సంగీత సాహిత్య సమలంకృతే | Fathers day special interview | Sakshi
Sakshi News home page

సంగీత సాహిత్య సమలంకృతే

Published Sun, Jun 17 2018 12:59 AM | Last Updated on Sun, Jun 17 2018 1:02 AM

Fathers day special interview - Sakshi

బాలమురళీకృష్ణ, సి.నారాయణరెడ్డి

సంగీతానికి బాలమురళీకృష్ణ. సాహిత్యానికి సి.నారాయణరెడ్డి. సంగీత సాహిత్య సమలంకృతంగా వారి పిల్లలైన రవాలను,  వాహినులను సాక్షి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది.

ఆయన సంగీతాన్ని పండితపామరులకు చేరువ చేశారు. సంగీతంతో ప్రపంచాన్ని తన్మయత్వంలో ముంచెత్తారు. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగా ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా గడిపేవారు?  ఈరోజు ఫాదర్స్‌డే. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. ఆయన ఆరుగురు పిల్లల్ని పలకరించింది. ఆ తండ్రి అను‘రాగాల’ గురించి తెలుసుకుంది.

మురళీ రవాలు
పెద్దబ్బాయి అభిరామ్, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి.  పెద్దబ్బాయి ప్రింటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో స్టేట్‌ గవర్నమెంట్‌లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్దమ్మాయి బీఏ మ్యూజిక్‌ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి బీఎస్‌సీ, మూడో అమ్మాయి ఎంఏ ఇంగ్లిష్‌.

పెద్దమ్మాయి అమ్మాజీ
నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు సూర్యకాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి.

ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన నాకు చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్‌ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు.

నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్‌ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు  ఎంతో  పరవశించిపోయారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి చేశాం. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి నాన్న ఎంతో సంబరపడ్డారు.

రెండో అమ్మాయి లక్ష్మి
మాతో క్యారమ్స్‌ ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్‌ కార్డ్స్‌ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు.

నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్‌ రింగ్‌ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు.

రెండో అబ్బాయి సుధాకర్‌
నాన్నగారికి అందమైన బాల్యం లేదు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆడే లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు. మాకోసం సింగపూర్‌ నుంచి టేప్‌ రికార్డర్‌ తెచ్చారు. అది ఇప్పటికీ మా  దగ్గర ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్‌ డిసి వచ్చారు.

అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్‌లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది.

మూడో అమ్మాయి మహతి
ఆయన మాతో చాలా అటాచ్‌డ్‌గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు... నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది.

వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్‌ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్‌ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్‌ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం.

నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మానాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని.  నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్‌ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం.

ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్‌ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన  వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచాలనీ అనుకుంటున్నాం.

మూడో అబ్బాయి డా. వంశీమోహన్‌
నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్‌ మైండెడ్‌గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు.  

ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు.

( తల్లిదండ్రులు అన్నపూర్ణ, బాలమురళీకృష్ణలతో 1. సూర్యకాంతి, 2. లక్ష్మి 3. మహతి 4. అభిరామ్,  5. డాక్టర్‌ సుధాకర్, 6. డాక్టర్‌ వంశీమోహన్‌; అల్లుళ్లు, కోడళ్లు)

పెద్దబ్బాయి అభిరామ్‌
మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను నాన్నగారు పనిచేశారు. 1964లో  ఆయన మ్యూజిక్‌ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్‌ వన్ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని  నమ్మేవారు.


(బాల మురళికృష్ణ పెద్దమ్మాయి అమ్మాజీ, పెద్దబ్బాయి అభిరామ్, రెండో కూతురు లక్ష్మి)

నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం ^è దువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్‌ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్‌ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే.

ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్‌ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్‌లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్‌ రివల్యూషనరీ నాట్‌ ఓన్లీ ఇన్‌ మ్యూజిక్‌ బట్‌ ఇన్‌ లైఫ్‌ ఆల్‌సో.  

– సంభాషణ: వైజయంతి పురాణపండ

కవన వాహినులు
‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ అన్నారు సినారె. అమ్మ బొమ్మ (ఫొటో) లేదని... అమ్మ బొమ్మ గీయలేని అశక్తుణ్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇది జరిగి రెండేళ్లయింది.

‘నాన్న రూపం కళ్ల ముందు నుంచి చెరగడం లేదు. ఆయన నవ్వు ముఖంతో శాశ్వతనిద్రలోకి జారిపోయి ఏడాదైంది. రోజూ అలవాటుగా నాన్న గది వైపు చూస్తూనే ఉన్నాం మా నలుగురు అక్కాచెల్లెళ్లం’ అన్నారు డాక్టర్‌ సినారె గారి పెద్దమ్మాయి గంగ. సంతోషం, దుఃఖం ఏదైనా సరే... అనుబంధం వ్యక్తమయ్యేది కన్నీళ్ల రూపంలోనే. ఫాదర్స్‌ డే సందర్భంగా డాక్టర్‌ సినారె జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారామె.

‘‘మా నాన్నకు మేము నలుగురం కూతుళ్లం. ఆ రోజుల్లో అబ్బాయి కోసం ఎదురు చూసేవాళ్లు. మగపిల్లవాడులేడని మా నానమ్మ, అమ్మ ఇద్దరికీ కొంచెం కొరత ఉండేది. కానీ నాన్నలో అది లేశమాత్రమైనా ఉండేది కాదు. ఎవరైనా ‘అందరూ అమ్మాయిలేనా’ అంటే ఆ మాట కూడా ఆయనకు నచ్చేది కాదు. ‘నాకు నలుగురు అమ్మలు’ అనేవారు. అమ్మ పోయిన తర్వాత నాన్న ఆమెతో చెప్పాలనుకున్న భావాలను ‘ఎంత స్వార్థం నీది... నలుగురు కూతుళ్లను కన్నావు. ఇప్పుడు తెలిసింది... నాలుగు దిక్కుల్లా తోడుంటారని’ అని రాసుకున్నారు.

నదుల పేర్లు
నాన్నది బాల్య వివాహం. వాళ్ల నానమ్మ తాను పోయేలోపు పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో పదకొండేళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మకి తొమ్మిదేళ్లు. అమ్మకి భక్తి ఎక్కువ, నాన్న దేవుణ్ని నమ్మేవారు కాదు. నేను పుట్టక ముందు నాలుగైదు సార్లు గర్భం పోవడంతో అమ్మ గోదావరి నది తీరాన నలభై రోజులు ఉపవాస దీక్ష చేసింది.

ఆరోగ్యం పాడవుతుందని నాన్న వద్దన్నా వినకుండా దీక్ష చేసిందట. ఆ తర్వాత నేను పుట్టడంతో గంగ అని పేరు పెట్టుకుంది అమ్మ. మా కరీంనగర్‌లో గోదావరి నదిని గంగగానే వ్యవహరిస్తారు. నాన్నకు స్వతహాగా నదులంటే ఇష్టం. దాంతో మిగిలిన ముగ్గురికీ యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. ఇంట్లో అనుబంధాలు జీవనదుల్లా ప్రవహించాలనేది ఆయన కోరిక.

                  (తండ్రి డాక్టర్‌ సి. నారాయణరెడ్డితో గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి)

అమ్మకు పక్షవాతం
నాకు ఏడేళ్లున్నప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చింది. అయినా సరే హెల్పర్‌తో అన్నీ సిద్ధం చేయించుకుని ఒక్కచేత్తోనే నాన్నకు ఇష్టమైనవి వండేది. రోజూ నాన్న ఇంటికి రాగానే తలుపు తీసేదాన్ని. ఇంటికి రాగానే అమ్మ మంచం దగ్గర కూర్చునేవారాయన.  అమ్మ పోయే వరకు కూడా ఆయన దినచర్య అలాగే సాగింది.

ఉపవాసాలతో ఆరోగ్యం పాడుచేసుకుంటుందని నాన్నకు అమ్మ గురించి ఎప్పుడూ బెంగ ఉండేది. భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడగని రోజుండేది కాదు. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుండేవారు. అమ్మ చేతి వంట కోసం గుమ్మడి గారు కూడా వచ్చేవారు.

మీరు నన్ను పోనిస్తారా!
చిన్నప్పటి నుంచి నాకు నాన్న కోసం ఎదురు చూడడం, నాన్న భోజనం చేస్తున్నంత సేపు దగ్గర ఉండడం నాలవాటయిపోయింది. నలుగురిలో ఎవరో ఒకరం నాన్న భోజనం చేసినంత సేపూ దగ్గర ఉండేవాళ్లం. భోజనం కాగానే ట్యాబ్లెట్‌ ఇస్తే ఎప్పుడు నోట్లో వేసుకునేవారో గుక్కెడు నీటితో మింగేసేవారు. నాకేమో ట్యాబ్లెట్‌ గొంతు దిగిందో లేదోనని భయం.

ఇంకొంచెం నీళ్లు తాగు నాన్నా అంటే... ‘నీకు చాదస్తం ఎక్కువవుతోందమ్మాయ్‌. వయసొస్తున్నది నీకా నాకా’ అనేవారు. గొంతు పట్టేస్తే ఎలా నాన్నా అంటే... ‘నాకేమవుతుంది, ఏమైనా అయినా అడ్డుపడి కాపాడుకోవడానికి మీరున్నారు కదా, నన్ను అంత సులభంగా పోనిస్తారా’ అనేవారు నవ్వుతూ.

అందరూ కనిపించాలి!
ఏ తండ్రికైనా కూతుళ్ల మీద ప్రేమ అలాగే ఉంటుందేమో, మా నాన్న మమ్మల్ని పొద్దుపోయాక చదువుకుంటున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అంతంత కష్టం ఎందుకనేవారు. ఆయన నిద్రపోయిన తర్వాత లైట్‌ వేసుకుని చదువుకునేది మా యమున. జీవితంలో చికాకులు పెంచుకోకూడదు, ప్రశాంతంగా జీవించాలనేవారు.

పెళ్లి చేసి అత్తగారిళ్లకు పంపిస్తే రోజూ మమ్మల్ని చూడడం కుదరదని అందరినీ తన దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఫిలింనగర్‌లో మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒక్కో ఫ్లోర్‌లో ఒక్కొక్కరి కుటుంబం, వెనుక ఒక పోర్షన్‌లో ఒక కుటుంబం ఉండేది. అందరికీ వంటగది ఒక్కటే. అల్లుళ్లతోనూ మాతో ఉన్నంత ప్రేమగా ఉండేవారు. ఇక మనుమలు, మనుమరాళ్లనయితే కనురెప్ప వేయకుండా చూసుకునే వారు.

అచ్చమైన సోషలిస్టు!
నాన్న గొప్ప సోషలిస్టు. ఉద్యమాల్లో పాల్గొనలేదనే కాని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను పాటించేవారు. మనుమల్లో ఎవరికీ పేరు చివర కులవాచకాల్లేవు. వాళ్లలో చిన్నప్పుడు కనిపించిన లక్షణాలను బట్టి పేర్లు పెట్టారు. లయ చరణ్‌ ఉయ్యాల్లో ఉన్నప్పుడు నాన్న చిటికెలు వేస్తుంటే వాడు ఆ చిటికెల శబ్దానికి ఆనందంగా కాళ్లను లయబద్దంగా ఆడించేవాడు. అందుకే ఆ పేరు. అన్వేష్‌ ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కళ్లు విప్పార్చి చూసేవాడు.

మేడే రోజు పుట్టిన బాబుకి క్రాంతి కేతన్‌ అని, చైతన్యదేవ్‌ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ. మా ఊరు హనుమాజీ పేటలో అన్ని కులాల వారినీ బంధుత్వంతోనే పిలిచేది మా నానమ్మ. నాన్నకు కూడా అదే అలవాటు వచ్చింది. కులాలవారీగా మనుషులను దూరంగా ఉంచే రోజుల్లోనే వాళ్లు సోషలిస్టు భావాలను అనుసరించారు. అందుకేనేమో నాన్నలో మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం కనిపించేది.

మనుమలతోపాటే
ఇంట్లో ఉన్నంత సేపూ మనుమలు, మనుమరాళ్లందరూ ఆయన చుట్టూ ఉండాల్సిందే. మేము పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటే ‘నాకూ పెట్టమ్మాయ్‌’ అని పెట్టించుకునేవారు. మేము ఎంత దగ్గర బంధువుల పెళ్లి అయినా సరే నలుగురమూ వెళ్లింది లేదు.

ఎవరో ఒకరం నాన్న దగ్గర ఉండేవాళ్లం. పెళ్లికి వెళ్తూ ‘నాన్నా పెళ్లికి వెళ్లి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాం’ అని చెప్పడానికి నోరు తెరిచినా, మాకు గొంతు పెగిలేది కాదు. ఆయనకు మేము వెళ్లడం నచ్చేదీ కాదు. ‘బంధువులు కదా’ అనేవారు ముక్తసరిగా. నేను మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడైతే ఆయన ఒకటే ఏడుపు.

ఆయన కన్నీళ్లు చూసి నాకూ ఏడుపాగలేదు. చాలాసేపటి తర్వాత ‘నువ్వు వెళ్లకపోతే అక్కడ పాప ఇబ్బంది పడుతుంది. వెళ్లిరా’ అన్నారు. అలా పంపించిన తర్వాత ఆయన నా కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపారని చెల్లెళ్లు చెప్పేవాళ్లు. నేను మనుమరాలిని నెలల పాపాయిని తీసుకుని ఇండియాకి వస్తున్నప్పుడు (వరేణ్య, నాన్నకు మునిమనుమరాలు) ఎయిర్‌పోర్టుకి వచ్చేశారు.

ఆలస్యంగా నిద్రపోయారు
గత ఏడాది జూన్‌ 12వ తేదీ. తెల్లవారు జామున నాలుగ్గంటలకు నాకు మెలకువ వచ్చింది. అంతకు మూడు గంటల ముందే నాన్నకు దగ్గు మందు తాగించి ఆయనకు నిద్రపట్టిన తర్వాత నేను పడుకున్నాను. అంతలోనే మెలకువ వచ్చింది. నాన్న గది దగ్గరకు వచ్చాను. నాన్నకు టెంపరేచర్, బిపి చెక్‌ చేయడానికి యమున కూడా వచ్చింది.

ఆ ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండడంతో భోజనం వద్దని బ్రెడ్, పాలు ఇచ్చాం. టెంపరేచర్‌ నార్మల్‌గానే ఉందని చెప్పి యమున పైన గదిలోకి వెళ్లింది. నేను నాన్నను ఒకసారి చూసి, ఆలస్యంగా పడుకున్నారు కదా, ఆరు గంటలకు నిద్రలేపుదాం అని అలాగే కూర్చున్నాను. ఆరయ్యేలోపే అటెండర్‌ వచ్చి ‘యమునమ్మ’ అంటూ ఆగాడు. యమున వచ్చి పల్స్‌ చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది.

