Somasundar
-
కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!
ఆవంత్స సోమసుందర్ స్వీయ చరిత్ర ‘కలలు–కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచన. ఎనిమిది దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంతో మమేకమైన ఒక మహాకవి మనసుతో వ్యక్తీకరిం చిన అరుదైన ఆత్మకథ. స్వాతంత్య్రోద్యమ పూర్వం నాటి పరిస్థి తులు మొదలుకొని ఆధునిక కాలంలో వెల్లువెత్తిన అనేక అభ్యుదయ ఉద్యమాలకు సోమసుందర్ ప్రత్యక్ష సాక్షి. అందుకేనేమో వజ్రాయుధ కవిగానే కాక విలక్షణమైన విమర్శకుడిగా, ‘కళాకేళి’ పత్రికా స్థాపకునిగా, కమ్యూనిస్టు ఉద్యమశీలిగా, అన్నింటినీ మించి నిరంతర స్వాప్నికుడిగా కలకాలం జీవించారు.కవులు జీవిత చరిత్రలు రాసి మెప్పించడం అరుదు. తెలుగులో ఆ సంఖ్య మరీ తక్కువ. అలాంటిది రెండు భాగాలుగా ఆత్మకథను రాసి... ముఖ్యంగా మొదటి భాగంలో అసాధారణ రచనా కౌశలాన్ని చూపిన ఘనత సోమసుందర్కే చెల్లుతుంది. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం 2005లో ‘కళాకేళి’ తరపున ప్రచురించిన ‘కలలు – కన్నీళ్ళు’ తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా ఒక అద్భుతమైన అక్షర కళా శిల్పం.‘నాకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక... మొదటి జ్ఞాపకం మా అమ్మ... మలి జ్ఞాపకమూ మా అమ్మే. అందుకే మాతృవందనంతోనే దీన్ని ప్రారంభిస్తున్నాను. మా అమ్మే నిరంతర స్మృతి వీచిక... మా అమ్మ నన్ను విడిచి వెళ్ళకముందే నేను మా అమ్మను విడిచి వెళ్ళిపోయాను; దూరంగా... అనంతంగా... సుదీర్ఘమైన ఎడబాటుగా. బాట మారింది. ఉనికి మారింది. ఆశ్రయం మారింది. అమ్మా మారింది...’1924 నవంబరు 18న శంఖవరంలో పుట్టినప్పటికీ, బాల్యంలోనే దత్తునిగా పిఠాపురానికి వలస వచ్చిన పసి జ్ఞాపకాల్ని స్పృశిస్తూ ఆత్మకథలో సోమసుందర్ రాసిన ఆరంభ వాక్యాలు ఇవి. నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి ఎడబాటుకు లోనైన పసి హృదయం బహుశా ఆనాడే కార్చిన కన్నీటి ధారల్ని కవితా పంక్తులుగా మార్చే ప్రక్రియను అభ్యసించి ఉంటుంది. భవిష్యత్తులో శ్రామిక వర్గం తరఫున ప్రాతి నిధ్యం వహించే బలమైన వజ్రా యుధ కలం ఆవిర్భావానికి అంకురార్పణ ఆనాడే జరిగిందేమో!మూడొందల పుటల ‘కలలు–కన్నీళ్ళు’ ఆత్మకథ అంతా ఒకెత్తయితే, దీనికి సో.సు. రాసిన ఐదు పుటల ముందుమాట ఒకటీ ఒకెత్తు. రూసో మహాశయుడి మాట, ‘రెక్కల చేప కథ విప్పింది’అంటూ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖ కవులు, రచయి తలు, మేధావుల ఆత్మ కథలను స్థూలంగా పాఠకుడికి పరిచయం చేశారు. అలా చేస్తూనే స్వీయచరిత్ర రాయటం ఎంత కష్టమో వివరించారు. గాంధీ, నెహ్రూ వంటి నేతలు మొదలు వర్జీనియా ఉల్ఫ్, జీన్‌పాల్ సార్త్రే వంటి పాశ్చాత్య మేధావుల స్వీయ చరిత్రల్ని గురించి చెబుతారు. అవి కాక, ఏనుగుల వీరాస్వామి, కందుకూరి వీరేశలింగం, చలం వంటి వారి ఆత్మకథల గురించి కూడా తడుముతారు. ఇన్నింటిలోకీ సో.సు.ను ప్రభావితం చేసింది మాత్రం డామ్ మోరీస్ రాసిన ‘మై సన్స్ ఫాదర్’ అనే ఆత్మకథ. సోమసుందర్ అనితర సాధ్యమైన అధ్యయనశీలతకి ఈ మున్నుడే ఒక ప్రతీక. ముందు మాటకి ముగింపుగా సో.