సోమసుందర్ జ్ఞాపకాలు
జీవన కాలమ్
నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకించాను- గర్వంగా. 2011 ఏప్రిల్ 16. తెలుగు నాటక దినో త్సవం నాడు కాకినాడ యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కా రానికి వెళ్తూ దారిలో సోమసుందర్‌గారిని దాదాపు నిద్ర లేపాను. ఆయన ఇంటి దగ్గర ఆగుతానని ముందే ఫోన్ చేసి చెప్పాను. నీరసంతో మంచం మీంచి లేవలేని పరిస్థితి. ఎప్పుడు కలసినా నాలుగైదు పుస్తకాలు - ఆయన రాసిన కొత్తవి - ఇవ్వకుండా ఉండరు. నికార్సయిన జీవ లక్షణం, మంచికి స్పందించే అద్భుతమైన అభిరుచి- ఈ రెండూ ఆయన 92 సంవత్సరాలు ‘జీవించ’ డానికి పెట్టుబడులు.
1957 ఏప్రిల్ 1. విశాఖపట్నం హిందూ రీడింగ్ రూంలో సోమసుందర్, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, మల్లాది రామచంద్రశాస్త్రి మొదలైనవారు పాల్గొన్న కవితా గోష్టి. నేను బొత్తిగా చిన్నవాడిని. లేచి నిలబడి నేను రాసిన ఉమర్ ఖయ్యూం పద్యాలు గడగడా చదివేశాను. నన్ను ‘సాఖీ కవి’ అన్నారు సోమసుందర్. చక్కటి మేలిమి ఛాయ. సంపన్నుడు. బంగారం రంగు సిల్కు లాల్చీ, ఉంగరాల జుత్తు, నిండైన నవ్వు - చూడగానే చూపు తిప్పుకోలేనంత అందగాడు. మళ్లీ పదేళ్ల తరువాత కాకినాడ సాహితీ సభలో కలిశాం. అరిపిరాల విశ్వం, నేనూ, కుందర్తీ ఒక గదిలో. సోమసుందర్ ఆ సభకి వచ్చి నన్ను కావలించుకున్నారు- ‘మనం కలసి పదేళ్లయింది’ అని గుర్తు చేస్తూ.
మద్రాసులో మా ఇంటికి ఎదురుగా అనిసెట్టి సుబ్బారావుగారి ఇల్లు. అక్కడికి ఎప్పుడు వచ్చినా కలిసేవారు. ఒకటి రెండు సార్లు భోజనానికి వచ్చారు. మంచి భోజనప్రియులు. అల్లం, పచ్చిమిరపకాయలు దట్టించిన కూరలు, పిండి వడియాలు వేసిన పనసపొట్టు కూర, ధనియాల చారు వంటివి అత్యంత ప్రియమైనవి. మొన్న టిదాకా చుట్ట కాల్చారు. గొప్ప సంభాషణాప్రియులు. సమయస్ఫూర్తితో పాటు చక్కని హాస్య ప్రియత్వం వారి ప్రత్యేకత.
2009 ఏప్రిల్ 10. పొలమూరులో నాకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక పుర స్కారం ఇచ్చినప్పుడు ఆయనా, చామర్తి కనకయ్యగారూ వచ్చారు. యథాప్రకారం ఒక సంచీతో పుస్తకాలు. ఆనాటి సభలో స్నేహపూర్వకమైన ప్రసంగం చేశారు. ఆ మధ్య ‘మిసిమి’లో సాహితీ విమర్శ మీద నా వ్యాసం వచ్చింది. ఉదయమే ఫోన్ - వ్యాసం చాలా గొప్పగా ఉందంటూ. నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకిం చాను- గర్వంగా.
2012 నవంబర్ 18. సోమసుందర్ చారిటబుల్ ట్రస్ట్ జరిపే పురస్కార ప్రదాన సభకి ముఖ్య అతిథిగా చెన్నై నుంచి బయలుదేరాను. పరాకుగా విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డు తీసుకున్నాను. మా అబ్బాయి పొరపాటు కారణంగా హైదరాబాదు విమానం ఎక్కేశాను. మళ్లీ 11-30 కి మరో విమానం ఎక్కి, విశాఖ వచ్చి సరాసరి పిఠాపురం వెళ్లాను. రామాచంద్రమౌళి, అంపశయ్య నవీన్, చందు సుబ్బారావు, దాట్ల దేవదానంరాజు అంతా ఉన్నారు. నాది ఆఖరి ప్రసంగం. ఆయనది సంకల్పబలం. 89వ ఏట పెళ్లికొడుకులాగ కూర్చుని అందరినీ సత్కరించారు.
ఆయన ‘కబడ్దార్! కబడ్దార్!’ కవితలో ‘పదండి ముందుకు’ గేయానికి తీసిపోని ఆవేశం, అభివ్యక్తీ ఉన్న వని నాకనిపిస్తుంది. తొలిరోజుల్లో కృష్ణశాస్త్రి కవిత్వాన్ని భుజాల మీద ఊరేగించిన యువసేనకి సైన్యాధ్యక్షుడు. ప్రతిభ ఎక్కడ కనిపించినా భుజాన ఎత్తుకునే ఔదార్యం ఆయన సొత్తు. ఆయన స్పృశించని రచయిత లేడు - పురిపండా, సి. నారాయణరెడ్డి, దేవులపల్లి, చెలం (పురూరవ), గుర జాడ, శ్రీశ్రీ, కుందర్తి, ఖైఫీ అహమ్మద్, శేషేంద్రశర్మ, అనిసెట్టి - ఆయన స్పందన ఎప్పుడూ వ్యాసంతో ఆగేది కాదు. ఒక గ్రంథమయ్యేది.
తెలుగుభాషలో ప్రత్యేకమైన పలుకు సోమసుందర్ సొంతం. ‘కృష్ణకోకిల స్వామికి సౌవర్ణిక’ వ్యాసం మొదటి నాలుగు వాక్యాలు ఉదహరించాలని కలం వేగిరపడుతోంది. ‘‘శ్రీ కృష్ణశాస్త్రి ఆగమనంతో ఆంధ్ర సాహితికి ముసలితనపు దీర్ఘ శిశిరం దుసి కిల్లిపోయింది. ఓసరిల్లి ఉన్న పాతలోగిలి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. కొత్త ఈదురుగాలి ఒకటి కొసరి కొసరి పిలిచింది. గుబాళించింది. అలసిసొలసిన హసంతి కానిలం నింపాదిగా నిద్రమడతలు తొలగించుకున్నది....’’ ఎన్నాళ్లయింది ఇంత చక్కని నుడికారపు సొగసుల్ని జుర్రుకుని!
మొదటి నుంచీ ఆస్తికత్వానికి అసింటా జరిగినా - రుచినీ, అభిరుచినీ; కవి త్వంలో, అభివ్యక్తిలో కొత్తదనాన్నీ, గొప్పదనాన్నీ విడిచిపెట్టకుండా- తన చుట్టూ గిరులు గీసుకోని నిజమైన భావుకుడు. వయసుని జయించడానికి జీవితమంతా దగ్గర తోవని పట్టుకున్న ధీశాలి, ఉదారుడూ, ఉద్యమకారుడూ - తన నమ్మకాలకు హృద యాన్ని తాకట్టు పెట్టకుండా తన షరతుల మీదే ‘కవిత్వాన్ని’ అనుభవించిన యోగి, భోగి ఆవంత్స సోమసుందర్. - గొల్లపూడి మారుతీరావు