేశ్ గుండ్లూరు, అనిల్ గంటేటి, ఆటా కార్యవర్గ బృందం హేమ ప్రసాద్ సడ్డాలా, బాబు కొండవీటి, సురేశ్.ఎం, డాక్టర్ రాపూరి, రమేశ్ సొంటేనమ్, రమేశ్ మల్నేని, నయన్.ఎం, సురేశ్ పొట్లూరీ, శ్రీని ఆకుల, పార్శి, శ్రీనివాస్ సత్రశాల, శ్రీనివాస్ రెడ్డి, లెక్సింగ్టన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని సాహితీ శిఖరం సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. -
సినారెకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: తన కలంతో సాహితీజగత్తును ఓలలాడించిన విశ్వకవనమూర్తి సినారె భౌతిక ప్రయాణం ముగిసింది. మానవుడే ఇతివృత్తంగా ఆవిర్భవించిన ‘విశ్వంభరుడి’కి అశేష జనవాహిని అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. మహా కవిని కడసారి చూసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, సాహితీవేత్తలు, పలు రంగాల ప్రముఖులు తరలివచ్చారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. స్వగృహం నుంచి సారస్వత పరిషత్తుకు.. సినారె సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయన మనవళ్ల రాక కోసం సినారె పార్థివదేహాన్ని పుప్పాలగూడలోని డాలర్స్‌కాలనీలో ఉన్న స్వగృహంలో ఉంచారు. బుధవారం తెల్లవారుజామున మనవళ్లు ఇక్కడికి చేరుకోవడంతో ఉదయం 8 గంటలకు సినారె అంతిమయాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలు, పోలీసు బ్యాండ్‌తో పుప్పాలగూడ నుంచి బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తుభవన్కు చేరుకుంది. కవులు, రచయితలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు సినారె పార్థివదేహాన్ని అక్కడ ఉంచారు. అనంతరం సారస్వత పరిషత్తు నుంచి తిరిగి ప్రారంభమైన అంతిమయాత్ర... నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల మీదుగా మధ్యాహ్నం 1.20 గంట లకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న సీఎం కేసీఆర్, పలు వురు మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకున్నా రు. మధ్యాహ్నం 1.30 సమయంలో భౌతికాయాన్ని మహాప్రస్థానంలోని ‘మోక్ష స్థల్’చితిపై ఉంచారు. అనంతరం సీఎం కేసీఆర్ అధికారికంగా మహాకవికి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు, ఇతర ప్రముఖు లు నివాళి అర్పించారు. 1.45 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకు కడసారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఈ సమయంలో కు టుంబ సభ్యుల రోదనలతో విషాదం అలముకుంది. చివరిగా హన్మాజీపేట వాసులు, అభిమానులు తమ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహాకవిని చివరిసారి వీక్షించేందుకు సినారె స్వగ్రామం హన్మాజీపేట, వేములవాడ, సిరిసిల్ల, తదితర ప్రాంతాలకు చెందిన వందల మంది అభిమానులు, హైదరాబాద్‌లోని పలు కళాశాలల విద్యార్థులు మహాప్రస్థానానికి తరలి వచ్చారు. తొలుత వారికి సినారె పార్థివదేహాన్ని చూసేందుకు అవకాశం లభించలేదు. అయితే సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి జోక్యంతో పోలీసులు కొంతసేపు అవకాశం కల్పించారు. చివరగా 2.05 గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య, ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. హాజరైన ప్రముఖులు.. అంతకుముందు గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం పుప్పాలగూడలోని నివాసంలో సినారె పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ‘సాక్షి’మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి తదితరులు సినారె పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వద్ద సినారె అంత్యక్రియలకు ఆయన మనవళ్లు అన్వేష్‌రెడ్డి, క్రాంతికేతన్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని, జగదీశ్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్, శాసనమండలి విప్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీ బాల్క సుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, బాబూమోహన్, ప్రకాష్ గౌడ్, మర్రి శశిధర్‌రెడ్డి, సాహితీవేత్తలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లతోపాటు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, అభిమానులు హాజరయ్యారు. పోలీసుల అత్యుత్సాహంతో ఇబ్బంది సీఎం రాక దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసుల అత్యుత్సాహంతో సినారె కుటుంబసభ్యులు, బంధువులకు ఇబ్బంది ఎదురైంది. సినారె పార్థివదేహంతో వచ్చిన వాహనం వెనుక మరో బస్సులో సినారె కుమార్తెలు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు సహా ఇతర బంధువులు వచ్చారు. అయితే పోలీసులు ఆ బస్సును జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అనుమతించకుండా దర్గా చౌరస్తా వద్ద నిలిపివేశారు. దాంతో వారంతా దిగి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. పోలీసుల తీరుపై పలువురు బంధువులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సినారె ప్రియశిష్యులైన ఆచార్య గోపి వంటి కవులు, ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కవి శివారెడ్డి, ఓల్గా, కుటుంబరావు తదితరులంతా మోక్షస్థల్ వరకు వెళ్లలేకపోయారు. సాహితీలోకం నివాళులు తెలంగాణ సారస్వత పరిషత్ సినారెకు సమున్నతంగా నివాళులర్పించింది. పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు సారస్వత పరిషత్తు వద్ద సినారె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సాహిత్యాన్ని, సినారెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాయుద్ధనౌక గద్దర్ తన పాటతో సినారెకు నివాళులర్పించారు. మనవరాలి కన్నీటి కవిత.. సినారె అంతిమయాత్ర ప్రారంభానికి ముందు ఆయన నివాసం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సినారెతో జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సినారె మునిమనవరాలు వరేణ్య తాతపై రాసిన ‘ఓ మైగ్రాండ్పా’కవిత చదివి వినిపించింది. అందులో ఆమె తాతపై కురిపించిన ప్రేమానురాగాలను గుర్తుచేసుకున్నప్పుడు కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా బాధలో మునిగిపోయారు. సినారె శిష్యుడినని గర్వంగా చెప్పుకునే గజల్ శ్రీనివాస్ కూడా సినారెపై రాసిన కవితను వినిపించారు. పార్థివదేహాన్ని ఇంట్లో నుంచి తరలిస్తున్న సమయంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సినారె జీవితం, మరణాన్ని కవితగా వినిపించారు. -
నేడు సినారె అంతిమయాత్ర
డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు పుప్పాలగూడ డాలర్హిల్స్లోని ఆయన స్వగృహం నుంచి షేక్‌పేట్ నాలా, మెహదీపట్నం, ఆబిడ్స్ మీదుగా తిలక్‌రోడ్డులోని తెలంగాణ సారస్వతపరిషత్తుకు ఆయన పార్థివ దేహాన్ని చేరుస్తారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కవులు, రచయితల సందర్శనార్ధం అక్కడ ఉంచుతారు. ఆ తర్వాత సారస్వతపరిషత్తు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీచౌకి, విస్పర్‌వ్యాలీ మీదుగా మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకుంటుంది. –సాక్షి, సిటీబ్యూరో -
సినారెను సముచితంగా గౌరవించుకుంటాం: కేసీఆర్
హైదరాబాద్: విశ్వవిఖ్యాత కవిరేడు పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయరణరెడ్డి పేరుమీద హైదరాబాద్ నగరం నడిబొడ్డున స్మారక భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా మహాకవిని సముచితంగా గౌరవించుకుంటామని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సినారె భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ‘సి. నారాయణరెడ్డిగారు పుట్టిన ఊరైన హనుమాజీపేట తోపాటు హైదరాబాద్ ట్యాంక్‌బండ్, సిరిసిల్ల, కరీంనగర్‌లలో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటుచేస్తాం. వారు ఎంతగానో ప్రేమించిన సార్వత కళా పరిషత్‌కు ఇదివరకే గ్రాంట్లు అందించాం. ఇక ముందు కూడా ఆ సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రాష్ట్రంలోని ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడతాం. సినారెను ఇంకా గొప్పగా గౌరవించుకునేక్రమంలో ప్రభుత్వానికి ఉత్తమ సలహాలు ఇవ్వదలుచుకుంటే స్వీకరిస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సినారె భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ వెంట డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. అమెరికా నుంచి కుటుంబసభ్యులు రావాల్సి ఉంది. బుధవారం ఉదయం సినారె అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సినారె(85) సోమవారం తెల్లవారుజామున నిద్రలోనే తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
సాహితీలోకం
రఫీ నోట సినారె పాట రఫీ తెలుగు పాట పాడటం విడ్డూరం. అదీ ఎన్టీఆర్‌కు పాడటం ఇంకా విచిత్రం. కానీ ఆ విచిత్రం సాధ్యమైంది. పైగా అది జనానికి నచ్చింది. నిర్మాత పుండరీకాక్షయ్యకు రఫీ అంటే అభిమానం. ఆయన తన ‘భలే తమ్ముడు’లో రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఇది షమ్మీ కపూర్ ‘చైనా టౌన్’కు రీమేక్ కాబట్టి అందులో హిట్ అయిన ‘బార్ బార్ దేఖో’ను తెలుగులో అనుసరించి దాంతోపాటు మిగిలిన పాటలను కూడా రఫీ చేత పాడిద్దామనుకున్నారు. ఆ పాటలు సినారెకు రాసే అవకాశం వచ్చింది. ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ పెద్ద హిట్. ‘నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే’ పాట కూడా. ఆ తర్వాత ‘గీత్’ రీమేక్ ‘ఆరాధన’లో సినారె రాసిన పాటలకు మళ్లీ రఫీ పాడారు. ‘నా మది నిన్ను పిలిచింది గానమై’, ‘నేడే తెలిసింది ఈనాడే తెలిసింది’ నేటికీ రేడియోలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మంచి అవకాశం ఏమిటంటే సి.రామచంద్ర సంగీతంలో ‘అక్బర్ సలీం అనార్కలి’కి సినారె పాటలు రాయడం. అందులోని ‘సిపాయీæ సిపాయీ’, ‘తానె మేలి ముసుగు తీసి’.. రఫీ గొంతులో తెలుగు ప్రేక్షకులను అలరించాయి. రఫీకి తెలుగు రాదు కనుక సినారెకు ఉర్దూ బాగా వచ్చు కనుక వారిద్దరికీ అలా కుదిరింది. ఆ జోడీ మాధుర్యం మనకు మిగిలింది. కవి రెచ్చిపోతే... కవికి కవి పాత్ర దొరకడం చాలా అరుదు. సినారెకు అలాంటి అవకాశం కె.విశ్వనాథ్ ద్వారా వచ్చింది. ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు కవి. వాణిశ్రీ డాన్సర్. ఒక సందర్భంలో ఇరువురి మధ్యా పోటీ వస్తుంది. పాటకు సైదోడుగా డాన్స్ చేస్తానని వాణిశ్రీ అంటుంది. ఇక్కడ కవి రెచ్చిపోవాలి. ‘మీ ఇష్టం... మీరే హీరో అనుకుని ఏం రాస్తారో రాయండి’ అన్నారు కె.విశ్వనాథ్. ఇక సినారె కలం జవనాశ్వం మీద పరుగు తీసింది. చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన కరకంకణములు గలగలలాడగ వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ నీ కులుకునుగని నా పలుకు విరియ నీ నటననుగని నవ కవిత వెలయగా ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ.... ఈ పాటలో సినారె చాలా కఠినమైన క్లిష్టమైన సంస్కృత పదబంధాలు వేసినా ప్రేక్షకులు ఇబ్బంది పడలేదు. పైగా పాటల పోటీలో ఈ పాట పాడటం ఒక ఆనవాయితీగా మారింది. దీని మీద పారడీలు రావడం కూడా కద్దు. బంధాలకు మాటలు అద్దాడు సినారెకు తోడబుట్టువులు లేరు. అందుకని చెల్లెలి బంధం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ‘బంగారుగాజులు’ సినిమాలో చెల్లెలి పాట రాసే అవకాశం వచ్చినప్పుడు దానిని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. ‘అన్నయ్య సన్నిధి’ పాట ఇప్పటికీ హిట్. ఇక తండ్రి గురించి రాసిన ‘ఓ నాన్నా నీ మనసే వెన్న’... తండ్రి గొప్పతనం తెలియచేస్తుంది. ‘ప్రేమించు’ సినిమాలో ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా?’ పాట చాలా ఆర్ద్రంగా అమ్మ గొప్పతనం తెలియ చేస్తుంది. ఇక స్నేహం మీద సినారె రాసిన ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ చిరస్థాయిగా నిలిచి ఉంది. ఇన్ని బంధాల గురించి రాసిన సినారెనే మనుషులలో ఉండే కృత్రిమత్వాన్ని ఏవగిస్తూ ‘అనురాగం ఆత్మీయత అంతా ఒక బూటకం’ (తాత మనవడు) రాశారు. సూపర్ హిట్ ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగులు ఇవాళ ప్రతి సినిమాకు ఒక హిట్ ఫార్ములాగా మారాయి. కాని పాత రోజుల్లో ఒక పాట గొప్ప ఐటమ్ సాంగ్‌గా రాణించింది. ఆ పాట సినారె వల్ల జన్మెత్తింది. ‘అమ్మ మాట’ సినిమాలో జ్యోతిలక్ష్మితో ఒక డాన్స్ నంబర్ చేయాలని దర్శకుడు భావించాడు. దానికి గీత రచయిత సినారె, సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూర్చుని కుస్తీలు పడుతున్నారు. ఎంతకీ పాట కుదరలేదు. రమేశ్ నాయుడు మొదట లంచ్‌కు వెళ్లిపోయారు. సినారె పేపర్ మీద అసలు పాటకు కావలసిన రఫ్ నోట్స్‌లా ‘మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘమాసం వెళ్లేదాకా మంచి ముహూర్తం లేదన్నాడు ఆగేదెట్టాగా అందాక వేగేదెట్టాగా’ అని రాసుకుని తానూ లంచ్‌కు వెళ్లారు. లంచ్ నుంచి తిరిగి వచ్చిన రమేశ్‌నాయుడు ఈ సంగతి తెలియక అదే పాట పల్లవి అనుకుని దానికి అద్దిరిపోయే ట్యూన్ కట్టారు. సినారె వచ్చి ఆశ్చర్యపోయి దానికి కొనసాగింపుగా చరణాలు రాశారు. ఆ పాట బహుశా తెలుగులో చాలా పెద్ద ఐటమ్సాంగ్గా నిలిచింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులో గొప్ప అందం సంతరించుకుంది. ఇదే ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ‘నందామయా గురుడ నందామయ’ కూడా పెద్ద హిట్ సాంగే. ‘దమ్ మారే దమ్’ పాటను అనుసరిస్తూ తెలుగు నేటివిటీతో సినారె ఆ పాటను రాస్తే జె.వి.రాఘవులు ట్యూన్ చేశారు. చేవ ఉన్న కవికి ఏ సందర్భమైనా ఒకటే... మెప్పించే పాట బయటకు వస్తుంది అనడానికి ఈ సందర్భాలు ఉదాహరణ. క్లాసిక్ పాటల కొలువు ‘మల్లెలు పూచె వెన్నెల కాచె ఈ రేయి హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా’.... రాజన్ నాగేంద్ర సంగీతంలో సినారె రాసిన ఈ పాట ఎటువంటి చికాకు సమయంలో అయినా సేద తీరుస్తుంది. ఇదే కాదు ఇలాంటి క్లాసిక్ పాటలు సినారె చిట్టాలో చాలానే ఉన్నాయి. ‘నిర్దోషి’ కోసం ఆయన రాసిన ‘మల్లియలారా... మాలికలారా’... ఘంటసాల గాత్రంలో అమరత్వాన్ని పొందింది.‘తిరుపతమ్మ కథ’లో ‘పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా బాలా’... కూడా క్లాసిక్ కిందకే వస్తుంది. ‘ఏకవీర’లోని ‘తోటలో నా రాజు తొంగి చూచెను నాడు’ ఒక కోమలమైన గీతం. దీనిని రాసిన సినారె కె.వి.మహదేవన్ ముందు పెడితే దానిని ఆయన ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ’ స్టయిల్లో చాలా ఫాస్ట్‌గా ట్యూన్ కట్టాడట. అప్పుడు సినారె అది క్లాసిక్‌గా ఉండాలని ఇప్పుడు రికార్డ్ అయి ఉన్న వరుసలో తానే పాడగా సినారె ఆ వరుసనే తీసుకున్నారు. ఇక అమరశిల్పి జక్కన కోసం ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ ఆల్‌టైమ్ క్లాసిక్ కింద చెప్పుకోవాలి. ఇందులో– ‘పైకి కఠినమనిపించును– లోన వెన్న కురిపించును జీవమున్న మనిషి కన్న– శిలలే నయమనిపించును’... అనడంలో ఎంతో లోతు, తాత్త్వికత ఉన్నాయి. సినారె రాసిన కొన్ని పాటలు స్పీడ్‌గా ఉన్నా క్లాసిక్ స్థాయిలో నిలబడ్డాయి. ‘ఆడబ్రతుకు’ కోసం ఆయన రాసిన– ‘అందము చిందె హృదయకమలం– అందుకునే రాజొకడే వేల తారకల బృందములోన– వెలిగె చందురుడొకడే’... ఒక కొత్త సొబగుతో పదాల పొహళింపుతో ఉంటుంది. పౌరాణిక సినిమాలలో ‘కురుక్షేత్రం’ కోసం రాసిన ‘మోగింది కల్యాణ వీణ’... చారిత్రక సినిమాలలో తాండ్ర పాపారాయుడుకు రాసిన ‘అభినందన మందార మాల’ క్లాసిక్స్ స్థాయిలో నిలిచాయి. ఇన్ని పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె. ఎన్నో పాటలు ఇచ్చి వెళ్లిన కవి సినారె. జాతి కోసం పరితపించే పాట తెలుగు ప్రాంతాలన్నా తెలుగు భాష అన్నా తెలుగు జాతి అన్నా సినారెకు ఎంతో ప్రాణం ఎంతో ఇష్టం. ఇరు ప్రాంతాల మధ్య విభేదం ఆయనకు అంతగా నచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన ఇరువర్గాల సహజీవనాన్ని కాంక్షిస్తూ కవిత్వం రాశారు. ఈ సంగతి విన్న ఎన్టీ రామారావు ఆ సమయంలో తాను తీస్తున్న ‘తల్లా పెళ్లామా’లో ఒక పాటను సందర్భం లేకపోయినా రాసి పెట్టించారు. అదే– ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది’. ఈ పాటను ఎన్టీఆర్ తన ఎన్నికల ప్రచార సమయంలో చైతన్యరథం మీద విపరీతంగా వినిపించేవారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పడినా ఇద్దరూ గ్రహించ వలసిన ఉపదేశం ఈ పాటలో కనిపిస్తుంది. ‘వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’... ‘మహాభారతం పుట్టింది రాజమహేంద్రవరంలో భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ల సంస్కృతి నిండు సున్నా’..... కవి పలుకు అక్షర సత్యం. జయలలిత స్విమ్‌సూట్ సాంగ్ ‘మనుషులు–మమతలు’ సినిమా నాటికి జయలలిత ఇంకా స్టార్ కాలేదు. ఆమెకు సినారె రాసిన కవ్వించే పాట పెద్ద హిట్టయ్యింది. ‘సిగ్గేస్తో్తందా సిగ్గేస్తో్తందా మొగ్గలాంటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తేసిగ్గేస్తుందా– నీకు సిగ్గేస్తుందా’...ఈ పాటలో నాగేశ్వరరావు బిడియస్తుడిగా కనిపిస్తారు.‘చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే‘ సిగ్గేస్తుంది అంటారు. ఈ పాటలో జయలలిత స్విమ్‌సూట్‌లో కనిపించి ప్రేక్షకులకు హుషారు కలిగిస్తారు. అప్పటికి అలాంటి డ్రస్సుల్లో పాటలు కొత్త.ఈ పాటే కాదు జయలలిత కోసం సినారె రాసిన ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ పాట కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. జగపతివారి ‘అదృష్టవంతులు’ సినిమాలో జయలలితను కవ్విస్తూ నాగేశ్వరరావు ఈ పాట పాడతాడు. ఈ లెక్కన సినారె ఇద్దరు (మాజీ) సి.ఎం.లకు పాట రాసినవారయ్యారు. -