సు, ‘నా చేతిలోని లేఖినిని మృత్యువు తప్ప వేరెవ్వరూ అపహరించలేరని’ అంటారు. అలా అన్న మాటల్ని నిలుపుకొని 2016 ఆగష్టు 16న చివరి శ్వాస వరకూ విస్తృతమైన సారస్వత సేవ కావించిన అరుదైన ప్రజాకవి సోమసుందర్.అల్లూరి సీతారామరాజుకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబ నేపథ్యం నుండీ అల్లారు ముద్దుగా సంస్కృత శ్లోకాలు, సంగీత కచేరీలు, నాటకాలు, సినిమాలు, కౌమార ప్రేమ కలాపాలు... ఇలా ఒకటేమిటి ఎన్నో వర్ణాలు మనకి సో.సు. జీవితంలో కనబడతాయి. హైస్కూల్ విద్యార్థిగా స్టూడెంట్ యూనియన్ సభలకని కోల్ కతా వెళ్ళినప్పుడు హౌరా బ్రిడ్జి మీద చూసిన జీవచ్ఛవానికి కలత చెంది నవ యువకుడు పట్టిన కలం, కట్టిన కవిత తెలుగు నేలమీద దశాబ్దాల పాటు వెల్లువలా సాగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నినాదమై రగిలింది. ‘హే నిజాం పాదుషా, ఖబడ్దార్ !’ అని హెచ్చరించింది. నిషేధానికి గురై చరిత్ర సృష్టించింది.చదవండి: గల్ఫ్ వలస జీవిత సారం‘కవిత్వమూ, కమ్యూనిజమూ తప్ప మరే ధ్యాసా నాకు లేదు’ అని తన ఆత్మకథలో ప్రకటించుకున్న సో.సు. జీవితాన్ని ఆ రెంటికే అంకితం చేశారు. సుమారు ముప్పై మూడు భాగాల్లో ఎన్నెన్నో అపురూప విషయాల్ని నమోదు చేశారు. పిఠాపురం సంస్థానంలో సాహిత్య వాతావరణం మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన అభ్యుదయ కవిత్వోద్యమం వరకూ ఎంతో హృద్యంగా చెప్పారు. హైదరాబాదు కవి మిత్రుల నుండీ మద్రాసు మేధాసాంస్కృతిక స్రవంతి దాక, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ వంటి వారితో అనుభవాలు, మిత్రులతో చేసిన ఉత్తర భారత యాత్రా విశేషాలు... ఒక్కటేమిటి తన జీవన చిత్రంలోని గాఢమైన రంగులన్నిటినీ ఆత్మకథ రూపంలో పాఠక లోకానికి అందించారు సో.సు. అయితే, ఎందుకనో తెలీదు కానీ సోమసుందర్ స్వీయచరిత్రకి రావాల్సిన గుర్తింపు సాహితీ లోకంలో సైతం రాలేదు.చదవండి: వెనక్కి నడవమంటున్నారా?విశాలమైన పచ్చిక బయళ్ళ పైన పిండార బోసినట్లు ‘నా జీవితంలో మంచిపనులు ఎన్ని చేశానో అంతకు మించిన చెడ్డ పనులు చేశాను. అందుకే మంచి పనులు సవిస్తరంగా ఏకరువు పెట్టలేదు. చెడ్డపనులు మచ్చుకు కొన్నే చెప్పకుండా విడిచిపెట్టనూలేదు. అసలు జీవితం అంటే ఏమిటి? చెడ్డ పనులు రహస్యంగా చేసు కుంటూ పోవడం. మంచి పనులు తక్కువే అయినా బహి రంగంగా చేయడం...’ అని చెప్పుకున్న సోమసుందర్ ధైర్యాన్ని, పారదర్శకతను చదివి అంగీకరించి, స్వీకరించేందుకు కూడా కొంత సాహసం కావాలేమో అనిపిస్తుంది. బహుశా అందుకనే వృద్ధాప్యంలో డిక్టేట్ చేసి రాయించిన సో.సు. స్వీయచరిత్ర రెండో భాగం ‘పూలు, ముళ్ళు’ అంతగా కదిలించదు. ఏదో భారంగా రాసినట్టు సాగుతుంది. ఇదంతా ఒకెత్తయితే ఏకకాలంలో కవిగా, కార్య కర్తగా కూడా మసిలిన ఆయన కార్యదీక్ష ఒక్కటీ ఒకెత్తు. స్వాతంత్య్రం వచ్చే నాటికి జైల్లో శిక్ష అనుభవిస్తూ కూడా ఈ దేశంలో సోషలిజం కోసం నిబద్ధతతో కృషి చేసిన సో.సు. తర్వాత కాలంలో పూర్తిస్థాయి సాహితీవేత్తగా మారారు.ప్రజా చైతన్యమే లక్ష్యంగా సకల సాహితీ ప్రక్రియలను ప్రయోగించారు. లిటరరీ ట్రస్ట్ స్థాపించి ఎందరో యువకవుల్నీ, రచయితల్నీ పురస్కారాలతో ప్రోత్సహించారు. శతాధిక గ్రంథాల్ని రచించి తెలుగులో ఎన్నదగిన అభ్యుదయ దిక్సూచిగా భాసించారు. ఆయన స్పూర్తిని అందుకుని కొనసాగించగలగడమే మహాకవి ఆవంత్స సోమసుందర్‌కు మనం ఇచ్చే అర్థవంతమైన ఆత్మీయ నివాళి.- గౌరవ్ సామాజిక కార్యకర్త (నేడు ఆవంత్స సోమసుందర్ శతజయంతి) -
చింతమనేని దూషణలు..హేయమైన చర్య
తాడేపల్లిగూడెం: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పూర్వ అధ్యక్షులు దూసనపూడి సోమసుందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను చింతమనేని బండబూతులు తిడుతూ దూషించడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట ఏరియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో దూసనపూడి విలేకరులతో మాట్లాడారు. చింతమనేని ఎవరిని పడితే వారిని దూషించడం, సంస్కారహీనంగా మాట్లాడటం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయంలో ఆయన్ని కంట్రోల్ చేసే విధానం ప్రభుత్వానికి కనిపిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్యే అంటే శాసనాలు చేసి ప్రజల్ని పరిరక్షించాలి కానీ ఇలా జనాలపై దాడులు చేస్తూ, బాధ్యతా రాహిత్యంగా ఉన్న వ్యక్తికి శాసనసభకు వెళ్లే అర్హత లేదని స్పష్టం చేశారు. చింతమనేని వ్యవహారంలో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులను దూషించడం, వారిపై దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రాంతాలకతీతంగా జర్నలిస్టులంతా నిరసనలు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. -
సోమసుందర్ జ్ఞాపకాలు
జీవన కాలమ్ నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకించాను- గర్వంగా. 2011 ఏప్రిల్ 16. తెలుగు నాటక దినో త్సవం నాడు కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కా రానికి వెళ్తూ దారిలో సోమసుందర్గారిని దాదాపు నిద్ర లేపాను. ఆయన ఇంటి దగ్గర ఆగుతానని ముందే ఫోన్ చేసి చెప్పాను. నీరసంతో మంచం మీంచి లేవలేని పరిస్థితి. ఎప్పుడు కలసినా నాలుగైదు పుస్తకాలు - ఆయన రాసిన కొత్తవి - ఇవ్వకుండా ఉండరు. నికార్సయిన జీవ లక్షణం, మంచికి స్పందించే అద్భుతమైన అభిరుచి- ఈ రెండూ ఆయన 92 సంవత్సరాలు ‘జీవించ’ డానికి పెట్టుబడులు. 1957 ఏప్రిల్ 1. విశాఖపట్నం హిందూ రీడింగ్ రూంలో సోమసుందర్, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, మల్లాది రామచంద్రశాస్త్రి మొదలైనవారు పాల్గొన్న కవితా గోష్టి. నేను బొత్తిగా చిన్నవాడిని. లేచి నిలబడి నేను రాసిన ఉమర్ ఖయ్యూం పద్యాలు గడగడా చదివేశాను. నన్ను ‘సాఖీ కవి’ అన్నారు సోమసుందర్. చక్కటి మేలిమి ఛాయ. సంపన్నుడు. బంగారం రంగు సిల్కు లాల్చీ, ఉంగరాల జుత్తు, నిండైన నవ్వు - చూడగానే చూపు తిప్పుకోలేనంత అందగాడు. మళ్లీ పదేళ్ల తరువాత కాకినాడ సాహితీ సభలో కలిశాం. అరిపిరాల విశ్వం, నేనూ, కుందర్తీ ఒక గదిలో. సోమసుందర్ ఆ సభకి వచ్చి నన్ను కావలించుకున్నారు- ‘మనం కలసి పదేళ్లయింది’ అని గుర్తు చేస్తూ. మద్రాసులో మా ఇంటికి ఎదురుగా అనిసెట్టి సుబ్బారావుగారి ఇల్లు. అక్కడికి ఎప్పుడు వచ్చినా కలిసేవారు. ఒకటి రెండు సార్లు భోజనానికి వచ్చారు. మంచి భోజనప్రియులు. అల్లం, పచ్చిమిరపకాయలు దట్టించిన కూరలు, పిండి వడియాలు వేసిన పనసపొట్టు కూర, ధనియాల చారు వంటివి అత్యంత ప్రియమైనవి. మొన్న టిదాకా చుట్ట కాల్చారు. గొప్ప సంభాషణాప్రియులు. సమయస్ఫూర్తితో పాటు చక్కని హాస్య ప్రియత్వం వారి ప్రత్యేకత. 2009 ఏప్రిల్ 10. పొలమూరులో నాకు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి స్మారక పుర స్కారం ఇచ్చినప్పుడు ఆయనా, చామర్తి కనకయ్యగారూ వచ్చారు. యథాప్రకారం ఒక సంచీతో పుస్తకాలు. ఆనాటి సభలో స్నేహపూర్వకమైన ప్రసంగం చేశారు. ఆ మధ్య ‘మిసిమి’లో సాహితీ విమర్శ మీద నా వ్యాసం వచ్చింది. ఉదయమే ఫోన్ - వ్యాసం చాలా గొప్పగా ఉందంటూ. నా కాలమ్ ఏ వారం బాగున్నా ఆయన దగ్గర్నుంచి ఫోన్ రాక తప్పదు. ఈ సంవత్సరం ఒక జాతీయ పురస్కారానికి వారి పేరుని ఉటంకిం చాను- గర్వంగా. 2012 నవంబర్ 18. సోమసుందర్ చారిటబుల్ ట్రస్ట్ జరిపే పురస్కార ప్రదాన సభకి ముఖ్య అతిథిగా చెన్నై నుంచి బయలుదేరాను. పరాకుగా విమానాశ్రయంలో బోర్డింగ్ కార్డు తీసుకున్నాను. మా అబ్బాయి పొరపాటు కారణంగా హైదరాబాదు విమానం ఎక్కేశాను. మళ్లీ 11-30 కి మరో విమానం ఎక్కి, విశాఖ వచ్చి సరాసరి పిఠాపురం వెళ్లాను. రామాచంద్రమౌళి, అంపశయ్య నవీన్, చందు సుబ్బారావు, దాట్ల దేవదానంరాజు అంతా ఉన్నారు. నాది ఆఖరి ప్రసంగం. ఆయనది సంకల్పబలం. 89వ ఏట పెళ్లికొడుకులాగ కూర్చుని అందరినీ సత్కరించారు. ఆయన ‘కబడ్దార్! కబడ్దార్!’ కవితలో ‘పదండి ముందుకు’ గేయానికి తీసిపోని ఆవేశం, అభివ్యక్తీ ఉన్న వని నాకనిపిస్తుంది. తొలిరోజుల్లో కృష్ణశాస్త్రి కవిత్వాన్ని భుజాల మీద ఊరేగించిన యువసేనకి సైన్యాధ్యక్షుడు. ప్రతిభ ఎక్కడ కనిపించినా భుజాన ఎత్తుకునే ఔదార్యం ఆయన సొత్తు. ఆయన స్పృశించని రచయిత లేడు - పురిపండా, సి. నారాయణరెడ్డి, దేవులపల్లి, చెలం (పురూరవ), గుర జాడ, శ్రీశ్రీ, కుందర్తి, ఖైఫీ అహమ్మద్, శేషేంద్రశర్మ, అనిసెట్టి - ఆయన స్పందన ఎప్పుడూ వ్యాసంతో ఆగేది కాదు. ఒక గ్రంథమయ్యేది. తెలుగుభాషలో ప్రత్యేకమైన పలుకు సోమసుందర్ సొంతం. ‘కృష్ణకోకిల స్వామికి సౌవర్ణిక’ వ్యాసం మొదటి నాలుగు వాక్యాలు ఉదహరించాలని కలం వేగిరపడుతోంది. ‘‘శ్రీ కృష్ణశాస్త్రి ఆగమనంతో ఆంధ్ర సాహితికి ముసలితనపు దీర్ఘ శిశిరం దుసి కిల్లిపోయింది. ఓసరిల్లి ఉన్న పాతలోగిలి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. కొత్త ఈదురుగాలి ఒకటి కొసరి కొసరి పిలిచింది. గుబాళించింది. అలసిసొలసిన హసంతి కానిలం నింపాదిగా నిద్రమడతలు తొలగించుకున్నది....’’ ఎన్నాళ్లయింది ఇంత చక్కని నుడికారపు సొగసుల్ని జుర్రుకుని! మొదటి నుంచీ ఆస్తికత్వానికి అసింటా జరిగినా - రుచినీ, అభిరుచినీ; కవి త్వంలో, అభివ్యక్తిలో కొత్తదనాన్నీ, గొప్పదనాన్నీ విడిచిపెట్టకుండా- తన చుట్టూ గిరులు గీసుకోని నిజమైన భావుకుడు. వయసుని జయించడానికి జీవితమంతా దగ్గర తోవని పట్టుకున్న ధీశాలి, ఉదారుడూ, ఉద్యమకారుడూ - తన నమ్మకాలకు హృద యాన్ని తాకట్టు పెట్టకుండా తన షరతుల మీదే ‘కవిత్వాన్ని’ అనుభవించిన యోగి, భోగి ఆవంత్స సోమసుందర్. - గొల్లపూడి మారుతీరావు -
ఆరిన సాహిత్య కాపలా దీపం
సందర్భం ‘కాలానికి కవిత్వం కాపలా దీపం’ అని నమ్మిన సోమసుందర్... తన రచనల ద్వారానే కాక వ్యక్తిత్వం ద్వారా కూడా మనకు ఎంతో ఇచ్చిపోయిన సాహిత్యకారుడు. ఒక మంచి వ్యాసం కంటబడితే ఒక మంచి కవిత కనిపిస్తే ఒక ఉత్తరం రాసి భుజం తట్టడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని. సోమసుందర్గారి నిష్ర్కమణతో ఒక మనిషి కాదు ఒక తరం చరిత్ర పుటల్లోకి తరలి పోయింది. అభ్యుదయ కవిత్వ యుగపు ఆఖరి ప్రతినిధి వెళ్లిపోయారు. తొమ్మిది పదుల జీవి తంలో ఏడున్నర పదులు సాహిత్య ప్రస్థానం సామాన్యమైన విషయం కాదు. విశ్రమించని కలం ఆయనది. కవితలు, విమర్శలు, కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు... నూట పాతిక పైగా రచనలు. ఆయన దత్త పుత్రుడు. కాళూరి వారి కుటుంబం నుంచి అవంత్స వారి సంపన్న కుటుంబానికి పెంపకానికి వెళ్లినవాడు. ఏ ఉద్యోగమూ చెయ్యకుండా జీవితం గడిచిపోయేటంత ఆస్తి ఆయనను సోమరిగా, వ్యస నపరుడిగా చెయ్యక పోవడం ఆయన వ్యక్తిత్వ విశిష్టతను చాటి చెబు తుంది. సోమసుందర్ ఒక వ్యక్తి కాదు. కొందరు వ్యక్తులుగా అగుపించరు. కొన్ని గుణాలకు ప్రతీక లుగా కనిపిస్తారు. సోమసుందర్ నిర్భీతికి, స్వీయాభిప్రాయాలపట్ల ఉన్న అపారమైన నమ్మ కానికి, నిరంతర చైతన్య శీలతకు ప్రతీకగా తోచారు తప్ప ఎప్పుడూ కేవలం ఒక మనిషిగా అనిపించలేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం, అజ్ఞాతవాసానికి వెళ్లిపోవడం, జైలు జీవితాన్ని అనుభవించడం, ఆయన నిర్భీతి అభిప్రాయ దృఢత్వం ఒక్క సాహిత్యానికి మాత్రమే సంబం ధించినవి కావని స్పష్టం చేస్తాయి. ఆయన కవిత్వం పేరు చెబితే వజ్రాయుధం అంటారందరూ. తెలంగాణ సాయుధ పోరా టానికి ఆయనకు ఎంత దూరం. ఏమి సంబంధం? అక్షరానికి ఉన్న శక్తి ఎంతో తెలిపే సందర్భాలలో వజ్రాయుధ రచన ఒకటి. ఒక పుస్తకం నిషేధానికి గురి కావాలంటే ఎంత శక్తివంతమైనదై ఉండాలి? ఆయన దానితో ఆగిపోలేదు. పుంఖాను పుంఖాలుగా రాస్తూనే వచ్చారు. ఆ రోజున తెలంగాణ పోరాటానికి స్పందించినట్టే ఆ మధ్య బాబ్రీ మసీదు విధ్వంస ప్రకంపనలకూ స్పందించారు. మధ్యలో గోదావరి జల ప్రళయానికి కవితా రూపం ఇచ్చారు. వివిధ సామాజిక అంశాల నుంచి రక్షణకు ‘రక్షరేఖ’ కట్టడం నుంచి ‘జీవన లిపి’కి తాత్విక వ్యాఖ్యానం చెప్పడం వరకూ విస్తరించింది ఆయన కవిత్వం. తొలినాళ్లలో ఛందో బద్ధంగా వెలువడిన ఆ కవిత్వం గేయంగా, పాటగా, వచన కవితగా ప్రవహిస్తూనే వచ్చింది. ఆయన రాసినన్ని దీర్ఘ కవితలు తెలుగు కవుల్లో మరెవ్వరూ రాయలేదు. ముప్ఫై ఐదుకు పైగా ఉన్నాయవి. సోమసుందర్ గారిని కవిగానే ఎక్కువ గుర్తు పెట్టుకోవడం వల్ల విమర్శకుడిగా ఆయన నిర్వహించిన చరిత్రాత్మకమైన పాత్ర పైన తగినంత వెలుగు పడలేదు. శ్రీరంగం నారాయణ బాబుకు సాహిత్యంలో దక్క వలసిన స్థానం అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఆయన చాలా బాధ్యతగా ‘రుధిర జ్యోతిద్దర్శనం’ అనే విమర్శ వెలువరించారు. యుగ కవిగా ప్రసిద్ధుడైన శ్రీశ్రీకి ఆ కారణం చేత దూరం కావడానికి ఆయన వెనుకాడ లేదు. తిలక్ కవిత్వం మీద ఆయన రాసిన అమృత వర్షిణి విమర్శ వ్యాస సంపుటి తిలక్ కవిత్వం అంతా ‘అమృతం కురిసిన రాత్రి’గా వెలువడక ముందే వచ్చిందనీ, తిలక్ సోమసుందర్‌కు సమకాలికుడనీ గమనిస్తే విమర్శకుడిగా ఆయన ఎలాంటి పాత్ర పోషించారో అర్థమౌతుంది. ఆయన విమర్శ అత్యధిక భాగం ఎవరెవరికి దక్కాల్సిన స్థానాలు వాళ్లకు దక్కడం కోసం వెలువరించినదే. సోమసుందర్ విమర్శలో విశిష్టత ఏమంటే చాలా సమకాలికంగా ఉండడం. శేషేంద్ర కవిత్వం మీద నారాయణ రెడ్డి కవిత్వం మీద రాయడం విశేషం. సమకాలిక కవుల కవిత్వం మీద ఒక కవి రాయడం అరుదు. అసూయ, దురభిమానం అడ్డుపడి కలం సాగదు. ఒక కవి తన తర్వాత తరపు కవుల మీద రాయడం మరీ ఆశ్చర్యం. మువ్వా శ్రీనివాసరావుగారి కవిత్వం మీద ఒక పుస్తకం వెలువరించడం వెనక ఎంత నిరహంకారం, మమకారం ఉండాలి. కృష్ణశాస్త్రి గారు తన కవిత్వంమీద విమర్శ వ్యాసాలు రాయమని అడిగి రాయించుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం. వ్యాఖ్యాన మార్గంలో సాగే విలక్షణమైన విమర్శ సోమసుందర్ది. ఒక్కొక్క కవితను తీసుకుని దాని సామాజిక చారిత్రక నేపథ్యాన్ని, కవి తాత్విక నేపథ్యాన్ని వివరిస్తూ సాగుతుంది. కష్టమైన పదాలకు వివరణ ఉంటుంది. ప్రాచీన కావ్య ప్రబంధాలకు వచ్చిన వ్యాఖ్యలకు ఇది ఆధునిక రూపం. అసూయా రాహిత్యం, ధర్మాగ్రహం, సాహిత్య బాధ్యత, విస్తృత పఠన శీలత వంటి లక్షణాలెన్నో ఉంటే తప్ప ఆ విమర్శ పుట్టదు. అభ్యుదయ కవితా ప్రస్థానంలో ఆయన పాత్ర విశిష్టమైనది. వజ్రాయుధం కావ్యాన్ని వెలు వరించడం సరే. ఆరుద్ర రాసిన త్వమేవాహం పుస్తకాన్ని ఆయనే ప్రచురించారు. పురిపండా అప్పలస్వామి గారి పులిపంజా మీద విమర్శ గ్రంథం రాశారు. అనిసెట్టి సుబ్బారావుగారి కవిత్వం మీద ‘అగ్నివీణ ఆలపించిన అణు సంగీతం’ రాశారు. ఆ యుగపు కవులెందరికో వ్యాఖ్యాతగా ముందుకువచ్చారు. సోమసుందర్ పఠనకు, రచనకు భాషాపర మైన ఎల్లలు లేవు. సుబ్రహ్మణ్య భారతిమీద, హెన్రిక్ హెయినే జీవితం మీద, కాళిదాసు రామకథమీద, లియోనార్డొ డావిన్సీ జీవితం మీద ఉర్దూ సాహిత్యంలో ఉన్నత శిఖరాల మీద పుస్తకాలు రాశారు. అతి జటిలమైన భావంతో, భాషతో వచ్చిన క్రిస్టోఫర్ కాడ్వెల్ ఇల్యూజన్ అండ్ రియాలిటీని తెలుగు చేశారు. ఆయన కళాకేళి ప్రచురణల ద్వారా చేసిన సేవ చాలా విశిష్టమైనది. ఆయన అభిరుచులు అనేకం. అందులో సంగీతం ఒకటి. కర్ణాటక, హిందు స్తానీ సంగీతాల పట్ల ఉన్న గౌరవం, అవగాహన ఆయన ‘హంసధ్వని’ పుస్తకంలో కనిపిస్తాయి. ప్రముఖ సంగీతకారుల జీవితాలకు విద్వత్తులకు గీసిన రేఖాచిత్రాల సంపుటి అది. యువతరాన్ని ప్రోత్సహించడం కోసం పురస్కారాలను ఏర్పాటు చెయ్యడం, ప్రతిభావంతుల్ని ఏరి పట్టుకోవడం ఆయన విధిగా నిర్వ హిస్తున్న విషయాలు. కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ వంటి ప్రతిభా వంతుడి సాహిత్య వ్యవసాయం సాగిపోవడం వెనుక సోమసుందర్ గారి ప్రోత్సాహం విస్మరించలేనిది. ఒక మంచి వ్యాసం కంటబడితే ఒక మంచి కవిత కనిపిస్తే ఒక ఉత్తరం రాసి భుజం తట్టడం ఆయనకు ఎంతో ఇష్టమైన పని. ‘కాలానికి కవిత్వం కాపలా దీపం’ అని నమ్మిన సోమసుందర్‌గారు తన జీవితమంతా సాహిత్యానికి కాపలా దీపంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. తన రచనల ద్వారానే కాక వ్యక్తిత్వం ద్వారా కూడా మనకు ఎంతో ఇచ్చిపోయిన సాహిత్యకారుడాయన. ( వ్యాసకర్త: డాక్టర్ రెంటాల వెంకటేశ్వర రావు, కవి, రచయిత) ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, కొత్తపేట మొబైల్ : 77991 11456 -
బతుకును పండుగ చేసుకున్న మనిషి
