స్తబ్దతను ఛేదించిన ‘మురళి’ | Bala Murali Krishna days are over with his death | Sakshi
Sakshi News home page

స్తబ్దతను ఛేదించిన ‘మురళి’

Published Thu, Nov 24 2016 12:38 AM | Last Updated on Tue, Oct 30 2018 5:50 PM

స్తబ్దతను ఛేదించిన ‘మురళి’ - Sakshi

స్తబ్దతను ఛేదించిన ‘మురళి’

సందర్భం
యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధినేత కావడంతో అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్నాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! సంప్రదాయంపై అధికారమున్నవాడికే సంస్కరించే హక్కు ఉంటుంది.
 
సంప్రదాయం మీద  దండోరా వేయడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో అధికారం, ప్రభుత్వ విమర్శకులకు ఉంటేనే అది సాధ్యం. అంతా ‘సంకరం’ అయిపోతుందనుకునేవాళ్లు ఆధు నిక జీవన పద్ధతులకు దూరంగా అరణ్యాలలో, ఆశ్రమాలలో కంద మూలాలు తిని బతకవచ్చు. కాని అలా బతకడానికి ఇష్టపడటం లేదు. సంప్రదాయం చేత ఆధునికం చాకిరీ చేయించుకొనక తప్పదు. అందుకే కొత్త పాతల మేలు కలయిక అన్నారు.
 
సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కర్నాటక సంగీతాన్ని ఆధునికులకు మరింత కర్ణ పేయంగా మలచి, వందల సంఖ్యలో మాత్రమే ఆక ర్షితులవుతున్న శ్రోతలనూ, ప్రేక్షకులనూ వేల సంఖ్యలో పెంచడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దాక్షిణాత్య ఛాంద సులు కొందరు పదే పదే విమర్శలు చేసి కర్ణాటక సంగీత విరోధిగా లోకానికి చిత్రించాలని చూస్తున్నందుననే బాల మురళి ఇటీవల తిరగబడవలసి వచ్చింది. నిజానికి ఆయన  తన ముందుతరం పెట్టిపోయిన సంగీత సంప్రదాయాల పరిధిలోనే మార్పు చేశాడు. లలిత సంగీత బాణీలకు ఆక ర్షితులవుతున్న జనాన్ని కూడా తన వైపునకు ఆకట్టుకోవ డానికి వాణినీ, బాణినీ సంస్కరించుకున్నాడు. అదే విప్లవ మైతే, పాశ్చాత్య దేశాల్లోనూ, చివరికి కమ్యూనిస్టు దేశా ల్లోనూ గాత్ర, వాద్య సంగీతంలో వచ్చిన మార్పులను చూసి ఛాందసులు గుండెలు బాదుకోవలసి వస్తుంది.
 
బాలగంధర్వుడిగా తొమ్మిదేళ్లకు తిరువాయూర్ సంగీత సభలలో ఉద్దండులను తమ గానమాధుర్యంతో  ఊగించి శాసించిన బాలమురళి గురుపరంపరలో త్యాగ రాజుకు శిష్యుడుగా నిలవగలిగాడు. కర్ణాటక సంగీతాన్ని జనాకర్షకం చేయడానికి ఆయన సంగీత సరిహద్దులనే కాక దక్షిణాదిని దాటి యావద్భారతంలోనూ ఖ్యాతికెక్కాడు. వాక్కునూ, గేయాన్నీ సొంతం చేసుకున్న బాలమురళి, ‘బయకారుడై’ వాగ్గేయకారునిగా ప్రసిద్ధి పొందాడు. 430 బాణీలతో, 72 మేళకర్త రాగాలకు ఒక్కొక్క కృతి చొప్పున సమకూర్చుతూ ‘జనకరాగ మంజరి’ని రచించిన బాల మురళికి సంప్రదాయంపై అధికారం ఉండితీరాలి. అది ఉన్నవాడికే సంస్కరించే హక్కు కూడా ఉంటుంది. కనుకనే అతనికి చెప్పదగిన తొలికచేరి తిరువాయార్ సభ అయితే, తుది కచేరి తిరువనంతపురం కావలిసి వచ్చింది. కనుకనే బాలమురళి ‘సంప్రదాయాన్ని కొంత వదులుకోవాలి. లేకుంటే కర్ణాటక సంగీతం మెల్లమెల్లగా చచ్చిపోతుంది’ అని దండోరా వేయవలసి వచ్చింది. త్యాగరాజు సంప్ర     దాయంలోనే ఇతను కూడా వ్యాపార ప్రపంచం సరిహ ద్దులు దాటి నిధి కంటే దైవసన్నిధి సుఖం అని ఆలోచించ సాగాడు. ఇది ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం అర్రులు చాచే శ్రోతలకు శుభసూచకం.
 
సంప్రదాయ ఉల్లంఘన ఈనాటిది కాదు. వ్యాకరణ దోషాలను కూడా పట్టించుకోకుండా శ్రవణపేయతకు ప్రాధాన్యం కల్పించిన కర్ణాటక మూర్తిత్రయం కీర్తన కృతులు లేవా? ఈ మూర్తిత్రయం సంగీత సాగర మథ నంలో సౌలభ్యం కోసం ఎన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించారో! కొన్నేళ్లక్రితం ‘ప్రజానాట్య మండలి’ ప్రాచీన కళారూపాలన్నింటినీ చేపట్టినప్పుడు వాటిని ప్రజా రంజకం చేసినప్పుడు సంప్రదాయ కళలకు మరింత వన్నె కూర్చిపెట్టిందే గాని, తగ్గించలేదు. బాలమురళికి ముందు నాగయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధునికం చేసినట్టే ‘శ్రీరంగ రంగా కావేటి రంగా’ వంటి కీర్తనలను విప్లవీకరించి తన బాణీలతో వేల సంఖ్యలో జనాల్ని ఆకర్షిస్తున్నవాడు గద్దర్.
 
ఒకప్పుడు యూరోపియన్ సంగీతానికి మొజార్ట్ అధి నేత అయినందున అది ‘మొజార్ట్ యూరప్’ అయింది. అలాగే బెతోవెన్ శకం అన్నారు. ఇది కర్ణాటక సంగీత లోకంలో బాలమురళి యుగం! తప్పులు దొర్లితే దొర్లుగాక. అసలు సొంత అడుగే పడనివ్వకపోతే ఎలా? జాజ్, ఫోక్, రాక్, పాప్, కంట్రీ సింఫోనిక్, లైట్ క్లాసికల్, బ్రాడ్వే, హాలీవుడ్ - ఇంత వైవిధ్యం పాశ్చాత్యులు పెంచుకుంటున్నారు. కొత్త రాగ మాలికల ద్వారా సరికొత్త స్వరకల్పనల ద్వారా ఫ్రాంక్ జప్పా, రోలింగ్ స్టోన్స్, అరీతా ఫ్రాంక్లిన్ ఆధునికులలో సంగీత ఝరికి హద్దులు లేవని నిరూపిస్తున్నారు. మైకేల్ జాక్సన్ ఇందుకొక సరికొత్త మేళవింపు.
 
యూరప్‌లో సెబాస్టియన్ బాక్ చర్చి మ్యూజిక్ సంప్ర దాయాన్ని కాపాడుతూనే హెచ్చుమందిని ఆకర్షించేందుకు వాద్య, గాత్రాలకు మెరుగులు దిద్దుకున్నాడు. కచేరీ మధ్యలో బాలమురళి ‘విరామం’ తీసుకుంటాడని బాధపడే ఛాందసులకు విరామ చిహ్నం వ్యాస రచనకు ఎంత ఆరో గ్యమో, వాగ్గేయకారునికి మధ్యలో సరికొత్త ‘ఎత్తుబడి’కి అంతే అవసరం. ఈ విరామం విషయంలో యూరప్‌లో స్యూయెన్‌బర్గ్-స్ట్రావిన్‌స్కీ; బ్రామ్స్-వాగ్నెర్‌ల మధ్య ఎన్ని వాదోపవాదాలు సాగాయో, మన దక్షిణాదిన బాల మురళి-బాలచందర్ మధ్య కూడా అలాగే తలెత్తాయి.
 
అక్కడ ‘ట్వెల్వ్ టోన్ వర్క్స్’ను మ్యూజిక్ ఆప్ ఇంట ర్వల్స్ అన్నారు. కనుకనే స్యూయెన్‌బర్గ్ ‘స్వర కల్పన అంటే నీలోని అంతర్వాణిని ఆదరించుకోడమే’గానీ మూడోవాడి జోక్యాన్ని సహించడం కాదు అన్నాడు. కేవలం జానపద గీతాల ద్వారా ప్రత్యామ్నాయ సంగీత బాణీలను సమకూ ర్చిన మైఖేల్ గ్లింకా.. జారు చక్రవర్తిని కూడా సమ్మోహితం చేసిన దేశభక్తియుత సంగీత నాటకాన్ని రచించాడు.
 బరోడిన్ రంగం మీదికి వచ్చిన తర్వాతే ‘సంగీతంలో స్తబ్దత’ కాస్తా వదిలిపోయిందన్నాడు జర్మన్ విమర్శకుడు అభీలిజ్. అలాగే మన వర్ణ, స్వర ప్రబంధకర్త బాలమురళి కూడా రామదాసు కీర్తనల నుంచి రాఘవేంద్ర స్వామి స్తుతి వరకూ, త్యాగరాజు సంస్కృత కృతుల నుంచి ఉమా శంకర స్తుతి మాల వరకు సంప్రదాయంలోనే సమ్మతమైన సంస్క రణలు తెస్తే ఎందుకింత సణుగుడు?
 (కర్ణాటక సంగీతంలో బాలమురళి సంస్కరణలపై 31 ఏళ్ల క్రితం -13.10.85- భావమురళి శీర్షికన ఏబీకే ప్రసాద్ రాసిన వ్యాసం)

ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement