bala murali krishna
-
ఆయన జీవితమే సంగీతం: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరులేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలోనే కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు లేరని పేర్కొన్నారు. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని గొప్ప కళాకారుడన్నారు. ఆ గొప్ప కళామేధావి తెలుగువారు కావడం గర్వకారణమని ఆయన చెప్పారు. రాబోయే తరాలకు బాలమురళీకృష్ణ గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు. కలెక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, ఆ మరిమళమే బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అంతటిగొప్ప కళాకారుడు జయంత్యుత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. కళాకారులు వంకాయల వెంకటరమణమూర్తి, డాక్టర్ పంతుల రమ, ఎం.శ్రీనివాస నరసింహామూర్తి, కె.సరస్వతి, గురువిల్లి అప్పన్న, డాక్టర్ మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డాక్టర్ బీకేడీ ప్రసాద్, ధనుంజయ పట్నాయక్‌లను మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్‌చంద్ సత్కరించారు. అంతకుముందు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
షాడో మంత్రి వీరంగం
ఆయన షాడో మంత్రి. అధికార పార్టీలో అందరికి సుపరిచితుడు. ఇక పైరవీలు చేసే నేతలకు అయితే ఆయన బాగా సన్నిహితం. నెల్లూరు నగరంలో షాడో మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రి నారాయణకు అన్నీ తానై వ్యవహరిస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహారశైలి తరచూ వివాదంగా మారుతోంది. తాజాగా సోమవారం చిన్నబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఎన్నికల విధుల్లోని పోలీసులు, అధికారులపై వీరంగం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నారాయణ సిబ్బందినే స్టేషన్‌కు తీసుకువస్తారా అంటూ నానా యాగీ చేసి పోలీసులపై మండిపడుతూ గందరగోళం సృష్టించారు. అయినా పోలీసులు మాత్రం నోరు మెదపని పరిస్థితి. అదే గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఆగమేఘాల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ అధికార పార్టీ నేతగా ఉన్న పట్టాభి రామిరెడ్డి విషయంలో మాత్రం, అదీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జిల్లా పోలీసు బాస్ మొదలుకొని నగర డీఎస్పీ వరకు ఒక్కరు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ పచ్చచొక్కాలు ధరించిన పోలీసుల్లా మారడం సర్వత్రా వివాదంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రజాభిమానం లేని నారాయణ కేవలం కరెన్సీ నోట్లనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కూడా నమ్మకుండా సొంత మనుషుల ద్వారా డబ్బు వ్యవహారాలకు తెరతీశారు. తన విద్యా సంస్థల్లోని సిబ్బందితో అడగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తూ ప్రజలకు దొరికిపోతున్నారు. అందులో భాగంగా ఆదివారం, సోమవారం వరుసగా రెండు రోజుల పాటు నెల్లూరు నగరంలో డబ్బులు పంచుతూ స్థానికులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబట్టారు. అది కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక స్థాయి ఉద్యోగులే కావడం విశేషం. ఆదివారం 43వ డివిజన్లో డబ్బు పంచడానికి నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి రూ.8.30 లక్షలతో ఉండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు యథావిధిగా కేసు నమోదు చేసి సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇక సోమవారం నగరంలోని 40వ డివిజన్లో నారాయణ విద్యాసంస్థల లెక్చరర్ బాలమురళీకృష్ణ రూ.50 వేల నగదు ఎవరెవరికి పంపిణీ చేయాలనే దానికి సంబంధించిన స్లిప్పులు, టీడీపీ కండువాలతో చిక్కారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకొని చిన్నబజార్ స్టేషన్లో అప్పగించారు. బాలమురళీతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అనుచరుడు పట్టాభి చిన్నబజార్ స్టేషన్‌కు చేరుకుని తమ వాళ్లను ఎలా పట్టుకుంటారని పోలీసులపై మండి పడ్డారు. నారాయణ సిబ్బంది నారాయణకు కాకుండా మీకు పనిచేస్తారా అంటూ తీవ్రంగా ఆవేశంతో ఉగిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో డీఎస్పీ మురళీ కృష్ణ స్టేషన్‌కు చేరుకుని అనేక తరన్జనభర్జల అనంతరం డబ్బులతో దొరికిన బాలమురళీ కృష్ణపై కేసు నమోదు చేసి మిగిలిన వారికి సంబంధం లేదంటూ పంపేశారు. ఇదేమి పోలీసు రాజ్యం కొద్ది రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. రూరల్ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న టీడీపీ వ్యక్తులను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఆపి వారిని స్టేషన్లో అప్పగించారు. పోలీసులు సర్వే టీమ్ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని పార్టీ కా>ర్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇదేమి అన్యాయం అని స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించిన ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి హైడ్రామా నడుమ అరెస్ట్ చేశారు. వాస్తవానికి ప్రజాప్రతినిధికి జరిగిన విషయంపై ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే ఎలాంటి హోదాలేని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి స్టేషన్లో నానా యాగీ చేసినా పోలీసులు మాత్రం మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. పైగా ఎన్నికల విధుల్లో ఉండి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక పోలీసులు మరింత పక్కగా ఎన్నికల నియామావళికి లోబడి పనిచేయాలి. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నారాయణ అడుగులకు మడుగులు ఒత్తడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. పట్టాభి తీరు అంతే పట్టాభి రామిరెడ్డి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. నగర టీడీపీలో నేతలుగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తాళ్లపాక ఆనురాధ తదితరులు ఇప్పటికే పట్టాభి తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలోనూ పట్టాభి వ్యవహారంపై అనేక సార్లు మంత్రి వద్ద, రెండు సార్లు చంద్రబాబు వద్ద కూడా పంచాయితీ జరిగింది. పట్టాభిపై ఉన్న వ్యతిరేకతతో 2016లో టీడీపీ నేతల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన అతన్ని ఓడించారు. మరో వైపు ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్‌తో పాటు పట్టాభి చేసిన అరాచకాల్ని ఓటర్లు కాగితంపై రాసి బ్యాలెట్ పేపర్‌తో కలిపివేయడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులను వేధించిన తీరును, పట్టాభి ఆడియో టేపులను సీపీఎం నేతలు విడుదల చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనున్నారు. -
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీతానికి బాలమురళీకృష్ణ. సాహిత్యానికి సి.నారాయణరెడ్డి. సంగీత సాహిత్య సమలంకృతంగా వారి పిల్లలైన రవాలను, వాహినులను సాక్షి ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేసింది. ఆయన సంగీతాన్ని పండితపామరులకు చేరువ చేశారు. సంగీతంతో ప్రపంచాన్ని తన్మయత్వంలో ముంచెత్తారు. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ తండ్రిగా ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా గడిపేవారు? ఈరోజు ఫాదర్స్‌డే. ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. ఆయన ఆరుగురు పిల్లల్ని పలకరించింది. ఆ తండ్రి అను‘రాగాల’ గురించి తెలుసుకుంది. మురళీ రవాలు పెద్దబ్బాయి అభిరామ్, రెండో అబ్బాయి సుధాకర్, మూడో అబ్బాయి వంశీమోహన్, పెద్దమ్మాయి కాంతి (అమ్మాజీ), రెండో అమ్మాయి లక్ష్మి, మూడో అమ్మాయి మహతి. పెద్దబ్బాయి ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైరయ్యారు. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి డాక్టర్లు. పెద్దమ్మాయి బీఏ మ్యూజిక్ ఫిలాసఫీ, సైకాలజీ, రెండో అమ్మాయి బీఎస్సీ, మూడో అమ్మాయి ఎంఏ ఇంగ్లిష్. పెద్దమ్మాయి అమ్మాజీ నేను అందరికంటె పెద్దదాన్ని. నన్ను నాన్నగారు అమ్మాజీ అని పిలిచేవారు. మా నాయనమ్మ గారి పేరు సూర్యకాంతమ్మ. అందువల్ల నాకు సూర్యకాంతి అని పేరు పెట్టారు. కాని అమ్మాజీ అని పిలిచేవారు. నాన్నగారు మాతో చాలా స్నేహంగా, ఎంతో సరదాగా ఉండేవారు. కాలేజీలో సంగీతం పోటీలలో మొదటి బహుమతి వచ్చిన రోజున, ఆ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ నాన్నతో చెబితే, ఆయన నన్ను దగ్గరకు తీసుకున్నారు. నాకు ఆనందంతో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఆ సంఘటన నేను మరచిపోలేను. నా పెళ్లికి ముందు నాన్నగారి కచేరీలలో వెనకాలే కూర్చుని తంబురా వేసేదాన్ని. నాన్నగారితో పాడాను కూడా. నాన్నగారు రాసిన కల్యాణవసంతం రాగంలో ‘గానమాలించి’ కీర్తన నాకు చాలా ఇష్టం. మా వారి ఉద్యోగరీత్యా మేం పంజాబ్ భటిల్డాలో ఉన్నప్పుడు, నాన్న ఒకసారి మా ఇంటికి వచ్చారు. నాన్నగారికి జనం మధ్యన ఉండటం చాలా ఇష్టం. అందుకని మా వారితో పనిచేసేవారిని భోజనానికి పిలిచాం. వారందరితో కలిసి నాన్న డిన్నర్ చేశారు. వారంతా నాన్నని పాట పాడమన్నారు. నాన్న వారి కోసం కచేరీ చేశారు. వాళ్లు ఎంతో పరవశించిపోయారు. నాన్నగారి షష్టిపూర్తి, 81వ పుట్టినరోజు వేడుకలు మేం ఆరుగురం కలిసి చేశాం. మేం అలా సరదాగా వేడుక చేయడం చూసి నాన్న ఎంతో సంబరపడ్డారు. రెండో అమ్మాయి లక్ష్మి మాతో క్యారమ్స్ ఆడేవారు నాన్న. అప్పుడప్పుడు అందరం కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్లం. గోదావరి జిల్లాలకు ప్రత్యేకమైన అడ్డాట మాతో బాగా అడేవారు. సరదా కోసం రమ్మీ కూడా ఆడేవారు. అందరం నాన్నతో కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. అన్నం కలిపి మా అందరికీ ముద్దలు పెట్టేవారు. నాన్నగారి 75 సంవత్సరాల పుట్టినరోజు పండుగకు నేను ప్లాటినమ్ రింగ్ బహుమతిగా ఇచ్చాను. అది చూసి నాన్న మురిసిపోతూ, చేతికి పెట్టుకుని, ‘లక్ష్మీ నీ ఉంగరం పెట్టుకున్నాను చూశావా’ అన్నారు. ఇచ్చిన బహుమతి చిన్నదా, పెద్దదా అనే ఆలోచనే ఆయనకు ఉండదు. వస్తువు విలువ గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. అలాగే ఏది చేసి పెడితే అది మాట్లాడకుండా తినేసేవారు. రుచి ఎలా ఉన్నా, ‘ఎంతో బాగుంది’ అనేవారు. రెండో అబ్బాయి సుధాకర్ నాన్నగారికి అందమైన బాల్యం లేదు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు. ఆయన ఒక్కరే. ఆరో ఏట నుంచే సంగీతం పాడటం ప్రారంభించారు. సంగీతంతోనే ఆయన జీవితం గడిచిపోయింది. అందుకే ఆడే లోటును ఆయన మాతో తీర్చుకున్నారు. మనవలతో కూడా సరదాగా ఆడేవారు. మాకోసం సింగపూర్ నుంచి టేప్ రికార్డర్ తెచ్చారు. అది ఇప్పటికీ మా దగ్గర ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం నాన్నగారు సంగీత కచేరీ చేయడానికి వాషింగ్టన్ డిసి వచ్చారు. అప్పుడు నేను, నా భార్య న్యూయార్క్‌లో ఉన్నాం. నాన్నగారి దగ్గరకు వెళ్లి రెండు రోజులు అక్కడే సరదాగా గడిపాం. అక్కడ మా రెండో అమ్మాయి లాస్యతో కలిసి అందరం నాన్నగారి కచేరీకి వెళ్లాం. అక్కడ చాలామంది అమెరికన్లు మొట్టమొదటిసారిగా దక్షిణ భారత సంగీత కచేరీ వినడానికి వచ్చారు. వారంతా నాన్నగారి కచేరీ విని సంబరపడిపోయారు. నాన్న పాటకు తాళం వేశారు. ఆ నాటి దృశ్యం మా జీవితంలో మరచిపోలేని సంఘటనగా ముద్ర వేసింది. మూడో అమ్మాయి మహతి ఆయన మాతో చాలా అటాచ్డ్గా ఉండేవారు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు. నేనే కాదు మా అమ్మాయి కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకుంది. ఆయన పాఠం చెప్పేటప్పుడు ఏనాడూ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. చాలా సాధారణంగా నేర్పేవారు. పూర్వీకులు రాసిన పాటలు, కీర్తనలు... నాన్నకి ఏ పాట కావాలంటే ఆ పాట, ఏ పుస్తకం కావాలంటే అది వెతికి తీసి ఇచ్చే బాధ్యత నాది. వేసవి సెలవుల్లో నాన్నతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. ఆయన చాలా బాగా ఆడేవారు. మా ప్రోగ్రెస్ కార్డు వస్తే ఏం మాట్లాడకుండా సంతకాలు పెట్టేవారు. మేమందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే మేమే కాదు, మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. ఆయన అన్నీ తన కళ్లతో చూశారు. నిండు జీవితం గడిపారు. మేం అందరం కలసిమెలసి ఉంటాం. ఎక్కడో ఒక చోట తరచు కలుస్తుంటాం. అది నాన్నగారి పెంపకంలో వచ్చిన సంస్కారం అనుకుంటాం. నేను కూడా చెన్నైలోనే ఉండటం వల్ల తరచుగా అమ్మానాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుండేదాన్ని. చివరి రోజుల్లో ఇంచుమించు ప్రతిరోజూ వెళ్లేదాన్ని. నాన్న దగ్గరకు వచ్చి ఆయనను చూసి, మళ్లీ ఇంటికి బయలుదేరుతుంటే, కళ్లనీళ్లు పెట్టుకుని, ‘అప్పుడే వెళ్లిపోతున్నావా’ అనేవారు. ఆయన ఇమ్మోర్టల్ అనే భావన మాలో ఉండిపోయింది. అందుకే ‘నాన్నలేరు’ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాం. ఆయన ఉన్నారన్న భావనలోనే జీవించాలి అనుకుంటాం. కాని బాధ మాత్రం పోవట్లేదు. నాన్నగారు రాసి పబ్లిష్ అవ్వని కీర్తనలను ఒక పుస్తకంలా తీసుకురావాలని,. విజయవాడలో ఉన్న ఇంట్లో నాన్నగారికి సంబంధించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచాలని, చెన్నైలో నాన్న శిష్యులకు సంగీతం నేర్పించిన రూమ్‌ను కూడా ప్రదర్శనకు ఉంచాలనీ అనుకుంటున్నాం. మూడో అబ్బాయి డా. వంశీమోహన్ నాన్నగారు ఏ విషయాన్నయినా చాలా తేలికగానే తీసుకునేవారు. సంగీతంలో మునిగితేలడం వలన, ఆ కీర్తనలలోని తత్త్వాన్ని ఒంట బట్టించుకోవడం వల్ల, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉండేవారు. ఇరుకుగా ఆలోచించే మనస్తత్వం కాదు ఆయనది. అందుకే ఇతర విషయాలను సెకండరీగా తీసుకునేవారు. ఎప్పుడైనా మా మనసుకి బాధ కలిగితే ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకని ఆయనకు చెప్పలేక అమ్మకు చెప్పేవాళ్లం. అయితే అమ్మ ద్వారా విషయం తెలుసుకుని, తన మనసులోనే బాధను దాచుకుని, మమ్మల్ని ఓదార్చేవారు. ఆయనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడు తీరిక దొరికినా ఎత్తుకుని ఆడించేవారు. మనవలతో చెప్పే కబురులే వారికి జోలపాట అనుకునేవాళ్లం. ఆయన ఎత్తుకోగానే పిల్లలు ఒళ్లు తడిపితే, బట్టలు మార్చుకునేవారే కాని చిరాకు పడేవారు కాదు. ( తల్లిదండ్రులు అన్నపూర్ణ, బాలమురళీకృష్ణలతో 1. సూర్యకాంతి, 2. లక్ష్మి 3. మహతి 4. అభిరామ్, 5. డాక్టర్ సుధాకర్, 6. డాక్టర్ వంశీమోహన్; అల్లుళ్లు, కోడళ్లు) పెద్దబ్బాయి అభిరామ్ మా చిన్నతనంలో విజయవాడలో ఉండేవాళ్లం. అక్కడ కొన్నాళ్లు ఆకాశవాణి కేంద్రంలోను, సంగీత కళాశాలలోను నాన్నగారు పనిచేశారు. 1964లో ఆయన మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మద్రాసు వచ్చేశాం. తెలుగువారిని ఏ మాత్రం అంగీకరించని తమిళనాట నాన్న తట్టుకుని, నిలదొక్కుకుని, నంబర్ వన్ స్థాయికి చేరారు. సంగీత సాధన చేయమని మమ్మల్ని ఎన్నడూ బలవంతపెట్టలేదు. సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదని, అది భగవదత్తమైన కళ అని నమ్మేవారు. (బాల మురళికృష్ణ పెద్దమ్మాయి అమ్మాజీ, పెద్దబ్బాయి అభిరామ్, రెండో కూతురు లక్ష్మి) నాన్నగారు నిరంతరం సంగీత కచేరీలలో ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా మా అమ్మే చూసుకునేవారు. మేం ఏం ^è దువుతానంటే అదే చదివించారు. అందరం బాగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే అందరం బాగా సెటిల్ అయ్యాం. తొమ్మిది మంది మనవలు, ఆరుగురు మునిమనమలతో హాయిగా ఆడుకుంటూ నిండైన జీవితం అనుభవించారాయన. మా ఇల్లు ఒక మినీ ఇండియా. మా ఇంట్లో కొంకిణి, మలయాళం వాళ్లు కూడా సభ్యులే. ఇతర రాష్ట్రాలవారిని వివాహం చేసుకున్నా నాన్న ఏమీ అనలేదు. మా అబ్బాయి గుజరాతీ అమ్మాయిని చేసుకున్నాడు. ఆయనకు ఫోన్ చేసి చెప్పగానే, ఎంతో సంబర పడ్డారు. వాళ్ల రిసెప్షన్లో ∙‘సీతాకల్యాణ వైభోగమే’ పాట పాడుతూ ‘సదా కల్యాణ వైభోగమే, తను కల్యాణ వైభోగమే’ అంటూ పెళ్లికూతురు (తను), పెళ్లి కొడుకు (సదా) ల పేర్లతో పాడారు. వచ్చినవారంతా ఎంతో సంబరంగా తప్పట్లు కొట్టారు. నాన్నగారు ఆనందపడ్డారు. మా తమ్ముడు కొంకిణి అమ్మాయిని చేసుకున్నాడు. హీ ఈజ్ రివల్యూషనరీ నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ బట్ ఇన్ లైఫ్ ఆల్సో. – సంభాషణ: వైజయంతి పురాణపండ కవన వాహినులు ‘అమ్మంటే... ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ’ అన్నారు సినారె. అమ్మ బొమ్మ (ఫొటో) లేదని... అమ్మ బొమ్మ గీయలేని అశక్తుణ్నంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన. ఇది జరిగి రెండేళ్లయింది. ‘నాన్న రూపం కళ్ల ముందు నుంచి చెరగడం లేదు. ఆయన నవ్వు ముఖంతో శాశ్వతనిద్రలోకి జారిపోయి ఏడాదైంది. రోజూ అలవాటుగా నాన్న గది వైపు చూస్తూనే ఉన్నాం మా నలుగురు అక్కాచెల్లెళ్లం’ అన్నారు డాక్టర్ సినారె గారి పెద్దమ్మాయి గంగ. సంతోషం, దుఃఖం ఏదైనా సరే... అనుబంధం వ్యక్తమయ్యేది కన్నీళ్ల రూపంలోనే. ఫాదర్స్ డే సందర్భంగా డాక్టర్ సినారె జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారామె. ‘‘మా నాన్నకు మేము నలుగురం కూతుళ్లం. ఆ రోజుల్లో అబ్బాయి కోసం ఎదురు చూసేవాళ్లు. మగపిల్లవాడులేడని మా నానమ్మ, అమ్మ ఇద్దరికీ కొంచెం కొరత ఉండేది. కానీ నాన్నలో అది లేశమాత్రమైనా ఉండేది కాదు. ఎవరైనా ‘అందరూ అమ్మాయిలేనా’ అంటే ఆ మాట కూడా ఆయనకు నచ్చేది కాదు. ‘నాకు నలుగురు అమ్మలు’ అనేవారు. అమ్మ పోయిన తర్వాత నాన్న ఆమెతో చెప్పాలనుకున్న భావాలను ‘ఎంత స్వార్థం నీది... నలుగురు కూతుళ్లను కన్నావు. ఇప్పుడు తెలిసింది... నాలుగు దిక్కుల్లా తోడుంటారని’ అని రాసుకున్నారు. నదుల పేర్లు నాన్నది బాల్య వివాహం. వాళ్ల నానమ్మ తాను పోయేలోపు పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో పదకొండేళ్లకే పెళ్లి చేశారు. అప్పుడు అమ్మకి తొమ్మిదేళ్లు. అమ్మకి భక్తి ఎక్కువ, నాన్న దేవుణ్ని నమ్మేవారు కాదు. నేను పుట్టక ముందు నాలుగైదు సార్లు గర్భం పోవడంతో అమ్మ గోదావరి నది తీరాన నలభై రోజులు ఉపవాస దీక్ష చేసింది. ఆరోగ్యం పాడవుతుందని నాన్న వద్దన్నా వినకుండా దీక్ష చేసిందట. ఆ తర్వాత నేను పుట్టడంతో గంగ అని పేరు పెట్టుకుంది అమ్మ. మా కరీంనగర్లో గోదావరి నదిని గంగగానే వ్యవహరిస్తారు. నాన్నకు స్వతహాగా నదులంటే ఇష్టం. దాంతో మిగిలిన ముగ్గురికీ యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. ఇంట్లో అనుబంధాలు జీవనదుల్లా ప్రవహించాలనేది ఆయన కోరిక. (తండ్రి డాక్టర్ సి. నారాయణరెడ్డితో గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి) అమ్మకు పక్షవాతం నాకు ఏడేళ్లున్నప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చింది. అయినా సరే హెల్పర్‌తో అన్నీ సిద్ధం చేయించుకుని ఒక్కచేత్తోనే నాన్నకు ఇష్టమైనవి వండేది. రోజూ నాన్న ఇంటికి రాగానే తలుపు తీసేదాన్ని. ఇంటికి రాగానే అమ్మ మంచం దగ్గర కూర్చునేవారాయన. అమ్మ పోయే వరకు కూడా ఆయన దినచర్య అలాగే సాగింది. ఉపవాసాలతో ఆరోగ్యం పాడుచేసుకుంటుందని నాన్నకు అమ్మ గురించి ఎప్పుడూ బెంగ ఉండేది. భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడగని రోజుండేది కాదు. ఇంటికి ఎప్పుడూ అతిథులు వస్తుండేవారు. అమ్మ చేతి వంట కోసం గుమ్మడి గారు కూడా వచ్చేవారు. మీరు నన్ను పోనిస్తారా! చిన్నప్పటి నుంచి నాకు నాన్న కోసం ఎదురు చూడడం, నాన్న భోజనం చేస్తున్నంత సేపు దగ్గర ఉండడం నాలవాటయిపోయింది. నలుగురిలో ఎవరో ఒకరం నాన్న భోజనం చేసినంత సేపూ దగ్గర ఉండేవాళ్లం. భోజనం కాగానే ట్యాబ్లెట్ ఇస్తే ఎప్పుడు నోట్లో వేసుకునేవారో గుక్కెడు నీటితో మింగేసేవారు. నాకేమో ట్యాబ్లెట్ గొంతు దిగిందో లేదోనని భయం. ఇంకొంచెం నీళ్లు తాగు నాన్నా అంటే... ‘నీకు చాదస్తం ఎక్కువవుతోందమ్మాయ్. వయసొస్తున్నది నీకా నాకా’ అనేవారు. గొంతు పట్టేస్తే ఎలా నాన్నా అంటే... ‘నాకేమవుతుంది, ఏమైనా అయినా అడ్డుపడి కాపాడుకోవడానికి మీరున్నారు కదా, నన్ను అంత సులభంగా పోనిస్తారా’ అనేవారు నవ్వుతూ. అందరూ కనిపించాలి! ఏ తండ్రికైనా కూతుళ్ల మీద ప్రేమ అలాగే ఉంటుందేమో, మా నాన్న మమ్మల్ని పొద్దుపోయాక చదువుకుంటున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అంతంత కష్టం ఎందుకనేవారు. ఆయన నిద్రపోయిన తర్వాత లైట్ వేసుకుని చదువుకునేది మా యమున. జీవితంలో చికాకులు