ఈ ఏడాది కాలంగా నాకు ఎప్పటి లాగానే ఉదయం నాలుగింటికే మెలకువ వస్తోంది. నాన్న లేడని తెలిసి కూడా ‘నాన్నా లే’ అనే పిలుపు నోటి వరకూ వస్తూనే ఉంది. ఈ నెల పన్నెండవ తేదీన ఆయన సంవత్సరీకానికి మిత్రులందరూ సారస్వత పరిషత్‌లో కలిశారు. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే నాన్న లేదా వేదిక మీద పులిలా కనిపించే నాన్న రూపాలే తెలుసు. ఆ రోజు అందరూ ఉన్నారు వేదిక మీద నాన్నలేరు. ఇప్పుడు మాతో ఉన్నది ఆయన జ్ఞాపకాలే’’.

యమున
నాన్న మా చిన్నప్పుడు సినిమాలకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ నోరు తెరవమనేవారు. పళ్లు శుభ్రంగా తోముకుంటున్నామా లేదా అని అంత పట్టింపుగా ఉండేవారు. సరిగ్గా బ్రష్‌ చేయట్లేదనిపిస్తే కోప్పడేవారు.

నాన్నకు రోజూ కళ్లద్దాలు, వాచీ తుడిచి ఇచ్చేదాన్ని. నాకు వంటలో ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడతాయి. ‘నువ్వింత సున్నితంగా ఉంటావు, మృదువుగా మాట్లాడుతావు. వంట ఎందుకు అంత ఘాటుగా చేస్తావు’ అనేవారు. ఆయన పరిషత్తుకెళ్లేటప్పుడు బాక్స్‌ పెడతాం. బాక్స్‌ తెరిచి చూడగానే... మా నలుగురిలో ఆ రోజు బాక్స్‌ ఎవరు పెట్టి ఉంటారనేది పట్టేసేవారు.

సరస్వతి
నాన్న ఉదయం ఐదున్నరకి అల్లుళ్లతోపాటు వాకింగ్‌కి వెళ్లేవారు. నాన్న జేబులో చిన్న నోట్‌బుక్, పెన్ను ఎప్పుడూ ఉంటాయి. వాకింగ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను నోట్‌బుక్‌లో రాసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్‌ని గంగక్కకిచ్చేవారు. అక్క కాపీని తిరగరాసేది. అమ్మ అనారోగ్యం కారణంగా చెల్లెళ్ల బాధ్యత అంతా పెద్దక్కే చూసుకుంది.

నాన్న కూడా అన్ని పనులకూ అక్క మీదనే ఆధారపడేవారు. రచనలకు వచ్చిన డబ్బుని ఇంటికి రాగానే ‘అమ్మాయ్‌’ అని పిలిచి అక్కకిచ్చేసి జేబు బరువు తీరినట్లు భావించేవారు. జేబులో అసలే డబ్బు పెట్టుకోకపోతే ఎక్కడైనా టిప్పు ఇవ్వాల్సి వస్తే ఎలా అని అక్క రోజూ నాన్న జేబులో కొంత డబ్బు పెడుతుండేది.

కృష్ణవేణి
నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని తాను రాసిన గజల్స్‌ చదివి వినిపించేవారు. రాత్రి ఇంటికి రావడం ఆలస్యమైతే ఫోన్‌ చేసి ‘పిల్లలు (మనుమలు, మనుమరాళ్లు) నిద్రపోకపోతే కొంచెం సేపు మెలకువగా ఉంచండి, వచ్చేస్తున్నాను’ అని చెప్పేవారు. ఆయనకు హిందీ సినిమాలిష్టం.

సినిమాలు చూడాలనుకుంటే మనుమలు, మనుమరాళ్లందరినీ తీసుకుని వెళ్లేవారు. కుటుంబం డాలర్‌ హిల్స్‌కి మారేటప్పుడు పెద్దగా ఇష్టపడలేదు నాన్న. ఫిలిం నగర్‌ ఇల్లు బాగానే ఉందిగా మారడం ఎందుకన్నారు. ఆ ఇంటిని నాన్న కోసమే డిజైన్‌ చేయించాం. ఆయన డ్రాయింగ్‌ రూమ్‌లోకి కూర్చుంటే ఇల్లంతా ఆయనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నారంతే.

– సంభాషణ: వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement