చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల్లో ఎలాంటి వంచనాత్మకమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందో.. ఆచరణాత్మకం కాని ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో.. ప్రజలకు తెలుసు. ఎన్డీయే సర్కారు ఆ హామీలను నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూస్తూ వైఎస్సార్‌సీపీ ఆరునెలల గడువు ఇచ్చింది. ప్రజలకు అదే ధోరణిలో మాయమాటలు చెప్పడం తప్ప.. ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల విషయంలో నోరు మెదపకుండా ప్రభుత్వం వంచిస్తూనే పాలన సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ దాటిపోయిందనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ పోరుబాటలో కార్యచరణకు దిగుతుండడం.. కూటమి సర్కారులో వణుకు పుట్టిస్తోంది.
వైఎస్సార్‌సీపీ ఉద్యమ ప్రణాళికకు జడుసుకుంటున్న ప్రభుత్వం రాజకీయం కుటిల వ్యూహాలను అమల్లో పెడుతోంది. ఆ పార్టీ నాయకులను లోబరచుకోవడం.. తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ చేతి కీలుబొమ్మల్లాగా ఆడించడం.. వైఎస్సార్‌సీపీ మీదకే అస్త్రాల్లాగా ప్రయోగించడం అనేది అధికార పార్టీ అనుసరిస్తున్న తాజా వ్యూహంగా ఉంది. వైఎస్సార్సీపీ బలహీన పడుతున్నట్టుగా ప్రజల్లో ఒక తప్పుడు భావనను క్రియేట్ చేయడానికి వైఎస్సార్‌సీపీ నాయకులతో రాజీనామాలు చేయించడం ఒక తక్షణ ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి ఇన్నాళ్లుగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన, తనను మంత్రిని చేసిన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. భవిష్యత్తు కార్యాచరణ గురించి ఊహాగానాలు రాయొద్దని మీడియాకు విన్నవించుకున్నారు. ఒకవైపు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొంటూ.. మరోవైపు కనీసం ఏడాది రోజులైనా ప్రభుత్వానికి హామీలు నెరవేర్చడానికి టైం ఇవ్వకుండా.. అప్పుడే ఉద్యమాలు చేయడం కరెక్టు కాదని అవంతి సూత్రీకరించడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది.
తాడేపల్లిలో కూర్చుని నిర్ణయాలు చేస్తోంటే అమలు చేయడానికి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ అవంతి అనడాన్ని లోతుగా గమనిస్తే.. ఆ మాటల వెనుక ‘ఉండవల్లి’ స్క్రిప్టు ఉన్నదనే సంగతి ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వానికి, తమ హామీలు తీర్చడానికి ప్రజలు అయిదేళ్ల గడువు ఇచ్చారని, అప్పుడే పోరాటాలు సరికాదని.. ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా అవంతి శ్రీనివాస్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల మీద తెలుగుదేశం అండ్ కో పార్టీలు రెండు రకాల గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలకు గేలం వేసి, ఎర వేసి, ప్రలోభపెట్టి ఆకర్షించడం ఒక పద్ధతి. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి వస్తే మంచి భవిష్యత్తు చూపిస్తామని ఆశ పెడతారు. గేలం వేస్తే లొంగని వారిని బెదిరిస్తున్నారు. వధ్యశిల బెదిరింపు అన్నమాట. వారి కెరీర్ అంతం అయ్యేలాగా కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఈ రెండురకాల వక్ర మార్గాల్లో ఏదో ఒకదానికి వైఎస్సార్‌సీపీ నాయకులు లొంగిపోతున్నారు.
అయితే రాజీనామా చేసిన నేతలకు మంచి భవిష్యత్తు అనేది బూటకం మాత్రమే. మంత్రి పదవి ఆశ పెట్టి బాలినేని శ్రీనివాస రెడ్డిని చేర్చుకున్నారు. ఆయనతో జగన్ మీద నానా నిందలు వేయించారు. తీరా ఇప్పుడు కరివేపాకు లాగా తీసి పక్కన పడేశారు. తెలుగుదేశం కూటమి పార్టీల ప్రలోభాలకు లొంగి వైఎస్సార్‌సీపీని వీడుతున్న వారి భవిష్యత్తు కూడా అంతేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
:::ఎం.రాజేశ్వరి
ఇదీ చదవండి: యనమల గతి ఇక ఇంతేనా?
Comments
Please login to add a commentAdd a comment