పల్లవెళ్లిపోయింది
కదిలించే పల్లవి జీవితాన్నే కదిలిస్తుంది. తేజం ఉన్న పల్లవి... నిస్తేజంగా ఉన్న జీవితాన్ని పరుగులెత్తిస్తుంది. ఉల్లాసం ఉన్న పల్లవి... చరణాలలో ఉత్తేజం నింపుతుంది. పల్లవే లేకపోతే చరణాలు నడవగలుగుతాయా? కొత్తకొత్త లోకాలను చూడగలుగుతాయా? ఈ పల్లవి ఎంత స్వార్థపరురాలు! తనైతే కొత్త లోకాన్ని చూడ్డానికి వెళ్లిపోయింది. చరణాలను చలనరహితం చేసింది. అవును... పల్లకెళ్లిపోయింది. సినారే అనే పల్లవెళ్లిపోయింది. ∙సాక్షి ఫీచర్స్ డెస్క్ గోగులు పూచె గోగులు కాచె ఓ లచ్చగుమ్మాడి గోగులు దులిపె వారెవరమ్మా ఓ లచ్చ గుమ్మాడి... పల్లె పదాన్ని కొనగోట పలికించి కులికిన ఆ పల్లవి వెళ్లిపోయింది. నోమి నోమన్నలాల నోమన్నలాల సందామామా సందామామ పొద్దు వాలక ముందే పోదారి రాయే తూరుపోళ్ల బుల్లెమ్మ తూరుపోళ్ల బుల్లెమ్మ... ఊరి చెణుకులను కలంలో నింపుకుని జగమంతా చల్లిన ఆ పల్లవి వెళ్లిపోయింది. అటు చూస్తే చార్మినారు ఇటు చూస్తే జామా మసీదు ఆ వంక అసెంబ్లి హాలు ఈ వంక జూబిలి హాలు రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్... సిటీలో షికారు చేయించి, పాయా షేర్వాల ఘుమఘుమలనీ బన్ బిస్కట్ల బరువు రుచిని అలవాటు చేసి, మణికట్టు మీద ఇంత అత్తరు చార వేసి వదిలిన ఆ పల్లవి వెళ్లిపోయింది. ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. అహా... తేనెను ఊటగా చేసుకొని మాటలో మకరందం నింపుకుని చీకటి రాతిరిలో కూడా వెన్నెల సవ్వడులను వినిపించగలిగిన ఆ పల్లవి వెళ్లిపోయింది. భలే మంచి రోజు పసందైన రోజువసంతాలు పూచే నేటి రోజు... ప్రతి మంచి సందర్భానికి మనసు నిండుగా పాడుకునేలా ఒక పాటను పదిలంగా ఇచ్చి ఆహ్లాదాన్ని ఎల్లెడలా పంచిన ఆ పల్లవి వెళ్లిపోయింది. సింగిరెడ్డి నారాయణరెడ్డి, సి. నారాయణరెడ్డి, సినారె... పాత తరానికి కొత్త తరానికి మిగిలిన ఆఖరు వారధి ఆయన. పాట పరువు, మర్యాద బెసకకుండా జాగ్రత్తగా భుజాలపై మోసి దాని బరువు పెంచిన కవి ఆయన. పండితులకు, పామరులకు మధ్య సమన్వయ స్థాయిలో పాటను నిలబెట్టి శృంగారం, కరుణ, ఎడబాటు, నీతి బోధన, వియోగం, విషాదం ఏదైనా సరే హత్తుకునేలా చెప్పి వచ్చింది రెండు మూడు మజిలీల బాటసారి కాదు సుదీర్ఘ యానం చేయగల పాటసారి అని నిరూపించిన పథికుడాయన. ఆయన చాలా గొప్ప పాటలు రాసి ఉండవచ్చు. కొన్ని ఉత్త పాటలు రాసి ఉండవచ్చు. కాని చెత్త పాటలు మాత్రం రాయలేదన్న పేరు తెచ్చుకున్న సమర్థ కలంధారి ఆయన. సాహిత్యంలో సినారె గొప్పకవి. కాని కొందరి దృష్టిలో మాత్రం ఆయన అంతకు మించిన గొప్ప సినీకవి. ఎన్టీ రామారావు పట్టుపట్టి ఇద్దరు కవులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఒకరు సినారె. మరొకరు వేటూరి. ఇద్దరూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రంగంలో నిలబడినవారే. ఆబాలానికీ గోపాలానికీ తమ బలం నిరూపించినవారే. ఆయితే వేటూరి ఫాస్ట్ పాసింజర్‌లా చాలా స్టేషన్లలో ఆగుతూ ఆ ప్రయాణికులను అకామడేట్ చేయడంలో భాగంగా కొన్ని నాసిరకం పాటలు రాశారు. కాని సినారె ఎక్స్‌ప్రెస్ రైలులా ఆచి తూచి, ఎంచుకున్న స్టేషన్లలోనే ఆగుతూ ఆ ప్రొడక్షన్ హౌస్‌లకే తాననుకున్న దర్శకులకే పని చేస్తూ సినీ కవిగా ఎప్పుడూ చావు కొని తెచ్చుకోకుండా కన్నులొట్టపోకుండా పూర్ణరూపంతో నిలబడగలిగారు. బహుశా అందుకు కారణం ఆయనకు ఫుల్‌టైమ్ అధ్యాపక వృత్తి ఉండటం, యూనివర్సిటీ అధ్యాపకునిగా స్థిరమైన సంపాదన ఉండటం, సాహితీకృషిలోనూ దినదినప్రవర్థమానమైన గుర్తింపు లభిస్తూ ఉండటం... కనుక పాటను ‘ఛాయిస్’గా ఉంచుకునే చాన్స్ ఆయనకు ఉండింది. వేటూరికి అది లేదు. వేటూరికి పాటే హోల్‌టైమ్ ప్రొఫెషన్. కనుక తన వద్దకు బంగారు కంచం పట్టుకొచ్చినవారికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టారు... సత్తు ప్లేటు తెచ్చినవారికి సద్దన్నం పడేశారు. కాని సినారెది స్టాండర్డ్ మీల్స్. అది రుచిగా ఉంటుంది. ఆకలీ తీరుస్తుంది. తరియింతును నీ చల్లనిచరణమ్ముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళికవోలే... ఈ ‘కర్పూర కళిక’ సినారె మార్క్. ఆయన సినిమా పాటలు రాయడానికి అర్రులు చాచి ఉంటే ‘గులేబకావళి కథ’ కంటే ముందే వచ్చిన ఒకటీ అరా అవకాశాలను ఆబగా అందిపుచ్చుకునేవారు. కాని హుందాగా ఉండాలి... సినీ రంగంలో హుందాగా కొనసాగాలి అని ముందే నిశ్చయించుకున్నారు. అందువల్ల తొలి సినిమాతో అడుగుపెడితే అందులోని అన్ని పాటలు రాయడం ద్వారా అడుగు పెట్టాలని ‘గులేబకావళి కథ’ ద్వారా అడుగు పెట్టారు. అప్పటికే ఆయనకు సినిమా రంగంలో మిక్కిలినేని, గుమ్మడి, అక్కినేని గాఢమైన స్నేహితులు. అయితే అవకాశం మాత్రం ఎన్టీ రామారావే ఇచ్చారు. అగాధాలకు చేరే సత్తా కొన్ని చేపలకు ఉన్నా అవి సముద్రంలో సూర్యకాంతి సోకినంత మేరనే తిరుగాడుతుంటాయి. సినారె కూడా సాహిత్యంలోకాని, సినిమాలో కాని సగటు పాఠకుణ్ణి, కాస్త పైస్థాయి పాఠకుణ్ణి మాత్రమే దృష్టిలో పెట్టుకొని రచన చేయగలరు అని ఎన్టీఆర్ కనిపెట్టారు. ఒంటరి అయిపోయాను మరి ఇంటికి ఏమని పోను?... ఒక్కోసారి పాటకు ఈపాటి సులువైన పదాలు సరిపోతాయి. సినారె అవి అలవోకగా అందించగలరు. వెల్కమ్ చెప్పడానికి ఇంకేమి కావాలి? మరి బి.ఎన్.రెడ్డిలాంటి వాళ్లకు ఏం కావాలి? ఆయన పెద్ద దర్శకుడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి కవుల చేతి పానకాలనీ మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి ఉద్దండుల పాయసాలను రుచి చూసినవారు. ‘పూజాఫలం’ సినిమాకు సినారెను పిలిచి లిట్మస్ టెస్ట్ పెట్టారు. ఎందుకంటే బి.ఎన్.రెడ్డికి పాట రాసినవాడు ఎవరికైనా రాయగలడు. ఏ టెస్ట్ అయినా పాస్ కాగలడు. పైగా సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు. ఇద్దరు మేధావుల మధ్య సినారె. భళారె అని అనిపించుకోక తప్పదు. సందర్భం చెప్పారు. పియానో పాట. పియానో రీడ్స్ మీద జమున వేళ్లు కదలాడిస్తూ పాట పాడాలి. సినారె వేళ్లు కూడా పేపర్ మీద కదలాడుతూ పాట రాశాయి. పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే.... పాస్ అయ్యాడు గురుడు. మరి? వచ్చింది ఎవరు? శబ్ద మేధావి.. గద్య మేధావి... సందర్భానుసారంగా సృజనను మెరిపించగల కలం మేధావి. కాని ఆ పాట కాదు. అంతకన్నా సుందరమైన లలితమైన భావం అవసరమైన పాట అదే సినిమాలో మరో చోట అవసరమైంది. కలం నిదుర లేచింది. నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో నిదుర లేచెనెందుకో... సినారె వచ్చాడట... బి.ఎన్.కు రాశాడట... సాలూరి ట్యూన్ కట్టాడట... ట్రైనింగ్ పూర్తయ్యి జాబ్ రెగ్యులరైజ్ అయ్యింది. ఇక మిగిలిందంతా కెరీరే. సరే ఇది చూడండి. భానుమతి వచ్చారు. ఎన్టీఆర్ పి.బి.శ్రీనివాస్‌లను తెచ్చారు. తను, పి.బి.శ్రీనివాస్ పాడుతుండగా తన మీద ఎన్టీఆర్ మీద డ్యూయెట్ పిక్చరైజ్ చేయాలట. అందుకు సినారె పాట రాయాలట. భానుమతి సంగతి తెలిసిందేగా. ఆమె స్వయంగా రైటర్, డైరెక్టర్, యాక్టర్, సింగర్.. ఇంకా అనేకం. ఆమె సూపర్ ఇగో ఎదురుగా సినారె క్రియేటివ్ ఇగో ఢీకొట్టి నిలవాల్సి వచ్చింది. సినిమా: వివాహ బంధం. సినారె పాట రాశారు. నీటిలోనా నింగిలోన నీవే ఉన్నావులే కనులలోన కలలోన కలసి ఉన్నాములే... ‘కవి గారూ... ఎంత సింపుల్‌గా హాయిగా రాశారండీ’... భానుమతి రామకృష్ణ ప్రశంస. అది ఆస్కార్ రెడ్‌కార్పెట్ వాక్కు ఏమాత్రం తక్కువ కాదు. పి.బి.శ్రీనివాస్ వచ్చాడు కాబట్టి ఇంకో గాయకుడు కె.బి.కె.మోహనరాజును కూడా చెప్పుకుందాం. ‘పూలరంగడు’లో ఆయన తన మొదటి పాట పాడాడు. ఆ పాటతోనే గుర్తుండిపోయాడు. ఈ ‘గుర్తు’ను ఇచ్చింది సినారె. ఈ పద గుబాళింపును ఇచ్చింది సినారె. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి... అసలు సినారె అంటే డ్యూయెట్స్. డ్యూయెట్స్ అంటే సినారె. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ టాప్ టెన్ డ్యూయెట్స్ తీస్తే అందులో రెండైనా సినారెవి ఉంటాయి. హీరో హీరోయిన్ల సరస సంభాషణ, సున్నితమైన శృంగార వ్యక్తీకరణ, మాటకు మాట జవాబు... వీటిని రాయడంలో సినారె సిద్ధహస్తులు. అందుకనే ఎస్.భావనారాయణ, డివిఎస్ రాజు, దుక్కిపాటి మధుసూదనరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిన్న మొన్నటి ఎస్.గోపాలరెడ్డి వరకు ఎందరో ప్రొడ్యూసర్లు ఆయన చేత డ్యూయెట్స్ రాయించుకునేవారు. దుక్కిపాటి మధుసూదనరావు ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా కోసం సాలూరి మ్యూజిక్‌లో ఒక పాటకు అవకాశం ఇచ్చారు. అది ట్యూన్‌కు చేసిన పాట. సాలూరి రాజేశ్వరరావు సన్నని గొంతులో ట్యూన్‌ను ‘తానాన’ లో వినిపించారు.‘తనినన తానిన తనినన తనినని తానీ తానానతానా’...రాసే ముందు కండిషన్ కూడా పెట్టారు. ‘లఘువులన్న చోట లఘువు... గురువులున్న చోటు గురువు’ తప్పనిసరి. సినారె క్షణంలో రాశారు. ‘కిలకిల నవ్వులు చిలికిన– పలుకును నాలో బంగారువీణ కరగిన కలలే నిలిచిన – విరిసెను నాలో మందారమాల’... కిలకిల, చిలికిన, కరిగిన, నిలిచిన.... పదాలను ఔపోసన పట్టినవాడికే సాధ్యం. ఇదే దుక్కిపాటి ‘ఆత్మీయులు’ సినిమాలో మరో అవకాశం ఇచ్చారు. వాణిశ్రీ, అక్కినేని హీరో హీరోయిన్లు. హీరోయిన్ తన మనసులోని మాటను ‘చేమంతి’ని మిషగా పెట్టి చెప్పాలి. సాలూరి ట్యూన్ సిద్ధం చేశారు. పదాలను సినారె సిద్ధం చేయడం ఎంత సేపు? ఓ... చామంతీ ఏమిటే ఈ వింత– ఈ చినదానికి కలిగెనేల గిలిగింత మేని పులకింత... ఇదే సాలూరి సంగీతంలో ‘కులగోత్రాలు’ సినిమా కోసం సినారె రాసిన ఈ పాటను మాత్రం ఎలా మర్చి పోగలం? చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరాలేవా ఇంకా సిగ్గు నీకేలా... ఇక డ్యూయెట్లకు విషమ పరీక్ష ఎన్టీఆర్ పెట్టారు. ‘దానవీరశూరకర్ణ’లో దుర్యోధనుడికి డ్యూయెట్ కావాలన్నారు. అంత వరకూ దుర్యోధనుడు విలన్. సినిమాల్లో అతడు కనిపించడమే తప్ప అతడి భార్య ఎవరో పిల్లలెవరో సంసారం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాంటిది దుర్యోధనుడికి ప్రియురాలిని పెట్టి పైగా పాట కూడా పెట్టడమా? ఇది సినారెకు చిత్రంగా అనిపించింది. విచిత్రంగా అనిపించింది. అదే పల్లవిగా మారింది. చిత్రం భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రాచ నగరుకు రారాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం.... ‘ఆడా– మగా’ పాడే డ్యూయెట్లు సరే ‘మగా– మగా’ పాడే డ్యూయెట్లలో కూడా సినారె సిద్ధహస్తులు. ‘మంచి మిత్రులు’లోని పాట దీనికి ఉదాహరణ. అందులో ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుస్తారు. కలిసే ముందు రోజు వారికి ఎక్సయిట్మెంట్ పెరిగిపోతుంది. దానిని పాట రూపంలో చూపాలి.సినారె కలం అందుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్నినాళ్లు దాగిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెరవారదేమో ఈ చీకటి విడిపోదేమి... సినారె కలం చీకట్లను చీల్చిన వీచిక దాసరి యుగం వచ్చింది ‘తూర్పు–పడమర’ తెచ్చింది.అది తమిళంలో బాలచందర్ సినిమా. తెలుగులో దాసరి నారాయణరావు రీమేక్ చేశారు. తమిళంలో ఉన్న ఒక పాటను యథాతథంగా వాడదామని నిర్మాతలు అన్నారు. దాసరి కూడా ఓకే అన్నారు. కాని సినారె వినలేదు. సంగీత దర్శకుడు రమేశ్‌నాయుడు కూడా వినలేదు. అంతకుమించిన మంచి పాటను సొంతపాటను ఇస్తాం అని చెప్పారు. సత్తా ఉన్నవాళ్లు పట్టు పట్టనే కూడదు. పట్టారా పాట హిట్ కాక తప్పదు.శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని... ఇదే సినిమాలో ‘తూర్పు పడమర ఎదురెదురు’ పాటను కూడా సినారె రాశారు. అందులోనే ‘కాలమనే గేలానికి చిక్కి’... అనే ఎక్స్ప్రెషన్ ఉంది. అలాంటిది విన్నప్పుడు శభాషో అనాలనిపిస్తుంది... సాహో అని పొగడాలనిపిస్తుంది. దాసరి– సినారె– రమేశ్నాయుడుల కాంబినేషన్ మేజిక్ ఆ తర్వాత కూడా పని చేసింది. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘శివరంజని’ సినిమాలో హీరో హరిప్రసాద్ హీరోయిన్ జయసుధను పొగిడే సోలో ఉంది. అప్పుడూ సినారె కలం పరుగులు తీసింది. అభినవ తారవో నా అభిమాన తారవో శివరంజనీ... శివరంజనీ... చక్రవర్తి దెబ్బకు కె.వి.మహదేవన్, వేటూరి ఉధృతికి సినారె కొంచెం మసక కమ్మినవారయ్యారనేది వాస్తవం. సినారె కవిగా, వైస్ చాన్స్‌లర్‌గా ఎంతో బిజీగా ఉన్నా ఆయన అంతరాత్మ పరితపించేది మంచి పాట కోసమే. ఆ సమయంలో ఈ ఇరువురినీ ఆదుకున్నది భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఎస్.గోపాలరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన అన్ని సినిమాల్లో సినారె పాటలు రాశారు. అవి కెవి మహదేవన్ బాణీలలో పడి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వంగతోట కాడ ఒళ్లు జాగ్రత్త నంగనాచి ముళ్లు తొంగి తొంగుంటాయ్ నాటుకుంటే తీయాలంటే నీ తరమా నా తరమా... ‘మంగమ్మ గారి మనవడు’లో ఈ పాట ఎంత హిట్టో ‘మా పల్లెలో గోపాలుడు’లో ఈ పాట ఇంకా హిట్టు. రాణీ రాణెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా.... అయితే ఇదే సందర్భంలో కె.విశ్వనాథ్‌కు వేటూరికి వచ్చిన ‘దూరం’ సినారెకు లాభించింది. ‘శంకరాభరణం’, ‘సప్తపది’ సినిమాల తర్వాత కొంతకాలం పాటు వేటూరి విశ్వనాథ్‌కు పాటలు రాయలేదు. ఆ సందర్భంలోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ను వెలికి తీయాల్సి వచ్చింది. ‘సీనియర్‘ అవసరమైనప్పుడు సినారె చేత పాటలు రాయించుకోవాల్సి వచ్చింది. ‘స్వాతి ముత్యం’లో అలా సినారె రాసిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. వటపత్ర సాయికీ వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... మనసు పలికే మౌనగీతం నీవే మమతలొలికే స్వాతిముత్యం నీవే... ఆ తర్వాత సినారె ‘స్వయంకృషి’, ‘స్వాతి కిరణం’ సినిమాలకు కూడా కె.విశ్వనాథ్ కోసం పాటలు రాశారు. ‘స్వాతి కిరణం’ కోసం రాసిన ‘సంగీత సాహిత్య సమలంకృతే’..., ‘ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి’... పెద్ద హిట్ అయ్యాయి. కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు రావాలి. సిరివెన్నెల, వెన్నెలకంటి, భువనచంద్ర, సాహితి, జొన్నవిత్తుల, చంద్రబోస్ వంటి తర్వాతి తరం కవులు వచ్చారు. ఇందరు ఉన్నా సినారె పాట సినారెను వెతుక్కుంటూ వస్తూనే ఉంది. నిర్మాత ఆర్. రమణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘నీరాజనం’ కేవలం సినారె, సంగీత దర్శకుడు ఓపి నయ్యర్ కోసమే తీశారా అని అనిపిస్తుంది. హిందీలో అంత గొప్ప సంగీత దర్శకత్వం వహిస్తే అందులోనే పూర్తి పాటలు సినారె తప్ప మరొకరు రాయలేరు అని నిశ్చయానికి రావడం వింత లేదు. ‘నీరాజనం’ మ్యూజికల్ హిట్. నిను చూడక నేనుండలేను... నిను చూడక నేనుండలేను... ఘల్లు ఘల్లున గుండె ఝల్లున పిల్ల ఈడు తుళ్లి పడ్డదీ... మనసొక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరం... జనం వీటిని పాడుకున్నారు. జనాన్ని ఊపేసిన సినారె చివరి హిట్ పాట ‘ఒసే రాములమ్మ’లో ఉంది. దాసరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో ఉంటుంది. తెలంగాణ అంటే సినారె జన్మస్థలి. ఇక ఆ కలానికి ఎలా ఉంటుందో తెలుసు కదా ఆకలి. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి గుమ్మ ఓ పుత్తడి బొమ్మఓ రాములమ్మ... ఓ రాములమ్మ... సినారె ఇప్పుడు వ్యక్తిగానే కవిగా, సినీ కవిగా పెద్ద వారయ్యారు. ఇంకా చెప్పాలంటే పాట కంటే కూడా పెద్ద వారయ్యారు. ‘అరుంధతి’ వంటి సినిమాల్లో ఆయన అతి అరుదుగా పాట రాసినా తెలుగు సినిమాలో ఒక మంచి సందర్భం, ఆయన మాత్రమే రాయగల సందర్భం ఆయన తలుపు తట్టలేకపోయింది. మరణించే నాటికి ఆయన రాయగా రికార్డ్ అయిన పాటలు కేవలం ఒకటీ రెండు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఏం పర్వాలేదు. ఆ కలం ఎందుకు పుట్టిందో ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చగలిగింది. ఆ పల్లవి ఎక్కడ మొదలైందో అంతకు వంద యోజనాల దూరం దాటగలిగింది. వినే చెవి ఉన్న ప్రతి చోటకూ ఆయన పాట చేరింది. కొట్టుకునే గుండె ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన పదాల ప్రతి స్పందన అందింది. ఉత్తుత్తిన అనే మాట కాదు. నిజంగానే సినారెతో ఒక శకం ముగిసింది. సినీ స్వర్ణయుగపు ఉజ్వల పతాకం అవనతం జరిగింది. ఒక పల్లవి వెళ్లిపోయింది. ఒక పాటల పల్లకీ వెళ్లిపోయింది. తన చరణాల జాడలను వదిలి ఒక పల్లవి మరెప్పుడూ తిరిగిరాని చోటుకు తరలి వెళ్లిపోయింది. మృత్యువు కవికి మాత్రమే. పాట చిరంజీవి. -
శ్రమయేవ జయతే..
