పాట అయ్యాకే దోషం ఏమిటో చెప్పేవారు!
మంగళంపల్లి బాలమురళి చాలా ఏళ్లుగా నాకు సుపరిచితులు. దాదాపు 70 సంవత్సరాల అనుబంధం మాది. విజయవాడలో ప్రభుత్వ సంగీత కళాశాల 1960లో స్థాపించారు. ఆ సమయంలో నేను రేడియోలో పనిచేస్తున్నాను. నన్ను మ్యూజిక్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరడానికి రమ్మన్నారు. వెంటనే ఆయనను క లిశాను. 1960 - 62 దాకా ఆయన ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన విద్యార్థులకు ఒక మంచి అలవాటు చేశారు. ప్రతివారు తరగతి గదిలోకి వెళ్లగానే తప్పనిసరిగా ‘నాద తనుమనిశం శంకరం’ కీర్తనను ప్రార్థనగా పాడాలనే నియమం పెట్టారు. అలాగే కళాశాల విద్యార్థులంతా ‘గురువుగారు’ అనే పిలవాలని నిర్దేశించారు. తరగతిలో మేం పాఠాలు చెబుతున్నప్పుడు ఆయన అటుగా నడుస్తూ వినేవారు. ఎప్పుడైనా మేం పాడటంలో ఏదైనా దోషం వస్తే, వెంటనే ఆయన ఏమీ చెప్పకుండా, ఒక చిన్న కాగితం తీసుకుని ‘పాఠం అయిపోయాక నా దగ్గరకు రండి’ అని చీటీ మా దగ్గర పెట్టి వెళ్లిపోయేవారు. మేం పాఠం పూర్తయ్యాక ఆయన దగ్గరకు వె ళితే, మేం చేసిన దోషాన్ని చాలా నెమ్మదిగా చెప్పేవారు. అంతటి సహృదయులు ఆయన. ఆ తరవాత మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్‌గా వెళ్లిపోయారు. విజయవాడలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి ‘భక్తిరంజని’ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆయన తన వెంట నన్ను కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా తీసుకువెళ్లారు. దాదాపు 70 కచ్చీరీలకు ఆయనకు సహకార గానంలో పాల్గొన్నాను. ఆయనతో కలిసి ‘త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు’, ‘ఉత్సవ సంప్రదాయ కీర్తనలు’ అని మొత్తం 30 సీడిలు చేశాం.
మహా గాయకుడు
ఆయన బార్న్ మ్యుజీషియన్. సంగీతంతో పుట్టారు. తొమ్మిదవ ఏటే 72 మేళకర్త రాగాలలో కీర్తనలు రాశారు. తరువాత ఎన్నో కృతులు చేశారు. సంగీతంలో ఆయనకి తెలియని ప్రక్రియ లేదు. శాస్త్రీయ సంగీతం, భక్తి సంగీతం, సినిమా సంగీతం, లలిత సంగీతం... అన్నిటిలోనూ ఆయనకు అభినివేశం ఉంది. వయొలిన్, వయోలా, మృదంగం, వీణ, కంజీరా... ఇన్ని వాద్యాలు వాయిస్తారు. ఆయనకు చెప్పరానంత మనోధర్మ సంగీతం ఉంది. ఎన్నో ప్రక్రియలు చేశారు. నిన్నమొన్నటి దాకా త్రిస్థాయిలు పలికించారు. చిరునవ్వు ఆయన సొంతం. కచ్చేరీలో అయినా, బయట అయినా ఆయన మోములో చిరునవ్వు చెరగదు. నవ్వుతూ పాడటం చాలా కష్టం. కానీ అది ఆయనకే చెల్లింది. ఆయన ఏది ముట్టుకున్నా ఆ విద్య ఆయనకు వస్తుంది. మహర్జాతకుడు.
పక్కవాద్యం...
ఆయన కచ్చేరీ చేసేటప్పుడు ఆయనకు ఎంత చిన్నస్థాయి వాళ్లు పక్కవాద్యం వాయించినా పాడేవారు. వాళ్లని ప్రోత్సహించేవారు. వారు నా స్థాయి వాళ్లు కాదు అనే మాట ఎన్నడూ అనలేదు. పెద్దపెద్ద వాళ్లు కూడా ఆయన పక్కన వాయించడానికి భయపడేవారు. మహామేధావి. గంభీరమైన గొంతు ఆయనది. కింద షడ్జమం కూడా అందుకునేవారు, అంతలోనే తారస్థాయి పాడతారు. మనసుతో తాళం వేసేవారు. ఆ లయ మనసులో పుట్టుకతో వచ్చింది.
ప్రయాణాల్లో...
ఆయన ప్రయాణాల్లో చాలా సరదాగా ఉండేవారు. నేను మొట్టమొదటిసారి ఆయనతోనే విమానం ఎక్కాను. ఒకసారి ‘రామవిలాస సభ’ బెంగ ళూరు వాళ్లు పెద్ద కచ్చేరీ పెట్టారు. దానికి నన్ను తీసుకువెళ్లారు. ఆ కచ్చేరీ నుంచి వచ్చేటప్పుడు ఆయనతో విమానంలో ప్రయాణించే అదృష్టం కలిగింది. నన్ను విమానం ఎక్కించిన ఘనత ఆయనది.
బృహదీశ్వర మహాదేవ: ‘బృహదీశ్వర మహాదేవ...’ అనే కానడ రాగ కీర్తనకు పెద్ద కథ ఉంది. ఒకసారి వారితో కలిసి తమిళనాడులో కొన్ని ఊళ్లలో కచేరీలు చేసే సందర్భంలో, తంజావూరులో ఒక కచేరీకి వెళ్లవలసి వచ్చింది. అక్కడ బృహదీశ్వరాలయం ఉంది. అది చాలా పెద్ద దేవాలయం. నేను, బాలమురళిగారు ఆ ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయనకు అప్పటికప్పుడు ఆశువుగా ఒక ఈ కీర్తన తట్టింది. వెంటనే బసకు వచ్చిన తరువాత, ‘ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు మంచి కీర్తన తట్టింది. నేను చెప్తాను, నువ్వు వెంటనే రాసేసై’ అన్నారు. ఆ కీర్తన అలా వచ్చింది.
ప॥బృహదీశ్వర మహాదేవ బ్రోవుము మహాప్రభావ
సహజ కారుణ్య ఈక్షణ సాధు సుజన సంరక్షణ
చ॥మమతపాశముల తాళను శమనవైరి దయలేకను
కమనీయ మురళీగాన సమ సంగీతము లేదను
(సంభాషణ: పురాణపండ వైజయంతి)