గాన గంధర్వుడు
జీవన కాలమ్
ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవలక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టుంటుంది.
త్యాగరాజస్వామి ఐదో తరం గురు సంపద నాకు దక్కిన అదృష్టం- అని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గర్వపడ్డారు... గతంలో నేను సంపాద కత్వం వహించిన ‘సురభి’ పత్రికకి ఇంట ర్వ్యూలో. బాలమురళి గురువులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకి మానాంబుచావిడి (ఆకుమళ్ల) వెంకట సుబ్బయ్య సంగీత భిక్ష పెట్టారు. అంతకుముందు మరీ చిన్న తనంలో తండ్రి పట్టాభిరామయ్య ఏకైక సంతా నంగా ప్రతీరాత్రీ పక్కనే పడుకుని ఆయన చెప్పే సరళీస్వరాలు, జంట స్వరాలూ, వర్ణాలూ - అన్నీ ‘జ్ఞాపకం’ చేసుకున్నారు. ఏడో యేట గురువు ఉంటే మంచిదని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకు తీసుకెళ్లారు. ‘ఏదీ, నీకొచ్చిన పాట ఒకటి పాడు’ అన్నారాయన. పాడారు. వీడిని ఇంట్లో దింపి మధ్యాహ్నం రమ్మన్నారాయన. వస్తే ‘వీడికి చెప్పవలసిందేం లేదు. వచ్చినవి మననం చేసుకోవడమే’ అన్నారట.
1939 జూలై 6న మొదటి కచ్చేరీ. సభలో నాన్న, గురువు ఉన్నారు. 9 నుంచి ఒక గంట సాగాలి. పదిన్నరయినా సాగుతోంది. గురువు వేదిక మీదికి వచ్చి కుర్రాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి దిష్టితీయమన్నారు. తర్వాత ముసునూరి సత్యనారాయణ భాగవతార్ హరికథ చెప్పాలి. చెప్పలేనని ఆయన వేదిక దిగిపోయారు. పట్టాభి రామయ్య మురళి వాయించేవారు. కొడుక్కి ‘ముర ళీకృష్ణ’ అని పేరు పెట్టుకున్నారు. ముసునూరి సూర్యనారాయణ పేరులో ‘బాల’ కలిపారు ఆ రోజు. ఆ విధంగా బాలమురళీకృష్ణ అయ్యారు.
తర్వాత తిరువయ్యూరులో దిగ్దంతుల ముందు అలవోకగా పాడే కుర్రాడిని చూసి అబ్బుర పడి వీణ ధనమ్మ ఎత్తుకుని తనతో తీసుకుపోయి దిష్టి తీసిందంటారు. వారి ఇంటి ఎదుటి సత్రంలో వారి గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వామి విడిది చేశారు. చాతుర్మాస దీక్ష చేస్తు న్నారు. బాలమురళికి కబురు పంపించారు. ‘ఒక్క మాట చెప్తావా? త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేదంటావు?’ అన్నారు. ఒక క్రమబద్ధమైన ధోరణిలో లేదన్నారు. ‘ఆయన ఇదివరకెన్నడూ చేయనిది, చేయలేనిదీ చేశారు. చరిత్రలో మిగి లారు. ఆ పని నువ్వూ చెయ్యి’ అన్నారు. అప్పుడా యనకి 16. మరో రెండేళ్లలో 72 మేళ కర్త రాగాలలో కృతులు చేశారు. అది అప్పటికీ ఇప్పటికీ అపూర్వం. అనితర సాధ్యం. ఆయన జీవితమంతా అనితర సాధ్యమైన సంగీతాన్నే ఆరాధించారు.
బహుశా ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవ లక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టు ఉంటుంది. ఆయనలో చిలిపితనం ఉంది, సరదా ఉంది. ప్రతీ క్షణాన్నీ అనుభవించే ‘సరసత’ ఉంది. తాను ఆనం దిస్తూ పాడతారు. ఆ ఆనందాన్ని రసికునికి పంచి ఆ క్షణాన్ని అజరామరం చేస్తారు. దాదాపు 53 ఏళ్ల కిందట - విజయవాడ రేడియో కేంద్రం ‘భక్తిరంజని’ విని రంజించని వారె వరూ లేరు. జాతీయ స్థాయిలో ఆ కార్యక్రమం పరిమళించింది. ఆ గుబాళింపుకి అధ్యక్షుడు బాల మురళి. ఇంకా శ్రీరంగం గోపాలరత్నం, వింజ మూరి లక్ష్మి, వీబీ కనకదుర్గ, ఎమ్‌వీ రమణమూర్తి, సూర్యారావు ప్రభృతులు ఉండేవారు. ఉదయమే అహిర్ భైరవిలో ‘పిబరే రామరసం’ అంటే శ్రోతల హృదయాల్లో రామరసం చిప్పిల్లేది. ఈ విందుకి కారకులు - మరొక మహానుభావుడు - ఇంకా విజ యవాడలో ఉన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావుగారు. ఆయనకిప్పుడు నూరేళ్లు.
ఆయన సంగీత ప్రపంచంలో ఏమి చేశా రనికాదు. ఏమి చెయ్యలేదని ప్రశ్నించుకోవాలి. భీంసేన్ జోషీ, అజయ్ చక్రవర్తి వంటి వారితో ‘జుగల్‌బందీ’కి శ్రీకారం చుట్టారు. అవి అపూర్వ మైన కచ్చేరీలు. స్వరశ్రీ, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించారు. ఇక - సంగీత రచనలో ఆయనకి ఆయనే సాటి. నాటలో ‘అమ్మ’ వర్ణం వింటే పులకించిపోతాను. రామప్రియ మరొక కళా ఖండం. కదన కుతూహలం తిల్లాన - ఇలా ఏరడం వారి దిషణకి అన్యాయం చేసినట్టు. మా ఇంట్లో దసరా నవరాత్రులకు బొమ్మల కొలువు ప్రత్యేకత. 2008 ఆగస్టు 10న సతీ సమే తంగా వచ్చారు. వారికి పాదాభివందనం చేసి శాలువా కప్పాను. నాకు చాలా ఇష్టమైన ఆయన రచనని పాడమన్నాను. కానడలో ‘బృహదీశ్వర మహాదేవ!’ నా చేతిని ఆప్యాయంగా పుచ్చుకుని పాడారు. ఆయన పాటలో, రచనలో ఈ జన్మకే పరి మితం కాని ఉపాసనా బలమేదో కనిపిస్తుంది.
ఆఖరుసారి విశాఖపట్నం బీచిలో విశ్వప్రియ హాలులో ఇస్కాన్ ఉత్సవాలలో పాడారు. పాట సాహిత్యం మరిచిపోతున్నారు. వృద్ధాప్యం ఓ జీనియస్‌ని ఏమారుస్తోంది. కానీ ఆయన లొంగడం లేదు. సాహిత్యం జ్ఞాపకానిది. ఉద్దతి జీన్స్‌ది. కాస్సే పయాక సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసు దేవాచార్ ‘దేవాదిదేవ’ ఎత్తుకున్నారు. అంతే. నభూతో నభవిష్యతి. అది ఒక మహాగాయకుడి విజృంభణ. బాలమురళీకృష్ణ ఈ తరం సంగీతానికి అధ్య క్షుడు. ఏతరంలోనయినా కనిపించని అరుదైన గంధర్వుడు. A complete musical genius.
గొల్లపూడి మారుతీరావు