అనుసరణ-అనుకరణ | Follow-simulation | Sakshi
Sakshi News home page

అనుసరణ-అనుకరణ

Published Wed, Oct 22 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

అనుసరణ-అనుకరణ

అనుసరణ-అనుకరణ

జీవన కాలమ్

గొప్ప ప్రతిభావంతుడి వెనుక ఆ ఆలోచనని నమ్మే ఎందరో నడుస్తారు. అనుసరిస్తారు. గొప్ప ప్రతిభ కొన్ని గొప్ప ఆలోచనల్ని తన సొంతం చేసుకుంటుంది. అనుసరణ మూలాన్ని గౌరవిస్తూ, గుర్తిస్తూ, గుర్తు పెడుతూ దాని వెనుక వినయంగా అడుగులు వేయడం అనుకరణ.

 ఈ రెండు మాటలూ వినడానికి దగ్గరగానే కని పించవచ్చును కాని అర్థం లో ఒకదానికొకటి చాలా దూరం. ఈ రెండు మాట లకీ రామాయణపరంగా అర్థాన్ని వెదుకుదాం.సీతమ్మ వనవాసం లో శ్రీరాముడిని అనుస రించింది. మారీచుడు మాయలేడిగా శ్రీరాముడిని అనుకరించాడు. ఎంత తేడా! మరో గొప్ప ఉదాహరణని చూద్దాం. కన్యాశు ల్కంలో గిరీశం దేనినయినా తన పబ్బంగడుపుకో డానికి అనుకరించగలడు. ఇది పాత్ర. మధురవాణి ఇంట్లో పందిరి పట్టె మంచం కింద కనిపించిన రామ ప్పంతుల్ని పూటకూళ్లమ్మ చీపురు దెబ్బలకి వాడు కున్నాడు. అది ఆ పాత్ర ధోరణి.

ఆ రోజుల్లోనే గొప్ప కవితలు రాసిన ఇంగ్లిషు రచయిత్రి ఒకావిడ ఉన్నారు-ఆన్ టైలర్. ఆమె మొదటి సంకలనాన్ని తన సోదరి జేన్ టైలర్ రచనలతో కలిపి ప్రచురించారు. ఆన్ టైలర్ పేరు చాలా మందికి వెంటనే గుర్తురాదు. కాని పిల్లలకి ఇంగ్లిష్ చదువులు గర్వంగా చెప్పించే తల్లిదండ్రుల దగ్గర్నుం చి, చదువుకొనే పిల్లల వరకూ ఈ పద్యాన్ని ఆనం దంతో కితకితలు పెట్టినట్టు గుర్తుపడతారు.
 
‘‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ / హౌ ఐ వండర్ వాట్ యూ ఆర్...’’
 ఆన్ టైలర్ రాసిన ‘మై మదర్’ అనే కవితను చూడండి.

Who fed me from her gentle breast / And hushed me in her arms to rest/ And on my cheeks sweet kisses prest/ My mother.
దీన్ని గిరీశం (గురజాడ) మక్కీకి మక్కీ ‘కన్యాశుల్కం’లో ఎలా అనుకరించారో చూడండి.
She leaves her bed at AM four / And sweeps the dust from off the Floor / And heaps it all behind the door / The widow.
 
ఇది అచ్చమైన అనుకరణ.

గురజాడ వారిదే మరో ఉదాహరణ. మన జా నపద సాహిత్యంలో దూసుకుసాగే మాత్రాఛ్ఛంద స్సుతో నడిచిన పాటని చూడండి. గుమ్మాడేడే ముద్దూ గుమ్మా/గుమ్మాడేడే కన్నా తల్లీ / గుమ్మాడేడే గోపీ కృష్టా /గుమ్మాడేడమ్మా. మొదటి మూడు లైన్లూ 14 మాత్రలు. ఆఖరి లైను 7 మాత్రలు. దాన్ని అపురూపమైన ముత్యాల సరాన్ని చేశారు మహాకవి. మెచ్చనంటావీవు/నీవిక మెచ్చకుంటే మించి పోయెను/కొయ్యబొమ్మలు మెచ్చు కళ్లకు / కోమ లుల సౌరెక్కునా కొత్త మాత్రా చందస్సుని తెలుగు సాహిత్యానికి అందించిన ఘనత గురజాడది. దీనికి అనుసరణ తెలుగు సాహిత్యంలో తన ఉద్ధతితో ‘దిషణాహంకారం’ తన సొత్తని చాటు కున్న విశ్వనాథ తొలినాటి రచన- ‘కోకిలమ్మ పెళ్లి’

 చిలుకతల్లి మహాన్వయంబున / నిలిచినవి సాంస్కృతిక వాక్కులు / కోకిలమ్మ తెలుగు పలుకూ / కూడబెట్టిందీ. ‘తెలుగు పలుకు కూడబెట్టడం’ ఈ కవిసామ్రా ట్టుకే చెల్లు. ఇది అచ్చమయిన అనుసరణ. మరొక ఆధునిక వైతాళికుడు శ్రీశ్రీ కవితల్లో ఎన్ని డజన్ల కవుల, విదేశీ రచయితల జీనియస్ తొంగిచూసిందో చెప్పడం కష్టం. మయకోవస్కీ, స్విన్‌బర్న్, ఎడ్గార్ ఎలెన్ పో.. ఈ జాబితా అనం తం. శ్రీశ్రీ పాదరసం. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒకసారి యాదృచ్ఛికంగా ఆల్బర్ట్ కామూ ‘రైనాసిరస్’ నాటకాన్ని గురించి చెప్పాను. మర్నా టికే ‘మట్టి మనిషి’ అనే కవితని రాసి రేడియో స్టేషన్‌కి తీసుకువచ్చారు శ్రీశ్రీ. ఇక, ఎన్నో చారిత్రక మైన కథలని తన బాణీకి మలుచుకుని అనుసరిం చిన అద్భుతమైన నాటక రచయిత షేక్స్‌పియర్. వాల్మీకి రామాయణాన్ని తమ భాషలో చెప్పి, అనువదించిన మహాకవులెందరో ఉన్నారు. రామా యణాన్ని తన నరాల్లోకి ఎక్కించుకుని, ధమనుల్లో పూరించుకుని తన వేదనతో మేళవించి కొత్తగా ఆవి ష్కరించిన వారూ మరెందలో ఉన్నారు. ఒక్క ఉదా హరణ - మళ్లీ విశ్వనాథ.

జాగ్రత్తగా పరిశీలిస్తే-షెల్లీని దేవులపల్లి రచ నల్లో గుర్తుపట్టవచ్చు. కాని ’ఎవరని ఈ రేయి నిదు ర హృదయమదర/ వేయి చేయి ఛాయలాడ పెనుచీ కటి సైగలతో/ నా కన్నుల రక్త మురల లాగి కొందు రు...’ అన్నప్పుడు ఒక్క కృష్ణశాస్ర్తే కనిపిస్తాడు.
 మరో గొప్ప అనుసరణ: నన్నయ్య భారతంలో అర్జునుడు ద్రుపదుని బంధించి గురువు ద్రోణా చార్యునికి కానుకగా ఇచ్చినప్పుడు, ఒకప్పుడు తన సహోధ్యాయి, తనని అవమానించిన మహారాజుని చూసి ద్రోణుడు ఎకసెక్కంగా అంటాడుః ‘వీరెవ రయ్య! ద్రుపద మహరాజులె’!! అని.

పోతన పరమ భక్తుడు. సాధువు. భాగవతంలో యశోద! శ్రీకృష్ణుడిని తన అక్కున చేర్చుకుని ముద్దు లాడుతూ ‘‘వీరెవరయ్య! శ్రీకృష్ణుడు కారె!’’ అం టుంది. ఇవి సుప్రసిద్ధమయిన అనుసరణలు. మూలానికి వన్నె తెచ్చేవి కూడా.ఆలోచన సూర్యరశ్మి లాంటిది. ప్రతీ ఉదయం దర్శనమిస్తుంది. కాని దానిలో భేదమల్లా ఆ వెలుగు ఆ ఉదయానికే ప్రత్యేకం. అంతే.

(వ్యాసకర్త, సుప్రసిద్ధ రచయిత, నటుడు)గొల్లపూడి మారుతీరావు
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement