సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ ప్రజల భాష సంగీతం. మనసును కదిలించేది, మనిషిలో చైతన్యాన్ని రగిలించేది సంగీతం. కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరులేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సంగీతంలోనే కాదు.. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు లేరని పేర్కొన్నారు. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఎరుగని గొప్ప కళాకారుడన్నారు. ఆ గొప్ప కళామేధావి తెలుగువారు కావడం గర్వకారణమని ఆయన చెప్పారు. రాబోయే తరాలకు బాలమురళీకృష్ణ గొప్పతనాన్ని తెలియజేయాలన్నారు.
కలెక్టర్ వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని, ఆ మరిమళమే బాలమురళీకృష్ణ అని పేర్కొన్నారు. అంతటిగొప్ప కళాకారుడు జయంత్యుత్సవాల్లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. కళాకారులు వంకాయల వెంకటరమణమూర్తి, డాక్టర్ పంతుల రమ, ఎం.శ్రీనివాస నరసింహామూర్తి, కె.సరస్వతి, గురువిల్లి అప్పన్న, డాక్టర్ మండపాక శారద, ధనవాడ ధర్మారావు, డాక్టర్ బీకేడీ ప్రసాద్, ధనుంజయ పట్నాయక్‌లను మంత్రి ముత్తంశెట్టి, కలెక్టర్ వినయ్‌చంద్ సత్కరించారు. అంతకుముందు మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment