పలుకే బంగారమాయెనా! | The last interview given by BalamuraliKrishna | Sakshi
Sakshi News home page

పలుకే బంగారమాయెనా!

Published Wed, Nov 23 2016 8:32 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM

పలుకే బంగారమాయెనా!

పలుకే బంగారమాయెనా!

జననం : 06 జూలై 1930
మరణం : 22 నవంబర్ 2016
బాలమురళీకృష్ణ  ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు

స రి గ మ ప ద ని... సప్తస్వరాలు.
ఆ స్వరాలన్నిటికీ నైవేద్యం పెట్టిన బాలగంధర్వుడు...
ఈ స్వరస్వతీపుత్రుడు!
పాటతో పులకింపజేసి...  సాక్షాత్తూ భగవంతుడినే తిలకింపజేసిన బాలమురళి పలుకే బంగారమాయెనా!

 

‘‘పునర్జన్మ ఉందో, లేదో నాకు తెలియదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంగీతం పరంపరాగతంగా రావడం లాంటి వాటిని బట్టి, మన శాస్త్రాలను బట్టి చూస్తే పునర్జన్మ ఉందనే అనుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే, ఈసారి ‘పెద్ద’ బాల మురళీకృష్ణ లాగా, ‘కొత్త’ బాల మురళీకృష్ణ లాగా మరింత మెరుగైన పనులు చేస్తా. సంగీతానికి నాకు చేతనైనంత ఇంకా... ఇంకా చేస్తా’’. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఇంటర్వ్యూ చేస్తూ పునర్జన్మలు ఉన్నాయంటారా? మీకు నమ్మకం ఉందా? అని సాక్షి ‘ఫ్యామిలీ’ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది. తన గానాన్ని భువికిచ్చి, బాలమురళి దివికేగిన ఈ సందర్భంలో ఆనాటి ఆయన సంభాషణలోని కొన్ని స్వర గమకాలు మళ్లీ మీ కోసం.
 

అప్పటికప్పుడు తిల్లానా రాసుకొని, అక్కడికక్కడ సంగతులు వేసుకొని మీలా పాడేయడం ప్రయత్నం మీద వస్తాయా?
లేదు. ఇవన్నీ ప్రయత్నం చేస్తే వచ్చేవి కావు. సహజంగా అలా జరగాలి. అంతే. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను... సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా మాత్రం ఉంటాను. పాట నా నోట పలుకుతుంది. అసలు నా జీవితంలో నేనెప్పుడూ కచ్చేరీలు చేయాలనీ, ఇందులోనే స్థిరపడాలనీ అనుకోలేదు. అలా జరిగింది. ఆ క్రమంలో ‘బాలమురళి బాణీ’ అనేది సృష్టించాను. ఈ సంగీతం, పాండిత్యం మీకు భగవద్దత్తం అనుకోవచ్చా? మీలో ఒక త్యాగయ్య, ప్రయాగ రంగదాసు, సుసర్ల దక్షిణామూర్తుల అంశ ఉందని అభిమానులు అంటారు...

ఇదంతా భగవంతుడు ఇచ్చిందే. అయితే, ఫలానా వారి అంశ లాంటివి నేను చెప్పలేను. నేనివాళ ఇలా ఉండడానికే అలాంటి మహానుభావులే కారణం. మా అమ్మ గారి తాత గారు ఎన్నో కృతులు వెలయించిన సుప్రసిద్ధ ప్రయాగ రంగదాసు గారు. ఇక, మా నాన్న గారు పట్టాభిరామయ్య గాయకులు. మా అమ్మ వైణికురాలు. మా పెద్దమ్మ సంగీతం పాడేవారు, పిల్లలకు నేర్పేవారు. ఇలా పరంపరాగతంగా సంగీతం నాకు సంక్రమించింది. పెపైచ్చు, మా నాన్న గారి ఒళ్ళో కూర్చొని, ఆయన పాటలు వింటూ, అంటూ పెరిగాను. ఒక్కసారి వింటే వచ్చేసేది. పుస్తకం చూడకుండా పాడేసేవాణ్ణి. అంతా దైవలీల. 

ఎనిమిదేళ్ళు నిండీ నిండగానే కచ్చేరీలు మొదలు పెట్టారు. ఇప్పటికి 76 ఏళ్ళుగా కొన్ని వేల కచ్చేరీలు చేశారు. అసలు తొలిసారిగా మీరిచ్చిన కచ్చేరీ గుర్తుందా?
ఎందుకు లేదూ! 1938 జూలైలో అనుకుంటా... బెజవాడలోని దుర్గాపురంలో శరభయ్యగారి గుళ్ళలో హాలు ప్రారంభోత్సవం. త్యాగరాజస్వామి, వారికి మానాంబుచావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య, ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి, సుసర్లకు పారుపల్లి రామకృష్ణయ్య, ఆయనకు నేను - ఇలా  త్యాగరాజస్వామి ప్రత్యక్ష శిష్యపరంపరలో నేను అయిదో తరం వాణ్ణి. మా గురువు గారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు తమ గురువులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి పేర ‘సద్గురు ఆరాధనోత్సవాలు’ జరుపుతున్నప్పుడు నాతో కచ్చేరీ చేయించారు. కొద్దిసేపనుకున్న నా గానం కొన్ని గంటలు మంత్రముగ్ధంగా సాగింది. నా తరువాత హరికథ చెప్పాల్సిన సుప్రసిద్ధులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ తన ప్రోగ్రామ్ కూడా వద్దని, నన్ను ఆశీర్వదించారు. అప్పటి దాకా నా పేరు మురళీకృష్ణ. పసివాడినైన నాకు ‘బాల’ అనే మాట ఆయనే చేర్చి, ‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. 

మీ 11వ ఏట తిరువయ్యారులో బెంగుళూరు నాగరత్నమ్మ గారు స్వామి ఆశీస్సులిప్పించారనీ, అప్పటి కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతీస్వామి మిమ్మల్ని ‘జనకరాజ కృతిమంజరి’కి దీవించారనీ, మరొకరు మీకు కవితా లక్షణం ఉపదేశించారనీ... ఇలా ఎందరో స్వామీజీల అనుగ్రహం మీకు లభించిందట!
నా 11వ ఏట తిరువయ్యారులో త్యాగరాయ ఆరాధనోత్సవాలలో పారుపల్లి వారికిచ్చిన సమయంలో నేను పాడినప్పుడు, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చి, చుట్టూ మూగితే, నాగరత్నమ్మ గారు నన్ను తీసుకువెళ్ళి, త్యాగరాజస్వామి విగ్రహం పాదాల చెంత పడేశారు. ‘ఏ నరదృష్టీ సోకకుండా ఈ పిల్లవాణ్ణి కాపాడమ’ని ప్రార్థించారు. ఇక, బెజవాడలోని సత్యనారాయణపురంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న సత్రంలో (దూబగుంట వారి సత్రం ఇప్పటికీ ఉంది) చాతుర్మాస్య దీక్షకని కుర్తాళం పీఠాధిపతి వచ్చారు. ఆయన మా గురువు పారుపల్లి వారికి ఆధ్యాత్మిక గురువు. స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ ప్రేరణ, ఆశీర్వాదం అందుకొని, 72 మేళకర్త రాగాల్లో కీర్తనల రచన ‘జనక రాగ కృతి మంజరి’ మొదలుపెట్టాను. ఇక, శరభయ్య గారి గుళ్ళలో ఉండే దేవీ ఉపాసకుడు, పండితుడు అయ్యప్పశాస్త్రి నాకు యతి, ప్రాస, కవితా లక్షణాలను చెప్పడం, కృతి, కీర్తన, పాట, పదం, జావళీల భేదాలు, రచనా రహస్యాలు తెల్పడం నా సాహితీ రచనకు వన్నెలద్దింది. ప్రతిభకు పెద్దల ఆశీర్వాద బలం తోడైంది.

మీ జీవితంలో మీ గురువు గారి పాత్ర? ఆయనలో మీరు చూసిన ప్రత్యేకత?
మా గురువు పారుపల్లి వారు లేకపోతే, ఆంధ్రదేశంలో ఇవాళ కర్ణాటక సంగీతం ఇంతగా ప్రాచుర్యంలోకి వచ్చేది కాదు. బెజవాడలో గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి సైకిల్ మీద వెళ్ళి, పాఠం చెప్పించుకున్న రోజులు నాకింకా గుర్తే. శిష్యులమైన మా అందరికీ ఆయన తనకు తెలిసిన విద్యనంతా నేర్పారు. గమ్మత్తేమిటంటే, పారుపల్లి వారి దగ్గర మా నాన్న గారూ పాఠం చెప్పించుకున్నారు. నేనూ సంగీతం నేర్చుకున్నాను. తండ్రీ కొడుకులిద్దరికీ ఆయనే గురువన్న మాట!

రేడియో పాపులారిటీకి కూడా ఎంతో శ్రమించారు. ఉదయం వేళ ‘భక్తి రంజని’ ఆలోచన మీదేనట!
అవును. ఆ రోజుల్లో కోరుకొని మరీ రేడియోలో చేరాను. ఉదయాన్నే నిద్ర లేస్తూనే, మంచి సంగీతం వింటే, శ్రోతలకు బాగుంటుందని ఆ భక్తి సంగీత కార్యక్రమం పెట్టాను. దాని కోసం ఎన్నో తత్త్వాలు, భక్తి కీర్తనలు సుప్రసిద్ధులెందరితోనో పాడించాను. అలాగే, సంగీతం, నాటకం, స్పోకెన్ వర్డ్ లాంటి వివిధ విభాగాలకు ప్రొడ్యూసర్లనే పోస్టులు పెట్టించి, ఆ యా రంగాల్లోని సుప్రసిద్ధులను అధిపతులుగా నియమించేలా చూశాను. ఆకాశవాణికి అది స్వర్ణయుగం.

విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల పెట్టించి, తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసిన మీరు మద్రాసుకు మారిపోయి, ఇక్కడే 50 ఏళ్ళుగా స్థిరపడడానికి కారణం?
ఉత్తరాదికి బొంబాయి ఎలాగో, దక్షిణాదికి మద్రాసు అలా! కళా, సాంస్కృతిక రంగాలకు ఇది కేంద్రం. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. బెజవాడ మ్యూజిక్ కాలేజీకి రాజీనామా చేశాక, మళ్ళీ మద్రాసు ఆకాశవాణిలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, కచ్చేరీలిస్తూ వచ్చా. ఆ తరువాత పూర్తిగా సంగీతం మీదే దృష్టి పెడుతూ, ఉద్యోగం వదిలేశాను. అయితే, నేనెప్పుడూ డబ్బుకూ, సంగీతానికీ ముడిపెట్ట లేదు. ఇంతిస్తేనే పాడతాను అనలేదు. కళ మీద త్రికరణ శుద్ధిగా దృష్టి పెడితే, సంపాదన దానంతట అదే వస్తుంది. అలాగే, ఆ రోజుల్లో ఎక్కువ డబ్బు వచ్చింది నాకే!

మీకు అత్యంత ఇష్టమైన రాగం ఏమిటి?
పిన్న వయసులోనే 75 మేళకర్త రాగాలలో కీర్తనలు రాసి, ‘జనక రాగ కృతి మంజరి’ పేర ప్రచురించా. వాటిని పాడి ప్రచారంలో పెట్టాను. అలాగే, సరికొత్త తాళ విధానాన్ని కనిపెట్టాను. ఇక, మహతి, లవంగి, గణపతి - ఇలా నేను సృష్టించిన రాగాలే దాదాపు 25 పైగా ఉంటాయి. అన్నీ నా పిల్లలే కదా. వాటిలో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పడం కష్టం.

కానీ, కల్యాణి మీకు ఇష్టమైన రాగమనుకుంటా..? మీరే ఎక్కడో ఆ మాట అన్నట్లున్నారు!
(నవ్వేస్తూ...) గతంలో ఒకసారి కేరళలోని త్రివేండ్రంలో అనుకుంటా. కచ్చేరీ చేస్తున్నా. ఆ సమయంలో నేను కల్యాణి రాగం పాడుతుంటే, ఒక అందమైన అమ్మాయి వచ్చి, నా పక్కన కూర్చొంది. ‘సొగసు నీ సొమ్ము కల్యాణి రాగిణీ, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో...’ అని అప్పటికప్పుడు పాట, వరుస కట్టాను. ఆ కృతి అయిపోగానే ఎలా వచ్చిన అమ్మాయి అలా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. దానికి ఆ కచ్చేరీకి వచ్చినవాళ్ళే సాక్షులు. కల్యాణి రాగదేవతే అలా వచ్చిందనుకుంటా.

ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉండేది?
ఎన్టీఆర్ మంచి నటుడు, చాలా గొప్పవారు. ‘నర్తనశాల’, ‘శ్రీమద్విరాటపర్వము’ లాంటి చిత్రాల్లో ఆయనకు నేను మంచి పాటలు పాడాను. మా మధ్య ఆ గౌరవాదరాలు ఉండేవి. కానీ, ఆయన లలిత కళా అకాడెమీలన్నిటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసేసరికి, భేదాభిప్రాయం వచ్చింది. కళాకారులకు అవమానం జరిగిందనే బాధతో ఆయన తన పంథా మార్చుకొనే దాకా పాడనన్నాను. ఏడేళ్ళ విరామం తరువాత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి అభ్యర్థనతో మళ్ళీ హైదరాబాద్‌లో పాడాను. తరువాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ సాదరంగా మళ్ళీ పిలిచి, గౌరవించడంతో వెళ్ళాను. పాడాను. ప్రాథమికంగా మేమిద్దరం ఆర్టిస్టులం. ఆయన నటన నాకూ, నా పాటలు ఆయనకూ నచ్చేవి. అధికారానికో, అహంకారానికో, ఆర్థిక బలిమికో కాదు... నేను ప్రేమకు కట్టుబడతాను. వట్టి డబ్బు ఇస్తే ప్రేమ ఉంటుందా?

‘మహతి’ అనే పేరు బాగా ఇష్టమా? 50 ఏళ్ళుగా మీరు స్థిరనివాస ముంటున్న ఈ ఇంటికి కూడా ‘మహతి’ అనే పేరు పెట్టుకున్నారు.(నవ్వేస్తూ...) నేను పుట్టిన పక్షం రోజులకే మరణించిన మా అమ్మ వీణావాదనలో దిట్ట. నారదుడి వీణ పేరు కూడా మహతే కదా. అందుకే, ఈ పేరు. 

జీవితపు ద్వితీయార్ధంలో పరిచయమైనా, దీర్ఘకాలం మీ వెంట ఉండి, మీ చరిత్రనూ, కృషినీ భావి తరాలకు అందించాలని ఎం.బి.కె. ట్రస్ట్ ద్వారా ప్రయత్నించిన నర్తకి సరస్వతి మరణించడం...
(తీవ్రమైన భావోద్వేగానికి గురై...) ఆమె లేకపోవడం నాకు అపారమైన నష్టం. షి వజ్ మై లైఫ్. (కళ్ళలో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికీ, తుడుచుకోవడానికీ ప్రయత్నిస్తూ...) ఆమె మరణం తరువాత అనేక అంశాలపై నాకు ఆసక్తి కూడా పోయింది.
(ఇంటర్వ్యూ: డాక్టర్ రెంటాల జయదేవ)

 

చదువులేని విద్యార్థి 12 డాక్టరేట్ల మేధావి
నేను తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో పుట్టా. నేను పుట్టిన పక్షం రోజులకే వాళ్ళ అక్కచెల్లెళ్ళలో అతి చిన్నదైన మా అమ్మ సూర్యకాంతమ్మ చనిపోయింది. దాంతో, మా అమ్మగారి అక్కల్లో అందరి కన్నా పెద్దవారూ, బాల వితంతువైన మా పెద్దమ్మ సుబ్బమ్మగారు నన్ను పెంచారు. నేను స్కూల్‌లో చేరి చదివింది సరిగ్గా 3 నెలలే. నా పాట విని, విజయవాడ గవర్నర్‌పేటలోని మునిసిపల్ స్కూల్‌లో హెడ్‌మాస్టర్ నాకు ఫస్ట్ ఫారమ్‌లో ప్రవేశం కల్పించారు.

మా నాన్నగారు నన్ను ముందు కూర్చోబెట్టుకొని, సైకిల్ తొక్కుతూ బడికి తీసుకువెళ్ళడం నాకిప్పటికీ గుర్తే. అయితే, బడిలో కూడా నా పాటలే ఆకర్షణ. ప్రతిరోజూ నేనే బడిలో ప్రార్థన చేసేవాణ్ణి. అంతా నా చుట్టూ చేరేవారు. నా సంగీతంతో మిగిలిన పిల్లల చదువు కూడా పాడవసాగింది. ఇంతలో నేను క్వార్టర్లీ పరీక్షలు తప్పాను. దాంతో, ‘మీ వాడికి చదువు కన్నా సంగీతమే కరెక్ట్. అందులోనే కృషి చేయించండి’ అని హెడ్‌మాస్టర్ మా నాన్న గారికి చెప్పారు. (నవ్వుతూ...) అలా 6వ తరగతి ఫెయిలై, స్కూలు చదువు అటకెక్కినా, వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొని, డాక్టర్‌నయ్యా.

రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో బెజవాడలో ఓ ఆడ ఇంగ్లీష్ ఎనౌన్సర్ నా పాట విని నచ్చి, ఇంగ్లీషులో మెచ్చుకొని, షేక్‌హ్యాండ్ ఇవ్వబోతే అర్థం కాక జంకాను. ఆ తరువాత పట్టుబట్టి, 3 నెలల్లో ఇంగ్లీషులో పట్టు సాధించి, ఆమెతో అనర్గళంగా మాట్లాడా. రోటరీక్లబ్‌లో ఇంగ్లీషులో నా తొలి ఉపన్యాసమిచ్చా. అలాగే, సంస్కృతం మీద పట్టు సాధించా.

ఐస్‌క్రీమ్  తినే గొంతు
నేను ఎప్పుడూ ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. ఫలానాది తింటే జలుబు చేస్తుంది, గొంతు పట్టుకుంటుంది లాంటివేవీ నాకు లేవు. ఐస్‌క్రీమ్‌లంటే ఇష్టం. శుభ్రంగా లాగిస్తుంటా. కచ్చేరీల ముందు, మధ్య విరామంలో కూడా ఐస్‌క్రీమ్‌లు తిన్న సందర్భాలున్నాయి. ఇష్టంగా ఏది తినాలనిపిస్తే, తినేస్తుంటా. ముఖ్యంగా చిరుతిళ్ళు ఎక్కువ తింటూ ఉంటా. కారప్పూస, కారబ్బూంది, అటుకులు, లడ్డూలు, గారెలు, దోసెలు ఇష్టంగా తింటా.

బెజవాడ ఆయన ప్రాణవాయువు
మంగళంపల్లికి బెజవాడతో మంచి అనుబంధం. మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీకృష్ణ  బెజవాడ సత్యనారాయ ణపురంలోని తన సొంత ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభిరామయ్య కట్టించిన ఇల్లది. మద్రాసులో స్థిరపడి, సంగీతంలో  ఖండాంతర ఖ్యాతి పొందిన తరువాత కూడా  ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే పెట్టుకోవడం ఆ వూరి మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. కనుకనే విజయవాడ పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన  ఇల్లు వున్న  వీధికి మంగళంపల్లి వీధి అని పేరు పెట్టారు.

మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు. ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ  చేశారు.  ఆయన తమిళ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ సంగతి మంగళంపల్లి చెవిన పడింది.  ఇక ఆ రోజు  పూనకం పట్టినట్టు వర్ణం నుంచి  మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని గౌరవం వుందని, తనకు పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని చెబుతుండేవారు. అసలు సిసలు సంగీతం కావేరీ ఒడ్డునే ఉందనేవారు.

వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో  నవయుగ ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి  వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు  ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు. ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ  ఒకసారి గురువుగారి కంట పడ్డారు. ‘వయోలిన్ సంగతి సరే! ముందు నీ సంగతి చూసుకో’ అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం). ఆనాటి నుంచి మంగళంపల్లి అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు.

1985 ప్రాంతంలో  కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి వివాహానికి మంగళంపల్లి మద్రాసు నుంచి వచ్చారు. పెళ్ళిలో కచేరీ కూడా చేసారు. ఆ తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్‌కు వెళ్ళారు. కోరమండల్  ఎక్స్ ప్రెస్ ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను  టీసీ మంగళంపల్లిని చూడగానే గుర్తుపట్టి సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి,  ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి  మీకు బెర్తు ఇస్తాను అని చెప్పి వెళ్లి పోయాడు. ఈలోగా ఒక బెంగాలీ బాబు  వచ్చి బాలమురళితో  అది తన బెర్తని, అక్కడి నుంచి లేవమని అన్నాడు.

తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు.  అయితే ఏమిటట (వాట్ ఇఫ్) అనేశాడు. మంగళంపల్లి చిన్నబుచ్చుకుని టీసీ వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో ఇలా అన్నారు- ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా  నిజం కాదు. మన అసలు స్థాయి  ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’ అన్నారు. ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన కనిపించింది. 
- ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement