లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు | APSRTC bus collide truck | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published Mon, Nov 4 2013 12:46 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

APSRTC bus  collide  truck

పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టిన ప్రమాదంలో బస్సుడ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న పది మంది గాయాలపాలయ్యారు. పట్టణంలోని ఫ్లైవోవర్ బ్రిడ్జి దిగువభాగంలో ఉన్న బుగ్గవాగు బ్రిడ్జిపై శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై చర్చజరుగుతుండగానే అదే జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు నారాయణపేట్ నుంచి గుంటూరుకు వెళుతుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.
 
 బస్సులో సుమారు 35మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైవోవర్‌నుంచి బస్సు కిందికి దిగుతున్న సమయంలో అదుపుతప్పి బ్రిడ్జిపై వస్తున్న లారీని ఢీకొట్టింది. బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జయింది.  బస్సుడ్రైవర్‌సహా 10మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు రెండు 108 వాహనాలు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించాయి. బస్సు డ్రైవర్ దేవరకొండకు చెందిన శేషయ్య, బస్సులో ప్రయాణిస్తున్న గుంటూరు లాలాపేటవాసి కరీముల్లా, సత్తెనపల్లికి చెందిన శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెంకు చెందిన రాధాకృష్ణ, నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, సంతోషమ్మ దంపతులతోపాటు మరో నలుగురు గాయపడ్డారు.
 
 లారీ లేకపోతే పెను ప్రమాదం జరిగేది..
 ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో స్థానిక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బాలమురళీకృష్ణ శనివారం ఉదయం  ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బస్సు డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు.  బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండి పూర్తిగా కుడి వైపునకు వచ్చి లారీని ఢీకొట్టాడని, లారీ లేకపోతే బస్సు వాగులోపడి పెనుప్రమాదం సంభవించేదన్నారు. లారీలో ఇసుక లోడు ఉండడం కూడా మంచిదయిందన్నారు. వీఆర్వో బండ్ల రామారావు, కోనంకి గ్రామ కార్యదర్శి శ్రీరామిరెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులకు నివేదిక అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement