gollapudi maruti rao
-
కుమారుని మరణం కుంగదీసింది
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కన్నుమూతపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ ప్రతిభాశాలికి నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు, మారుతిరావుకి సన్నిహితుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ గొల్లపూడి అస్తమయం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఆయనను చిన్న కుమారుడు శ్రీనివాస్ ఆకస్మిక మరణం బాగా కుంగదీసిందన్నారు. గొల్లపూడి మరణం పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆయన భార్యకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన నటులలో గొల్లపూడి మారుతిరావుగారు ఒకరని టాలీవుడ్ హీరో నాని ట్వీట్ చేశారు. ఆయన మాట్లాడేతీరు, నటించిన తీరు ఆకట్టుకుంటుందని, ఆయన సాన్నిహిత్యం మరువలేనిదని పేర్కొన్నారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందిస్తూ హ్యాపీడేస్ సినిమాకు ముందు ఒక చిన్న సినిమాలో ఆయనతో కలిసి నటుడు కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాననీ, ఆ సందర్భంగా ఆయన మార్గదర్శకత్వం, సలహాలు ఎప్పటికీ తనతోనే శాశ్వతంగా ఉంటాయంటూ గొల్లపూడిని గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన సినిమాలు, నటనతో ఆయన మన గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్ చేశారు. దీంతోపాటు ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కాగా గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు.1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన మారుతీరావు వివిధ కళారంగాల్లో తనదైన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారు. రచయితగా, నటుడుగా, జర్నలిస్ట్, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాలలో విశిష్ట సేవలందించారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులతోపాటు, ఇతర ప్రముఖులు కూడా సంతాపం వెలిబుచ్చారు. Gollapudi Maruthi Rao gaaru, one of my most favourites. The way he spoke and the way he acted always felt so familiar and family like. You will always be remembered Sir 🙏🏼 — Nani (@NameisNani) December 12, 2019 Worked as an actor come Assistant director with Sir on a small movie before Happy Days.. the guidance and advice he gave me then is still with me... Rest in Peace sir.. you are always immortal and with us in the form of your brilliant movies 🙏🏽 Gollapudi Maruti Rao garu 🙏🏽 pic.twitter.com/Jwzt5csokB — Nikhil Siddhartha (@actor_Nikhil) December 12, 2019 -
గొల్లపూడికి ఉపరాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై : జ్వరంతో చెన్నైలోని లీమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం పరామర్శించారు. గొల్లపూడి కుటుంబ సభ్యులను ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, గొల్లపూడి ఆరోగ్యం కుదుటపడిందని బుధవారం డిశ్చార్జ్ కానున్నారని ఆయన కుమారుడు రామకృష్ణ తెలిపారు. సునిశతమైన విమర్శకు, ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వెల్లడించడంలో గొల్లపూడి పెట్టింది పేరని వెంకయ్య అన్నారు. ఆయన త్వరలోనే కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలను పొందాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. -
వ్యవస్థ విలువ
ఏ రోజు పేపరు తెరిచినా ఈనాటి దేశ పాలన ఆయా ప్రభుత్వాలు కాక సుప్రీం కోర్టు, చాలాచోట్ల హైకో ర్టులు నిర్వహిస్తున్నాయనిపి స్తుంది. తెల్లవారి లేస్తే ఫలానా పరీక్షలలో అయిదు మార్కులు కలపాలా వద్దా, గవర్నరుగారు ఇచ్చిన తాఖీదు ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత కాలం ఉండవచ్చు, కలిసి ఒక గదిలో బతికే అమ్మాయి, అబ్బాయి ఎంత కాలానికి భార్యాభర్తలనిపించు కుంటారు, అరెస్టయిన ఫలానా వ్యక్తి నేరస్తుడు అవునా? కాదా? చిన్న పిల్లల పునరావాసాలపైన నిబంధనలు సబబా, కాదా? ఫలానా నీటి పారుదల కాలువ పక్కన మరుగుదొడ్డిని నిర్మించవచ్చా, కూడదా?– ఈ విషయాలన్నింటిపై న్యాయం చెప్పా లని సుప్రీంకోర్టును వ్యాజ్యాల ద్వారా అభ్యర్థించారు. ఈ మధ్య డీఎంకే నేత ఎం.కరుణానిధి తమిళ నాడులో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. దేశమంతా నివాళులర్పించింది. ఆయన 13 సార్లు శాసనసభకి ఎన్నికై, అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవ చేశారు. ఒక పక్క శవం ఉండగా ఆయన పార్థివ శరీరానికి మెరీనా బీచ్‌లో అంత్య క్రియలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని అర్థించారు. ముఖ్యమంత్రి కారణాలు చెప్పి కాదన్నారు. రాత్రికి రాత్రే మద్రాసు హైకోర్టు విచారణ జరిపి, మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు జరపడానికి అనుమతిని ఇచ్చింది. బయటవారికి కనిపించేది పాలకవర్గం వ్యతి రేకతో, చట్టపరమైన అభ్యంతరం మాత్రమే కాదు, ఒక పక్క దేశ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, విదేశీ ప్రముఖులు నివాళులర్పిస్తుండగా, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే ప్రభుత్వం న్యాయస్థా నంలాగా పెద్దరికం చూపలేకపోయిందే అని. ఒక అనూహ్యమైన, అద్భుతమైన విషయం. సాలీనా 160 లక్షల పోలీసు కేసులున్న బిహార్ దక్షిణ ప్రాంతంలోని ‘పాడియా’ అనే గ్రామవాసులు ఇంత వరకూ న్యాయస్థానం ముఖం చూడలేదు. గత 100 సంవత్సరాలలో ఒక్కటి ఒక్కటంటే ఒక్క పోలీసు కేసు లేదట. ఇది ఈనాటి భారతదేశంలో తగాదాలు లేని, మధ్యవర్తి అవసరం రాని జీవితం గొప్ప సంస్కారం. ఇది ఒక గ్రామం ఒక శతాబ్దంగా పాటిం చడం, అదిన్నీ మన దేశంలో గొప్ప విడ్డూరం. న్యాయ వ్యవస్థ మనకు మనం ఏర్పాటు చేసు కున్న ‘నియతి’. ఆ వ్యవస్థ మన సంస్కారానికీ, పరి ణతికీ సూచిక. అయితే ఆ వ్యవస్థ తప్ప మన నిర్ణ యాలకీ, జీవన విధానానికీ గతిలేని స్థితిని తెచ్చు కోవడం ఆ వ్యవస్థ పతనానికి నిదర్శనం. మనం ఏర్పరచుకున్న న్యాయస్థానం గొప్ప విచక్షణ, నిష్పక్ష పాత వైఖరి గల వ్యవస్థ. మన తలకు మించిన సమ స్యలకి దాన్ని ఆశ్రయించడం మన లక్ష్యం. ఏ రామ మందిరం తగాదానో, ఏ ముస్లిం విడాకుల సంప్రదా యమో, కశ్మీరులో 370 అధికరణ ఆవశ్యకతో– ఇలాంటివి సుప్రీంకోర్టు నిర్ణయించి తీర్పు ఇవ్వాల్సిన గంభీరమైన సమస్యలు. ఫలానా పరీక్షలో అయిదు మార్కులు కల పాలా? రహదారి బంగళా పక్క సారా దుకాణం ఉండాలా? వంటి అతి సామాన్య సమస్యల పరిష్కా రానికి కాదు. మరి ఇప్పుడాపనే జరుగుతోంది. ఈ దేశాన్ని పాలక వ్యవస్థ కాక అతి ముఖ్యమైన కొండ కచో నవ్వు పుట్టించే, చాలాసార్లు నవ్వులపాలు చేసే సమస్యల పరిష్కారం ఈ వ్యవస్థ మీద పడింది. ఫలానా జాతీయ గీతం ఫలానా చోట వెయ్యాలా వద్దా? అప్పుడు మనం నిలబడాలా, అక్కరలేదా? ఇది వ్యవస్థలో చిత్తశుద్ధి, విచక్షణ లేకపోవడానికి నిద ర్శనమని నాకనిపిస్తుంది. కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ గొప్ప కథ. వివరాలు అలా ఉండగా స్థానికులు అంగీక రించిన ఊరిపెద్ద శ్రీరాములు నాయుడు ఆ ఊరిలో చిన్న రైతు అప్పలరాముడు అప్పు గురించి నిర్ణ యాన్ని చెప్తాడు. కథంతా ఆ నిర్ణయం పర్యవ సానాన్ని గురించి. ఆ నిర్ణయానికి తలొంచడం ఆ గ్రామం ‘కట్టుబాటు’. నాయుడి తీర్పు విన్నాక పర్య వసానం కథ. అలా కాక అప్పలరాముడు రొమ్ము విరిచి ‘ఇలా నిర్ణయించడానికి నువ్వెవరయ్యా?’ అన్నా, ‘ముందు పట్నంలో నీ మూడో పెళ్లాం సంగతి తేల్చు’ అని బోర విరిస్తే అది మరొక కథ. ఓ గొప్ప విలువ పతనం. ఏమిటీ ఈ విపరీతం? ఏమయింది ఈ వ్యవ స్థకి? ఒకరిపట్ల ఒకరికి, ఒక వ్యవస్థపట్ల గౌరవం, నమ్మకం, మర్యాద లుప్తమవడమే ఇందుకు నిద ర్శనం. ప్రతీ విషయానికీ సుప్రీంకోర్టుని ఆశ్రయిం చడం, క్లిష్ట సమస్యపై తీర్పు చెప్పాలని అభ్యర్థిం చడం గడుసైన వ్యవహారం. వ్యవస్థను బెదిరించి నడి పించడమే. మనం ఏర్పరచుకున్న గొప్ప వ్యవస్థ మన విశ్వాస రాహిత్యం, విచక్షణా రాహిత్యం, దుర్విని యోగం, నవ్వు పుట్టించే ఆకతాయి వ్యాజ్యాల కార ణంగా మరుగుదొడ్లు, దెయ్యాల స్థాయికి తీసుకువస్తే ఏమవుతుంది? ఏ రోజు పేపరు తెరిచినా అందుకు వంద సమాధానాలు దొరుకుతాయి. గొల్లపూడి మారుతీరావు -
నిశ్శబ్ద విప్లవ వీరులు
మనం తెల్లారిలేస్తే రాబ్రీ దేవి, ఆమె ముద్దుల తనయుడు తేజస్వీ యాదవ్ జైలుకి వెళ్తారా లేదా? విజయ్ మాల్యాని మన దేశానికి ఎప్పుడు తీసుకు వస్తారు. – ఇలాంటి ఆలోచ నలతో సతమతమవుతూ ఉంటాం. ఇవి మనకి సంబం ధించిన, మన జీవితాలను ప్రభావితం చేసే సమస్యలు కావు. అయినా ఆలోచించడం మనల్ని కృంగదీసే వ్యస నం. కానీ మరొకపక్క నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. కొత్త యోధులు– ప్రమేయం లేని వీరులు ఈ సమా జాన్ని, దేశాన్నీ ప్రభావితం చెయ్యబోతున్నారు. ఆ అమ్మాయి – స్వప్నా బర్మన్ – రెండు కాళ్లకీ ఆరేసి వేళ్లు. బెంగాలులో అతిపేద కుటుంబంలో పుట్టింది. ఆ పిల్ల తండ్రి రిక్షా లాగుతాడు. తల్లి తేయాకు తోటల్లో రోజుకూలీ. వాళ్లు ఒక రేకుల షెడ్డులో బతుకుతారు. దైనందిన జీవినమే వారి సమస్య. కానీ ఫొటోలో ఆ పిల్ల నవ్వు – దైనందిన సమస్యల్ని లెక్కచేయని, ఆకాశంలోకి మోర సారించే ఓ యోధురాలి ‘విశ్వాసా’నికి ప్రతీక. మొన్నటి ఆసియా క్రీడల పోటీలలో– హెప్ల థాన్ అనే క్రీడ ఒకటుంది. ఇది కొన్ని రకాల క్రీడల సమగ్ర రూపం– 100 మీటర్ల హార్డిల్స్, హైజంప్, ఇనుప గోళాన్ని విసిరే ‘షాట్ పుట్’, లాంగ్ జంప్, జావలిన్, 800 మీటర్ల హార్డిల్స్– ఇలాగ. వీటన్నిం టినీ కలిపితే– హెప్లథాన్. క్రీడ అన్నివిధాలా కడుపు నిండిన వ్యక్తి వినోదం. కానీ బయటి ప్రపంచపు వికారాలకు దూరంగా, పేదరికంలో, శారీరక అవలక్షణా లతో మగ్గే ఓ అమ్మాయి కాలివేళ్లతో సరైన జోళ్లు లేక నరకయాతన పడుతోంది. మంచి జోళ్లు కొనుక్కునే ఆస్కారం లేదు. అవకాశం లేదు. అయినా ఈ ప్రతికూల లక్షణాలతో, పగిలిన దవడకి బాండేజీతో ఈ క్రీడమీద ఆధిపత్యాన్ని సాధించింది. దేశీయ స్థాయిలో ఆ క్రీడలో పాల్గొని ఆసియా క్రీడలలో స్వర్ణ పతకాన్ని సాధించి– ఈ దేశ పతాకాన్ని అంతర్జాతీయంగా ఎగురవేసింది. ఆమె చిరు నవ్వులో పేదరికం లేదు. ఆకలి లేదు. అవసరాలు లేవు. ప్రపంచాన్ని జయించే విజయోత్సాహం ఉంది. ఈ విజయం తర్వాత దేశం మేలుకొంది. ఆమె కాళ్లకు సరిపోయే జోళ్లను తయారు చేయించి ఇవ్వడానికి తమిళనాడులో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చింది. మన వర్తమానాన్ని గజిబిజి చేసే కుళ్లు నాయ కత్వంతో తలమునకలవుతున్న ఈనాటి వ్యవస్థలో సాహసాన్నీ, ఆశనీ, విశ్వాసాన్నీ నింపే గొప్ప యోధులు వీరు. ఇంకా కింది దశలకు వెళ్తాను. 15 ఏళ్ల కిందటి కథ. మా ఇంట్లో ఓ వంట మనిషి. భర్త తాగుబోతు. ఇద్దరు ఆడపిల్లలు. తాగుబోతు భర్తని దూరంగా తగిలేసింది. ఈ ఇంటికి వంటకి వచ్చినప్పుడు– ఏడె నిమిదేళ్ల ఈ ఇద్దరు పిల్లల్నీ అల్లరి చెయ్యకుండా– ఇంటి బయట గోడ దగ్గర కూర్చోపెట్టేది. వారికి వారి పేదరికం తెలుసు. తమ పరిమితి తెలుసు. బుద్ధిగా కూర్చొనేవారు. మా ఆవిడ ఎప్పుడైనా ఏదైనా ఇస్తే తినేవారు. మా మనుమ రాళ్ల బట్టలు ఇస్తే వేసుకునే వారు. పలకరిస్తే పలికే వారు. లేకపోతే కుంచించుకపోయి– తమ ఉనికి మరొకరిని బాధించకుండా ఆ గోడకి ఒదిగిపోయేవారు. తల్లి పని పూర్తయ్యాక– నిశ్శబ్దంగా చెయ్యి పుచ్చుకు నడిచిపోయేవారు. ఏమవుతారు ఈ పిల్లలు? చదువుకుంటారా? వీళ్లూ వంటలు చేస్తారా? అది హీనమైన పనేం కాదు. అయినా రెండో తరానికి వార సత్వంగా ఇచ్చే పనేనా? ఎప్పుడైనా మనస్సులో కదిలేది. 15 ఏళ్ల తరువాత వీళ్లిద్దరూ పోస్టు గ్రాడ్యు యేట్లయ్యారు. బియ్యే తరువాత కాలేజీ వీళ్లని పిలిచి స్కాలర్‌షిప్పు లిచ్చింది. 40 ఏళ్ల కిందటిమాట. మరొక పేద ఇల్లాలు. ఒక మహా కర్ణాటక విద్వాంసుని దూరపు బంధువు. మేం మద్రాసులో ఉన్న రోజుల్లో మా ఇంటికి వచ్చేది. మా ఆవిడకి వంటలో తోడుగా నిలిచేది. జీతానికి కాదు. బియ్యం నూకలు ఇస్తే కొంగున కట్టుకువెళ్లి పిల్లలకు వండిపెట్టేది. ఒక్కోసారి అక్షింతలు పోగుచేసి, కడిగి వండి– అందరికీ వేర్వేరుగా వడ్డిస్తే సరిపోదని ఒక కంచంలో అన్నం కలిపి పిల్లల నోటికి అందించేది. ఆ పిల్లలు సౌందర్యవంతులు. తర్వాతి కాలంలో ఓ పారి శ్రామికవేత్త ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి మేం వెళ్లాం. ఇప్పుడామె కోటీశ్వరురాలు. కుర్రాడు పెన్నుల కంపెనీలో ఆఫీసరు. ఎప్పుడూ ఓ పెన్నుల పార్శిలు పట్టుకుని నన్ను కలుస్తాడు– ‘మీరు మాకు అన్నం పెట్టారు మామయ్యగారూ’ అంటూ. పేదరికం రెండో పార్శ్వమిది. ఒకరు ఆత్మ గౌర వంతో మంచి జీతానికి నిచ్చెనలు వేస్తూ సమా జాన్ని ఆరోగ్యవంతంగా నిలుపుతున్నారు. మరొకరు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్నారు. వీరు ఉల్ఫా నాయ కులు కారు. ఇది దేశాన్ని కొల్లగొట్టే అవకాశవాదుల కథ కాదు. స్వప్నా బర్మన్ కథ ఈ దేశానికి విజయపతాక. కళ్లు మిరుమిట్లు గొలిపే నిశ్శబ్ద విప్లవానికి సంకేతం. బంగారు కాంతులతో మెరిసే తూర్పు. గొల్లపూడి మారుతీరావు -
మెజారిటీ సంతానం
ఉత్తరప్రదేశ్ భాలియా జిల్లాలోని భైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ దేశభక్తుడు. అంతేకాదు. హిందూ దేశభక్తుడు. నానా టికీ నియంత్రణ పేరిట తగ్గి పోతున్న హిందూ జనాభాకి ఆయన బాధపడి ఒక మార్గాన్ని సూచించారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తీ– హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అయిదుగురు పిల్లల్ని కనాలని. మరి ఆ అయిదుగురూ ఎవరు? ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. మరొక బిడ్డ? స్పేర్ట! అప్పుడు మెజా రిటీ హిందువులకి దక్కుతుందని వారు వాక్రుచ్చారు. జాతీయ జనాభా ప్రణాళిక ప్రకారం జనాభాను నియంత్రించే పనిని ఒక పక్క ప్రభుత్వం చేస్తుండగా సింగ్ వంటి దేశభక్తులు ‘స్పేర్’ పిల్లల్ని కని పెంచా లని సందేశాన్నిస్తున్నారు. ఇలాంటి వారికి– జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలీదు! నా పెళ్లి నాటికి మా నాయనమ్మకి 90 ఏళ్లు. ఇది 57 సంవత్సరాల కిందటిమాట. నాకు పెళ్లయి, ఆమె ఆశీర్వాదానికి వస్తే– మా ఇద్దర్నీ తడివి ‘వందమంది సంతానాన్ని’ కనమని ఆశీర్వదించింది. ఇందులో తేలికగా 50 స్పేర్లున్నాయి. అంటే సురేంద్రసింగ్ ఆలోచనా ధోరణి– 57+90 నాటిది. ఈ దేశానికి రెండో లోక్‌సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ని నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చూసేవాడిని. వారికి 14 మంది సంతానం. వారి అల్లుడు, ఆనాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు ఆత్మీయులు– కె. రామస్వామి అయ్యంగార్‌కి 18 మంది సంతానం అనుకుంటాను. స్పేర్ల ఆలోచన లేని రోజులవి. కాలాన్ని బట్టి, మారే వ్యవస్థని బట్టి, వర్తమాన జీవన సరళిని బట్టి– ఆలోచనా ధోరణిని సవరిం చుకోలేని ఎందరో సింగులు మనకి ఉత్తర దేశంలో– ముఖ్యంగా బీజేపీలో కనిపిస్తారు. బీజేపీలోనే ఎందుకు? బాలెట్ పెట్టెనుంచి, పదవి దాకా ‘పాకే’ అవకాశాన్ని– వీరి ప్రమేయం లేకుండా నరేంద్ర మోదీ అనే పెను తుఫాన్ ఇలాంటి వారికి కల్పిం చింది కనుక. ‘హిందూ’ ప్రాముఖ్యతపై వీరు చేసే ఆలోచనలకు ఇన్నాళ్లకి రోజులొచ్చాయని అనుకునే సింగులు బోలెడంతమంది ఉన్నారు. లేకపోతే ‘స్పేర్’ ఆలోచనలతో– ఇలాంటివారు– తమ మాట లని ప్రజలు వినే అర్హతని కూడా సంపాదించుకోలేక పోయేవారు. ఈ సింగు గారే– నిన్నటికి నిన్న– బీఎస్పీ నాయ కురాలు మాయావతిని గౌడు గేదెతో పోల్చారు. అప రిశుభ్రత, దుర్వాసన ఇలాంటి వాటిని ఉటంకిం చారు. చాలా అమర్యాదకరమైన, అహంకారపూరి తమైన– ఇలాంటి ప్రసంగాలు– అటు పార్టీకీ, ఇటు వ్యక్తికీ చెప్పరాని అన్యాయం చేస్తాయి. మరి వీరి ‘వాచాలత్వానికి’ అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎవరయి నా– కేంద్ర నాయకులు చేస్తున్నారా? మనకు తెలీదు. వీరు కాలదోషం పట్టిన ఊరగాయలాంటివారు. ఒక ప్పుడు ‘రుచి’గా ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు పూర్తిగా మురిగిపోయింది. ఇవాళ– ‘హిందూ మెజా రిటీకి స్పేర్ సంతానాన్ని కనే ఆలోచన– హాస్యాస్ప దమే కాక, కొంతలో కొంత ప్రమాదకరం కూడా. ఈ ఊరగాయలన్నింటినీ ఒకచోట సమావేశపరిచి– గట్టి పాఠాన్ని అమిత్ షా పీకాలని నాకనిపిస్తుంది. ఈ సందర్భంలో అతి ఉదాత్తమైన, అపురూ పమైన– జ్ఞాపకాన్ని ఉటంకించాలని మనస్సు ఆరా టపడుతోంది. చాలా దశాబ్దాల కిందట ఢిల్లీలో జరి గిన ప్రపంచ చలన చిత్రోత్సవంలో జపాన్ దేశపు చిత్రాన్ని చూశాను. ఆ ఉత్సవాలకి వచ్చే చిత్రాలు– ఆ దేశ స్థాయిలో ఉన్నవి, దేశ వైభవాన్ని చాటేవి. ప్రపం చానికి సందేశాన్నిచ్చేవి. ఈ చిత్రం ఒక దేశ భక్తుడి కథ. ఎటువంటి దేశ భక్తుడు? అప్పుడున్న రాజకీయ వాతావరణంలో తమ దేశాన్ని కాపాడే దమ్ము, శక్తి, ఆదర్శాన్ని పుణికిపుచ్చుకోగల వీరులను ప్రస్తుతం కనే అవసరం ఉందని నమ్మే ఒక వ్యక్తి. ఆనాటి యువ తరం వీర్యాన్ని పరిపుష్టం చేసే వీరవనితలను సమీక రించి– ఆనాటి యువ కిశోరాలు కొత్త తరానికి జన్మ నిచ్చే ఉద్యమాన్ని చేపట్టిన వీరుడు. ఆలోచనలో ఎక్కడా అపశ్రుతి లేదు. ఆచరణలో ఎక్కడా అప భ్రంశం లేదు. ఎంతసేపూ దేశ భవిష్యత్తు, దేశభక్తుల ఆదర్శానికి ఏ మాత్రమూ తీసిపోని– ఓ వ్యక్తి కథ. తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే చిత్రోత్సవంలో భాగం. అస్మదాదులం ఒక్క క్షణం బిత్తరపోయాం. కానీ ఆనాటి 3 గంటల చిత్రంలో ఎక్కడా ఎబ్బెట్టు తనం లేదు. సినిమా ఆద్యంతమూ కత్తిమీద సాము. ఒక్క ఫ్రేము ఎక్కువైతే కథా నాయకుడు తార్పుడు గాడు అయిపోతాడు. తూకంలో నడిస్తే దేశభక్తుడవు తాడు. ఇది దేశభక్తుడి కథ. ఒక మహర్దర్శకుని సృష్టి ఆనాటికి. న్యాయంగా ఈ కథకీ, సింగుగారి వాచాల త్వానికీ పొంతన లేదు. కానీ అపశ్రుతిని, అశ్లీలతని సమాజయోగ్యం చేసి, కళగా మలిచిన ఓ మహా దర్శ కుని కృషిని ఈ క్షణంలో గుర్తు చేసుకోవడం అసం దర్భం కాదనుకుంటాను. గొల్లపూడి మారుతీరావు -
సంపంగి పువ్వులు
జీవన కాలమ్ అర్హత అరటి చెట్టులాంటిది. అరటి చెట్టు శరీర మంతా మనిషికి ఉపకారం చేస్తుంది– కాయ, పండు, ఆకు, దూట, ఆఖరికి దొప్ప కూడా. ఆర్జన వారకాంత లాంటిది. సంపంగి పువ్వు. మత్తెక్కిస్తుంది. మరులు గొలుపుతుంది. ఇంకా లేక పోతే ఎలాగ అనిపిస్తుంది. అనిపించేలోగానే ఇంకా లేకుండా పోతుంది. అర్హత పెద్దమనిషి. నమ్మకంగా సేవ చేస్తుంది. ఆర్జన పెద్ద ఆకర్షణ. నమ్మకంగా దాన్ని పట్టుకు వేలాడాలని పిస్తుంది. రాజకీయ నాయకులకు ‘వాస్తు’ మీద అపారమైన నమ్మకం. కారణం– వారి పదవులు ‘ఆర్జన’. లాల్ బహదూర్ శాస్త్రి వాస్తు గురించి ఆలోచించినట్టు మనమెవరమూ వినలేదు, అలాగే అబ్దుల్ కలాం. వాస్తు మాత్రమే కాదు. నేటి రాజకీయ నాయకులు చాలామందికి చాలా విషయాలమీద అపనమ్మకం. ఉదాహరణకి కర్ణాటక పబ్లిక్ వర్క్స్ మంత్రి రేవన్న మంత్రిగా ఉన్నంతవరకూ బెంగుళూరు బంగళాలో నిద్రపోరాదని జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అందు వల్ల ఆయనేం చేస్తాడు? రోజూ 7 గంటలు– 370 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన సొంతవూరు హోలె నరసిపురా ఇంట్లో పడుకుని నగరానికి వస్తాడు. ఒకప్పుడు జయలలిత అమ్మగారి నమ్మకాలు ఊహించలేనివి. ప్రతీ రోజూ–రోజుకో రంగు చీరె. సోమవారమయితే–ఆకుపచ్చ–ఇలాగ ఇక ఆఫీసులో ఆమె కుర్చీ ఎప్పుడూ తూర్పు వైపు ఉండాలి. రోజూ బీచ్‌లో కణ్ణగి విగ్రహం ముందునుంచి వెళ్లడం ఆమెకు బొత్తిగా నచ్చేది కాదు. దాన్ని ఏవో కార ణాలకి తీయించేశారు. రాజకీయ దుమారం రేగింది. దరిమిలాను అది డీఎంకే ఆఫీసుకి చేరింది. ఈ వ్యవ హారం బయటపడి–మరో విగ్రహాన్ని పెట్టక తప్పింది కాదు. అన్నగారు తన రోజుల్లో పాత రోజుల్నాటి సెక్రటేరియట్ ప్రవేశ ద్వారం గుండా వెళ్లడం మంచిది కాదని ఎవరో వాస్తు నిపుణులు చెప్పారట. తదాదిగా వారి పరిపాలనంతా ఇంటి దగ్గర నుంచే సాగింది. ట్యాంక్‌బండ్ వైపు ద్వారం తెరిచాక సెక్ర టేరియట్కి వచ్చారంటారు. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు అందరికన్నా ఎతైన భవనంలో ఉండాలని వాస్తు. అందుకని కొత్త కాంప్లెక్స్‌లో ఐదు ఫ్లోర్లు, ఆరు ప్రత్యేకమైన బ్లాకులు ఉన్న భవనాలు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఒక నమ్మకం ఉంది. పదవిలో ఉండగా నోయిడాకి వస్తే ఆ పదవి పోతుందని. అఖిలేష్ యాదవ్ పదవిలో ఉండగా ఆ వేపు కూడా చూడలేదట. ఒక్క వ్యాపారి నమూనా. విశాఖపట్నంలో కోట్ల వ్యాపారి. తిరుగులేదు. కానీ తొలి రోజుల్లో ముఖ ద్వారం వాస్తు ప్రకారం చాలా నాసిరకం అని శాస్త్ర జ్ఞులు తేల్చారు. మరి ఎలాగ? ఆ భవనానికి ఈశా న్యం మూల ఓ చిన్న గుమ్మం ఉంది. అది ఆ భవ నంలో పక్క సందులోకి పోతుంది. అయితే అది వాస్తు ప్రకారం మహత్తరమైన ప్రవేశ ద్వారం. ఇప్ప టికీ దుకాణాన్ని మొదట ఆ గుమ్మాన్ని తెరిచి లోనికి వెళ్లాకనే పెద్ద తలుపులు తెరుస్తారు. చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌గారు ఓ సరదా అయిన కథ చెప్పారు. ఓ హైదరాబాద్ రాజకీయ నాయకుడు ఆయన్ని కలిసి తన ఇంటిముందున్న మర్రి చెట్టువల్ల తనకి పదవి రావడం లేదని దాన్ని కొట్టించమని కోరారట. రంగ రాజన్‌గారు నవ్వి ‘అయ్యా.. చెట్టు తీసేయడం కాదు. రోజూ చెట్టుకి పూజ చెయ్యండి. పదవి వస్తుంది’ అన్నారట. మరో నాలుగు నెలలకి ఆయనకి నిజం గానే పదవి వచ్చింది. చెట్టుకి పూజలందాయి. భారతదేశం తరువాత అంత భారతీయత కనిపించే మరొక దేశం నేపాల్. నా మట్టుకు– భారత దేశం కన్నా భారతీయత పాలు నేపాల్‌లోనే ఎక్కు వేమో? నేపాల్ దేశమంతా ఒకప్పుడు చిన్న చిన్న రాజుల సామ్రాజ్యాలు. ప్రతీ రాజూ దైవభక్తుడే. అక్కడే ఆశ్చర్యకరమైన విషయం చూశాను. ప్రతీ రాజు కోటలోనూ– ఆయన పడక గదిలో కళ్లు విప్ప గానే కనిపించేటట్టు– ఎదురుగా– భారదేశంలో ఉన్న అన్ని గొప్ప దేవాలయాల నమూనాలు దర్శనమి స్తాయి. కాశీ, కేదార్, పూరీ, జగన్నాథ్, తిరుమల ఆల యం–ఇలాగ. ఈ ఏర్పాటుకి రెండు పార్శా్వలున్నా యేమో! ఒకటి: భక్తి. దానితో మనకి తగాదా లేదు. రెండు: వాస్తు. ఎన్నో చిన్న చిన్న కోటలు– నమూనా దేవాలయాలు చూశాను. ఆశ్చర్యం– నూటికి నూరు పాళ్లూ నమూనాలు! సంపంగి పువ్వులు గుబాళిస్తాయి. మరో ఆలో చన లేకుండా చేస్తాయి. అవి లేకపోతే బతికేదెలా అని పిస్తాయి. కానీ వాటి జీవితం అంతంతమాత్రం అని మనకి తెలుసు. ఎక్కువ కాలం నిలవకపోవచ్చునని తెలుసు. కనుకనే కృత్రిమమైన దన్ను కావాలి. పరో క్షంగా ప్రాణం పోసి బతికించుకోవాలని తాప త్రయం. అందుకే రోజుకి 7 గంటల ప్రయాణం. గొల్లపూడి మారుతీరావు -
జనం ఆమోదిస్తేనే పాపులారిటీ
సినిమా నటుల పాపులారిటీ జనం ఆమోదిస్తే వచ్చిందే తప్ప ఆ నటుల వ్యక్తిగత గొప్పతనంతో రాలేదని సీనియర్ నటులు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు అన్నారు. ఆడియన్స్ ఆమోదిస్తే వచ్చిన పాపులారిటీని మిగతా రంగాల్లోకి యధాతథంగా అనువదించడానికో, తర్జుమా చేయడానికో ప్రయత్నిస్తే ప్రయోజనం లేదన్నారు. నటుడి పాపులారిటీ మదుపుగా మారాలంటే రాజకీయాల్లో వారేం చేయగలరనేదే కీలకమవుతుందన్నారు. రాజకీయనేతలకు ఉండాల్సిన బ్యాలెన్స్ విషయంలో కళాకారులకు ఇబ్బంది ఎదురవుతుందని, మహానటుడు ఎన్టీఆర్ కూడా అక్కడే దెబ్బతిని ఉండొచ్చని అంటున్న గొల్లపూడి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ ముక్కుసూటితనంతో మీకు ఇబ్బందులు కలగలేదా? ఆలిండియా రేడియోలో ఆఫీసర్‌గా ఎదిగాను. టైమ్ అంటే ఎంత వాల్యూ నో నాకు వృత్తే తెలిపింది. ఫలానా గంటకు, ఫలానా నిమిషానికి సౌండ్ రికార్డింగ్ అంటే ఆపడానికి లేదు. కానీ సినిమా ఫీల్డులో ఎవరైనా పరిచయం కొద్ది జోకులేసినా భరించేవాడిని కాదు. ఎందుకంటే నేను గౌరవాన్ని ఆస్వాదించేవాడిని. కెమెరా ముందు నిల్చోగానే నేను ఒక స్టార్‌ని అనే ఫీలింగ్ వచ్చేసేది. అందుకే ఎవరైనా తేడాగా వ్యవహరిస్తే సహించేవాడిని కాదు. నా ముక్కుసూటితనంతో కొంత నష్టపోయి ఉంటాను. ఎన్టీఆర్ మరణం, ఆ సందర్భంపై మీ స్పందన? ఆయన వ్యక్తిగత జీవితం, దాని ప్రతిఫలనాలు, కుటుంబంలో వచ్చిన విభేదాలు ఇవేవీ నాకు తెలీవు. కానీ ఆయన అలాంటి పరిస్థితుల్లో గద్దె దిగడం చూస్తే ఆయన మ్యాన్ ఆఫ్ ఈగో. ఈగో ఇన్‌ది రైట్ సెన్స్. నటుడిగా మకుటం లేని మహారాజు. నడిస్తే మహారాజులాగే నడిచేవాడు. అల్లుడి నుంచే అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎన్టీఆర్ ఊహించి ఉంటారా? నిజంగా ఈ విషయంపై నాకు అవగాహన లేదు. కానీ ఒక విషయం చెప్పగలను. ఆయన రాజకీయాల్లో పెరిగిన వ్యక్తి కాదు. ప్రధానంగా ఆయన నటుడు. గొప్ప కళాకారుడు. వ్యక్తిగతమైన డిగ్నిటీని రాజకీయం కోసం వదులుకునే వ్యక్తి కాదాయన. తనకు ఒక అడ్వాంటేజ్, మరొక డిసడ్వాంటేజ్ కూడా ఉండేది. అంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు వారు చేసే పనులపై వారే పరిమితి విధించుకోవాలి. లేకుంటే వారిని ఎవరూ కరెక్ట్ చేయలేరు. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక రాజీవ్ గాంధీ.. ఎవరూ ఊహించలేని మ్యాడ్ మెజారిటీ సంపాదించిన నేతలు వీరు. కానీ రామారావు తాననుకున్న మంచిపనులన్నీ చేశారు. కళాకారుడు రాజకీయాల్లోకి ప్రవేశించడం వల్ల రాజకీయాలకు ప్రయోజనం కలుగుతుందేమో కానీ, రాజకీయనేతకు ఉండాల్సిన బ్యాలెన్స్ కళాకారుడికి ఒక్కొక్కప్పుడు ఇబ్బంది అవుతుందా అనిపిస్తుంటుది. చిరంజీవి ఇంకా చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చినా, ఎన్టీఆర్‌లాగా పాపులర్ కాలేకపోయారెందుకు? వీళ్లది డిఫరెంట్ ప్లేన్ అంటాను. చిరంజీవి పాపులారిటీ మామూలిది కాదు. ఆయన సినిమాల్లోనే నేను ఎక్కువగా నటించాను. నాకు మంచిమిత్రుడు. కానీ, ఎన్టీఆర్‌కి జై అన్నట్లుగా ఏఎన్నార్‌కి జై అనరు. ఆయన పాపులారిటీ వేరు. ఆడియెన్స్ కూడా వేరు. ఇదే వీరికీ వర్తిస్తుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ రజనీకాంత్, కమల్ హసన్ కూడా రాజకీయాల్లేకి వచ్చేశారు కదా? పవన్‌కల్యాణ్, రజనీకాంత్, కమల్ హసన్ రాజకీయాల్లోకి వచ్చారు కానీ వారు ఏం చేయగలరో ఇప్పటికి మన ఊహకు అందదు. చేయగలిగితే మంచిదే. సరైన ఆలోచన ఉన్నవారు ఇవ్వాళ రాజకీయాల్లోకి రావాలి. అంతవరకే మనం కోరుకోగలం. ఒక వ్యక్తి వైయక్తిక ప్రజాదరణను ఒక సగటు మనిషి ఎలా జడ్జ్ చేయగలరు? అతడి పాపులారిటీ ఒక నటుడి పాపులారిటీగా మదుపుగా మారగలదా. ఇప్పుడు తానేం చెబుతున్నాడో అది సరిపోతుందా, ఆ మాత్రం ఇంకో రాజకీయ నేత కూడా చెప్పవచ్చు కదా. రాజకీయాల్లోకి నటులు ఎందుకిలా ప్రవేశిస్తున్నారు? ఇవాళ ఉన్న మాధ్యమాల్లో అతి పాపులర్ మాధ్యమం సినిమా. నేను గొప్ప రచన చేస్తే మీరో మరొకరో చదువుకుని ఆనందిస్తారు. ఒక మంచి సినిమాలో నటిస్తే కోట్లమంది చూసి ఆనందిస్తారు. ఆ పాపులారిటీ, ఆ కీర్తి ఆడియన్స్ ఆమోదిస్తే వచ్చిన పాపులారిటీ. దాన్ని మిగతా ఏరియాల్లోకి అనువదించడానికో, తర్జుమా చేయడానికో కొందరు ప్రయత్నిస్తారు. సినిమారంగంలో పెడధోరణులు, వదంతులు, విమర్శలపై మీ అభిప్రాయం? ఇవన్నీ వేరువేరు కోణాలు. ఉదాహరణకు మీరు కోటు వేసుకుంటే అందంగా ఉన్నారు. అదే సమయంలో మన సంస్కృతికి దూరంగా ఉన్నారు. మీరు కోటేసుకుంటే ఇక్కడ మనిషిగా కని పించటంలేదు. ఇవన్నీ ఒకే అంశంపై మూడు నాలుగు కోణాలు. ఇటీవల రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై మహిళలు తిరగబడ్డారు. అది కూడా ఒక ధోరణి. యాంగిల్. తెలుగు సమాజానికి మీరిచ్చే సందేశం? మనం ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత పురోగతి సాధించినా, ఎన్ని తెలివి తేటలతో కొత్త ప్రయోగాలు చేయగలిగినా, సంప్రదాయ వైభవం అనే పునాదిని కాపాడుకుంటూ వెళ్లగలిగితే ఆ మేరకు మన విజయాలు, పురోగతి ఎక్కువ ఉపయోగపడతాయని నా ఫీలింగ్. అమ్మని అమ్మగారూ అని పిలవడం, నీ భార్యను చక్కగా గౌరవించడం, మీ పిల్లలు మిమ్మల్ని చూడగానే కాళ్లకు నమస్కరించడం వీటికీ సంప్రదాయానికి ఏమీ సంబంధం లేదు. ఇవ్వాళ మార్వాడీలను చూస్తుంటే రోడ్డు మీద వెళుతూ కూడా నమస్కారం పెడతారు. మిమ్మల్ని చూడగచ్చాడ్రా మళ్లీ వీడు అనుకోవడానికి, చూడగానే నమస్కారం పెట్టడానికీ ఎంత తేడా ఉంది. మనిషిని చూడగానే నమస్కరించడం అనే భావన ఎంత గొప్పదో కదా. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో...) https://goo.gl/QWReC9 https://goo.gl/8HTHP2 -
మనిషి కుక్కని కరిస్తే...
జీవన కాలమ్ అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కని కరిస్తే అది వార్త అన్నారెవరో. ఈ మధ్య ఓ సరదా అయిన సంఘటన సిమ్లాలో జరిగింది. రాహుల్‌గాంధీగారు ఎన్నికల ఫలితాల మీద జరిపే సమీక్షా సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగుగారి మేనకోడలు– ఈ మధ్యనే తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆషాకుమారి సభకి వచ్చారు. ఆమెని ఓ మహిళా కానిస్టేబుల్ ఆపారు. వాగ్వాదం పెరిగింది. అవతల కాంగ్రెసు మీటింగు జరిగిపోతోంది. ఎమ్మెల్యేగారికి కోపం పెరిగింది– తన పార్టీ మీటింగుకి హాజరు కావడానికి పోతుంటే ఓ కానిస్టేబుల్ తనని ఆపడమా! వెంటనే చాచి చెంపదెబ్బ కొట్టింది. సాధారణంగా ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇలాంటి ముచ్చట్లు మన రాష్ట్రంలో చాలాసార్లు వింటూంటాం. పోలీసు స్టేషన్లోనే ఆఫీసర్లని కొట్టిన నాయకుల ‘పెద్దరికం’మనం చదివి మురిసిపోయాం. కానీ కథ ఇక్కడ ఆగలేదు. కానిస్టేబుల్ వెంటనే అంతే బలంగా ఎమ్మెల్యే చెంప పగలకొట్టింది. ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు ఎవరు ఎవరి మీద ఫిర్యాదు చెయ్యాలి? ఎమ్మెల్యేగారు కొట్టారని కానిస్టేబులా? లెక్క అక్కడితో సరిపెట్టేసింది కదా! మరి ఎమ్మెల్యేగారు చెయ్యాలా? ‘మరి తమరు ముందు పీకారు కదా?’ఇదీ మీమాంస. ఈ కథ తర్వాత ఏమీ జరగలేదు. కాగా ఎమ్మెల్యే ఆషా కుమారే కాస్త ఎక్కువ బాధ పడ్డారు. ‘ఆవిడ నన్ను నానా మాటలూ అంది. అవమానపరిచింది. నేను ఆవిడ తల్లి వయసు దాన్ని. అయినా నేను ఆవేశపడకుండా ఉండాల్సింది. నేను క్షమాపణ చెప్తున్నాను.’అన్నారు ఆషాకుమారి. మన చోటా నాయకులు ఎన్నికలలో జయించగానే కాస్త గోరోజనం పెరగడం చూస్తాం. వారు సాధారణంగా నేల మీద నడవరు. వారి వెనుక చిన్న చేతి సంచి పట్టుకుని ఓ నౌకరు నడుస్తూంటాడు. వారికి చుట్టూ ప్రపంచం బొత్తిగా హీనంగా కనిపిస్తూంటుంది. వారి పక్కన నడిచే చెంచాలు వారి కంటే పెద్ద అంగలు వేస్తారు. అధికారం తలకెక్కినప్పటి కుసంస్కారం ఇది. ఒక్కక్షణంలో గతం మసకబారుతుంది. తాము ప్రత్యేకమైన పదార్థంతో మలిచిన మహానుభావులమనే భావం ఆకాశంలో నడిపిస్తుంది. ఇంగ్లీషులో ఒక వాక్యం ఉంది When you loose your temper, you loose more than temper అని.ఇది చదువుకున్న సంస్కారి అవగాహన. కానిస్టేబుల్ తల్లి వయసున్న, కొత్తగా ఎన్నికైన ఒక మాజీ ముఖ్యమంత్రిగారి మేనకోడలు– ఎంత సంయమనం, ఎంత మర్యాదని చూపించాలి! లోపలికి వెళ్లనీయని కారణంగా ఆ ఎమ్మెల్యే బయట అరగంట నిలిచిపోయిందని తెలిస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఏమయ్యేది? ఇప్పుడు ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది? మనకన్నా చిన్నవాళ్ల మీద మనం చూపే అధికారం– కుసంస్కారం. మనకన్నా పెద్దవాళ్ల మీద ఆ అధికారాన్ని చూపగలిగితే అది ‘నిజాయితీ’అనిపించుకుంటుంది. పెద్దవాళ్లు చిన్నవారి పట్ల చూపే ఆవేశం కన్నా చిన్నవాళ్లు పెద్దవారిని నిలదీసే ‘ధైర్యం’వెయ్యి రెట్లు బలమైనది. షిల్లాంగులో జరిగిన ఈ సంఘటన విశాఖపట్నంలో తుపాకీలాగ పేలింది. చిన్న ఉద్యోగి చేసిన సాహసం– పెద్ద ఉద్యోగి చేసిన అనౌచిత్యాన్ని తలదన్నింది. ఇదే– ’ loosing more than temper’అంటే. నిజమైన అధికారం తలొంచుతుంది. విర్రవీగదు. నిజమైన పెద్దరికం ‘చెప్పుకోదు’. తెలిసేటట్టు చేస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్పడానికి నేనెప్పుడూ అలసిపోను. ఆఫీసులో పనివేళలు దాటిపోయాక– తప్పనిసరిగా పనిలో తలమునకలయిన ఉద్యోగి– నాలుగో ఫ్లోర్ లిఫ్టు దగ్గర నిలబడి ఉంది. మెట్లు దిగుతున్న అధికారి చూశాడు. ఆయన్ని చూసి ఈమె కాస్త కంగారుపడింది. ‘ఏమమ్మా! ఇంత ఆలస్యంగా వెళుతున్నావు?’అన్నారాయన. ఏదో నసిగింది. లిఫ్టు వచ్చేదాకా ఆయనా ఆమెతో నిలబడ్డారు– ఆమె అక్కరలేదంటున్నా. లిఫ్టులో ఆమెతో పాటు దిగి– ఆమెను కారు ఎక్కించి వెళ్లారు. ఆ ఉద్యోగి పేరు సుధ. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని పెళ్లి చేసుకుని ‘సుధా నారాయణమూర్తి’అయ్యారు. ఆ అధికారి జేఆర్డీ టాటా. ఈ దేశంలో ‘భారతరత్న’గౌరవాన్ని పుచ్చుకున్న ఒకే ఒక్క వ్యాపారి ఆయన. మన కంటే చిన్నవాడిమీద విరుచుకుపడే ఆవేశం ‘ఆవేశం’అనిపించుకోదు. ‘ఉడుకుమోతుతనం’అనిపించుకుంటుంది. 1990లో అహమ్మదాబాదు సమీపంలో జరిగిన రైలు ప్రయాణంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక ప్రయాణికురాలి కోసం ఫస్టుక్లాసు కూపేలో ఉన్న ఇద్దరు నాయకులు– ఆమెకు బెర్తు ఇచ్చి– కంపార్టుమెంటులో నేల మీద దుప్పటి పరుచుకుని పడుకున్నారు. వారిద్దరు– శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్రమోదీ అనే కార్యకర్త. వారిద్దరిలో ఒకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరొకాయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దేశపు ప్రధాని అయ్యారు. ఈ విషయాన్ని వారిద్దరు చెప్పుకోలేదు. తర్వాత రైల్వే బోర్డు జనరల్ మేనేజర్ అయిన ఆ ప్రయాణికురాలు వ్రాశారు. గొల్లపూడి మారుతీరావు -
శాశ్వతంగా నిలిచేది అక్షరమే
-
ఓ గొప్ప సినీమాలాంటి కథ
జీవన కాలమ్ సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉపయోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం. 125 సంవత్సరాల కిందటి (1892)– అంటే సరిగ్గా గురజాడ ‘కన్యాశుల్కం’ పుట్టిన సంవత్సరం. నిజంగా జరిగిన కథ. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో 18 ఏళ్ల కుర్రాడు చదువుకుంటున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. మేన మామ చదువు చెప్పించాడు. ఈసారి ఫీజు కట్టడానికి డబ్బులేదు. ఇతనూ, మరొక మిత్రుడూ కలసి ఆలో చించారు. అప్పటి రోజుల్లో అతి ప్రముఖుడైన ఓ సంగీత విద్వాంసుడి కచేరీ పెట్టించి, టికెట్లు అమ్మి, మిగిలిన డబ్బుతో ఫీజు కట్టుకోవచ్చునని వారి ప్లాను. అప్పట్లో అతి ప్రఖ్యాత పియానో వాద్యగాడు పెరెడెస్కీని కలిశారు. ఆయన మేనేజరు కార్యక్రమానికి 2 వేల డాలర్లు (125 సంవత్సరాల కిందటి మాట అని మరిచిపోవద్దు) గ్యారంటీ ఫీజు అడిగాడు. వీళ్లిద్దరూ ఒప్పుకున్నారు. కచేరీకి ఏర్పాట్లను ప్రారంభించారు. అనుకున్న రోజున కచేరీ బ్రహ్మాండంగా జరిగింది. కానీ వీరు ఆశించినట్టు లాభం రాకపోగా 1,600 డాలర్లే వసూలైంది. వీళ్లు కుర్రాళ్లు. ఆయన మహానుభావుడు. 1,600 డాలర్లతో సరాసరి ఆయన దగ్గరికే వెళ్లారు. కథంతా చెప్పుకుని 1,600 డాలర్లతోపాటు 400 డాలర్ల చెక్కు ఇచ్చి త్వరలో ఈ బాకీ తీరుస్తామని చెప్పుకున్నారు. పెరెడెస్కీ అంతా విన్నాడు. ఆయన చేతిలోని చెక్కుని చింపేసి 1,600 వెనక్కి ఇచ్చాడు. ‘ఈ కచేరీకి అయిన బాకీలు తీర్చి మీ జీతాలు కట్టుకుని ఏమైనా డబ్బు మిగిలితే తనకివ్వమ’న్నాడు. కుర్రాళ్లు ఆయన ఔదార్యా నికి బిత్తరపోయారు. తర్వాత పెరెడెస్కీ జీవితం కళ కారణంగా అంత ర్జాతీయ కీర్తిని ఆర్జించిపెట్టింది. ఊహించనంత ధనాన్ని ఆర్జించి పెట్టింది. తన దేశపు ఔన్నత్యానికి, ప్రపంచంలో స్వదేశ స్మారక చిహ్నాల నిర్మాణానికీ ఆయన చేసిన కృషి ప్రజాభిమానాన్ని సంపాదించిపెట్టింది. మన దేశంలో గొప్ప ఉపాధ్యాయుడు, తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశ ఉపాధ్యక్షుడు అయినట్టుగా– 1919లో పోలెండు స్వతంత్ర దేశమయినప్పుడు దేశాధ్యక్షుడు పిల్సుడెస్కీ ఆయన్ని ప్రధాన మంత్రిని చేశారు. ఇది కళకూ, వితర ణకూ, రాజకీయ జీవనానికీ ఏర్పడిన వంతెన. 1935 నాటి మాట. పోలెండుకి పెరెడెస్కీ ప్రధాన మంత్రి అయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధంలో పోలెండు హిట్లరు పుణ్యమంటూ సర్వనాశనమయింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. 150 లక్షలమంది ఆహారం లేక అలమటించే పరిస్థితి. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ఏం చెయ్యాలో పెరెడెస్కీకి పాలుపోలేదు. చివరికి అమెరికా ఆహార, పునరావాస సంస్థకి విజ్ఞప్తి చేశాడు. అప్పుడు ఆ సంస్థ అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ (తర్వాతి కాలంలో ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు) వెంటనే 150 టన్నుల బట్టలు, రగ్గులు, ప్రత్యేక వంట శాలలను ఏర్పాటు చేసి రోజుకి 2 లక్షలమందికి భోజ నాలను ఏర్పాటు చేశాడు. అమెరికా రెడ్‌క్రాస్ సంస్థ 2 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది. యుద్ధం ముగిశాక కష్ట సమయంలో తన దేశానికి ఉపకారం చేసిన వ్యక్తిని కలుసుకోవడానికి పెరెడెస్కీ అమెరికా వచ్చాడు. హూవర్ని కలిసినప్పుడు దాదాపు కళ్లనీళ్ల పర్యంతం అయి కృతజ్ఞతని చెప్పుకున్నాడు. హూవర్ నవ్వి ‘మరేం పరవాలేదు సార్. 48 సంవ త్సరాల కిందట మీరు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఓ కుర్రాడికి సహాయం చేశారు. మీకు గుర్తుండకపోవచ్చు. ఆనాడు మీకిచ్చిన 1,600 డాలర్లు వెనక్కి ఇచ్చి మా చదువుని కాపాడారు. ఆ కుర్రాడిని నేనే’ అన్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు మహా నుభావుల ఔదార్యానికి అద్దంపట్టే అపూర్వమైన కథ. సాధారణంగా ‘మనం ఈ సహాయం చేస్తే మనకేం ఉప యోగం?’ అని ఆలోచించడం మానవ స్వభావం. ‘కానీ ఈ సహాయం జరగకపోతే అతను నష్టపోయేదేమిటి?’ అని ఆలోచించడం కేవలం మహనీయుల స్వభావం. అందుకే వారిలో ఒకరు తన దేశపు ప్రధాని అయ్యారు. మరొకరు తన దేశపు అధ్యక్షుడయ్యారు. హూవర్ 1919లో అమెరికా సంక్షేమ సంస్థ అధ్య క్షుడిగా వార్సా వెళ్లారు. తనకి స్వాగతం చెప్పడానికి– ఆనాటి యుద్ధంలో దెబ్బతిన్న ప్రజలు– ముఖ్యంగా 25 వేల మంది పిల్లలు ఆయనకి స్వాగతం చెప్పడానికి జోళ్లు లేని కాళ్లతో బారులు తీర్చారట. ఆ దృశ్యాన్ని చూసి హూవర్ చలించిపోయాడు. అప్పటికప్పుడు అమెరికాకు తాఖీదు పంపి– 7 లక్షల ఓవర్ కోట్లు, 7 లక్షల జోళ్లు పోలెండుకి ఓడలో పంపే ఏర్పాట్లు చేశాడు. మరో రెండే ళ్లపాటు 50 లక్షల జోళ్లు అమెరికా నుంచి దిగుమతి అవు తూనే ఉన్నాయి. ఒక వ్యక్తి ఔదార్యం, ఒక వ్యవస్థ ఔదార్యంగా పరి ణమించిన అపూర్వమైన కథనం ఇది. జీవితంలో పేద రికం చిన్న మబ్బుతునక. కానీ అది కప్పి ఉన్న వ్యక్తిత్వ వైభవం అనూహ్యమైన తేజస్సు. మరిచిపోవద్దు. పెరె డెస్కీ గొప్ప కళాకారుడు. హూవర్ది గొప్ప పేదరికం. ఉదాత్తతకీ, కళకీ, పేదరికానికీ దగ్గర బంధుత్వముంది. గొల్లపూడి మారుతీరావు -
బంగారు మనిషి
విశ్లేషణ (జీవన కాలమ్) జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది. అతను ప్రపంచంలోకెల్లా వేగంగా పరిగెత్తగల యోధుడు. తొమ్మిది సంవత్సరాలపాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతుల్ని చేసి, అభిమానుల్ని ఆనందోత్సాహాలతో ఉర్రూతలూగించిన చాంపియన్. అతను ఉస్సేన్ బోల్ట్. అభిమానుల తృప్తికోసం ఆఖరిసారి పరుగుపందెంలో పాల్గొంటున్నాడు. అభిమానులు గర్వంగా అతని విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపం చం మరొక్కసారి ఆ విశ్వవిజేత చేసే విన్యాసానికి సిద్ధపడుతోంది. కాని ఆ రోజు అతని అడుగు ఒక్క లిప్తకాలం జంకింది. శరీరం మొరాయించింది. ఆఖరి 50 మీటర్లు ఒక జీవితకాలం దూరంగా కనిపించాయి. తనని దాటి ఏనాడూ కాలు కదపలేని ఇద్దరు ముందుకు దూసుకుపోయారు. అతనికి కాదు. వారికే ఇది పెద్ద షాక్. ఇదేమిటి? పెద్దాయన తడబడ్డాడు! 9 సంవత్సరాలపాటు అతనికి ముందు గాలికూడా జొరబడలేని వేగంతో 8 ఒలింపిక్ పతకాలూ, 11 ప్రపంచ చాంపియన్ పతకాలూ గెలుచుకుని ఎన్నోసార్లు తనని తానే జయించుకుని రికార్డులు సృష్టించిన ఒక వీరుడు ఆ రోజు కేవలం మూడు సెకెన్లు ఆలస్యమయాడు. అతని ముందు ఇద్దరు నిశ్చేష్టులయి, నిస్సహాయంగా ముందుకు దూకారు. అక్కడితో కథ ముగియలేదు. జీవితంలో ఆఖరిసారిగా పోటీలో పాల్గొంటున్న మహావీరుడికి గెలిచిన వీరుడు అక్కడికక్కడే మోకాళ్ల మీద నిలిచి మోకరిల్లాడు. ప్రపంచం నిశ్చేష్టమయింది. ఓ గొప్ప చరిత్ర ముగిసింది. 9 సంవత్సరాలు ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా నిలిచిన బోల్టు ఏమన్నాడు? ‘నేనూ మామూలు మనిషినే!’ అన్నాడు. ఇలాంటి మామూలు మనుషులు చరిత్రలో ఎంతమంది ఉంటారు! అలాంటి అనూహ్యమైన సంఘటన మరొక్కసారి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మెన్ బ్యాటింగ్ ఏవరేజ్ 100 ఉండేది. ఇది అనూహ్యం. కాని ఆయన ఆఖరి ఆటలో కంటినిండా నీరు ఉంది. మొదటి బాల్కి అవుట్ అయాడు. కనుక ఏవరేజ్ 99.99 అయింది. ఇది కూడా చాలా అరుదయిన విషయం. పరుగు పందెం ముగుస్తూనే బోల్ట్– ఆఖరిసారి పందెం చివరి గీతని తలవొంచి తాకి ముద్దుపెట్టుకున్నాడు.. ఆ గీతమీద లోగడ గోమఠేశ్వరుడిలాగ నిలిచిన చరిత్ర అంతటితో ముగిసింది. చూస్తున్న లక్షలాది అభిమానుల కళ్లు చెరువులయాయి. ఒక దశాబ్దంపాటు ప్రపంచాన్ని పరిపాలించిన ఈ జమైకా వీరుడు– 30సార్లు ప్రపంచంలోని ఎందరో పరుగు వీరులతో పోటీ చేశాడు. వారిలో కేవలం 9 సందర్భాలలో మాత్రమే మాదకద్రవ్యాలు పుచ్చుకోని వీరులు పరుగు తీశారు. ఆ 9 సందర్బాలూ ఒక్క బోల్ట్ విజయాలే! ఓ పాత్రికేయుడు– ఆయన గురించి అన్న మాటని– ఎంత ప్రయత్నించినా తెలుగులో అంత గొప్పగా చెప్పలేను. At a time when there was-and still is- a deep sense of cynicism about sporting excellence of any kind, he was the ultimate escape artist. ఆఖరి పరుగు పందాన్ని గెలిచిన గాట్లిన్ అన్నాడు. ‘‘నేను గెలుస్తున్నంత సేపూ నన్ను వేళాకోళం చేసే కేకలు అభినందించే చప్పట్లకన్నా మిన్నుముట్టాయి. కారణం నాకు తెలుసు. ప్రపంచం బోల్ట్ అపజయాన్ని కూడా పండగ చేస్తోంది.. గెలిచినా బోల్ట్ ముందు ఒక్కసారి మోకరిల్లాలనుకున్నాను. ఈ క్రీడకి ఆయన చేసిన ఉపకారం అనితరసాధ్యం.’’ బోల్ట్ అన్నాడు: ‘‘ఈ వెక్కిరింతలు న్యాయం కాదు. గాట్లిన్ గొప్ప పోటీదారుడు. మంచిమనిషి’’. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని నలుమూలల నుంచి అభిమానుల సందేశాలు వెల్లువెత్తాయి. మనకు తెలిసివచ్చే ఒకే ఒక అభిమానిని ఉటంకిస్తాను. అతను ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆయన మాటలు: ‘ప్రపంచంలో బోల్ట్ కంటే గొప్పవాడెవడూ లేడు. ఉండడు.. అంత గొప్ప క్రీడా జీవితాన్ని ఇంతవరకూ చూడలేదు. ఇంత త్వరగా ఆ రికార్డులు ఎవరూ అధిగమించలేరు. ఉస్సేన్ సాబ్! ప్రపంచం మిమ్మల్ని తప్పక మిస్ అవుతుంది. ఎప్పుడయినా సరదాకి క్రికెట్ ఆడాలనిపిస్తే రండి. నేనెక్కడ ఉంటానో మీకు తెలుసు!’. బోల్ట్ గొప్ప క్రికెట్ అభిమాని. ‘థ్యాంక్స్ చాంప్’ అని సమాధానం ఇచ్చాడు. పర్వతాన్ని ఎక్కిన ప్రతీవాడికీ దిగే రోజు వస్తుంది. కిరీటాన్ని ధరించిన మహారాజుకీ ఆఖరి విశ్రాంతి ఆరడుగులే. కాని తలవొంచే క్షణంలో తనూ మనలాంటి మనిషే అన్న స్పృహ అతన్ని మళ్లీ ఆకాశాన నిలుపుతుంది. బోల్ట్ వేగంలో గాలికి పాఠం నేర్పిన గురువు. మనలాగే అందలాన్ని దిగి మనమధ్య నిలిచిన మహోన్నతమైన వీరుడు. చరిత్రలో ఎక్కువమంది బోల్ట్‌లు ఉండరు. ఆ మాటకి వస్తే ఎక్కువమంది డాన్ బ్రాడ్మెన్లూ ఉండరు. గొల్లపూడి మారుతీరావు -
ఒక అమెరికా భక్తుడి ఉవాచ
♦ జీవన కాలమ్ ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. నేను బీజేపీ కార్యకర్తని కాను. ఈ దేశంలో అందరిలాంటి పౌరుడిని. తమిళనాడులో కస్టమ్స్ శాఖ అత్యధిక ఉన్నత న్యాయస్థానం (ట్రిబ్యునల్)కు న్యాయాధికారిగా పనిచేసి రిటైరైన 86 సంవత్సరాల ప్రముఖ రచయిత నాకు ఒక అమెరికా భక్తుడి (జాసన్. కె.) వ్యాసాన్ని పంపారు. నలుగురూ చదివితే బాగుంటుందనిపించింది. కాలమ్ పరిమితి దృష్ట్యా సంక్షిప్తంగా చెబుతాను: అమెరికా ఇస్తున్న నిధులతో పనిచేసే ప్రాజెక్టుల కోసం భారతదేశం నలుమూలలా తిరుగుతూ ఉంటాను. పేదల్నీ, నిరుపేదల్నీ కలుస్తూంటాను. భారతదేశంలో ఉన్న కొన్ని అపప్ర«థల్ని తొలగించాలన్నదే నా ప్రయత్నం. అమెరికా మిత్రులు, కొందరయినా భారతీయులు దీన్ని చదువుతారని ఆశిస్తాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా భారతదేశంలో గ్రామీణ రంగం మోదీగారి వెనుక ఉంది. వాళ్లని మీరు భక్తులన్నా, అనుచరులన్నా వాళ్లకి వెంట్రుక ఊడదు (ఇంతకన్న ముతక మాట అన్నాడు). మొట్టమొదటిసారిగా మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణమూలేని పార్టీ నాయకుడు వారికి దక్కాడు. అనూహ్యమైన కుంభకోణాలతో మురిగిన దేశం ఒక ప్రధాని మూగతనాన్ని వేళాకోళం చేసే స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో ఇది గొప్ప, వాంఛనీయమైన పరిణామం. ముస్లింలు మోదీని ద్వేషించటం లేదు. చదువుకున్న హిందూ మేధావులు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అతి మెళకువగా, శ్రద్ధగా ప్రజాభిప్రాయాన్ని వంకర తోవ పట్టించడానికి చేసిన కృషిని ఆయన గంగలో కలిపాడు కనుక. సరదాగా టీ సేవిస్తూ పత్రికల్లో రాజకీయాలను చర్చించే ‘బాతాఖానీ’మేధావుల నడ్డి మీద ఆయన ఒక తాపు తన్నాడు కనుక. నాకనిపిస్తుంది చాలామంది భారతీయులు మోదీని వ్యతిరేకించడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తూ, తద్వారా తాము మేధావులం, మతాతీత శక్తులమని నిరూపించుకోజూస్తున్నారని. వారికి అదొక ఫేషన్. ఒక్క ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి– కేజ్రీవాల్. ఆయన మోదీ విద్యార్హతల్ని ప్రశ్నిం చారు. విశ్వవిద్యాలయం సాధికారికంగా సమర్థించే సరికి పూర్తిగా జారిపోయాడు. ఇది అతి నీచమైన ‘spit and run-' రాజకీయం. ఇలా కక్కగా కక్కగా ఏదో మురికి ఆయనకు అంటుకోక మానదని కొందరి ఆశ. ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక స్థాయిగల దేశం 86 శాతం కరెన్సీని ఉపసంహరించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక శాస్త్రాన్ని చదువుకున్నవాడిగా ఇది సరైన పని అని నేను అనుకోవడం లేదు. కానీ దేశం తలవొంచినట్టు తోస్తోంది. అయితే ‘అవినీతి’ చరిత్రలేని మోదీ చేపట్టిన ఈ చర్య చెల్లుబాటు కావడం ద్వారా ఆయన నిజాయితీపట్ల విశ్వాసం ప్రజల్లో మరింత పెరిగింది. అమెరికాలో ట్రంపుని పదవిలో కూర్చోపెట్టిన మమ్మల్ని చూసి భారతదేశంలో మేధావులు నవ్వుకోవచ్చు. అయినా సాహసం చేసి ఒక మాటంటాను. ఈయనకి మరో చాన్సు ఇవ్వండి. ఆయన సరైన కృషి చేస్తున్నాడు. అందుకు ఆయనకి దమ్ము, వెన్నుబలం ఉన్నాయి. ఒక్క కాశీలో ఆయన జరిపిన బహిరంగ ఊరేగింపు చాలు– అందుకు నిదర్శనంగా ఉదహరించడానికి. కెన్నెడీ హత్య ఇంకా మా మనస్సుల్లో పచ్చిగా ఉంది. ఒక్క పిచ్చివాడి చేతిలో తుపాకీ చాలు, మీ దేశాన్ని అవ్యవస్థలో పడేసేది. ఆయన్ని వెనకేసుకొచ్చేవారిని వెక్కిరించే షోకుని విడిచిపెట్టండి. అలా చేయడం సరదాగా ఉండొచ్చుకానీ– అందువల్ల మీకే నష్టం. దేశంలో ఎక్కువమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారితో మీరు ఏకీభవిస్తున్నకొద్దీ వారి అనుచరుల సంకల్పబలం పెరుగుతుంది. ఆయనతో ఏకీభవించని ప్రత్యర్థి ఎవరయినా– సహేతుకంగా ఆలోచించగా నేను చూడలేదు. కాగా ఆయన్ని విమర్శించిన చాలామంది తమ మనస్సులు మార్చుకోవడం నేనెరుగుదును. దురదృష్టం. భారతీయ సైన్యం చేసిన దాడులనీ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. మాకు ట్రంపు ఉన్నాడు. అమెరికాని సమర్థించే ఆయన ఏ చర్యనయినా బొత్తిగా చదువురాని అమెరికన్ కూడా సమర్థించాడు. మీ సైన్యం చర్యలనే మీరు ఖండించే స్థితికి వస్తే– మీలో ఏదో సీరియస్ లోపం ఉన్నట్టే లెక్క. నక్షత్రాల జాతీయ పతాకం అమెరికాకు తలమానికం. కానీ మీ త్రివర్ణ పతాకం మీకు అలా కాకపోవడం దురదృష్టకరం. మీకిది వింతగా కనిపించవచ్చుకానీ నేను మీ దేశాన్ని, మీ ప్రజలని ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. రాహుల్ గాంధీ అనే ఆ శాల్తీని కాక ఈయన్ని మళ్లీ ఎన్నుకోడానికి మరో ఎన్నిక మీకు అవసరమనిపిస్తే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించుగాక! గొల్లపూడి మారుతీరావు -
కాలం తీపి గురుతులు
జీవన కాలమ్ ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌కి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి, ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్. ఎన్ని సంవత్సరాలు! 53 గడిచిపోయాయి. అప్పుడే నేను ఆంధ్రప్రభ వదిలి హైదరాబాదు రేడియోకి వచ్చాను. దశాబ్దాలుగా ఉన్న మద్రాసు వదిలి సగం మనసుతో కె. విశ్వనాథ్ హైదరాబాదు వచ్చారు అన్నపూర్ణా సంస్థ కోసం. ఇద్దరికీ కిరాణా దుకాణం– నారాయణగూడాలో శంకరయ్యది. ఆయన శ్రీమతి జయలక్ష్మిగారు, మా ఆవిడా కలిసేవారు. నేను అప్పుడప్పుడు మా ఆవిడకి తోక. మద్రాసులో 34 భగీరథ అమ్మాళ్ వీధి అన్నపూర్ణా ఆఫీసు. ‘డాక్టర్ చక్రవర్తి’కి నేనూ, దుక్కిపాటి గారూ హాలు పక్క గదిలో కథా చర్చలు జరుపుతుండగా హాలులో ఎస్. రాజేశ్వరరావుగారితో సంగీతం కంపోజింగ్ చేయిస్తున్నారు విశ్వనాథ్. ఉన్నట్టుండి మా గది లోకి వచ్చారు–రాజేశ్వరరావుగారు: ‘‘విశ్వంగారికి సంగీ తం మీద మంచి పట్టు ఉందండి!’’ అని వెళ్లిపోయారు. ఎక్కడికి? సరాసరి ఆఫీసు నుంచి ఇంటికి. అది రాజేశ్వరరావుగారి అలక. విశ్వంగారూ కంగారు పడిపోయారు. కానీ ఆయన మాట ఎంత నిజం! తెలుగు సినిమాలో సంగీతానికి ‘రుచి’నీ, ‘శుచి’నీ మప్పి పదికాలాల పాటు ప్రాణం పోసిన దర్శకులు విశ్వనాథ్. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలో మొదటి సీనుని– ఆత్రేయకి బదులు నేను రాసిన మొదటి సీనుని–ఫెయిర్ కాపీ రాసుకున్న వ్యక్తి విశ్వనాథ్. నేను రాసిన మొదటి సీనుని (ఆత్మగౌరవం) మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహిం చిన వ్యక్తి విశ్వనాథ్. ఆయనా నేనూ కలసి నటించిన మొదటి సీనుని మళ్లీ నేనే రాశాను (శుభసంకల్పం). మొదటిసారిగా కెమెరామాన్ పి.సి. శ్రీరామ్ గారింట్లో మేమిద్దరం నమూనా సీను నటించాం. ‘చెల్లెలి కాపురం’ చర్చల్లో నాకు జర్దా కిళ్లీ సరదాగా మప్పిన ఘనత విశ్వనాథ్‌గారిది. సీను ‘రంజు’గా వచ్చిం దంటే స్వయంగా కిళ్లీ చుట్టి ఇచ్చేవారు సంబరంతో. 18 సంవత్సరాలు అది ఇద్దరి పీకలకీ చుట్టుకుంది. ఒకరోజు మేమిద్దరం యునైటెడ్ కాలనీ బజార్లో రాత్రి జర్దా కోసం తిరిగాం! తర్వాత ఇద్దరం బయటపడ్డాం. చక్కని భోజన ప్రియత్వం ఇద్దరికీ ఉంది. ‘శుభ సంకల్పం’ నిర్మాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. వారిం ట్లోనే చర్చలు. ప్రతిరోజూ ముందు తినబోయే పలహారాన్ని చర్చించేవాళ్లం. వంటావిడ కాంతమ్మగారు రుచిగా పంపించేవారు– పెసర పుణుకులు, చల్ల చిత్తాలు, పెసరట్టు, రవ్వదోశె– ఇవే ముందు నిర్ణయం కావాలి. తర్వాతే కథా చర్చ. ‘రుచి’ కారణంగా చర్చలు మరికొన్నాళ్లు కొనసాగిన గుర్తు. విజయనగరంలో ‘శుభ సంకల్పం’ షూటింగు. రోజూ హోటల్ నుంచి బయలుదేరి నన్ను దారిలో కారెక్కించుకునేవారు. విజయనగరం దారిలో – అప్పుడే తోటల్నుంచి వచ్చే కూరల బుట్టలు దింపించి– బీరకాయలు, వంకాయలు, బెండకాయలు కొని– జొన్నవలస లొకేషన్లో వంటవాడికిచ్చి చేయించుకునేవాళ్లం. ఆయన దర్శకత్వంలో నేను నటించిన మొదటి చిత్రం–‘స్వాతిముత్యం’. నేను బిజీగా ఉన్న రోజులు. ఆరోజు ఆయన షూటింగుకి ఆలస్యంగా వచ్చి– ‘‘నాతో నడువు మారుతీరావ్’’ అంటూ కుడికాలు ఎత్తి ఎత్తి వేయడం మప్పారు పాత్రకి. ఆ చిన్న పాత్రకి అది మేనరిజం. రజతోత్సవ సభలో రాజ్‌కపూర్ ఆ కుంటిని గుర్తు చేసుకున్నారు–ఆ కుంటి నాదేనని భావిస్తూ. పాత్ర మీద ప్రత్యేకమైన angularityని పట్టుకోవడంలో విశ్వనాథ్‌కి విశ్వనాథే సాటి. ‘శంకరాభరణం’లో సంగీతం మేస్టారు, ‘సాగరసంగమం’లో డ్యాన్స్ మేస్టారు, ‘స్వాతిముత్యం’ లో నా పాత్ర అందుకు ఉదాహరణలు. ‘శుభలేఖ’ రాస్తూండగా అనుకోకుండా నటుడినయ్యాను. పాలకొల్లులో పగలు ‘ఇంట్లో రామయ్య–వీధి లో కృష్ణయ్య’ షూటింగు. రాత్రి సంభాషణల రచన. విశాఖపట్నానికి ‘శుభలేఖ’ స్క్రిప్ట్ చిరంజీవితోనే పంపా ను. బహుశా ఆయనకి ఎక్కువ సినిమాలు రాసింది నేనేనేమో (ఆత్మ గౌరవం, చెల్లెలి కాపురం, ఓ సీత కథ, మాంగల్యానికి మరోముడి, ప్రేమబంధం, శుభలేఖ, శుభ సంకల్పం)! ఇద్దరం కలసి మొట్టమొదటి నంది అవార్డుని పుచ్చుకున్నాం. ఆయన నటుడయ్యాక ఒక గొప్ప దర్శకుడిని తెలుగు సినీమా ఏ కాస్తో నష్టపోయిందనిపిస్తుంది. ముందు ముందు ఎన్ని సాగరసంగమాలు, స్వాతిముత్యాలు వచ్చేవో. ఖాకీ దుస్తులతో మొదటి షాట్ దర్శకత్వం వహించడం నుంచి, చేతికర్ర వరకూ ఆయన ప్రయాణాన్ని గమనించినవాడిని. ఏ కొన్ని అడుగులో కలసి వేసినవాడిని. విశ్వనాథ్ తపస్వి. కళకి పామర రంజకత్వాన్ని మప్పిన దర్శకుడు. ఎన్ని విజయాలు సాధించినా కాళ్లని నేల మీదే నిలుపుకున్న వ్యక్తి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం విశ్వనాథ్‌గారికి సబబైన కిరీటం. సినీమాని ‘అభిరుచి, సంస్కారం, సంస్కృతి– ఆ తర్వాతే ఆరోగ్యకరమైన వినోదం’ పొలిమేరల్లో నిలిపిన చాంపియన్. జాతీయ స్థాయిలో ‘కీర్తి’ నిలిచినా జీవితాన్ని, జీవనాన్ని సడలించని మధ్య తరగతి అగ్రహారీకుడు కె. విశ్వనాథ్. గొల్లపూడి మారుతీరావు -
గాన గంధర్వుడు
జీవన కాలమ్ ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవలక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టుంటుంది. త్యాగరాజస్వామి ఐదో తరం గురు సంపద నాకు దక్కిన అదృష్టం- అని మంగళంపల్లి బాల మురళీకృష్ణ గర్వపడ్డారు... గతంలో నేను సంపాద కత్వం వహించిన ‘సురభి’ పత్రికకి ఇంట ర్వ్యూలో. బాలమురళి గురువులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుకి మానాంబుచావిడి (ఆకుమళ్ల) వెంకట సుబ్బయ్య సంగీత భిక్ష పెట్టారు. అంతకుముందు మరీ చిన్న తనంలో తండ్రి పట్టాభిరామయ్య ఏకైక సంతా నంగా ప్రతీరాత్రీ పక్కనే పడుకుని ఆయన చెప్పే సరళీస్వరాలు, జంట స్వరాలూ, వర్ణాలూ - అన్నీ ‘జ్ఞాపకం’ చేసుకున్నారు. ఏడో యేట గురువు ఉంటే మంచిదని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరకు తీసుకెళ్లారు. ‘ఏదీ, నీకొచ్చిన పాట ఒకటి పాడు’ అన్నారాయన. పాడారు. వీడిని ఇంట్లో దింపి మధ్యాహ్నం రమ్మన్నారాయన. వస్తే ‘వీడికి చెప్పవలసిందేం లేదు. వచ్చినవి మననం చేసుకోవడమే’ అన్నారట. 1939 జూలై 6న మొదటి కచ్చేరీ. సభలో నాన్న, గురువు ఉన్నారు. 9 నుంచి ఒక గంట సాగాలి. పదిన్నరయినా సాగుతోంది. గురువు వేదిక మీదికి వచ్చి కుర్రాడిని ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి దిష్టితీయమన్నారు. తర్వాత ముసునూరి సత్యనారాయణ భాగవతార్ హరికథ చెప్పాలి. చెప్పలేనని ఆయన వేదిక దిగిపోయారు. పట్టాభి రామయ్య మురళి వాయించేవారు. కొడుక్కి ‘ముర ళీకృష్ణ’ అని పేరు పెట్టుకున్నారు. ముసునూరి సూర్యనారాయణ పేరులో ‘బాల’ కలిపారు ఆ రోజు. ఆ విధంగా బాలమురళీకృష్ణ అయ్యారు. తర్వాత తిరువయ్యూరులో దిగ్దంతుల ముందు అలవోకగా పాడే కుర్రాడిని చూసి అబ్బుర పడి వీణ ధనమ్మ ఎత్తుకుని తనతో తీసుకుపోయి దిష్టి తీసిందంటారు. వారి ఇంటి ఎదుటి సత్రంలో వారి గురువుగారి ఆధ్యాత్మిక గురువు విమలానంద భారతీస్వామి విడిది చేశారు. చాతుర్మాస దీక్ష చేస్తు న్నారు. బాలమురళికి కబురు పంపించారు. ‘ఒక్క మాట చెప్తావా? త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేదంటావు?’ అన్నారు. ఒక క్రమబద్ధమైన ధోరణిలో లేదన్నారు. ‘ఆయన ఇదివరకెన్నడూ చేయనిది, చేయలేనిదీ చేశారు. చరిత్రలో మిగి లారు. ఆ పని నువ్వూ చెయ్యి’ అన్నారు. అప్పుడా యనకి 16. మరో రెండేళ్లలో 72 మేళ కర్త రాగాలలో కృతులు చేశారు. అది అప్పటికీ ఇప్పటికీ అపూర్వం. అనితర సాధ్యం. ఆయన జీవితమంతా అనితర సాధ్యమైన సంగీతాన్నే ఆరాధించారు. బహుశా ఆయన గొంతులో పలకని గమకం, రవ్వ సంగతి లేదేమో. ఎప్పుడూ విన్న కీర్తనని వింటున్నా మరేదో కొత్త మర్యాద, జీవ లక్షణం పలుకుతుంది. మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దిషణ రూపుదిద్దుకున్నట్టు ఉంటుంది. ఆయనలో చిలిపితనం ఉంది, సరదా ఉంది. ప్రతీ క్షణాన్నీ అనుభవించే ‘సరసత’ ఉంది. తాను ఆనం దిస్తూ పాడతారు. ఆ ఆనందాన్ని రసికునికి పంచి ఆ క్షణాన్ని అజరామరం చేస్తారు. దాదాపు 53 ఏళ్ల కిందట - విజయవాడ రేడియో కేంద్రం ‘భక్తిరంజని’ విని రంజించని వారె వరూ లేరు. జాతీయ స్థాయిలో ఆ కార్యక్రమం పరిమళించింది. ఆ గుబాళింపుకి అధ్యక్షుడు బాల మురళి. ఇంకా శ్రీరంగం గోపాలరత్నం, వింజ మూరి లక్ష్మి, వీబీ కనకదుర్గ, ఎమ్వీ రమణమూర్తి, సూర్యారావు ప్రభృతులు ఉండేవారు. ఉదయమే అహిర్ భైరవిలో ‘పిబరే రామరసం’ అంటే శ్రోతల హృదయాల్లో రామరసం చిప్పిల్లేది. ఈ విందుకి కారకులు - మరొక మహానుభావుడు - ఇంకా విజ యవాడలో ఉన్నారు. బాలాంత్రపు రజనీకాంత రావుగారు. ఆయనకిప్పుడు నూరేళ్లు. ఆయన సంగీత ప్రపంచంలో ఏమి చేశా రనికాదు. ఏమి చెయ్యలేదని ప్రశ్నించుకోవాలి. భీంసేన్ జోషీ, అజయ్ చక్రవర్తి వంటి వారితో ‘జుగల్బందీ’కి శ్రీకారం చుట్టారు. అవి అపూర్వ మైన కచ్చేరీలు. స్వరశ్రీ, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించారు. ఇక - సంగీత రచనలో ఆయనకి ఆయనే సాటి. నాటలో ‘అమ్మ’ వర్ణం వింటే పులకించిపోతాను. రామప్రియ మరొక కళా ఖండం. కదన కుతూహలం తిల్లాన - ఇలా ఏరడం వారి దిషణకి అన్యాయం చేసినట్టు. మా ఇంట్లో దసరా నవరాత్రులకు బొమ్మల కొలువు ప్రత్యేకత. 2008 ఆగస్టు 10న సతీ సమే తంగా వచ్చారు. వారికి పాదాభివందనం చేసి శాలువా కప్పాను. నాకు చాలా ఇష్టమైన ఆయన రచనని పాడమన్నాను. కానడలో ‘బృహదీశ్వర మహాదేవ!’ నా చేతిని ఆప్యాయంగా పుచ్చుకుని పాడారు. ఆయన పాటలో, రచనలో ఈ జన్మకే పరి మితం కాని ఉపాసనా బలమేదో కనిపిస్తుంది. ఆఖరుసారి విశాఖపట్నం బీచిలో విశ్వప్రియ హాలులో ఇస్కాన్ ఉత్సవాలలో పాడారు. పాట సాహిత్యం మరిచిపోతున్నారు. వృద్ధాప్యం ఓ జీనియస్‌ని ఏమారుస్తోంది. కానీ ఆయన లొంగడం లేదు. సాహిత్యం జ్ఞాపకానిది. ఉద్దతి జీన్స్ది. కాస్సే పయాక సునాద వినోదిని రాగంలో మైసూర్ వాసు దేవాచార్ ‘దేవాదిదేవ’ ఎత్తుకున్నారు. అంతే. నభూతో నభవిష్యతి. అది ఒక మహాగాయకుడి విజృంభణ. బాలమురళీకృష్ణ ఈ తరం సంగీతానికి అధ్య క్షుడు. ఏతరంలోనయినా కనిపించని అరుదైన గంధర్వుడు. A complete musical genius. గొల్లపూడి మారుతీరావు -
‘మల్లెపూదండ’
జీవన కాలమ్ ‘దీనబంధు’ అనే సినీమా కోసం రాసింది ఈ తెలుగుతల్లి పాట. తీరా ఆ సినీమాలో దర్శకుడు ఆ పాటని ఉంచలేదు. ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప పాటకి ఆ చిన్న వేదిక చాలదు. జాతికి జాతీయ గీతం కావలసిన పాట. ఐదు, ఆరు తారీఖుల్లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు చాలా కారణాలకి చిరస్మరణీయం. ప్రారంభమే నన్ను పుల కింపచేసింది. 12 దేశాల తెలు గువారు సమావేశమయిన విదేశంలో పట్టుచీరెలు కట్టు కున్న ఎనిమిది మంది మహిళలు- దాదాపు 16 సంవత్సరాల కిందట తెలుగు దేశాన్ని విడిచి వచ్చినవారు- వేదిక మీదకి వచ్చి, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’’ పాడారు. నాకు కళ్లు చెమ్మగిల్లాయి, ‘‘మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక నీ పాటలే పాడుతా’’ అని గొంతెత్తి అంటూంటే - దేశభక్తితో కాదు- 55 సంవత్సరాల కిందటి నా జ్ఞాపకాల్ని కదిపినందుకు. అంతకు మించి శంకరంబాడి సుందరాచారి కలం ఇంతగా జీవం పోసుకుని 12 దేశాల తెలుగు వారిని - విదే శాల్లో పలకరిస్తున్నందుకు. శంకరంబాడి సుందరాచారి నాకు అత్యంత ఆత్మీయుడు. జీవితంలో పెద్ద తిరుగుబాటుదారుడు. ఆత్మా భిమానాన్ని ఎన్నడూ పణంగా పెట్టకుండా పేదరికాన్ని అలవోకగా ఆహ్వానించి-రైల్వేస్టేషన్లో కళాసీగా సామాన్లు మోసి, హోటల్లో వెయిటర్‌గా చేసినవాడు. హృదయం అమృతం. నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో పరిచయం. నాకప్పుడు 22 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మ, తమ్ముళ్లు వచ్చినప్పుడు కంచి వెళ్తే -విష్ణు కంచి తిప్పి ‘ఉళహళంద పెరుమాల్’ (భూమిని కొలిచిన దేవుడు) దర్శనం చేయించి మాకు స్వయంగా వంటచేసి వడ్డించినవాడు. పెళ్లయి నా భార్య చిత్తూరికి కాపురానికి వస్తే ఇద్దరం బట్టలు పెట్టి నమ స్కారం చేశాం. మా ఇంట్లో గోడకి గొంతికిలా కూర్చుని మా ఇద్దరినీ ఆశీర్వాద పద్యంతో దీవించాడు. సకల సౌభాగ్య సంపత్తి, సరస మైత్రి/ ఆయురారోగ్య ఘనకీర్తి, ఆత్మతృప్తి/యోగఫల శక్తి, సుఖ సుప్తి కలిగి/ మారుతీ శివకాములు మనగ వలయు. తిరుపతిలో నా ‘వందేమాతరం’ ప్రదర్శనకి ఇప్పటికీ స్టేషన్ ఎదురుగా ఉన్న సత్రంలో మేకప్ అవు తుండగా సుందరాచారి దూసుకువచ్చాడు. ‘‘మారుతీ రావు. చెప్పు నన్నేంచెయ్యమంటావు?’ అంటూ. ‘‘మీరు కవులు. మీరు చెయ్యగలిగిన పని ఒక్కటే. మా కళావనికి ప్రార్ధన గీతం రాసిపెట్టండి’’ అన్నాను. అప్పటికప్పుడు కాగితం తీసుకుని, కలం పట్టుకుని గీతం కాదు, తేటగీత రాశాడు. ‘మా‘కళావని’ ఓంకార మర్మరాగ/ మాధురల నొంది, భావ సంపదను బడసి/ పల్కు గజ్జెలు కదల, విశ్వమును వశ్య/ పరుచుగావుత నటరాజ వందన ములు’ సుందరాచారి పేదవాడు. కానీ అక్షరం మీద ఘన మైన ప్రభుత్వాన్ని సాధించిన శ్రీమంతుడు. ఎంతో మందిని సమకూర్చుకుని- చిత్తూరు నడిబొడ్డులో గాయకశిరోమణి చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్లెకి స్వయంగా గండపెండేరం తొడిగి, కాళ్లు పట్టుకుని సభలో వందనం చేశాడు. అప్పుడు ‘ఆంధ్రప్రభ’ న్యూస్ ఎడిటరు జి. కృష్ణ గారు. మరునాటి దినపత్రికలో సుబ్రహ్మణ్య పిళ్లెకి జరి గిన సత్కారం పతాక శీర్షిక. బహుశా చరిత్రలో ఎవరూ ఆ పని చేసి ఉండరేమో! ఒక గాయకు డిని ఒక కవి ఇంత ఘనంగా, మనస్ఫూర్తిగా సన్మానం చేయడం. అప్పట్లో ఆయన నాకిచ్చిన ‘నా స్వామి’ అనే శతకం నా దగ్గర- ఒక్క నా దగ్గరే ఉంది. ఎవరయినా ప్రింటు చేస్తే 100 కాపీలు లంచం పుచ్చుకుంటానన్నాను చాలాకాలం కిందట ఒక కాలమ్ రాస్తూ. ఒకాయన 200 కాపీలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కోరగా వారికిచ్చాను. 5000 కాపీలు ప్రచురించారు. ఆయన అభిమానులు - ఇద్దరి పేర్లే చెప్తాను. విశ్వనాథ సత్యనారాయణ. శతకం చదివి, ‘స్వామి వచ్చి మీ గుండెల్లో కూర్చున్నట్లున్నది. వేసం గిలో కుండలో చల్లని నీళ్లలో వట్టివేళ్లు వేసి పానీ యమం దించినట్లున్నది’’ అన్నారు. మరొకాయన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. ‘కవి హృదంతర మున గలుగు నిర్వేదంబు/ విలువ నీవే యొరుగ గలవు..’’ అన్నారు. 1942లో ‘దీనబంధు’ అనే సినీమా కోసం రాసింది ఈ తెలుగుతల్లి పాట. తీరా ఆ సినీమాలో దర్శకుడు ఆ పాటని ఉంచలేదు. ఆశ్చర్యం లేదు. ఇంత గొప్ప పాటకి ఆ చిన్న వేదిక చాలదు. జాతికి జాతీయ గీతం కావలసిన పాట. అయింది. చాలామంది జీవితంలో ఎన్నో రచనలు చేస్తారు. కానీ కాలం కర్క శంగా వడబోసి ఒకటి రెండింటినే మిగులుస్తుంది. సుందరాచారి చాలా రచనలు చేశాడు. కానీ తెలుగుతల్లి పాట మిగిలింది. అభేరి రాగంలో తప్ప మరే రాగంలో పాడినా దీని రుచి ఇంతగా అందదు. సుందరాచారి జీవితం, ముగింపూ క ళ్లనీళ్లు తెప్పి స్తాయి. కానీ తన్మయత్వంతో, దేశభక్తితో, పులకరింతతో అనునిత్యం-తెలుగు సభల్లో జాతిని పులకింపచేసే దేశ భక్తుడు, పుణ్యాత్ముడు, పునీతుడినీ తలుచుకున్నా కళ్ల నీళ్లు వస్తాయి. మల్లెపూదండ మా సుందరాచారి. గొల్లపూడి మారుతీరావు -
గొల్లపూడి మారుతీరావు ఇంట్లో బొమ్మల కొలువు
-
కాఫీ కథ
జీవన కాలమ్ ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. దాదాపు 55 సంవత్సరాల కిందట- నేను చిత్తూరు ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓ వ్యాసాన్ని రాశాను. దాని పేరు ‘కాఫ్యాంతం కావ్యం’. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత... 7వ శతాబ్దంలో ఇథియోపియాలో ఓ గొర్రెల కాపరి పొలంలో పచ్చగడ్డిని తింటున్న గొర్రెలు ఉన్నట్టుండి మత్తుగా ఉండటాన్ని గమనించాడట. కారణం- ఒకంతకిగాని అర్థం కాలేదు. చెట్లకి కాసిన ఏవో వింత పళ్లు తినడం కారణంగా వాటిలో ఈ మార్పు వచ్చిందని కని పెట్టాడట. తనూ తిన్నాడు. తనకీ మత్తుగా అనిపించింది. ఆ విధంగా మొదటి కాఫీ గింజల రుచి మనిషికి అందింది. క్రమంగా సంపన్న కుటుంబాల వారికి ఈ మత్తు అందింది. ఇస్లాం దేశాలలో ఈ గింజలతో ‘గావా’ అనే వైన్‌ని తయారు చేసేవారట. ఈ వైన్‌ని ‘వైన్ ఆఫ్ అరేబియా’, ‘డెవిల్స్ డ్రింక్’ అనేవారట. అయితే మత్తు రుచిగా, సుఖంగా ఉంది కదా? ఈ కారణానికే క్రైస్తవ దేశాలలో ఈ గింజల ద్రావకాన్ని వింతగా చూశారు. మరి దీన్ని నిషేధించాలా వద్దా? ఎవరు నిర్ణయించాలి? పోప్‌గారి దగ్గరికి ఈ ధర్మ సందేహం చేరింది. ఆయనా కాఫీని రుచి చూశారు. చూసి తన్మయుడయిపోయాడు. నిషేధించడానికి మనసు రాలేదు. కాగా, తమ సొంతం చేసుకోవాలని మనసు ఉవ్విళ్లూరింది. దాన్ని నిషేధిం చకపోగా ఈ ద్రావకానికి మతాన్ని ఇచ్చి ‘పెద్దల ద్రావకం’గా అంగీకరించారు. అప్పటి నుంచీ వాటికన్లో ఈ కాఫీ జొరబడింది. టర్కీలో ఈ కాఫీ ఇంకా ప్రాధాన్యం సంపాదించుకుంది. సమాజ ధర్మంలో భాగమయిపోయింది. పెళ్లికి ఫలానా అమ్మాయి వరుడుకి తగిన భార్య అవునా కాదా ఎలా నిర్ణయించాలి? ఆ పిల్ల కాఫీ తయారు చేయాలి. ఆ కాఫీ రుచిని బట్టి ఆ అమ్మాయిని ఎంపిక చేసేవారట. అది ఆ అమ్మాయి మొదటి అర్హత. ఇంకా విడ్డూరం ఏమిటంటే ఏ కారణం చేతయినా అమ్మాయి కాపురం చేస్తూ కాఫీ తయారు చేసే ఒడుపుని నష్టపోతే- భర్త కోర్టుకి వెళ్లి విడాకులకి అర్జీ పెట్టుకోవచ్చు. టర్కీ ఆడపిల్ల ఏదయినా నష్టపోవచ్చుకానీ, కాఫీ తయారు చేసే పనివాడితనాన్ని పోగొట్టుకోకూడదు. భారతదేశంలో కాఫీ కథ ఇంకా విచిత్రమైనది. బాబూ బూడాన్ అనే సూఫీ ముస్లిం మత ప్రవక్త 16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకి వెళ్లి తిరిగి వస్తూ యెమన్ నుంచి ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి తీసుకువచ్చాడు. ఏడు గింజలే ఎందుకు? ఇస్లాంకి 7 చాలా పవిత్రమైన అంకె కనుక. వాటిని కర్ణాటకలో చిక్ మగుళూర్ కొండల్లో నాటాడు. అప్పట్లో ఆ కొండల్ని దత్తాత్రేయ కొండలు అనేవారట. దరిమిలాను కర్ణాటక, నాగినహళ్లి ప్రాంతంలో కొండల్ని ఇప్పటికీ బాబూ బుదం గిరి - అని అంటారు. 7 గింజలతో దిగుమతి అయిన కాఫీని ప్రస్తుతం 107 దేశాలకు భారతదేశం ఎగుమతులు చేస్తోంది. ఈ కాఫీ పంటకీ అరకు లోయకీ బంధుత్వముంది. 1890 ప్రాంతంలో అరకు లోయ పొలాల్లో 3 సంవత్సరాల దిగుబడి ఇచ్చే పంటల తర్వాత పోడు వ్యవసాయానికి (జిజీజ్ట ఛిఠ్టజీఠ్చ్టిజీౌ) ప్రత్యామ్నాయంగా ఈ కాఫీ పంటని అప్పటి జయపూర్ మహారాజు, బ్రిటిష్ రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో వేశారట. ఇప్పటికీ యూరోపు ‘మార్నింగ్ కాఫీ’కి అరకులో పండిన కాఫీ గింజలనే శ్రేష్ఠంగా చెప్పుకుంటారు. అసలు వినడానికే ఇబ్బందిగా, కాస్త వెగటుగా, కాని వాస్తవమయిన విచిత్రమైన కాఫీ ఒకటుంది. అది ఇండోనేసియాలో తయారవుతుంది. చాలా ఖరీదయిన, ఎంతో రుచికరమైన కాఫీ అది. ఇండో నేిసియాలో ‘సివిట్ (ఇఉగఐఖీఖీ)’ అనే పిల్లికి కాఫీ పళ్లు తినిపిస్తారట. కాఫీ గింజలమీద ఉన్న పొట్టుకోసం పిల్లి తింటుంది. పొట్టు ఊడి, గింజలు పిల్లి శరీరంలో ప్రయాణం చేసి, దాని పేగులలోంచి వెళ్తూ కొన్ని రసాయనికమైన మార్పులకు లోనవుతాయి. తర్వాత పిల్లి ఆ గింజల్ని విస ర్జిస్తుంది. వాటిని ఏరి, శుభ్రం చేసి, వేయించి కాఫీ చేస్తారు. ఈ కాఫీ చాలా విలువైనది, రుచికరమైనది, ఖరీదైనది. ఒక కప్పు 5 డాలర్ల నుంచి వంద డాలర్లు ఉంటుంది. దీని పేరు ‘సివిట్ షిట్ కాఫీ’ (తెలుగులో ‘సివిట్ పెంట కాఫీ’). మా ఆవిడ చెప్పిన కథ - దాదాపు 65 సంవత్సరాల కిందట రాజమండ్రిలో ఆమె నాయనమ్మ - అంటే శ్రీపాద కామేశ్వరరావుగారి సతీమణి రూలు ప్రకారం కాఫీని చిన్న పిల్లలు తాగకూడదు. ఎందుకని? మత్తు రుచులు మరిగి చెడిపోతారని. మా అత్తగారు - అంటే ఆవిడ పెద్ద కోడలు - తన అత్తగారికి తెలియకుండా పిల్లలకి చిన్న గ్లాసుల్లో కాఫీ అందించేదట. వీళ్లు తలుపు చాటున నక్కి - దొంగతనంగా కాఫీ తాగి ఆనందిం చేవారట. ఒకప్పుడు అందరికీ జొన్న అన్నమే ఆహారం. ‘.... జొన్నలె తప్పన్ సన్నన్నము సున్న సుమీ’ అని వాపోయాడు శ్రీనాథుడు. ఇప్పుడు సన్నన్నం తప్ప జొన్న అన్నం ఎవరికీ తెలియదు. అలాగే ఆలోచనలోకయినా రాని ఒకప్పటి ద్రావకం ఇవాళ నిత్యావసరమైపోయింది. కేవలం 7 గింజల్తో విశ్వరూపం దాల్చిన కాఫీ ఇవాళ సర్వాంతర్యామి. గొల్లపూడి మారుతీరావు -
సోమసుందర్ జ్ఞాపకాలు
జీవన కాలమ్ నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకించాను- గర్వంగా. 2011 ఏప్రిల్ 16. తెలుగు నాటక దినో త్సవం నాడు కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కా రానికి వెళ్తూ దారిలో సోమసుందర్గారిని దాదాపు నిద్ర లేపాను. ఆయన ఇంటి దగ్గర ఆగుతానని ముందే ఫోన్ చేసి చెప్పాను. నీరసంతో మంచం మీంచి లేవలేని పరిస్థితి. ఎప్పుడు కలసినా నాలుగైదు పుస్తకాలు - ఆయన రాసిన కొత్తవి - ఇవ్వకుండా ఉండరు. నికార్సయిన జీవ లక్షణం, మంచికి స్పందించే అద్భుతమైన అభిరుచి- ఈ రెండూ ఆయన 92 సంవత్సరాలు ‘జీవించ’ డానికి పెట్టుబడులు. 1957 ఏప్రిల్ 1. విశాఖపట్నం హిందూ రీడింగ్ రూంలో సోమసుందర్, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, మల్లాది రామచంద్రశాస్త్రి మొదలైనవారు పాల్గొన్న కవితా గోష్టి. నేను బొత్తిగా చిన్నవాడిని. లేచి నిలబడి నేను రాసిన ఉమర్ ఖయ్యూం పద్యాలు గడగడా చదివేశాను. నన్ను ‘సాఖీ కవి’ అన్నారు సోమసుందర్. చక్కటి మేలిమి ఛాయ. సంపన్నుడు. బంగారం రంగు సిల్కు లాల్చీ, ఉంగరాల జుత్తు, నిండైన నవ్వు - చూడగానే చూపు తిప్పుకోలేనంత అందగాడు. మళ్లీ పదేళ్ల తరువాత కాకినాడ సాహితీ సభలో కలిశాం. అరిపిరాల విశ్వం, నేనూ, కుందర్తీ ఒక గదిలో. సోమసుందర్ ఆ సభకి వచ్చి నన్ను కావలించుకున్నారు- ‘మనం కలసి పదేళ్లయింది’ అని గుర్తు చేస్తూ. మద్రాసులో మా ఇంటికి ఎదురుగా అనిసెట్టి సుబ్బారావుగారి ఇల్లు. అక్కడికి ఎప్పుడు వచ్చినా కలిసేవారు. ఒకటి రెండు సార్లు భోజనానికి వచ్చారు. మంచి భోజనప్రియులు. అల్లం, పచ్చిమిరపకాయలు దట్టించిన కూరలు, పిండి వడియాలు వేసిన పనసపొట్టు కూర, ధనియాల చారు వంటివి అత్యంత ప్రియమైనవి. మొన్న టిదాకా చుట్ట కాల్చారు. గొప్ప సంభాషణాప్రియులు. సమయస్ఫూర్తితో పాటు చక్కని హాస్య ప్రియత్వం వారి ప్రత్యేకత. 2009 ఏప్రిల్ 10. పొలమూరులో నాకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక పుర స్కారం ఇచ్చినప్పుడు ఆయనా, చామర్తి కనకయ్యగారూ వచ్చారు. యథాప్రకారం ఒక సంచీతో పుస్తకాలు. ఆనాటి సభలో స్నేహపూర్వకమైన ప్రసంగం చేశారు. ఆ మధ్య ‘మిసిమి’లో సాహితీ విమర్శ మీద నా వ్యాసం వచ్చింది. ఉదయమే ఫోన్ - వ్యాసం చాలా గొప్పగా ఉందంటూ. నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకిం చాను- గర్వంగా. 2012 నవంబర్ 18. సోమసుందర్ చారిటబుల్ ట్రస్ట్ జరిపే పురస్కార ప్రదాన సభకి ముఖ్య అతిథిగా చెన్నై నుంచి బయలుదేరాను. పరాకుగా విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డు తీసుకున్నాను. మా అబ్బాయి పొరపాటు కారణంగా హైదరాబాదు విమానం ఎక్కేశాను. మళ్లీ 11-30 కి మరో విమానం ఎక్కి, విశాఖ వచ్చి సరాసరి పిఠాపురం వెళ్లాను. రామాచంద్రమౌళి, అంపశయ్య నవీన్, చందు సుబ్బారావు, దాట్ల దేవదానంరాజు అంతా ఉన్నారు. నాది ఆఖరి ప్రసంగం. ఆయనది సంకల్పబలం. 89వ ఏట పెళ్లికొడుకులాగ కూర్చుని అందరినీ సత్కరించారు. ఆయన ‘కబడ్దార్! కబడ్దార్!’ కవితలో ‘పదండి ముందుకు’ గేయానికి తీసిపోని ఆవేశం, అభివ్యక్తీ ఉన్న వని నాకనిపిస్తుంది. తొలిరోజుల్లో కృష్ణశాస్త్రి కవిత్వాన్ని భుజాల మీద ఊరేగించిన యువసేనకి సైన్యాధ్యక్షుడు. ప్రతిభ ఎక్కడ కనిపించినా భుజాన ఎత్తుకునే ఔదార్యం ఆయన సొత్తు. ఆయన స్పృశించని రచయిత లేడు - పురిపండా, సి. నారాయణరెడ్డి, దేవులపల్లి, చెలం (పురూరవ), గుర జాడ, శ్రీశ్రీ, కుందర్తి, ఖైఫీ అహమ్మద్, శేషేంద్రశర్మ, అనిసెట్టి - ఆయన స్పందన ఎప్పుడూ వ్యాసంతో ఆగేది కాదు. ఒక గ్రంథమయ్యేది. తెలుగుభాషలో ప్రత్యేకమైన పలుకు సోమసుందర్ సొంతం. ‘కృష్ణకోకిల స్వామికి సౌవర్ణిక’ వ్యాసం మొదటి నాలుగు వాక్యాలు ఉదహరించాలని కలం వేగిరపడుతోంది. ‘‘శ్రీ కృష్ణశాస్త్రి ఆగమనంతో ఆంధ్ర సాహితికి ముసలితనపు దీర్ఘ శిశిరం దుసి కిల్లిపోయింది. ఓసరిల్లి ఉన్న పాతలోగిలి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. కొత్త ఈదురుగాలి ఒకటి కొసరి కొసరి పిలిచింది. గుబాళించింది. అలసిసొలసిన హసంతి కానిలం నింపాదిగా నిద్రమడతలు తొలగించుకున్నది....’’ ఎన్నాళ్లయింది ఇంత చక్కని నుడికారపు సొగసుల్ని జుర్రుకుని! మొదటి నుంచీ ఆస్తికత్వానికి అసింటా జరిగినా - రుచినీ, అభిరుచినీ; కవి త్వంలో, అభివ్యక్తిలో కొత్తదనాన్నీ, గొప్పదనాన్నీ విడిచిపెట్టకుండా- తన చుట్టూ గిరులు గీసుకోని నిజమైన భావుకుడు. వయసుని జయించడానికి జీవితమంతా దగ్గర తోవని పట్టుకున్న ధీశాలి, ఉదారుడూ, ఉద్యమకారుడూ - తన నమ్మకాలకు హృద యాన్ని తాకట్టు పెట్టకుండా తన షరతుల మీదే ‘కవిత్వాన్ని’ అనుభవించిన యోగి, భోగి ఆవంత్స సోమసుందర్. - గొల్లపూడి మారుతీరావు -
గొప్ప మేష్టారు
జీవన కాలమ్ కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయిపోతారు. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండే షన్ సభలకి ముగ్గుర్ని ఆహ్వా నించాలని తాపత్రయ పడేవా ళ్లం - పి.వి. నరసింహారావు, శివాజీ గణేశన్, అబ్దుల్ కలా మ్. అనారోగ్యం కారణంగా నరసింహారావు గారు రాలేక పోయారు. శివాజీ గణేశన్ అవ కాశం ఇవ్వకుండానే వెళ్లిపో యారు. ఒక యువకుని కలల్ని మృత్యువు అర్ధంతరంగా తుంచేయడం ఆయన్ని స్పందింపజేస్తుందని భావిస్తూ మాజీ రాష్ట్రపతిని సంప్రదించాం. వారిని కలవ డానికి నేను వెళ్లలేకపోయాను. పిల్లలు వెళ్లారు. మా కృషిని అభినందిస్తూనే ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాల కారణంగా రాలేకపోయారు. అది మా దురదృష్టం. జీవితంలో అవసరాల్ని అతి విచిత్రంగా కుదించు కున్న ఆయన గురించి ఎన్నో కథలున్నాయి. అన్నా విశ్వ విద్యాలయంలో ఆయన ఒక చిన్న గదిలో ఉండేవారట - ఒక పూర్తి ఇంటిని తీసుకోగలిగినా, ఆయనకి వంట చేసే తమిళుడు - ఆయన భోజనం గురించి చెప్పేవాడు. వెర్త కుళంబు, చారు, వడియాలు - ఇంతే ఆహారం. ఆయనకి ఒక సహాయకుడు ఉండేవాడు. ఏనాడూ తన బనీను, అండర్ వేర్ అతనికి ఉతకడానికి ఇచ్చేవారు కారట. రాష్ట్రపతి భవనంలోకి ఒక బ్రీఫ్‌కేసుతో వచ్చి ఆ బ్రీఫ్ కేసుతోనే తిరిగి వెళ్లారని చెప్తారు. తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైం టిస్టు పని చేసేవాడు. పొద్దుట ఆఫీసుకి వెళ్తే ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. ఒక రోజు భార్య తడబడుతూ చెప్పింది. పిల్లలు ఊళ్లో ఎగ్జిబిషన్‌కి వెళ్లాలనుకుంటున్నా రని. సైంటిస్టు బాధపడిపోయాడు. ఆ రోజు త్వరగా ఇం టికి వస్తాననీ, పిల్లల్ని సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు. ఆఫీసుకి వెళ్లి బాస్‌తో ఆ విషయం చెప్పాడు. నిరభ్యం తరంగా వెళ్లమని అన్నాడాయన. తీరా పనిలో పడ్డాక రాత్రి 8 గంటలకి ఆ విషయం గుర్తుకొచ్చింది. తుళ్లి పడ్డాడు. భార్యకిచ్చిన మాట తప్పాడు. సిగ్గుపడుతూ ఇంటికి వచ్చాడు. పిల్లలు కనిపించలేదు. ‘పిల్లలేరీ?’ అని అడిగాడు భార్యని. మీ బాస్ వచ్చి ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్లా రని చెప్పింది. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. తన ఉద్యోగంలో ఆయన రెండేసార్లు సెలవు పెట్టా రట. ఆయన తండ్రి పోయినప్పుడు. తల్లి పోయిన ప్పు డు. పొద్దున్నే భగవద్గీత చదువుకుంటారు. 18 గంటలు ఉద్యోగం. రుద్రవీణ వాయిస్తారు. ఆయన రామ భక్తుడి నని ఆయనే చెప్పుకున్నారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు: ‘‘మీ దృష్టిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి?’’ అని. ఆయన చెప్తూ ‘‘నేనింతవరకూ సూర్యుని చుట్టూ 76 సార్లు తిరి గాను (అంటే వయస్సు 76 సంవత్సరాలు) నేను మరిచి పోలేని విషయం ఒకటుంది. శ్రీహరికోట నుంచి మొద టి ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు ఒక సాంకేతిక లోపం వచ్చింది. అయినా ప్రయోగించవచ్చని నేను నిర్ణ యం తీసుకున్నాను. ఆ ప్రయోగం విఫలమయింది. అం దరూ విమర్శించారు. వెంటనే పత్రికా సమావేశం జర గాలి. మా డెరైక్టర్ సతీష్ ధావన్ ‘‘నేను పత్రికా సమా వేశంలో మాట్లాడుతాను’’ అన్నారు. విమర్శల్ని సూటిగా ఎదుర్కొన్నారు. రెండో ప్రయోగం విజయవంతమ యింది. నన్ను పిలిచి ‘‘పత్రికా సమావేశంలో నువ్వు మాట్లాడు’’ అన్నారు. ఇది గొప్ప పాఠం. మంచి నాయ కుడు వైఫల్యానికి బాధ్యతని ధైర్యంగా తీసుకుంటాడు. విజయాన్ని తన అనుయాయులతో పంచుకుంటాడు’’. ‘‘మీలో పూడ్చుకోలేని పెద్ద లోపమేమిటి?’’ అని ఓ తెలివైన పాత్రికేయుడు అడిగాడట. కలామ్ నవ్వి ‘‘నాకు చేతకాని ఒకే ఒక్క విషయం - రాజకీయం’’ అన్నారట. కలామ్ వేదిక మీద నిలబడితే ఉపాధ్యాయులయి పోతారు. ఆయన ఉపన్యాసం పాఠం చెప్తున్నట్టు ఉం టుంది. తన ముందున్న వాళ్లని తన వాళ్లుగా చేసుకునే ఆత్మీయత ఉపాధ్యాయుడిది. నాకనిపించేది - పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల్లోనూ ఆయన ఉపాధ్యాయుడే అయిపోతారు. విచిత్రంగా ప్రేక్షకులు మొదట ఆశ్చర్య పడి, ఆయన మాటలకు ఆనందపడి - తమకు తెలియ కుండానే విద్యార్థులయిపోతారు. చిన్న పిల్లల్లాగ చప్ప ట్లు కొడతారు. నాకు చాలా ఇష్టమయిన, ఆయన చెప్పిన గొప్ప సూక్తులలో ఒకటి: ‘‘వైఫల్యం నువ్వు కిందపడినప్పుడు కాదు. వైఫల్యం నువ్వు కిందపడి లేవడానికి ప్రయత్నం చెయ్యనప్పుడు’’. ఒక మత్స్యకారుల కుటుంబంలో పుట్టి, అంతులేని పేదరికాన్ని అనుభవించి (ఆయన తల్లి వీలయినంత కిరసనాయిలు ఆదా చేసేవారట - కలామ్ రాత్రివేళల్లో చదువుకోడానికి కలసి వస్తుందని!) కేవలం స్వశక్తితో పద్మశ్రీ అయి, పద్మభూషణ్ అయి, పద్మవిభూ షణ్ అయి, భారతరత్న అయి, ఈ దేశానికి రాష్ర్టపతి అయి, దేశ, విదేశాలలో 40 విశ్వవిద్యాలయాలలో గౌర వ డాక్టరేట్లను అందుకున్న అతి సామాన్య జీవితాన్ని గడిపిన మేష్టారు తప్ప ఈ మాటని ఎవరూ చెప్పలేరు. ఒక వ్యక్తి గొప్పతనం అతని అవసానం చెప్తుందం టారు. అంతిమ క్షణాలలో తనకి అత్యంత ఆత్మీయులైన యువతతో ప్రసంగిస్తూనే వేదిక మీదే తనువు చాలిం చడం అతను సిద్ధ పురుషుడని చెప్పడానికి గొప్ప నిదర్శనం. గొల్లపూడి మారుతీరావు -
సినిమాలాంటి కథ
జీవన కాలమ్ మాధ్యమంలో ‘నీతి’ త్రివేణీ సంగమంలో సరస్వతి నది లాంటిది. దానికోసం వెదకనక్కరలేదు. అది నిర్మాత, దర్శకుని మనస్సులో ఉంటే చాలు. ప్రేక్షకుడు గుర్తుపడతాడు. ఇది వేడి వేడి కథ. తమిళనాడులోని నాగరకోయిల్లో పిళ్లె యార్పురంలో ఉన్న సివాంతి ఆదిత్నార్ కాలేజీలో జరిగింది. సుదన్ అనే కుర్రాడు తనకంటే రెండేళ్ల సీనియర్ అమ్మాయితో కాలేజీ క్లాసు గదిలో తలుపులు బిగించుకుని కాలక్షేపం చేశాడు. కాలేజీ యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. కుర్రాడు కోర్టుకెళ్లాడు. ఆ విషయమై ఆ అమ్మాయి ఫిర్యాదు చేయలేదు కనుక సాక్ష్యం లేదని అతని వాదన. అతని తరఫు న్యాయవాది ఏం వాదించాడో తెలుసుకోవాలని ఉంది. ఇద్దరూ కాలేజీ గదిలో తలుపులేసుకుని భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నారా? సీనియర్ అమ్మాయి అతనికి మహాత్మాగాంధీ గురించి వివరిస్తోందా? ఇద్దరూ కలసి వసుైధైక కుటుంబం గురించి ప్రార్థనలు చేస్తున్నారా? దరిమిలాను ఆ కుర్రాడిని యాజమాన్యం కాలేజీ నుంచి డిస్మిస్ చేసింది. కేసు హైకోర్టుకి వచ్చింది. అది అవినీతి చర్య అంటూ హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ కేసు కొట్టేశారు. ఆయన రెండు విషయాలు చెప్పారు. ‘చదువు చెప్పే పాఠశాలల్ని దేవాలయాలుగా భావించాలి. ఉపాధ్యాయులు దేవుళ్లు. (ఇదే పత్రికలో మరొక వార్త- విల్లుపురంలో అసిస్టెంటు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల ‘దేవత’-పేరు రమ్య- తన దగ్గర చదువుకుంటున్న సతీష్‌కుమార్ అనే 21 ఏళ్ల కుర్రాడిని పెళ్లిచేసుకుంది!) ఇవీ న్యాయమూర్తి మాటలు: ‘ఈ రోజుల్లో సినీ మాలు, మాధ్యమాలూ యువతరం మీద ఎక్కువ ప్రభా వం చూపుతున్నాయి. నేరస్తుల కార్యకలాపాలను చూపే సినీమాలు యువతను నేరాల వేపు ప్రోత్సహిస్తున్నాయనడంలో సందేహం లేదు. సెక్స్ మొదలైన సహజ బల హీనతలను ఎత్తిచూపే సినీమాలు మానవ నైతిక ప్రవర్తనను చెడుదారి పట్టిస్తున్నాయి. టీవీలు, సినీమాలు, నాటకాలు, ఇతర ఆధునిక సాంకేతిక వినియోగాలు, మొబైల్ ఫోన్లు యువకుల జీవితాల్ని పెడదారి పట్టించ డానికి మూలకారణాలు అవుతున్నాయి. ఈ కేసు అందు కు సరైన ఉదాహరణ’. ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తే - సమాజానికి పీడగా పరిణమించే ప్రమాదముంది - అంటూ కుర్రాడి అప్పీలుని తిరస్కరించారు. మాధ్యమం- సినీమా కానీ, మరేదయినా కానీ సమాజానికి భూతద్దం. సమాజ నీతికి జనరలైజేషన్. మంచివాడి మంచితనం కన్నా- విలాస పురుషుడి విలా సాలు చాలా ఆకర్షణీయంగా, అందుబాటుగా, అలవరు చుకొనేంత సులువుగా కనిపిస్తాయి. మనిషి బలహీనత- మెజారిటీ ప్రేక్షకులకు దగ్గరగా, అందుబాటులో ఉంటుంది. చెల్లిపోయినంత వరకూ గొప్పగా ఉంటుంది. చెల్లించుకోగలిగితే గర్వంగా ఉంటుంది. అందుకే మాధ్య మాలకు మంచి ఖాతాదారులు - యువత. అరాచకం దాని రుచి. ‘సంసారం ఒక చదరంగం’ సినీమా రిలీజయి 28 సంవత్సరాలయింది. సింగపూర్ నుంచి ఓ కంపెనీ చైర్మన్, చీఫ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్ పోతుల బాలవర్ధన్‌రెడ్డి కిందటివారమే తెలుగులో ఉత్తరం రాశాడు: ‘మీ ‘సంసారం చదరంగం’ అంటే నాకు పంచప్రాణాలు. కొన్ని పదులసార్లు చూసి ఉంటా. వీలుదొరికినప్పుడల్లా చూస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడున్న మీరు ప్రతీ మధ్యతరగతి కుటుంబీకుల నాన్నే. ఆ పాత్రకి హ్యాట్సాఫ్... పాదాభివందనాలతో’. సినీనటుడికి ఒక ప్రేక్షకుడు- అదిన్నీ అంత ఉన్నత పదవిలో ఉన్న ఒక అధికారి ‘పాదాభివందనం’ చేసి ఎన్నాళ్లయింది? మాధ్యమం చెప్పే మంచికి స్పందించిన ఒక వ్యక్తి ఆవేశమది. ఈ అభినందన నటుడిది కాదు - మాధ్యమానిది. ఈ మధ్య ఒక సభలోంచి బయటకు వస్తూంటే ఓ వృద్ధురాలు నా ముందుకు వచ్చి నా కాళ్లకు నమస్కారం చేసింది. నేను కంగారు పడిపోయాను. ఏవేవో చెప్పి ‘ఈ నమస్కారం మీరు వేసిన తండ్రి పాత్రకు’ అంది. నేనా చిత్రానికి కథా రచయితని కాను. కేవలం నటుడినే. అయినా ఓ పాత్ర, దాని సౌజన్యం మూడు దశాబ్దాలు ప్రేక్షకుల మనస్సుల్లో మిగిలింది. దురదృష్టవశాత్తూ మాధ్యమాలు వ్యాపారంగానే నిలదొక్కుకుని- సామాజిక బాధ్యతని అటకెక్కించాయి. ఓ లవకుశ, ఓ ప్రతిఘటన, ఓ సీతారామయ్యగారి మనుమరాలు, ఓ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఓ మొఘల్-ఏ- ఆజం మంచిని చెప్తూనే వ్యాపారాలు చేశాయి. మాధ్యమంలో ‘నీతి’ త్రివేణీ సంగమంలో సరస్వతి నది లాంటిది. దానికోసం వెదకనక్కరలేదు. అది నిర్మాత, దర్శకుని మనస్సులో ఉంటే చాలు. ప్రేక్షకుడు గుర్తుపడతాడు. అలాగే దాని అవసరం లేదని అటకెక్కించేసిన ‘నిజం’ కూడా ప్రేక్షకుడు గుర్తుపడతాడు. ఎలా? నాగరకోయిల్ సుదన్ అనే కుర్రాడిగా. దురదృష్టం ఏమిటంటే న్యాయమూర్తి విధించేది అధికారంతో పెట్టే ఆంక్ష. మాధ్యమాల విశృంఖలత్వం వాటికి దక్కిన స్వేచ్ఛ దుర్వినియోగం. -
చరిత్ర ఓ శిఖరం
జీవన కాలమ్ నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవన సరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న మనియార్డర్ కథ ముగిసింది. ఈ మధ్య ఇలాగే టెలిగ్రామ్ వారసత్వమూ ముగిసింది. ఎప్పుడో 1880లో దేశంలో లక్షా 55 వేల పోస్టాఫీసులలో ఈ సౌకర్యాన్ని ఆనాటి ప్రభుత్వం ఏర్పరిచింది. కొన్ని చరిత్రలకి కాలదోషం పట్టడం కాలధర్మం. మా అమ్మ చెప్పేది. ఆవిడకి పన్నెండో యేట పెళ్లయింది. భర్త దగ్గరకి- అంటే విజయనగరం నుంచి విశాఖపట్నం రావాలి. ఈవిడ పెద్దమ్మాయి. అత్తారింటికి వెళ్లనని ఏడ్చేదట. మా తాతగారు బుజ్జగించి ఓ మిఠాయి పొట్లాం కొనిచ్చి, విజయనగరం రైల్వేస్టేషన్ దాకా ఒంటెద్దు బండి కట్టించి పంపేవారట. విశాఖపట్నంలో విప్పర్తివారి వీధిలో కాపురం. ఆ ఇంట్లోనే మరో కుటుంబం ఉండేది- శ్రీశ్రీ తల్లిదండ్రులు. ఇప్పుడు ఒంటెద్దు బండి దాదాపు చరిత్ర. నాకు మొదటి కథకి 5 రూపాయలు మనియార్డరు రావడం గుర్తుంది. రెండు కారణాలకి అది పెద్ద జ్ఞాపకం. మొదటి సంపాదన. కథకి రాబడి. ప్రొద్దుటూరులో జూటూరు రమణయ్య గారనే వదాన్యులు, ఆయన నా నాటిక ఏదో చూశారు. ముచ్చటపడి - ఆ నాటికని మెచ్చుకుంటూ నాకు ‘వరుమానంగా’ 15 రూపాయలు మనియార్డరు పంపారు. ఒక ప్రశంసకి మనియార్డరు ఒక అభిమాని పంపడం అదే మొదటిసారి. ఆఖరిసారీను. ‘మనిషికో చరిత్ర’లో నా పేరు పంచముఖాగ్ని హోత్రావధాని. పోచికోలు కబుర్లు చెబుతూ కాలం వెళ్లబుచ్చే తెలివైన సోమరి. భార్య వెంకటలక్ష్మికి మని యార్డరు వస్తుంది. పోస్ట్‌మ్యాన్‌ని నిలదీస్తాడు. ‘వెంకట లక్ష్మి లేదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. అడ్రసు తెలీదు. ఏం చేస్తావ్?’ ‘డబ్బు కట్టిన వాళ్లకే పంపించేస్తాం’ ‘మరి వాళ్లు కట్టిన చార్జీలు?’ ‘డిపార్టుమెంటుకి.’ ‘అదెలాగయ్యా? మా డబ్బులు మీ దగ్గర కొంతకాలం మూట కట్టించుకుని మళ్లీ మాకే ఇచ్చెయ్యడానికి మేం చార్జీలు ఇవ్వాలా? బ్యాంకుల్లో వేస్తే వడ్డీ వస్తుంది కదా! రెండూ గవర్నమెంట్ సంస్థలే కదా? పోస్టల్ డిపార్టుమెంటుకి ఒక రూలు, బ్యాంకులకి ఒక రూలా?’ మన తరంలోనే 7 విషయాలు అంతరించాయట. ఇది ఆలోచించాల్సిన విషయం. 1. పోస్టాఫీసు, ఉత్తరాలు, మనీయార్డర్లు, ట్రంక్‌కాల్స్ అవసరాలు తీరి పోయాయి. 2. చెక్కుబుక్కు. ఈ మధ్య ఏదో కంపెనీ ఇంటర్నెట్లో డబ్బు కడితే 20 రూపాయలు రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. 3. పుస్తకం. రచయితగా ఈ ఆలోచన బాధగా ఉన్నా మరో రూపంలో రచన జీవిస్తుంది- రాయడానికి కంప్యూటర్, పంపడానికి ఇంటర్నెట్ కాక కనీసం 200 పైచిలుకు పుస్తకాలను దాచుకోవడానికి ‘ఎమెజాన్’ ఉంది. ఇంకా హార్డ్‌కాపీలు, పెన్‌డ్రైవ్‌లూ- మీ ఇష్టం. 4.అమెరికా గ్రంథాలయాల్లో చాలా చోట్ల ఆడియో పుస్తకాలను చూశాను. తెలుగులో మొదటి ఆడియో నవల - నా ‘పిడికెడు ఆకాశం’ని మిత్రులు పెద్దిరెడ్డి గణేశ్‌గారు ప్రచురించారు. తెలుగు చదవడంరాని ఈనాటి చాలామంది తెలుగువారికి ‘ఆడియో’ పెద్ద వరం. 5. టెలిఫోన్ డిపార్టుమెంట్ అవినీతితో, అహంకారంతో దశాబ్దాలుగా బానిసత్వాన్ని అనుభవించిన మనకి ఇంటి ‘ల్యాండ్ టెలిఫోన్’ దరిద్రం వదిలి పోయింది. 6. ఈ తరంలోనే విశ్వరూపం దాల్చిన మరో వినోదం- టెలివిజన్. ఇవాళ ప్రతి సెల్‌ఫోనూ ఒక టెలివిజనే. 7. సంగీత వాద్యాలు. ఇవాళ ఏ వాయిద్యాన్నయినా వాయించగల సింథసైజర్స్ వచ్చేశాయి. ఈ మధ్య పేరూరులో ఒక ఊరేగింపులో నాదస్వరం కచ్చేరీ వినిపించింది. డోలు వాయిస్తున్న వాద్యగాడిని మెచ్చుకోవాలని పరుగెత్తాను. సింథసైజర్ ముందు కూర్చుని కళ్లు తిరిగిపోయేలాగ వాయిస్తున్న క్లారినెట్కి సహకార వాద్యాన్ని అందిస్తున్నాడు. కోల్పోయే ముఖ్యమైన విషయం- మన ఏకాం తం. ఒక్క ఆధార్ కార్డు చాలు దేశంలో ఎక్కడయినా మన చరిత్రను విప్పడానికి. ఉపగ్రహంతో కనుగొనే సాధనాల ద్వారా విశాఖపట్నంలో మన ఇంటిమీద ఎన్ని పెంకులున్నాయో కెనడాలో కూర్చుని లెక్క పెట్టవచ్చు. నాకేమో చరిత్ర పునరావృతమౌతుందన్న మాటని ఒప్పుకోవాలనిపించదు. చరిత్ర వలయం కాదు. చరిత్ర ఒక శిఖరం. తనని తాను ఓడించుకుంటూ, తనని తానే జయించుకుంటూ కొత్త సౌలభ్యంతో, కొత్త అవతారంతో మన జీవనసరళిని మలుపు తిప్పుతూనే ఉంటుంది. తాతగారు కన్నుమూయడం కాలధర్మం. కాని మనుమడు ఆయన వారసత్వపు మూలాలను నిక్షిప్తం చేస్తూనే కొత్తపుంతలను తొక్కడ మూ కాలధర్మమే అవుతుంది. లేకపోతే మానవుడు ఇప్పటికీ కొండ గుహల్లోనే జీవిస్తూ ఉండేవాడు. (కొసమెరుపు: ఇంతకీ పోస్టల్ డిపార్టుమెంట్ మనియార్డరు విధానాన్ని నిలిపి వేయలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ప్రధాన పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ ప్రకటించారు.) -
హనీమూన్ అయిపోయింది
జీవన కాలమ్ భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగిసింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘటనలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మవిశ్వాసం ఉంది. 2014లో భారతీయ జనతా పార్టీ - తద్వారా నరేంద్ర మోదీ విజయానికి అహర్నిశలూ కష్టపడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్. పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలనతో విసిగి వేసా రిపోయిన ఓటరు ఈ అవినీతి పాలనకు ఏనాటికయినా ప్ర త్యామ్నాయం కనిపిస్తుందా అని నిస్సహాయంగా ఎదురు చూస్తూ మోదీ నాయక త్వాన్ని నిర్ద్వంద్వంగా ఆహ్వానించారు. ఇందులో ఆ పార్టీకి సంబంధించిన కొన్ని అతివాద విధానాలనీ, మత ఛాందసాన్నీ సమ్మతించనివారూ, మతేతరులూ కూడా ఉన్నారు. నరేంద్ర మోదీని నిండు మనస్సుతో ఆహ్వానిం చిన కోట్లాదిమందిలో నేనూ ఉన్నాను. ఆయన పార్లమెంటు ముందు మోకరిల్లినప్పుడు అందరం పులకించాం. తల్లి దీవెనలందుకున్నప్పుడు ఆర్ద్రతతో కరిగి పోయాం. పదవీ స్వీకారానికి సార్క్‌దేశాల నాయకులను ఆహ్వానించినప్పుడు ఆయన రాజనీతిజ్ఞతకు పొంగిపో యాం. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌గారి తల్లికి ఆత్మీ యంగా పట్టుశాలువా పంపినప్పుడు రాజకీయాలకు అతీతంగా మానవత్వపు విలువలకి పెద్దపీట వేసినం దుకు మోదీని ప్రశంసించాం. ప్రతిపక్షాలు ఆయన ప్రతి ష్టను విదేశాలలో గబ్బు పట్టించిన నేపథ్యంలో ఒక్కొక్క దేశపు ప్రశంసలనీ ఆయన అందుకుంటున్నప్పుడు మోదీ రాజకీయ దౌత్యానికి సంబరపడ్డాం. నవాజ్ షరీఫ్‌తో భుజాలు కలిపినా పాకిస్తాన్ హురియత్ నాయకులను చర్చలకు ఆహ్వానించినప్పుడు - రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని నిలిపి వేసినందుకు గర్వపడ్డాం. పెద్ద మనస్సుకీ, బుద్ధి లేని చర్యకీ చాలా దూరం ఉందని ప్రభుత్వం హెచ్చరిం చడాన్ని గర్వంగా ఆహ్వానించాం. కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులు కొన్ని పార్టీ వర్గాల్లో మేల్కొన్నాయి. ఒకాయన నాథూ రాం గాడ్సేకి దేవాలయం కడతానన్నారు. ఒకానొక మంత్రి సాధ్వీ నిరంజన్‌జ్యోతి నిండు సభలో ‘మీకు రాం జాదోం (రామ సేవకులు) కావాలా? హరాం జాదోం కావాలా?’ అని బల్లగుద్దినప్పుడు దేశం తెల్లబోయింది. మరో మంత్రి గిరిరాజ్ సింగుగారు బరితెగించి ‘రాజీవ్ గాంధీ ఓ తెల్ల అమ్మాయిని కాక ఏ నైజీరియా అమ్మా యినో చేసుకుంటే ఆమెని పార్టీ నాయకురాలిని చేసే వారా?’ అన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు మోహన్ భగ వత్గారు మదర్ థెరిస్సా లక్ష్యం మత మార్పిడి అన్నా రు. సాక్షి మహరాజ్ అనే పార్లమెంటు సభ్యులు ప్రతీ దంపతులు నలుగురు పిల్లల్ని కనాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్ తొగాడియా గారు ఆ ఆలోచనని వెంటనే సమర్థించారు. గోవా ముఖ్య మంత్రిగారు నర్సులు ఎండల్లో సమ్మె చేస్తే కమిలి పోతారన్నారు. రాంప్రసాద్వర్మ అనే మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు పొగాకుకీ, కేన్సర్‌కీ సంబంధం లేదన్నారు. ఈలోగా కశ్మీర్లో పదవి మాత్రమే లక్ష్యంగా పాకి స్తాన్ని సమర్థించే పీడీపీతో భారతీయ జనతా పార్టీ చెయ్యి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. దేశం షాక్ అయింది. పదవిలోకి రాగానే పీడీపీ నాయకులు ముఖ్య మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఉవాచ: ‘పాకిస్తాన్ ధర్మమా అంటూ, వేర్పాటువాదుల సహకారంతో కశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి’. దేశం ఆగ్రహంతో విలవిలలాడింది. ఈలోగా నాలుగేళ్లుగా జైలులో ఉన్న కశ్మీర్ వేర్పాటు వాది, ఉద్యమాలలో 112 మంది మారణహోమానికి కారణమైన పాకిస్తాన్ అనుయాయుడు మస్రత్ ఆల మ్ను ముఫ్తీగారి ప్రభుత్వం విడుదల చేసింది. దేశం తెల్లబోయింది. వేర్పాటువాదులతో చర్చలకు ఆహ్వానించినందుకే అధికార చర్చలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కశ్మీర్ జాతీయ దినోత్సవానికి హురియత్ నాయకులతో పాటు పాల్గొనడానికి విదేశాంగ ఉపమంత్రిని పంపింది. ముం దు రోజే కశ్మీర్ పొలిమేరల్లో తన కొడుకును దుండగులు చంపగా ఓ తల్లి కొడుకు శవాన్ని పట్టుకుని ‘నా కొడుకు మాటేమిటి? మోదీ ఏం సమాధానం చెబుతారు?’ అని ఆక్రోశించింది. పదవిలో ఉండగా సంయమనాన్ని పాటిస్తూ, అందరినీ కలుపుకుని పాలన చేసిన ఆ పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజపేయి భారతరత్నంగా దేశం మన్న నలు పొందడాన్ని ఆ పార్టీయే మరచిపోకూడదు. భారతీయ జనతా పార్టీ హనీమూన్ గడువు ముగి సింది. హనీమూన్ దశలో చిన్న చిన్న అపశ్రుతులను మోజు భర్తీ చేస్తుంది. కాని ఇప్పటికి జరిగిన సంఘట నలలో పెద్ద పెద్ద కప్పదాట్లున్నాయి. అదుపు తప్పిన ఆత్మ విశ్వాసం ఉంది. మించి-చిన్న నిరంకుశ లక్షణాలు ఉన్నాయి. పార్టీ అనుయాయుల విశృంఖలత్వం పట్ల మోదీ మౌనం పరోక్షంగా ఆయన మద్దతుగా దేశం భావి స్తుంది. ఓటరు నిర్వేదం మూట బరువెక్కకుండా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభం కావాలని- కోరి గద్దెనెక్కిం చిన ఓటరు ఆత్రుతగా, కాస్త కలవరంతో ఎదురుచూసే రోజులొచ్చాయి. -
చరిత్రకు రాని హీరోలు
జీవన కాలమ్ మా వాసూ పోయిన 23 సంవత్సరాలలో ఏ ఒక్కసారీ ఇలాంటి కాలమ్ రాయలేదు. 18 సంవత్సరాలుగా వాసూ పోయిన రోజున ఉత్తమ నూత న దర్శకుడిని సత్కరిస్తూ- ఆ రోజు ఎవరి కళ్లూ చెమర్చకుం డా చేసే ప్రయత్నం చెప్పనల వి కాదు. ఈ బహుమతి ఉద్దేశం వాసూని తలుచుకుని కంటతడిపెట్టుకోవడం కాదనీ, ఒక యువదర్శకుని విజయాన్ని పండుగ చేసుకో వడమనీ అతిథులందరికీ చిన్న కాగితాలు పంపేవారం. కానీ జయాబచ్చన్, అపర్ణాసేన్, సునీల్‌దత్ వంటి వారిని ఆపలేకపోయేవారం. అయినా భోరుమన్న కళ్లు తుడుచుకున్న లెస్లీ కెర్వాలో, జానకీ విశ్వనాథన్, ఆమిర్ ఖాన్లు ఎందరో ఉన్నారు- అది మా నిస్సహాయత. ప్రతీ సంవత్సరం ఆనాటి విషాదాన్ని వెనక్కి నెట్టి విజేతను గుండెలకు హత్తుకుంటున్న మమ్మల్ని చూసి ఒక హిందీ మిత్రుడు అడిగాడు: "Tell me, when will this madness end?" అని. "After us" అదీ సమాధానం. ఒక్కరే - మాలతీచందూర్ మా గుండెల్లోంచి దూసుకెళ్లారు, ‘‘...వెలుగులో ఉన్నవాడు చీకటి వస్తుంద ని భయపడతాడు. చీకటిలో ఉన్నవాడు ఏ చిన్న వెలుగు కనిపించినా దాని వెనుక నడిచిపోతాడు....’’ అయితే ఇందుకుకాదు ఈ కాలమ్. ఈ 18 సంవ త్సరాలూ ఏటా ఓ యువదర్శకుడిని గౌరవించినప్పు డల్లా - అలా సత్కారానికి నోచుకోని మరో 20-30 మం ది ఆ సంవత్సరం కనిపిస్తారు. వారి ప్రయత్నంలో లోపం లేదు. వారి జీనియస్‌కి వారు బాధ్యులు కారు. వాళ్లకి తప్పనిసరిగా ఉత్తరం రాస్తాం. ఆ ఉత్తరం మీద నేనే సంతకం చేస్తాను. ఇది బహుమతి కన్నా ముఖ్య మైన పని. ఈ ఉత్తరాన్ని రోజుల తరబడి ఆలోచనల్లో రంగరించి సిద్ధం చేశాం. ఆ యువ దర్శకుని ఉత్సాహాన్ని ఏవిధంగానూ తగ్గించకుండా పునరుద్ధరించే వాక్యాలివి: ‘‘మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించే దర్శ కుని మొక్కవోని లక్ష్యానికి దోహదం చేస్తూ, అతని ఆద ర్శానికి దన్నుకావాలన్నదే మా ఫౌండేషన్ లక్ష్యం. ప్రతీ సంవత్సరం అందరు తొలి దర్శకులను ఆహ్వానించి ప్రోత్సహించాలన్నదే మా ధ్యేయం. ఈ పోటీలో మీ చిత్రం పాల్గొనడమే గొప్ప విజయం. కారణం- ఇలాం టి ప్రోత్సాహానికి మా శ్రీనివాస్ నోచుకోలేదు కనుక. మీ చిత్రం చాలా బాగుంది. అయితే, ఇన్ని చిత్రాల పరిశీ లనలో, తప్పనిసరిగా ఏ ఒక్క చిత్రమో మిగతావాటి కంటే ఒక్క అడుగయినా ముందు నిలుస్తుంది. అయితే అన్నీ గొప్ప ప్రయత్నాలే. సందేహం లేదు. కాని, ఈ బహుమతి ఒక్కరికే దక్కుతుంది. గత్యంతరం లేదు. దర్శకుడిగా ఎన్నో అంగల్లో ముందుకు సాగబో తున్న మీ కెరీర్ సమర్థవంతం, ఫలవంతం కావాలని ఆశి స్తున్నాం. మీలో ఆ సామర్థ్యం ఉన్నదని నమ్ముతున్నాం. ఆగస్టు 12న మీలో ఒకరయిన మీలాంటి దర్శకునికి సత్కారం జరుగుతుంది. మా కుటుంబ సభ్యుడిగా వచ్చి అందులో పాల్గొనండి.’’ ఈ ఉత్తరాన్ని గత 18 సంవత్సరాలుగా దేశం నలు మూలలో ఉన్న 265 మంది యువ దర్శకులకు ఇప్పటి వరకూ పంపాం. ఇప్పుడు ఈ కాలమ్ స్ఫూర్తి. మొన్న ఈ ఉత్తరం అందుకున్న బహుమతి రాని బెంగాలు దర్శకుడు బౌద్ధా యన్ ముఖర్జీ కలకత్తా నుంచి సమాధానం రాశాడు. అది ఇది: ‘‘మీ ఉత్తరానికి ధన్యవాదాలు. అందులో విషయం మనసుని బాధ పెట్టినా బహుమతిని ఒక్కరే అందుకో గలరని అర్థమవుతోంది. న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని నేను మనసారా గౌరవిస్తాను. అయితే అరవిందన్ పుర స్కారం లాగ ఈ బహుమతితో పాటు ఒక ప్రత్యేక ప్రశం సని న్యాయనిర్ణేతలు రెండో స్థానంలో ఉన్న చిత్ర దర్శ కుడికి అందజేయవచ్చు. అందువల్ల మరో చిత్ర దర్శకునికి ఆనందం కలుగుతుంది. ఈ సంస్థకి నా శుభాకాంక్షలు. శ్రీనివాస్ స్ఫూర్తి మా అందరిలో ప్రబలాలని, రాబోయే కాలంలో నిజాయి తీగా మేము చేసే కృషి మరింత ఫలవంతం కావాలని ఆశిస్తాను. శ్రీనివాస్‌కి మేము ఇవ్వగల నివాళి అది. మీ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా సాగాలి. మీరు నూతన దర్శకులలో నింపుతున్న ప్రాణవాయు వు- జ్యోతిగా వెలుగొందాలి. ఇది గొప్ప కృషి. ధన్య వాదాలు.’’ ఇది చదువుతూంటే కుటుంబమంతటికీ కళ్లు చెమ ర్చాయి. గుండె గొంతులో కదిలింది. ఇంత ఉదాత్త మయిన యువదర్శకులు ఈ దేశంలో ఎందరు ఈ కళని పరిపుష్టం చేస్తున్నారో! ఆర్ద్రత ఆదర్శాన్ని ఆకాశంలో నిలుపుతుంది. ఇలాంటి స్పందనలు కన్నీటిని కూడా కర్పూరంలాగ వెలి గించి-కాంతిని హృదయాల్లో నింపుతాయి. మా వాసూ ధన్యుడు. -
ట్రాజిక్ హీరో
జీవన కాలమ్ ‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’ అని ఎ. రాజా నెలల తరబడి గొంతుచించు కున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్నవారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి. రాజకీయ రంగంలో పదవికీ, అధికారానికీ మధ్య చిన్న దు ర్మార్గం ఉంది. పదవిలో పని చేస్తే డబ్బు వర్షం కురుస్తుంది. విచిత్రం, ఏమీ చెయ్యకపోవ డం వల్ల కూడా డబ్బు వర్షం కురుస్తుంది. రెండో పని తన చుట్టూ జరుగుతూంటే కళ్లు మూసుకుని తన నిజాయితీని మాత్రం కాపాడుకున్న ట్రాజిక్ హీరో మన్మోహన్సింగ్. భారత చరిత్రలో కొందరు గొప్ప ఉపాధ్యాయులు దారి తప్పి రాజకీయ రంగంలోకి వచ్చారు- సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ జకీర్ హుస్సేన్, అబ్దుల్ కలాం, మన్మోహన్సింగ్. ఆయన దగ్గర పనిచేసి, ఆయన మీద పుస్తకం రాసిన సంజయ్ బారూ; బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన వినోద్ రాయ్ ఆక్స్‌ఫర్డ్‌లో సింగుగారి దగ్గర చదువుకున్నారు. మొదటి ముగ్గురు నాయకులూ అవినీతితో ప్రమేయం లేకుండా జీవించారు. మన్మోహన్ సింగు గారు తన చుట్టూ అవినీతిని పెరగనిచ్చి- తను మాత్రం కళ్లు మూసుకుని చరిత్రహీనులయ్యారు. మన్మోహన్సింగుగారు మొక్కవోని నిజాయితీ పరు డనే, నిప్పులాంటివాడనే అపప్రథ దేశంలో ఉంది. ఇది ‘అపప్రథ’ అనడానికి కారణం తనచుట్టూ విస్తరించే అవి నీతిని తెలిసి-తాను అందులో భాగస్వామి కాని ఒక్క కారణానికే సంతృప్తి చెందిన ఆత్మవంచన సింగు గారిది. జస్వంత్‌సింగ్ పుస్తకం, సంజయ్బారూ (ది ఆక్సిడెంటల్ ప్రైమినిస్టర్) పుస్తకం, జయంతి నటరాజన్ అక్కసుతో చేసిన ప్రకటనలూ ఈ విషయాన్ని చెప్పక చెప్తాయి. ‘‘ప్రధానమంత్రికి నేను చెప్పే చేశాను’’ అని ఏ. రాజా నెలల తరబడి గొంతుచించుకున్నా, లక్షల కోట్ల రూపాయలు బొగ్గు కుంభకోణంలో తన చుట్టూ ఉన్న వారు నొల్లుకొంటున్నా- తెలిసి కళ్లు మూసుకోవడం భయంకరమైన అవినీతి. ఎదిరి పక్షం పదవిలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని తవ్వి బయటికి తీస్తూంటే ఈ రొంపిలోంచి తను బయ టపడడానికి బీజేపీ నాయకులను సింగుగారు ప్రతిదినం సంప్రదిస్తున్నట్టు వార్త. ఆయన్ని కోర్టుకు హాజరు కావా లని సమన్సు పంపితే- చచ్చి గింజుకున్నా ఇంటర్వ్యూ ఇవ్వని సోనియా గాంధీగారు మొదటిసారిగా తమ నాయకమ్మన్యుల బృందంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని ఇంటికి నాలుగు వందల గజాలు నడిచి వెళ్లడం సుందర దృశ్యం. ఇదే సోనియాగారు అలనాడు ప్రధాని పీవీ నరసిం హారావుగారిపై లఖూబాయ్ కేసు, సెంట్ కీట్స్ కేసు, జేఎంఎం కేసు, లెబర్హాన్ కమిషన్ విచారణ జరిగిన ప్పుడు ఒక్కసారి కూడా ఆయనను పలకరించలేదు. జేఎంఎం కేసులో ఆయన నిందితుడని కోర్టు తీర్పు ఇచ్చి నప్పుడు - ఇంకా రాజకీయాలు తలకెక్కని మన్మోహన్ సింగు ఒక్కరే పీవీని పరామర్శించడానికి వచ్చారు. నిన్న ఢిల్లీలో ఊరేగిన నాయకమ్మన్యులు ఒక్కరూ రాలేదు. పీవీ కన్నుమూసినప్పుడు వారి భౌతికదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి రానివ్వలేదు. భారతదేశ చరిత్రలో రాజధానిలో కాక వేరే చోట అంత్యక్రియలు జరిగిన ఒకే ఒక్క ప్రధాని పీవీ. మరెందుకు ఇప్పుడు మన్మోహన్సింగుగారి మీద ప్రత్యేక అభిమానం? యూపీఏ గోత్రాలన్నీ ఆయనకి తెలుసు కనుక. ఏనాడయినా వాటిని ఆయన విప్పద లిస్తే అంతకన్న సాధికారకమైన రుజువులు మరెక్కడా దొరకవు కనుక. ఏమాటకామాటే చెప్పుకోవాలి- అలాంటి మనస్తత్వమే మన్మోహన్సింగుగారికి ఉంటే - దేశ చరిత్రలో పీవీగారి హయాంలో లిబర లైజేషన్‌కు చరి త్రను సృష్టించిన ఒక మేధావి- కేవలం ‘మడి’ కట్టుకుని అపకీర్తిని మూటకట్టుకోడు (సంజయ్ బారూ పుస్తకమే ఇందుకు సాక్ష్యం). హత్యానేరానికి జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయ టకు వచ్చిన శిబూ సోరెన్ జైలు నుంచి సరాసరి బొగ్గు మంత్రిగా ఢిల్లీ చేరడం ప్రధాని గారికి తెలియకుండానే జరిగిందా? ఒక రాజా, ఒక కనిమొళి, ఒక సురేశ్ కల్మా డీ, ఒక షీలా దీక్షిత్, ఒక దయానిధి మారన్, ఒక జగ ద్రక్షకన్, ఒక నవీన్ జిందాల్, ఒక శ్రీప్రకాశ్ జైస్వాల్ కథ లని సింగుగారు వినలేదా? సింగుగారు అమెరికాలో ఉండగా అవినీతి నిరోధక ఆర్డినెన్స్ ‘నాన్సెన్స్’ అని పత్రికా సమావేశంలో కాగి తాన్ని ముక్కలు చేసిన రాహుల్ కుర్రచేష్టల్ని పెద్ద వయ స్సుతో భరించి- అపకీర్తిని నిశ్శబ్దంగా మూటకట్టుకుని చరిత్రలో ట్రాజిక్ హీరోగా మిగిలిపోయిన మేధావి, ఇం టలెక్చువల్, పెద్దమనిషి మన్మోహన్సింగు. ఆ కార ణానికే వెన్నెముక లేని ప్రవర్తనకి యూపీఏ అవినీతికి పరోక్షమైన వాటాదారుడు. ‘రాబోయే కాలంలో చరిత్ర నన్ను సానుభూతితో అర్థం చేసుకుంటుంది’ అని వాపోయిన పెద్దమనిషి- తన మంచితనాన్ని, స్వామిభక్తిని, నిర్వేదాన్ని చివరం టా వాడుకొని - ఇప్పటికీ ముఖం తుడుపుకి- రోడ్ల మీద ఊరేగింపు జరిపిన అవినీతిపరుల విన్యాసాలకు బలి అయిన అపర ‘కర్ణుడు’ మన్మోహన్సింగ్. ఈ మధ్య ఓ మిత్రుడు వేరే సందర్భంలో ఈ వాక్యాల్ని ఉటంకించారు: Silence in the face of evil is evil in itself. Not to speak is to speak. And not to act is to act. -
‘ఇంగ్లండ్ డాటర్’
ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావించే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ కొన్ని తప్పుడు మాటల్ని చిత్రంగా రూపొందించగా ఈ దేశంలో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని ఉద్రేకపడుతున్నారు. డిసెంబర్ 16, 2012. నిర్భ య రేప్. ఆరుగురు రేప్ చేసి ఆమె మర్మావయవాలను గాయం చేసి దారుణంగా చంపారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం వారికి ఉరిశిక్ష విధించిం ది. ఒక నేరస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఒక ఇం గ్లండ్ డాటర్ లెస్లీ ఉడ్విన్ అనే చిత్ర నిర్మాత- ప్రపం చంలో మహిళలకు జరిగే అన్యాయా న్ని గురించి ‘ఇండియాస్ డాటర్’ అనే డాక్యు మెంటరీని తీయడానికి పూనుకుంది. ఆ మధ్య ఇంగ్లండ్‌లో చాలా రేప్‌లు జరిగాయి. కాని ఈ ఇంగ్లండ్ డాటర్‌కి నమూనాగా ఇండియా డాటర్ రేపే కావలసి వచ్చింది. ఇండియా వచ్చి-ఈ దేశపు చట్టాలు సవ్యంగా పని చేస్తే-ఈపాటికి ఉరికంబం ఎక్కవలసిన ముఖేష్‌సింగ్ అనే మానవ మృ గాన్ని కలిసింది. ఈయన ఇంటర్వ్యూకి రెండు లక్షలు అడిగాడు. 40 వేలకి ఒప్పందం కుదిరింది. ఈ పశువు చెప్పిన విషయాలు, అతని మాటల్లోనే: ‘‘కుర్రాడి కంటే రేప్‌కి అమ్మాయికే బాధ్యత ఎక్కువ. రాత్రి 9 గం టలకి మర్యాదైన ఆడపిల్ల రోడ్డు మీద తిరగదు. ఇంటి పని, వంటపని ఆడవాళ్ల పనులు. డిస్కో లకి తిరగడం, తప్పుడు బట్టలు వేసుకోవడం కాదు. నేను రేప్ చేస్తున్నపుడు ఆమె ఎదిరించకుండా ఉండాల్సింది. నిశ్శబ్దంగా రేప్ జరగనివ్వాలి. అప్పుడు వ్యవహారం ముగిశాక ఆమెని వదిలేసేవాళ్లం-కుర్రాడిని నాలుగు తన్ని.’’ ఈ కేసు వాదిస్తున్న ప్రబుద్ధుడు డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ గారి అభిప్రాయాలు, వారి మాటల్లోనే, ‘‘ నా కూతురో, చెల్లెలో పెళ్లికాకుండా ప్రేమలో పడి అవమా నకరంగా ప్రవర్తిస్తే - ఆవిడని నా ఫార్మ్‌హౌస్‌కి తీసుకెళ్లి నా బంధువులందరి ముందూ పెట్రోలు పోసి తగ లెడతాను.’’ నాకు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశం, అదృ ష్టం కలగలేదు. కాని దీన్ని చూసి తీరాలని చాలామంది మేధావులు ఈ దేశంలో గొంతు చించుకుంటున్నారు. సమాజంలోని తప్పుడు ఆలోచనా ధోరణిని (mindset) ఎండగట్టడానికి ఇలాంటి డాక్యుమెంటరీ రావలసిందే నని ప్రముఖ కవి, రచయిత జావెద్ అఖ్తర్ పార్లమెం టులో గొంతు చించుకున్నారు. ఆయన రచనల మీదా, కవితల మీదా నాకు అపారమైన గౌరవం. ఇక్కడ ఆగు తాను. కాని ముఖేష్‌సింగ్ మాట ఈ దేశపు ఆలోచనా ధోరణికి ప్రాతినిధ్యం వహించదు. ఒక దౌర్భాగ్యుడి moral perversion, decadenceకీ మాత్రమే నిదర్శనం. ఈ ఇంగ్లండ్ డాటర్ చేసిన నేరాలు. 1. మరణశిక్ష పడిన ఖైదీని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. 2. నిర్భయ పేరుని ప్రకటించింది. 3. ఆమె ఫొటోను ప్రకటించింది(ట). 4. పూర్తయిన డాక్యుమెంటరీని అధికారులకు చూపి వారి సమ్మతిని తీసుకోలేదు. 5. బీబీసీ దీనిని మహిళా దినోత్సవానికి ప్రసారం చేయాలని తలపెట్టి, దేశంలో అలజడి లేవగానే లోపాయికారీగా ముందుగానే ప్రసారం చేసేసింది. ఈ డాక్యుమెంటరీని ఫలానా ఉడ్విన్ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, కెనడాలలో ప్రసారం చేయ సంక ల్పించిందట. ఇండియాలో 24X7 చానల్ మార్చి 8న ప్రసారానికి అంగీకరించింది. ఆరు దేశాలలో ‘ఇండియాస్ డాటర్’ ప్రసారం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం? ఉడ్విన్‌కి డబ్బు కలసివస్తుంది. మనకి గబ్బు కలసివస్తుంది. బ్రిటిష్ వారికి మన పట్ల ప్రేమని అలనాడు చర్చిల్ నాటి నుంచీ వింటున్నాం. మన దేశంలో- నాకు తెలుగు బాగా రాదు క్షమిం చాలి-ఇంటెలెక్చువల్ హిపోక్రసీ ఎక్కువ. హృదయ వైశాల్యం గల భారతీయ మేధావులు-ఇండియా రేప్ కథని - ఇందుమూలంగా అంతర్జాతీయంగా లేచిన దుమారాన్నీ సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడ్డ ఓ ఇం గ్లండ్ డాటర్ కళాఖండాన్ని-చట్టాలనీ మాన వీయ విలువలనీ ఆంక్షలనీ విస్మరించి- ఆరు దేశాలలో ప్రసా రం చేయడం ద్వారా ఈ దేశ ప్రజల ఆలోచనా ధోరణి మార్పుకు సహకరిస్తుందని భావిస్తున్నారు. ఓ నీచుడి తప్పుడు మాటల్ని ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావిం చే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ చిత్రంగా రూపొందించగా ఈ దేశం లో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని పత్రి కల్లో పార్లమెంటుల్లో ఉద్రేకపడుతున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా-పశు ప్ర వృత్తికి ఓ ఆడపిల్ల జీవితాన్ని బలిచేసి, డబ్బు కోసం దిక్కుమాలిన, దుర్మార్గపు అభిప్రాయాలను చెప్పగా, దా న్ని సొమ్ము చేసుకుని-సమాజ హితమని దొంగ పేరు పెట్టిన ఘనమైన నిర్మాతకి సవినయంగా, స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఒకే ఒక్కమాట చెప్పాలని నరాలు పొంగు తున్నాయి: ‘‘షటప్!’’ (ఈ కాలమ్ రాశాక అమెరికా మిత్రుడు డాక్యు మెంటరీని పంపారు. దాన్ని చూశాక కూడా ఒక్క అక్షరం మార్చాలని అనిపించలేదు.) -
ది లాస్ట్ మొఘల్
జీవన కాలమ్ నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్తత్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయిస్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. భారతీయ సినీ ప్రపంచంలో మరో రామానాయుడు ఉండరు. ఇది చాలా తేలికగా అని పించే మాటగా చాలామందికి కనిపించవచ్చు కాని- ఆ ప్రత్యే కతని ఒక జీవితకాలం కేవలం పరిశ్రమతో, చిత్తశుద్ధితో నిరూ పించుకున్న వ్యక్తి రామానా యుడుగారు. సినీమా రంగానికి ఏ మాత్రమూ సంబంధం లేని రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో వృత్తుల్ని చేపట్టారు. ఒక పక్క చదువుకొంటూ ఆసుపత్రి కాంపౌండర్‌గా పని చేశారు. రైసు మిల్లు నడిపారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేశారు. చుట్ట, పంచె, లాల్చీతో ఆనాడు మద్రాసుకు కేవలం పొగాకు వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చి, సినీ రంగంలో ముమ్మరాన్ని చూసి- ఓ రోజంతా ఆం ధ్రా క్లబ్బు చెట్టుకింద కూర్చుని ఆ వాతావరణాన్ని పరి కించి, అవగాహన చేసుకుని రంగంలోకి దిగి- సినీరం గంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తయినా మరిచి పోలేని శిఖరాలను అధిరోహించిన వ్యక్తి నాయుడుగారు. చదువుతో సంబంధం లేని ఇన్స్టింక్ట్ ఆయన పెట్టుబడి. నేలబారు వ్యక్తి ఆర్తి ఆయన మూలధనం. దేశంలో 13 భాషలలో వందల చిత్రాల్ని నిర్మించారు. నాగిరెడ్డి గారి తో కలసి చిత్రాలు తీశారు. విజయం ఆయన ఊతప దం. ఆయన ఓసారి నాతో అన్నారు - ఏనాటికయినా స్టూడియోని నిర్మించాలని. ఒకటికాదు, రెండు స్టూడి యోలు నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో ఎన్నో సినీమాలు నటించాను. కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం అన్నింటిలో వ్యక్తిగతమయిన ప్రమేయం పెట్టుకుని-తను చేసేదేదో ఎరిగి చేసిన నిర్మా త-రామానాయుడుగారు. నటుల ఆహార్యం, పాత్రీక రణ - అన్నింటినీ తన ధోరణిలో ఆపో శన పట్టేవారు. ‘మాంగల్యబలం’లో నేను చేసిన ‘బూతుల బసవయ్య’ పాత్ర ఆయనకి అత్యంత ప్రియమైనది. కార ణం- ఆ పాత్ర ఆయనకి తెలుసు. నా దగ్గర కూచుని ఆ పాత్రను నా కళ్లకు కట్టా రు. కారంచేడులో వారి చెల్లెలుగారింట్లో ఉండి ‘శ్రీకట్నలీలలు’ సినీమా చేశాను. ఇన్ని కమర్షియల్ సినీమాలు నిర్మించినా ఆయనకు ఆర్ట్ ఫిలిం తీయాలని సరదా. నా ‘కళ్లు’ కథని బాలచందర్ నిర్మిస్తున్నా రని తెలిసి నన్ను పిలిచి ఆ కథ హక్కులు తీసుకున్నారు. విచిత్రమేమిటంటే ఎన్నో చిత్రాలలో నటించారు. ఆ మధ్య గోవా చలన చిత్రోత్సవంలో నన్ను చూసి, ‘‘ఈ మధ్య నా సినీమాలు ఏం చూసినా నువ్వు కనిపిస్తున్నావయ్యా!’’ అన్నారు. చాలామందికి తెలియని విషయం- నిర్మాతగా చలవ బట్టలు వేసుకుని కుర్చీలో పెత్తనం చేసే మనస్త త్వం కాదు నాయుడుగారిది. సెట్టు మీద లైట్బోయి స్తో కలసి ట్రాలీ నడుపుతారు. తోటి సిబ్బందికి ఆ చర్య ఎంత ఊతాన్నిస్తుందో నాకు తెలుసు. మేము తేలికగా 40 సంవత్సరాలు ఇరుగు పొరుగు ఇళ్లలో మద్రాసులో జీవించాం. కుటుంబాలతో ఆత్మీయ మైన పరిచయం. ఈ మధ్య ఏదో పని మీద ఒక ఉపకా రం కోసం ఆయనకి ఫోన్ చేశాను. ఆ పని పూర్తి చేసి మర్నాడు రోజంతా నా కోసం ఫోన్ చేస్తున్నారు. స్నేహా నికీ, ఆత్మీయతకూ ఆయన ఇచ్చే ప్రాధాన్యం అది. ఏ షూటింగ్‌లోనో గుర్తులేదు కాని ఓ రోజు ఆల స్యంగా సెట్టు మీదకి వచ్చి ‘‘మా సురేష్ కొడుక్కి నా పేరు పెట్టాడయ్యా!’’ అనడం గుర్తుంది. మనవడిని పరి శ్రమ మళ్లీ ‘రామానాయుడు’ అనలేక ‘రానా’ అంది. రానాతో ‘లీడర్’ చేస్తూ ఈ మాటని గుర్తు చేశాను. సినీ రంగంలో మూడు తరాల వ్యక్తులతో పనిచేసిన అదృష్టం నాది. నాయుడుగారు, వెంకటేష్, రానా. అలాగే కె. ఎస్. ప్రకాశరావుగారు, రాఘవేంద్రరావు, ఇప్పుడు ప్రకాష్. ఒక కళని సంప్రదాయం చేసుకున్న కుటుంబాలివి. తన వైభవాన్నీ, సంపదనీ తన కుటుంబానికే పరి మితం చేసుకోకుండా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక అభివృద్ధికి డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి కేంద్రాన్ని స్థాపించి, మెదక్‌లో ఉదారంగా 33 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కారంచే డులో, పరిసర ప్రాంతాల్లో ఎన్నో కల్యా ణ మండపాలను నిర్మించారు. సామా జిక చైతన్యానికి అద్దం పట్టే చిత్రం ‘హోప్’ (ఆశ)లో ప్రముఖ పాత్ర ధరిం చారు. కేవలం సామాజిక ప్రయోజనం కారణంగానే ఆ చిత్రానికి జాతీయ బహు మతి లభించింది. అభిరుచికీ, సాటి మనిషి అభ్యుదయానికీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే రామానాయుడుగారు సినీ నిర్మాణంలో గిన్నిస్‌బుక్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఒకే ఒక్క నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత. పద్మభూషణ్. ఆయన్ని బాగా, ఆత్మీయంగా తెలిసిన వారికి నాయుడుగారు జీవితాన్ని జీవనయోగ్యం చేసుకున్న మొఘల్. బాగా లోతుకు వెళ్లి చూస్తే మూలాలను మరచి పోని మనిషి. పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే రామానాయుడు గారి జీవితం ఒక సందేశం. మృత్యువు ఒక క్రూరమైన ముగింపు. స్వయంకృషితో తన లక్ష్యాలే పెట్టుబడిగా మానవతా విలువలని రాజీ పరచకుండా విజయానికి మన్నికైన అర్థాన్ని కల్పించిన- మరొక్కసారి- మూవీ మొఘల్ రామానాయుడు. ఎవరో రచయిత అన్నాడు: జీవితం ఒక ఆక్సిడెంట్. ఎక్కువమంది ఆ ప్రయాణంలో గాయపడుతుంటారు- అని. కానీ జీవితంలో ఎందరి ఆక్సిడెంట్లకో మన్నికైన ప్రత్యామ్నాయాన్ని కల్పించిన వ్యక్తి నాయుడుగారు. ఆయన కన్నీరు-నాకు తెలిసి ఎరుగరు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా-ఆయన కారణంగా కన్నీరు ఎరుగరు. -
రెండు ఎన్నికలు - ఒకే నీతి
గత సంవత్సరంగా కంటి మీద కునుకులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినందుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు. గత పన్నెండు నెలల్లో కేజ్రీవాల్‌ని ఢిల్లీ ప్రజలు రెండు సార్లు ఎన్నుకున్నారు. మొదటి సారి కేవలం అవినీతిపై కేజ్రీవాల్ ఎత్తిన ధ్వజం మాత్రమే కారణమైతే, రెండో సారి ఎన్నికల్లో మిగతా పార్టీలు మోదీపై వారు ఎత్తద లచిన ధ్వజం కారణం. తృణ మూల్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, లల్లూ ప్రసాద్, నితీశ్‌కుమార్ వంటి వారికి కేజ్రీవాల్ మీద ప్రేమ కంటే మోదీ పట్ల వ్యతిరేకత - ఇంకా తమ ఉనికి పట్ల సందిగ్ధత ఎక్కువ మొగ్గు. బాచయ్య బూచయ్యకి వ్యతిరేకి. బూచయ్యంటే నాకు సుతరామూ ఇష్టం లేదు. అందుకూ బాచయ్యంటే నాకిష్టం. రాష్ట్రంలో తన ప్రతిపత్తిని కోల్పోయిన లల్లూకి, పశ్చిమ బెంగాల్లో నానాటికీ అవినీతి తెరలు ముసురు కుంటున్న మమతా బెనర్జీకి, స్వయంకృతాపరాధం నుంచి ఎలా బయటపడాలో తెలీని నితీశ్‌కి కేజ్రీవాల్ నీటిలో తేలే ఊతం కర్ర. అయితే ఇక్కడ ఆగితే కేజ్రీవాల్‌కి అన్యాయం చేసినట్టే అవుతుంది. ‘టీ’ అమ్ముకుని జీవించిన ఓ సాదా సీదా మనిషి ఢిల్లీకి నిచ్చెన వెయ్యడమనే ‘అండర్ డాగ్’ రొమాన్స్ ఆనాడు ఆకర్షణ అయితే- గత ఏడు నెలలుగా తిరుగులేని విజయాలని మూటగట్టుకున్న ‘ఆత్మ విశ్వాసం’ దాదాపు అహంకారపు స్థాయికి చేరిన మోదీ కారణంగానే కేజ్రీవాల్ అండర్ డాగ్ అయ్యాడు. ఆరోజు మోదీ ఎన్నిక కావడానికి ముఖ్య కారణమే ఈ రోజు కేజ్రీ వాల్కి కొంగుబంగారం అయింది. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టుబడి- మోదీ. ఈ దేశంలో గత సంవత్సరంగా కంటి మీద కును కులేని చాలా చాలా పార్టీలకి కేజ్రీవాల్ విజయం ఒక ఊరట. ఆయన గెలిచినందుకు కాదు. మోదీ ఓడినం దుకు. ఓటమికి ఇది ప్రారంభమని వారు గుండెల మీద చేతులు వేసుకోగలిగినందుకు. ఎనిమిది నెలల పాటు తిరుగులేని విజయాన్ని శిరస్త్రాణంలాగ ధరించి, నిరంకు శంగా నడిచిన మోదీ ‘బాడీ లాంగ్వేజ్’ వారిని హింసిం చింది. ఎట్టకేలకు మోదీ ప్రతిభ, మోదీ గ్లామర్, మోదీ దూకుడు వీగిపోయిన మధురక్షణం- చాలామందికి. ఇందులో బీజేపీ స్వయంకృతాపరాధం కూడా ఉంది. తమ పార్టీకి తిరుగులేదనుకుంటే ఫరవాలేదు కాని- తక్కువ వ్యవధిలోనే సాథ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహరాజ్, ప్రవీణ్ తొగాడియా వంటివారు ఈ విజయా న్ని నెత్తికెత్తుకుని అనుచితంగా చేసిన ప్రకటనలని మోదీ ఖండించకపోవడం ద్వారా పరోక్షంగా వాటిని సమర్థిస్తు న్నట్టు కనిపించడం చాలామందిని గాయపరిచింది. నాయకత్వం పట్టించుకోని అలసత్వం నిజంగా ప్రభుత్వ ధోరణికి అద్దం పడుతోందా అన్న మీమాంస చాలా మంది ఓటర్లని బలితీసుకుంది. ఏడు దశాబ్దాల ‘సెక్యుల రిజం’ అనే ఆత్మ వంచనని ప్రాక్టీసు చేస్తున్న ఈ దే శపు పార్టీలకి ఇది అదను. అవకాశం. బీజేపీని ఎదిరించ డానికి వారి ఆయుధమూ- మతమే. క్రితం ఎన్నికకీ, ఈ ఎన్నికకీ కేజ్రీవాల్ శక్తి సామ ర్థ్యాలు చరిత్ర సృష్టించేంత పెరగలేదు. అయితే ఎదిరి పక్షం బలహీనమయింది. తమ తమ ప్రయోజనాలకు మిగతా పార్టీల దొంగ దెబ్బ కలసివచ్చింది. ఇది కాదన లేని కర్ణుడి శాపం. తాను చెయ్యదలచుకున్నదంతా 49 రోజుల్లోనే చేసెయ్యాలనుకున్న ఆత్రుత ఆనాడు కేజ్రీవాల్ ప్రభుత్వా న్ని రోడ్డు మీదకు ఈడిస్తే, అయిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం లో 7 నెలల అలసత్వం - దాదాపు అదే ఇబ్బందిని - సూచనగా బీజేపీకి కలిగించింది. అయితే ఇద్దరికీ రెండు అవకాశాలున్నాయి. కేజ్రీవాల్‌కి ఇప్పుడు ఐదేళ్ల పాలనా వకాశం. బీజేపీకి ఇంకా 4 సంవత్సరాల 4 నెలల అవకా శం. ఈ విధంగా ఈ అపజయం బీజేపీకి పరోక్షమయిన ఉపకారం. వేళ మించిపోకుండా కలసొచ్చిన చెంపపెట్టు. ఇకముందు కేజ్రీవాల్ - ఇదివరకులాగ కాక తన పాత్రని సవరించుకోవలసి ఉంది. ఉద్యమానికీ, ఉద్యో గానికీ, నినాదానికీ, నిర్మాణానికీ బోలెడంత తేడా ఉంది (ఉద్యోగానికీ, రాజకీయానికీ చుక్కెదురని నిరూపించిన ఇద్దరు మహానుభావులు కళ్లముందున్నారు- మన్మోహన్ సింగ్, కిరణ్‌బేడీ). కాగా నిజాయితీ మంకు పట్టుదల కాకూడదు. అర్ధరాత్రి దాడులు కాకూడదు. రోడ్ల మీద ప్రభుత్వాల ధర్నా కాకూడదు. ఇవన్నీ కేజ్రీవాల్‌కి ఈపాటికి అర్థమయ్యే ఉంటా యి. ముఖ్యంగా ఆయన గోడ మీద రాసుకుని గుర్తుం చుకోవలసిన విషయం ఒకటుంది. 67 సంవత్సరాలు జులుంతో, అవినీతితో, దుర్మార్గంతో, అసమర్థతతో రాజకీయ నాయకుల అరాచకంతో విసిగిపోయిన ప్రజా నీకం- రాజకీయాలతో ప్రమేయం లేని ఉద్యమకారుడిని గద్దె ఎక్కించింది. ఇది స్వతంత్ర భారతంలో చరిత్ర. ఈ ఎన్నిక విజయం కాదు. ఓటరు విసుగుదలకి సంకేతం. ఒక పరీక్ష. ఒక అవకాశం. కుర్చీ ఎక్కించిన ఓటరు నిర్దాక్షిణ్యంగా దింపగలడని- కనీసం ఈ ఎన్నిక- ఈ రెండు పార్టీలనూ హెచ్చరిస్తోంది. -
మేధస్సు అలసిపోదు
గొల్లపూడి మారుతీరావు, ప్రసిద్ధ రచయిత - నటుడు - కాలమిస్టు కిందటి శతాబ్దపు అయిదో దశకం తెలుగు దేశానికి మరపురాని దశ. కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం. ముఖ్యంగా ‘భక్తి రంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం ఆ వైభవానికి మూలపురుషులు బాలాంత్రపు రజనీకాంతరావుగారు కావడం. నాకప్పుడు ఇరవయ్యేళ్లు. తెల్లవారితే ప్రతీ ఇంట్లో ‘భక్తిరంజని’ పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి. తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి - ఇలాగ. ఇవన్నీ మధురమయిన జ్ఞాపకాలు. బాలమురళీకృష్ణ, వోలేటి వేంకటేశ్వర్లు, ఎమ్.వి. రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, పాకాల సావిత్రీ దేవి, నల్లాన్ చక్రవర్తుల నరసింహా చార్యులు - వీరంతా గానం చేసిన పాటలవి. అన్నమాచార్య కీర్తనలు అప్పటికింకా ప్రాచుర్యంలోకి రాలేదు. మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన ఆ కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు. అయితే ‘‘ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది’’ అన్న కీర్తన బాలమురళీ కృష్ణ పాడగా విన్న గుర్తు. అప్పటికి టీవీలు లేవు. ఆనాటి రేడియో ప్రాచుర్యాన్ని పూర్తిగా అనుభవించిన తరం మాది. కానడలో వోలేటిగారి హనుమాన్ చాలీసా, చరిత్రగా నిలిచిపోయిన బిళహరి, కాంభోజీ, జౌన్పురీ, నాట మొదలైన రాగాలలో బాలమురళి నారాయణ తీర్థ తరంగాలు, రజని సూర్య స్తుతి - ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు. ‘మాది’ అని నన్నూ కలుపుకోడానికో కారణం ఉంది. నా జీవితంలో - ఆ మాటకి వస్తే మా ఇంట్లో మొదటి రేడియో నేను కొన్నదే. 1959లో నేను అంతర్జాతీయ రేడియో నాటికోత్సవాల పోటీలలో నా నాటిక ‘అనంతం’కు మొదటి బహుమతిగా పుచ్చుకున్న వంద రూపాయలతో, నేను రేడియోకి రాసిన ‘శాఫో’ అనే నాటికకి దక్కిన పదిహేను రూపాయలు, ‘అనంతం’లో నటించినందుకు దక్కిన మరో పాతిక కలపగా, మా నాన్నగారు మరో ఇరవై రూపాయలు ఇచ్చిన గుర్తు. ఆ పైకంతో చిన్న ‘మర్ఫీ’ రేడియో కొన్నాను. అది ఆ తర్వాతి 57 సంవత్సరాల జీవితానికి పెట్టుబడి అయింది. ఆ విధంగా రజనీకాంతరావుగారు, బాలమురళీకృష్ణ, మిగతా గాయకులంతా నా డ్రాయింగు రూములో కొలువుతీరారు. ఓ చిన్న రచయితకి అదొక దేవలోకం. ఎప్పుడయినా ఈ గంధర్వుల్ని చూడగలుగుతానా అనుకొని రేడియోలో తలదూర్చి మరీ లలిత సంగీతం వినేవాడిని. అది 1959. మరో నాలుగేళ్లకు (1963) వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. రేడియోలో ఉద్యోగం వచ్చింది! అంతే. అదే జీవితంలో పెద్ద మలుపు. నా జీవితంలో గొప్ప అదృష్టాన్ని చెప్పమంటే నా ప్రవృత్తి- వృత్తి మమేకయి జీవితమంతా కొనసాగడం. అడుగడుగునా ఎందరో పెద్దలతో భుజం కలిపి పనిచేయడం. ఏనాడూ అహంకారానికి తావివ్వని ప్రతిభావంతుల, పెద్దలతో సాంగత్యం, ఆ మలుపులో నా అభిరుచిని సంధించినవారిలో రజనీకాంతరావుగారి పాత్ర ఉంది. 1959 నాటి మరో ప్రత్యేకమైన జ్ఞాపకం - విజయవాడ మొగల్రాజపురంలో మహీధర రామమోహనరావు గారింట్లో సాహితీ సమావేశం. ఆ రోజుల్లో నా ఆనర్స్ చదువు పూర్తి చేసుకుని ‘ఆంధ్రప్రభ’లో ఉద్యోగానికి వారం వారం నీలంరాజు వేంకట శేషయ్యగారిని కలుస్తూండేవాడిని. విజయవాడలో మహీధర రామ మోహనరావుగారు సాహితీ సమావేశాలకు సంధానకర్త. సైకిలు మీద వచ్చి అందరి ఇళ్లకీ వెళ్లి మమ్మల్నందరినీ పేరు పేరునా సమావేశాలకు ఆహ్వానించేవారు. ఆ రోజు కొడవటిగంటి, శ్రీశ్రీ వచ్చారు. ఆనాటి సభలో నేనూ, ఏటుకూరి బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు, అంగర సత్యనారాయణ రావు ప్రభృతులు ఉన్న జ్ఞాపకం. రజనీగారు అప్పుడు విజయవాడ రేడియోలో చేస్తున్నారు. వచ్చారు. అనర్గళంగా ‘మహాప్రస్థానం’లో కవితల్ని గానం చేశారు. 1959-63 వరకూ ఆంధ్రప్రభలో పనిచేసి 1963 జనవరి 17న హైదరాబాదు రేడియో స్టేషన్లోకి అడుగుపెట్టాను. అప్పుడక్కడ రజనీకాంతరావుగారు పనిచేస్తున్నారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, యండమూరి సత్యనారాయణ, అయ్యగారి వీరభద్రరావు, ఆచంట నారాయణ మూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, న్యాపతి రాఘవరావు, దాశరథి - ఇలా ఎందరో మహానుభావుల సమక్షంలో నౌఖిరీ. నిజానికి అది ఉద్యోగం కాదు. వైభవం. అప్పటికి రజనిగారు పాటలు రాసి, బాణీలు చేయగా పాటలను చిరస్మరణీయం చేసిన ఒక తరం వెళ్లిపోయింది. ఎస్. వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారి, శాంతకుమారి - ఇలాగ. నా జీవితంలో అదృష్టం - తర్వాతి కాలంలో మళ్లీ వారందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరితో పనిచేశాను. ఓ ముప్ఫై సంవత్సరాల తర్వాత ఇంగ్లండులో కెంట్‌లో మిత్రులు డాక్టర్ వ్యాకరణం రామారావు గారింట్లో సూర్యకుమారి గారిని కలిశాను. ‘‘మీ అందరివల్లే నేను రేడియోలో చేరాను’’ అని ఆమెకు గుర్తు చేశాను. వోలేటి పాడిన ద్విజావంతి రాగంలో రజని గీతం ‘మనసౌనే రాధా, మరల వేణువూద!’’ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. పాట వినగానే నా జ్ఞాపకాలు 55 ఏళ్లు వెనక్కి దూకుతాయి. రజని పాట ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ అన్నపాట ఇప్పటికీ పాడగలను. రేడియోలో ఎస్. వరలక్ష్మిగారు పాడారు. ఆవిడ నాకంటే 12 సంవత్సరాలు పెద్ద. నిజానికి నా ముందుతరం హీరోయిన్. 35 సంవత్సరాల తర్వాత మేమిద్దరం కనీసం నాలుగు చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించాం! ‘శ్రీవారు’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆవిడకి ‘ఊపరె ఊపరె ఉయ్యాల’ పాటని గుర్తు చేశాను. ఆవిడకి జ్ఞాపకం రాలేదు. నాకు గుర్తున్నట్టు పాడి వినిపించాను. అది విని ఆమె నాకు మళ్లీ పాడారు. మంచి పాట, మంచి బాణీ, రజని సంగీతంలో జీవలక్షణం చిరంజీవి అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రజనిగారు 1940లో రేడియోలో ఆర్టిస్టుగా చేరారు. 1943లో ఆయన ఉద్యోగం రెగ్యులరైజ్ అయింది. 1978 వరకూ పనిచేసి స్టేషన్ డెరైక్టరుగా పదవీ విరమణ చేశారు. ఆ తరానికి అది ఉద్యోగం కాదు. ఉద్యమం. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మద్రాసు కమాం డరన్ చీఫ్ రోడ్డులోఉన్న ఆకాశవాణి కేంద్రంలో దాదాపు అందరూ ఉన్నారు. పార్లమెంటులో నెహ్రూ ప్రసంగాన్ని వారూ పులకించిపోతూ విన్నారు. ఆనాడు రజని టంగుటూరి సూర్యకుమారి చేత ‘మాదీ స్వతంత్ర దేశం’ పాడించారు. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రసారమైన మొదటి దేశభక్తిగేయం ఇది. ఎంతటి గౌరవం! అప్పుడు కేంద్రంలో బుచ్చిబాబు, అనౌన్సరు మల్లంపల్లి ఉమామహే శ్వరరావు మొదలైనవారంతా ఉన్నారు. ఏం రోజులవి? రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది. ఆ స్ఫూర్తితోనే మా తరం వారంతా పనిచేశాం. నాకు ఏనాడూ రేడియోలో నా జీతమెంతో తెలి సేది కాదు. తెల్లవారితే ఏ కొత్త పనిచెయ్యాలా అని ఆఫీసుకి దూకే వాళ్లం. 1963-68 మధ్య హైదరాబాదులో రేడియోలో ఉద్యోగం. నా పని డ్యూటీ ఆఫీసరు. ఒక సంఘటన బాగా గుర్తు. ఆ రోజు అయిదు గంటలకి ఇంటికి బయలుదేరుతున్నాను. స్టూడియోలో రజనిగారు, వేణుగాన విద్వాంసులు ఎన్.ఎన్. శ్రీనివాసన్గారూ - అంతా హడావిడి పడుతూ పరుగులు తీస్తున్నారు. పాటల రికార్డింగు మరో పక్క జరుగుతోంది. ‘బావొచ్చాడు’ నాటిక గ్రామస్తుల కార్యక్రమంలో (సాయంత్రం 6-20కి) ప్రసారం. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వెళ్తున్న నన్ను ఆపారు. అప్పటికే ఆయన కంఠం మూగపోయింది. నన్ను పిలిచి కాగితం మీద రాశారు. ‘‘నీ మొహం రాగి చెంబులాగ ఉంటుంది. నా నాటికలో వేస్తావా?’’ అని. చేసేది రేడియో నాటిక. మొహానికీ దానికీ సంబంధం లేదు. ఆయన చమత్కారమది. ఏం వేషం? అందులో నా పాత్ర ‘బావ’. అంటే ప్రధాన పాత్ర. సంగీత రూపకానికి సంగీతం సమకూర్చినది రజనీకాంతరావుగారు. ఆశగా కూర్చున్నాను. కార్యక్రమం పాటతో ప్రారంభమైంది. అవుతూనే మరో పాట. పండగకి బావ ఇంటికి రావడం సందర్భం. పాటలు వేడివేడిగా వస్తున్నాయి. కాలం జరిగిపోతోంది.7 గంటలకి తెలుగులో వార్తలు. 6-55 అయిపోయింది. ఈ బావ ఎప్పుడొస్తాడు? దేవులపల్లివారిని అడిగాను. సన్నని చిరునవ్వు సమాధానం. 6-57 అయింది. నా చేతికి ఓ కాగితం మీద ఒక మాట రాసిచ్చారు దేవులపల్లి. ‘‘ఏమర్రా పిల్లలూ!’’ అన్నాను. అంతా ‘‘బావొచ్చాడు బావొచ్చాడు’’ అన్నారు. నాటిక అయిపోయింది! ఆ విధంగా రజని గారి సంగీత రూపకంలో ఒకే ఒక్కసారి నటించాను. నా షష్ఠిపూర్తికి ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ రజని గారు ప్రత్యేక సంచికలో వ్యాసం రాశారు. అంతటి మహానుభావులతో 50 ఏళ్లు నిలిచిన మధురమైన జ్ఞాపకం ఇది. నేను విజయవాడలో పనిచేసే నాటికి రజనీగారు ఉత్తర దేశంలో పనిచేసేవారు. నాకు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చి శంబల్పూర్ బదిలీ చేసేనాటికి విజయవాడ స్టేషన్ డెరైక్టరుగా వచ్చారు. అప్పటికి నేను సినీమాల్లో ముమ్మరంగా రచనలు చేస్తున్నా. సినీరంగ మిత్రులు నా ఉద్యోగానికి రాజీనామా చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. రాజీనామా పత్రాన్ని తీసుకుని రజనీగారి గదిలోకి వెళ్లాను. కాగితం తీసుకు చదివారు. ఒక్కసారి నన్ను ఎగాదిగా చూసి కాగితాన్ని అడ్డంగా చింపేశారు. ‘‘శంబల్పూరు వెళ్లు. అక్కడి నుంచే రచనలు చెయ్యవచ్చు. నేను డిఫికల్టు స్టేషన్లలో పనిచేయబట్టే ఇక్కడికి రాగలిగాను. మరేం ఆలోచించకు. వెళ్లు’’అంటూ హితవు చెప్పారు. ఆయన కారణంగా వెళ్లాను. మరో పదేళ్లు రేడియోలో పనిచేసి, అసిస్టెంటు స్టేషన్ డెరైక్టరుగా ప్రమోషన్ తీసుకుని, కడప రేడియో స్టేషన్‌కి హెడ్డునయి, ఊహించని రీతిలో సినిమాల్లో నటించి, తొలి సినిమాకే స్టార్నై- అప్పుడు తప్పక రాజీనామా చేశా. మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలిసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితం. ఒక శతాబ్ద కాలం సంగీత సాహిత్యాలకు తనదయిన ప్రత్యేకతలను సంతరించిన వాగ్గేయకారులు రజనీగారు. ఆయన నూరేళ్ల జీవితం ఒక ఉద్యమం. ఆయన తరానికి దక్కిన అవకాశాలు మరే తరానికీ దక్కవు. ఓ మాధ్యమానికి ఊపిరి పోసి, ఓ దేశ స్వాతంత్య్రాన్ని చిరస్మరణీయం చేసి, సంగీతానికి నూరేళ్ల ఆయుష్షును పోసిన నిండు జీవితం రజనీగారిది. తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం. -
అభినవ పాదుకాపట్టాభిషేకం
జీవన కాలమ్ ముంతదార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దాద్‌లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టుకుని అరబ్ దేశాలు పండుగ చేసుకున్నాయి. అరాచకం అంటువ్యాధి. తిరుగుబాటు దొమ్మీ సంస్కా రం. వ్యక్తిగత విచక్షణకీ, గుం పు ఆవేశానికీ పొంతన ఉం డదు. అలాగే వ్యక్తి సంస్కారం ఉన్నతంగా ఉన్నా గుంపు ఉద్రేకమే నిలదొక్కుకుంటుం ది. ఇది ఒక సమూహానికి సం బంధించిన మనస్థితి. ఒకాయన 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఆయన పేరు మహాత్మాగాంధీ. అది దావానలంలాగ ప్రపంచమంతా వ్యాపించింది- గొప్ప ఆయుధంగా. అది ఉద్యమం. ఒకాయన ఆరేళ్ల క్రితం సామ్రాజ్యశక్తుల మీద తన అసహనాన్ని ప్రకటించాడు-బాగ్దాద్‌లో, అమెరికా అధ్య క్షుడు బుష్ మీద బూటు విసిరి. తర్వాత- ప్రపంచమం తా-50 సందర్భాలలో తమ బూట్లను వేర్వేరు కారణా లకి నాయకుల మీద విసిరి తమ అసంతృప్తినీ నిరసననీ ప్రకటించారు. యూరోపు, ఉత్తర అమెరికా, ఇండియా, చైనా, హాంకాంగ్, ఇరాక్, టర్కీ, ఆస్ట్రేలియాలలో ఈ విన్యాసాలు సాగాయి. వ్యవస్థలో అక్రమాన్ని ఎదిరించలేని సామాన్య మానవుడు- ఒక వ్యక్తి తెగించి, ఆవేశంతో చేసిన పనిని ఆనందంగా, అంతే ఆవేశంతో సమర్ధించడం - ఈ చర్య లకు మూలసూత్రం. సినీమాల లో మెలోడ్రామాకీ, గుడు లలో దేవుడికి చేసే మన ప్రార్థనలకీ మూలసూత్రం ఇదే. ‘భగవంతుడా! వెంకయ్య నా ఆస్తి దోచేశాడు. వాడికి బుద్ధి చెప్పు!’- ఇది సామాన్య మానవుడి తిరుగుబాటు ఆయుధం. రిక్షా వాడిని పోలీసు కాల్చుకు తింటున్నాడు. అతని అవినీతిని హీరో రోడ్డు మీద ఎదిరించి నిలదీశాడు. గొప్ప రాణింపు కథకి. ఒక పాత్రికేయుడు- ముంత దార్ ఆల్-జైదీ బుష్ మీద బాగ్దా ద్లో బూటు విసిరి ‘ఇది ఇరాకీ ప్రజలు నీకిచ్చే వీడ్కోలు ముద్దురా, కుక్కా!’ అని అరిచాడు. ఆ తర్వాత ముద్దునీ, బూటునీ నెత్తిన పెట్టు కుని అరబ్ దేశాలు పండుగ చేసు కున్నాయి. 2009లో ప్రపంచంలో ఉన్న అరబ్బులలో జైదీని మూడో స్థానం లో నిలిపింది ఈ చర్య. తిక్రిత్ అనే చోట ఈ బూటుకు మూడు మీటర్ల విగ్రహాన్ని స్థాపించారు. జైదీ విసి రిన బూటు పేరు డ్యూకాట్ 271. దాన్ని తయారు చేసిన కంపెనీ ఇస్తాంబుల్‌లో బేడాన్ షూ కంపెనీ. ఆ క్షణం నుంచీ ఆ బూటుకి కొత్త పేరు వచ్చింది- ‘బుష్ షూ’. తర్వాత కంపెనీ ‘బైబై బుష్ షూ’గా మార్చింది. అయితే జైదీ సోదరుడు కాస్త దేశభక్తిని ఈ సంఘటనకు జత చేసి ఈ షూ బాగ్దాద్‌లోనే తయారయిందన్నాడు. ఏతావాతా ఈ సంఘటన తర్వాత ఈ షూ ఒక్కవారంలోనే మూడు లక్షల జతలు అమ్ముడుపోయాయట. లండన్ ఆర్టిస్ట్ పావెల్ వానెన్స్కీ 21 కేజీల కంచు బూటును తయారు చేసి, దానికి 24 క్యారెట్ల బంగారం పూతను పూయించాడు. జైదీకి ఆరు తలుపులున్న మెర్జిడిస్ని ఒక అభిమాని బహూకరించాడు. ఆఫ్ఘాన్ రచయితలు ఆయన పాటలు రాసి పాడుకున్నారు. ఒక సౌదీ వ్యాపారి జైదీ విసిరిన బూటుని 10 మిలియన్ అమెరికన్ డాలర్లకి కొనడానికి ముందుకొచ్చాడు. ఒక జాతి నిరసనని తెలపడానికి కొత్త ఆయుధాన్నీ, కొత్త పద్ధతినీ ఆవిష్కరించిన వైతాళికుడు జైదీ. దరిమి లాను ఢిల్లీలో (2009) మన ఆర్థికమంత్రి చిదంబరం మీద ఒక సిక్కు పాత్రికేయుడు జర్నాయిల్ సింగ్ 1984 సిక్కుల మారణహోమం పట్ల ప్రభుత్వం అలసత్వానికి నిరసనగా బూటు విసిరాడు. 2010లో షమీద్ ఖాన్ పాకి స్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మీద బూటు విసిరాడు. ఇప్పుడు మరొక బూటు కథ. రియో డి జనిరో (బ్రెజిల్)లో జరిగిన ప్రపంచ బంతి ఆట పోటీలలో అర్జెంటీనాతో ఫైనల్లో ఆడి ఒకే ఒక గోల్‌తో కప్పును గెలిపించిన ఆట గాడు మారియో గోడ్జీ. ఈ విజయంతో 24 సంవత్సరాల తర్వాత జర్మనీ కప్పును గెలుచుకుం ది. అది ఒక చరిత్ర. గోడ్జీ ఆ గోల్ కొట్టిన బూట్లని ఆనాడు గ్రౌండ్లో వాటికంటుకున్న గడ్డిపోచలతో సహా భద్రంగా 22 సంవత్సరాలు దాచాడు. మొన్న పసిపిల్లల సంక్షేమ నిధికి ఒక్క ఎడమకాలి బూటుని మాత్రం వేలం వేశారు. 2.38 మిలి యన్ల అమెరికన్ డాలర్లకి ఆ బూటు అమ్ముడయింది. పాదుకలను శిరస్సున ధరిం చి- సింహాసనం మీద ఉంచి అన్న శ్రీరామచంద్రుడికి ప్రతినిధిగా పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేసిన భరతుడి కథ మనకు పురాణం. ఈ కాలంలో పాదుకల విలువ- రెండు మిలియన్లు, మెర్సిడెస్ కారు, లక్షల వ్యాపారం, ప్రపంచ ప్రఖ్యాతి- అన్నిటికీ మించి ఓ జాతి ఆత్మ గౌర వానికి అభిజ్ఞ. కాదు- ఓ జాతి తనకు జరిగిన అవమా నానికి చేసిన తిరుగుబాటుకి గుర్తు. మరొక్కసారి - అరాచకం అంటువ్యాధి. అరాచకా నికి జాతి ఉదాసీనత తోడయితే అది మళ్లీ ఉద్యమమ వుతుంది. ఒక సందేశమవుతుంది. ఉద్యమ లక్ష్యం ఉదాత్తమయితే అది భరతుడి ‘పాదుక’ అవుతుంది. ఒకటి నిరసన, మరొకటి నివేదన, ఇంకొకటి ఆరాధన. -
గాడ్సే గుడి
జీవన కాలమ్ గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమాజమంతా సమర్థించదు కదా! అఖిల భారత హిందూ పరి షత్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూ ర్లో జాతిపిత హంతకుడు గాడ్సే స్మృతికి ఒక దేవాలయా న్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించా రు. గాడ్సే మేనకోడలు హిమా నీ సావర్కర్ దాచిపెట్టిన గాడ్సే చితాభస్మాన్ని పుణే నుం చి తీసుకువచ్చి ఈ ఆలయం లో భద్రపరుస్తారని ఉన్నావ్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సాక్షి మహరాజ్ ప్రకటించారు. జాతిని నడిపించే నాయకుడిని ‘దేవుడి’ని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామ కరణం చేశారు. ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్పూర్లో గాంధీ జీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది. తిరునల్వేలిలో నమితా అనే నటీమణికి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను ‘తెలంగాణ దేవత’గా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ తెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయ కుడు దేవుడు. అయితే రాజీవ్‌గాంధీ మారణహోమానికి కారణమ యిన శివరాసన్ని మహా త్యాగమూర్తి అని తమిళ నాడులో ఊరేగింపులు జరిపారు. ఇందిరాగాంధీని కాల్చి చంపిన బియంత్‌సింగ్, సత్వంత్‌సింగ్‌లను అమృత్ సర్‌లో అఖల్‌తఖ్త్ (సిక్కుమత ప్రధాన పీఠం) అమర వీరులుగా గుర్తించి, అక్టోబర్ 31న అంటే, బియంత్ సింగ్‌ను ఉరి తీసిన రోజును స్మారకదినంగా పండుగ చేస్తోంది. ఒక మతం అంగీకరించి, హత్యని ఆత్మత్యాగంగా గుర్తించిన సందర్భమది. ఒక ప్రధాని మారణహోమాన్ని ఒక వర్గం నెత్తిన పెట్టుకుని కుట్రదారుడిని వీరుని చేసిన సందర్భం శివరాసన్ అనే హంతకుడికి నివాళి. గాడ్సే జాతిపితని హత్య చేశాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష విధించింది. శిక్ష అమలయింది. సమాజమంతా సమ ర్థించని నెగిటివ్ దేవుళ్లు వీరు. మరి కుష్బూ గుడినీ సమా జమంతా సమర్థించదు కదా! వీరు మైనారిటీ దేవుళ్లు. మొదటిరకం దేవుళ్లు వ్యవస్థ మీద తిరుగుబాటు దేవుళ్లు. ఒక ఉదాహరణ. గురువుగారు సిగరెట్లు కాల్చడం నేరం అని బోధించారు. మీకు గురువుగారి మీద అంతులేని కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా ప్రకటించాలి? గబగబా నాలుగు సిగరెట్లు కాల్చి, సిగరెట్లు కాల్చానని గురువుగారి ముందు బోర విరిచారు. ఇప్పుడేం చేస్తారు? పర్యవసానం కాదు, కేవలం ఆ చర్యే తన ‘తిరుగుబాటు’కి ఉపశమనం. ఈ నెగిటివ్ గుడుల లక్ష్యం అదే. మాయావతి, కుష్బూ, అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్‌ల గుడులు కూడా ఒక వికారమే. శివరాసన్, బియంత్‌సింగ్, గాడ్సేల గుడులు వికారానికి ఆవలిగట్టు. కొందరికి దేవుడు ఆరోగ్యకరమైన ఆలోచనల పర్య వసానం. మరికొందరికి తమ ఆలోచనలకు అద్దం పట్టని వ్యవస్థని నిర్మూలించినందుకు దేవుడు. ఏ దేవుడు మీకిష్టం? విశ్వాసానికి ఏది అంగీకరించడానికి యోగ్యమైన కొలమానం? నలుగురి నమ్మకాన్ని ఆకాశంలో నిలిపిన మెజారిటీ విలువా? పదిమంది కోపానికి కారణమయిన ఒక మైనారిటీ భావించే అన్యాయమా? శిష్ట సమాజానికి ఒక నియతి ఉంది. నలుగురితో చావు- అది అవాంఛనీయమైనా- అది పెళ్లి. ఒక్కడితో చావు- అది అతనికి సహేతుకమైనా- ప్రమాదకరమైన చావు. ఈ కొలబద్దతో చూస్తే గాంధీని చంపిన గాడ్సే నేరాన్ని‘పొరపాటు’ అని సరిపెట్టుకుని గుడి కట్టే సాక్షి మహరాజుల చర్య భయంకరమైన, ప్రమాదకరమైన అవినీతి. నీకు నచ్చకపోతే వేంకటేశ్వరస్వామికి దండం పెట్టకు. రజనీకాంత్‌కి గుళ్లో హారతి ఇవ్వకు. ఇబ్బంది లేదు. కాని సమాజం- అది నీకు సబబుగా కనిపించక పోయినా- తిరస్కరించిన హంతకుడిని ‘దేవుడి’ని చేసే హక్కు నీకులేదు. ఇది బియంత్‌సింగ్‌కీ వర్తిస్తుంది. శివ రాసన్‌కీ వర్తిస్తుంది. గాడ్సేకీ వర్తిస్తుంది. మా మిత్రుడి మాటల్లో ఇది న్యూరో- సోషియో డిజార్డర్. గుడి సంగతి తర్వాత- ముందు ఈ గుడి నిర్మాతలకి వైద్య సహాయం కావాలి. -
రాహుల్ నవ్వాలి
జీవన కాలమ్ పాపులారిటీ పెరగాలంటే రాహుల్ గాంధీ ఏం చెయ్యాలి? సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. ఈ మధ్య రాహుల్‌గాంధీ బొత్తిగా నవ్వకుండా బుంగ మూతి పెట్టుకు కనిపిస్తు న్నారు. ఎక్కడ మాట్లాడినా నుదురు ముడతలు పడు తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన పాపులారిటీ తగ్గడానికి కారణాలని ఆయన సన్నిహి తులూ, కాంగ్రెస్ నాయకులూ కొందరు గ్రహించారు. వారిలో పవన్‌కుమార్ బన్సల్, చిరంజీవి, సంజయ్ నిరుపమ్ వంటి ముఖ్యులు ఉన్నారు. వీరు ఈ మధ్య రాహుల్‌గాంధీ గారితో ఏకాంతంగా సమావేశమ య్యారని వార్త. పాపులారిటీ పెరగాలంటే రాహుల్‌గాంధీ ఏం చెయ్యాలి? మరికాస్త విశాలంగా, హాయిగా నవ్వుతూ కనిపించాలి. సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. చిరంజీవి అనే మెగాస్టార్, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్టులు. వారికి గొప్ప రహస్యాన్ని ఉద్బోధించారు. ‘‘బాబూ! రాజకీయాలు కూడా ఒక విధంగా నటిం చడమే!’’ అనే బ్రహ్మసూత్రాన్ని ప్రబోధించారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ‘నటిస్తున్న’ కారణంగానే వారి రేటింగ్ పెరుగుతున్నదని చిరంజీవిగారు స్వానుభవంతో గ్రహించి ఉండవచ్చు. అందరి ఉమ్మడి అభిప్రాయం ఏమిటంటే- రాహుల్ గాంధీగారు ఇప్పటికన్నా పాత్రికేయులతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలి. అంటే? ఒక కాంగ్రెస్ నాయ కులు అన్నారు: ‘అప్పుడప్పుడు వాళ్ల భుజాల మీద చేతులు వెయ్యాలి’ అని. మోదీగారి సభల్లో వేదిక మీద ఎప్పుడూ 40 మంది ఉంటారు. వాళ్ల మధ్య ఆయన చుక్కల్లో చంద్రుడిలాగ వెలిగిపోతూంటారు. కాని రాహుల్ గారి సభల్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని దిక్కులు చూస్తున్న, బొత్తిగా చిరు నవ్వు మరచిపోయిన కమాండోలు ఉంటారు. ఇవి ఆత్మీయులయిన, అనుభవం గల సన్నిహితులు చెప్పే గొప్ప సూచనలని నేను నమ్ముతాను. కాకపోతే నావి మరికొన్ని సూచనలున్నాయి. రాహుల్ గాంధీగారు పత్రికా సమావేశాల్లో జొరబడి ఆర్డినెన్స్ కాగితాలు చించెయ్యడం, పార్లమెంటులో నిద్ర పోవడం వంటి కుర్ర చేష్టలు తరుచూ చేస్తుంటారు కనుక- చూడగానే పెద్దమనిషిలాగ మర్యాదగా కనిపించడానికి చిరంజీవిగారి సహాయంతో జుత్తుకి తెల్లరంగు వేయ డమో, కాస్త తెల్లబడిన జుత్తున్న విగ్గు పెట్టడమో చేయాలి. నుదురు కాస్త ముడుతలు పడినట్టు కనిపించడానికి రకరకాల మేకప్ పరికరాలున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతిరోజూ గెడ్డం గీసుకోవాలి. ఎప్పుడూ దిక్కుమాలిన కుర్తా కాక తరుచుగా అత్తా కోడలంచు పంచె, పొందూరు ఖద్దరు కండువా వేసు కోవాలి. ‘‘రాజకీయాలు నటన వంటివే’’ అన్న సత్యాన్ని రాహుల్‌గాంధీ గారు గీతావాక్యం లాగ గోడకు తగిలిం చుకుని ఓ మూల చిరంజీవి బొమ్మని ఉంచుకోవాలి. ఇక- పాత్రికేయులతో భుజం మీద చెయ్యి వేయడం చాలదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ వీపు మీద తట్టడం, మధ్య మధ్య చిలిపిగా కడుపులో పొడవడం వంటి సరదా పనులు చెయ్యాలి. అప్పుడప్పుడు సభల్లో దేశవాళీ అలవాట్లను మెచ్చుకుంటూ - దారి పక్కన నిలబడ్డ కుర్రాడి చేతిలో మొక్కజొన్న కండె, దూరంగా నిలబడిన అమ్మాయి చేతిలో పకోడీ పొట్లం లాక్కొని చటుక్కున నోట్లో వేసుకోవాలి. సగం సగం బట్టలున్న పేదపిల్లని హఠాత్తుగా ఎత్తుకుని కెమెరాకి కనిపించేటట్టు బుగ్గలు నిమరాలి. ఇవన్నీ తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ని ప్రజల్లో పెంచుతాయి. సందేహం లేదు. అయితే ముఖ్యమయిన పని మరొకటుంది. రాహుల్‌గాంధీ గారు కేవలం నవ్వడమే కాక అప్పు డప్పుడు కాస్త ఏడవడం కూడా అలవాటు చేసు కోవాలి. వాళ్ల అమ్మ హయాంలో జరిగిన దిక్కు మాలిన అవినీతులు- బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, తెల్గీ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, ప్రజా శ్రేయస్సుని కాక పార్టీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకూ ఉపకారం జరగని రీతిలో పార్లమెంటులో దీపాలార్పి రాష్ట్రాన్ని చీల్చిన కుంభకోణం- వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, అసహ్యించుకుని తమ అసహ్యాన్ని ఓట్ల ద్వారా నిర్దాక్షిణ్యంగా, కుండబద్దలు కొట్టినట్టు తెలియ చేశారనీ గుర్తుంచుకుంటే - చేసిన తప్పిదాలను - ఎలా గూ ముఖం చెల్లనిస్థితి వచ్చింది కనుక- కనీసం ఒప్పు కోవడం, పశ్చాత్తాపాన్ని ప్రకటించడం- రాజకీయ నాయకులలో అరుదయిన ‘నిజాయితీ’కి అద్దం పడ తాయి. ఏమయినా రాహుల్ గారు ముందు ముందు ఇంకా విశాలంగా, ఇంకా నిండుగా, ఇంకా మెండుగా నవ్వుతారు. అది మన అదృష్టం. -
‘రేపు’ తీపి
జీవన కాలమ్ ‘ఇతను ఇంతకంటే వృద్ధిలోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టి సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. ఈ మధ్య మానవవన రుల మంత్రి స్మృతీ ఇరానీ భర్తతో కలసి నాథూలాల్ అనే జ్యోతిష్కుడితో జాత కాన్ని చూపించుకున్నారు. ఆవిడ మంత్రి అవుతారని లోగడ నాథూలాల్ చెప్పా రట. ఇప్పుడు రాష్ట్రపతి అవుతారని జోస్యం చెప్పా రు. ఇది బొత్తిగా మత ఛాందసమని పత్రికలవారు ఆమెను నిలదీశారు. ‘అది నా వ్యక్తిగత వ్యవహారం’ అన్నారు స్మృతీ ఇరానీ. ‘నాకూ జ్యోతిషం మీదా ఖగోళశాస్త్రం మీదా నమ్మకాలున్నాయి’ అంటూ మం త్రిని వెనకేసుకొచ్చారు నజ్మా హెప్తుల్లా. ‘ఆవిడ మానవ వనరుల మంత్రి. శాస్త్రీయమైన విశ్వాసాలనే ప్రోత్సహించాలి’ అన్నారు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్‌గారు. వారికి గుర్తు లేని విషయమేమిటంటే జ్యోతిషం ఒక శాస్త్రంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి ఎన్నో విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశం. కాగా, అయ్యరు గారూ! వంద అనుభవాల పెట్టుబడి- విశ్వాసం. వంద సంవత్సరాల విశ్వాసాల పరిణతి -శాస్త్రం. మన దేశంలో చిలకలనీ, పావురాలనీ నమ్ము కొని వాటి పేరిట కలల్ని అమ్ముకుని పొట్టపోసుకునే పేవ్మెంట్ జ్యోతిష్కుల మధ్య, శాస్త్రీయమైన అన్వ యమూ, ప్రతిభా కల ఒక్క ప్రముఖుడిని గుర్తు పట్ట డం కష్టం. మిగతా తొమ్మిది మంది శాస్త్రాన్ని గబ్బు పట్టిస్తారు. దేశంలో తెలియని రేపుని బులిపించి డబ్బు చేసుకొనేవారెందరో. వీరంతా శాస్త్రం పేరు చెప్పి కాయలమ్ముకునే అవకాశవాదులు. రేపు గురిం చి ఎవరికెంత తెలుసో, ఆ రేపు వచ్చేవరకూ తెలి యదు. కాని వారికి లోనయ్యే లేదా నమ్మేవారి విశ్వా సం కల్మషం లేనిది. నమ్మించడంలోనే అవినీతి ఉంది. నమ్మడంలో అకుంఠితమైన విశ్వాసం మూలాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి తు.చ. తప్పకుండా చెప్ప గల పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ఫ్రెంచ్ జ్ఞాని నోస్టర్‌డామస్‌ల ‘కాలజ్ఞానం’ ఇప్పటికీ ప్రపంచా న్నంతటినీ ఆశ్చర్యపరుస్తోంది. పిడపర్తి దక్షిణా మూర్తిగారి జీవితచరిత్ర అద్భుత సంఘటనల మణి హారం. మిత్రుడు భమిడిపాటి రాధాకృష్ణ తన మృత్యువుకి ముహూర్తాన్ని తనే నిర్ణయించుకు న్నాడు. ముత్తుస్వామి దీక్షితార్ తన అవసానాన్ని గుర్తుపట్టి, శిష్యులను పిలిచి ‘మీన లోచన పాశమో చని కదంబ వనవాసిని’ (మీనాక్షి మేముదం దేహి’ కీర్తన - పూర్వీ కల్యాణి) అనే చరణాన్ని నెఱవల్ చెయ్యమంటూ తనువు చాలించారు. ఇది చరిత్ర. గ్రహధర్మాన్ని ఎరిగిన వారికి భవిష్యత్తు కరత లామలకం. ఇందుకు నేనెన్నయినా ఉదాహరణలు చెప్పగ లను. పాతికేళ్ల కిందట మా నాన్నగారు విశాఖ కింగ్‌జార్జ్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు- హార్ట్ అటాక్ వచ్చి, క్షయతో రెండు ఊపిరితిత్తులూ చెడి, కోమాలో. ఈ స్థితిలో మా తమ్ముడు మా కుటుంబ జ్యోతిష్కులు వేదుల కామేశ్వరశర్మగారిని కలుద్దామన్నాడు. నాన్నగారు వెళ్లిపోతున్నారనడా నికి జ్యోతిష్కుని ప్రమేయం అవసరం లేదు. అయి నా ఆశపోదు. వెళ్లాం. కామేశ్వరశర్మ గారు మా నాన్న గారి మిత్రులు. ఆయనకు కుష్టు. విషయం తెలిసి ఆయనా నివ్వెరపోయారు. దాదాపు గంటసేపు లెక్క లు వేశారు. అవతల ఆసుపత్రిలో చావుబతుకుల్లో నాన్నగారు. ఇక్కడ కాగితం మీద లెక్కలు వేస్తున్న జ్యోతిష్కుడు. ఆ క్షణంలో జ్యోతిషం మీదా, మా తమ్ముడి మీదా, ఆయన మీదా కలిగిన కోపం, అస హ్యం వర్ణనాతీతం. ఆఖరికి లెక్కలు పూర్తి చేసి తేలికగా, ‘మరేం పరవాలేదయ్యా! గండం గడిచి పోతుంది’ అన్నారు. నాకు కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. లేచి వచ్చేశాను. ఆ తర్వాత నాన్నగారు కోలుకుని, 14 ఏళ్లు జీవించి, నిద్రలో వెళ్లిపోయారు. నేను సినీనటుడినయ్యాక ఇదే విషయాన్ని ఓ ప్రముఖ హీరోకి, హీరోయిన్‌కి చెప్పాను. వారిద్దరూ తమ జాతకాలు ఇచ్చారు. వారి పేర్లు చెప్పకుండా కామేశ్వరశర్మగారికిచ్చాను. ఆయన పరిశీలించి రెండు రోజుల తర్వాత చెప్పారు, ‘ఈ అమ్మాయి చాలా పాపులర్. త్వరలో పెళ్లవుతుంది’ అని. ఆ మాట విని హీరోయిన్ నవ్వేసింది- వేళాకోళంగా. కొన్ని నెలల లోనే ఆవిడ అమ్మ పైదేశానికి వెళ్లినప్పుడు అర్ధాం తరంగా పెళ్లి చేసేసుకుంది. ఆ పెళ్లి చాలాకాలం నిలవలేదు. అది వేరే కథ. ఇక హీరో గురించి. ‘ఇతను ఇంతకంటే వృద్ధి లోకి వస్తాడు. రాజకీయాలలోకి వెళ్తాడు’ అన్నారు. హీరో నవ్వారు. శర్మగారు ఇప్పుడు లేరు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. మానవ స్వభావానికి విశ్వాసం దగ్గర తోవ. అది మతాలకు అతీతంగా మనకు తెలియని రేపు వైపు దృష్టిని సారిస్తుంది. అదే దాని రుచి. జిజ్ఞాస దాని పెట్టుబడి. విశ్వాసం ఇంధనం. అన్నిటికీ మిం చి ‘బంగారు భవిష్యత్తు’ దాని పదును. -
గొల్లపూడికి లోక్‌నాయక్ పురస్కారం
విశాఖపట్నం: ఈ ఏడాది లోక్‌నాయక్ పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, సాహిత్యవేత్త గొల్లపూడి మారుతీరావుకు అందజేయనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 18న విశాఖపట్నంలోని కళాభారతిలో ఈ అవార్డు అందజేస్తామని తెలిపారు. అవార్డు కింద రూ.1.25 లక్షల నగదును, ప్రశంసా పత్రాన్ని అందిస్తామన్నారు. 2005 నుంచి ఈ అవార్డులను అందిస్తున్నామన్నారు. తెలుగు సాహితీ రంగానికి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు లభించడం లేదన్న అవేదనను యార్లగడ్డ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. విశాఖలో శ్రీశ్రీ, రావిశాస్త్రి నివసించిన గృహాలను స్మారక మందిరాలుగా గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
అనుసరణ-అనుకరణ
జీవన కాలమ్ గొప్ప ప్రతిభావంతుడి వెనుక ఆ ఆలోచనని నమ్మే ఎందరో నడుస్తారు. అనుసరిస్తారు. గొప్ప ప్రతిభ కొన్ని గొప్ప ఆలోచనల్ని తన సొంతం చేసుకుంటుంది. అనుసరణ మూలాన్ని గౌరవిస్తూ, గుర్తిస్తూ, గుర్తు పెడుతూ దాని వెనుక వినయంగా అడుగులు వేయడం అనుకరణ. ఈ రెండు మాటలూ వినడానికి దగ్గరగానే కని పించవచ్చును కాని అర్థం లో ఒకదానికొకటి చాలా దూరం. ఈ రెండు మాట లకీ రామాయణపరంగా అర్థాన్ని వెదుకుదాం.సీతమ్మ వనవాసం లో శ్రీరాముడిని అనుస రించింది. మారీచుడు మాయలేడిగా శ్రీరాముడిని అనుకరించాడు. ఎంత తేడా! మరో గొప్ప ఉదాహరణని చూద్దాం. కన్యాశు ల్కంలో గిరీశం దేనినయినా తన పబ్బంగడుపుకో డానికి అనుకరించగలడు. ఇది పాత్ర. మధురవాణి ఇంట్లో పందిరి పట్టె మంచం కింద కనిపించిన రామ ప్పంతుల్ని పూటకూళ్లమ్మ చీపురు దెబ్బలకి వాడు కున్నాడు. అది ఆ పాత్ర ధోరణి. ఆ రోజుల్లోనే గొప్ప కవితలు రాసిన ఇంగ్లిషు రచయిత్రి ఒకావిడ ఉన్నారు-ఆన్ టైలర్. ఆమె మొదటి సంకలనాన్ని తన సోదరి జేన్ టైలర్ రచనలతో కలిపి ప్రచురించారు. ఆన్ టైలర్ పేరు చాలా మందికి వెంటనే గుర్తురాదు. కాని పిల్లలకి ఇంగ్లిష్ చదువులు గర్వంగా చెప్పించే తల్లిదండ్రుల దగ్గర్నుం చి, చదువుకొనే పిల్లల వరకూ ఈ పద్యాన్ని ఆనం దంతో కితకితలు పెట్టినట్టు గుర్తుపడతారు. ‘‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ / హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్...’’ ఆన్ టైలర్ రాసిన ‘మై మదర్’ అనే కవితను చూడండి. Who fed me from her gentle breast / And hushed me in her arms to rest/ And on my cheeks sweet kisses prest/ My mother. దీన్ని గిరీశం (గురజాడ) మక్కీకి మక్కీ ‘కన్యాశుల్కం’లో ఎలా అనుకరించారో చూడండి. She leaves her bed at AM four / And sweeps the dust from off the Floor / And heaps it all behind the door / The widow. ఇది అచ్చమైన అనుకరణ. గురజాడ వారిదే మరో ఉదాహరణ. మన జా నపద సాహిత్యంలో దూసుకుసాగే మాత్రాఛ్ఛంద స్సుతో నడిచిన పాటని చూడండి. గుమ్మాడేడే ముద్దూ గుమ్మా/గుమ్మాడేడే కన్నా తల్లీ / గుమ్మాడేడే గోపీ కృష్టా /గుమ్మాడేడమ్మా. మొదటి మూడు లైన్లూ 14 మాత్రలు. ఆఖరి లైను 7 మాత్రలు. దాన్ని అపురూపమైన ముత్యాల సరాన్ని చేశారు మహాకవి. మెచ్చనంటావీవు/నీవిక మెచ్చకుంటే మించి పోయెను/కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు / కోమ లుల సౌరెక్కునా కొత్త మాత్రా చందస్సుని తెలుగు సాహిత్యానికి అందించిన ఘనత గురజాడది. దీనికి అనుసరణ తెలుగు సాహిత్యంలో తన ఉద్ధతితో ‘దిషణాహంకారం’ తన సొత్తని చాటు కున్న విశ్వనాథ తొలినాటి రచన- ‘కోకిలమ్మ పెళ్లి’ చిలుకతల్లి మహాన్వయంబున / నిలిచినవి సాంస్కృతిక వాక్కులు / కోకిలమ్మ తెలుగు పలుకూ / కూడబెట్టిందీ. ‘తెలుగు పలుకు కూడబెట్టడం’ ఈ కవిసామ్రా ట్టుకే చెల్లు. ఇది అచ్చమయిన అనుసరణ. మరొక ఆధునిక వైతాళికుడు శ్రీశ్రీ కవితల్లో ఎన్ని డజన్ల కవుల, విదేశీ రచయితల జీనియస్ తొంగిచూసిందో చెప్పడం కష్టం. మయకోవస్కీ, స్విన్‌బర్న్, ఎడ్గార్ ఎలెన్ పో.. ఈ జాబితా అనం తం. శ్రీశ్రీ పాదరసం. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒకసారి యాదృచ్ఛికంగా ఆల్బర్ట్ కామూ ‘రైనాసిరస్’ నాటకాన్ని గురించి చెప్పాను. మర్నా టికే ‘మట్టి మనిషి’ అనే కవితని రాసి రేడియో స్టేషన్‌కి తీసుకువచ్చారు శ్రీశ్రీ. ఇక, ఎన్నో చారిత్రక మైన కథలని తన బాణీకి మలుచుకుని అనుసరిం చిన అద్భుతమైన నాటక రచయిత షేక్స్పియర్. వాల్మీకి రామాయణాన్ని తమ భాషలో చెప్పి, అనువదించిన మహాకవులెందరో ఉన్నారు. రామా యణాన్ని తన నరాల్లోకి ఎక్కించుకుని, ధమనుల్లో పూరించుకుని తన వేదనతో మేళవించి కొత్తగా ఆవి ష్కరించిన వారూ మరెందలో ఉన్నారు. ఒక్క ఉదా హరణ - మళ్లీ విశ్వనాథ. జాగ్రత్తగా పరిశీలిస్తే-షెల్లీని దేవులపల్లి రచ నల్లో గుర్తుపట్టవచ్చు. కాని ’ఎవరని ఈ రేయి నిదు ర హృదయమదర/ వేయి చేయి ఛాయలాడ పెనుచీ కటి సైగలతో/ నా కన్నుల రక్త మురల లాగి కొందు రు...’ అన్నప్పుడు ఒక్క కృష్ణశాస్ర్తే కనిపిస్తాడు. మరో గొప్ప అనుసరణ: నన్నయ్య భారతంలో అర్జునుడు ద్రుపదుని బంధించి గురువు ద్రోణా చార్యునికి కానుకగా ఇచ్చినప్పుడు, ఒకప్పుడు తన సహోధ్యాయి, తనని అవమానించిన మహారాజుని చూసి ద్రోణుడు ఎకసెక్కంగా అంటాడుః ‘వీరెవ రయ్య! ద్రుపద మహరాజులె’!! అని. పోతన పరమ భక్తుడు. సాధువు. భాగవతంలో యశోద! శ్రీకృష్ణుడిని తన అక్కున చేర్చుకుని ముద్దు లాడుతూ ‘‘వీరెవరయ్య! శ్రీకృష్ణుడు కారె!’’ అం టుంది. ఇవి సుప్రసిద్ధమయిన అనుసరణలు. మూలానికి వన్నె తెచ్చేవి కూడా.ఆలోచన సూర్యరశ్మి లాంటిది. ప్రతీ ఉదయం దర్శనమిస్తుంది. కాని దానిలో భేదమల్లా ఆ వెలుగు ఆ ఉదయానికే ప్రత్యేకం. అంతే. (వ్యాసకర్త, సుప్రసిద్ధ రచయిత, నటుడు)గొల్లపూడి మారుతీరావు -
సినిమా కొన్ని వర్గాలకు అందుకే దూరమైంది - గొల్లపూడి
‘‘సినిమా వ్యాపారాత్మక కళ. ఆనాటి కాలంలో లక్షల లాభం కోసం సినిమాలు తీసేవారు. నేడు కోట్ల కోసం తీస్తున్నారు. అయితే లాభం కోసం ఏ హద్దులు పాటించాలి అన్నదే ఇక్కడ ముఖ్యం. మితిమీరి తీస్తే ఏ రసమయినా బోర్ కొడుతుంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ 26వ వార్షిక సాంస్కృతి , వందేళ్ల సినిమా అవార్డుల ప్రదానం-2013 ఆదివారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో చలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని పై విధంగా స్పందించారు. వందేళ్ల సినిమా ఉత్సవం అనే నెపంతో తెలుగువారందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందని చలమేశ్వర్ పేర్కొన్నారు. మారుతున్న సాంస్కృతిక ప్రపంచంలో ఇంకో వందేళ్ల తర్వాత సినిమా కనుమరగవచ్చన్నారు. గతంలో నాటకాలు, ఇతర కళారూపాలు... పండగలు, వేడుకలకు పరిమితమైనట్టే సినిమా సైతం కొత్త రూపు సంతరించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు,రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ... ‘‘వందేళ్ల భారత సినిమా చరిత్రతో నాది 50 ఏళ్ల అనుబంధం. నటుడిగా, రచయితగా మూడు తరాల వారితో పనిచేశాను. ప్రస్తుతం వస్తున్న సినిమాలు పూర్తిగా వ్యాపార ధోరణిలో ఉంటున్నాయి. దీంతో కొన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు దూరమవుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డు అందుకోవడం, ఢిల్లీలోని తెలుగువారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇంకా మాధవపెద్ది సురేష్, చంద్రబోస్, శివాజీరాజా , విజయలక్ష్మి, గోపికాపూర్ణమ, మల్లికార్జున, కష్ణ కౌశిక్ తదితరులను సత్కరించారు.