ఆయన మనలాగే ఓ సగటు మనిషి. చదువు కోసం వాగులు, ఒర్రెలు దాటినవారే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా అండగా నిలిచిన అన్నదమ్ముల కలలను నెరవేర్చాడు. అందుకోసం మధ్యలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చినా అందివచ్చిన అవకాశాలను ఆసరాగా చేసుకుని జీవిత ఉన్నత శిఖరాలకు మెట్లుగా మలచుకున్నాడు. ఓ దశలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితులైనా అంతటితో సంతృప్తిచెందకుండా అనుకున్న లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించాడు. తన ఆశయూన్ని నెరవేర్చుకునేందుకు ఓ దశలో అజ్ఞాతంలోకి(కుటుంబానికి, మిత్రులకు దూరంగా) వెళ్లాడు. సమస్యలనే సాధనంగా చేసుకుంటూ ఆశయూన్ని అందుకున్నాడు. ఆయనే నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సి. నారాయణరెడ్డి. కుటుంబం.. విద్యాభ్యాసం.. మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని శ్రీపురం అనే గ్రామంలో చింతకుంట చెన్నారెడ్డి, నర్సింగమ్మ దంపతుల ఆరో సంతానం మన జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి. నలుగురు అన్నలు, ఓ అక్క తర్వాత జన్మించిన ఆయనది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. చిన్నపాటి వ్యవసాయం ఉన్న ఆ కుటుంబంలో తండ్రితో పాటు నలుగురు అన్నలు కూడా వ్యవసాయమే చేసేవారు. అయితే, ఏడో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చెన్నారెడ్డి కన్నుమూశారు. అప్పటినుంచీ అన్నలే ఆయనకు అన్నీ అయి పెంచి చదివించారు.తండ్రి చనిపోవడంతో ఆయన చదువుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్నలు ప్రోత్సహించి చదివించినా, ఖాళీ ఉన్నప్పుడల్లా పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసేవారు. పదోతరగతి పూర్తయిన తర్వాత ఇక చదవకూడదని, ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవానుకున్నారు. వెంటనే హైదరాబాద్ వెళ్లి ఓ పెట్రోల్ పంపులో పనిచేశారు. అయితే, పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో జూనియర్ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువు చెప్తామనడంతో ఇంటర్లో చేరారు. ఇంటర్ తర్వాత కూడా చదువు భారమవుతుందేమోనని భావిం చిన ఆయన అప్పుడు పెయింటర్‌గా పనిచేశారు. మళ్లీ ఇంటర్లో మంచి మార్కులు రావడంతో డిగ్రీలో చేరారు. 3వ తరగతి వరకు శ్రీపురంలో, 4నుంచి 7 వరకు పక్కనే ఉన్న కల్వాల్లో, 8 నుంచి ఇంటర్‌వరకు మక్తల్‌లో, డిగ్రీ నారాయణఖేడ్‌లో చదివిన నారాయణరెడ్డి బీఈడీ కోర్సును ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. ఆ తర్వాత ఎంఎస్సీ( మ్యాథ్స్) కూడా చేశారు. ఆ తర్వాత డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించారు. 2008లో గ్రూప్-1 రాసి మొదటి ప్రయత్నంలోనే స్టేట్ 4వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాదించారు. బీఈడీలో, డీఎస్సీలో కూడా ఆయన రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. 2011లో గద్వాల ఆర్డీఓగా, ఆ తర్వాత 2011లో పెద్దపల్లి ఆర్డీఓగా, అనంతరం ఈ ఏడాది జూలైలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన ఆయన జిల్లాల విభజన నేపథ్యంలో నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఈనెల 11న బాధ్యతలు స్వీకరించారు. జీవిత పాఠాలు ఒంటపట్టించుకుని.. జేసీ నారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే కోరిక బాగా ఉండేది. అందుకే అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ వచ్చేవారు. అయితే, ఇంటర్ తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడే ఆయన ఓ అవగాహనకు వచ్చారు. చదువే ఆయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.వంశవృక్షంలో ఎక్కడో ఓ చోట టర్న్ రావాలని, ఆ టర్న్‌కు కారణం తానే కావాలని కలలు కన్నారు. ఇక, ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లిన తర్వాత జీవితంపై ఆయనకు ఓ స్పష్టత వచ్చింది. ఉస్మానియాలో ఉన్నప్పుడు జేబులో చిల్లిగవ్వ లేకుండా వారాల పాటు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే కష్టపడి చదివి డీఎస్సీ రాసి మహబూబ్‌నగర్ జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, 2006 డీఎస్సీలో ఎంపికైన వారికి పోస్టిం గ్లు ఇవ్వడం ఆలస్యమైం ది. దీంతో మక్తల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. అప్పుడు ఆయన జీతం నెలకు రూ.2,500మాత్రమే. అప్పటికే ఎమ్మెస్సీ, బీఈడీ అయిపోవడంతో అక్కడ పనిచేస్తున్న వారంతా ఆయన్ను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఇంత చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడో అని హాస్య ధోరణిలో మాట్లాడుకోవడం ఆయనకు ఇబ్బంది అనిపించింది. రెండు నెలలకే ఆ ఉద్యోగాన్ని మానేసి మేనమామలు ఇచ్చిన ఆర్థిక భరోసా హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి ఇనిస్టిట్యూట్‌లో గ్రూప్స్ శిక్షణకు వెళ్లారు. అయితే, 2008లో ఆయనకు డీఎస్సీ పోస్టింగ్ ఇచ్చారు. తాను చదివిన కల్వాల్ పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. ఉన్న ఊరే అయినా ఓ రూం అద్దెకు తీసుకుని చదువుకున్నారు నారాయణరెడ్డి. బడిలో పాఠాలు చెప్పడం, ఇంట్లో తినడం, రూంకు వెళ్లి చదువుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సివిల్స్ రాయలేదనే బాధ ఉండేది తన జీవిత ప్రస్థానం గురించి చెపుతూ జేసీ నారాయణరెడ్డి ఎంతో ఆర్ద్రతతో చెప్పిన ఓ మాట నిజంగా ఈనాటి యువతకు స్ఫూర్తిదాయకమే. ‘అయ్యో... నేను సివిల్స్ ఎందుకు రాయలేదు.. అని అప్పుడుప్పుడూ బాధపడుతుంటా... నాకు ఎప్పుడూ ఆ బాధ ఉంటుంది.’ అని చెప్పారు. ఆయన ఏ పరీక్ష రాసినా మంచి మార్కులే... ఏ పోటీ పరీక్షలోనయినా టాప్ ర్యాంకులే... అలాంటి సమయంలో సివిల్స్ రాసి ఉంటే మంచి ఫలితమే సాధించేవారు.. కానీ, ఆర్థిక అనివార్యత, జీవితంలో పడ్డ కష్టాలు ఆయనను ఏదో ఉద్యోగంలో చేర్పించాయి. కానీ, తన ఉద్యోగంలో కూడా నిబద్ధత ప్రదర్శిస్తూ సివిల్స్ రాయలేదనే బాధను అధిగమిస్తూ ఆయన ఉన్నతాధికారి స్థానానికి వచ్చారు. అంటే మనకున్న పరిమితుల్లో సర్దుకుపోతూనే ఉన్నత స్థానానికి వెళ్లాలన్న భావన జేసీ నారాయణరెడ్డి జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది. అజ్ఞాతమే.... ఇక, ఆ సమయంలో మరోసారి నారాయణరెడ్డి తన లక్ష్యాన్ని నెమరువేసుకున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేంత శక్తి ఇచ్చిన మెదడు... ఉద్యోగాన్ని కూడా సాధించి పెడుతుందని, అది జరగాల్సిందేనని భీష్మించుకున్నారు. వెంటనే అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. అంటే... ఎక్కడికో వెళ్లలేదు... చదువే పనిగా పెట్టుకుని కుటుంబానికి, స్నేహితులకు, ఇతర కార్యక్రమాలకు సమయం ఇవ్వలేదు. ఉదయం 5:30 నుంచి రాత్రి 11:30 వరకు ఒకటే పని... చదువుకోవడమే. కాలకృత్యాలు తీర్చుకోవడం, భోజన విరామ సమయాల్లో తప్ప ఆయన ఎప్పుడూ పుస్తకాలను అంటిపెట్టుకునే ఉండేవారు. 2007 జనవరి నుంచి 2008 ఆగస్టు వరకు ఆ పద్ధతిలోనే చదువుకుని గ్రూప్-1 ఉద్యోగం రాశారు. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా... గ్రూప్-1 ద్వారానే తనకు కొత్త జీవితం రావాలి. లేదంటే తన ఆశలు సమాధి అయిపోవాలని నిర్ణయించుకున్నారంటే ఎంత పట్టుదలగా ప్రయత్నించారో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడ్డా తానెప్పుడూ ఒత్తిడిని ఎదుర్కోలేదని నారాయణరెడ్డి ‘సాక్షి’తో ధీమాగా చెప్పారంటే ఎంత కష్టమయినా ఎదుర్కోవాలనే ఆయన పట్టుదలతో పాటు ఆయన చేసిన శ్రమ ఆయుధాలయ్యాయి. కష్టానికి నిర్వచనంగా ఆయనను విజయతీరాల వైపు తీసుకెళ్లాయి. అందుకే ఆయన కూడా పట్టుదల, శ్రమ అనే ఆయుధాలను ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవాలని నేటి యువతకు చెపుతున్నారు. శ్రమయే వజయేత అనే సూక్తికి నిలువుటద్దంగా నిలిచిన మన జేసీ నారాయణరెడ్డి జీవితాన్ని, ఆయన ఎదుర్కొన్న కష్టాలను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తి పొంది జిల్లా యువత తమ తమ జీవితాల్లో విజయతీరాలను చేరాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. -
అమ్మ పీఠం
సినారె పుట్టినరోజు సందర్భంగా... మా అమ్మ డాక్టర్ సి. నారాయణరెడ్డితో మాట్లాడితే... అమ్మ అక్కున చేర్చుకున్నప్పుడు కలిగే ఆనందకంటే జ్ఞానపీఠం కూడా పెద్దది కాదేమో! అనిపిస్తుంది. అమ్మ ఒడిని మించిన పీఠం మరోటి ఉండదనిపిస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే సంస్కారం, నిరాడంబరత అలవడింది అమ్మ నుంచేనంటారు. తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ... అమ్మ బొమ్మకు పదచిత్రణ చేయగలిగిన వాడినే కానీ పటచిత్రణ చేయలేనని కళ్లు తుడుచుకున్నారా విజ్ఞానఖని. ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ ఇక మా అమ్మ సంగతికొస్తే... మా అమ్మ పేరు బుచ్చమ్మ. ఏమీ చదువుకోలేదు. సంగీతం, సాహిత్యం తెలియదు. నన్ను సంతోషపెట్టడానికి పాటలు పాడేది. జోకొడుతూ పాడే పాటలో ఉన్న సాహిత్యం ఏమిటో బిడ్డకు అక్కరలేదు. బిడ్డకు అమ్మ గొంతును మించిన బాణీ అక్కరలేదు. ఆ గొంతులోని ప్రేమమాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారిపోయిన జ్ఞాపకాలను నాకు మిగిల్చింది మా అమ్మ. లోకజ్ఞానం తెలియని అమాయకురాలు మా అమ్మ. వంద నాగళ్ల వ్యవసాయపు లోగిట్లో ఆమె ప్రపంచం నేనే. ఆమె సంతోషం నేనే, ఆమె దుంఖమూ నేనే. చదువుకోసమైనా సరే ఆమె కళ్ల ముందు నుంచి దూరంగా పోవడానికి ఇష్టపడేది కాదు. మా హనుమాజీ పేటలో నాలుగో తరగతిక్కూడా పాఠశాల లేదు. ‘పదో తరగతి చదవనీ, తాసిల్దారవుతాడ’నే వాడు నాయిన మల్లారెడ్డి. అయినా అమ్మ ఒప్పుకునేది కాదు. నేను సిరిసిల్ల (కరీంనగర్ జిల్లాలో తాలూకా కేంద్రం) మాధ్యమిక పాఠశాలలో చేరడం వెనుక ఒక కన్నీటి సంద్రం ఉంది. నాకు చదువుకోవాలని చాలా గట్టిగా ఉండేది. అమ్మకు నేను ఆమె కళ్ల ముందు నుంచి వెళ్లడం ఇష్టం లేదు. ఇద్దరి పట్టు సమంగా ఉంది. ఉక్రోషం కొద్దీ ఊరి బయట ఉన్న మోటబావిలో దూకేశాను. నాకు ఈతరాదు. నా స్నేహితుడు బావిలో దూకి నన్ను బయటకు తీసి మా అమ్మ దగ్గరకు తీసుకొచ్చాడు. ‘‘ఎందుకు బిడ్డా! ఈతరాదని తెల్సీ దూకావు’’ అని భోరున ఏడ్చింది. ‘‘నువ్వు సిరిసిల్ల బడికి వద్దన్నావుగా’’ అన్నాను. అంతే... నా ఇష్టం కోసం ఆమె రాజీపడ్డది. ‘‘సర్లే! అట్టాగే పోదువు గాని!’’ అన్నది. అలా సిరిసిల్లకు పంపింది. తర్వాత హైదరాబాద్‌లో చదివేటప్పుడు కూడా ఆమె ఎప్పుడూ సంతోషపడలేదు. ‘చదువుకని హైద్రాబాద్ పోయాడు’ అని బాధపడేది. నన్ను ‘బాపు’ అని పిలిచేది. చెప్పడం కూడా అలాగే. ‘‘మా బాపు పాటలు రాస్తుంటాడు’’ అని చెప్పేటప్పుడు కూడా ఆమెలో ఆనందం కంటే బిడ్డ కళ్ల ముందు ఉండకుండా ఎక్కడో దూరంగా ఉన్నాడనే ఆవేదనే ఉండేది. నేను చేసిన పనికి ఆమె ఆనందం పొందిన క్షణాలు నాకు గుర్తు లేదు. అప్పటి వరకు ఆమె ఉండనేలేదు. నేను ఎం.ఎ చదివేటప్పుడే నాకు దూరంగా... ఎప్పటికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోయింది. నన్ను ఎంత ఒంటరిని చేసిందంటే... అమ్మ పోతూ పోతూ తన బొమ్మ (ఫొటో) ఇచ్చి పోలేదు. అసలు బొమ్మంటూ తీస్తే గదా ఇవ్వడానికి. ఎప్పుడైనా... ‘‘అమ్మా బొమ్మ దిగవే అంటే...ఆణిముత్యంలా నవ్వేది. నువ్వు నా బొమ్మవు కాదా బాపూ అంటూ నన్ను అక్కున చేర్చుకునేది. నాకు మిగిలింది నా మనోఫలకం మీదున్న అమ్మ బొమ్మ మాత్రమే. అయితే... ఇటీవల కళ్లు మూసుకుని చూస్తే అమ్మ బొమ్మ అలుక్కు పోతూంది. మిగిలిన ఆ కాస్త రూపమూ తుడుచుకుపోతే... దిగులుతో గుండె వణికిపోయింది. ఉదయం నిద్రలేచినప్పుడు కురులారబోసుకునే అమ్మరూపమే నా కళ్లలో. అదీ మసకబారుతోందా? అమ్మ రూపం నా కళ్ల ముందు నుంచి మసక బారక ముందే అమ్మ పటం (చిత్రం) గీయాలనుకున్నాను. కానీ... నేను... నేను... చిత్రకారుణ్ని కాను, పదచిత్రణ మాత్ర జీవినని అప్పటి వరకూ గుర్తుకు రాలేదు. ఎంత మెదిపినా కలం కుంచె అవుతుందా? పదాలు రేఖలవుతాయా? కవినన్న గర్వం మంచుకొండ చరియలా విరిగి పడిపోయింది. పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకుని అమ్మరూపాన్ని పదిలంగా నిలుపుకున్నాను. అమ్మ నుంచి మమకారం పంచడం నేర్చుకున్నాను. ఎంతమందికి పంచగలిగితే అంతమందికీ పంచుతున్నాను. అదే నన్ను ఇందరికి ఆత్మీయుడిని చేసింది. ‘దేవత కనిపించదు. కానీ అమ్మ కనిపిస్తుంది. కాబట్టి దైవం కంటే మనకు జన్మనిచ్చిన అమ్మను మిన్నగా చూసుకోవాలి’ - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహన్ -
లలితమైన భాష రమ్యమైన భావం
సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. ఆయన హృదయమే కవిత్వం. బాలకవిగా చివురు తొడిగి కవితా వటవృక్షమై ఎదిగిన పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కవితా ప్రస్థానంలో ఎన్నో మలుపులు కనిపిస్తాయి. ‘మార్పు నా తీర్పు’ అని ఏనాడో అన్నారాయన. ప్రవహించే నీరులా స్వచ్ఛమైన కవిత ఎప్పుడూ ఆరోగ్యకరమే. సినారె కవిత్వంలో మనకు ప్రధానంగా, ప్రథమంగా గోచరించేది రమణీయకత. ఏది చెప్పినా, మెత్తదనం సంతరించుకున్న కవిత ఆయన సొంతం. ఒకనాడు ఆయనను అనుప్రాస ప్రియుడన్నారు. కాని అనుప్రాస మోజులో పడి ఎక్కడా శిల్పాన్ని కాని, కవిత్వాన్ని కాని దూరం చేసుకోలేదు. వాటిని తన ధోరణిలోకి ఇముడ్చుకొని వశపరచుకొన్నాడు. అందుకే ప్రతి గేయం, ప్రతి పద్యం విరజాజి పందిరిలా ఉంటుంది. నారాయణరెడ్డి చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన కవికిశోరం. బి.ఎ. దాకా ఉర్దూ మాధ్యమంలో చదివినా మాతృభాషపై మమకారం పోగొట్టుకోలేదు. విద్యార్థి దశనుండి కవితలు వ్రాస్తూ వచ్చారు. ఆ దశలోనే నవ్వని పువ్వు వంటి గేయ నాటికలు, జలపాతం వంటి ఉత్తమ రచనలు వెలువడ్డాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే సభలూ సమావేశాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన కంటే రసవంతంగా వ్యాఖ్యానమందించే వారు లేరనిపించుకొన్నారు కూడా. సినారె కవితల్లో కాళిదాసాది భారతీయ మహాకవుల పరువముంది. ఉర్దూ కవుల ఆవేశం, నవ్యత కనిపిస్తాయి. భట్టుమూర్తి వంటి ప్రజ్ఞ ఉంది. భావకవిగా, అభ్యుదయ కవుల్లో అభ్యుదయవాదిగా, విప్లవ ధోరణికి నీరాజనం పట్టే విప్లవ రచయితగా, ప్రజాకవిగా భాసిల్లారు. విరసంతో సరసం ఆడగల సమర్థుడాయన. ఆయన హృదయమే కవిత్వం. ఆర్ద్రతతో తడిసిన ఆయన అంతరంగం నుండి పెకిలి వచ్చే ప్రతిపదంలోనూ కవిత్వం ఉంటుంది. ‘సురభిళ శబ్దమ్మొక్కటి తరగెత్తిన చాలు/ నా యెడద నందులందు కోటి నందనాలు గుబాళించు’ అనే శబ్ద శిల్పి ఆయన. ఆయన తన రచనల్లో తననీ విధంగా పరిచయం చేసుకొన్నారు: ‘నా పేరు కవి, ఇంటిపేరు చైతన్యం, ఊరు సహజీవనం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం’. ఒక్కచోట ఆయన ఇలా హితవు పల్కారు: ‘ముళ్ళలాగ ఎవరినీ నొప్పించవద్దు/ పూలలాగ అందరినీ మురిపిస్తే ముద్దు’. పచ్చి వేడి, పిచ్చి చలువ ఆయనలో చూడొచ్చు. మహోద్ధతి, మౌనగతి రెండూ ఆయనకు తెలుసు. ఆయన సంప్రదాయాన్ని జీర్ణించుకొన్న ప్రయోగం. ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయం. ఒక దీపావళినాడు ఒక చిన్నారిపాప దీపం వెలిగిస్తున్నది. ఆ పాపను చూసి రెడ్డిగారి హృదయంలో వెలిగిన కవితా జ్యోతి: ‘ముట్టించు పాపా దీపం ముట్టించు/ ముసురుకొన్న మా తమస్సును/ నీవైనా తుదముట్టించు’. ఆయన శ్రమ జీవుల చమట బిందువులను జాతి రత్నాలుగా తలచారొకచోట. మంచికి నిలబడ్డ మనిషిని మహర్షిగా కొలిచి మానవతావాదిగా కనిపించారు మరోచోట. పొరలు కమ్మని విజ్ఞానం అరవిందంలా విరియాలని వాంఛించారింకో చోట. ఆయన కవిత్వంపై కాల్పనికోద్యమ, మానవోద్యమ, అభ్యుదయోద్యమ ప్రభావాలున్నా వాటిని తనవిగా చేసుకోగల ప్రతిభాశాలి ఆయన. లలితమైన భాష, రమ్యమైన భావన ఆయన సొంతం. ‘ఈ పదముల రాపాడిన మాపురములు, చిరుగజ్జెలు చప్పని నా బ్రతుకులోన రసధ్వనులను పలికించెను’. బండరాతిలో గుండెల చప్పుడును, పాషాణంలో సైతం ప్రాణాన్ని గమనించగలిగిన రసజ్ఞుడు. ‘ఈ నల్లని రాలలో - ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున - ఏ గుండెలు మ్రోగెనో/ పైన కఠినమనిపించును - లోన వెన్న కనిపించును/ కదలలేవు మెదలలేవు - పెదవి విప్పి చెప్పలేవు/ ఉలియలికిడి విన్నంతనె - గలగలమని పొంగి పొరలు’. సహృదయత గల కవి - అందుకే సమతా శాంతుల నాకాంక్షిస్తున్నారు. ‘సమత నా తల్లి- సౌహార్దం నా తండ్రి/ అనాది నా జననం-అనంతం నా పయనం/ విశ్వం నా ఊరు-శాంతి నా పేరు’. సామాన్య ప్రజలను పీడిస్తే-ఆవేశం పుడుతుంది. ఎక్కడ? ‘చిల్లిగవ్వకు కొరగాని-చితికిన బతుకుల నుంచి’. చివరకేమవుతుంది? ‘పిడికిళ్ల లోని ఆవేశం-పిడుగులను పుట్టిస్తుంది/ నడి నెత్తిలోని ఆవేశం- నవయుగాన్ని సృష్టిస్తుంది’. కవి బ్రహ్మవంటివాడు-అతన్ని మించిన వాడే ఆత్మ చేతన అంటూ ఉంటే- ఆ సత్యాన్ని చాలా బాగా చెప్పారు. ‘నేను రాస్తున్నది తుడిచి వేస్తున్నది-గీతం కాదు, స్వరలిపి అతడు గీస్తున్నది సీలు వేస్తున్నది-అదృష్ట పలకం మీద భాస్వర లిపి స్వరం గొప్ప భాస్వరం కంటె-గీతిక గొప్ప జాతకం కంటె అతనికంటె నేనే గొప్ప-ఆత్మ చేతన అంటూ వుంటె’. కవికి కావలసింది ఆత్మ చేతన. అతడు చేయాల్సిన కల్పనలేమిటో, అతని కర్తవ్యమేమిటో నిశితంగా అంటున్నాడు. ‘ఈ రాత్రి కనవలసింది- కవలలను కాదు-క్రాంతి గోళాలను/ ఈనాడు కావలసింది- డోల ఊపడం కాదు-నిద్రలేపడం’. సినారె ప్రతి మాటలో ప్రగతివాదం ప్రస్ఫుటిస్తుంది. ఒకనాడు భావ గీతాలు వ్రాసిన యువకవి; శృంగారాన్ని వరించిన రసజ్ఞుడు, కాలాన్ని గమనించి అవసరాన్ని గుర్తించి ప్రజా సమస్యలను ఆకళించుకొని ప్రజాకవిగా సాగుతున్నారు. - డా॥ఎ.రాధాకృష్ణరాజు (వ్యాసకర్త - అధ్యక్షులు, కర్ణాటక తెలుగు విజ్ఞాన సమితి) -
‘యెల్ది’ పుస్కకావిష్కరణ
సాక్షి, ముంబై: హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్ హాలులో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం యెల్ది పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో అఖిల భారత పద్మశాలి సంఘం చైర్మన్, ముంబై వాస్తవ్యుడు యెల్డి సుదర్శన్ రచించిన గూఢచారి వదిన (యెల్డి సుదర్శన్ కథలు), యెల్డి మాణిక్యాలు (మినీ కథలు)లను డా. సి. నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాంమూర్తి పద్మశాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఐఏఎస్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రముఖ వ్యాపావవేత్త చిలువేరు గంగాధర్ పద్మశాలి, ఎస్బీహెచ్ అధికారి నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. -
అతని అనువాదం కూడా సాహిత్యమే...
సవ్యసాచి: నిదుర పో... నిదుర పో... నిదుర పో నిదురపోరా తమ్ముడా నిదురలోన గతమునంతా నిముసమైన మరచిపోరా... చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయినే చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా మధురాశలు పలికేనో నా మనసున చిలికేనో ఆపాత మధురాలైన ఇలాంటి పాటల్ని వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. అందులోనూ ‘సంతానం‘ చిత్రంలోని ‘నిదుర పోరా’ పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా స్మరించని వాళ్లుండరు. అయితే ఈ పాటలన్నీ అనిసెట్టి రాశారని అందరికీ తెలియకపోవచ్చు. అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు (1922). శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా. సి.నారాయణరెడ్డి వంటి సినీ కవులలాగే సినీరంగ ప్రవేశానికి ముందే అభ్యుదయకవిగా ప్రసిద్ధులు. ‘అగ్నివీణ’, ‘బిచ్చగాళ్ల పదాలు’ వంటి కావ్యాలు... ‘గాలిమేడలు’, ‘మాఊరు’ నాటకాలు, ‘చెప్పు కింద పూలు’, ‘చరమాంకం’ నాటికలు మొదలైనవి అనిసెట్టి పేరు చెప్పగానే చప్పున స్ఫురించే రచనలు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే నవ్య కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అ.ర.సం కార్యవర్గ సభ్యుడిగా 1973లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా అభ్యుదయ కవిత్వంతో పరిచయమున్న వాళ్లెవరూ అనిసెట్టిని మర్చిపోరు. అనిసెట్టి సాహిత్యంపై ఇది వరకే వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. కాని అనిసెట్టి సినీరచనలపై సమగ్ర పరిశీలన జరగలేదు. అనిసెట్టి 1952లో గిడుతూరి సూర్యం ప్రోత్సాహంతో ‘ప్రియురాలు’ చిత్ర రచయితగా సినీరంగంలో అడుగుపెట్టి ‘శ్రీకృష్ణ లీలలు’ (1956), ‘కొండవీటి దొంగ’ (1958) అనువాద చిత్రాలతో ఆ రంగంలో నిలదొక్కుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్రల తర్వాత ఆ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. అనిసెట్టి రచయితగా పని చేసిన సుమారు 130 చిత్రాలలో డెరైక్ట్ చిత్రాలు 40 కాగా మిగిలినవన్నీ అనువాదాలే. అనువాదాల్లో ఆరుద్ర లిప్‌సింక్ కంటే తెలుగుదనానికి ప్రాధాన్యం ఇస్తే అనిసెట్టి లిప్సింక్ని నిర్లక్ష్యం చేయకుండా వీలయిన వరకు మూలంలోని భావాలను కూడా అనువదిస్తూ అనువాద రచనను అసిధారవ్రతంలా నిర్వహించారు. అనిసెట్టి అనువాదం చేసిన సినిమాల్లో ‘కొండవీటి దొంగ’, ‘మావూరి అమ్మాయి’, ‘పాప పరిహారం’ ‘మాయామశ్చీంద్ర’, ‘సర్వర్ సుందరం’, ‘లోకం చుట్టిన వీరుడు’ మొదలైనవి పేరు తెచ్చాయి. మలయాళంలో వచ్చిన మొట్టమొదటి ‘స్వామి అయ్యప్ప’ సినిమాకు తెలుగు అనువాదం అనిసెట్టే. ఆ పాటలు నేటికి అయ్యప్ప భక్తుల కార్యక్రమాల్లో వినబడుతుంటాయి. ఆయన అనువాదం చేసిన ‘కొండవీటి దొంగ’లోని పాటల్లో తెలుగుదనం చూడండి. సాహసమే జీవితపు బాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా తమలపాకు సున్నమూ పడుచువాళ్లకందమూ ఒక్కడికీ ఇద్దరయా ఇవి కలికాలపు బుద్ధులయా... ఇవి వింటే అనువాదమని అనుకోరు. ఇక భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘పాలుం పశముం’ (1961) తమిళ చిత్రం తెలుగులో ‘ప్రాయశ్చిత్తం’గా అనువాదమైతే తమిళంలోని కన్నదాసన్ మాతృరచనకు అనిసెట్టి అద్భుతమైన తెలుగు అనువాదం చేశారు. ఆ పాట- పోతే పోనీ పోరా ఈ పాపపు జగతీ శాశ్వతమెవరురా... ఈ పాటలోని తాత్త్విక వాక్యాలు చూడండి. జీవితమే ఒక స్వప్నమహో మన జననం కమ్మిన నిద్దురహో ఇట మరణం ఆత్మకు వేకువహో... తమిళంలో ఎలా ఉన్నా తెలుగులో ఇది ఉన్నత సాహిత్య రూపం తీసుకుంది. ఇది అనిసెట్టి ఘనత. భీమప్రతిజ్ఞ (1965)లో ఆయన రాసిన పాట అనువాదంలో కూడా సాహిత్యవిలువ తేవచ్చనడానికి ఉదాహరణ. వీచెను కాలపు సుడిగాలి అది విసరెను బాధల పెనుధూళి విధికి లేదులే ఏ జాలి ఆ విధాతకిదియే ఒక కేళి... ‘కళత్తూర్ కన్నమ్మ’ తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా అనువాదం అవగా అందులో అనిసెట్టి రాసిన- కనిపెంచు తల్లీ కాపాడుతండ్రీ ఆపదలో ఆదరించు దైవము నీవే పాట అదే ఇతివృత్తంతో తీసిన ‘మూగనోము’ కోసం ఆరుద్ర రాసిన తల్లివి నీవే తండ్రి నీవే/ చల్లగ కరుణించే దైవము నీవే పాటకు స్ఫూర్తి కావడం అనిసెట్టికి గర్వకారణం. అనిసెట్టి 1979 డిసెంబర్ 27న నరసరావు పేటలో 57 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన ఖాళీ అన్నది ఎరగరు. మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చినా మళ్లీ ‘సర్వర్ సుందరం’తో విజృంభించారని అంటారు. తన స్వీయ నిర్మాణంలో తీసిన ‘మన ఊరు’ ఆయన చివరి సినిమా. అనిసెట్టి ఒక మంచికిగాని చెడుకుగాని బయటకు వెళ్లేవారు కాదట. ఇంట్లోనే రాసుకుంటూ కూర్చునేవారట. ఏవిఎం, దేవర్ ఫిలిమ్స్‌కు ఆయన పర్మినెంట్ రైటర్. పదిహేను రోజులకో సినిమా ముగించేవారు. అనువాద చిత్రాలనూ, పాటలనూ ద్వితీయ శ్రేణికి చెందినవిగా కొందరు భావించినా, అనువాద రచనను కొందరు రచయితలు జీవిక కోసమే స్వీకరించినా అనువాద రచన కూడా అంకిత భావంతో స్వీకరించి దాని గౌరవాన్ని పెంచిన కొద్దిమంది రచయితల్లో అనిసెట్టి ఒకరు. - పైడిపాల 9989106162 -
రావూరి భరద్వాజ కన్నుమూత
హైదరాబాద్: నవలా రచయిత, సాహితీవేత్త జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ(86) కన్నుమూశారు. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి 8.35 గంటలకు ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం ఈనెల 14న ఆస్పత్రిలో చేర్చారు. ఇటీవలే ఆయన జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న తెలుగు రచయితగా ఖ్యాతికెక్కారు. ఆయన రాసిన పాకుడురాళ్లు నవలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. సుమారు 170పైగా కథలు, నవలలు రాశారు. కృష్ణా జిల్లా మొగలూరులో 1927, జూలై 5న రావూరి భరద్వాజ జన్మించారు. పేదరికం కారణంగా ఆయన ఏడో తరగతి వరకే చదువుకున్నారు. 17 ఏటనే కలం పట్టారు. కాదంబరి, పాకుడురాళ్లు ఆయనకు పేరు తెచ్చిన నవలలు. ఎవరూ స్పృశించని అంశాలపై రచన చేయడం భరద్వాజ ప్రత్యేకత. 1987 వరకు ఆల్ ఇండియా రేడియో పనిచేశారు. ఆయన రాసిన జీవనసమరం పుస్తకానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. -
ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...
మా ఊరు నల్లగొండ జిల్లాలోని సుద్దాల. మా గ్రామం నుండి నాలుగు కిలోమీటర్లు నడిచి సీతారామపురం గ్రామానికి వెళ్లి చదువుకునేవాళ్లం. ఆ దారిలో నల్లని గుట్టలు ఉండేవి. అక్కడ మేమంతా ఆడుకొనేవాళ్లం. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. మొట్టమొదటగా నేను బాగా ఇష్టపడిన పాట అమరశిల్పి జక్కన్న (1964) చిత్రంలోని ‘ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...’. ఈ పాట విన్నప్పుడల్లా నాలో నాకే ఏవో తెలియని సందేహాలు కలిగేవి. ఈ రాళ్లలో కళ్లు ఎలా ఉంటాయి? ఇలా ఆ పాట నన్ను బాగా ఆలోచింప జేసింది. సి.నారాయణరెడ్డిగారు రాసిన ఈ పాట ‘అమరశిల్పి జక్కన్న’ సినిమాలోకి రాకముందే ‘రామప్ప’ అనే నాటకంలో ఉంది. దానిని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరిచారు. సినిమాలో దీనికి మరో బాణీ అందించారు సాలూరి రాజేశ్వరరావుగారు. ఈ పాట నన్ను ఎంతగానో ఇన్‌స్పయిర్ చేసింది. పాట విన్న తర్వాత నాకు గీతరచయితగా మారాలనే కోరిక కలిగింది. అంతేకాదు... టైటిల్స్‌లో నా పేరు సినారెగారి పేరు తర్వాత ఉండాలనే కోరిక కూడా కలిగింది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున... ఏ గుండెలు మ్రోగెనో... అనే పల్లవిలో కళ్లు చూస్తాయి, రెప్పలు ఆర్పుతాయి, వాటికొక జ్ఞానం ఉంది. అయితే రాళ్లకు అవి ఉండవు కానీ కంటిపాపలలో నల్లదనాన్ని చూసి ఒక సామ్యాన్ని తీసుకున్నారు. కాబట్టి ‘ఈ నల్లని రాలలో’ అని మొదలుపెడతారు. గుండెకి స్పందించే గుణం, ధ్వనించే గుణం ఉంటుంది. కానీ బండకు ఈ రెండు గుణాలు లేవు. స్పందించే గుణం ఉన్నవాటిని స్పందించని గుణం ఉన్నవాటికి ఆపాదించడం ఈ పాట మొత్తంలో మనకు కనిపిస్తుంది. పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి/మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి... ఇది రాళ్ల గురించి రాసిన పాట. రాళ్లు అడవుల్లో కదలకుండా, మెదలకుండా ఉండే జడపదార్థం. అవి ‘పద్మాసనం వేసుకొని తపస్సమాధిలో మునిగి ఉన్న ఋషుల్లాగ ఉన్నాయి’ అనడమనేది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ‘రాత్రి నల్లని రాతి పోలిక’ అంటారు శ్రీశ్రీ. రాతిని ముట్టుకుంటే తెలుస్తుంది. రాత్రిని అనుభవిస్తే తెలుస్తుంది. అలా పోల్చడం గొప్ప విషయం. మునులు ప్రత్యేక ఆశయం కోసం తపస్సు చేస్తారు. చలన పదార్థాన్ని, జడపదార్థమైన రాతితో పోల్చడమనే వినూత్నమైన ఆలోచనా విధానానికి ఈ పాట నిలువుటద్దం. ఇలా పోల్చడం నన్ను బాగా ఆకట్టుకుంది. ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు/ ఉలి అలికిడి విన్నంతనే గలగలమని పొంగిపొరలు’ అనే చరణంలో... ప్రవహించే గుణానికి పలికే శబ్దం ఉంటుంది. ఉదాహరణకు నది ప్రవహిస్తూ గలగలమని శబ్దం చేస్తూంటుంది. అలాంటి శబ్దమే లేని, కదలికే లేని రాళ్లు ఉలి శబ్దం వినగానే గలగలమని ప్రవహిస్తాయి. కదలలేని ఆ రాళ్లకు చెవులు లేవు, రాయి ప్రవహించదు. కానీ చెవులు లేని వాటికి వినబడినట్లు, కదలలేనివి ప్రవహించినట్లు పోల్చుతూ, ఉలి చప్పుడు వినగానే గలగలమని పొంగుతాయనడం అనన్యసామాన్యమైన ఆలోచన. పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును/ జీవమున్న వునిషికన్న శిలలే నయువునిపించును... అసలు రాయి అనేది కఠినమైనది. లోన వెన్న కనిపించును అన్నారు సినారె. రాళ్లు పైకి ఎంత కఠినంగా కనిపించినా, చెక్కుతూ పోతే ఎలా అంటే అలా ఒదిగే ఒక మైనంలాగ ఒదుగుతుందనే విషయం శిల్పాలు చెక్కే శిల్పులకు మాత్రమే తెలిసిన శిల్పరహస్యం. అయితే ఈ విషయం నారాయణరెడ్డిగారే ఎలా పట్టారని నా ప్రశ్న. నా నృషి కురు తే కావ్యం... అంటే కవి... ఋషి అయితే తప్ప కావ్యాన్ని సృష్టించలేడు. ఆయన ఋషి కాబట్టే అంత భావగర్భితంగా రాయగలిగారు. మనిషికి జీవం ఉంది, రాళ్లకు జీవం లేదు. మనుషులకన్నా రాళ్లే గొప్పవని ఒక సార్వకాలీనమైన సామాజిక మధన జనిత సత్యాన్ని వేమనలాగ చివరి వాక్యంలో చేర్చారు. అంటే శిలల కంటే కఠినమైనవాళ్లు ఈ సమాజంలో ఉన్నారన్నారు. ఈ సినిమాలో నాయికా నాయకులకు వివాహమయ్యాక, చిన్న అపోహకు గురై విడిపోతారు. అంటే కథకు అనుసంధానిస్తూ లోక సత్యాన్ని కూడా ఈ పాటలో చెప్పారు సినారె. సంభాషణ : నాగేష్