పెంచుకోకూడదు, ప్రశాంతంగా జీవించాలనేవారు. పెళ్లి చేసి అత్తగారిళ్లకు పంపిస్తే రోజూ మమ్మల్ని చూడడం కుదరదని అందరినీ తన దగ్గరే ఉండేలా చూసుకున్నారు. ఫిలింనగర్లో మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒక్కో ఫ్లోర్లో ఒక్కొక్కరి కుటుంబం, వెనుక ఒక పోర్షన్లో ఒక కుటుంబం ఉండేది. అందరికీ వంటగది ఒక్కటే. అల్లుళ్లతోనూ మాతో ఉన్నంత ప్రేమగా ఉండేవారు. ఇక మనుమలు, మనుమరాళ్లనయితే కనురెప్ప వేయకుండా చూసుకునే వారు. అచ్చమైన సోషలిస్టు! నాన్న గొప్ప సోషలిస్టు. ఉద్యమాల్లో పాల్గొనలేదనే కాని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను పాటించేవారు. మనుమల్లో ఎవరికీ పేరు చివర కులవాచకాల్లేవు. వాళ్లలో చిన్నప్పుడు కనిపించిన లక్షణాలను బట్టి పేర్లు పెట్టారు. లయ చరణ్ ఉయ్యాల్లో ఉన్నప్పుడు నాన్న చిటికెలు వేస్తుంటే వాడు ఆ చిటికెల శబ్దానికి ఆనందంగా కాళ్లను లయబద్దంగా ఆడించేవాడు. అందుకే ఆ పేరు. అన్వేష్ ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కళ్లు విప్పార్చి చూసేవాడు. మేడే రోజు పుట్టిన బాబుకి క్రాంతి కేతన్ అని, చైతన్యదేవ్ ఇలాగే ఉంటాయి పేర్లన్నీ. మా ఊరు హనుమాజీ పేటలో అన్ని కులాల వారినీ బంధుత్వంతోనే పిలిచేది మా నానమ్మ. నాన్నకు కూడా అదే అలవాటు వచ్చింది. కులాలవారీగా మనుషులను దూరంగా ఉంచే రోజుల్లోనే వాళ్లు సోషలిస్టు భావాలను అనుసరించారు. అందుకేనేమో నాన్నలో మనిషిని మనిషిగా ప్రేమించే తత్వం కనిపించేది. మనుమలతోపాటే ఇంట్లో ఉన్నంత సేపూ మనుమలు, మనుమరాళ్లందరూ ఆయన చుట్టూ ఉండాల్సిందే. మేము పిల్లలకు అన్నం కలిపి తినిపిస్తుంటే ‘నాకూ పెట్టమ్మాయ్’ అని పెట్టించుకునేవారు. మేము ఎంత దగ్గర బంధువుల పెళ్లి అయినా సరే నలుగురమూ వెళ్లింది లేదు. ఎవరో ఒకరం నాన్న దగ్గర ఉండేవాళ్లం. పెళ్లికి వెళ్తూ ‘నాన్నా పెళ్లికి వెళ్లి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాం’ అని చెప్పడానికి నోరు తెరిచినా, మాకు గొంతు పెగిలేది కాదు. ఆయనకు మేము వెళ్లడం నచ్చేదీ కాదు. ‘బంధువులు కదా’ అనేవారు ముక్తసరిగా. నేను మా అమ్మాయి డెలివరీ కోసం అమెరికా వెళ్లాల్సినప్పుడైతే ఆయన ఒకటే ఏడుపు. ఆయన కన్నీళ్లు చూసి నాకూ ఏడుపాగలేదు. చాలాసేపటి తర్వాత ‘నువ్వు వెళ్లకపోతే అక్కడ పాప ఇబ్బంది పడుతుంది. వెళ్లిరా’ అన్నారు. అలా పంపించిన తర్వాత ఆయన నా కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపారని చెల్లెళ్లు చెప్పేవాళ్లు. నేను మనుమరాలిని నెలల పాపాయిని తీసుకుని ఇండియాకి వస్తున్నప్పుడు (వరేణ్య, నాన్నకు మునిమనుమరాలు) ఎయిర్‌పోర్టుకి వచ్చేశారు. ఆలస్యంగా నిద్రపోయారు గత ఏడాది జూన్ 12వ తేదీ. తెల్లవారు జామున నాలుగ్గంటలకు నాకు మెలకువ వచ్చింది. అంతకు మూడు గంటల ముందే నాన్నకు దగ్గు మందు తాగించి ఆయనకు నిద్రపట్టిన తర్వాత నేను పడుకున్నాను. అంతలోనే మెలకువ వచ్చింది. నాన్న గది దగ్గరకు వచ్చాను. నాన్నకు టెంపరేచర్, బిపి చెక్ చేయడానికి యమున కూడా వచ్చింది. ఆ ముందు రోజు రాత్రి జ్వరంగా ఉండడంతో భోజనం వద్దని బ్రెడ్, పాలు ఇచ్చాం. టెంపరేచర్ నార్మల్‌గానే ఉందని చెప్పి యమున పైన గదిలోకి వెళ్లింది. నేను నాన్నను ఒకసారి చూసి, ఆలస్యంగా పడుకున్నారు కదా, ఆరు గంటలకు నిద్రలేపుదాం అని అలాగే కూర్చున్నాను. ఆరయ్యేలోపే అటెండర్ వచ్చి ‘యమునమ్మ’ అంటూ ఆగాడు. యమున వచ్చి పల్స్ చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ ఏడాది కాలంగా నాకు ఎప్పటి లాగానే ఉదయం నాలుగింటికే మెలకువ వస్తోంది. నాన్న లేడని తెలిసి కూడా ‘నాన్నా లే’ అనే పిలుపు నోటి వరకూ వస్తూనే ఉంది. ఈ నెల పన్నెండవ తేదీన ఆయన సంవత్సరీకానికి మిత్రులందరూ సారస్వత పరిషత్‌లో కలిశారు. మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే నాన్న లేదా వేదిక మీద పులిలా కనిపించే నాన్న రూపాలే తెలుసు. ఆ రోజు అందరూ ఉన్నారు వేదిక మీద నాన్నలేరు. ఇప్పుడు మాతో ఉన్నది ఆయన జ్ఞాపకాలే’’. యమున నాన్న మా చిన్నప్పుడు సినిమాలకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్తుండేవారు. మద్రాసు నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ నోరు తెరవమనేవారు. పళ్లు శుభ్రంగా తోముకుంటున్నామా లేదా అని అంత పట్టింపుగా ఉండేవారు. సరిగ్గా బ్రష్ చేయట్లేదనిపిస్తే కోప్పడేవారు. నాన్నకు రోజూ కళ్లద్దాలు, వాచీ తుడిచి ఇచ్చేదాన్ని. నాకు వంటలో ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడతాయి. ‘నువ్వింత సున్నితంగా ఉంటావు, మృదువుగా మాట్లాడుతావు. వంట ఎందుకు అంత ఘాటుగా చేస్తావు’ అనేవారు. ఆయన పరిషత్తుకెళ్లేటప్పుడు బాక్స్ పెడతాం. బాక్స్ తెరిచి చూడగానే... మా నలుగురిలో ఆ రోజు బాక్స్ ఎవరు పెట్టి ఉంటారనేది పట్టేసేవారు. సరస్వతి నాన్న ఉదయం ఐదున్నరకి అల్లుళ్లతోపాటు వాకింగ్‌కి వెళ్లేవారు. నాన్న జేబులో చిన్న నోట్‌బుక్, పెన్ను ఎప్పుడూ ఉంటాయి. వాకింగ్‌లో ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనలను నోట్‌బుక్‌లో రాసుకునేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్‌ని గంగక్కకిచ్చేవారు. అక్క కాపీని తిరగరాసేది. అమ్మ అనారోగ్యం కారణంగా చెల్లెళ్ల బాధ్యత అంతా పెద్దక్కే చూసుకుంది. నాన్న కూడా అన్ని పనులకూ అక్క మీదనే ఆధారపడేవారు. రచనలకు వచ్చిన డబ్బుని ఇంటికి రాగానే ‘అమ్మాయ్’ అని పిలిచి అక్కకిచ్చేసి జేబు బరువు తీరినట్లు భావించేవారు. జేబులో అసలే డబ్బు పెట్టుకోకపోతే ఎక్కడైనా టిప్పు ఇవ్వాల్సి వస్తే ఎలా అని అక్క రోజూ నాన్న జేబులో కొంత డబ్బు పెడుతుండేది. కృష్ణవేణి నాన్న మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని తాను రాసిన గజల్స్ చదివి వినిపించేవారు. రాత్రి ఇంటికి రావడం ఆలస్యమైతే ఫోన్ చేసి ‘పిల్లలు (మనుమలు, మనుమరాళ్లు) నిద్రపోకపోతే కొంచెం సేపు మెలకువగా ఉంచండి, వచ్చేస్తున్నాను’ అని చెప్పేవారు. ఆయనకు హిందీ సినిమాలిష్టం. సినిమాలు చూడాలనుకుంటే మనుమలు, మనుమరాళ్లందరినీ తీసుకుని వెళ్లేవారు. కుటుంబం డాలర్ హిల్స్‌కి మారేటప్పుడు పెద్దగా ఇష్టపడలేదు నాన్న. ఫిలిం నగర్ ఇల్లు బాగానే ఉందిగా మారడం ఎందుకన్నారు. ఆ ఇంటిని నాన్న కోసమే డిజైన్ చేయించాం. ఆయన డ్రాయింగ్ రూమ్‌లోకి కూర్చుంటే ఇల్లంతా ఆయనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నాలుగు నెలలు ఉన్నారంతే. – సంభాషణ: వాకా మంజులారెడ్డి -
ప్రణవానికి ప్రతిబింబం
నివాళి నేనాయన్ని మొదటిమారుగా చూసింది, విన్నది 1944లో. నా మేనమామ మేకా మువ్వగోపాల అప్పారావు పెళ్లి హైదరాబాదులో జరిగిన తరువాత, సొంత ఊరైన నూజివీడు తేలప్రోలు ఎస్టేటులో జరిగిందా కచ్చేరీ. ఆయన కప్పుడు 14 ఏళ్లుంటాయి కానీ చూడటానికి ఏడెనిమిదేళ్ల వానిలా ఉన్నాడు. నా వయస్సు అయిదు. కచ్చేరీ చివరి భాగం మాత్రం విని-- నాకు తెలుసు నాకు నచ్చేపాటలా సమయంలోనే పాడతారని--‘పదాలు, జావళీలు పాడలేదేం? అతనికి రావా!’ అని నేను నా అమ్మమ్మనడగటం, ‘చిన్నపిల్లాడేం పాడతాడు నీ సానివారి పాట?’ లని అమ్మమ్మ నన్ను గదమాయించడం నాకు గుర్తున్నది. నేను రికార్డులపైనా, ముఖతా గడ్డిభుక్త సీతారాం వద్ద (ఆమె బొబ్బిలి వేణుగోపాలుని నృత్యసేవకే కాక బొబ్బిలి సంస్థాన నర్తకి కూడాను. మా చిన్నతనంలో మేముండే రాణి వాసానికి రోజూ వచ్చి, నేను కోరిన పాటలు పాడేది) పాటలే వినడానికి యిష్ట పడేవాణ్ణని అమ్మమ్మకు తెలుసు. ఆ సమయంలోనే నేను బెంగుళూరు నాగరత్నమ్మ కచ్చేరీ కూడా విన్నాను. ఆమెతో నాకు చనువు కనుక ‘నేనే జాణ’ పాడలేదేమని అడిగాను. ఆ రికార్డు నాకెంతో ఇష్టం. ‘నీ కోసం పాడతాన్నాయనా’ అంటూ నన్ను ఒళ్లో కూర్చోబెట్టు కుని పాడారు. ‘బాలమురళిది సంగీతమూ కాదు, కర్ణాటకమూ కాదు, అదొక ఓంకార మమ్మా! అయ్యవారి (అంటే త్యాగయ్య) ప్రణవానికి ప్రతిబింబం’ అని నాగ రత్నమ్మ మా అమ్మతో ఎన్నో మార్లు అన్నారట. మళ్లీ ఆయన్ను తరచూ చూడటం కుటుంబ సమేతంగా వారు మద్రాసుకి తరలివచ్చిన తరువాతనే! ఆయనతో సాన్నిహిత్యం, భార్య అన్నపూర్ణమ్మ గారితో, పిల్లలతో పరిచయం. క్రమేణా బాలమురళీగారితో చనువు ఏర్ప డింది. ‘ఇది మీరు సరిగా పాడలేదు. ఆ పాటకు వరస బాగా కట్టలేదు’ అనే వాడిని. నా సంగీత పరిజ్ఞానమెంతటిదో ఆయనకు బాగా తెలుసును గనుక చిరునవ్వేసేవారు. 1970 ప్రాంతంలో ఆయన గ్రామఫోను కంపెనీకి అన్నమా చార్యుల సంకీర్తనలొక ఎల్.పి ఇచ్చారు. అన్నమయ్య పాటల తొలి ఎల్.పి యిదే. ఆ తరువాతనే శ్రీరంగం గోపాలరత్నం, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి తది తరులు. ఆ ఎల్.పికి ‘స్లీవ్ నోట్స్’ (కవరు మీది వివరణ) వ్రాయమని నన్ను హెచ్.ఎమ్.వి రికార్డింగ్ ఆఫీసరైన పి. మంగపతి అడిగారు, బహుశా బాలమురళి అనుమతితోనే. వ్రాశాను. బాగా వచ్చింది. రాకేం? సంగీతమంటే ఆసక్తి, ఆ గాయకుడంటే గౌరవం, శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలల ద్వారా అన్నమ య్యంటే భక్తి ఉండగా! ఈ పాటల్లో రెండిటికి వరసలు అన్నమయ్య అంతరంగంలోంచి దొంగి లించి చేసినవి (రాగి రేకులపైనున్న రాగాలలో కాదు). ‘ఇందరికి నభయంబు లిచ్చు చేయి’ - అన్న దశావతార సంకీర్తనొకటైతే, ‘కొమ్మ తన ముత్యాల కొంగు జారగ’ - రెండవది. ఇందులో అమ్మవారు నిదురించే తీరులో మదాలస భంగి మలు చెలికత్తెలచే పారిజాత పూరేకులంత లలితంగా వర్ణితం. ఈ రెండింటినీ వారి అనుమతితో నేనెన్నోమార్లు శ్రీనివాస మంగాపుర కల్యాణ వేంకటేశ్వరుని సాక్షాత్కార వైభవ సమయంలోనూ (ఆషాఢ శుద్ధ సప్తమి), కార్వేటినగర వేణుగోపాలుని పుట్టిన రోజునా (గోకులాష్టమి) ఒక యాభై సంవత్సరాలు ఆ ట్రాక్స్ ఉపయోగించి నృత్యనివేదనగా చేశాను. ఏం చెయ్యకూడదా! అన్నమయ్య అనలేదూ... ఏనుగుపైనా, కుక్కపైనా ప్రసరించే ఎండ ఒక్కటేనని? ఆ ఎల్.పి.కి ముఖపత్రం బాపు చేత వేయించమని ఆ కుంఫిణీ వారిని వేధించాను. అన్నమయ్య-మురళీ పాటలకు తగిన ట్లు నా విన్నపం విని, బాపు బంగారు వాకిలిలోన ఆ కలియుగ కృష్ణుడు కనబడేటట్లు వేశారు. ఇవన్నీ బాలమురళికి నచ్చాయి కాబోలు... తదుపరి భద్రాచల రామదాసు కీర్తనల ఎల్.పి.కి, తనే పాడి, వాయులీనం, మృదంగం వాయించిన ఒక ఈ.పి.కి అలాగే వ్రాయించుకున్నారు. ఇందులో వినిపించే బాలమురళి విద్వత్తు ఎంత టిదో, హెచ్.ఎమ్.వి రికార్డింగు ఇంజినీరు రఘునాథన్ శబ్దగ్రాహక నైపుణ్యం అంతటిది. మొదట పాట, జాగాలతో రికార్డు చేసి, ఆ తరువాత మృదంగం, చివర వాయులీనం జాగ్రత్తగా ఆ జాగాలలో బిగించడం అప్పటి పరికరాలతో, యింద్రజాలమే. ఆ తరువాత హెచ్.ఎమ్. మేహ శ్ అన్నతను ‘సంగీతా’ కంపెనీ స్థాపించి, తక్కిన కంపెనీలన్నీ పాతికేళ్లలో చేసింది ఒక ఐదేళ్లలో సాధించాడు. ఈ మాస్టర్ రికార్డింగు కంపెనీకి బాలమురళీ... పదీ యిరవై కాదు వందకు పైగా పలు భాషల్లో కేసెట్లు రికార్డు చేశారు. అప్పుడొక తమాషా జరిగింది. ఈ మహేశ్ సరస్వతీ స్టోర్స్‌కి (కొలంబియా) కన్నడ విభాగంలో పనిచేసినప్పటి నుంచి నా హితుడు. ఒక ఎల్.పి.కి నాతో మొదటిమారుగా స్లీవ్నోట్స్ వ్రాయించిందితనే. వీరికి బాలమురళీ త్యాగయ్య ‘నౌకా చరిత్రం’ లోని కొన్ని పాటలొక కేసెట్టు చేయగా ఇన్లే కార్డు మీద రెండు వాక్యాలు వ్రాయమని అడిగితే వ్రాశాను. ఎప్పటి లాగా నేను వ్రాసింది ప్రూఫ్ చూపేటప్పుడు దానిపై ‘సంగీతం అభయాంబిక’ అని ఉంటే అలా వేయకూడ దన్నాను. ‘ఆమె రికార్డింగుకి ఎంతో తోడ్పడ్డారు. అలా వేసి తీరాలి’ అన్నారు. ‘అయితే నేను వ్రాయను’ అని తుమి తేల్చేశాను. ఆ ఇన్లే కార్డు చూసి ‘రంగా రావు పరిచయ వాక్యాలు లేవేం?’ అని బాలమురళి అడిగితే, నసుగుతూ, నాన్చుతూ చెప్పేరట - ‘సంగీతం ఫలానా’ అని వేస్తే వ్రాయనన్నాడని! వాళ్లనే గసిరి ‘త్యాగరాజు కీర్తనలకు సంగీతం మరొకరా? కావలిస్తే ఆర్కెస్ట్రేషన్’ అని వేయండన్నారట! అలా నా పక్షం వహించారు బాలమురళి. ఇంతకూ అభ యాంబిక ఎవరు? ఆనాడు బాలమురళి నియామకాలు చూసే ఆంతరంగిక కార్యదర్శి. ఆమెతో నాకు సఖ్యమే. చిన్నతనంలో తన యిద్దరు సోదరీమణులతో నాట్య ప్రదర్శనలివ్వడమే గాక, రంగవల్లుల ఎగ్జిబిషన్‌ను చేసేవారు. ఒకమారు ఆమె, బాలమురళి ప్రోత్సాహంతో బెంగుళూరు నాగరత్నమ్మ పాత పాటలు కేసెట్టుపై విడుదల చేద్దామని నా రికార్డులడిగితే వాటినామెకు ఇచ్చాను. పని జరిగిన తరువాత నా ప్రాణాలను భద్రంగా నాకు తిరిగి యిచ్చారు. ‘సంగీతా’ వారికి బాలమురళి పాడిన కేసెట్లలో నాకు బాగా నచ్చినవి అష్టపదులు, తరంగాలు, క్షేత్రయ్య పదాలు, భరత నాట్యాంశాలు కలిగిన ఒక కార్యక్రమం, తిల్లానాలు. ఆ తిల్లానాలన్నీ వీనుల విందు చేసేవే. కానీ వాటిలో కుంతల వరాళి తిల్లానా అంటే పిచ్చి యిష్టం. నేనెరిగిన నిష్ణాతులైన స్త్రీపురుష నాట్యకళాకారులెందరికో వీటి గురించి చెప్పాను, అడిగాను, ప్రాథేయపడ్డాను... ‘దీనిని రంగమెక్కించండీ’ అని! ‘అబ్బా, చాలా కష్టమైనదండీ!’ అని తప్పించు కున్నారు. చివరికి శాంత - ధనుంజయన్లు (నేనప్పుడు వారి వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నాను) దానికి రంగస్థలంపై ఒక అపూర్వమైన రూపం కల్పించారు, దాదాపు 45 సంవత్సరాల క్రిందట. బాలమురళి కృతిని భరత నాట్యానికి - బంగారుకి పరిమళం- జోడించటానికి వారు ఆడిందే నాంది! ఒకప్పుడు, 1965 ప్రాంతంలో నేను మద్రాసు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కి సంగీత కచ్చేరీల గురించి వ్రాస్తుండేవాడిని. ఒక కచ్చేరీలో బాలమురళి పాడిన తీరుని విమర్శించాను ‘మధ్య మధ్య వెనుక తంబూరా వేస్తున్న వ్యక్తిని (ఎవరో కాదు, తన కుమార్తె) తిరిగి చూడటమేమిటి! మైక్‌కి దూరమై పాట వినపడటం తగ్గిపోదా! రేడియోలో అంతకాలం పనిచేసిన వారికి మైక్ ప్రాముఖ్యం తెలి యదా!’ అంటూ. ఆయన్ని ‘కొడు’కంటూ ముద్దుచేసే నా అక్క ఇందిరాదేవితో (బొబ్బిలి రాకుమారి, ఆకాశవాణి వీణా విదుషి, బహుమతులు పొందిన చిత్ర కారిణి) సగం నవ్వుతూ అన్నారట - ‘అమ్మా! మీ తమ్ముడికి నా పాట నచ్చలే’ దని! అక్క నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా అయిదు నిమిషాలు ఝాడించింది. ‘బాలమురళి పాటను విమర్శించేటంతటి వాడివా నీవు?’ అంటూ. తిల్లానాలు యిటీవలి విద్వాంసులెందరో చేశారు. అవి వారి వారి కంఠాల, వాద్యాల సొగసును యినుమడింప జేయడానికే రూపొందించబడ్డాయి. నాట్యా నికన్నీ అంతగా నప్పవు. బాలమురళీ తిల్లానాలు (ద్విజావంతి, బృందావన సారంగ, కదన కుతూహలం యిత్యాది) అలా కాదు. నాట్యం కోసమే తీర్చిన ట్లుంటాయి. ఇప్పుడాయన తిల్లానాలతో ఎందరో అందలమెక్కి ఊరేగుతు న్నారు, నాతో ఆనాడు ‘అబ్బా కష్ట’మన్నవారు కూడా! బాలమురళి దాదాపు ఏది పాడినా ‘దీనికి నాట్యం చెయ్యరూ?’ అని గోముగా అడిగినట్లుంటుంది. నూరేళ్లుగా దక్షిణ దేశంలో ‘కృష్ణం కలయసఖి సుందర’ మన్న తరంగాన్ని ముఖారి రాగంలో పాడుతున్నారు. 75 సంవత్సరాల కిందట త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి రికార్డు విన్నా, బాలమురళిది విన్నా మనసు గంతులు వేస్తుంది. కాళిందీతట తరికిటతోమ్లను కంటికి కట్టిస్తుంది. పదమైనా అంతే. ‘అలిగితే భాగ్యమాయే’ (క్షేత్రయ్య, హుసేని) ఆయన పాడగా వింటే అరసొంపు మాటలాడే ఆ ధూర్తుని దుండగీడుతనాన్నెలా ఆ ముగ్ధ ఓర్చుకుంటున్నదో అనీ, అయ్యో పాపం ఆ అబలాయ కబళాయ వాడి పాల బడిందా అనీ కంటనీరు పెట్టిస్తుంది. తన సంగీతానికెన్నో అన్నమయ్య సంకీర్తనలు పాడిన బాలమురళి మూడో నాలుగో వక్కలంక సరళారావు (ఆనాడు ‘కీలుగుర్రం’లో ఘంటసాలతో కలిసి ‘కాదు సుమా కల కాదు సుమా’ పాడిన గాయకి) వరసలకు ఒక కేసెట్లో పాడారు. ఆ చూడామణిలో కోహినూర్లు ‘చలిగాలి వెడ యేల చల్లీని’ (బృందా వని, సరళతో), ‘ఎంత దవ్వైననేమి’ (బాగేశ్రీ, నాట్యకళాకారిణి స్వప్న సుందరితో). రాగంలో సంగతి, అన్నమయ్య సంకీర్తనల స్వరకర్తగా సరళ ఎవ్వ రికీ తీసిపోదు. అందుకనే అడగ్గానే బాలమురళి ఆమెకు పాడటం. అష్టపదులలో చివరిది ‘నిజగాదస యదునందనే’ ఒక రాజహంస. సరసాలంతా జరిగిన తరువాత రాధ కృష్ణునితో సరాగాలు. యిలా ఎన్నో. నాట్య కళాకారులు వీటిని భరతనాట్య, కూచిపూడి, విలాసిని, మోహినీ ఆట్టం, మణిపురి, సత్రియ, కథక్ పద్ధతులలో గజ్జకడితేనా, అద్దిరభన్నా! ఈ క్రింది విషయం నాతో పద్మాసుబ్రహ్మణ్యం (భరతుని నాట్యశాస్త్రం నా తలకెక్కించే ప్రయత్నం చేసిన ధీరవిదుషి) చెప్పారు. ‘‘ఒకమారు బాలమురళి, నేను కచ్చేరీ నిమిత్తం రైల్లో వెళుతున్నాం. ‘ఒక జావళి నీ కోసం చేస్తా’ నంటూ అప్పటికప్పుడు ధారతో ‘మరులు మించెరా’ అన్నది నవరోజులో చేశారు. ఈ విషయం చెప్పి, అక్కడ దానికి నేను అభినయం పడితే, చూసినవారెంత మెచ్చుకున్నారో చెప్పలేను!’’. మెచ్చుకోక ఏం చేస్తారు? ఆ పాటలో మాటలు - ఒక ప్రౌఢ మరులు మించెరా అని వగలు పోతుంటే వినడం - మాంఛి ఎండాకాలంలో గాలి ఆడక బిగపట్టిన వేళ పచ్చకర్పూరం కలిపిన చందనం వీపుకి తమలపాకుతో పూసినట్లూ, గొంతు తడారిపోయినప్పుడు నిమ్మ నీరులో కాస్త తుహినమూ, తేనే కలిపి త్రాగించినట్లూ ఉంటుంది. నిజం. ఆయనకు సంగీతం తెలియదు. సంగీతానికి ఆయన తెలుసు. కాబట్టే ఆయన తనువిప్పుడు మనలో లేకపోయినా తను విడిచి వెళ్లిన విమల గాంధర్వం మనిషి ఉన్నంతవరకు మనసుకి ఆహ్లాదం కలిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడాయన ఉనికి గోలోకంలో (కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీ వాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి! వి.ఎ.కె. రంగారావు వ్యాసకర్త ప్రముఖ కళా, సంగీత విమర్శకులు, చెన్నై మొబైల్: 094447 34024 -
సంగీత సుధార్ణవం
అక్షర తూణీరం గమకాలు గుండెలవిసేలా లోతుగా.. ఉండాలన్న అతి పాత ధర్మాన్ని సంస్కరించారు. గమకాలు కలువ రేకులు కదిలి నంతసున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. ఒక సుమధుర సంగీత ఝరి ఆగిపోయింది. ఆయన గళంలో ఒక ఠీవి ఉంది. శ్రుతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగ తులు, గమకాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయన్న ధైర్యం ఆయనకుండేది. ‘బాలమురళి’ అంటే నవ శాస్త్రీయ చరిత్ర. ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం. త్యాగరాజ స్వామి గురు పరంపరలో అయిదో తరం వారసుడు. సంగీత సార్వ భౌమ పారుపల్లి రామకృష్ణయ్య శుశ్రూషలో సంగీత పాఠాలు నేర్చిన విద్యార్థి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అరవై ఏళ్ల క్రితం బాలమురళి వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించాడు. సంప్రదాయమంటే - ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడకట్టి తర్వాతి తరా నికి అందించడమేకానీ, తుచలు పోకుండా అందివ్వడం కాదని ఈ ‘ఛైల్డ్ ప్రాడిజీ’ నమ్మారు. అదే ఆచరించి చూపారు. అందుకే ఆయన వెయ్యిమందిలో ఒక్క రుగా కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపం చాన్నేలారు. సామాన్య జనులందరినీ సంగీతమాస్వాదించి ఆనందించగల రసి కులుగా ‘కన్వర్ట్’ చేసేస్తున్నాడని బాలముర ళిపై ఆనాటి ఛాందసులు అభియోగం మోపారు. దాన్నొక గొప్ప అభినందనగా, ఆశీర్వాదంగా బాలమురళి స్వీకరించారు. వస్తూనే ‘స్వరార్ణవం’ చంకనపెట్టుకు తెచ్చుకున్నాడని ప్రతీతి. ‘‘నేను వానికి నేర్పిందేమీ లేదు. వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు’’ అంటూ గురువు పారుపల్లి రామకృష్ణయ్య తరచూ చెబుతుండేవారట. ఆరవ ఏట పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన అసాధారణ ప్రతిభామూర్తి బాలమురళి. సంగీత లోకంలో ఆయనొక సాహసి. విద్యుత్తుతోబాటు తగుమాత్రం ధిషణాహం కారం కూడా బాలమురళి వినూత్న శైలిని తీర్చిదిద్దింది. గమకాలు గుండెలవిసేలా లోతుగా, గొడ్డలి గంట్లులా ఉండాలన్న అతిపాత ధర్మాన్ని సంస్కరించుకుని ఆపాత మధురంగా మలచుకున్నారు. గమకాలు కలువరేకులు కదిలినంత సున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. మెప్పించి, ఔననిపించారు. వయోలాని గిటార్‌లా, వయొలిన్‌ని ఏక్తారలా, వీణని వయొలిన్‌లా పలికించగల చతుర్థ సమర్థుడు. అనేక వాద్యాల మీద అధికారం సంపాయించారు. బాలమురళీ ‘పుట్టు విద్వాంసుడు’ అవడం వల్ల, సంగీత జ్ఞానిగా సాహిత్యకారునిగా సాధించాల్సినదంతా పాతికేళ్లకే పూర్తి చేసు కున్నారు. ఇక మిగిలిన తీరికలో కావల్సినన్ని సాము గరిడీలు చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధించారు. బాలమురళి కారణ జన్ముడు. స్కూలు చదువులెరుగని బాలమురళి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం గడిం చారు. కొత్త రాగాలను నిర్మించారు. అనేక కృతులు రచించారు. ఆయన తిల్లానాలను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాలకు పాటలు పాడినా బాలమురళి ముద్ర ఉంటుంది. గొప్ప చమత్కారి. ‘నేను కచ్చేరీల్లోనే సాధన కూడా చేస్తాను. ముఖ్యంగా పెళ్లిళ్లలో నా గోష్ఠి ఏర్పాటు చేసినపుడు. ఎందుకంటే అక్కడ నన్నెవరూ వినరు. అందు కని నా ప్రయోగాలు నేను చేసుకుంటాను’ అని చెప్పేవారు. సంగీతానికి బాల మురళి చేసిన గొప్ప సేవ ఆయన రికార్డింగ్స్. కొన్ని వందల గంటలు రికార్డ్స్‌లో, టేపుల్లో, సీడీల్లో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. త్యాగరాజ కృతుల్లోని సాహిత్యాన్ని సుమధుర గాత్రంతో విశదపరిచారు. శాస్త్రీయ సంగీతానికి, ఆ విద్వాంసులకు బాలమురళి గ్లామర్ తెచ్చి పెట్టారు. ఆయన ‘షోకిలా’గా జీవించారు. ఆయన అందుకోని బిరుదులు, గౌర వాలు ఏవీ లేవు. అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామదాసు కీర్తనలు ఆయన నోట అమృతధారలైనాయి. బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్ర్క మణతో సరిగమల బృందావనం సద్దుమణిగింది. వారికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సంగీతమా ఇక సెలవు
► బాలమురళీ కృష్ణ అంతిమయాత్ర ► అభిమానుల కన్నీటి వీడ్కోలు తమిళసినిమా: సంగీత గాన గంధర్వుడు బాల మురళీకృష్ణ శాశ్వత సెలవుకు సంగీత లోకం మూగపోరుుంది. అభిమానగణం తల్లడిల్లిపోరుుంది. గుండెలు పగిలేలా మౌనంగా ఏడ్చేసింది. ఇదంతా నాకేమిటని భావించిన సంగీత సరస్వతి అవిశ్రాంతంగా తనకు సేవలందిం చి, జీవితాన్నే అంకితం చేసిన సంగీ త సామ్రాట్ బాలమురళీకృష్ణను తనలో లీనం చేసుకుంది. ఆయన భౌతిక కాయానికి మాత్రమే బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు. బాలమురళీకృష్ణ తుదిశ్వాస విడిచిన క్షణం నుంచి బుధవారం అంత్యక్రియల వరకూ ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నివాళులర్పిస్తూనే ఉన్నారు. ఆయన కీర్తి ప్రతిష్టలను, విజయాలను, తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అరుునా సంగీత సముద్రం లాంటి బాలమురళీకృష్ణ ప్రతిభ ఇంతని చెప్పడం ఎవరికి మాత్రం సాధ్యం? ఆయన సంగీత, గాన, కీర్తనలకు కొలమానం అసాధ్యం. అందుకే సంగీతం, ముఖ్యంగా కర్ణాటక సంగీతం కంటతడి పెట్టింది. సంగీతాభిమానుల తల్లడిల్లిపోయారు. పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించా రు. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, తమిళరాష్ట్రం తరఫున విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, అటవీశాఖ మంత్రి దిండుగల్ సి.శ్రీనివాసన్ మం గళవారం రాత్రి బాలమురళీకృష్ణ భౌ తికకాయానికి నివాళులర్పించారు. అ దే విధంగా బుధవారం ఉదయం నుం చే ప్రముఖులు అంజలి ఘటించడానికి తరలివచ్చారు. వారంతా సంగీత వి ద్వాంసుడు బాలమురళీకృష్ణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భారతరత్న అవార్డుకు ఆయనే అలంకారం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప సంగీత విద్వాం సుడు, భారతదేశానికి ఖ్యాతిని ఆర్జించిపెట్టిన గాన గంధర్వుడు బాలమురళీకృష్ట భౌతిక కాయానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంత్యక్రియల లాంఛనాలను నిర్వహించాలని మ్యూజిక్ అకాడమీ ప్రతినిధి పప్పు వేణగోపాల్రావు, ఈలపాట శివప్రసాద్ డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన ఏంతో సంగీత సేవ చేసిన తమిళ రాష్ణ్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. ఇక సంగీతాన్ని భ్రస్టు పట్టిస్తున్న వారికి పద్మ అవార్డులు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం బాల మురళీకృష్ణ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడికి భారతరత్న అవార్డు పురస్కారాన్ని అందించకపోవడం బాధాకరం అన్నారు. నిజానికి భారతరత్న అవార్డును బాలమురళీ కృష్ణ ఎప్పుడో అధిగమించారని, ఆ యనకు ఆ బిరుదు అవసరం లేదని అన్నారు. అరుుతే భారతరత్న బిరుదు ను అందిస్తే ఆయన అభిమానులుగా తాము ఆనందిస్తామని పేర్కొన్నారు. 60 ఏళ్ల అనుబంధం: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పీఎస్.నారాయణన్ నివాళులర్పిస్తూ బాలమురళీకృష్ణతో తన అనుబంధా న్ని గుర్తు చేసుకున్నారు.బాలమురళీ కృష్ణ ఎనిమిదేళ్ల వయసులో ఎలాంటి ప్రతిభను చాటుకున్నారో, 86 ఏళ్ల వ యసులోనూ అంతే ప్రతిభను కలిగి ఉన్నారన్నారు. అరుునా కొంచెం కూ డా గర్వం ప్రదర్శించని అత్యంత నిరాడంబురుడని కీర్తించారు. చివరి దశ లో ప్రశాంతంగా గడిపారు. అలాంటి బాలమురళీకృష్ణ మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేశారు : సంగీతానికి అంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా కర్ణాటక సంగీతాన్ని పూర్తిగా మార్చేసిన మహానుభావుడు బాలమురళీకృష్ణ అని కర్ణాటక సంగీత గాయని అరుణా సారుురామ్ వ్యాఖ్యానించారు. మూడు విధాలుగా పాడగల ప్రతిభావంతుడనీ, సంగీతం గ్లామర్‌ను చదివిన బాల మురళీ కృష్ణ లాంటి గొప్ప సంగీత విధ్వాంసుడిని ఈ లోకంలో మరొకరిని చూడలేమని అన్నారు. ఆయన్ని కలిసిన ప్రతి సారి సంగీతం గురించి కొత్త కొత్త విషయాలు చెప్పే వారని అరుణా సారుురామ్ అన్నారు. మనం చూసిన వాగ్గేయకారుడు: ఈ తరంలో మనం అందరం చూసిన వాగ్గేయకారుడు బాలమురళీ కృష్ణ అని ప్రముఖ సంగీత కళాకారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అన్నారు. ఈ గాన గంధర్వుడితో తనది 36 ఏళ్ల అనుబంధం అని తెలిపారు. 1980లో బాల మురళీ కృష్ణ వద్ద శిష్యుడిగా చేరానని తెలిపారు. ఆయన వద్ద ఏడేళ్లు గురుకుల విద్యను అభ్యసించానన్నారు. శిష్యుడుగా కాకుండా కన్న కొడుకులా చూసుకున్నారు. తానిప్పుడీ స్థారుులో ఉన్నానంటే అందుకు కారణం తన గురువు బాల మురళీ కృష్ణే. ఆయనతో కలిసి పలు సంగీత కచ్చేరీలు చేశాను. నేను జీవించి ఉండగానే నా సంగీతాన్ని, పాటల్ని ప్రజలు వింటున్నారు. అలా నేను చాలా అదృష్టవంతుడ్ని అని బాలమురళీకృష్ణ అం టుండేవారని తెలిపారు. అలాంటి సం గీత సరస్వతీ పుత్రుడు ఈ లోకానికి మరొకరు రారని వ్యాఖ్యానించారు. కర్ణాక సంగీత సామ్రాట్: బాల మురళీ కృష్ణ కర్ణాటక సంగీత సామ్రాట్ అని కీర్తించారు ప్రముఖ సంగీత కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు. ఏడవ ఏట నుంచే తాను గురు సమానులు బాల మురళీ కృష్నకు సహకారిగా ఉంటున్నానని తెలిపారు.అలాంటి గొప్ప సం గీత విద్వాంసుడి మరణంతో సంగీత లోకం దుఖఃసాగరంలో మునిగి పోరుుందన్నారు. బాల మురళీ కృష్ణ సంగీత సేవకే పుట్టారన్నారు. అద్భుత ప్రతిభాశాలి. ఆయన తెలుగు వాడిగా పుట్టడమే మన అదృష్టం అన్నారు. సంగీతకళామూర్తి: బాలమురళీ కృష్ణ సంగీత కళామూర్తి అని సీనియర్ సంగీతదర్శకుడు ఎస్ఏ.రాజ్‌కుమార్ పేర్కొన్నారు. అట్లాంటి ఆయన భౌతి కంగా మన ముందు లేకపోరుునా ఆయన సంగీతం కలకాలం సజీవంగా ఉంటుందన్నారు. తమ మ్యూజిక్ సంఘానికి మూలస్తంభం లాంటి వారన్నారు. సంఘానికి ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ఏమయ్యా నాతో పాడించవా అన్నారు: బాల మురళీ కృష్ణతో తనకు పెద్దగా పరిచయం లేదు గానీ, ఒక సారి మద్రాసు యూనివర్సిటీలో గాయకుడు ఎస్సీ.బాల సుబ్రహ్మణ్యం ఆయనికి పరిచయం చేశారని, అప్పుడు ఏమయ్యా వీళ్లందరితో పాడిస్తున్నావు నాతో పాడించవా? అని అడిగారని సీనియర్ నిర్మాత కె.మురారి అన్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి : ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు బాలమురళీకృష్ణ మృతి వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఒక ప్రకటనలో సంతాపం వెలిబుచ్చారు. బాలమురళీకృష్ణ చిన్నతనంలోనే అద్భుతమైన గానం చేసేవారని, దేశ విదేశాలలో వేలాది కచేరీలు నిర్వహిం చి ఖ్యాతిని గడించారన్నారు. సినీ పరి శ్రమలో కూడా విజయకేతనం ఎగురవేశారని గుర్తు చేశారు. తమిళ మహా నాడు సెమ్మొళి కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌కు ఆయన తొలి బాణిని కట్టిన మేధావి అని పేర్కొన్నారు. 72 మేళ కర్త రాగాలను ఆలపించారు: తాను రచన చేసి బాణీలు సమకూర్చి న 72 మేళ కర్తరాగాలను బాలమురళీ కృష్ణ ఆలపించారని యువ సంగీత, గీత రచరుుత స్వర వీణాపాణి ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా నటుడు మనో, గాయనీ వాణి జయరామ్, సంగీతదర్శకుడు, గాయకుడు జి.ఆనంద్, రాము, గజల్స్ శ్రీనివాస్, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, ద్రవిడదేశం పార్టీ అధ్యక్షుడు వీ.కృష్ణారావు, ఆమ్ ఆద్మీ రాష్ట్ర కార్యదర్వి డీ.సురేశ్, సుధ, లలిత కళా వేదిక కార్యదర్శి మాధవి, ఉపాధ్యక్షుడు రామ్, మైలాపూర్ శాసన సభ్యుడు నటరాజ్, సీపీఐ నేత నల్లకన్ను, వైఎస్ ఆర్సీపీ సేవాదళ్ తమిళనాడు విభాగం ప్రధాన కార్యదర్శి కమలాపురం లక్ష్మి శ్రీదేవిరెడ్డి బాలమురళీ కృష్ణకు నివాళులందించారు. బుధవారం సాయంత్రం బాలమురళీ కృష్ణ భౌతిక కాయానికి స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగారుు. భారీ ఊరేగింపుగా సాగిన ఈ అంత్యక్రియలకు బంధువులు, సన్నిహితులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అశృనయనాలతో వీడ్కోలు పలికారు. కారణజన్ముడు బాలమురళీకృష్ణ : బాలమురళీకృష్ణ కారణ జన్ముడని సంగీత కళాకారుల ద్వయం ప్రియాసిస్టర్స్ పేర్కొన్నారు. ఆయన సంగీతం గురించి మాట్లాడే అర్హత తమకు లేదని, అరుుతే ఆయన స్ఫూర్తి మాత్రం తమపై ఉందని అన్నారు. బాలమురళీకృష్ణ వల్ల ప్రభావితం కాని సంగీత కళాకారులు లేరు అనడం అతిశయోక్తి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ చేతుల మీదుగా సత్కారం అందుకునే అదృష్టం తమకు లభిం చిందని అన్నారు. సంగీత సరస్వతి పంపిన వ్యక్తి బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడి కాలంలో తామూ ఉన్నందుకు ఆనందంగా ఉందని ప్రియాసిస్టర్స్ అన్నారు -ప్రియాసిస్టర్స్ -
గాన గంధర్వుడు
జీవన కాలమ్ ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవలక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టుంటుంది. త్యాగరాజస్వామి ఐదో తరం గురు సంపద నాకు దక్కిన అదృష్టం- అని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గర్వపడ్డారు... గతంలో నేను సంపాద కత్వం వహించిన ‘సురభి’ పత్రికకి ఇంట ర్వ్యూలో. బాలమురళి గురువులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకి మానాంబుచావిడి (ఆకుమళ్ల) వెంకట సుబ్బయ్య సంగీత భిక్ష పెట్టారు. అంతకుముందు మరీ చిన్న తనంలో తండ్రి పట్టాభిరామయ్య ఏకైక సంతా నంగా ప్రతీరాత్రీ పక్కనే పడుకుని ఆయన చెప్పే సరళీస్వరాలు, జంట స్వరాలూ, వర్ణాలూ - అన్నీ ‘జ్ఞాపకం’ చేసుకున్నారు. ఏడో యేట గురువు ఉంటే మంచిదని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకు తీసుకెళ్లారు. ‘ఏదీ, నీకొచ్చిన పాట ఒకటి పాడు’ అన్నారాయన. పాడారు. వీడిని ఇంట్లో దింపి మధ్యాహ్నం రమ్మన్నారాయన. వస్తే ‘వీడికి చెప్పవలసిందేం లేదు. వచ్చినవి మననం చేసుకోవడమే’ అన్నారట. 1939 జూలై 6న మొదటి కచ్చేరీ. సభలో నాన్న, గురువు ఉన్నారు. 9 నుంచి ఒక గంట సాగాలి. పదిన్నరయినా సాగుతోంది. గురువు వేదిక మీదికి వచ్చి కుర్రాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి దిష్టితీయమన్నారు. తర్వాత ముసునూరి సత్యనారాయణ భాగవతార్ హరికథ చెప్పాలి. చెప్పలేనని ఆయన వేదిక దిగిపోయారు. పట్టాభి రామయ్య మురళి వాయించేవారు. కొడుక్కి ‘ముర ళీకృష్ణ’ అని పేరు పెట్టుకున్నారు. ముసునూరి సూర్యనారాయణ పేరులో ‘బాల’ కలిపారు ఆ రోజు. ఆ విధంగా బాలమురళీకృష్ణ అయ్యారు. తర్వాత తిరువయ్యూరులో దిగ్దంతుల ముందు అలవోకగా పాడే కుర్రాడిని చూసి అబ్బుర పడి వీణ ధనమ్మ ఎత్తుకుని తనతో తీసుకుపోయి దిష్టి తీసిందంటారు. వారి ఇంటి ఎదుటి సత్రంలో వారి గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వామి విడిది చేశారు. చాతుర్మాస దీక్ష చేస్తు న్నారు. బాలమురళికి కబురు పంపించారు. ‘ఒక్క మాట చెప్తావా? త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేదంటావు?’ అన్నారు. ఒక క్రమబద్ధమైన ధోరణిలో లేదన్నారు. ‘ఆయన ఇదివరకెన్నడూ చేయనిది, చేయలేనిదీ చేశారు. చరిత్రలో మిగి లారు. ఆ పని నువ్వూ చెయ్యి’ అన్నారు. అప్పుడా యనకి 16. మరో రెండేళ్లలో 72 మేళ కర్త రాగాలలో కృతులు చేశారు. అది అప్పటికీ ఇప్పటికీ అపూర్వం. అనితర సాధ్యం. ఆయన జీవితమంతా అనితర సాధ్యమైన సంగీతాన్నే ఆరాధించారు. బహుశా ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవ లక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టు ఉంటుంది. ఆయనలో చిలిపితనం ఉంది, సరదా ఉంది. ప్రతీ క్షణాన్నీ అనుభవించే ‘సరసత’ ఉంది. తాను ఆనం దిస్తూ పాడతారు. ఆ ఆనందాన్ని రసికునికి పంచి ఆ క్షణాన్ని అజరామరం చేస్తారు. దాదాపు 53 ఏళ్ల కిందట - విజయవాడ రేడియో కేంద్రం ‘భక్తిరంజని’ విని రంజించని వారె వరూ లేరు. జాతీయ స్థాయిలో ఆ కార్యక్రమం పరిమళించింది. ఆ గుబాళింపుకి అధ్యక్షుడు బాల మురళి. ఇంకా శ్రీరంగం గోపాలరత్నం, వింజ మూరి లక్ష్మి, వీబీ కనకదుర్గ, ఎమ్వీ రమణమూర్తి, సూర్యారావు ప్రభృతులు ఉండేవారు. ఉదయమే అహిర్ భైరవిలో ‘పిబరే రామరసం’ అంటే శ్రోతల హృదయాల్లో రామరసం చిప్పిల్లేది. ఈ విందుకి కారకులు - మరొక మహానుభావుడు - ఇంకా విజ యవాడలో ఉన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావుగారు. ఆయనకిప్పుడు నూరేళ్లు. ఆయన సంగీత ప్రపంచంలో ఏమి చేశా రనికాదు. ఏమి చెయ్యలేదని ప్రశ్నించుకోవాలి. భీంసేన్ జోషీ, అజయ్ చక్రవర్తి వంటి వారితో ‘జుగల్బందీ’కి శ్రీకారం చుట్టారు. అవి అపూర్వ మైన కచ్చేరీలు. స్వరశ్రీ, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించారు. ఇక - సంగీత రచనలో ఆయనకి ఆయనే సాటి. నాటలో ‘అమ్మ’ వర్ణం వింటే పులకించిపోతాను. రామప్రియ మరొక కళా ఖండం. కదన కుతూహలం తిల్లాన - ఇలా ఏరడం వారి దిషణకి అన్యాయం చేసినట్టు. మా ఇంట్లో దసరా నవరాత్రులకు బొమ్మల కొలువు ప్రత్యేకత. 2008 ఆగస్టు 10న సతీ సమే తంగా వచ్చారు. వారికి పాదాభివందనం చేసి శాలువా కప్పాను. నాకు చాలా ఇష్టమైన ఆయన రచనని పాడమన్నాను. కానడలో ‘బృహదీశ్వర మహాదేవ!’ నా చేతిని ఆప్యాయంగా పుచ్చుకుని పాడారు. ఆయన పాటలో, రచనలో ఈ జన్మకే పరి మితం కాని ఉపాసనా బలమేదో కనిపిస్తుంది. ఆఖరుసారి విశాఖపట్నం బీచిలో విశ్వప్రియ హాలులో ఇస్కాన్ ఉత్సవాలలో పాడారు. పాట సాహిత్యం మరిచిపోతున్నారు. వృద్ధాప్యం ఓ జీనియస్‌ని ఏమారుస్తోంది. కానీ ఆయన లొంగడం లేదు. సాహిత్యం జ్ఞాపకానిది. ఉద్దతి జీన్స్ది. కాస్సే పయాక సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసు దేవాచార్ ‘దేవాదిదేవ’ ఎత్తుకున్నారు. అంతే. నభూతో నభవిష్యతి. అది ఒక మహాగాయకుడి విజృంభణ. బాలమురళీకృష్ణ ఈ తరం సంగీతానికి అధ్య క్షుడు. ఏతరంలోనయినా కనిపించని అరుదైన గంధర్వుడు. A complete musical genius. గొల్లపూడి మారుతీరావు -
స్తబ్దతను ఛేదించిన ‘మురళి’
సందర్భం యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధినేత కావడంతో అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్నాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! సంప్రదాయంపై అధికారమున్నవాడికే సంస్కరించే హక్కు ఉంటుంది. సంప్రదాయం మీద దండోరా వేయడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో అధికారం, ప్రభుత్వ విమర్శకులకు ఉంటేనే అది సాధ్యం. అంతా ‘సంకరం’ అయిపోతుందనుకునేవాళ్లు ఆధు నిక జీవన పద్ధతులకు దూరంగా అరణ్యాలలో, ఆశ్రమాలలో కంద మూలాలు తిని బతకవచ్చు. కాని అలా బతకడానికి ఇష్టపడటం లేదు. సంప్రదాయం చేత ఆధునికం చాకిరీ చేయించుకొనక తప్పదు. అందుకే కొత్త పాతల మేలు కలయిక అన్నారు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కర్నాటక సంగీతాన్ని ఆధునికులకు మరింత కర్ణ పేయంగా మలచి, వందల సంఖ్యలో మాత్రమే ఆక ర్షితులవుతున్న శ్రోతలనూ, ప్రేక్షకులనూ వేల సంఖ్యలో పెంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దాక్షిణాత్య ఛాంద సులు కొందరు పదే పదే విమర్శలు చేసి కర్ణాటక సంగీత విరోధిగా లోకానికి చిత్రించాలని చూస్తున్నందుననే బాల మురళి ఇటీవల తిరగబడవలసి వచ్చింది. నిజానికి ఆయన తన ముందుతరం పెట్టిపోయిన సంగీత సంప్రదాయాల పరిధిలోనే మార్పు చేశాడు. లలిత సంగీత బాణీలకు ఆక ర్షితులవుతున్న జనాన్ని కూడా తన వైపునకు ఆకట్టుకోవ డానికి వాణినీ, బాణినీ సంస్కరించుకున్నాడు. అదే విప్లవ మైతే, పాశ్చాత్య దేశాల్లోనూ, చివరికి కమ్యూనిస్టు దేశా ల్లోనూ గాత్ర, వాద్య సంగీతంలో వచ్చిన మార్పులను చూసి ఛాందసులు గుండెలు బాదుకోవలసి వస్తుంది. బాలగంధర్వుడిగా తొమ్మిదేళ్లకు తిరువాయూర్ సంగీత సభలలో ఉద్దండులను తమ గానమాధుర్యంతో ఊగించి శాసించిన బాలమురళి గురుపరంపరలో త్యాగ రాజుకు శిష్యుడుగా నిలవగలిగాడు. కర్ణాటక సంగీతాన్ని జనాకర్షకం చేయడానికి ఆయన సంగీత సరిహద్దులనే కాక దక్షిణాదిని దాటి యావద్భారతంలోనూ ఖ్యాతికెక్కాడు. వాక్కునూ, గేయాన్నీ సొంతం చేసుకున్న బాలమురళి, ‘బయకారుడై’ వాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందాడు. 430 బాణీలతో, 72 మేళకర్త రాగాలకు ఒక్కొక్క కృతి చొప్పున సమకూర్చుతూ ‘జనకరాగ మంజరి’ని రచించిన బాల మురళికి సంప్రదాయంపై అధికారం ఉండితీరాలి. అది ఉన్నవాడికే సంస్కరించే హక్కు కూడా ఉంటుంది. కనుకనే అతనికి చెప్పదగిన తొలికచేరి తిరువాయార్ సభ అయితే, తుది కచేరి తిరువనంతపురం కావలిసి వచ్చింది. కనుకనే బాలమురళి ‘సంప్రదాయాన్ని కొంత వదులుకోవాలి. లేకుంటే కర్ణాటక సంగీతం మెల్లమెల్లగా చచ్చిపోతుంది’ అని దండోరా వేయవలసి వచ్చింది. త్యాగరాజు సంప్ర దాయంలోనే ఇతను కూడా వ్యాపార ప్రపంచం సరిహ ద్దులు దాటి నిధి కంటే దైవసన్నిధి సుఖం అని ఆలోచించ సాగాడు. ఇది ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం అర్రులు చాచే శ్రోతలకు శుభసూచకం. సంప్రదాయ ఉల్లంఘన ఈనాటిది కాదు. వ్యాకరణ దోషాలను కూడా పట్టించుకోకుండా శ్రవణపేయతకు ప్రాధాన్యం కల్పించిన కర్ణాటక మూర్తిత్రయం కీర్తన కృతులు లేవా? ఈ మూర్తిత్రయం సంగీత సాగర మథ నంలో సౌలభ్యం కోసం ఎన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించారో! కొన్నేళ్లక్రితం ‘ప్రజానాట్య మండలి’ ప్రాచీన కళారూపాలన్నింటినీ చేపట్టినప్పుడు వాటిని ప్రజా రంజకం చేసినప్పుడు సంప్రదాయ కళలకు మరింత వన్నె కూర్చిపెట్టిందే గాని, తగ్గించలేదు. బాలమురళికి ముందు నాగయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధునికం చేసినట్టే ‘శ్రీరంగ రంగా కావేటి రంగా’ వంటి కీర్తనలను విప్లవీకరించి తన బాణీలతో వేల సంఖ్యలో జనాల్ని ఆకర్షిస్తున్నవాడు గద్దర్. ఒకప్పుడు యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధి నేత అయినందున అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్ణాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! తప్పులు దొర్లితే దొర్లుగాక. అసలు సొంత అడుగే పడనివ్వకపోతే ఎలా? జాజ్, ఫోక్, రాక్, పాప్, కంట్రీ సింఫోనిక్, లైట్ క్లాసికల్, బ్రాడ్వే, హాలీవుడ్ - ఇంత వైవిధ్యం పాశ్చాత్యులు పెంచుకుంటున్నారు. కొత్త రాగ మాలికల ద్వారా సరికొత్త స్వరకల్పనల ద్వారా ఫ్రాంక్ జప్పా, రోలింగ్ స్టోన్స్, అరీతా ఫ్రాంక్లిన్ ఆధునికులలో సంగీత ఝరికి హద్దులు లేవని నిరూపిస్తున్నారు. మైకేల్ జాక్సన్ ఇందుకొక సరికొత్త మేళవింపు. యూరప్‌లో సెబాస్టియన్ బాక్ చర్చి మ్యూజిక్ సంప్ర దాయాన్ని కాపాడుతూనే హెచ్చుమందిని ఆకర్షించేందుకు వాద్య, గాత్రాలకు మెరుగులు దిద్దుకున్నాడు. కచేరీ మధ్యలో బాలమురళి ‘విరామం’ తీసుకుంటాడని బాధపడే ఛాందసులకు విరామ చిహ్నం వ్యాస రచనకు ఎంత ఆరో గ్యమో, వాగ్గేయకారునికి మధ్యలో సరికొత్త ‘ఎత్తుబడి’కి అంతే అవసరం. ఈ విరామం విషయంలో యూరప్‌లో స్యూయెన్‌బర్గ్-స్ట్రావిన్స్కీ; బ్రామ్స్-వాగ్నెర్ల మధ్య ఎన్ని వాదోపవాదాలు సాగాయో, మన దక్షిణాదిన బాల మురళి-బాలచందర్ మధ్య కూడా అలాగే తలెత్తాయి. అక్కడ ‘ట్వెల్వ్ టోన్ వర్క్స్’ను మ్యూజిక్ ఆప్ ఇంట ర్వల్స్ అన్నారు. కనుకనే స్యూయెన్‌బర్గ్ ‘స్వర కల్పన అంటే నీలోని అంతర్వాణిని ఆదరించుకోడమే’గానీ మూడోవాడి జోక్యాన్ని సహించడం కాదు అన్నాడు. కేవలం జానపద గీతాల ద్వారా ప్రత్యామ్నాయ సంగీత బాణీలను సమకూ ర్చిన మైఖేల్ గ్లింకా.. జారు చక్రవర్తిని కూడా సమ్మోహితం చేసిన దేశభక్తియుత సంగీత నాటకాన్ని రచించాడు. బరోడిన్ రంగం మీదికి వచ్చిన తర్వాతే ‘సంగీతంలో స్తబ్దత’ కాస్తా వదిలిపోయిందన్నాడు జర్మన్ విమర్శకుడు అభీలిజ్. అలాగే మన వర్ణ, స్వర ప్రబంధకర్త బాలమురళి కూడా రామదాసు కీర్తనల నుంచి రాఘవేంద్ర స్వామి స్తుతి వరకూ, త్యాగరాజు సంస్కృత కృతుల నుంచి ఉమా శంకర స్తుతి మాల వరకు సంప్రదాయంలోనే సమ్మతమైన సంస్క రణలు తెస్తే ఎందుకింత సణుగుడు? (కర్ణాటక సంగీతంలో బాలమురళి సంస్కరణలపై 31 ఏళ్ల క్రితం -13.10.85- భావమురళి శీర్షికన ఏబీకే ప్రసాద్ రాసిన వ్యాసం) ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పలుకే బంగారమాయెనా!
జననం : 06 జూలై 1930 మరణం : 22 నవంబర్ 2016 బాలమురళీకృష్ణ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు స రి గ మ ప ద ని... సప్తస్వరాలు. ఆ స్వరాలన్నిటికీ నైవేద్యం పెట్టిన బాలగంధర్వుడు... ఈ స్వరస్వతీపుత్రుడు! పాటతో పులకింపజేసి... సాక్షాత్తూ భగవంతుడినే తిలకింపజేసిన బాలమురళి పలుకే బంగారమాయెనా! ‘‘పునర్జన్మ ఉందో, లేదో నాకు తెలియదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంగీతం పరంపరాగతంగా రావడం లాంటి వాటిని బట్టి, మన శాస్త్రాలను బట్టి చూస్తే పునర్జన్మ ఉందనే అనుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే, ఈసారి ‘పెద్ద’ బాల మురళీకృష్ణ లాగా, ‘కొత్త’ బాల మురళీకృష్ణ లాగా మరింత మెరుగైన పనులు చేస్తా. సంగీతానికి నాకు చేతనైనంత ఇంకా... ఇంకా చేస్తా’’. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఇంటర్వ్యూ చేస్తూ పునర్జన్మలు ఉన్నాయంటారా? మీకు నమ్మకం ఉందా? అని సాక్షి ‘ఫ్యామిలీ’ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది. తన గానాన్ని భువికిచ్చి, బాలమురళి దివికేగిన ఈ సందర్భంలో ఆనాటి ఆయన సంభాషణలోని కొన్ని స్వర గమకాలు మళ్లీ మీ కోసం. అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని మీలా పాడేయడం ప్రయత్నం మీద వస్తాయా? లేదు. ఇవన్నీ ప్రయత్నం చేస్తే వచ్చేవి కావు. సహజంగా అలా జరగాలి. అంతే. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా మాత్రం ఉంటాను. పాట నా నోట పలుకుతుంది. అసలు నా జీవితంలో నేనెప్పుడూ కచ్చేరీలు చేయాలనీ, ఇందులోనే స్థిరపడాలనీ అనుకోలేదు. అలా జరిగింది. ఆ క్రమంలో ‘బాలమురళి బాణీ’ అనేది సృష్టించాను. ఈ సంగీతం, పాండిత్యం మీకు భగవద్దత్తం అనుకోవచ్చా? మీలో ఒక త్యాగయ్య, ప్రయాగ రంగదాసు, సుసర్ల దక్షిణామూర్తుల అంశ ఉందని అభిమానులు అంటారు... ఇదంతా భగవంతుడు ఇచ్చిందే. అయితే, ఫలానా వారి అంశ లాంటివి నేను చెప్పలేను. నేనివాళ ఇలా ఉండడానికే అలాంటి మహానుభావులే కారణం. మా అమ్మ గారి తాత గారు ఎన్నో కృతులు వెలయించిన సుప్రసిద్ధ ప్రయాగ రంగదాసు గారు. ఇక, మా నాన్న గారు పట్టాభిరామయ్య గాయకులు. మా అమ్మ వైణికురాలు. మా పెద్దమ్మ సంగీతం పాడేవారు, పిల్లలకు నేర్పేవారు. ఇలా పరంపరాగతంగా సంగీతం నాకు సంక్రమించింది. పెపైచ్చు, మా నాన్న గారి ఒళ్ళో కూర్చొని, ఆయన పాటలు వింటూ, అంటూ పెరిగాను. ఒక్కసారి వింటే వచ్చేసేది. పుస్తకం చూడకుండా పాడేసేవాణ్ణి. అంతా దైవలీల. ఎనిమిదేళ్ళు నిండీ నిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా కొన్ని వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ గుర్తుందా? ఎందుకు లేదూ! 1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్ళలో హాలు ప్రారంభోత్సవం. త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను - ఇలా త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి. మా గురువు గారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. మీ 11వ ఏట తిరువయ్యారులో బెంగుళూరు నాగరత్నమ్మ గారు స్వామి ఆశీస్సులిప్పించారనీ, అప్పటి కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతీస్వామి మిమ్మల్ని ‘జనకరాజ కృతిమంజరి’కి దీవించారనీ, మరొకరు మీకు కవితా లక్షణం ఉపదేశించారనీ... ఇలా ఎందరో స్వామీజీల అనుగ్రహం మీకు లభించిందట! నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లి వారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న సత్రంలో (దూబగుంట వారి సత్రం ఇప్పటికీ ఉంది) చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు. ఆయన మా గురువు పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్య గారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది. మీ జీవితంలో మీ గురువు గారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత? మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. నేనూ సంగీతం నేర్చుకున్నాను. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట! రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట! అవును. ఆ రోజుల్లో కోరుకొని మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. అలాగే, సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆ యా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం. విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, ఇక్కడే 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం? ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళా, సాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను. అయితే, నేనెప్పుడూ డబ్బుకూ, సంగీతానికీ ముడిపెట్ట లేదు. ఇంతిస్తేనే పాడతాను అనలేదు. కళ మీద త్రికరణ శుద్ధిగా దృష్టి పెడితే, సంపాదన దానంతట అదే వస్తుంది. అలాగే, ఆ రోజుల్లో ఎక్కువ డబ్బు వచ్చింది నాకే! మీకు అత్యంత ఇష్టమైన రాగం ఏమిటి? పిన్న వయసులోనే 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాసి, ‘జనక రాగ కృతి మంజరి’ పేర ప్రచురించా. వాటిని పాడి ప్రచారంలో పెట్టాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే కదా. వాటిలో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పడం కష్టం. కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమనుకుంటా..? మీరే ఎక్కడో ఆ మాట అన్నట్లున్నారు! (నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా. ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉండేది? ఎన్టీఆర్ మంచి నటుడు, చాలా గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను. వట్టి డబ్బు ఇస్తే ప్రేమ ఉంటుందా? ‘మహతి’ అనే పేరు బాగా ఇష్టమా? 50 ఏళ్ళుగా మీరు స్థిరనివాస ముంటున్న ఈ ఇంటికి కూడా ‘మహతి’ అనే పేరు పెట్టుకున్నారు.(నవ్వేస్తూ...) నేను పుట్టిన పక్షం రోజులకే మరణించిన మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా. అందుకే, ఈ పేరు. జీవితపు ద్వితీయార్ధంలో పరిచయమైనా, దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ భావి తరాలకు అందించాలని ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా ప్రయత్నించిన నర్తకి సరస్వతి మరణించడం... (తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్. (కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికీ, తుడుచుకోవడానికీ ప్రయత్నిస్తూ...) ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది. (ఇంటర్వ్యూ: డాక్టర్ రెంటాల జయదేవ) చదువులేని విద్యార్థి 12 డాక్టరేట్ల మేధావి నేను తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే వాళ్ళ అక్కచెల్లెళ్ళలో అతి చిన్నదైన మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాల వితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మగారు నన్ను పెంచారు. నేను స్కూల్లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్లో హెడ్మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు. మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. అయితే, బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. ప్రతిరోజూ నేనే బడిలో ప్రార్థన చేసేవాణ్ణి. అంతా నా చుట్టూ చేరేవారు. నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్మాస్టర్ మా నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ...) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా. రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థం కాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో పట్టు సాధించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా. ఐస్‌క్రీమ్ తినే గొంతు నేను ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. ఫలానాది తింటే జలుబు చేస్తుంది, గొంతు పట్టుకుంటుంది లాంటివేవీ నాకు లేవు. ఐస్‌క్రీమ్‌లంటే ఇష్టం. శుభ్రంగా లాగిస్తుంటా. కచ్చేరీల ముందు, మధ్య విరామంలో కూడా ఐస్‌క్రీమ్‌లు తిన్న సందర్భాలున్నాయి. ఇష్టంగా ఏది తినాలనిపిస్తే, తినేస్తుంటా. ముఖ్యంగా చిరుతిళ్ళు ఎక్కువ తింటూ ఉంటా. కారప్పూస, కారబ్బూంది, అటుకులు, లడ్డూలు, గారెలు, దోసెలు ఇష్టంగా తింటా. బెజవాడ ఆయన ప్రాణవాయువు మంగళంపల్లికి బెజవాడతో మంచి అనుబంధం. మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీకృష్ణ బెజవాడ సత్యనారాయ ణపురంలోని తన సొంత ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభిరామయ్య కట్టించిన ఇల్లది. మద్రాసులో స్థిరపడి, సంగీతంలో ఖండాంతర ఖ్యాతి పొందిన తరువాత కూడా ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే పెట్టుకోవడం ఆ వూరి మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. కనుకనే విజయవాడ పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన ఇల్లు వున్న వీధికి మంగళంపల్లి వీధి అని పేరు పెట్టారు. మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు. ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ చేశారు. ఆయన తమిళ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ సంగతి మంగళంపల్లి చెవిన పడింది. ఇక ఆ రోజు పూనకం పట్టినట్టు వర్ణం నుంచి మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని గౌరవం వుందని, తనకు పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని చెబుతుండేవారు. అసలు సిసలు సంగీతం కావేరీ ఒడ్డునే ఉందనేవారు. వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో నవయుగ ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు. ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ ఒకసారి గురువుగారి కంట పడ్డారు. ‘వయోలిన్ సంగతి సరే! ముందు నీ సంగతి చూసుకో’ అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం). ఆనాటి నుంచి మంగళంపల్లి అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు. 1985 ప్రాంతంలో కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి వివాహానికి మంగళంపల్లి మద్రాసు నుంచి వచ్చారు. పెళ్ళిలో కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్‌కు వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లిని చూడగానే గుర్తుపట్టి సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి మీకు బెర్తు ఇస్తాను అని చెప్పి వెళ్లి పోయాడు. ఈలోగా ఒక బెంగాలీ బాబు వచ్చి బాలమురళితో అది తన బెర్తని, అక్కడి నుంచి లేవమని అన్నాడు. తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు. అయితే ఏమిటట (వాట్ ఇఫ్) అనేశాడు. మంగళంపల్లి చిన్నబుచ్చుకుని టీసీ వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో ఇలా అన్నారు- ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా నిజం కాదు. మన అసలు స్థాయి ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’ అన్నారు. ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన కనిపించింది. - ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు -
పాట అయ్యాకే దోషం ఏమిటో చెప్పేవారు!
మంగళంపల్లి బాలమురళి చాలా ఏళ్లుగా నాకు సుపరిచితులు. దాదాపు 70 సంవత్సరాల అనుబంధం మాది. విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల 1960లో స్థాపించారు. ఆ సమయంలో నేను రేడియోలో పనిచేస్తున్నాను. నన్ను మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరడానికి రమ్మన్నారు. వెంటనే ఆయనను క లిశాను. 1960 - 62 దాకా ఆయన ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన విద్యార్థులకు ఒక మంచి అలవాటు చేశారు. ప్రతివారు తరగతి గదిలోకి వెళ్లగానే తప్పనిసరిగా ‘నాద తనుమనిశం శంకరం’ కీర్తనను ప్రార్థనగా పాడాలనే నియమం పెట్టారు. అలాగే కళాశాల విద్యార్థులంతా ‘గురువుగారు’ అనే పిలవాలని నిర్దేశించారు. తరగతిలో మేం పాఠాలు చెబుతున్నప్పుడు ఆయన అటుగా నడుస్తూ వినేవారు. ఎప్పుడైనా మేం పాడటంలో ఏదైనా దోషం వస్తే, వెంటనే ఆయన ఏమీ చెప్పకుండా, ఒక చిన్న కాగితం తీసుకుని ‘పాఠం అయిపోయాక నా దగ్గరకు రండి’ అని చీటీ మా దగ్గర పెట్టి వెళ్లిపోయేవారు. మేం పాఠం పూర్తయ్యాక ఆయన దగ్గరకు వె ళితే, మేం చేసిన దోషాన్ని చాలా నెమ్మదిగా చెప్పేవారు. అంతటి సహృదయులు ఆయన. ఆ తరవాత మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్‌గా వెళ్లిపోయారు. విజయవాడలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ‘భక్తిరంజని’ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆయన తన వెంట నన్ను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్లారు. దాదాపు 70 కచ్చీరీలకు ఆయనకు సహకార గానంలో పాల్గొన్నాను. ఆయనతో కలిసి ‘త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు’, ‘ఉత్సవ సంప్రదాయ కీర్తనలు’ అని మొత్తం 30 సీడిలు చేశాం. మహా గాయకుడు ఆయన బార్న్ మ్యుజీషియన్. సంగీతంతో పుట్టారు. తొమ్మిదవ ఏటే 72 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశారు. తరువాత ఎన్నో కృతులు చేశారు. సంగీతంలో ఆయనకి తెలియని ప్రక్రియ లేదు. శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, సినిమా సంగీతం, లలిత సంగీతం... అన్నిటిలోనూ ఆయనకు అభినివేశం ఉంది. వయొలిన్, వయోలా, మృదంగం, వీణ, కంజీరా... ఇన్ని వాద్యాలు వాయిస్తారు. ఆయనకు చెప్పరానంత మనోధర్మ సంగీతం ఉంది. ఎన్నో ప్రక్రియలు చేశారు. నిన్నమొన్నటి దాకా త్రిస్థాయిలు పలికించారు. చిరునవ్వు ఆయన సొంతం. కచ్చేరీలో అయినా, బయట అయినా ఆయన మోములో చిరునవ్వు చెరగదు. నవ్వుతూ పాడటం చాలా కష్టం. కానీ అది ఆయనకే చెల్లింది. ఆయన ఏది ముట్టుకున్నా ఆ విద్య ఆయనకు వస్తుంది. మహర్జాతకుడు. పక్కవాద్యం... ఆయన కచ్చేరీ చేసేటప్పుడు ఆయనకు ఎంత చిన్నస్థాయి వాళ్లు పక్కవాద్యం వాయించినా పాడేవారు. వాళ్లని ప్రోత్సహించేవారు. వారు నా స్థాయి వాళ్లు కాదు అనే మాట ఎన్నడూ అనలేదు. పెద్దపెద్ద వాళ్లు కూడా ఆయన పక్కన వాయించడానికి భయపడేవారు. మహామేధావి. గంభీరమైన గొంతు ఆయనది. కింద షడ్జమం కూడా అందుకునేవారు, అంతలోనే తారస్థాయి పాడతారు. మనసుతో తాళం వేసేవారు. ఆ లయ మనసులో పుట్టుకతో వచ్చింది. ప్రయాణాల్లో... ఆయన ప్రయాణాల్లో చాలా సరదాగా ఉండేవారు. నేను మొట్టమొదటిసారి ఆయనతోనే విమానం ఎక్కాను. ఒకసారి ‘రామవిలాస సభ’ బెంగ ళూరు వాళ్లు పెద్ద కచ్చేరీ పెట్టారు. దానికి నన్ను తీసుకువెళ్లారు. ఆ కచ్చేరీ నుంచి వచ్చేటప్పుడు ఆయనతో విమానంలో ప్రయాణించే అదృష్టం కలిగింది. నన్ను విమానం ఎక్కించిన ఘనత ఆయనది. బృహదీశ్వర మహాదేవ: ‘బృహదీశ్వర మహాదేవ...’ అనే కానడ రాగ కీర్తనకు పెద్ద కథ ఉంది. ఒకసారి వారితో కలిసి తమిళనాడులో కొన్ని ఊళ్లలో కచేరీలు చేసే సందర్భంలో, తంజావూరులో ఒక కచేరీకి వెళ్లవలసి వచ్చింది. అక్కడ బృహదీశ్వరాలయం ఉంది. అది చాలా పెద్ద దేవాలయం. నేను, బాలమురళిగారు ఆ ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయనకు అప్పటికప్పుడు ఆశువుగా ఒక ఈ కీర్తన తట్టింది. వెంటనే బసకు వచ్చిన తరువాత, ‘ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు మంచి కీర్తన తట్టింది. నేను చెప్తాను, నువ్వు వెంటనే రాసేసై’ అన్నారు. ఆ కీర్తన అలా వచ్చింది. ప॥బృహదీశ్వర మహాదేవ బ్రోవుము మహాప్రభావ సహజ కారుణ్య ఈక్షణ సాధు సుజన సంరక్షణ చ॥మమతపాశముల తాళను శమనవైరి దయలేకను కమనీయ మురళీగాన సమ సంగీతము లేదను (సంభాషణ: పురాణపండ వైజయంతి) -
సంగీత చికిత్సతో...
సంగీత చికిత్స ద్వారా రాగాలతో రోగాలు తగ్గించడమనే ప్రక్రియ కోసం బాలమురళి ఎంతగానో శ్రమించారు. ఫలానా జబ్బుకు ఫలానా రాగంతో చికిత్స అని ఏమైనా కనిపెడితే, అది ప్రపంచంతో పంచుకోవచ్చని తపించారు. అందుకే మ్యూజిక్ థెరపీ మీద ప్రయోగాలు చేశారు. ‘‘అవసరం వస్తే, తెలిసినవాళ్ళు నన్ను అడిగితే, సంగీత చికిత్స చేస్తాను. అయితే, ఫలానా అస్వస్థతకు ఫలానా రాగం పాడాలంటూ సాధారణీకరించి చెప్పలేం. అది సదరు రోగిని బట్టి, ఆ వ్యక్తి శారీరక, మానసిక స్థితిని బట్టి మారిపోతుంటుంది. అంతేతప్ప, ఫలానా రోగ లక్షణం ఉన్నవాళ్ళందరికీ ఫలానా రాగం పనికొస్తుందని చెప్పలేం. అయినా, వ్యాధి తగ్గాలంటూ చూపే అనురాగాన్ని మించిన రాగం (సంగీతం) ఏముంటుంది’’ అని నవ్వుతూ అనేవారు. ‘భారతరత్న’ ఎప్పుడో ఇవ్వాల్సింది! ‘‘గంభీరమైన, అద్భుతమైన మంచి బేస్ వాయిస్ బాలమురళి గారిది. సంక్లిష్టమైన కర్ణాటక శాస్త్రీయ సంగీతం పాడేటప్పుడు స్వరస్థానాల్ని అందంగా రూపొందించి, అంతే అందంగా, జనరంజకంగా పాడడం ఆయనలోని గొప్పతనం. అందుకే, ఒకే కీర్తనను కొన్ని వందల మంది పాడినా, బాలమురళి పాటే విలక్షణంగా ఉంటుంది. సాహిత్యానికి విలువనిస్తూ, సంగీతాన్ని సమన్వయం చేస్తూ పాడే దిట్ట ఆయన. పి.వి. నరసింహారావు గారి పేరిట ‘నృసింహ ప్రియ’ అనీ అప్పటికప్పుడు కొత్త రాగాన్ని కనిపెట్టి, పాడిన స్రష్ట ఆయన. అంత శాస్త్రీయ సంగీత మేధావి అయినా, సినిమా పాట దగ్గరకు వచ్చేసరికి, సినిమాకు తగ్గట్లు మలుచుకొని అద్భుతంగా పాడడం చూస్తాం. ఆయన పాడిన కీర్తనలున్న ‘రాగసుధా రసం’ అనే క్యాసెట్‌ను ఏడో తరగతిలో ఉండగా మా నాన్న గారు తెచ్చి ఇస్తే, విని నేర్చుకున్నా. అలా నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. పెద్దయ్యాక చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారిగా ఆయనను స్వయంగా కలసినప్పుడు ‘కమలదళాయతాక్షీ...’ అనే ఆయన కీర్తన చిన్నప్పుడు విన్నది పాడితే చాలా సంతో షించారు. నా సినిమా సంగీతంలోని పాటలన్నీ ఆయనకు పాడి, వినిపిస్తే మెచ్చుకు న్నారు. ఒక్కమాటలో ఆయన సంగీత గని. రాగనిధి. సరస్వతీ పుత్రుడు. సాక్షాత్తూ సరస్వతీ అంశ. అలాంటి ఆయన ‘భారతరత్న’కు ఎప్పుడో సంపూర్ణంగా అర్హులు. ఆ అవార్డెప్పుడో ఇవ్వాల్సింది. కానీ, రకరకాల రాజకీయాలు, బ్యూరోక్రసీ వల్ల ఇవ్వకపోవడం చాలా దారుణం, బాధా కరం. మనిషి మరణించాక కీర్తిస్తే ఏం లాభం? బతికున్నప్పుడు గౌరవించకుండా!’’ - కె.ఎం రాధాకృష్ణన్, ‘ఆనంద్, గోదావరి’చిత్రాల సంగీత దర్శకుడు-శాస్త్రీయసంగీతజ్ఞుడు త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను 5వ తరం వాణ్ణి... త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను... ఇలా! గానమే కాకుండా అనేక వాద్యాల మీద నాకు పట్టు మొదలైంది ద్వారం వయొలిన్ కచ్చేరీతో! ఆయన వాయిస్తుంటే విని విని, చూసి చూసి, చటుక్కున వయొలిన్ తీసి వాయించడం మొదలు పెట్టాను. తర్వాత వయోలా, మృదంగం, కంజీరా, వీణ ఇలా... చాలానే! నేను పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకిష్టమైనవి... ‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు..’ (ఉయ్యాల - జంపాల), ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా...’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా...’ (మేఘసందేశం), ‘నర్తనశాల’లోని ‘సలలిత రాగ సుధారస సారం’ వగైరా! సంగీతానికి నేనిచ్చే నిర్వచనం... లైఫ్! సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతేతప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. ఆ సంగీతం సమశ్రుతిలో ఉంటే, అదే బ్రహ్మానందం! - ‘సాక్షి’తో మంగళంపల్లి బాలమురళీకృష్ణ -
సినీ మధు మురళి
స్వర సంగీత సార్వభౌముడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనగానే శాస్త్రీయ సంగీత విద్వాంసులే గుర్తుకువస్తారు. కానీ, ఆయనకూ, సినీ రంగానికీ విశేష అనుబంధం ఉంది. తెలుగు, తమిళ, కొన్ని సినిమాల్లో ఆయన నటించారనీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాల్లో కొన్ని పదుల సినిమా పాటలు పాడారనీ అంటే ఈ తరానికి ఆశ్చర్యం కలిగించవచ్చు. తొలి సినిమా... తొలి పాట... మంగళంపల్లి పాతికేళ్ళ వయసుకే శాస్త్రీయ, లలిత, రేడియో సంగీతాల్లో శిఖరసమా నుడయ్యారు. ఆ పరిస్థితుల్లో శ్రీరాజరాజేశ్వరీ ఫిలిమ్స్‌వారు ‘సతీ సావిత్రి’ (1957) సినిమా తీస్తూ, అందులో పాడాల్సిందిగా ఒత్తిడి చేయడంతో, తొలిసారిగా సినీ నేపథ్య గాయకుడి అవతారం ఎత్తారు. అప్పటికి ఆయన మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగి. అక్కినేని హీరో అయిన ఆ చిత్రంలో కథానాయిక ఆ తరం సినీ నటి, గాయని ఎస్. వరలక్ష్మి. ఆమె బాలమురళీకృష్ణ శిష్యురాలే. దాంతో, శిష్యురాలి కోసం ఆయన ఆ చిత్రంలో ‘తులసీవనములకేగ’ మొదలైన పద్యాలు, పాటలు పాడారు. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్రధారి అయిన ఎన్టీయార్‌కు బాలమురళి (బెంగుళూరు లతతో కలసి) పాడిన ‘సలలిత రాగ సుధా రససారం..’ పాట ఇవాళ్టికీ సంగీత రసికుల హృదయాల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. ఆ తరువాత ఎన్టీయార్ ‘శ్రీమద్విరాట పర్వము’లో మళ్ళీ బృహన్నల పాత్రకు వచ్చే పాటలు (‘ఆడవే హంస గమన...’, ‘జీవితమే కృష్ణ సంగీతము’) పట్టుబట్టి మరీ బాలమురళీకృష్ణతోనే పాడించారు. ‘స్వాతి తిరునాళ్’ అనే మలయాళ చిత్రంలో ఆయన పాడిన హిందీ భజన గీతం సుప్రసిద్ధమైంది. దాంతో, ఆయనకు కేరళ ప్రభుత్వం ఉత్తమ గాయకుడిగా అవార్డు కూడా ప్రదానం చేసింది. మలయాళంలో హీరో! ఆ తరువాత బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు తెరపై ఆయన కనిపించారు. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశారు. ‘‘అంటే.. అందులో నేనే హీరో అన్న మాట! ఇన్ని చేసినా, అన్నీ హీరోయిన్ లేని పాత్రలే. 80 ఏళ్ళ పైబడిన ఈ వయసులో కూడా నేను అంత పెద్దవాడిలా కనిపించను. అందుకే, ఇప్పటికీ హీరోయిన్ ఉన్న పాత్ర ఎవరైనా ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నా’’ అని ‘సాక్షి ఫ్యామిలీ’తో గతంలో ఆయన నవ్వుతూ అన్నారు. ఆణిముత్యాల లాంటి సినీ బాణీలు ఎన్నో శాస్త్రీయ స్వరరచనలు చేసిన బాలమురళి సినీ స్వర రచనల్లోనూ తన బాణీ పలికించారు. జి.వి. అయ్యర్ దర్శకత్వంలోని కన్నడ చిత్రం ‘హంస గీతె’ (1975)తో ఆయన తొలిసారిగా సినీ సంగీత దర్శకుడి అవతారమెత్తారు. సంస్కృత భాషలో తొలి చలనచిత్రమైన జి.వి. అయ్యర్ ‘ఆది శంకరాచార్య’కు కూడా స్వరకర్త - బాలమురళీకృష్ణే. ఆ తరువాత కన్నడంలో వచ్చిన ‘మధ్వాచార్య’కు, తమిళంలోని ‘రామానుజాచార్య’, సంస్కృతంలోని ‘భగవద్గీత’ కు ఆయనే సంగీత దర్శకులు. ‘మధ్వాచార్య’ చిత్రం కోసం అప్పట్లో బాలమురళి కేవలం ఆరు వాద్యాల్ని మించి ఉపయోగించకపోవడం విశేషం. నేషనల్ బెస్ట్ సింగర్ బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్ విశేషం ఏమిటంటే, ఈ ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు సినిమాల్లో కూడా ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందు కోవడం! ‘హంసగీతె’కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా, కన్నడ ‘మధ్వాచార్య’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవా ర్డులు ఆయన సొంతమయ్యాయి. తెలుగులో ఒక్క సినిమానే! తెలుగు చిత్రసీమ స్వరకర్తగా బాలమురళి ప్రతిభను వినియోగిం చుకోలేకపోయింది. తెలుగులో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ‘తోడు’ (1997) చిత్రా నికి ఒక్క దానికే ఆయన స్వరాలు అందించారు. ఆ సినిమాలో బాలమురళి తన సంప్రదాయశైలికి భిన్నంగా స్వరాలు సమకూర్చారు. ఆ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది పురస్కారం గెలుచుకుంది. చాలా మంచి పాటలున్న ఈ సినిమా ద్వారా గాయని ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు కూడా వచ్చింది. అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఎవరూ అడగక పోవడంతో బాలమురళి తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డెరైక్షన్ చేయలేదు. వెండితెర నారదుడు! సినీ నేపథ్యగానంతో మొదలుపెట్టిన బాలమురళి తరువాత కెమేరా ముందుకొచ్చి నటించారు. ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’ (1967)లో ఆయన పోషించిన నారద మహర్షి పాత్ర చాలా పాపులర్. ఆ సినిమాలో నారద పాత్రకు వచ్చే ‘ఆది అనాదియు నీవే దేవా’, ‘వరమొసగే వనమాలి’ పాటలు ఆయనే పాడుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నారద పాత్ర పోషించారు. తరచూ ఆ పాత్రే వస్తుండడంతో విసుగొచ్చి, నటనకు బ్రేక్ చెప్పారు. మిస్సయిన ‘శంకరాభరణం’ నిజానికి, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సంగీత కథాచిత్రం ‘శంకరాభరణం’కి కూడా మొదట బాలమురళీకృష్ణతోనే పాటలు పాడించాలనుకున్నారట దర్శక - నిర్మాతలు. సరిగ్గా అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. అది రెండు నెలల పర్యటన కావడంతో, దర్శక - నిర్మాతలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించారు. ఆ రకంగా శాస్త్రీయ సంగీత విద్వాంసుడి జీవితకథగా నడిచే ‘శంకరాభరణం’ పాటలు బాలమురళి మిస్సయ్యారు. ఎస్పీ బాలు సాధన చేసి మరీ ఆ పాటలు పాడి, అజరామరమైన కీర్తి సంపాదించారు. బాలమురళి సినీ గాన రవళి బాలమురళి గానం చేసిన తెలుగు సినీగీతాలెన్నో జనాదరణ పొందాయి. ఆయన పాడిన పాటల నుంచి మచ్చుకు కొన్ని... ‘సతీసావిత్రి’ (1957)- ‘విలాసాల కోవెల, వినోదాల నావలె...’ పాట (ఎస్. వరలక్ష్మితో కలసి) ‘జయభేరి’ (1959)- ‘శుక్లాంబరధరం విష్ణుం...’ పద్యం ‘స్వర్ణగౌరి’ (1962)- ‘జయజయ నారాయణ’ పాట ‘నర్తనశాల’ (1963)- ‘సలలిత రాగ సుధారససారం...’ ‘కర్ణ’(1963)- ‘‘నీవు నేను వలచితిమి...’ (పి. సుశీలతో కలసి) ‘భక్త రామదాసు’ (1964)- కబీరు గీతాలు ‘ఉయ్యాల - జంపాల’ (1965)- ‘ఏటిలోని కెరటాలు...’ ‘పల్నాటియుద్ధం’(’66)-‘శీలముగలవారి చినవాడా’(పి. సుశీలతో) ‘భక్త ప్రహ్లాద’ (1967)- ‘సిరి సిరి లాలి’ (ఎస్. జానకితో), ‘నమో నారసింహ’ (పి. సుశీలతో కలసి) ‘వీరాంజనేయ’(’68)- ‘నవరాగమె సాగేనులే’(పి.బి. శ్రీనివాస్‌తో) ‘అందాల రాముడు’ (1973).... ‘పలుకే బంగారమాయెనా...’ ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975)... ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’ (పి.లీల తదితరులతో కలసి) టి.టి.డి. వారి డాక్యుమెంటరీ ‘శ్రీవేంకటేశ్వర వైభవం’(1977)... ‘తెర తీయరా తిరుపతి దేవరా’ ‘గుప్పెడు మనసు’ (1979)... ‘మౌనమె నీ భాష...’ ‘మేఘసందేశం’ (1982)... ‘పాడనా వాణి కల్యాణిగా..’ ‘ప్రియమైన శ్రీవారు’ (1997)... ‘జాతకాలు కలిసేవేళ’ - రెంటాల -
ప్రియుడి ఇంటి ముందే కిరోసిన్ పోసుకుని..
-
ప్రియుడి ఇంటి ముందే కిరోసిన్ పోసుకుని..
బాపట్ల(గుంటూరు): ప్రేమ పేరుతో వంచించి మోసం చేసిన యువకుడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగిందో యువతి. తన వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాల మురళికృష్ణ అదే ప్రాంతానికి చెందిన జ్యోతి అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఏడు నెలల గర్భవతి అయిన జ్యోతిని పెళ్లాడటానికి మురళికృష్ణ నిరాకరించడంతో.. అతని ఇంటి ముందే యువతి వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో బస్సుడ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న పది మంది గాయాలపాలయ్యారు. పట్టణంలోని ఫ్లైవోవర్ బ్రిడ్జి దిగువభాగంలో ఉన్న బుగ్గవాగు బ్రిడ్జిపై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై చర్చజరుగుతుండగానే అదే జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు నారాయణపేట్ నుంచి గుంటూరుకు వెళుతుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. బస్సులో సుమారు 35మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైవోవర్‌నుంచి బస్సు కిందికి దిగుతున్న సమయంలో అదుపుతప్పి బ్రిడ్జిపై వస్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జయింది. బస్సుడ్రైవర్‌సహా 10మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు రెండు 108 వాహనాలు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించాయి. బస్సు డ్రైవర్ దేవరకొండకు చెందిన శేషయ్య, బస్సులో ప్రయాణిస్తున్న గుంటూరు లాలాపేటవాసి కరీముల్లా, సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెంకు చెందిన రాధాకృష్ణ, నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, సంతోషమ్మ దంపతులతోపాటు మరో నలుగురు గాయపడ్డారు. లారీ లేకపోతే పెను ప్రమాదం జరిగేది.. ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ శనివారం ఉదయం ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బస్సు డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి పూర్తిగా కుడి వైపునకు వచ్చి లారీని ఢీకొట్టాడని, లారీ లేకపోతే బస్సు వాగులోపడి పెనుప్రమాదం సంభవించేదన్నారు. లారీలో ఇసుక లోడు ఉండడం కూడా మంచిదయిందన్నారు. వీఆర్వో బండ్ల రామారావు, కోనంకి గ్రామ కార్యదర్శి శ్రీరామిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులకు నివేదిక అందజేశారు.