సినీ మధు మురళి
స్వర సంగీత సార్వభౌముడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనగానే శాస్త్రీయ సంగీత విద్వాంసులే గుర్తుకువస్తారు. కానీ, ఆయనకూ, సినీ రంగానికీ విశేష అనుబంధం ఉంది. తెలుగు, తమిళ, కొన్ని సినిమాల్లో ఆయన నటించారనీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళాల్లో కొన్ని పదుల సినిమా పాటలు పాడారనీ అంటే ఈ తరానికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
తొలి సినిమా... తొలి పాట...
మంగళంపల్లి పాతికేళ్ళ వయసుకే శాస్త్రీయ, లలిత, రేడియో సంగీతాల్లో శిఖరసమా నుడయ్యారు. ఆ పరిస్థితుల్లో శ్రీరాజరాజేశ్వరీ ఫిలిమ్స్‌వారు ‘సతీ సావిత్రి’ (1957) సినిమా తీస్తూ, అందులో పాడాల్సిందిగా ఒత్తిడి చేయడంతో, తొలిసారిగా సినీ నేపథ్య గాయకుడి అవతారం ఎత్తారు. అప్పటికి ఆయన మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగి. అక్కినేని హీరో అయిన ఆ చిత్రంలో కథానాయిక ఆ తరం సినీ నటి, గాయని ఎస్. వరలక్ష్మి. ఆమె బాలమురళీకృష్ణ శిష్యురాలే. దాంతో, శిష్యురాలి కోసం ఆయన ఆ చిత్రంలో ‘తులసీవనములకేగ’ మొదలైన పద్యాలు, పాటలు పాడారు. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్రధారి అయిన ఎన్టీయార్‌కు బాలమురళి (బెంగుళూరు లతతో కలసి) పాడిన ‘సలలిత రాగ సుధా రససారం..’ పాట ఇవాళ్టికీ సంగీత రసికుల హృదయాల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. ఆ తరువాత ఎన్టీయార్ ‘శ్రీమద్విరాట పర్వము’లో మళ్ళీ బృహన్నల పాత్రకు వచ్చే పాటలు (‘ఆడవే హంస గమన...’, ‘జీవితమే కృష్ణ సంగీతము’) పట్టుబట్టి మరీ బాలమురళీకృష్ణతోనే పాడించారు. ‘స్వాతి తిరునాళ్’ అనే మలయాళ చిత్రంలో ఆయన పాడిన హిందీ భజన గీతం సుప్రసిద్ధమైంది. దాంతో, ఆయనకు కేరళ ప్రభుత్వం ఉత్తమ గాయకుడిగా అవార్డు కూడా ప్రదానం చేసింది.
మలయాళంలో హీరో!
ఆ తరువాత బెంగాలీలో ఉత్పలేందు చక్రవర్తి దర్శకత్వంలోని ‘చచందనిర్’లో కాసేపు తెరపై ఆయన కనిపించారు. ఓ సంగీత విద్వాంసుడి జీవితం చుట్టూ తిరిగే కథగా మలయాళంలో రూపొందిన ‘సంధ్య కెందిన సింధూరం’ చిత్రంలో ఆ కథానాయక పాత్ర చేశారు. ‘‘అంటే.. అందులో నేనే హీరో అన్న మాట! ఇన్ని చేసినా, అన్నీ హీరోయిన్ లేని పాత్రలే. 80 ఏళ్ళ పైబడిన ఈ వయసులో కూడా నేను అంత పెద్దవాడిలా కనిపించను. అందుకే, ఇప్పటికీ హీరోయిన్ ఉన్న పాత్ర ఎవరైనా ఇస్తారేమోనని ఎదురుచూస్తున్నా’’ అని ‘సాక్షి ఫ్యామిలీ’తో గతంలో ఆయన నవ్వుతూ అన్నారు.
ఆణిముత్యాల లాంటి సినీ బాణీలు
ఎన్నో శాస్త్రీయ స్వరరచనలు చేసిన బాలమురళి సినీ స్వర రచనల్లోనూ తన బాణీ పలికించారు. జి.వి. అయ్యర్ దర్శకత్వంలోని కన్నడ చిత్రం ‘హంస గీతె’ (1975)తో ఆయన తొలిసారిగా సినీ సంగీత దర్శకుడి అవతారమెత్తారు. సంస్కృత భాషలో తొలి చలనచిత్రమైన జి.వి. అయ్యర్ ‘ఆది శంకరాచార్య’కు కూడా స్వరకర్త - బాలమురళీకృష్ణే. ఆ తరువాత కన్నడంలో వచ్చిన ‘మధ్వాచార్య’కు, తమిళంలోని ‘రామానుజాచార్య’, సంస్కృతంలోని ‘భగవద్గీత’ కు ఆయనే సంగీత దర్శకులు. ‘మధ్వాచార్య’ చిత్రం కోసం అప్పట్లో బాలమురళి కేవలం ఆరు వాద్యాల్ని మించి ఉపయోగించకపోవడం విశేషం.
నేషనల్ బెస్ట్ సింగర్ బెస్ట్ మ్యూజిక్ డెరైక్టర్
విశేషం ఏమిటంటే, ఈ ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు సినిమాల్లో కూడా ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందు కోవడం! ‘హంసగీతె’కు ఉత్తమ నేపథ్య గాయకుడిగా, కన్నడ ‘మధ్వాచార్య’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవా ర్డులు ఆయన సొంతమయ్యాయి.
తెలుగులో ఒక్క సినిమానే!
తెలుగు చిత్రసీమ స్వరకర్తగా బాలమురళి ప్రతిభను వినియోగిం చుకోలేకపోయింది. తెలుగులో అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ‘తోడు’ (1997) చిత్రా నికి ఒక్క దానికే ఆయన స్వరాలు అందించారు. ఆ సినిమాలో బాలమురళి తన సంప్రదాయశైలికి భిన్నంగా స్వరాలు సమకూర్చారు. ఆ సినిమా ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది పురస్కారం గెలుచుకుంది. చాలా మంచి పాటలున్న ఈ సినిమా ద్వారా గాయని ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా నంది అవార్డు కూడా వచ్చింది. అంతకు ముందు కానీ, ఆ తరువాత కానీ ఎవరూ అడగక పోవడంతో బాలమురళి తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డెరైక్షన్ చేయలేదు.
వెండితెర నారదుడు!
సినీ నేపథ్యగానంతో మొదలుపెట్టిన బాలమురళి తరువాత కెమేరా ముందుకొచ్చి నటించారు. ఏ.వి.ఎం. వారి ‘భక్త ప్రహ్లాద’ (1967)లో ఆయన పోషించిన నారద మహర్షి పాత్ర చాలా పాపులర్. ఆ సినిమాలో నారద పాత్రకు వచ్చే ‘ఆది అనాదియు నీవే దేవా’, ‘వరమొసగే వనమాలి’ పాటలు ఆయనే పాడుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నారద పాత్ర పోషించారు. తరచూ ఆ పాత్రే వస్తుండడంతో విసుగొచ్చి, నటనకు బ్రేక్ చెప్పారు.
మిస్సయిన ‘శంకరాభరణం’
నిజానికి, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన సంగీత కథాచిత్రం ‘శంకరాభరణం’కి కూడా మొదట బాలమురళీకృష్ణతోనే పాటలు పాడించాలనుకున్నారట దర్శక - నిర్మాతలు. సరిగ్గా అదే సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. అది రెండు నెలల పర్యటన కావడంతో, దర్శక - నిర్మాతలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించారు. ఆ రకంగా శాస్త్రీయ సంగీత విద్వాంసుడి జీవితకథగా నడిచే ‘శంకరాభరణం’ పాటలు బాలమురళి మిస్సయ్యారు. ఎస్పీ బాలు సాధన చేసి మరీ ఆ పాటలు పాడి, అజరామరమైన కీర్తి సంపాదించారు.
బాలమురళి సినీ గాన రవళి
బాలమురళి గానం చేసిన తెలుగు సినీగీతాలెన్నో జనాదరణ పొందాయి. ఆయన పాడిన పాటల నుంచి మచ్చుకు కొన్ని... ‘సతీసావిత్రి’ (1957)- ‘విలాసాల కోవెల, వినోదాల నావలె...’ పాట (ఎస్. వరలక్ష్మితో కలసి)
‘జయభేరి’ (1959)- ‘శుక్లాంబరధరం విష్ణుం...’ పద్యం
‘స్వర్ణగౌరి’ (1962)- ‘జయజయ నారాయణ’ పాట
‘నర్తనశాల’ (1963)- ‘సలలిత రాగ సుధారససారం...’
‘కర్ణ’(1963)- ‘‘నీవు నేను వలచితిమి...’ (పి. సుశీలతో కలసి)
‘భక్త రామదాసు’ (1964)- కబీరు గీతాలు
‘ఉయ్యాల - జంపాల’ (1965)- ‘ఏటిలోని కెరటాలు...’
‘పల్నాటియుద్ధం’(’66)-‘శీలముగలవారి చినవాడా’(పి. సుశీలతో)
‘భక్త ప్రహ్లాద’ (1967)- ‘సిరి సిరి లాలి’ (ఎస్. జానకితో), ‘నమో నారసింహ’ (పి. సుశీలతో కలసి)
‘వీరాంజనేయ’(’68)- ‘నవరాగమె సాగేనులే’(పి.బి. శ్రీనివాస్‌తో)
‘అందాల రాముడు’ (1973).... ‘పలుకే బంగారమాయెనా...’
‘శ్రీరామాంజనేయ యుద్ధం’ (1975)... ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’ (పి.లీల తదితరులతో కలసి)
టి.టి.డి. వారి డాక్యుమెంటరీ ‘శ్రీవేంకటేశ్వర వైభవం’(1977)... ‘తెర తీయరా తిరుపతి దేవరా’
‘గుప్పెడు మనసు’ (1979)... ‘మౌనమె నీ భాష...’
‘మేఘసందేశం’ (1982)... ‘పాడనా వాణి కల్యాణిగా..’
‘ప్రియమైన శ్రీవారు’ (1997)... ‘జాతకాలు కలిసేవేళ’
- రెంటాల