90వ పుట్టిన రోజు / ఆవంత్స సోమసుందర్ సోమసుందర్ వ్యక్తి వేరు, సాహిత్యం వేరు కాదు. ఎప్పుడూ చుట్టుపక్కల పదిమంది కుర్రాళ్లు ఉండవల్సిందే.నడుస్తున్న రాజకీయాల నుంచి సినిమాలు, సంగీతం, కవిత్వం ఎన్నెన్ని విషయాలు. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు ఖబడ్దార్.. ఖబడ్దార్.. అంటూ నైజాం పాలనపై ఎత్తిన కవితల కత్తి ఆవంత్స సోమసుందర్ ‘వజ్రాయుధం’. ‘బానిసల దండయాత్ర’ కవితలోని ఈ మాటల బాణాలు తెలంగాణా సాయుధ పోరాటంలో దిక్కుదిక్కులా వినపడిన జనగర్జనలు. తన చరిత్ర తనె పఠించి ఫక్కున నవ్వింది ధరణి తన గాథను తనె స్మరించి భోరున ఏడ్చింది ధరణి... ఏం మిగిలింది చెప్పుకోడానికి? ప్రభువుల అణచివేత, పాలెగాళ్ల దురాగతాలు... అందుకనే కదా ధరణి నిస్సహాయంగా నవ్వింది. తట్టుకోలేక ఏడ్చింది. ఈ కవిత్వం సత్యం పలికింది. అందుకే పాలకులకు కోపం వచ్చింది. 1949లో వచ్చిన ‘వజ్రాయుధం’ పుస్తకాన్ని ఏడాది తిరగకుండానే మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. 1956లో మళ్లీ ఈ పుస్తకం ప్రజల ముందుకు వచ్చింది. ఆవంత్స సోమసుందర్కి ఈ నెల 18కి తొంభై ఏళ్లు నిండుతాయి. ఇప్పటి వరకు ఆయన సుమారు 100 పుస్తకాలు రాశారు. రాయడం మొదలుపెట్టి 73 ఏళ్లు అయినా 90 ఏళ్ల వయసు వల్ల కాలు, కళ్లు మొరాయిస్తున్నా ఇంకా రాస్తూనే ఉన్నారు. అరకొరగా నాలుగు ముక్కలు రాసి సోషల్ మీడియాలోకి ఎక్కించి అరగంటకొకసారి ‘లైకులు’ లెక్కించుకునేవారికి ఈయన ఒక ఎవరెస్టు శిఖరంలా కనపడతాడు కాబోలు. రాసినవన్నీ అందరూ చదువుతున్నారా? అని ఆయనను అడగటం అర్థం లేని ప్రశ్న. ఎందుకంటే రాయడం ఆయన ధర్మం. తనకు తెలిసింది పదిమందికి చెప్పాలనుకోవటం ఆయన ఫిలాసఫీ. ఆయన రాయని సాహితీరూపాలు లేవు. కవిత్వం, కథ, విమర్శ, విశ్లేషణ, ఆత్మకథ, ఉత్తరాలు ఇలా అన్ని ప్రక్రియలు వాడుకున్నారు. 1950లో ‘బానిసల దేశం’ కథల సంపుటి వేశారు. తర్వాత రాసిన కథలతో కలిసి ’84లో మరో కథల సంపుటి వేశారు. ‘సంచారిణీ దీపశిఖ’ లాంటి కథలు ఉన్నతమైన మానవ సంబంధాలకి ప్రతిబింబాలు. ‘కళాకేళి’ పత్రిక స్థాపించి నడిపింది నాలుగు ఏళ్లే అయినా అనేక మంది రచయితలకి ముఖ్యంగా యువకులకి వేదిక కల్పించి ఉత్సాహపరిచారు. ఆరుద్ర ‘త్వమేవాహం’ మొదలు ప్రచురించింది సోమసుందరే. అభ్యుదయ రచయితల సంఘం పెరిగి, పెద్దదై ఉద్యమంలా ఎదగడంలో సోమసుందర్ ‘కృషి’ చాలా ఉంది. అయితే అభ్యుదయం నీరసించినా సోమసుందర్ చతికిల పడలేదు. ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా మొహం మీద ఎలా చెప్పగలరో తను ప్రేమించిన విషయాన్ని దాచుకోకుండా చెప్పగలరు అనడానికి ఉదాహరణలు- కృష్ణశాస్త్రి, తిలక్, అనిశెట్టిల మీద రాసిన విశ్లేషణలు. మరీ ప్రేమ ఎక్కువైతే మరింత ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టగలరు. కావాలంటే ‘శేషేంద్రజాలం’, ‘రుధిర జ్యోతిర్దర్శనం’ సాక్ష్యాలు. సోమసుందర్ వ్యక్తి వేరు, సాహిత్యం వేరు కాదు. ఎప్పుడూ చుట్టుపక్కల పదిమంది కుర్రాళ్లు ఉండవల్సిందే. నడుస్తున్న రాజకీయాల నుంచి సినిమాలు, సంగీతం, కవిత్వం ఎన్నెన్ని విషయాలు. నాలుగు చుక్కల మందే అమృతం. ఇంక అక్కడ మిరియాల లక్ష్మీపతో, చందు సుబ్బారావు లాంటి వాళ్లో ఉంటే జాతరే జాతర. అలాంటి ఓ సంబరాలలోనే కదా ‘ఏనుగు పాదాల కింద నలిగిన చీమ కాలు విరిగిన శబ్దాన్ని’ సైగల్ గొంతులో విన్నది. అబ్దుల్ కరీంఖాన్ గారు ‘హంసధ్వని’ని హిందుస్తానీ చేశారు అని తెలుసుకున్నది. జన్మెత్తిన మానవునకు జీవితమే పరమ ధనం అయితే అది ఒకమారే అతని కొసగబడిన వరం అందుకనే కదా ఆయన తన బతుకునెప్పుడూ పండుగలా చేసుకున్నారు. వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తు మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నారు. కాలము సైకత తీరము నడచినపుడె పడును జాడ గాలి కదిలెనా మళ్లీ కనిపించదు నరుని జాడ.... కాని సార్, మీ తోటి జ్ఞాపకాలు ఎప్పుడూ పచ్చని ఆకుల్లా మాలో కొత్తగానే ఉంటాయి. కాలం గాలికి రెపరెపలాడుతూ నవ్వుతూనే ఉంటాయి. - కృష్ణమోహన్‌బాబు, 98480 23384 -
ఘనంగా సోమసుందర్ జన్మదినం
పిఠాపురం టౌన్, న్యూస్‌లైన్ :వజ్రాయుధ కవి, విమర్శకుడు ఆవంత్స సోమసుందర్ నవయుగ సాహిత్యరంగానికి మార్గదర్శి అని నటుడు, ప్రయోక్త చాట్ల శ్రీరాములు అన్నారు. పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం చెలికాని భావనరావు సభాసదన్‌లో అభ్యుదయ కవి డాక్టర్ ఆవంత్స సోమసుందర్ 90వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ సాహిత్య రంగంలో ప్రతీ ఒక్కరూ సోమసుందర్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. జీవిస్తే సోమసుందర్లాగ జీవించాలన్నారు. నాటకరంగం క్షీణించిపోయిందని ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నానన్నారు. తెలుగులో మంచి నాటకాలు రావాలన్నారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పి.చిరంజీవినీకుమారి మాట్లాడుతూ సాహిత్య రంగంలో సోమసుందర్ ఎవర్గ్రీన్ హీరో అన్నారు. హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ అభ్యుదయానికి మారుపేరు, కాలంతో ప్రవహించే వ్యక్తి సోమసుందర్ అని కొనియాడారు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ వందకు పైగా రచనలు చేసిన సోమసుందర్ శతవసంతాలు దాటి జీవించాలన్నారు. కవి చందు సుబ్బారావు, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నిత్య అభ్యుదయ కవి సోమసుందర్ అని ప్రశంసించారు. కాకినాడ ఆర్డీవో జవహర్‌లాల్‌నెహ్రూ, పలువురు ప్రముఖులు సోమసుందర్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ సోమసుందర్ రచించిన పలు గ్రంథాలను పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. సాయంత్రం జరిగిన సోమసుందర్ లిటరరీ ట్రస్టు 13వ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శిఖామణికి సోమసుందర్ సాహిత్య పురస్కారం, డాక్టర్ సి.మృణాళినికు రాంషా స్మారక విమర్శక పురస్కారం, డాక్టర్ రాధేయకు రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం, మిధునం శ్రీరమణకు గురజాడ కథా ప్రబాస పురస్కారాలను సోమసుందర్ అందజేసి వారిని సత్కరించారు. లిటరరీ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ కె .వెంకట్రావు, డాక్టర్ జి.సీతారామస్వామి, డాక్టర్ జీవీఎల్ అనూరాధ, మేకా మన్మధరావు, శశికాంత్ శాతకర్ణి, బాలాంత్రపు హేమసుందర్, డాక్టర్ నాగసూరి వేణుగోపాలరావు, ఎం.రంగయ్య, పీఎస్ భట్టు, హెచ్‌వీకే రంగారావు, విజయశేషేంద్ర శాతకర్ణి, రామానాయుడు, కొత్తెం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.